Monday, October 12, 2015

అన్వేషణ

 అన్వేషణ


నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి
నాకు  కొన్ని పరిధులు ఉన్నాయి
నాకు కొన్ని నిబద్ధతలు ఉన్నాయి
నాకు కొన్ని  ప్రామాణికాలు ఉన్నాయి
నాకు కొన్ని  అవరోధాలు ఉన్నాయి
నాకు కొన్ని అవకాశాలు ఉన్నాయి

అవును
నన్ను నేను అప్పుడప్పుడు ప్రక్షాళన  చేసుకొంటాను
నన్ను నేను  అప్పుడప్పుడు  పరీక్షించు  కొంటాను

అవును
నువ్వు నన్ను వేలెత్తి చూపినపుడు
నీ వ్రేళ్ళ మధ్య నుంచి  వెలుగులా జారి పోతాను
నువ్వు నా కోసం  కార్చిచ్చు  వై  అడువుల్ని  వెతుకుతున్నపుడు
నీ  పిడికిలి  మధ్య  చీకటినై  నీ  గుండె గోడల్లో  మృత కణాన్నై  పడి  ఉంటాను

అవును
కన బడే  ముళ్ళ కంపల్ని  ఎత్తి  వాడిన అంకురాల్ని  పొదివి పట్టుకొన్నా
అగ్ని గుండం లోకి  జారి పోతున్న  కీటకాల్ని   గుండెకు  హత్తుకొన్నా
వ్యవస్థల  అవస్థలలో  కూరుకు పోయిన  పిపీలకల్ని బయటకు తీస్తున్నా
కుల మత  పంజరాల్లో  ఇరుక్కుపోయిన  శాంతి కపోతాల్ని కాపాడుతున్నా

అవును
నేను కవిని !

అక్షరాల బీజాక్షరాల్తో 
కొన్ని సూర్య మండలాల్ని  వెలిగిస్తాను
కొన్ని కొత్త గ్రహాల కోసం
అన్వేషణ మొదలు పెడతాను

అవును
నేను కవిని !








Saturday, October 10, 2015

ఏది కవిత్వం? ఏది కుకవిత్వం? ఏది సుకవిత్వం ?


ఏది కవిత్వం? ఏది కుకవిత్వం? ఏది సుకవిత్వం ?


కవిత్వం అంటే ఏమిటి? కోన్ని మంచి మాటలు చెప్పడం , సమాజాన్ని జాగృతి  చెయ్యడం , అన్యాయాన్ని వేలెత్తి చూపడం , ప్రజల మనో భావాల్ని   దెబ్బ తినకుండా వ్రాయడం .

ఈ ఆమధ్య వ్రాస్తున్న కవులు తెగ ఆవేశ  పడి  పోయి  ఏది  వ్రాయచ్చో , ఏది వ్రాయ  గూడదో  అని తెలియకుండా  , నోటి కి ఏది వస్తే అది వ్రాయడం , వచన కవిత్వం గదా అని ప్రతి ఒకడు ఏదో  ఒకటి వ్రాయడం అలవాటై పొయింది . ముఖ పుస్తకం , blogs వచ్చిన తర్వాత  ఈ  జబ్బు చాలా  ముదిరి పోయింది  . ఎందుకంటే  ముఖ పుస్తకంలో  సంపాదకులు  గానీ , కవితను సరి  చూసి  పబ్లిష్  చెయ్యడానికి  ఎవరు ఉండరు . ఇక్కడ  కవి రాసింది  రాసినట్లు గానే  post  చెయ్యబడుతుంది .  గాంధీ  చంపినా వాడు గాడ్సే . గాంధీ  మంచి  వాడు , మహత్ముడు . మరి గాడ్సే గూడా   మంచి వాడే మరి కొందరికి  . ఒక వర్గం  కవులు గాంధీ  ని గురించి రాస్తే , ఇంకొక వర్గం కవులు గాడ్సే గూడా గొప్ప వాడని రాస్తారు. అంటే ఒకే  విషయం మీద , రెండు విభిన్న  వైరుధ్యాలు  గన  బడుతాయి. అమ్మ మంచిదా , నాన్న మంచోడా అని అడిగితే   , ఇద్దరు మంచోళ్ళే  అన్న బిడ్డ లా కవి  తన అశావహ దృక్పథాన్ని , విషయ పరిజ్ఞానాన్ని  ,  ఒక  positive belief  ని balanced  approach  తో అలవరచు కొవాలి.  కవి  తాను  వ్రాస్తున్న  విషయం  మీద  సమన్వయ  న్యాయం  చెయ్యగలగాలి.

కులాల  గురించి పరస్పర దూషణలు చేసుకోవడం, ఇతర మతాల్ని కించ పరచడం,   ఒకరి ఆహారపు అలవాట్లను  , వేష భాషల్ని, వారి సంప్రదాయాల్ని  అగౌరవ పరచడం లాంటి విషయాల మీద కవులు  రాయక పోవడం మంచిది. చైనా లో కుక్కల్ని , జపాన్ లో కప్పల్ని తింటారు. కొందరు ఎలుకల్ని , బొద్దింక ల్ని గూడా కొందరు  తింటారు . అవి మన లాంటి దేశాల్లో  తినరు. అలా అని వాళ్ళని అసహ్యించు కొంటమా ?

 కవి  ఏ విషయాన్ని అయినా బాహ్య దృష్టి , అంతర్గత దృష్టి తో చూడ గలిగినప్పుడే   రాణిస్తాడు .  తన చెప్ప  దలచు కొన్న దేదో  నిర్మోహ మాటం గా రాయ గలిగిన వాడే  మంచి  కవి. కొన్ని  సమాజ సహజ  సూత్రాలను బట్టి కవి  మసలు కొవాలి. సమాజం కంటే కవి గొప్ప వాడు గాదు.  తండ్రి కూతురు మధ్య , అన్న చెల్లెళ్ళ మధ్య  అనురాగం ఉంటుంది గానీ , sexual  perceptions ఉండవు . ఆ మధ్య ఒక కవి  ,' నాన్న నా యోనిలో ...'  అని ఒక కవితను రాసి  మళ్లీ  డిలీట్  చేశారు . అంటే ఆత ను చెప్ప దలచు కొన్నది  child sexual molest  మీద. గానీ రాస్తున్నది బూతు  కవిత్వం .

చెప్పదలచు కొన్నది ఒకటి  , రాస్తున్నది  వేరొకటి  అయితే ఆ కవిత్వానికి  విలువ ఏముంటుంది ? పద ప్రయోగాలు చెయ్యాలనే  ఆరాటం ,  తనకు  తప్ప వేరే వాళ్లకు అర్థం గాకుండా వ్రాయడం ఈ  మధ్య fashion  అయిపొయింది .
చిన్న చిన్న పదాలతో , పామరులకు గూడా  అర్థమయ్యే రీతిలో కవులు వ్రాయ లేరా ?

'' దేశ  మంటే  మట్టి  గాదోయ్ ! దేశ  మంటే  మనుషులోయ్ !!'' అన్న గురుజాడ  కవితలో గొప్ప పద ప్రయోగం ఏమి లేదు కదా ?

(డిస్క్లైమర్; ఇది ఎవరిని ఉద్దేశించి రాసినది  గాదు .ఇది  కేవలం నా  వ్యక్తిగత అభిప్రాయం  మాత్రమే )

Friday, October 2, 2015

అగ్నిపూలు

అగ్నిపూలు



అదిగో
ఆ బురద నీటిలో  ఆకలి చేపలు
ఎలా  తల్లడిల్లుతున్నాయో
ఎలా  మల్లగుల్లాలు  పడుతున్నాయో  చూడు
తాటాకు  చప్పుళ్ళలో
వాన చినుకు  శబ్దంలో
గుండె  గూడై
చూరు  చెరువై
ఎండ మావై
భ్రమలు  కల్పిస్తున్న  జీవితం
తలక్రిందులై  కన్పిస్తుంది నాకు
ఈ  మాయా  దర్పణంలో

అదిగో
జీవ  హరితాన్ని  హరించి
పేలవంగా  బొమికలతో
శ్మశానంలో  పీనుగు కాలిన
పొగల్లా  పారాడే
శిలల్లాంటి  శవాలు
బ్రతుకే  చూడని  అనుభవాలు

అదిగో
మానవ హారానికి
దారాల్లా నిలబడ్డ కాగడాలు
వెలుతురు  చుక్కలు మ్రింగి
చీకటి  తుఫానులో
చిక్కుకొన్న వాళ్ళు
దిక్కూ మొక్కూ  లేక
అసృక్కుల  ఏరులో
అప్రచ్చన్నమైన   అహ్రీకులు
వాళ్ళ  ఘర్మ  జలానికి
వాళ్ళ ధర్మ జలానికి
రాలి పడ్డ  శ్వేత  బిందువులు
నేల  మీద  పడి  అగ్ని  పూలవుతున్నాయి
వాళ్ళు  పలికిన ప్రతి మాట
అంకుశం తగిలిన భూమిలో
అంకురమై
అక్షరమై
జన జాతిని  జాగృతం   చేస్తుంది
మానవత   పరిమళాల్ని  వెదజల్లుతుంది