Friday, January 23, 2015

తిరిగే దేవుళ్ళు !


  తిరిగే దేవుళ్ళు !
-----------------------------------------

నువ్వొక్క సారి రైలేక్కుతున్నపుడు
జారి  కింద పడిపోతుంటే
చేయ్యి పట్టి పైకి లాగిన  పెద్దమనిషి
మళ్లి  నీకు అగుపించనే  లేదు

వరదల్లో చిక్కు కొన్న నిన్ను
రక్షించాడే ఒక  బికారి
అతన్ని నువ్వు గమనించనే లేదు

నువ్వొక సారి గుండె పోటుతో
ఆసుపత్రిలో స్పృహ లేకుండా పడినప్పుడు
నీ తల నిమిరి వెళ్ళిపోయిన వ్యక్తిని నువ్వు
గుర్తు పట్టనే లేదు

నీ బిడ్డ  ఒంటరిగా  వెడుతున్నపుడు
ఆకతాయిల  ఆగడాలనుంచి
తప్పించిన  ఒక  అయ్య కోసం
నువ్వు  మళ్లి  వాకబు చేయ  లేదు

రోడ్డు దాటుతున్న నీ  శ్రీమతిని
రెప్పపాటులో  ప్రమాదం  నుంచి కాపాడిన
ఒక  అమ్మను  నువ్వు  చూడనే లేదు

గుడిలో  తప్పిపోయిన  నీ ఆరేళ్ళ కొడుకు
ఉత్తరం వైపు ఏడుస్తూ ఉన్నాడని
చెప్పిన కోయ రాజును
నువ్వు మర్చి పోయ్యావు

వర కట్న పిశా చి తో
నువ్వు కుదుర్చు కొన్న పెళ్ళి సంబంధం
వద్దని చెప్పిన  పంతులు గారిని
నువ్వసలు   తర్వాత  పట్టించుకోనే  లేదు

నువ్వు గొప్ప విపత్తులో నున్నపుడు
నీతో పాటే ప్రయాణిస్తున్న ఒక వ్యక్తీ
చెప్పిన సందేశం నిన్నెంతగా  మార్చిందో
అసలు ఆ అగంతక వ్యక్తీ  ఎవరో
ఎక్కడ దిగాడో నువ్వు పట్టించు కోనేలేదు


ఎక్కడో ఎందుకో ఎవరో
మనకు కొందరు  తారస పడుతుంటారు
ఎన్నో జన్మల  నుండి
మనకు వారితో అనుబంధం  వుందనిపిస్తుంది
వాళ్ళు చెప్పిన  కొన్ని వాక్యాలు
మన జీవితాలనే మారుస్తాయి
వాళ్ళతో  రెండు క్షణాల పరిచయం
మన ఎద లోతుల్ని తట్టి లేపుతాయి
జీవన సత్యాలు కొన్ని మనకు
అసత్యాలుగానే  అన్పిస్తాయి
అపరిచిత వ్యక్తుల  అవ్యక్త  సహాయాలు
మనం  ఇట్టె మరచిపోతాము
వాళ్ళ కోసం మనం మళ్లీ వెతికినా
వాళ్ళు మాయ మైపోతారు

వాళ్ళే నేమో  మనుషుల్లో  తిరిగే దేవుళ్ళు !



భాను  వారాణాసి
23. 01 , 2015
సీయాటెల్, usa

No comments:

Post a Comment