Tuesday, November 25, 2025

నేను శాంతిని కోరుకోవడం లేదు!

 




నేను శాంతిని కోరుకోవడం లేదు!

---------------------------

నా అక్షరాలు విస్పోటనాలై

నా ఎదలో మండే జ్వాలలు

ఆ ఉగ్రవాదుల్ని దహించే దాకా

నేను నిద్ర పోను!

శాంతి మంత్రాలు జపించడం ఆపండి
ఉన్మాదులకు శాంతి మంత్రాలు తల కెక్కవు

పచ్చని చెట్ల మీద మొలుస్తున్న అగ్ని పుష్పాలు

నదుల్లో  మునిగి తేలుతున్న చిల్లర శవాలు


కొండల మధ్య  పారుతున్న రక్తపు టేరులు

అవును అగ్ని పర్వతాలు లావాను ప్రసవించాయి

మనిషి హృదయం ఒక అగ్ని పర్వతమే!
రక్తాన్ని మూట గట్టుకొని పచ్చని బ్రతుకుల్ని‌

రుధిరంతో అభిషేకం  చేస్తున్నాడు

ఉగ్రవాదం ఇప్పుడు వేయి తలల విష సర్పం

మానవత్వాన్ని మంట కలుపు తున్నది
మూర్ఖత్వానికి చిరునామా వాడు !
ప్రపంచాన్ని కబళించాలని చూస్తున్నాడు‌!
నా అక్షరాలు నిలువెల్ల కంపిస్తున్నాయి
నేను ఇప్పుడు  మరణ శాసనం వ్రాయడానికే వచ్చాను

ఉన్మాది లక్షణాలతో  కొందరు వూగి పోతున్నప్పుడు

ప్రపంచం నిస్సహాయ స్థితిలో దిక్కులు చూస్తున్నప్పుడు

నేను శాంతిని కోరుకోవడం లేదు!
ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఫిరంగిలా

ఈ వుగ్రవాదాన్ని అంతం చెయ్యాలి!


వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు

11.11.2025



No comments:

Post a Comment