సంక్రాంతి పండుగ
---------------
నగర జీవితంలో అపార్టుమెంటుల్లో ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్న మనకు
భోగిమంటలు వేసుకోవడానికి చోటెక్కడిది?
ద్వారాలకు తోరణాలు కట్టడానికి మామిడాకు లెక్కడివి?
పిల్లలకు భోగిపళ్ళు పోయడానికి తీరికెక్కడిది?
పండగ రోజు తలంటు పోసుకొని అభ్యంగన స్నానం చెయ్యడానికి ఓపికెక్కడిది?
బాల్యం గుర్తుకొచ్చి మనసంతా బాధగా ఉంది!
ముగ్గుల్లో గుమ్మడి పూల గొబ్బెమ్మలతో ప్రతి గృహమూ శోభిస్తూ వుండేది
హరిదాసుల , గంగిరెద్దుల ఆట పాటలు గుండె లోతుల్లో ఆనందపు టంచులు చూసేవి
ఇల్లంతా అయిన వాళ్ళ ప్రేమానురాగాలతో అల్లుకొని పొయ్యేది
పిండి వంటల ఘుమ ఘుమలు , అరిటాకుల్లో విందు భోజనాలు , పొంగళ్ళు , పాయసాలు
అరవై ఏళ్ళ జీవితం నగరానికి అంకితమై పోగా బాల్య స్మృతులు మిగిలి పొయ్యాయి
అపార్టుమెంటు గదిలో అతుక్కొని పోయిన బ్రతుకు
ఒంటి స్థంభం మేడలో పరీక్షత్తు మహరాజు బ్రతుకులా మిగిలి పోయింది
అమెరికాలో ఆ మూల సౌధంబులో కొడుకు, కోడలు అల్లుడు ,కూతురు ,పిల్లలు
వీడియో కాల్ లో సంక్రాంతి శుభాకాంక్షల పలకరింపులు
గంగిరెద్దుల విన్యాసాలకు , హరిదాసు కీర్తనలకు శిల్పారామం వుందిగా!
పిండి వంటల విందు భోజనాలకు స్విగ్గీ లో ఆర్డరు
కృత్తిమ జీవితంలో కృత్తిమ ఆనందాలు , కల్తీ భాంధవ్యాలు , మమతల మరీచకలు
సంక్రాంతి పండక్కి ఎక్కడుంది క్రాంతి?
పండక్కి అందరూ కలవాలనేది ఒక భ్రాంతి !
సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే సంక్రాంతి!
అయిన వాళ్ళందరూ ఒక చోట కలిస్తేనే పండగ కాంతి!
_____________________________________
వారణాసి భానుమూర్తి రావు
14.01.2023
అంతా మనం చేసుకొన్నదే కదా, భూత కాలం గురించి ఎంత వగచినా మానసిక ఒత్తిడి తప్ప వేరే సుఖం ఏమన్నా ఉందా??
ReplyDelete