Monday, November 28, 2022

నా " మట్టి వేదం " పుస్తకం‌ పై సమీక్ష

 నా  " మట్టి వేదం " పుస్తకం‌ పై సమీక్ష 

----------------------------------------------



మిత్రులకు ఈ సోమవారం మరో పుస్తక పరిచయం మీకోసం....💐


ఒక్కోసారి మట్టి పచ్చని జీవన గీతాన్ని....

ఒక్కోసారి అదే మట్టి కన్నీటితో తప్త గీతాన్ని పాడుతుంటుంది... 


పల్లె ఎప్పుడూ పచ్చదనాన్ని కలగంటుంది.... వాన మబ్బులు కరిగి కరిగి ఏకధాటిగా వాన పాట పాడాలని, చెరువులు, గుంటలు నీటి వాగులై పొంగిపొర్లాలని, రైతు వేసిన పంటలన్నీ ఏపుగా పెరిగి పచ్చని పట్టుచీర కట్టిన ఆడపడుచులా కంటినిండా కనిపించాలని పల్లె ఎప్పుడూ కలగంటూనే ఉంటుంది.  


రైతు వ్యథలను అక్షరాలు గా మార్చి కవితలుగా ఒంపి దానికి "మట్టి వేదం" అని అందమైన పేరు పెట్టి మన మధ్యకు తీసుకుని వచ్చిన కవి "వారణాసి భానుమూర్తి" గారు.


వీరు చిత్తూరు జిల్లా వాసి ప్రస్తుతం హైదరాబాద్ నివాసం. వీరు సాగర మథనం, సముద్ర ఘోష, మట్టి వేదం(కవితా సంపుటాలు), సంస్కార సమేత రెడ్డి నాయుడు(నవల) మొదలైన పుస్తకాలు ముద్రించారు.


ఈ "మట్టి వేదం" లో 70 కవితలు ఉన్నాయి. ఇందులో అన్నీ సామాజిక అంశాలే...ఎక్కువగా రైతు గురించి, పల్లెల గురించి రాశారు.


//తొలకరి జల్లులు కురిసే వేళ

మట్టి సుగంధాన్ని దోసిళ్ళతో ఒడిసి పడుతూ 

వ్రాసుకొంటున్న మట్టి కవిత్వం నాది//... 'మట్టి వేదం' కవితలో


మొదటి కవితలోని కవి మనకు మట్టి పరిమళాలను చూపించారు. మట్టితో తనకున్న గాఢమైన అనుబంధం ప్రతి పదంలోను మనకు స్పష్టంగా కనిపిస్తుంది.


//నాగేటి సాళ్ళు నవ్వితే నాకేంటి?

ముత్యాల విత్తనాలు జారితే నాకేంటి?

తల్లి వానమ్మ కనికరం సూపిత్తే

పండదా బంగారం నా నట్టింటి లోన!//...'నాగేటి సాళ్ళు' కవితలో


వాన కోసం రైతు ఎంత ఆశగా ఎదురు చూస్తాడో తెలియజేసే కవిత ఇది....


//ఎల్లలు లేని మా పల్లె ప్రపంచాన్ని చూడాలని ఉంది

ఆకాశం సాక్షిగా ఎగిరే పక్షులతో తీరాలకు చేరాలని ఉంది

అలల సాక్షిగా చలాకీ చేపలతో ఏట్లో ఈదాలని ఉంది//...'నా పల్లె ప్రపంచం' కవితలో...

కవికి పల్లెతో ఉన్న బాంధవ్యం గురించి, మళ్ళీ మళ్ళీ ఆ చోటుకి వెళ్ళి చూడాలనే తపన గురించి ఆర్తి గా చెబుతారు.

పల్లె నా అంతరంగం, పల్లె నా అంతరాత్మ అంటూ కొనసాగిన ఈ కవిత చదువుతుంటే మనక్కూడా మన సొంత ఊరు చూడాలని ఆశ కలుగుతుంది.


//మనిషితో మనిషి మాట్లాడని వాడు

అసలు మనిషెట్టా అవుతాడు// 'పుష్పించని మనిషి' కవితలో....

కొందరు ఎవరితోనూ పలుకక ఏకాకిగా ఉండాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళకు ఈ కవిత బాగా వర్తిస్తుంది. అలాంటి వాళ్ళను బ్రహ్మ జెముడు చెట్లతోనూ, తుమ్మ చెట్లతోనూ పోలుస్తూ...సమాజంలో జీవించే ఎవరైనా తోటి వారితో స్నేహపూర్వకంగా ఉండాలని హాయిగా నవ్వుతూ మాట్లాడాలని అంటారు. 


ఇలా ప్రతి ఒక్క కవిత ఒక్కో జ్ఞాపకంలా కవి రాసుకున్నట్లు అనిపించడమే కాకుండా మన జ్ఞాపకాలను కూడా తడిమేలా చేస్తుంది ఈ "మట్టి వేదం" కవితా సంపుటి.


చక్కటి పుస్తకాన్ని పాఠకులకు అందజేసిన "వారణాసి భానుమూర్తి" గారికి హృదయ పూర్వక అభినందనలు.


ఈ పుస్తకంకు మన అందరికీ సుపరిచితులైన "శ్రీ కెరె జగదీష్" గారి ముందు మాటలు మరింత వన్నె తెచ్చాయి.


ఈ "మట్టి వేదం" పుస్తకం కావలసిన వారు 9989073105 నెంబర్ కు సంప్రదించ గలరు.


పుస్తక పరిచయం

శాంతి కృష్ణ ✍️

28.11.22

Friday, November 25, 2022

మనుషుల్లో ఋషులు




మనుషుల్లో ఋషులు

" రఘు కథలు వ్రాస్తాడంట. ఇటీవల వాడి కథకు ఏదో వార పత్రిక పోటీల్లో  మొదటి బహుమతి  వచ్చిందట. "

నిజంగా నేను ఆశ్చ్యర్య పొయ్యాను.
వాడేంటి? వాడు కథలు వ్రాయడం ఏమిటి?  నాకు ఈ మిస్టరీ అంతు బట్టడం లేదు. రఘుకి నాకు ఎన్నో ఏళ్ళ నుండి పరిచయం వుంది. ఇద్దరమూ ఒకే ఆఫీసులో పని చెయ్యడం గాకుండా , ఒకే చోట పుట్టి పెరిగి చదువు కొన్న వాళ్ళం. తెలుగు పద్యం గూడా స్పష్టంగా చదవ లేని వెధవ , వాడు తెలుగులో కథలు వ్రాయడం ఏమిటి?

వాడికింత భాషా పరిజ్ణానం వుందా? నా మటుకు నాకు వాడికంత తెలివి లేదనే నా అభిప్రాయం.
కథలు వ్రాయడ మంటే మాటలా? కథలో శిల్పం , వస్తువు గావాలి. కథనం వుండాలి. సమ కాలీన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని , ఆ సమస్యలను అందులో వుంచి , ఒక పరిష్కార మార్గాన్ని సూచించే విధంగా రచయిత మార్గ దర్శకంగా సమాజానికి దారి చూపాలి. అలాంటి కథా నైపుణ్యం వాడికుందంటే నాకు నమ్మ బుద్ధి కాలేదు.
అయినా ఇంత టాలెంట్  పెట్టుకొని‌ , నాకు ఒక్క సారైనా ఎందుకు చెప్ప లేదు?

వాడి కథ ఒక ప్రముఖ వార పత్రికలో పడి , మొదటి బహుమతి గెలుచు కొందంటే నాలో ఎక్కడో కొంచెం ఈర్ష్య జనించింది.ఎందుకంటే నాకు తెలుగులో మార్కులు వాడి కంటే నాకే ఎక్కువ వచ్చేవి. నాకు వందకు తొంబై వస్తే , వాడికి నలభై , యాభై మార్కులు వచ్చేవి.

జర జర మని లుంగీ వూడ దీసి , పాంటు తగిలించుకొని రఘు వాళ్ళింటికి బయలు దేరాను.  రఘు వాళ్ళ ఇంటికి వెడుతున్నానని శ్రీమతి తో చెప్పి తలుపు గడియ పెట్టుకొమ్మని చెప్పాను.

నాకు మదిలో ఆరాటం ఎక్కువయింది.వాడ్ని అడిగి వాస్తవాలను కనుక్కోవాలి. కనీసం ఫోన్ అయినా చేసి చెప్పొచ్చు గదా? వాడి ఆనందం నాతో ఎందుకు పంచు కోవాలని అనుకోవడం లేదు. ఈ చిన నాటి స్నేహితుడ్ని మరచి పొయ్యాడేమో కాబోలు.

నేను సనత్ నగర్ లో వుంటాను. వాడు ఎర్ర మంజిల్ కాలనీ లో ఉంటాడు. డబుల్ డెక్కర్ బస్సు ఎక్కి కూర్చొన్నా! దానికన్నా ఎద్దుల బండి నయమనిపిస్తోంది. దాదాపు నలభై నిముషాలు పైగా పట్టింది.  బస్సంతా జనంతో కిట కిట లాడి పోతోంది.

" ఎర్రమంజిల్ కాలనీ " అని కండక్టర్ గట్టిగా అరచాడు. పై బస్ నుండి మెట్లు దిగి ఒక్క సారిగా బస్సు నుండి కిందకు దిగాను. కండక్టర్ బెల్లు ఠంగ్ ఠంగ్ మని రెండు సార్లు లాగాడు. డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం అంటే అదొక్క సరదా!

రోడ్డు క్రాసు చేసి ఎర్రమంజిల్ కాలనీ లోని ప్రభుత్వ క్వార్టర్స్ లో నెంబరు పట్టుకొని ఎక్కడో ఓ మూల ఉన్న వాడి ఇల్లు చేరినాను. ఇల్లు బాగుంది. విశాలంగా ఉంది.ఎప్పుడో కట్టిన  ఇళ్ళు , ప్రభుత్వ వుద్యోగులకు కేటాయిస్తారు.

" ఠక్..ఠక్.."తలుపు తట్టాను.
ఎదురుగా వాడి శ్రీమతి జానకి  తలుపు తెరచింది.

ఆమె ముఖంలో చెమట , ఆ అలసట చూస్తూనే తెలుస్తోంది , వంటి గది నుండి వస్తోందని.

" రండి అన్నయ్యా! " లోపలికి పిలిచి సోఫా చూపించి ఫాన్ , టూబ్ లైట్ వేసింది.

" వీడెక్కడమ్మా? " అడిగాను నేను.

" ఉదయం తొమ్మిది గంటకకల్లా వెళ్ళారు. భుజాన ఒక సంచీ , కొన్ని తెల్ల కాగితాలు తగిలించుకొని వెళ్ళారు. ఆది వారం వస్తే ఇదే సంత. ఎక్కడి కెడతారో చెప్పరు ." అంది రఘు శ్రీమతి.

" ఆది వారం అలా నిన్ను తీసుకొని  పార్కులు , షికార్లు , సినిమాలకు వెళ్ళకుండా ఎక్కడికి చెప్పా పెట్టకుండా  వెడుతున్నాడు వీడు? " అన్నాను నేను ఒకింత అసహనంగా.

" వుండండి అన్నయ్యా! కాఫీ తీసు కొస్తాను." అని చెప్పి వంట గది లోకి వెళ్ళింది జానకి.

వాడి టేబుల్ మీద కొన్ని తెల్ల కాగితాలు రెప రెప లాడు తున్నాయి. టేబుల్ సొరుగు తీసి చూశాను. కట్టలు కట్టల పేపర్లలో  ఏదో వ్రాసి వున్నవి కనబడ్డాయి. అన్ని కథలు , కవితలు వ్రాసినట్లున్నాడు వాడు.

" వాడు కథలు , కవితలు వ్రాస్తాడా అమ్మా! " అని అడిగాను జానకిని. కాఫీ కప్పుతో , మంచినీటి గ్లాసుతో లోపలి కొచ్చింది తను.

" ఏమో ! అన్నాయ్యా! నాకయితే ఏమీ చెప్పరు. ఏమీ చూపించరు. "
అంది జానకి.
" ఇటీవల వాడి కథకు మొదటి బహుమతి వచ్చిందంట. చెప్పాడా అమ్మా నీకు? "

" నాకసలు ఏమీ తెలీదన్నాయ్యా"
కాఫీ తాగేసి బయట పడ్డాను నేను.
************************************
కవులను, రచయితలను నేను మరీ దగ్గరగా ఎప్పుడూచూడ లేదు. వారి జీవన వ్యవహార శైలి ఎలా వుంటుందో నాకు తెలీదు. వారూ మన లాగే ఉంటారా? కానీ ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటారని విన్నాను. వాళ్ళకు గూడా కొన్ని మానసిక బల హీనతలు ఉంటాయని విన్నాను.  మరి ఈ రఘు గాడికి ఉన్నట్లుండి ఈ జబ్బు ఎలా పట్టుకొందో అర్థం కావడం లేదు. సంతోషంగా  ఇంటి పట్టున వుండకుండా ఎక్కడ తిరుగు తున్నాడో ఏమో?

"వాడి కోసం ఎక్కడని వెతకను? ఈ హైదరాబాదు మహా నగరం లో ఏ మూలని వెతకను ? " అనుకొంటూ ఇందిరా పార్కు వైపు వడివడిగా అడుగు లేశాను. బాగా దూరం అనిపించి ఒక ఆటో ఎక్కేశాను.‌

ఇందిరా పార్కు లోయర్ టాంక్ బండ్ లో ఉంటుంది. బహుశా వీడు ఈ పార్కులో ఏ మూలో కూర్చొని కథలు వ్రాస్తుంటాడు. " కుక్క పిల్లా, సబ్బు బిళ్ళా, అగ్గి పుల్లా ...కాదేదీ కవితక నర్హం‌" అన్నాడు శ్రీ శ్రీ.‌ "  కవిత్వమొక తీరని దాహం ! " అన్నారు శ్రీ శ్రీ ,  కానీ నేను కవిత్వం ఒక వ్యసనం  అని అంటాను. కవులు అందుకే ఇంటినీ , వంటినీ పట్టించు కోకుండా వ్రాసుకొంటూ ఉంటారు. పాపం రచయితల , కవుల అర్థాంగులు నిజంగా త్యాగ మయులు.‌ వారికి మనం  నిజంగా జోహార్లు అర్పించాలి.

ఇందిరా పార్కు చేరుకొన్నాక రఘు కోసం  జల్లెడ పెట్టి వెతికాను. రఘు ఎక్కడయినా వున్నాడేమో అని.
కొమ్మ సందుల్లో , చెట్టు తొర్రల్లో ,  గుబురు పొదల్లో జంటల ప్రేమ కలాపాలు , శృంగార విన్యాసాలు చూడ లేక కళ్ళు మూసుకొన్నాను. డేటింగ్ పేరుతో ఈ ప్రేమికులు ఒకరి మీద ఒకరు పడుకొని  ఆలింగనాలు , చుంబనాలు పెట్టుకొనే రసిక శిఖామణులు ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. చదువు కోవలసిన వయసులో ఈ కుర్రకారు ఇలా ప్రేమ దోమ అంటూ తమ విలువైన కాలాన్ని దుర్వినియోగ పరచు కొంటున్నారు.‌

అరగంట సేపు ఆ పార్కులో అలా ఇలా తిరిగి బయట కొచ్చేశాను. బస్సు కోసం నిరీక్షిస్తున్నాను. అక్కడ దూరంగా రఘు లాగే ఉన్నాడు.‌ ఒక బిక్షగాడికి ఎదురుగా కూర్చొని బాతాఖానీ చేస్తూ తను తెచ్చుకొన్న తెల్ల కాగితాల మీద ఏవో పిచ్చి గీతల్ని  బరికేస్తున్నాడు.

పరుగు పరుగున వెళ్ళి ,  " ఒరేయ్  ! రఘూ ! ఏమి చేస్తున్నావురా ఇక్కడ? " అన్నాను నేను ఒకింత ఆశ్చర్యకరంగా.

వాడు వ్రాస్తున్న తెల్ల కాగితాల్ని సంచీ లోకి దోపాడు.

" నువ్వు ఇక్కడకు ఎలా వచ్చావు? నేనిక్కడున్నానని నీ కెవరు చెప్పార్రా రామ్నూర్తీ ? " అని వాడు నొసలు చిట్లిస్తూ నా కేసి చూశాడు‌. బహుశా  నేను అక్కడకి రావడం వాడికి ఇష్టం లేదనుకొంటా!

" నేను వ్రాయ బోయే కథలకు ప్లాటు అంటే మూలం తయారు చేసుకొంటున్నా! అన్నట్టు మొన్న నా కథకు ప్రధమ బహుమతి వచ్చింది తెలుసా? అదీ పేరున్న వార పత్రికలో.  ఆ కథ చదివిన వేలాది పాఠకులు నా అభిమానులు అయి పొయ్యారు. " అని నా కళ్ళల్లోకి చూస్తూ ఆనందంగా అన్నాడు.‌

" చూడరా? ఎన్ని ఉత్తరాలో! నా అభిమానులు నాకు వ్రాసినవి .' అని పాంట్ జోబీలో నుండి ఒక యాభై కార్డుల కట్టను చూపించాడు.

" నీ కథకు మొదటి బహుమతి వచ్చిందని నాకు చెప్పనే లేదు "

" సారీరా రామ్మూర్తీ ! నేను ఎవరికీ చెప్పలేదు "
అన్నాడు వాడు.

" సారీ ! చలపతి గారూ ! మీ కథ చెప్పండి . ఇతను రామ్మూర్తి అనీ , నా ఆఫీసులో సహోద్యోగి " అని నన్ను ఆ భిక్షగాడికి పరిచయం చేశాడు.

" ఇతను చలపతి గారని. ఒకప్పుడు బాగా చచ్చి బ్రతికిన వాడు. సారీ..బ్రతికి చెడిన వాడు. ఇంట్లో పెళ్ళాం‌, బిడ్డల పోరు బడలేక సన్యాసం తీసుకొని , ఇలా యాచక వృత్తి లోకి దిగిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆఫ్ ఏ కాలేజి.  అందరూ ఉన్నా నా అనే వారు లేక , ఇలా వసుధైక కుటుంబంలో చేరి యాచక వృత్తిని కొన సాగిస్తున్నాడు ." అని అతని వంక చూస్తూ చలపతిని పరిచయం చేశాడు నన్ను.

చలపతి గారు ఏక ధాటిగా ఆంగ్లంలో తన గురించి చెబుతున్నాడు.‌ఆయన ఇంగ్లీషులో ఉన్న నైపుణ్యానికి అతని కాళ్ళు మొక్కాల్సిందే! మరి ఏ పరిస్థితుల ప్రభావం వల్ల అతను యాచకుడిగా మారాడో అర్థం కాలేదు.

" మిమ్నల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది " అని నేను చలపతి గారికి నమస్కరిస్తూ ఇంగ్లీషులో అన్నాను.

అతడు నవ్వి వూరుకొన్నాడు.

" చలపతి గారూ! సెలవిప్పించండి. రేపు ఆదివారం‌ మిమ్మల్ని ఎనిమిది గంటలకు కలుస్తాను. మీ జీవిత చరిత్ర మొత్తం చెప్పాలి. ఈ సారి మీ లాంటి బాధా తప్త సర్ప దష్టుల గురించి ఒక మెగా ధారావాహికను వ్రాయాలను కొంటున్నాను. వంద మంది మీ లాంటి అభాగ్యుల చరిత్రను వ్రాసి సాహితీ జగత్తులో ఒక ప్రకంపనను సృష్టిస్తాను.‌" అన్నాడు రఘు.

" తధాస్థు . మీ కోరిక నెర వేరుతుంది ." అన్నాడు చలపతి గారు రెండు చేతులెత్తి దీవిస్తూ.

జోబీ లోంచి యాభై రూపాయలు తీసి " ఇది వుంచండి. రేపు ఆది వారం మిమ్మల్ని పబ్లిక్ గార్డన్స్  లో కలుస్తాను " అని బయలు దేరాడు రఘు.

" నీకిదేం పొయ్యే కాలం రా! ఏమిటిదంతా? " అసహనంగా అడిగాను.

" రచయితలు , కవులు ఈ సమాజాన్ని చైతన్య పరచాలి. వారు దాని కోసం తమ కాలాన్ని కొంచెం త్యాగం చెయ్యాలి. ఫాంటసీ కథలు , ప్రేమ  కథల చౌకబారు సాహిత్యం వల్ల సమాజానికి ఒరిగిందేమీ లేదు.  ఈ సమాజం లో అగర్భ దరిద్రంతో మగ్గుతూ , కోట్లాది మంది బాధా తప్త సర్ప దష్టులు , అభాగ్యులు ఉన్నారు. నా చిన్నతనంలోనూ  ఇలాంటి అభాగ్యులు ఉండే వారు. తిండికి లేక పొలాల్లో ఎలకల్ని పట్టి తినేవారు. ఆకులు ,అలములు , దుంపలు తినే వారు. తాగే దానికి శుభ్రమైన మంచి నీరు , వుండడానికి గూడు , కడుపుకు పట్టెడన్నం , శరీరానికి గుడ్డ లేని అగర్బ దరిద్రులు ఆనాడూ ఉన్నారు. ఈ నాడూ దరిద్రంతో బాధ పడే వారున్నారు. ఎక్కడుందీ లోపం? ఎక్కడికి పోయిందీ మన సామ్య వాదం? పంది కొక్కుల్లాగా బలిసిన రాజకీయ రాబందులు , లంచాలకు మరిగిన అవినీతి జలగలు , వడ్డీ పిశాచులు , అవినీతి గుత్తేదారులు ఈ సమాజాన్ని విచ్చన్నం చేసేశారు.‌ ఈ దేశాన్ని సర్వ నాశనం చేశారు. వున్నవాడు కోట్లకు పడగ లెత్తు తున్నాడు. లేని వాడు అగర్భ దరిద్రంలో  మ్రగ్గి పోతున్నారు." 

ఆవేశంతో వూగి పోతున్నాడు రఘు.‌ అంత అవేశాన్ని నేను ఎప్పుడూ చూడలేదు.

" పతితులార!
భ్రష్టులార
బాధాసర్ప దష్టులార!
బ్రతుకు కాలి,
పనికిమాలి,
శని దేవత రధచక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార!
హీనులార!
కూడు లేని, గూడు లేని
పక్షులార!భిక్షులార!
సఖులవలన పరిచ్యుతులు,
జనులవలన తిరస్క్రుతులు,
సంఘానికి బహిష్క్రుతులు"

రఘు నోటి నుండి శ్రీ శ్రీ వ్రాసిన జగన్నాధ చక్రాల కవిత అలవోకగా వినిపిస్తోంది. ఇలాంటి కవితల్ని విన్నప్పుడు రక్తం మరుగుతుంది. ఏదో చెయ్యాలనే పిచ్చి ఆవేశం వస్తుంది. కానీ ఎవరికి వారు వారి బ్రతుకు చట్రంలో ఇరుక్కు పొయ్యారు. ఎవరూ ఈ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచించడం లేదు.

" ఏమంటాను సంఘ సంస్కర్తా? ముష్టి వాళ్ళ మీద కథలు చదివే పాఠకులు ఉంటారను కొన్నావా? ఇప్పుడు యువతకు కావలసింది హగ్గులు , కిస్సులు , విచ్చలి విడి శృంగార కథలు , మర్డర్లు , హార్రర్ , సస్పెన్స్ త్రిల్లర్ . ఇలాంటి సాహిత్యాన్ని చదవడం ఎప్పుడో మానేశారు. అసలు పుస్తకాలు కొని ఎవరైనా చదువుతున్నారా? అంతా ఆన్ లైన్ పత్రికలు.‌పైన రెండు లైన్లు , ముగింపు రెండు లైన్లు చదివడానికి గూడా టైం లేదు. ఒకప్పుడు వార  , మాస పత్రికలు , నవలలు ఎంతో మంది కొని చదివే వారు. ఇప్పుడు టీ వీ , యూ టూబ్ లు వచ్చాక పుస్తక పఠనం మానేశారు‌. కుర్ర కారు క్రికెట్ మాచ్ గంటల తరబడి చూస్తారు గానీ ఒక మంచి పుస్తకాన్ని అర గంట చదవ మనండి. రఘూ ! ఆనాడు మహా కవులు రాయ ప్రోలు , గురు జాడ , చిలక మర్తి , శ్రీ శ్రీ , తిలక్ , చలం లాంటి మహా కవుకు తమ రచనలతో సమాజాన్ని కొంత వరకూ మార్చ గలిగారు. కానీ ఈ నాడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది. కవులు , రచయితలు ఇంత కష్ట పడి వ్రాసి , అచ్చయించి , పుస్తకాన్ని అవిష్కరణ చేయించి , బోలెడు డబ్బులు ఖర్చు పెడితే , కనీసం ఎంతమంది ఆ  పుస్తకాన్ని డబ్బు పెట్టి కొంటున్నారు. అవిష్కరణ రోజు ఫ్రీ గా పుస్తకాలు దొరుకుతాయని అడుక్కు తినే వాళ్ళు బోలెడు మందిని నేను చూశాను. ఇక రచయితల , కవుల ఆర్థిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది . " అన్నాను నేను 

" అంటే నా నవల ఎవరూ చదవ రంటావా? " బేలగా అడిగాడు రఘు.

" వ్రాయడం నీ కర్తవ్యం. దాని ఫలితాలు దేవుడికి వదిలెయ్యి  " అన్నాను నేను.

రఘు నేనూ ఒక ఆటో ఎక్కి వాడిని ఎర్ర మంజిల్ కాలనీ లో దించి , నేను సనత్ నగర్ వైపు అదే ఆటోలో వెళ్ళాను.

మనసంతా ఏదో భారంగా , దిగులుగా ఉంది నాకు.
************************************
మొదటి రెండు వారాలు ఆఫీసుకు వచ్చిన రఘు ఆ తరువాత ఆఫీసుకు రావడం మానేశాడు.‌వాకబు చేస్తే ఏ లీవు అప్లయి చెయ్యలేదని తెలిసింది. వీడు చేజేతులా భవిష్యత్తును నాశనం చేసు కొంటున్నాడు. ఈ కవిత్వ పిచ్చి లో పడి వుద్యోగాన్ని వదులు కొంటున్నాడు వెధవ. వీడికి కొంచెం బుద్ధి చెప్పాలి అని అనుకొన్నాను.

ఒక రోజు ఆఫీసు వదలిన తరువాత స్కూటర్ వేసుకొని రఘు వాళ్ళింటికి వెళ్ళాను.

ఇల్లు తాళం వేసింది. ప్రక్కింటి వారిని అడిగాను.

" ఏమో తెలియదండీ ! రెండు వారాలుగా భార్యా భర్తలు ఇద్దరూ అసలు కనబడడం లేదు " అంది ఆ ఇంటావిడ.

దారిలో వెడుతున్న వారి పనమ్మాయిని అడిగాను‌.

" అయ్యగారు , అమ్మగారు నెల రోజులుగా మాట్లాడు కోవడం లేదండీ. అయ్యగారు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ సన్యాసి లాగా గడ్డం పెంచుకొని ఎప్పుడూ ఏదో వ్రాసుకొనే వారు. ఇంటి విషయాలు అసలు పట్టించు కోవడం మానేశారు . అమ్మగారే అన్నీ చూసుకొనే వారు.ఒక రోజు అమ్మ గారు నన్ను పిలిచి రేపటి నుండి పనికి రావద్దన్నారు. పుట్టింటికి వెళ్ళి పోతున్నానని చెప్పారు. అయ్య గారు గూడా ఈ ఇంటికి రావడం మానుకొన్నారు. ఎక్కడున్నాడో ఏమో ! " అని అన్నది ఆ పనమ్మాయి చాలా బాధ పడుతూ.‌

అనుకొన్నంత పనీ అయింది. ఏది జరగ గూడ దను కొన్నానో , అదే జరుగుతోంది.నా మనస్సు ఎందుకో కీడు శంకించింది .

ఆ పది రోజులో రఘు గాడి కోసం వెతకని చోటు లేదు. తిరగని ప్రదేశం లేదు . వాడి జాడే లేదు.
**************************************
ఐదు సంవత్సరాల తరువాత

చిత్రభాను నామ సంవత్సర ఉగాది పర్వ దిన శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో పురస్కారాలను అంద చేస్తోందని ప్రకటించారు.

ప్రభుత్వం నిర్వహిస్తున్న సాహిత్య అవార్డు ఉత్సవాలకు నాకు గూడా ఆహ్వానం అందింది.  నేను గూడా శ్రీమతి తో హాజరయ్యాను.

రవీంద్ర భారతి లో ఇసుక వేస్తే రాలనంత మంది జనంతో నిండి పోయింది. చాలా మందికి పాసులున్నా బయటే నిలుచుండి పొయ్యారు. 

ఎక్కడ చూసినా అవార్డు గ్రహీతల ఫ్లెక్సీలు రంగు రంగుల విద్యుత్ దీపాల మధ్య ప్రకాశిస్తున్నాయి. సాహిత్య రంగం , కళా రంగం , సేవా రంగం లో ప్రముఖులు , నిష్ణాతులు అయిన వారిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరిస్తోంది.‌

నగరం లోనే గాకుండా రాష్ట్రం నుండి గూడా ఎంతో మంది  లబ్ధ ప్రతిష్ఠులైన సాహితీ వేత్తలు , పండితులు , కళాకారులూ , సంగీత విద్వాంసులూ , రాజకీయ నాయకులు హాజరయ్యారు. చూడ్దానికి రెండు కళ్ళూ చాలడం లేదు. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే!  అధికారులు , అనధికారులతో రవీంద్ర భారతి కిట కిట లాడి పోతోంది.

వేదిక మీద చిన్నారుల కూచి పూడి , భరత నాట్య నృత్యాలతో అహ్లాదకరమైన వాతావరణం వుందక్కడ.

సభ ప్రారంభ మయింది.

ముఖ్య మంత్రి గారితో సహా తమ మంత్రివర్గంలో ముఖ్యులయిన వారు , అధికారులు వేదిక మీద ఆసీను లయ్యారు.

జ్యోతి ప్రజ్వలన తరువాత ఆహుతులందరినీ ఆహ్వానిస్తూ ప్రారంభోపన్యాసం చేస్తున్నాడు ఒక అధికారి.

పుష్ప గుచ్చాల అనంతరం ప్రభుత్వం నిర్వహించిన ఈ వుత్సవాలను గురించి వుపన్యాసం ఇస్తున్నారు.‌ అధ్యక్షుల వారి స్థానంలో ఉన్న ముఖ్య మంత్రి గారు ఉపన్యాసం చేస్తున్నారు. తమ ప్రభుత్వం కళల పట్ల , కళాకారుల పట్ల తమ అంకిత భావాన్ని వివరిస్తున్నారు.‌ తమ తమ వృత్తుల్లో రాణించిన ఉత్తమ కళాకారుల్ని , ఉత్తమ పండితుల్ని , ఉత్తమ సాహితీ వేత్తల్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానించారు ముఖ్య మంత్రి గారు. అందరి ముఖాల్లో ఏదో ఆనందం , సంతృప్తి ద్యోతక మవుతోంది.

అంతలో మైకులో ఇలా వినబడింది.
" సరస్వతీ పుత్రులు ,  ప్రముఖ నవలా కారుడు , ఉత్తమ విలువలు కలిగిన సాహితీ వేత్త, స్వయం కృషితో తన సత్తా ఏమిటో చూపించి , అఖిల ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకాన్ని ఉర్రూత లూగించి , కత్తి కంటే కలం గొప్పదని , అక్షర యజ్నం చేసిన అభినవ సోమ యాజులు , అభినవ వాల్మీకి , అక్షర బ్రహ్మ , జ్ణాన  పీఠ్ అవార్డు గ్రహీత శ్రీ శ్రీ సనగరం రఘునాధ రావు గారిని వేదిక మీదకు రావలసినదిగా ఆహ్వానిస్తున్నాము. ఉత్తమ రచయితగా అయన వ్రాసిన " జీవన గతులు " అనే నవలకు ఈ ఏడాది రాష్ట ప్రభుత్వ ఉత్తమ సాహితీ పురస్కారం జరగ బోతుంది. ఈ నవలకు ఈ సంవత్సరమే జ్ణాన పీఠ్ అవార్డు మన తెలుగు వాడికి లభించినందుకు రాష్ట ప్రభుత్వం తరపున సనగరం గారిని ఘనంగా సన్మానిస్తున్నాము "

అంటూనే సాదా సీదాగా గడ్డం పెంచుకొని , మామూలు ఖద్దరు బట్టలు వేసుకొని , తైల సంస్కారం గూడా సరిగా లేని జుత్తుతో వేదిక మీదకు చేరుకొన్నారు సనగరం రఘు నాధ రావు.
ఆయన వేదిక మీదకు రాగానే , వేదిక మీద పెద్ద లందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో రఘు నాధ రావును ఆహ్వానించారు. మంగళ వాయుద్యాల నడుమ అతడ్ని  ప్రత్యేక ఆసనంలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు సత్కరించారు. అలాగే పది లక్షల చెక్కు ,ఒక నివాస స్థలాన్ని బహూకరించారు.

మైకులో రఘు గురించి చెబుతుంటే నా కళ్ళను నేనే నమ్మ లేకున్నాను. నా స్నేహితుడు రఘు గాడేనా వీడు...ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఎలా సంపాయించాడు? వీడు వ్రాసిన నవల " జీవన గతులు " కి జ్ణాన పీఠ్ అవార్డు ఎలా వచ్చింది? అసలు ఆంధ్ర ప్రజానీకాన్ని అంతగా ఉర్రూత లూగించిన ఆ నవలలో ఏముంది? అనేక ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ముఖ్యమంత్రి గారు రఘును ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మన రాష్ట్రంలో ఈ పావర్టీ ని పార ద్రోలుతాను.‌ ఒక్క సామాన్యుడు గూడా ఆకలితో అలమటించడానికి వీల్లేదు. అందరికీ సమ న్యాయం చేస్తాను.‌ కూడు , గుడ్డ , గూడు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తాను. మీ నవల మాబ వత్వాన్ని తట్టి లేపుతుంది‌ ప్రజల్ని చైతన్య వంతుల్ని చేస్తుంది. సమాజాన్ని మార్చే ఇలాంటి నవలలు ఇంకా మీరు వ్రాయాలి. అలాగే రచయితలు పరిష్కార మార్గాన్ని చూపించే
విధంగా రచనలు చెయ్యాలి" అంటూ తన వుపన్యాసాన్ని ముగించారు ముఖ్య మంత్రి గారు.
"  నా శ్రీమతి చెవిలో మన రఘునే ఇతడు. పోయి కలుద్దాం రా ! " అని వేదిక మీదకు వెళ్ళడానికి ప్రయత్నించాను.

వేదిక మీదున్న పోలీసు అధికారులు నన్ను మెడ బట్టి బయటకు గెంటేశారు.

" నా చిన్న నాటి స్నేహితుడండీ ! మా రఘును కలవాలండీ  ! " అని నేను గట్టిగా అరుస్తున్నా! కానీ నా అరుపులు ఎవరికీ వినబడ లేదు.

వేదిక మీద రఘు మాట్లాడుతున్నాడు.‌ ఈ నవల పది భారతీయ భాషల్లో అనువదింప బడుతోంది‌ . అలాగే ఫారిన్ కంట్రీస్ వారు అనువాద హక్కుల్ని అడుగుతున్నారు. ఈ పుస్తకాల మీద వచ్చే కోట్లాది రూపాయల్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నాను . గౌరవ నీయులైన ముఖ్య మంత్రి గారు మన అభాగ్య అనాధ బాధా సర్ప దష్టులకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. దేశంలో దరిద్రాన్ని పార ద్రొయ్యాలి. అందరికీ సుఖ జీవనాన్ని ప్రసాదించాలి! " అని రఘు ప్రసంగాన్ని ముగించాడు.

రఘుని ఎలాగైనా కలవాలని ప్రయత్నించినా , వాడికి పెద్ద ప్రోటోకాల్ వున్నట్లుంది.  నలుగైదుగురు పోలీసు ఆఫీసర్లు రఘు కు తోడుగా అంబాసిడర్ కార్లో ఎక్కించారు. గేట్ బయట నిలబడి "  ఒరేయ్ రఘూ...నేను రామ్మూర్తిరా ! కార్ ఆపురా! నీతో మాట్లాడాలి " అని నేను గట్టిగా అరచాను.

నా అరపులు పట్టించు కోకుండా కారు రయ్యిమని గేట్ బయటకు వెళ్ళి పోయింది.
అచేతనంగా చేష్ట లుడిగి చూస్తూ వుండి పొయ్యాను.

రచయితలు , కవులు , కళాకారులు , శాస్త్రజ్ణులు పిచ్చి వాళ్ళ లాగానే కనిపిస్తారు నా లాంటి సామాన్యులకు. కానీ వారంతా పిచ్చివారిలా కనబడుతున్న  మహా మేధావులు. వీళ్ళే నేమో " ' మనుషుల్లో ఋషులు '  అని అనిపించింది నా కప్పుడు.

************************************
24.11.2022 తేదీ సంచికలో గోతెలుగు.కామ్ లో ప్రచురించ బడినది.

https://www.gotelugu.com/telugustories/view/10851/manushullo-rushulu


Tuesday, November 22, 2022

పెద్ద కొడుకు పుస్తకం అవిష్కరణ

వారణాసి భానుమూర్తి  రావు గారు వ్రాసిన  కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే.  కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని  అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. కాపీలు కావలసిన వారు 

vbmrao21@gmail.com 

ఈ మైల్ కు  మీ అడ్రస్ కి పంప గలరు.


వారణాసి భానుమూర్తి రావు

హైదరాబాదు




Sunday, November 13, 2022

మా తిరపతి‌ పయానం‌ ( రాచ పల్లి కథలు - 6)

 

 మా  తిరపతి  పయానం  ( రాచ పల్లి కథలు - 6)

మా నాయనకు తిరపతి బోవల్లని బలే ఆశగా ఉండేది. పుట్టినెంట్రుకులు పుట్టిన బిడ్డలకు తీసుకొనే పొయ్యేదానికి తిరపతికి పోయి గుండు కొట్టించే అలవాటు మా ఇంట్లో వుండేది.‌ పుట్టినెంట్రుకలు తీయించే దానికి కొందరు గుర్రం కొండ కాడుండే  రెడ్డమ్మ కొండకు , కొందరు చౌడేపల్లి కాడుండే చౌడమ్మ గుడికి పోతారు. మా నాయన అప్పో సప్పో చేసి తిరపతికి పోతా వుండె. తిరపతికి పోవల్లంటే కర్చు చ్యానా అవుతుంది. మా కుటుంబం పోవల్లంటే నూరు రూపాయలయినా గావల్ల. అంత దుడ్డు మా కాడ ఉండేది గాదు.

మా నాయన నాకు  ఆరేడేళ్ళు వచ్చినా పుట్టినెంటుకలు తీయించలా నాకు . 

"  పాపం‌  మగ పిల్లోడు... యాందీ దరిద్రము? ఆడ పిల్ల మాదిరి జుట్టు పెంచుకొని జడ ఏస్తావుంటే నాకు ఏడుపు వస్తా వుండాది.  నాకు కోపమొస్తే మంగలోళ్ళ రామన్న పిలిపించి ఇంట్లోనే గుండు కొట్టిస్తా!  " అని గట్టిగా మా నాయన్ను తిడ్తా వుండేది మా యమ్మ.

మా నాయన నన్ను తీసుకొని ముద్దు చేసే వాడు.  " సూడు నా కొడుకు ! ఎంత అందంగా ఉండాడో ! జుట్టు పెద్దదయినా గిరజాలు వేసుకొని, రిబ్బన్లు ఏసుకొని ,  చిన్ని కిట్టయ్య మాదిరి వుండాడు.  " అని నన్ను దగ్గరకు తీసుకొని ముద్దులు కురిపించే వాడు మా నాయన.

" నాయనా! నాకు మగ పిల్లోళ్ళ మాదిరి క్రాపు  చేయించు. నన్ను చూసి నా స్నేహితులంతా గేలి చేస్తా వుండారు. ఆడోడా ...అడోడా  అని పిలుస్తా నవ్వతా వుండారు. నాకు బిరీన గుండు కొట్టిస్తావా ? లేదా?  "  అని నేను చానా కోపంగా అడిగినా.

" తిరపతికి  పోదాము నాయనా ! ఈ సారి కూరగాయలు ఏసినాము  గదా  మన మడ్లో!  వారం వారం అమ్మతా వుణ్డాము గదా మాలు సంతలో..కలకడ సంతలో గూడా అమ్మతా వుండాము.‌ఈ సారి మన ఆవులు ఈని నాయి గదా? పాలు గూడా బాగా యిస్తా వుండాయి.  కవ్వం పెట్టి అమ్మ సిలికితే మస్తుగా వెన్న పడతా వుండాది. ఆ ఎన్న వుట్టి మీద ముంతలో పెట్టి వారానికి ఒక సారి మరగ పెడితే  నెయ్యి వస్తా వుండాది. నెయ్యి గూడా సొలిగె పావలా  లెక్కన అమ్మతా వుండాము. రూపాయికి నాలుగు సొలిగెల నెయ్యి .  నూరు రూపాయలు సేతిలో పడితే తిరపతికి అందరమూ పోతాము నాయనా! " అని మా నాయన కథంతా సెప్పె.

బియ్యం గూడా శేరు రూపాయి అని మా నాయన చెప్పినాడు.  అందుకే మేము నూకలు కొనుక్కొని రాగి సంగటి చేసుకొని తింటాము. బియ్యం ధర ఎక్కువంట.

నాకు ఏ ఇసయ మైనా మా నాయన పూస గుచ్చి నట్లు చెప్తాడు.‌ అందుకే నాకు అన్ని ఇసయాలు మా అన్న ,   అక్క కంటే నాకే బాగా తెలుసు.‌  చానా విసయాలు నేను మా నాయన దగ్గరే నేర్చు కొన్నా! ఎందుకంటే నేను సిన్న కొడుకును గదా!  అందుకే మా నాయనకు నేనంటే స్యానా ఇష్టం.

రెండు , మూడు  నెలల తరువాత మా నాయన నూరు  రూపాయలు సంపాయించి నాడు.

ఒక మంచి రోజు సూసు కొని పొద్దున్నే ఆరు గంటలకు స్నానాలు చేసి ,  మంచి బట్టలు ఏసు కొని , నేను మా నాయన , మా  అమ్మా, మా యన్న , మా యక్క  ఇంటిలో ఎంకటేస్వర సామి పటానికి టెంకాయ కొట్టి అందరమూ తిమ్మాపురం క్రాసు కాడికి నడుసుకొంటా పోతిమి.

అమ్మ సిత్రాన్నము , గడ్డ పెరుగన్నము  టిఫిన్  గిన్నెల్లో కట్టుకొని  గుడ్డ మూత కట్టి  బిగించె.‌ ఇంకా మా యమ్మ మేము  తినేదానికి అప్పచ్చులు , కారాలు , చుట్టలు ,  పప్పు బిళ్ళలు , కారం  బెట్టి వేయించిన  అనప కాయ గింజలు ,   వేయించిన చెనిక్కాయ గింజలు , పాగం పప్పు వుంటలు , జొన్న బొరుగుల బెల్లం కలిపిన వుంటలు అన్నీ ఎత్తుకొని తిత్తిలో పెట్టుకొని  ఇల్లు బీగాలు  వేసుకొని నడిస్తిమి.‌ ఈ రెండు రోజులూ గొడ్డూ గోదా తిండి కోసం మా ఇంటి పక్కనున్న మా మామోళ్ళకు జాగరత్త గా చూసుకోమని చెప్పితిమి.మాకు కోడి పెట్టలు , పుంజులు  నాలు గైదు వుండాయి .వాటి కోడి పిల్లలు పదో ఇరవై వుండాయి.‌రాత్రి అయిందంటే ఆటిని పెద్ద గంపల కింద చేర్చల్ల . ఆ పని మా అత్తోళ్ళకు చెప్పి నాము. నాలుగైదు మేకలుండాయి‌. ఆటిని మేతకు తీసుకొని పోవల్ల అని మా మామా వాళ్ళకు చెప్పితిమి.

మా ఇంటిలో కాపలాగా అంజి  అనే కుక్క వుండాది.‌
మేము పోతా వుంటే అది ఏడుపు మొగం ఏసుకొని చూస్తావుండాది. దానికి తిండీ గూడా మా రవణమ్మ అత్తకు చెప్పినాము.

అంతే కాదు మా ఇంటిలో రాజా , రాణి అనే రెండు పిల్లులు ఉండాయి. అయి మా అమ్మకు , నాకు అంటే స్యానా ఇష్టం . ఆటికి పాలు నేనే తాపిస్తా ప్రతి రోజూ.

అయి మా కొట్టంలో , చుట్టింట్లో , పసుల పాకలో తిరిగే ఎలకల్ని పట్టుకొని బాగా తినేస్తాయి.

" అమ్మా..రాజా , రాణికి పాలు ఎట్లా? " అని ఏడుపు మొహం వేసుకొని అడిగినాను నేను.

" రెండురోజులే గదా నాయనా! ఎలకల్ని తిని వుంటాయిలే ! " అనింది మా యమ్మ.

కానీ నాకు ఏ మూలనో పిల్లుల్ని‌ చూస్తా వుంటే బాధగా ఉండాది.

అవి‌ మ్యావ్ మ్యావ్ అని నా వొడిలో కూర్చొని ఆడుకొంటా వుంటాయి.

యాడికైనా  పోవాలంటే పెద్ద పీకు లాట.‌ అన్నీ సూసుకొని బోవల్ల. అందుకే ఇంట్లో ఎవ్వరో ఒక్కరుండల్ల‌.

తిమ్మాపురం‌ క్రాసు కాడికి వస్తానే  పీలేరుకు పొయ్యే ఎర్ర బస్సు నిలబడింది.

సంతోషంగా అందరమూ బస్సెక్కినాము.
నేను బస్సు ఎక్కి ఆరేడు నెలలు అవుతావుంది.‌అప్పుడెప్పుడో కలకడ శివరాత్రి తిరనాలకు కలకడ వరకూ బస్సెక్కి నాము అందరమూ.

నేనూ,  అక్కా, అన్నా  ముగ్గురు కూర్చొనే సీట్లో కూర్చొన్నాము‌ . అక్క ,  నేనూ కొట్లాడు కొన్యాము.  కిటికీ పక్కన ఎవరు కూర్చో వల్ల అని కొట్లాట. నేను గట్టిగా ఏడిస్తే నన్ను కిటికీ పక్క కూర్చో బెట్టిరి.‌ అక్కేమో ఏడుస్తా అమ్మ పక్కన  వుండే కిటికీ పక్కన కూర్చొండె .

కిటికీ పక్కన కూర్చొంటే గాలి చల్లగా ముక్కులకు , చెవులకు కొడుతోంది.‌ రోడ్డు పక్కన వుండే పల్లెల్ని , మనుషుల్ని ,  గుట్టల్ని చూస్తా వుంటే కుశాలుగా ఉండాది‌. మా యన్న నా మీద పడి పడి బయటకు తొంగి చూస్తా వుండాడు.

బస్సు పీలేరు బస్టాండు చేరింది.‌ అక్కడ నుండి పీలేరు రైల్వే స్టేషన్ కెడితే తిరపతికి వెళ్ళే రైలు వచ్చింది.‌

మేమంతా రైలు బండి ఎక్కినాము.  ఆ రైలు  బండి పాకాల మీదుగా తిరపతికి  పోతుంది. మా కందరికీ ఆ బొగ్గుల రైలు చూస్తా వుంటే ఎంతో సంతోషము వేసింది.‌ బస్సు కంటే రైలులో హాయిగా వుంది మా పయానం‌.
అప్పుడు ఒక తమాషా జరిగింది.

మేమంతా పాకాల  బొగ్గు  ఇంజన్  రైల్లో పోతావుంటే  నేను ఇంకో  బోగీ లోకి మా అమ్మా నాయనకు తెలీకుండా ,  సెప్పకుండా ఎల్లి పోతి.  మా యమ్మ  ఒకటే ఏడుపు .  మా నాయన కాళ్ళూ , సేతులూ వణకతా వుంటే నేనుండే బోగీకొచ్చి రెండు దెబ్బలు పీకి, బిగీన రెట్ట పట్టుకొని లాక్కోని పాయె!  నేను ఏడస్తావుంటే , మా యమ్మ అక్కడ అత్తిరాసాలు అమ్మే ఒకాయప్పకు  అణా ఇచ్చి అత్తిరాసాలు రెండు  కొన్నిచ్చె. నేను ఏడుపు మానేస్తి. 

మా యమ్మ నన్ను గట్టిగా పట్టుకొని తిరపతి దాకా వదలనే వదల్లా!

అప్పుడప్పుడూ మేము తెచ్చు కొన్న అప్పచ్చులు తింటా వుంటిమి.   మద్యాహ్నము మా యమ్మ తెచ్చు కొన సిత్రాన్నము , పెరుగన్నము చిన్న ప్లేట్లల్లో పెట్టి      ఇచ్చె. అందరమూ బాగా తిన్యాము.‌    మా నాయన రైలు ఆగి నప్పుడల్లా టేషన్ లో వుండే కుళాయల దగ్గర నీళ్ళు మర చెంబుల్తో పట్టుకోనిచ్చి మాకు తాపిస్తా వుండె‌.

సాయంకాలం ఆరు గంటలకు రైలు తిరపతికి చేరె.
మా నాయన స్యానా సార్లు తిరపతికి  వచ్చినాడు గాబట్టి ఆయప్పకు  అన్నీ తెలుసు.‌

ఆ రాత్రికి తిరపతిలో ఉండల్నా , కొండకు పోవల్నా అని మాట్లాడు కొంటిమి అందరమూ.

కొండకే పోదామని అమ్మ చెప్పె.  బస్టాండుకు  పోయి కొండకు పొయ్యే బస్సు ఎక్కినాము. బస్సులు వస్తా వుణ్డాయి. పోతా వుండాయి.

దూరంగా కొండ మీద వుండే గోపురం వరకూ లైట్లు కనబడతా వుండాయు.  కొండ మీద శంఖు చక్రాలు లైట్ల వెలుతురులో కనబడతా వుండాయి.

బస్సు కొండకు  కదిలింది. బస్సులో జనాలు ఒక్క సారిగా " గోవిందా ! గోవిందా ! " అని గట్టిగా అరచి నారు.  మేము గూడా  "  గోవిందా  " అని గట్టిగా అరిస్తిమి.

రాత్రి ఎనిమిది గంటలకు బస్సు కొండ చేరింది.
మా నాయన మమ్మల్ని అందర్నీ గట్టిగా పట్టుకొని ఒక ధర్మ సత్రానికి పిలుచు కొని పాయె.‌

ఆ రాత్రి అక్కడే పడుకొని , పొద్దున్నే కల్యాణ కట్ట కు పోవల్ల అని మా నాయన చెప్పె.

"కల్యాణ కట్టలో దేవుడు వుంటాడా నాయనా? " అని నేను అడిగినాను.

ఆ  మాటలకు మా నాయన పగల బడి నవ్వె.
" కల్యాణ కట్టలో నీకు బోడి గుండు చేస్తారు . "అని అన్యాడు మా నాయన.

ఆ రాత్రి మా యమ్మ తెచ్చు కొన్న అన్నం మూట విప్పె.అదే ఆ రోజు అందరమూ తిని అక్కడ్నే బొంతలు కింద పరచు కొని పడుకొంటిమి.

మా యమ్మ తెచ్చిన గిన్నెలు అన్నీ  శుభ్రంగా కడుక్కొని మా పక్కన్నే పడుకొన్యాది.

కొండ మీద బాగా చలి పెడతా వుంది.‌ మా యమ్మ తెచ్చు కొన్న దుప్పట్లు మాకు కప్పింది.

ఆ రాత్రి ఎప్పుడు నిద్ర పొయ్యామో మాకే తెలీదు.
**************************************
పొద్దున్నే తెల్ల వార తానే లేచి కల్యాణ కట్ట కాడికి పోయినాము అందరమూ.

అక్కడ గుండు కొట్టే వాళ్ళ దగ్గర నన్ను కూర్చో బెడతానే ఆయప్ప కొన్ని వేడ్నీళ్ళు  నెత్తిన చల్లి జుట్టు నంతా నీటితో తడిపె. నాకు బయ మేసి ఏడిస్తిని. మా యమ్మ , మా నాయన పక్కన కూర్చొని ధైర్యం చెప్పిరి.

" ఈ యప్ప నాకు గుండు కొట్టిస్తే   నాకు ఎంటికలు  మళ్ళా రావు గదా? " అని గట్టిగా ఏడుస్తా అన్యాను.

నా మాటలకు గుండు కొట్టే ఆయప్ప , మా యమ్మా , మా నాయనా పగల బడి నవ్విరి.

" రెండు నెలల్లో ఇంకా బాగా వొత్తుగా , నల్లగా వస్తాయి. అప్పుడు నువ్వు నీ స్నేహితుల మాదిరి క్రాపు వుంటుంది . యాల ఏడ్చేది? " అని మా అమ్మ నవ్వతా అనె.

" పుట్టిన ఎంటుకులు తీస్తా వుండారు గదా ? కత్తి పెట్టే ముందు కానుకలు పెట్టండి " అనె  ఆ గుండు గొరిగే  ఆయప్ప.

మా నాయన జోబీలో వుండే అర్థ రూపాయి బిళ్ళ ఆయప్పకు ఇచ్చె.

" గోవిందా! " అని ఆయప్ప నా నెత్తి మీద కత్తి పెట్టి బర బర మని గొరిగె.

గుండు చేసిన తరువాత నాకు చ్యానా హాయిగా ఉండినాది.

నాకు బోడి గుండు చేసిన తర్వాత నాకు మా వాళ్ళను చూసి స్యానా ఇస్మయం కలిగింది.

వరసగా మా అమ్మ గూడా గుండు చేసుకొనె. మా నాయన , మా అక్క , మా అన్న అందరూ గుండు చేసు కొనిరి . మేము ఐదు మంది బోడి గుండ్లతో కోనేటికి పోయి అక్కడ స్నానాలు చేస్తిమి.

అక్కడొకాయన  మా  బోడి గుండ్లకు గంధం బాగా పూసినాడు.  కత్తి వాటు మంట ఒక్క సారిగా తగ్గి పాయె. మా గుండులు  చల్లగా అనిపించె.
ఆయప్పే మాకు అందరికీ గోవింద నామాలు పెట్టినాడు.

ఆయప్పకు మా నాయన ఒక అర్థ రూపాయి బిళ్ళ చేతిలో పెట్టె.

మేమందరమూ ఆ తరువాత సర్వ దర్శనం లైనులో నిలబడితిమి. అందరూ గుండ్లు చేసుకొని గోవిందా , గోవిందా అని గట్టిగా రెండు చేతులూ ఎత్తి అరుస్త వుండారు.

మా నాయన నాకు  కాళ్ళు నొప్పి వస్తా వుండాయంటే నన్ను భుజాల మీద ఎక్కించు కొన్నాడు. నేను మా నాయన గుండు పట్టుకొని  ఎత్తులో‌ కూర్చొన్నా!

నాలుగైదు గంటలో దేవుని దర్శనం అయింది.

ఎంకటేస్వర సామి ఆ దీపాల కాంతిలో వెలిగి పోతున్నాడు. ఆ విగ్రహం చూసి మాకు
భక్తి భావం ఎక్కువయి , అందరమూ గట్టిగా " ఏడు కొండల వాడా! గోవిందా! " అని అన బడితిమి.

మా అమ్మ ఏడుస్తా వుండాది.

" సామీ ! నీ దర్శనం అయింది . మమ్నల్ని , మా బిడ్డల్ని ,  మా గొడ్డూ గోదల్ని , మా వూరిని సల్లగా చూడు నాయనా! గోవిందా! ఏడు కొండల వాడా! ఆపద మొక్కుల వాడా! " అని గట్టిగా అరచె.

మా అమ్మతో పాటి మేము గూడా గట్టిగా అరిస్తిమి.

దర్శనం అయిన తరువాత మా అమ్మ  మొక్కులు చెల్లించల్ల అని హుండీలో దాచుకొన్న దుడ్లు కొన్ని ఏసె.

ప్రసాదం తీసుకొని గుడి బయటకు అందరూ వస్తిమి.

మాకు ఈ  తిరపతి యాత్ర జీవితాంతం గుర్తుండి పోయింది.

ఎంతయినా మా సిత్తూరోళ్ళకు ఈ ఎంకన్నే  దిక్కు గదా?

******************************************
వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు

12.11.2022

.

Friday, November 11, 2022

వెలుగు లేని చీకటి ( కవిత))

 


వెలుగు లేని చీకటి
---------------

మా తాత గారిచ్చిన ఈ భవనం తాలూకు స్మృతి చిహ్నాలు కనుమరగై పొయ్యాయి
అపార్టుమెంటు భూతం నా బంగారు గృహాన్ని ముక్కలు చేసింది

మా పెరటి తోటలో పూస్తున్న సంపెంగ చెట్టు  వాడి పోయింది
మా ఇంటి మహ లక్ష్మి తులసమ్మ మొక్క గుండె బ్రద్ధ లయింది

మా ఇంటి చుట్టూ పెనవేసుకొన్న లతా నికుంజాలు సొమ్మసిల్లి పొయ్యాయి
మా ఇంటి చెట్ల మీద ఆడుకొంటున్న పక్షుల జంటలు పారి పొయ్యాయి

గూడు చెదిరిన తల్లి పక్షులు ఆర్త నాదాలు చేసుకొంటూ ఎగిరి పొయ్యాయి
పచ్చని చెట్ల మధ్య ఉన్న మా భవంతి కుప్ప కూలి పోయి ముక్కలయింది

ఇప్పుడు నా హృదయం మొద్దు బారి పోయింది
ఇప్పుడు నా బ్రతుకు వెలుగు లేని చీకటయింది
-------------------------------------

రచన: వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు
29.09.2022

పుస్తకావిష్కరణ

 

-----------------

పుస్తకావిష్కరణ

ఆ రోజు ఆదివారం.‌
ఫేస్‌బుక్  లో పేజీలు తిరగేస్తున్నాడు రాంబాబు. పుస్తకా విష్కరణలు  ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తన దగ్గరున్న చిన్న పొత్తం లో   నోట్ చేసుకొంటాడు.ఆతను సాహిత్య ప్రియుడే.అడపా దడపా కొన్ని‌ కవితలు వ్రాసుకొన్నాడు. కానీ ఎవరికీ చూపించడు. అతని ఎరుకలో ఇంకా అతను పరిణితి చెందిన కవి కాదని అతని వుద్దేశ్యం. నిర్వాహకులు
పిలిచినా ,  పిలవక పోయినా ఆయన సాహిత్య సభలకు , అవిష్కరణ సభలకు వెళ్ళడం అలవాటు. దానికి ఎనిమిది కారణాలు.
1. ఆది వారం‌ శ్రీమతి నుండి చీవాట్లు తినడం తప్పుతుంది.
2. పుస్తకాలు కొనే బాధ తప్పుతుంది. అవిష్కరణ సభలో ఎలాగూ నిర్వాహకులు పుస్తకాలు ఫ్రీగా పంచి పెడతారు .

3.  కొందరు ఇంటిలో అటక మీద చెదలు పట్టిన
పుస్తకాల్ని ఇక్కడ పంచి పెడుతుంటారు ఆ  కవుల వారసులు.‌ మా నాన్న గారు వ్రాసిన పుస్తకం అనీ ,మా తాత గారు వ్రాసిన పుస్తకం అనీ.ఇంట్లో పేరుకు‌ పోయి చెదలు తినేస్తున్న పుస్తకాల్ని ఎలాగైనా వదిలించు కోవాలని వారి ఆరాటం.
6. అవిష్కరణ సభలో భోజనాలు ఏర్పాట్లు గూడా వుంటాయి. అక్కడే తిని ఇంటికి వెళ్ళవచ్చు.
7. ఇంకో లాభం పెద్ద పెద్ద రచయితల్ని , కవుల్నే గాకుండా ఇతర ప్రముఖ అతిధుల్ని కలవ వచ్చు
వారితో సెల్ఫీ లు తీసు కోవచ్చు.
9. అసలయిన లాభం చెప్పలేదు కదా! కొందరు కవుల ఫోన్ నెంబర్లు తీసుకొని వారి పుస్తకాలు అంటే చెవి తెగ్గోసుకొంటాను , వారి గొప్ప ఫాన్ అంటే ,వారే ఇంటికి ఆ పుస్తకాల్ని  ఫ్రీ గా పంపిస్తారు.
ఇన్ని లాభాలున్న అవిష్కరణ సభల్ని ఎలా వదలు కొంటాము?
ఆంధ్ర ప్రదేశ్ లో గానీ , తెలంగాణా లో గానీ ఎక్కడైనా సాహిత్య సభలు జరగనీ , అక్కడకు వాలి పోతాడు రాంబాబు.అందుకే రాంబాబుకు కవుల మార్కెట్లో మంచి పేరుంది. ప్రతి సభకు తప్పక హాజరవుతాడని.
రాంబాబుకు ఒక చిరకాల వాంఛ ఒక్కటి ఉంది. ఎలాగైనా శాలువ ఒక్కటి కప్పించుకొని సన్మానం చేయించు కోవాలని. ఆ ఆశ తీరనే లేదు. తను కవి గాడు. కవితలు వ్రాయ లేడు. రచయితా గాదు. కథలు వ్రాయ లేడు. పోనీ వ్యాసకర్త అంటే అదీనూ గాదు.
ఆ కొరత రాను రానూ ఒక చింతగా మారి రాంబాబు మనో వేదనకు గురి అయ్యాడు.
ఎలా శాలువ కప్పించు కోవాలో తెలియడం లేదు.  తనకు శాలువాతో సన్మానం చేయించు కోవాలంటే తనలో ఏదో టాలెంట్ ఉండాలి.‌ సాహిత్య రంగం లోనైనా, కళా రంగం లో నైనా , సేవారంగం లో నైనా తనకు ఒక గుర్తింపు వుండాలి. అదే లేదు తనకు.  " ఉద్ధండ సాహిత్యాభి మాని " అని ఎవరైనా తనకు బిరుదు ఇచ్చి సన్మానం చేస్తే బాగుంటుందని రాం బాబు అనుకొనే  వాడు.
ఈ ఆది వారం , సుందరయ్య కళా భవన్ లో పొద్దున పది గంటలకు , మరీ సాయంత్రం ఆరు గంటలకు పుస్తక అవిష్కరణ సభలు ఉన్నాయని ఫేస్ బుక్ లో చూశాడు.‌ అందరూ ఆహ్వానితులే అన్న వాక్యం చదివి సంతోష పడి పొయ్యాడు.‌  ఆశ్చర్యం ఏమిటంటే పొద్దున సభలో ఇరవై మంది కవుల పుస్తకాల్ని అవిష్కరణ ఒకే రోజు చేస్తారని ఉంది. రాంబాబు ఆనందానికి అవధుల్లేవు.‌
ఉదయమే ఇంట్లోంచి బయలు దేరాడు. ఠంచనుగా పది గంటలకు సుందరయ్య హాలు చేరుకొన్నాడు. ఇంకా ఐదారు మంది గూడా రాలేదు. పదకొండు గంటల వరకూ కొంత మంది వచ్చారు. కానీ అధ్యక్షుల వారు రాలేదు. ఆయన పెద్ద రాజ కీయ నాయకుడు.  గవర్నర్ గా  పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవితంలో ఇలా సాహిత్య సాంస్కృతిక  సభలకు హాజరవుతున్నాడు. అతను వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఈ రెండు గంటలు కవుల అర్థం కాని కవితలు , పద్యాలు , పాటలు వినిపించారు.  కనీసం కాఫీ, టీ  నీళ్ళయినా మొహాన పొయ్య లేదు.  బహుశా భోజనం ఒకే సారి పెడతారేమో!
రాంబాబు కి నీరసం వచ్చేసింది. అంతలో ఒక అబ్బాయి కాగితాల కప్పుల్లో టీ ని నింపుకొని , ట్రేలో బిస్కట్లు పెట్టుకొని  వచ్చాడు. తను రెండవ లైన్లో కూర్చొన్నాడు. కానీ ఆ టీ  బిస్కట్ల అబ్బాయి వెనక కూర్చొన్న సీట్ల  నుండి సప్లయి చేస్తున్నాడు.  వెనకాల కుర్రోళ్ళు చాలా మంది నిలబడు కొని వున్నారు. పది నిమిషాలయినా ముందు లైన్ల వారికి ఇవ్వడం లేదు. అందుకే రాంబాబు  వెనక సీట్లో కి వెళ్ళి కూర్చొన్నాడు. మైకులో ఎవరో ఫ్రంట్ లైన్ లో వున్న అతిధులకి టీ బిస్కట్లు ఇస్తే సభ ప్రారంభ మవుతుంది అన్నాడు.
రాంబాబుకు ప్రాణం పోయినంత పనయింది.  ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ గూడా చేసి రాలేదు. నాలుగైదు వరసల వారికి టీ బిస్కట్లు ఇచ్చి ఆ  అబ్బాయి వెళ్ళి పొయ్యాడు. మళ్ళీ అతను రానే లేదు. రాం బాబు సొమ్మ సిల్లి పోతున్నాడు.
అవిష్కరణ సభ ప్రారంభమయింది. వేదిక మీద కూర్చొన్న మైకాసురులు మైకును పట్టుకొని మాట్లాడుతూనే వున్నారు. టైం సెన్స్ కొంచెం గూడా లేదు. ఇంకా అధ్యక్షుల వారు మాట్లాడడం లేదు.‌ అప్పటికే ఒంటి గంటన్నర దాటింది.ఇక లంచ్  ఎప్పుడు పెడతారో తెలీదు.
ఇప్పుడు అధ్యక్షుల వారిని మాట్లాడ మన్నారు. వేదిక మీదున్న పెద్ద మనుషుల పేర్లు చెప్పడానికే పది నిముషాలు పట్టింది.‌ ఇంకా ఎవరి పేరు అయినా  మరచి పోతే క్షమించాలి అన్నారు అధ్యక్షుల వారు.ఇరవై మంది కవులు దీనంగా కూర్చొన్నారు మొదటి వరసలో. రాంబాబు మళ్ళీ వచ్చి రెండవ వరసలో కూర్చొన్నాడు. ఎందుకంటే ఈ సారి ఇరవై పుస్తకాలు అప్పనంగా దొరుకు తున్నాయి.
మధ్యాహ్నం రెండు గంటలయింది. అధ్యక్షుల వారు సాహిత్యం గురించి మాట్లాడకుండా తన రాజకీయ ప్రస్థానం గురించీ , తను  ప్రత్యర్థులను ఎలా ముప్పు తిప్పలు పెట్టిందీ చెప్పుతున్నాడు. అంతలో ఒక నిర్వాహకుడు అధ్యక్షుల వారి చెవిలో ఏదో గొణిగాడు.
అంతలో అధ్యక్షుల వారు  వుపన్యాసం ముగించారు‌ .ఇప్పుడు ఇరవై మంది కవులు రెడీగా ఉండాలి అన్నారు ఎవరో! ఇరవై పుస్తకాల అవిష్కరణ ఒకే రోజు చెయ్యడం  నభోతో నభవిష్యతి. ఇన్ని పుస్తకాలు ఏ సాహిత్య సంస్థ గూడా ఒకే రోజు అవిష్కరించ లేదు. ఆ పని మేము చేసి చూపిస్తున్నాము‌ . వేదిక మీద పది మంది కూర్చొన్నారు. వేదిక క్రింద ఒక యాభై ,అరవై మంది కూర్చొన్నారు.  ఇరవై పుస్తకాల అవిష్కరణ జరిగింది. కుప్పలు కుప్పలుగా పుస్తకాలు వేదిక మీది టేబుల్ పై నిండి పొయ్యాయి. వేదిక మీద వున్న పెద్ద మనుషులు వారికిచ్చిన ఇరవై పుస్తకాల్ని సంచీలో నింపుకొంటున్నారు.
ఇక వేదిక దిగువ కూర్చొన్న వారి  కందరికీ  ఆ ఇరవై మంది వ్రాసిన పుస్తకాల్ని పంచేశారు. అలా పాపం ఆ బీద కవులు కష్టపడి అచ్చు వేయించిన పుస్తకాలు సుమారు యాభై అరవై   పుస్తకాల్ని అక్కడి కొచ్చిన వారికి వుచితంగా నిర్వాహకులు  పంచేశారు. కొందరయితే  ఫ్రీగా వస్తున్నాయని రెండు మూడు పుస్తకలు అదనంగా తీసుకొని దాచు కొంటున్నారు. పాపం కవుల ముహాల్లో కత్తి వాటుకి  నెత్తురు చుక్క గూడా లేదు. ఒక్కొక్కరు యాభై ,  అరవై పుస్తకాల్ని ఫ్రీగా పంచాలంటే   ఎంత  ఖర్చు అవుతుంది ? . అసలు ఐదు వందల పుస్తకాలు అచ్చు వేయించాలంటే అర్ద లకారం పైననే అయి పోతోంది. ఇంకా అవిష్కరణ సభ ఖర్చు  వగైరాలు ఖర్చు తడిసి మోపడవుతుంది.
అక్కడున్న కవులకు ఏమి మాట్లాడాలో తెలియడం లేదు.ఒక్కడన్నా ఒక్కడు పుస్తకాన్ని కొందామన్న పాపాన లేదు. అదేదో అవిష్కరణ సభకు వచ్చాము గదా, పుస్తకాలు ఫ్రీగా తీసు కోవడం వారి హక్కు అన్నట్లు ఫీల్ అయి పోతున్నారు.  కార్పోరేట్ కంపెనీలల్లో గూడా ఆనువల్ జనరల్ బాడీ మీటింగులప్పుడు యాజమాన్యం వారిచ్చే బిస్కట్ పాకెట్లకు , స్వీట్లకు  , బహుమతులకు ఇలాగే కొట్టుకొంటారు.  ఒక్క షేరున్నా , వెయ్యి షేర్లున్నా వారిచ్చే బిస్కట్ల కోసం ఎంత దూరమైనా వస్తారు.  యాజమాన్యం వీరికి ఆ  బిస్కట్లు ఇచ్చి పెద్ద పెద్ద రిజల్యూషన్ లను  పాస్ చేయించు కొంటుంది. అలాగే ఏడ్చినాయి ఈ మధ్య అవిష్కరణ సభలు గూడా అని అనుకొన్నాడు రాం బాబు.‌
సాయంత్రం నాలుగు గంటలవుతోంది. ఇంకా వేదిక మీద అభిమానులు కవుల్ని కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు.  లంచ్ మాట ఒక్కరు గూడా ఎత్తడం లేదు.
అంతలో మైకులో ఒకాయన ఇలా అన్నారు.
" ప్రియ సాహిత్యాభి మానులారా! ఇప్పటికే చాలా కాలా తీత మయింది. మమ్మల్ని మీరు క్షమించాలి. బయట అల్పాహార పాకెట్లు అరేంజ్ చేశాము. దయ చేసి అల్పాహారాన్ని ఆరగించి వెళ్ళాలి ." అని రెండు చేతులూ జోడించి దండం పెడుతున్నాడు.
బ్రతుకు జీవుడా! అని అనుకొంటూ రాంబాబు హాలు బయటకు వచ్చి రెండు మూడు అల్పాహార పాకెట్లును తీసుకొని ఓ మూల వేసిన కుర్చీలో కూర్చొని లాగించేశాడు. పులిహోర , పెరుగన్నం , ఉప్మా పాకెట్లు వున్నాయి అక్కడ మూడు ట్రేలల్లో.
సాయంత్రం ఆరు గంటలకు అక్కడే ఇంకో సాహిత్య సభ , పుస్తకావిష్కరణ వుంది.
బ్రతికుంటే బలిసాకు తిని బ్రతకొచ్చని అక్కడనుండి క్షణాల్లో మాయ మయ్యాడు రాంబాబు.
ఏమను కొన్నాడో ఏమో , రాంబాబు ఆ తరువాత
ఏ పుస్తకావిష్కరణ సభకు హాజరు కాలేదు.
******************************************
రచయిత: వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు

గో తెలుగు .కామ్ లో అక్టోబర్ నెలలో ప్రచురించారు.


పెద్ద కొడుకు ( నా మొదటి కథల సంపుటి)

 


నా మొదటి కథల సంపుటి
--------------------------------

పాఠక మహాశయులకు శుభాభినందనలు.

2022 ఏప్రిల్ నెల 17 వ తేదీన  ' *సంస్కార సమేత రెడ్డి నాయుడు*  '  నా తొలి నవలను అవిష్కరించాను. అలాగే అదే తేదీన నా  మూడవ కవితా సంపుటి ని  ' *మట్టి వేదం* '  ను అవిష్కరించాను .

నేను పుట్టి , పెరిగినది , చదువు కొన్నది గ్రామీణ వాతావరణం కాబట్టి  ఆ అనుభవాలు , ఆ   సంఘటనలే ఈ పుస్తకంలోని కథలు. అలాంటి  కథలే నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని నా అభిప్రాయం . నేను నా జీవితంలో చూసిన ,  అనుభవించిన సంఘటనలే నా కథలకు ప్రేరణాలు. నాకు  రాయల సీమ మాండలికం లో వ్రాయడం ఇష్టం . ' పెద్ద కొడుకు '  ,  ' రెడ్డమ్మ ' ,  '  కర్మాను సారే!  '  ,  ' వాన దేముడా !  ' ,  ' పల్లె రమ్మంటుంది -పట్నం పొమ్మంటుంది  ' లాంటి కథలు గ్రామీణ జీవిత నేపథ్యంలో  వాస్తవానికి దగ్గరగా వ్రాసిన కథలు . 

ఈ కథల సంపుటికి ముందు మాట వ్రాసి ఇచ్చిన కళారత్న , ప్రముఖ రచయిత, కవి ,  విమర్శకుడు , గజల్ కవి, జర్నలిస్ట్  , శ్రీ బిక్కి కృష్ణ గారికి నా హృదయ పూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను.

అలాగే ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది , మంచి కవర్ డిజైన్ తో పుస్తకాన్ని ముద్రించి పాఠక లోకానికి  అందించిన సాహిత్యాభి లాషి , సాహిత్య పోషకులు  శ్రీ సంపత్  కలిమిశ్రీ గారికి   , కలిమిశ్రీ ప్రచురణలు, విజయ వాడ వారికి  నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపు కొంటున్నాను.

ఈ కథా సంపుటిని ఎంతో దిగ్విజయంగా ఆవిష్కరించిన నవ్యాంధ్ర రచయితల సంఘం కార్యవర్గ నిర్వాహకులకు నా ధన్యవాదములు తెలుపు కొంటున్నాను.

అలాగే ఈ కథల్ని వివిధ పత్రికల్లో  చదివి నన్ను ఎప్పటి కప్పుడు ఆదరిస్తున్న పాఠక మహాశయులకు నమస్సులు తెలుపుకొంటున్నాను.

నాకు జన్మ నిచ్చి , విద్యా బుద్దులు నేర్పించిన  నా తలిదండ్రులు  కీ.శే . శ్రీ వారణాసి కృష్ణ మూర్తి రావు గారికి , కీ.శే. శ్రీమతి స్వర్ణాంబ గారికి నా హృదయ పూర్వక ప్రణామములు సమర్పిస్తున్నాను.

ఈ  మొదటి కథా సంపుటిని  పాఠక లోకానికి అందించాలనే నా కల నెరవేరింది.

భవదీయుడు

వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు
తేదీ :  15.11.2022

ప్రతులు కావలసిన వారు

మీ వివరాలు కామెంట్ బాక్స్ లో పెట్టండి .

లేదా ఫేస్‌బుక్ లో చూడండి.

చినుకు తాకిన నేల - నా సమీక్ష

 


" చినుకు తాకిన నేల " -  శాంతి కృష్ణ గారు   రచించిన కవితా సంపుటి  మీద నా సమీక్ష .‌
---------------------------------------
Poetry is the spontaneous out flow of powerful feelings. It takes its origin from emotions recollected in tranquillity . " William Wordsworth .

 
ఆధునిక సాహిత్య కవులు ఎంతో మంది  మంచి సాహిత్యాన్ని అందిస్తున్నారు.‌ కొన్ని కవిత్వాలు ఇంకా మన   మస్థిష్కంలో ఎక్కడో ఒక చోట నిక్షిప్తమై     వుంటాయి.‌ శ్రీ శ్రీ  గారు గానీ , రాయ ప్రోలు  గారు గానీ , తిలక్ గారు  గానీ , దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు గానీ తమ  సాహిత్యాన్ని సుసంపన్నం చేసుకొని కోట్లాది మంది సాహిత్యాభిమానుల ప్రశంసలు అందుకొన్నారు.‌
వీరు ఎన్నుకొన్న ప్రక్రియ ఏదైనా అందులో వారు నిష్ణాతులయ్యారు.‌ శ్రీ శ్రీ గారు సామ్య వాదం లేదా సోషలిజం లేదా మార్కిజం వాదాలతో ముడి పడిన కవిత్వాన్ని అందించారు. అలాగే దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు భావ కవిత్వాన్ని అందించారు.దీనినే కాల్పనిక వాద (Romanticism ) కవిత్వం అంటారు.‌ ఈ ప్రక్రియలో కవి తన అనుభూతుల్నీ , ఆత్మీయతల్నీ, వాంఛల్నీ వ్యక్త పరుస్తాడు.‌విలియం వర్డ్స్ వర్త్ , షెల్లీ , కీట్స్ వంటి పాశ్చ్యాత్య కవులు ఈ కాల్పనిక  వాద కవిత్వంలో నిష్ణాతులు అయ్యారు.

ఈ కాల్పనిక వాద కవిత్వం‌లో మనకు ప్రేమ తత్వం , ప్రకృతి తత్వం ,  అలౌకికాను భూతి , మార్మికత లాంటివి దర్శన మిస్తాయి.

' తెలుగు సాహితీ వనం ' అనే సమూహాన్ని ముఖ పుస్తకం లో స్థాపించి , ఐదు సంవత్సరాలుగా తన అకుంఠిత దీక్షతో , నిరంతర శ్రమతో అచిర కాలంలోనే 23000 మంది కవుల్ని ఒక చోట చేర్చి సాహిత్య సేవ చేస్తున్న ఆ తోట మాలి ఎవరో గాదు , శ్రీమతి శాంతి కృష్ణ గారు.‌ ఆమెకు కవిత్వం మీదున్న ప్రేమ , తెలుగు భాష మీదున్న అంకిత భావం‌ వలనే ఈ సాహిత్య వనం మూడు పూవులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది.

ఇటీవల రవీంద్ర భారతిలో 02.07.2022 వ తేదీన  ఆరు పుస్తకాలు ఒకే రోజు అవిష్కరించడం వెనుక శాంతి కృష్ణ గారితో పాటు మిగిలిన నిర్వాహకుల శ్రమ గుర్తింప తగ్గది.

శాంతి కృష్ణ గారు వ్రాసిన ఈ  ' చినుకు  తాకిన నేల ' అనే 70 కవితల పుస్తకాన్ని సమీక్ష చెయ్యడం  నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.‌ఈ కవితలన్నీ చదివాక , నేను ఇంతకు ముందు ఉటకించినట్లు , ఆమె  కాల్పనిక వాద (Romanticism )  కవిత్వాన్ని బాగా పండించారని చెప్పక తప్పదు.‌ మదిలో మెదిలే భావాల్ని అక్షర రూపంలోకి తెచ్చే క్రమంలో చాలా భావావేశానికి‌ లోనయి ఈ కవిత్వాన్ని  పుస్తక రూపంలో మన ముందుకు తెచ్చారు. 

" ఎక్కువగా ప్రకృతిని ఇష్ట పడే నేను ఏ సుందర దృశ్యం చూసినా వెంటనే అక్షర రూపం ఇవ్వడం అలవాటు . భావ కవిత్వ మంటే మక్కువ ఎక్కువ. అడవులన్నా , సముద్రమన్నా చాలా ఇష్టం " అని వ్రాసుకొన్నారు ఈ కవియిత్రి తన మనసు పలికిన మాటల్లో.."

" Poetry is an art. It is a form of writing that uses words to create a picture, sound or feeling. Poetry has its own sound , form , image and rythm ." అన్నారు పాశ్చ్యాత్య కవులు.

శాంతికృష్ణ గారి కవితలు చదువు తున్నప్పుడు ఈ అలౌకిక. అనుభూతి ,  ఈ రిథం, ఈ ఇమేజరీ , కొన్ని భావ చిత్రాలు మనకు అగుపడతాయి .

ప్రతి కవితా ఆమె అన్నట్లు మనల్ని అలౌకిక తత్వానికి , ప్రకృతి తత్వానికి తీసుకు వెడుతుంది.

" దోసిళ్ళ కొద్దీ వెన్నెల క్షణాలు
నన్నిప్పుడు ప్రేమగా అల్లుకు పోతున్నాయి "

అన్న ' వన మాలి '  భావ గీతం‌  చదువుతూంటే మనల్ని ఏదో లోకం లోకి తీసుకు వెడుతుంది.

మొదటి కవిత " గురువంటే నాన్నే! " లో

" నాన్నెప్పుడూ శిలా సదృశ్యమే
వణికించే చలి లోనూ నిర్దాక్షిణ్యంగా నిద్ర లేపి
పుస్తకాల ఒళ్ళో నన్ను పడేస్తూ "  అంటూ

" నాన్నంటే మలయ పవనమే!
నాన్నంటే ఆది గురువే! " అని  నాన్న మీద తమ ప్రేమను కురిపిస్తారు.

కవిత్వ నిర్మాణ పద్ధతులు , వాక్య నిర్మాణ పద్దతులు, ఎత్తు గడ, సాంద్రత , ముగింపు ,  బాగా తెలిస్తే గానీ కవిత్వం పండదు.‌ శాంతి కృష్ణ  గారు ఇవి ఔపాసన పట్టి నట్లున్నారు.

" ఆకలి చేసే  పేగుల చప్పుళ్ళు
వాన చప్పుళ్ళతో  కలిసి పోతున్నాయి " అని శబ్ధాలంకార ప్రయోగం చేశారు 'సంద్రం పిలుపు ' అనే కవితలో.

గంగ పుత్రుల అభాగ్య జీవితాల్ని స్పృశిస్తూ ,

" సూరీని కబురు లేక
సంద్రం   పిలుపు లేక
బెస్త పల్లె ముడుచుకొన్న
గువ్వలా ఉంది నేడు
దిగుల గుప్పెట్లో ఒదిగి పోతూ ! "

అనడంతో మనకు మనసంతా దిగులుతో నిండి పోతుంది.

ఆమె ఆశావాది కాబట్టి ,ఆమె కవితల్లో నిరాశా వాదం కనబడదు .

" అవినీతి అణు మాత్రం కనిపించని సరి కొత్త బంగారు లోకాన్ని చూడాలని ఉంది " అని అంటారు ఒక కవితలో.

' మృగాడు ' అనే కవితలో అని ఆమె అపర కాళిలా గర్జిస్తుంది.

" ఉరి కొయ్య కూడా మరణిస్తుందేమో
వాడి దేహాన్ని  మోసిన పాపానికి "

ఈ పుస్తకానికి పేరు ' చిగురు తాకిన నేల ' అనే ఒక కవితా శీర్షిక . ఆ కవితలో

" నీ మనసును ఏదైనా తడి స్పర్శిస్తే
చినుకు తాకిన నేలలా పరిమళించు ''
అనడం చాలా  చాలా బాగుంది.

అలాగే 'వెన్నెల వాగులో ' తన మానవత్వాన్ని చాటు కొన్నారు.

" చిరు సాయపు చెమరింతలకు
పులకరించే  ఆ పసి మనసుల్లో తప్పకుండా
మనమో వెన్నెల వాగవుదాం "

అనడం  వారి కవిత్వ ప్రతిభను గూడా తెలియ చేశారు.

" పువ్వును కత్తరించి
అవనికి వైధవ్యాన్ని
ఆపాదించకండి "

అంటారు ప్రకృతి తో మమేక మయ్యే అడవి బిడ్డల కోసం ' వైధవ్యం ' అనే కవితలో.

ఇలాంటి కవితలతో తెలుగు సాహిత్య వనం పులకరించిందనే చెప్పాలి.‌శాంతి కృష్ణ గారు మున్ముందు ఇంకా మంచి కవిత్వాన్ని వ్రాసి సాహితీ లోకాన్ని మురిపించాలని ఆశిస్తున్నాను.

సమీక్షకులు :
వారణాసి భానుమూర్తి రావు
కవి , రచయిత
సహస్ర కవి రత్న , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ , సాహితీ భూషణ
హైదరాబాదు
9989073105
21.07.2022

( ఈ సమీక్ష కేవలం తెలుగు సాహితీ వనం వారి ' అక్షర సవ్వడి ' సమీక్షల   పోటీల్లో బహుమతి పొందిన సమీక్ష .)

( ఈ సమీక్ష  నా స్వంత మనియూ, ఇది అనువాదం గాదనియూ , అనుసరణ గాదనియూ మీకు హామీ ఇస్తున్నాను. ఇది ఏ పత్రికకూ పంప లేదనియూ మీకు హామీ  ఇస్తున్నాను.)
Show quoted text