Saturday, May 30, 2015

మట్టి వేదం


  మట్టి వేదం
----------------------------------
మట్టి లోనే పుడతావు
మట్టి లోనే పెరుగు తావు
ఎవరినో  అమ్మా అంటావు
ఎవరినో  నాన్నా అంటావు
ఎవరో నీకు  అన్నా చెల్లి అవుతారు
ఎవరినో  పెళ్లి చేసు కొంటావు
ఆమెవరో నీకు అంతవరకూ  తెలియదు
అయినా జీవితాంతం ఆమెతో  బ్రతుకుతావు
ఎవరినో కంటావు
వాళ్ళ కోసం  నానా యాతన పడుతావు
వాళ్ళే  జీవిత సర్వస్వం అనుకొంటావు
నా అనుకోన్న  వాళ్ళు గూడా నీకు దూరం అవుతారు
నిన్ను నమ్ముకొన్న నీ  ఇల్లాలు నిన్ను వదలి శాశ్వితంగా  వెళ్లి పోతుంది
అపుడు నీది  ఒంటరి బ్రతుకు అవుతోంది
అపుడు  నువ్వు శూన్యంతో సహా జీవనం చేస్తావు
జీవన సత్యాలు  అపుడు నీకు గోచర మవుతాయి
అపుడు అనుకొంటావు  నువ్వు ...
మరణం సత్య మని ...!
మరణం నిత్య మని ...!
మట్టి కోసం నీ మనో నేత్రం  తెరచు  కొంటుంది
మట్టి  దైవత్వ మని
మట్టి పవిత్ర మని
మట్టి బంధ మని
మట్టి అనుబంధ  మని
మట్టి జీవిత మని
మట్టి  బ్రతుకు అని
మట్టి రాగ మని
మట్టి అనురాగ మని
మట్టి లో పుట్టావని
మట్టి లోనే నిర్యాణ మని !!


వారణాసి భాను మూర్తి
31.. 5. 2015

Friday, May 15, 2015

లంచావతారం అను ఒక శత సహస్రావతారం !

లంచావతారం  అను ఒక  శత సహస్రావతారం !
---------------------------------------------------------
ఇన్సులిన్ సూదులు  గుచ్చుకొంటూ
బి పి  , షుగర్    మాత్రలు   మింగుకొంటూ
ఉబ్బసాలు , శ్వాస కొస  వ్యాధులు  శక్తిని  హరిస్తుంటే
డిప్రెషన్  సైతాను   సతాయిస్తుంటే
బతుకు బండిని  లాగ లేక 
చస్తూ బతుకుతూ
బతుకుతూ  చస్తూ
నిర్జీవమైన   జీవితాన్ని గదుపుతున్న  ఓ అధికారీ !
కోట్లు కూడబెట్టావు
లంచాలు మరిగి   విల్లాలు , ప్లాట్లు , అపార్ట్మెంట్లు ,  ఫారం లాండ్లు
ఇల్లంతా  వజ్ర వైడుర్యాలు  పొదిగిన   అలంకరణలు
నీ ఆస్తుల  జాబితా  వెల కట్ట లేనిది
బంగారు కంచాల్లొ  భోంచేసిన  అదృష్ట  జాతకుడివి నువ్వు
అప్పనంగా వచ్చిన  లక్ష్మిని   నీ  ఇంట్లో  చూసి మురిసిపోయావు
ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని  , అధికారంతో , అహంకారంతో
అందల మెక్కావు !
అమాయకుల రక్తం పిండి  లంచాల్ని తిన్నావు
గాని ఓ అధికారి !
చివరకు ఏమయింది ?
బ్రెస్ట్  కాన్సర్   తో  నీ  శ్రీమతి  నలబై ఏటనే  చని  పోయింది
వయసోచ్చి న నీ  కూతురు  నీ  కారు  డ్రైవర్  తో  లేచి పోయింది
రాజ కుమారుడి లా  పెరిగిన  నీ  కొడుకు  కార్ రేస్ అని  ఔటర్ రింగ్ రోడ్డు
ఆక్సిడెంట్  లో  మరణించాడు
ఇపుడు  నువ్వు ఏకాకివి
కోట్లు ఉన్నా  కడుపు నిండా  తిన లేని వాడివి
ఈ   విశ్రాంత  దశలో  నువ్వు అవిశ్రాంతంగా  నరక యాతన  పడుతున్నావు
గాని ఒక్క సూత్రం  గుర్తు  పెట్టుకో
లంచాన్ని  రక్షించు
ఆ లంచం నిన్ను శిక్షి స్తుంది !
ధర్మాన్ని  రక్షించు
ఆ ధర్మం  నిన్ను కాపాడుతుంది !!




భాను వారణాసి
15.05. 2015




 

Monday, May 11, 2015

ఆ కిటికీ

 ఆ కిటికీ
---------------------


ఆ కిటికీ
నా  కంటికి  కునుకు   రానియ్యడం లేదు
 కిర్రు మని  శబ్దం  చేస్తున్నపుడల్లా
నా గుండె  వేగంగా  కొట్టు  కొంటోంది

ఆ కిటికీ  తెరచు  కొంటె చాలు
నాలో  నవ నాడులు  ఉద్రిక్తమయినట్లు  అన్పిస్తుంది

ఆ కిటికీ ప్రతి రోజు  కొత్తగా అన్పిస్తుంది
కొన్ని గంటల్లో  వైకుంఠ  ద్వారాలు  తెరు స్తున్నట్లుగా  అన్పిస్తుంది
ఆ కిటికీ  తలుపులు  తెరచి నప్పుడల్లా !

ఆ కిటికీ నా బ్రతుకుని  శాసించ  నట్లే ఉంటుంది
కిటికీ లోంచి ఆమె ముఖారవిందం  ఒక్కసారయినా చూడందే  నాకు
బ్రతుకు  లేనట్లు అన్పిస్తుంది

ఆమె ఒకసారి కిటికీ తలుపులు తెరచి
సుందర సుమనోహర  కళ్ళతో  పలకరిస్తే చాలు
నా హ్రదయం  అమృత మథనం  లో  క్రొంగొత్త  జీవితాన్ని అవిష్కరింప జేస్తుంది

ఆమె ఎవరో ?
ఇది ఏ  నాటి అనుబంధమో ??
ఆమె నవ్వే  నన్ను  ఆశల  చిగురులు  వేయిస్తోంది

ఒక్క  రోజు
ఆమె కిటికీ తలుపుల్ని  శాశ్వితంగా  మూసి వేసింది
ఆమె ఇంటి ముందర   నాదస్వరాలు , మామిడి తోరణాలు , వేద మంత్రాలు

నా హృదయం  ముక్క చెక్కలయి పోయింది
ప్రేమించడం గాదు
ప్రేమించబడడం  గొప్ప అదృష్టం

అలాంటి ప్రేమను పొందే వాళ్ళే   గొప్ప అదృష్ట వంతులు
కిటికీ  నిర్వికారంగా  నా వైపే చూసి  నవ్వు తోంది !!