Thursday, August 10, 2017

అరే కవి ఇంకా బ్రతికే ఉన్నాడు!

అరే కవి ఇంకా బ్రతికే ఉన్నాడు!
-----------------------------------------

కన్నీళ్లతో అక్షరాలకు అభిషేకం చేస్తే
ఒక జీవిత మంత కావ్యాన్ని  రాయవచ్చు
ఒడిసి పట్టుకొన్న ప్రతి అక్షరాన్ని
అందంగా మలచ వచ్చు
అక్షర శిల్పి వే కానక్కర లేదు
ఒక్క సారి మసి బారిన నుడిగట్టిన
లాంతరు బుడ్డీలను చూడు
వెలుగే లేని కళ్ళ వెనకాల నైరాశ్యపు గదులు
అయినా వెలుతురు చీకటిని తరుము తోంది
ఒక్క ఇంకిపోయిన నది సమరానికి  సన్నిద్ద మవుతోంది
సామూహికంగా శిలాజమైన చోట యుద్ధం క్షేత్రం
అక్కడ ప్రాణాక్షరాలు బీజా లై నిలుచున్నాయి
మనిషికీ కావలసిన అక్షరం అక్కడ లేచి నిల బడింది
ఇక కావ్యావిష్కరణే తరువాయి
అక్కడ చప్పట్లు కొట్టడానికి రెండు చేతులూ లేవు
అయినా అక్కడ అక్షరాలు  శ్వాసిస్తున్నాయి

అరే కవి ఇంకా బ్రతికే ఉన్నాడు!

వారణాసి భానుమూర్తి రావు
10.08.2017

Sunday, August 6, 2017

రైతు కూలి

రైతు కూలి
------------


ఎండనక , వాననక
 రేయనక, పగలనక  
 మట్టిని తిని
 మట్టి గాలిని పీల్చి
  మట్టి దుప్పటి కప్పుకొని
 ఆరుగాలం మట్టి లోనే
 బ్రతుకు సాగించే
ఓ రైతు కూలీ!
ఏమున్నది నీ దగ్గర?
సమస్తమూ పరజనుల
పాలయిన నీ బ్రతుకు
 మోసాల వూబిలో
 ఇరుక్కొన్న నీ బ్రతుకు బండి
మనుషుల సాక్షిగా
తెగులు పట్టిన నీ బ్రతుకు పంట
 కుళ్ళి పోయిన విత్తనాల సాక్షిగా
 పాడై పోయిన నీ ఆశల మడి
 పిచికారి కొట్టినా
బాగు పడని నీ బ్రతుకు
 కపిల తేలని బావిలో
శవమై పోయిన
 ఓ రైతు కూలీ ! సోదరా!
మమ్నల్ని క్షమించు!!

భాను వారణాసి/  05.08.2017