Saturday, January 31, 2015

ఇంకెప్పుడు ?

ఇంకెప్పుడు ?
---------------------------------------------

ఇంకెప్పుడు
మందార మకరంద మధుపమ్ములను   గ్రోలేది
ఇంకెప్పుడు
సందిట  తాయతులు సరిమువ్వ గజ్జెలు అని పాడుకొనేది
ఇంకెప్పుడు
బ్రతుకు  జిల్లేడాకుల వనంలో  తులసి  మొక్కల్ని పెంచేది
ఇంకెప్పుడు
లంకా దహనం గావించుకొని  అజ్ఞాత వాసం గడిపేది
ఇంకెప్పుడు
చీమల దండు బారి నుండి తప్పించుకొని  తపస్సు చేసేది
ఇంకెప్పుడు
ముఖాన  ప్రశ్నిస్తున్న ముడతలకు   సమాధానం చెప్పేది

ఆత్మ వర్చస్సు  కృష్ణ పక్షం ఎక్కిన  వేళ
రోజు  రోజూ  ఒక ప్రశ్నార్థకమే !

ఇంకో సంయానము   కోసం   వెతుకులాటలో ఉన్న సమయాన
నిన్ను నువ్వే ప్రశ్నించుకో'... ఇంకెప్పుడు అని

అవశేషంగా బ్రతుకు మారిన వేళ
శస్త్ర  చికిత్సలో  నొప్పినేగా  మిగుల్చుతాయి  ఈ  ప్రశ్నలు

రహస్య పేటికల్లో  దాగి ఉన్న
సృష్టి  రహస్యం  మన కర్థం గాదు

అందని  ఆకాశంతొ  నయినా
మాటలు కలిపి చూడాలి !


భాను వారణాసి
31. 01. 2015

Thursday, January 29, 2015

పిల్లలూ దేవుడూ చల్లని వారే !

పిల్లలూ దేవుడూ చల్లని వారే !
( వచన కవిత్వం)
----------------------------------------

ప్రతి రోజూ బోర్ కొట్టకుండా  నేను మా మనమ రాలిని  తీసుకోని అలా పార్కింగ్ కి వెడతాను . అక్కడ  చిన్నపిల్లలు అందరు సరదాగా ఆడుకుంటారు . అక్కడ మెక్సికన్ , కెనడా , అమెరికా , ఇండియా , పాకిస్తాన్ , ఇరాన్ , శ్రీ లంక, యూరప్  పిల్లలు అందరు ఒక్కటిగా  ఆటల్లో మునిగి  సరదాగా ఆడుకొంటున్నారు , అల్లరి  చేసుకొంటూ , ఒకర్ని ఒక్కరు పట్టుకొంటు , స్లయిడింగ్  , రైడర్స్  ఆడుకొంటున్నారు .

ఆ పిల్లలకి  భాష తెలియక పోయినా  , ఏ ప్రాంతం వాడో తెలియక పోయినా సరదాగా ఆడుకొంటున్నారు .

గానీ  వచ్చిన  బాధంతా  మనతోనే !

మెక్సికన్ వాణ్ని చూసి  వీళ్ళ  దేశం లో డ్రగ్స్ మాఫియా  రాజ్యం ఏలుతోంది !
కెనడా  దేశం వాణ్ణి  చూస్తే  వీళ్ళు  అందరికి  migration ఇచ్చేస్తారు !
అమెరిక వాణ్ణి చూస్తే  అంత అమాయకుడేం  గాదు అన్పిస్తుంది !
పాకిస్తాన్ వాణ్ణి చూస్తే  వీడు మన దాయాది , మన మీద  టేర్రరిజం  చేస్తున్నాడు !
ఇరాన్ వాణ్ని చూస్తే  ఇరాని చాయ్ గుర్తొస్తుంది !
శ్రీ లంక వాణ్ని చూస్తే  మన తమిళుల   ఊచకోత  గుర్తోస్తుంది !
యూరప్ వాణ్ని చూస్తే  మత  ముష్కరుల చేతిలో చచ్చిన సంపాదకుడు గుర్తొస్తాడు !

గాని మన ఇండియా వాణ్ణి చూస్తే    గుండె  చెరువవుతుంది !

కుల మత  పీడ  అక్కడ గూడా అంట   గడుతున్నాడు . అంతే  గాదు  ప్రాంతీయ విద్వేషాలు , భాషా బేధాల తెగులు అక్కడ  గూడా అంటిస్తున్నాడు . తెలిసి తెలియ నట్లు నటిస్తున్నాడు. మనిషి కన బడితే కనీస పలకరింపు  గూడా
 లేకుండా  మొహం తి ప్పు కొం టున్నాడు .  నాగరికత  తెలివి మీరి పోయిందో  , లేదా  డాలర్ల  మోజులో పడి మానవ సంబంధాలు  మరచి పొయ్యారో  తెలియడం లేదు .

నేను అలా మనసులో మధన పడుతున్నా , నా మనమ రాలు  అన్ని దేశాల పిల్లలతో  ఎంచక్కా అందరితో చెట్ట  పట్టాల్ వేసుకొని  సరదాగా ఆడుకొంటున్నది .

అందుకోనేమో  పిల్లలు దేవుడితో సమానం అని అంటారు . మనమంతా  పిల్లల  లాగుంటే ప్రపంచమంతా ఎంత బాగుంటుందో !

భాను వారణాసి
30. 01 . 2015

 

Wednesday, January 28, 2015

మావా నన్ను పెళ్లి జేసుకోవా ?

మావా నన్ను పెళ్లి జేసుకోవా ?
-------------------------------------------------
మా  అమ్మోళ్ళు   సేను కాడికి
మా నాయనోళ్ళు   సంత కాడికి
పోయిండారని
మా ఇంట్లోకి మెల్లగా
దూరిండ్లా నువ్వు  అ పొద్దు మామా !

మా తమ్ముడు గుక్క పట్టి
ఏడస్తావుంటే 
ఆడికి  పావలా  ఇచ్చి 
'పోరా కమ్మర కట్లు  కొనుక్కోపోరా'
అని వాణ్ణి   బైటకి పంపించి
నువ్వు నన్ను గట్టిగా  ఎనకాల నుండి
వాటేసు కాలేదా  మామా !

నీ  ఉక్కు సేతులు
నన్ను నలిపేస్తా  ఉంటే
నేను  ఉరికేనే  ఏడిస్తే
నువ్వు బయపడి నన్ను  ఇడిసిపేట్టలా !

'పొద్దుగూకులూ  నీకేమి  పని  
ఇంట్లోనే అమ్మీ' అని నువ్వు  నన్ను  అడిగితే
నేను యాడికి రావల్ల అంటే
మాలు సినిమాకి  ఆన్యావు
సినిమాకొస్తే  నేల టికెట్  తీస్కొని
ఇద్దరము పక్క పక్కన    కుస్సోని
నవ్వు కొని నవ్వు కొని సచ్చినాము !


శివరాత్రికి  కలకడ తిరణాలకు
అమ్మోల్లకు సెప్పకుండా పోయినాము
అక్కడ నాకు మంచి  సీర కొనిచ్చినావు
సేనిక్కయాల పంట సేడిపోయిందే  అమ్మీ
లేకంటే నీకు ఎండి కడియాలు  కొనిచ్చే
అని నా సెంపల పైన  ముద్దు పెట్న్యావు !


నా మెడలో సూత్రం కట్టు మామ
నీ  కాడ్నే  ఉంటా
నీ  బిడ్డల్ని కంటా
నిన్ను పాపోడ్ని మాదిరి   జూస్కొంటా
అంటే  నువ్వు నన్ను బిగ బట్టేసి
కల్లల్లొ  నీల్లు  పెట్కొని
బెమ్మ దేవుడు  దిగొచ్చి  వద్దన్యా
నిన్నే నేను పెల్లి జేసుకోనేది  అన్యావు
కావల్లంటే  కాణిపాకం ఎల్లి
పమానం గూడా  జేస్తనన్నావు !

 భాను వారణాసి
29. 01. 2015

Monday, January 26, 2015

రెండు తలకాయలు

రెండు   తలకాయలు
------------------------------------------------

నువ్వేమైన   చెప్పు
మనిషి లో ఇంకో  మనిషి  ఉంటాడు
వాడు మంచోడో  చెడ్డోడో  నాకయితే తెలియదు

వాడు  నిద్రాణ మైన
అభిజాత్యాన్ని  అప్పుడప్పుడు
తట్టి  లేపుతుంటాడు

అహంకారాన్ని గూడా
అప్పుడప్పుడు   రేపుతుంటాదు

ప్రతి మనిషికి రెండు   తలకాయలుంటాయి
ఒక తల  సమాంతరంగా
ఇంకో తల అడ్డగోలుగా

పై  పెదవి   ఒక మాట  విరిస్తే
క్రింది పెదవి ఇంకొక అర్థం  పూస్తుంది

ప్రతి మనిషి పైకి  బాగానే  ఉంటాడు
గాని లోపల మాత్రం విభిన్నంగా  ఉంటాడు

ఆకు  మాదిరే ఉంటుంది మృదువుగా
తీట గంజిరాకు   , గాని ఒక్క సారి  తాకితే
ఒళ్ళంతా  దుద్దుర్లు , నవ్వలు
మనిషి గూడా  తీట  గంజిరాకు  లాంటి వాడే

మనిషి నిజంగా వింత మృగమే
నిజమైన మృగానికి  
చంపుడో , చావుడోనో  తెలిసేది
కాని మనిషికి  చంపుడే  తెలుసు
మాటలతో ,చేష్టలతో ,వికార బుద్ధులతో

గుడిలో ప్రసాదం దొరక్క పొతే
శఠ   గోపం గూడా  లాకొని పొయ్యే వాళ్ళున్నారు

మనిషి  శిబి చక్ర వర్తి గాదు గదా
అంగాలను కోసి దానం చెయ్యడానికి

వాడి తల మిద  గొడుగు  ఉన్నత వరకు
వాడు ఎండ గురించి  బాధ పడడు
గొడుగు లాగేస్తే  వాడొక విప్ల కారుడు అయిపోతాడు

నల్ల చలు వద్దాలు వేసుకొన్న వాడికి
లోకమంతా  చల్లగా కనబడుతుంది

ఏమైనా  మనిషి రెండు విభిన్న కొణాల వ్యక్తీ

ప్రతి అణువులోను
న్యూట్రాన్ , ప్రోట్రాన్  ఉన్నట్లు !!



భాను  వారణాసి
27 జనవరి  2014




 

Sunday, January 25, 2015

నా భారత దేశం

నా భారత దేశం
----------------------------------

నా భారత దేశం
అందాల  తోట
నా భరత  మాత
కరుణాంతరంగ   నెలత

ఇది  పవిత్ర భూమి
ఇది  కర్మ  భూమి
ఇది వేద  భూమి
ఇది తపో భూమి

ఇక్కడే   వేదంబులు
ఇక్కడే   మహర్షులు
ఇక్కడే   దేవతలు
ఇక్కడే   దేవుళ్ళు

ఇక్కడే   ప్రేమ
ఇక్కడే   మమత
ఇక్కడే  కరుణ
ఇక్కడే   సమత

ఈ దేశం విశ్వానికి 
ఈ దేశం జ్ఞానానికి
ఈ దేశం  నాగరితకు
ఈ దేశం  ధర్మానికి

వందే మాతర గీతం
జన గణ మన  గీతం
గుండెల్లో  మ్రోగాలి
పాటై  పాడాలి



భాను వారణాసి
26. 01. 2015
గణ తంత్ర దినోత్సవం








 

నేను గుంపులో ఒక్కడ్ని !

నేను గుంపులో ఒక్కడ్ని !
( సిరీస్ 2)
---------------------------------------------
5
ఉపన్యాసాలతో  ఊర్ల మీద పడి
చెప్పేదొకటి చేసే దోకటయి
నటిస్తూ ... నటనలో ఏడుస్తూ  ...
పేదల నోట్లో  మన్ను  పోస్తూ
అధికారాన్ని అడ్డం పెట్టుకొని
దందాలు చేస్తూ , కమీషన్లు  కుమ్మేస్తూ
అధికార దుర్వినియోగంతో
తస్మదీయులకు  కాంట్రాక్టు పనులప్పగిస్తూ
కోట్లు   కోట్లు దండుకొంటున్న
 రాజకీయ నాయకులను  చూసి
సిగ్గుతో  తలవంచుకొని
నవ్వాలో ఏడవాలో తెలియక
నాలో  ఉన్న  కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి  చేద్దామని అనుకొన్నా
నా  మటుకు  నేను  ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ  గుంపులో  ఒక్కడ్ని !

6

నా ఇల్లు బాగా ఉంటే  చాలని
పక్కింటి వాళ్ళ ఇంట్లో  చెత్త బోస్తూ
రోడ్లు , బస్సు స్టాండ్లు , ఆసుపత్రులు
బడులు , గుడులు , పార్కులు
ఒకటేమిటి  సమస్త  ధరిత్రి నంతా
 నానా  గలీజు చేస్తూ
ఎక్కడ బడితే అక్కడ ఉచ్చలు  పోస్తూ
గోడల మీద ఉమ్ముతూ
నగరాలను , పల్లెల్లను , బస్తిలను
ఒకటేమిటి  ఏది కన బడితే  దానిని
అపరిశుభ్రం  చేస్తూ
ఎక్కడ పడితే అక్కడ  విసర్జిస్తూ
పందుల వలే  రొప్పుతూ దొర్లుతూ
దేశాన్ని మురికి కూపంగా చేస్తున్న
మన ప్రజా నీకాన్ని చూసి
నవ్వాలో ఏడవాలో తెలియక
నాలో  ఉన్న  కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి  చేద్దామని అనుకొన్నా
నా  మటుకు నేను  ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ  గుంపులో  ఒక్కడ్ని !

7

బస్సు ప్రయాణం
నరకానికి  పుష్పక విమానం
బస్సులో కూర్చు న్న మాటే గానీ
ఎక్కడ ఏ  లారీ కి గుద్దుతాడో
ఎంత మంది ప్రాణాలు గాల్లో కలుస్తాయో
ఎక్కడ కాలిపోతుందో , ఎక్కడ పగిలి పోతుందో
ఎక్కడ  మునిగి పోతుందో  అన్న టెన్షన్ తో
తాగొచ్చి నడిపే డ్రైవర్  మహిమో
లంచాలకు మరిగిన అధికారుల మహిమో
లైసెన్సు లేని డొక్కు బస్సులను
స్పీడ్ ప్రమాణాలను పాటించని  బస్సులను
రోడ్డు  సిగ్నళ్ళు  చూడకుండా  దూరిపొయ్యె వాహనాలను
విచ్చల విడిగా తిరిగే  వాహనాలను  చూసి
నవ్వాలో ఏడవాలో తెలియక
నాలో  ఉన్న  కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి  చేద్దామని అనుకొన్నా
నా  మటుకు నేను  ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ  గుంపులో  ఒక్కడ్ని !


Bhanu Vaaranasi
28.01.2015


 

Saturday, January 24, 2015

నేనేమౌతానో నీకు తెలుసా ??


నేనేమౌతానో  నీకు  తెలుసా ??
--------------------------------------------------------
నేను వినా  నీ కోసం పరితపించేది  ఎవ్వరు ?
నేను వినా నీ కోసం రెండు  కన్నీటి బొట్లను రాల్చేది  ఎవ్వరు ?
ఎలా ఏ భాషలో చెప్పాలో నీకు ?
నా ప్రేమలో స్వచ్చత  లేదన్నావు నువ్వు
నా దేహాన్ని కాలిస్తే నీకు బూడిద  మిగులుతుందేమో గానీ
నా హృదయాన్ని  కాల్చి చూడు
ఆశ్చర్య పోతావు నువ్వు
అక్కడ దాగిఉన్న స్వర్ణ పేటికలో
నీ ప్రతి బింబం కన బడుతుంది
ఇంకా ఏ విధంగా నా  ప్రేమను  నీకు
బహిర్గతం చెయ్యాలో తెలియటం లేదు నాకు
ఆకాశం  చూసావు  గదా
అంత నిర్మల మైనది   నా ప్రేమ !
సముద్రాన్ని  చూసావు గదా
అంత  లోతైనది  నా ప్రేమ !
మట్టిని చూసావు గదా
అంత  సహనం  గలది  నా ప్రేమ 1
జాబిల్లి  ని  చూసావు  గదా
వెన్నల  లాంటిది నా ప్రేమ !
అదో ఆ చిలిపి  నవ్వే వద్దన్నాను
అదో ఆ  ఓర చూపులే  కాదన్నాను
అవి రెండు నన్ను దహించి వేస్తాయి
నువ్వు  నా సహనాన్ని  గాని
ప్రేమను గాని  పరిక్షించాలనుకోకు
సలీం  లాగానో , మజ్ను లాగానో
దేవదాసు లాగానో
ప్రేమ నగర్ , ప్రేమాభిషేకం లో ఏ ఎన్ అర్  లాగానో
నేనేమి  విషం మింగను ,నేను అసలు చావను
అదో అదే నవ్వు వద్దంటున్నాను
అలా నీ  అధరాన్ని ముని పంటితో నొక్క వద్దన్నా
నువ్వు  ఇలానే  కబుర్లు చెప్పి
నాకు దూరమయ్యా వనుకో
నేనేమౌతానో తెలు సా ?

వచ్చే జన్మలో నీకు  ప్రేయసి గా పుట్టి
నిన్ను ఇలాగే  ఏడిపిస్తా !!

భాను వారణాసి
24. 01 . 2015


( యౌవన దశలో కొంత మంది ప్రేమికులు ప్రేమించు కొంటారు . ఎందుకో  కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఒకటి గాలేరు . ఇది ప్రతి ఒకరికి అనుభవమే . మనం కాలేజి చదివే రొజుల్లో అలా మనల్ని మురిపించి మాయ మయిన వాళ్ళెంతో మంది . అలాంటి భగ్న ప్రేమికులకు ఈ  కవిత అంకితం )

















 

Friday, January 23, 2015

తిరిగే దేవుళ్ళు !


  తిరిగే దేవుళ్ళు !
-----------------------------------------

నువ్వొక్క సారి రైలేక్కుతున్నపుడు
జారి  కింద పడిపోతుంటే
చేయ్యి పట్టి పైకి లాగిన  పెద్దమనిషి
మళ్లి  నీకు అగుపించనే  లేదు

వరదల్లో చిక్కు కొన్న నిన్ను
రక్షించాడే ఒక  బికారి
అతన్ని నువ్వు గమనించనే లేదు

నువ్వొక సారి గుండె పోటుతో
ఆసుపత్రిలో స్పృహ లేకుండా పడినప్పుడు
నీ తల నిమిరి వెళ్ళిపోయిన వ్యక్తిని నువ్వు
గుర్తు పట్టనే లేదు

నీ బిడ్డ  ఒంటరిగా  వెడుతున్నపుడు
ఆకతాయిల  ఆగడాలనుంచి
తప్పించిన  ఒక  అయ్య కోసం
నువ్వు  మళ్లి  వాకబు చేయ  లేదు

రోడ్డు దాటుతున్న నీ  శ్రీమతిని
రెప్పపాటులో  ప్రమాదం  నుంచి కాపాడిన
ఒక  అమ్మను  నువ్వు  చూడనే లేదు

గుడిలో  తప్పిపోయిన  నీ ఆరేళ్ళ కొడుకు
ఉత్తరం వైపు ఏడుస్తూ ఉన్నాడని
చెప్పిన కోయ రాజును
నువ్వు మర్చి పోయ్యావు

వర కట్న పిశా చి తో
నువ్వు కుదుర్చు కొన్న పెళ్ళి సంబంధం
వద్దని చెప్పిన  పంతులు గారిని
నువ్వసలు   తర్వాత  పట్టించుకోనే  లేదు

నువ్వు గొప్ప విపత్తులో నున్నపుడు
నీతో పాటే ప్రయాణిస్తున్న ఒక వ్యక్తీ
చెప్పిన సందేశం నిన్నెంతగా  మార్చిందో
అసలు ఆ అగంతక వ్యక్తీ  ఎవరో
ఎక్కడ దిగాడో నువ్వు పట్టించు కోనేలేదు


ఎక్కడో ఎందుకో ఎవరో
మనకు కొందరు  తారస పడుతుంటారు
ఎన్నో జన్మల  నుండి
మనకు వారితో అనుబంధం  వుందనిపిస్తుంది
వాళ్ళు చెప్పిన  కొన్ని వాక్యాలు
మన జీవితాలనే మారుస్తాయి
వాళ్ళతో  రెండు క్షణాల పరిచయం
మన ఎద లోతుల్ని తట్టి లేపుతాయి
జీవన సత్యాలు కొన్ని మనకు
అసత్యాలుగానే  అన్పిస్తాయి
అపరిచిత వ్యక్తుల  అవ్యక్త  సహాయాలు
మనం  ఇట్టె మరచిపోతాము
వాళ్ళ కోసం మనం మళ్లీ వెతికినా
వాళ్ళు మాయ మైపోతారు

వాళ్ళే నేమో  మనుషుల్లో  తిరిగే దేవుళ్ళు !



భాను  వారాణాసి
23. 01 , 2015
సీయాటెల్, usa

నేను గుంపులో ఒక్కడిని ! ( మొదటి భాగము )

నేను  గుంపులో  ఒక్కడిని !  ( మొదటి భాగము )
1

మునిసి పాలిటి  గుమాస్తాల , ఆఫీసర్ల కాళ్ళు  పట్టుకొని
చెప్పులు అరిగి పొయ్యెలా తిరిగినా
ఇల్లు కడ దామంటే అప్రోవల్ రాదాయే
డెస్క్  కింద చెయ్యి పెడితే గాని
పనులు జరగా వాయె
లంచం కోసం రకరకాల  జిమ్మి క్కులు
నోటు పెడితే గాని అటెండర్  గేటు తెరవడు
దక్షిణ పెడితే గాని  పేపర్ ముందుకు  పోదు
అని రంగా రావు  నాతొ  అన్నపుడు
నాలో  ఉన్న  కవి రగిలిపోయ్యాడు
ఏదో ఒకటి  చేయ్య మని  అడిగినా
కాని నేను మటుకు  ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ  గుంపులో  ఒక్కడిని!


2

అమ్మమ్మను తీస్కొని
సర్కారు దవఖాను కెళితే
గేటు కీపర్ అడ్డగించి  బెరమాడే
బెడ్డు లేక కింద పడుకొన్నమంటే
పందికొక్కులు దోమలు పిక్కుతినే రాత్రిపూట
దున్నపోతులు  డబ్బుకోసం పిక్కుతినిరి పగలుపూట
శవాల్ని అడ్డం పెట్టుకొని డబ్బులు గుంజిరి దొంగోళ్ళు
అని మా పక్కింటి రంగమ్మ  ఏడుస్తుంటే
నాలో  ఉన్న  కవి రగిలి పొయ్యాడు
ఏదో ఒకటి  చేయ్య మని  అడిగినా
కాని నేను మటుకు  ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ  గుంపులో  ఒక్కడిని!

3

ఇల్లు లేనోడ్ని  సామి
పొదుపు చేసి పిఎఫ్ డబ్బులు బోసి
ఆరంకణాల  భూమి కొందామని పొతే
అసైనడ్  భూములు తగల బెట్టిరి
రియల్ ఎస్తోతోల్ల మయామాటలు నమ్మి
కొం ప  కోల్లెరాయే
బతుకు బజారు పాలాయే
అని మా రంగ సామి  మొత్తుకొంటె
నాలో  ఉన్న  కవి రగిలిపొయ్యాడు
ఏదో ఒకటి  చేయ్య మని  అడిగినా
కాని నేను మటుకు  ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ  గుంపులో  ఒక్కడిని!


4

పిల్లల చదువులు గాదు గాని
లక్షల్లో డొనేషన్ లు గుంజుతున్నారు
సర్కారి స్కూళ్ళల్లో  చదువులు చెప్పరు
ప్రవేటు స్కూళ్ళ ల్లో  డబ్బులు లేనోళ్ళ ని రానివ్వరు
కూర్చుంటే ఫీజు, లేస్తే  ఫీజు
ఆడుకొంటే ఫీజు ,నిద్రపోతే ఫీజు
నాలుగు ఇంగ్లీష్ ముక్కలు కోసం
కాన్వెంట్ స్కూళ్ళు  కార్పోరేట్  స్కూళ్ళు
మా అన్న  తన గోడు చెప్పుకొంటే
నాలో  ఉన్న  కవి రగిలి పొయ్యాడు
ఏదో ఒకటి  చేయ్య మని  అడిగినా
కాని నేను మటుకు  ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ  గుంపులో  ఒక్కడిని!

 భాను వారణాసి
22.  01 . 2015

Wednesday, January 21, 2015

తాతా !



తాతా !
----------------------------------------

తాతా !
లయ తప్పిన నీ గుండె చప్పుడు  నాకు  వినబడింది
ఆ పచ్చిక  మైదానంలో నువ్వు నన్ను ఆడి స్తున్నపుడు
నీ  నవ్వులో  ఏదో  అపశ్రుతి   వినబడింది
నువ్వు నన్ను భుజాల  మీద   వేసుకొని
ఆడిస్తున్నపుడు  నీ దేహం వింతగా  కంపించడం చూశాను
బహుశా  స్వర్గంలో ఉన్న  బామ్మ
నీకు  గుర్తొచ్చిందేమో !
నువ్వు  నాకు రాజు దొంగ  కథ చెపుతున్నపుడు
నువ్వేమో ఒక నైరాశ్యానికి  లోనయ్యావు
బహుశా నీకు  మా చిన్నప్పటి  నాన్న గుర్తోచ్చాడేమో !
వేలు పట్టి నడిపించిన  నువ్వు
నీ  వేలు  పట్టి నడిపించే వాళ్ళు లేరనేగా నీ బాధ
నీలో కరుగు తున్న  వయస్సు 
వణుకు తున్న  నీ  దేహం
నీ  మాట వినలేదనే  గదా నీ  బాధ
నువ్వు ఇంట్లో ఉన్నపుడు
టామి తో గడిపే  టైం  నీతో గడపడం లేదనే గదా ?
ప్రేమల్లేని  బాందవ్యాల  మధ్య 
ఎలా నీ శేష  జీవితం  గడుస్తుందో అనేగా నీ బాధ ?
తాతా !
నువ్వు నాతో  అన్నీ  చెప్పక పోయినా
నాకన్ని తెలుసు
నువ్వు   ఆశించేది 
కేవలం  కొన్ని  ప్రేమానురాగాలు
కలబోసిన క్షణాల్ని మాత్రమే  అని
అమ్మ నాన్నలకి  నువ్వొక
నిరర్థక  మనిషని తెలుసు
కానీ  తాతా  నీకోసం నేనున్నా
నీ ఎద సవ్వడి చేసే  భాష
నాకర్థ  మయింది తాతా !
నా బోసి నవ్వులతో
నిన్ను  నవ్విస్తాను
సరేనా
నాతొ ఖటిఫ్  చెయ్యవు గదా తాతా ?

21. 01. 2015
  

Monday, January 19, 2015

అంతర్జాల యుగమా ?( AN ERA OF INTERNET)


అంతర్జాల యుగమా ? (An  era of internet )
-------------------------------------------------

అంతర్జాల సమీకరణాల సమన్యయంలో
పారాడుతున్న ఆత్మల సమాగమంలో
ముఖ పుస్తక పరిచయాలతో నెటిజన్లు
ఎన్నన్నో విశ్లేషణలు
ఎన్నెన్నో  విశదీ కరణలు
భావ వికేంద్రికరణలు కుప్పలు తెప్పలు గా ఒక్కచోట రాలిపడి
యుగానికి చాలినంత  గ్రంధాలు  పురుడు పోసుకొంటున్నాయి
సాంకేతిక  విప్లవం సామాన్యుడి మేధస్సు పదును పెట్టి
మేధో మథనం  జరుగుతున్నది
 దృశ్య శ్రవణ  పరికరాలు , నెట్ వర్కింగ్ , ఉపగ్రహాలతో
నైలు నదిని  దాటి పసిఫిక్ సముద్రాన్ని  క్షణాల్లో చేరుతున్నది
సమాచారాల సమాహారం
ఒక్క గొప్ప  మానవ చరిత్ర దిగంతాల అవతల 
సర్వర్ల లోయలలో  దాచిపెట్ట బడి  ఉంది
ఒక్క మాట  ఒక్క  రాతగా
ఒక్కొక్క కీ బోర్డున  ప్రతిధ్వనించే  అక్షర లయలు
జావా  దీవుల్లో  నిక్షిప్తమయ్యింది
అంతర్జాతీయ మందించిన   సమాచారాన్ని
అంగారక గ్రహం   క్రోడికరిస్తోంది
ఆఫ్రికా లో పుట్టిన ఎబోలా జీవ  కణాలు
బిగ్ బాంగ్  లో  ఉత్మన్నమయ్యే  దైవ కణాలు
సృష్టి రహస్యాన్ని చేదించే  మూల సూత్రాలు
రహస్య పేటికల్లో  సొల్యూషన్  కోసం వెతుకుతున్నాయి
సూపర్ సోనిక్ విమానాలు  శబ్ద వేగాన్ని  దాటి
ఖండాంతర విన్యాసాలు  చేస్తున్నాయి
భూమి చుట్టు ఉపగ్రహాలు తిరుగుతూ
గ్రహాంతర జీవితానికి బాటలు వేస్తున్నాయి
డార్విన్ సిద్దాంతం మరో మలుపు తిరుగు తున్నదా ?
ఎవల్యూషన్  లో క్రొత్త జాతి ఉత్పన్నమవుతున్నదా ?
రోబో లు  ప్రయోగశాలలో  క్రొత్త తరాన్ని   తయారు చేస్తున్నాయా?
న్యూటన్ గ్రావిటీ సిద్ధాంతం మారనున్నదా ?
నిక్షిప్త మైన  జ్ఞాన సంపద  మనిషిని  మనిషి చెయ్యాలి
మర మనుషుల చేతిలో  మనిషి  కీలు బొమ్మ కాగూడదు
అదుపు తప్పి  సాంకేతిక విజ్ఞానం  మానవ  వినాశనానికి దారి తీయ గూడదు
విచ్చన్న కర శక్తులకు విజ్ఞానం  దాసోహం కాగూడదు .



19. 01. 2015
భాను వారణాసి

 

Sunday, January 18, 2015

వినరా వినరా నరుడా !

వినరా  వినరా నరుడా !

-------------------------------------------------
వళ్ళు వంచితే  సుఖం దొరుకుతుంది
పని చేస్తే   మనీ  నీదవుతుంది
నక్క వినయాలు , వంకర పనులు
చంచా పనులు  ,దందాలు
లాభం లేదు తమ్ముడు
పని నేర్చుకో
పబ్బం గడుపుకో
తెలివి ఒకడబ్బ సొమ్ము గాదు
సదవాలే  సదవాలే
సదివింది  పది మందికి  ఉపయోగపడాలే
కష్ట పడాలే  కష్ట పడాలే
కష్ట పడి పదిమందికీ సాయం  చెయ్యాలె
అమ్మగారికి  కూరగాయలు పంపుడ్లు
పిల్లలను స్కూళ్ళకు దింపుడ్లు
అయ్యగారి కాళ్ళు  పిసుకుళ్ళు
ఇవన్ని  పని చేత గాని చవటమ్మలకు
మనిసి అన్నాక కళా పోసన తో పాటు
అభిమానం  ఉండాలే
ఆత్మను సంపుకొని  ఎన్నాల్లని బతుకు తావు
కాకి  గుడ్లు పెట్టేసి పారి  పోతుంది
కోయిల దాని గుడ్లను పొదిగి కాపాడు తుంది
పిల్లి పాలు తాగుతుంది 
అలాగే  ఇంట్లో వేసి కొడితే
పిల్లి పులయి  నిన్ను రక్కుతుంది
కోడి పిల్లని తాకి చూడు
కోడి పెట్ట  నిన్ను తరుముతుంది
కుక్క  విశ్వాసం గలదె
బతుకంతా  కుక్క బతుకు కాగూడదు
గుంతల్లో  పడాల్సిందే
మళ్లి  బయటకు రావాల్సిందే
ఒక్క సారి వెనక్కు తిరిగి చూడు
నువ్వేమైనా సాధించావ అని
నిన్ను  నువ్వే గొప్పోడు అనుకోన్నవో
గొయ్యి  వేరే వాళ్ళు తవ్వరు
నీ  గొయ్యి నువ్వే   తవ్వుకొన్నట్లు
చేయి సాచి  పని చేసావనుకో
నువ్వు  ఎక్కిన కొమ్మ నువ్వే నరుక్కోన్నట్లు
వినయం ఉండాలే
పెద్ద వాళ్ళంటే గౌరవం  ఉండాలే
గాని అతి వినయం ధూర్త లక్షణం
కొందరు  తమను మించినోల్లు  లేదంటరు
మిడిసి మిడిసి పడతరు
తడి గుడ్డతో గొంతులు కోసేటోల్లు కొందరు
రక రకాల మనుషులు  తమ్ముడు
ఎవరెట్లున్నా
మనం సక్కగా ఉన్నామా లేదా
అని చూసుకోవాలె



18. 01. 2015






 

Saturday, January 17, 2015

నిజంగా ఇది నిజం !

నిజంగా ఇది నిజం !
------------------------------------------------------

నిన్న నాకోక  కల వచ్చింది
ఒక  రాజ కుమారి
దివి నుండి  భువికి దిగి వచ్చిన దేవతలా ఉంది
వజ్ర వైడూర్యాలు ,పట్టు  పితాంబరాలు
వంది  మాగధులు ,సామంత రాజులు
వళ్ళంతా నవరత్న ఖచిత సువర్ణ ఆభరణాలు
ఓహ్ ప్రపంచమంతా   ఆమెకు దాసోహ మై  పోతుంది
నీ  కోసం ఏమి తెచ్చానో తెలుసా అంది ఆమె
చెప్పాను  సముద్ర మంత  ఐ శ్వ ర్యాన్ని అని
గాదు  నా  హృదయాన్ని  అంది ఆమె
ఆశ్చర్య పొయ్యాను నేను
నువ్వు నిన్న నా కలలో  నా హృదయాన్ని గెలిచావు
అది ప్రేమికుల ఊత పదం అన్నాను నేను
ఆమె కనులు సజల నేత్రా లయ్యాయి
ఆమె తన హృదయాన్ని విప్పి చూపింది
అవును నిజంగా నా బొమ్మే కన బడింది
రాజ కుమారి  నన్ను క్ష మించు  అన్నాను నేను
మరి నన్ను ప్రేమిస్తున్నావా అంది ఆమె
నేను జవాబు చెప్పకుండా వెను  తిరిగి వెళ్ళాను
మళ్లి  కాసేపటికి ఆమె ముందు ప్రత్యక్ష మయ్యాను
మళ్ళి ఆమె అదే ప్రశ్న అడిగింది
నేనింకో  హృ ద యాన్ని ఆమెకు చూపించాను
ఆ హృదయ కవాటాల్లో
సిరల్లో , ధమనుల్లో , రక్త  నాళాల్లో
హృదయ ప్రకంపనాల్లో , ధ్వని తరంగాల్లో
నా బొమ్మే కన బడింది
రాజ కుమారి ఏమి మాట్లాడ కుండా
తన హృదయాన్ని  తీసుకోని
వెను  తిరిగి పోయింది !


18.01. 2015
భాను వారణాసి 

Friday, January 16, 2015

నీ కోసమే !

నీ  కోసమే !



ఆనాడు  నువ్వు  నా కోసం
కొన్ని  క్షణాల్ని  బహుమానంగా  ఇచ్చావు    
నువ్వు నా  కోసం   కొన్ని నవ్వుల్నీ గూడా దాచి ఉంచావు

నువ్వు  మల్లెపూలు తురుముకొన్న జడతో  వచ్చి
వెన్నెలమ్మను కూడా  వెంట పెట్టు కొచ్చావు
నక్షత్రాలన్నీ  వొంపుకొని  నడచి వచ్చావు  నీలి  రంగు  ఆకాశ పల్లకి  మీద

అక్కడ  నేల మీద  పరచు కొన్న సంపంగి పూలు  నువ్వు రాగానే
నవ్వాయని  నువ్వు అలగ  లేదూ ?

మొగిలి పూల  వాసన  వస్తే నువ్వు భయ పడ్డావు 
గుర్తుందా నీకు  అక్కడ నాగ పాములుంటాయని

మనం ఒక్క సారి వాన జల్లులో తడచి నప్పుడు
నువ్వెంత భయ పడ్డావో  తెలుసా ?

ఆ గాఢ  పరిష్వంగణ లో  నన్ను నేను  తమాయించు  కోలేనప్పుడు
సుతారంగా  నువ్వు  నా పెదవుల్ని  స్పృశించావు

నువ్వు  కిల కిల మని నవ్వితే 
పోయిన వసంతం తిరిగిచ్చిందని  కోయిలమ్మ  నీతో  జత కలిపి పాడింది

ఎగిరే పక్షులన్నీ  ఆకాసంలో  ఒక్కసారి  ఆగి పోయి 
నీ వంకే  తదేకంగా చూస్తున్నాయి
నువ్వు గెంతుతూ చేసే  అల్లరిని  చూసి


నన్ను నేను  తమాయించు  కోలేక నీకీ  కవితను  రాస్తున్న 
ఒక్కసారి  వస్తే  నా హృదయాన్ని  చదువుదు  గానీ !
 


17. 01. 2015
భాను వారణాసి







 

Thursday, January 15, 2015

రెండు సూర్యుడ్లు



రెండు సూర్యుడ్లు
----------------------------------------------------------------------

నేను  సూర్యుడు  మా ఊర్లోనే  మొలిచి నట్లనుకోన్నాను
సూర్యుడు మా  వాడే అనుకొన్నాము మొదట్లో
మా ఊరు వదలి  నేనెప్పుడు  బయట వెళ్లలేదు
సూర్యుడు  మా ఊర్లోనే  తిరుగుతున్నాడ ని అనుకొన్నాము
కొందరయితే  కుల సభలు పెట్టి  సూర్యుడు  వాళ్ళ వాడే అన్నారు
ఎందుకంటె  తూర్పు  దిక్కున ఉన్న  రెడ్ల  పొలాల్లోనే  సూర్యుడు  పుడతాడని
అందుకే  సూర్యుడు  వాళ్ళ వాడని  అన్నారు
ఇది కొందరికి ఏ  మాత్రం  సయించలేదు
అందుకే  రెడ్ల  సూర్యుడు , కమ్మ సూర్యుడు , బ్రాహ్మణ సూర్యుడు
కోమటి సూర్యుడు , మాల సూర్యుడు అని పేర్లు  పెట్టుకొన్నారు
కులాన్ని బట్టి  సూర్యున్ని పిలుచుకొన్నారు
సూర్యుడ్ని అడ్డం పెట్టి ఎండ రాకుండా చెయ్యాలని కొందరు పన్నాగం
అది వీలు  కాలేదు
సూర్యుడ్ని ఎలాగయినా మాయం  చెయ్యాలని కొందరి పన్నాగం
అది   వీలు కాలేదు
సూర్యుడ్ని రెండు  ముక్కలు పంచు కొందామని కొంద  రన్నారు
అది వీలు కాలేదు
సూర్యుడు ఎప్పుడు  మా పల్లె గాడనే  వెలుగు ఇస్తా  ఉంటాడు
గాని  ఎప్పుడు మాకు దొరకనే  లేదు
ఇదేదో  విచిత్రంగా  ఉందని
ఊరిడిచి  ఒక్కసారి  బయట కెళ్ళా

ఇప్పుడు ప్రపంచ మంతటికి  ఇంకో  సూర్యుడు  ఉన్నాడని అని తెలుసు కొన్నాక
ఆశ్చర్య పొయ్యాను!!!



16.01.2015
Bhanu Varanasi

Wednesday, January 14, 2015

అన్వేషి

అన్వేషి

1
అతను  నిద్రపోతున్నాఅదే స్పృహ
ఆతను మేల్కొని ఉన్నా  అదే ధ్యాస
స్నానాల  గదిలో మౌనంగా
నీటి  పాటతో స్వరం కలుపుతాడు
పూజ చేస్తున్నపుడు
పుష్పాల మౌన గీతాల్ని వింటాడు
శ్రీమతి గోముగా  వీడ్కోలు చెపుతున్నపుడు
వసంత గానాల్ని వింటాడు
ఆఫీసు లో   కూ ర్చోన్నా
బేల చూపులు చూస్తూ  ఆలోచిస్తూ ఉంటాడు
ఇహ లోకాన  పని చేస్తూనే
భావ లోకంలో  విహరిస్తూ ఉంటాడు
2
కనబడే ఏ దృశ్య మైనా
కవిత లల్లెస్తాడు
అక్షరాల పిచ్చోడు అని కొందరన్నా
అసలు పట్టించు కోడు
3
ఇంటికి వస్తూనే  శ్రీమతి సినిమా అంటే
తను రాసిన క్రొత్త కవితల్ని  వినిపిస్తాడు
ఉవ్వెత్తున  ఉప్పెంగే ఉప్పెన లా
భావ  తరంగాల్ని  రాసుకొంటాడు

4
ప్రపంచమంతా  మునిగి పోయినా
తను కూర్మా వతారం ఎత్తిన  విష్ణు మూర్తి లా
భావ సాగరంలో  మునిగి  కవిత లల్లుతాడు
5
ప5క్క లోపడుకొన్న శ్రీమతి నిద్ర పోయే వరకు ఆగి
తన మిద వేసిన శ్రీమతి చెయ్యిని సుతారంగా ప్రక్కకు లాగి
మౌని లా కవన తపస్సు లోకి  జారుకొంటాదు
ఎన్ని గంటలో ఎన్ని జాములో
రాత్రి  అలా జారి పోతున్నా
లోకమంతా నిద్ర పోతున్నా
రాస్తూనే ఉంటాడు రాత్రి సూర్యుడై !
6
ప్రోద్దస్త మానము  మీ పిచ్చి గీతలూ  మీరూనూ
అని విసుక్కొన్న  శ్రీమతి కి  ఒక నవ్వు విసిరి వేస్తాడు
పిల్లల  కోసమని సినిమా   కెళ్ళినా
నేటి సినిమా  ప్రభావం అని ఒక్క కవితను  సరి చేసుకొంటాడు
7
మదిలో అరాటం
ఎదలో పోరాటం
ఏదో రాయాలని
ఏమో చెయ్యాలని
ఆత్రుత  తపన  వేదన
8
అతనే పశ్చిమాన ఉదయించే సూర్యుడు
అతనే   తూర్పున  అస్తమించే సూర్యుడు
పగలు రాత్రి తేడా తెలియని అనిత్యుడు
కవిత్వానికి జీవితానికి తేడా  తెలియని  అమాయకుడు
తన నీడలోనే తను వెలుగును చూసుకొంటున్నఅపరాజితుడు
తన కోసం  తానెప్పుడు జీవించని  మహా మనిషి
భావ లోకం లోనే విహరిస్తున్న  భావేన్వేషి
అతడు నిరంతర   తపస్వి .


భాను వారణాసి
13.01. 2015
 

Tuesday, January 13, 2015

ఎక్కడికి పోతున్నాం మనం ?

ఎక్కడికి   పోతున్నాం  మనం ?
--------------------------------
ఇల్లలికి
ముగ్గు పెట్టి
ఆకేసి
అన్నం బెట్టి
కూర బెట్టి
పులుసు వేసి
చారు వేసి
నెయ్యి వేసి
పెరుగు వేసి
 బాగా కలిపి
ముద్దలు  చేసి
కూర ముద్ద నాన్నకు
పులుసు ముద్ద అమ్మకు
చారు ముద్ద తాతయ్యలకు
పెరుగు ముద్ద బామ్మకు , అమ్మమ్మకు
నెయ్యి ముద్ద నీకు
అన్నం తినేసి
చెయ్యి  కడుక్కొని
సంతకు బొయ్యే దారేది ?
సరుకులు  తెచ్చే  దారేది ?

అని మన  చిన్న తనం లో  మన  బామ్మలు , అమ్మమ్మలు   చిన్నపిల్లల్ని  నవ్విస్తూ
కిత కితలు పెడుతూ అన్నం ముద్దలు తినిపించేవారు

కాని ఇప్పుడు

డైనింగ్ టేబుల్  దగ్గర కెళ్ళి
బేబీ  చైర్ లో కూర్చోని
స్పూన్ తీసుకోని
అన్నం కలిపి
కూర ముద్ద మిక్కీ  కి
పులుసు ముద్ద మిన్నీ  కి
చారు ముద్ద  గూఫీ కి 
పెరుగు ముద్ద  డైసీ  కి
నెయ్యి ముద్ద నీకు
అన్నం తినేసి
చెయ్యి కడుక్కొని
మాల్ కు బొయ్యే  దారేది ?
సరుకులు తెచ్చే దారేది ?

మానవ సంబంధాలన్నీ 
ఆర్ధిక సంబంధలయ్యాక
ఆత్మీయు ల కంటే
బొమ్మల  తో ఎక్కువ గా గడిపే
నేటి చిన్నారుల  భవితవ్యం
ఏమవుతుంది?
మన తరం  వాళ్ళు
ఏమి చెయ్యలేమా ?
మన  ఉమ్మడి సంసృతికి
తిలోదకాలు  ఇచ్చి నట్లేనా ??
ఎక్కడికి పోతున్నాం ?
ఏమై  పోతాం ??


భాను  వారణాసి
14.01. 2015
పుష్య మాసం
భోగి  పండుగ రోజు



 

కవి ( KAVI)

కవి

కవి  బాహ్య  ముఖుడే  కాదు
అంతః ర్ముఖు డు   గావాలి
కవి ఏక కంఠు డే గాదు
దశ కంఠు డు కావాలి

కవి  ఆకులో  హరితమై
పచ్చదనాన్ని చూడాలి
కవి  జల్లులో జల్లునై
తేమను  చవి చూడాలి
కవి  మట్టిలో రేణువై
మట్టి వాసన  చూడాలి

కవి యోగుడై
ప్రపంచాన్ని పరికించాలి
కవి  భో గుడై
ఇంద్రియాలను  జయించాలి
కవి  దేవుడై
ధర్మాని కాపాడాలి

కవి అకాశ మంత
ఎత్తు ఎదగాలి
కవి పాతాళ మంత
లోతు  ను చూడాలి
కవి సాగర మంత
సారాన్ని గ్రహించాలి

కవి ఒక్కసారి
విస్పోటనమై  భగ్గు మనాలి
కవి తాను కార్చిచ్చై
అధర్మాన్నిబూడిద  చెయ్యాలి

కవి తనకు తానై
కరిగి పోవాలి  మైనపు ఒత్తిలా
కవి  తనకు తానై
ప్రకాశించాలి  భానుడిలా



భాను వారణాశి
11. 01. 2015

 

Sunday, January 11, 2015

ప్రకృతి నీతో మాట్లాడుతూనే ఉంటుంది !

ప్రకృతి నీతో  మాట్లాడుతూనే  ఉంటుంది !

1
ఆర్జన లోనే నీ జీవితం
డస్సి పోయింది
బతుకు తెంపెర లాట లోనే
నీ కథ  ముగింపు కోస్తోంది
వార్ధక్యం  నీకు  తెలియకుండానే
నిన్ను  మింగుతోంది
నీ  గుండె  ఇక మిగిలిన
క్షణాల్ని  లెక్కపెడుతోంది
నీ   ఎక్స్పెరీ  డేట్
ఫైనల్ అయింది

2
అరాటాల  ఉప్పెనలో
ఇంకా  దేని కోసం పరుగు ?
నీ సంపాదన నింపాదిగా
లాకర్లో  నిద్ర పోతోంది
నిజమే ! నువ్వు నిజంగా
లోకాన్ని  జయించావు
గానీ   మిత్రమా


3
చల్లని ఉదయాన్ని
ప్రభాత సూర్యుణ్ణి
కిటికీ లోంచి పడుతున్న నీరెండని
గడ్డి పువు మిద జాలు వారే తుషార బిందువును
అద్దం ముందు కిచ కిచ మంటున్న ఊర పిచ్చుకను
కావు కావు మంటున్న  కాకి అరుపును
అదో ప్రక్కింట్లో ఉన్న కొబ్బరి చెట్ల ఆకులు లికి కదలి నప్పుడు  వచ్చే సడిని
ఆకాశ వాణి విన్పించే వందేమాతర గేయాన్ని
'సడి చెయ్యకొ గాలి , సడి చె య్యకే' అన్న రేడియో  లో  వచ్చే పాత పాటని 
ఫిల్టర్ కాఫీ వేస్తున్నపుడు  ఆ కాఫీ వాసనని
వాన చుక్కలు వరండా మీద నుండి  కిందకు పడుతున్న సవ్వడిని
ఏక్కడో  ఏటి మిద పోతున్న  తీతవ పక్షి  పాటను
స్నానాల గదిలో నిన్ను పలకరించే నీటి భాషను
గుడి లోంచి వచ్చే సన్నాయి వాయిద్యాన్ని
బడి లోంచి చిన్నారుల  కేకల్ని
ఇలా ఎన్నని చెప్పను ?
ఏమని చెప్పను ?
భగవంతుడు మన కిచ్చిన శ్రవణ సంపద
అనుభూతి కి లోనవ్వాలి గానీ
ప్రతి రాయి రప్ప , ప్రతి మాను మాకూ
నీతో మాట్లాడతాయి

అసలుకి నువ్వు
గమనించావో లేదో మిత్రమా
ప్రకృతి నీతో 
ఎప్పుడూ   మాట్లాడుతూనే  ఉంటుంది !

11.01. 2015
భాను  వారణాసి






 

Wednesday, January 7, 2015

సీమ రైతన్నా !

సీమ  రైతన్నా !

--------------------------------

యాడ బొయ్యెదన్న
ఏమి పిక్కు తిని
బతకాలన్న
సీమ బతుకులు
సింపిరి  బతుకులు
థూ  దీ నేమ్మ బతుకులు
బాయిలో  దిగి  సత్తేనే
బాగు పడే బతుకులు

తెల్లారి లేసి
కాడి మాను  ఎత్కొని
మడి  కాడ
కపిల తోలు  దామంటే
థూ దీనేమ్మ బతుకులు
బాయిలో నీల్లే  లేకపాయె

చేను కాడ  మడక దున్ని
సేనిక్కాయల పంట ఏస్తే
పెంట పురుగు  పాడు జేసే
థూ  దీనెమ్మ  బతుకులు
శెట్టి  కాడ  అప్పు మిగిలే

అమ్మి పెల్లి జెయ్యాలని
భూములన్నీ కొదవ బెట్టి
బ్యాంకు లోను  తీసుకొంటే
వడ్డి మీద వడ్డీ కట్టి
థూ  దీనెమ్మ బతుకులు
భూములన్నీ ఏల మేసిరి

సీమ రైతు కట్టమేమో
నాయకులకు పట్టదాయే
పెబుత్వాలు ఎన్ని వచ్చినా
పరిచ్చితి మారదాయే
సంక్రాంతి  వచ్చినా
సంబరాలు లేవాయే

మా సీమ రాయల సీమ
మా సీమ రతనాల సీమ
కొత్త పెబుత్వం  కొంతయినా
సీమ  కోసం  కర్సు  బెడితే
మా రైతన్నల  తల రాతలు  మారుతాయి
మా   బీడు మడ్లు సేన్లు  బంగారం పండుతాయి




 ( రాయల  సీమ రైతన్నల  దుస్థితి  చూసి  స్పందించిన  కవిత )



భాను మూర్తి
08.01. 2015




 

Tuesday, January 6, 2015

మిత్రమా !


మిత్రమా !

 

మిత్రమా !
చాలు నీవిక రాసినది
పుంఖాను పుంఖాను లుగా
కవితల కీకారణ్యంలో పెరిగిన
అక్షరాల మహా వృక్షాలు
అలుపెరగని అభిమన్యుడిలా
సమరానికి దిగిన నీ భావాస్త్రాలు
కాని మిత్రమా నువ్వెప్పుడైనా
దరిద్ర దిగంబరుల , దగా బడ్డ దీనార్థుల కథల్ని విన్నావా ?
ఆడ పుట్టుకే శాపంగా
దిన మొక గండంగా బ్రతికే నిర్భయ , అభయల్ని
అక్కున దరి జేర్చు కొన్నావా ?
గురువులే కామాంధులై , కాల యముడ్లై
చిన్నారుల పసిడి బాల్యాన్ని బడి గదుల్లోనే సమాధి చేస్తే
పసి హృదయాల్ని ఒక్కసారైనా అక్కున చేర్చు కోన్నావా ?
మిత్రమా !
నీ కవితలు ఎంత మంది ఎదల్ని తట్టి లేపుతున్నాయి ?
నీ కవితలు ఎంత మందికి ఉత్ప్రేరకాలుగా పని జేస్తున్నాయి?
బాల్య మంతా దరిద్రానికి బలి అయి పోతే
బాల్య మంతా బానిసత్వానికి బలి అయి పొతే
బాల్యం లోనే బ్రతుకు భారమయితే
నీ కవితలు వాళ్ళ జీవితాల్ని బాగు పరచాయా ?
నిన్న లేదు
నిన్న రాసిన సిరా ఇంకి పోయింది
రేపటి గురించి రాసే కవితల కోసం
కొత్త సిరా నింపుకోవాలి --
రేపటి గురించి రాసే కవితల్లో
నేడే మనం పయనిద్దాం.....
గుడిసె లోకి , బడి లోకి , గుడి లోకి
అడవి లోకి , లోయల్లోకి , జల పాతాల్లోకి
ఆకాశం లోకి , భూమి లోకి , పాతాళానికి
గనుల్లోకి, మట్టి పొరల్లోకి
సూర్యుడు లోకి, చంద్రుడు లోకి
నరకం లోకి , స్వర్గం లోకి
కలసి రాస్తాం కవిగా గాకుండా !
కవితల్ని విన్పించడం మానేసి
పోరాడుదాం జన హృ దయం తోనే !
ఒక బాల్యాన్ని ఒక్కొక్కరు దత్తత తీసుకొంటే
ఒక చిన్నారికి ఒక బంగారు బాట చూపిస్తే
ఒక నవ ప్రపంచానికి నడక నేర్పిస్తే
కవి కవి గానే మిగలడు
ఆతను ఒక అస్తమించని రవి లాగ
అహర్నిశలు శ్రమించే కవి కార్మికుడు లా
చరిత్రలో మిగిలి పోతాడు శాశ్వి తంగా !

రచన ; వారణాసి భాను మూర్తి రావు
09.12. 2014

ఒక్క కవిగా నన్ను నేను ప్రశ్నిం చు కొన్నాక కవిత ఇలా వ్రాశాను .