Monday, January 16, 2023

సంక్రాంతి పండుగ

 


సంక్రాంతి పండుగ
---------------

నగర జీవితంలో అపార్టుమెంటుల్లో ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్న మనకు
భోగిమంటలు వేసుకోవడానికి చోటెక్కడిది?
ద్వారాలకు తోరణాలు కట్టడానికి మామిడాకు లెక్కడివి?
పిల్లలకు  భోగిపళ్ళు పోయడానికి తీరికెక్కడిది?
పండగ రోజు తలంటు పోసుకొని అభ్యంగన స్నానం చెయ్యడానికి ఓపికెక్కడిది?

బాల్యం గుర్తుకొచ్చి మనసంతా బాధగా ఉంది!
ముగ్గుల్లో గుమ్మడి పూల గొబ్బెమ్మలతో ప్రతి గృహమూ శోభిస్తూ వుండేది
హరిదాసుల , గంగిరెద్దుల ఆట పాటలు గుండె లోతుల్లో ఆనందపు టంచులు చూసేవి
ఇల్లంతా అయిన వాళ్ళ ప్రేమానురాగాలతో అల్లుకొని పొయ్యేది
పిండి వంటల ఘుమ ఘుమలు , అరిటాకుల్లో విందు భోజనాలు , పొంగళ్ళు , పాయసాలు

అరవై ఏళ్ళ జీవితం నగరానికి అంకితమై పోగా బాల్య స్మృతులు మిగిలి పొయ్యాయి
అపార్టుమెంటు గదిలో అతుక్కొని పోయిన బ్రతుకు
ఒంటి స్థంభం మేడలో పరీక్షత్తు మహరాజు బ్రతుకులా మిగిలి పోయింది
అమెరికాలో  ఆ మూల సౌధంబులో కొడుకు, కోడలు అల్లుడు ,కూతురు ,పిల్లలు
వీడియో కాల్  లో సంక్రాంతి శుభాకాంక్షల పలకరింపులు

గంగిరెద్దుల విన్యాసాలకు , హరిదాసు కీర్తనలకు శిల్పారామం‌ వుందిగా!
పిండి వంటల విందు భోజనాలకు స్విగ్గీ లో ఆర్డరు
కృత్తిమ  జీవితంలో కృత్తిమ ఆనందాలు , కల్తీ భాంధవ్యాలు , మమతల మరీచకలు

సంక్రాంతి పండక్కి ఎక్కడుంది క్రాంతి?
పండక్కి అందరూ కలవాలనేది ఒక భ్రాంతి !
సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే సంక్రాంతి!
అయిన వాళ్ళందరూ ఒక చోట కలిస్తేనే పండగ కాంతి!

_____________________________________

వారణాసి భానుమూర్తి రావు
14.01.2023

Tuesday, January 10, 2023

నేను చెట్టుగా పుడతాను

 




నేను చెట్టుగా పుడతాను
~~~~~ ~~~~~~~~~~

ఇక మనం  అణు బాంబులా విచ్చన్నమై పోవాల్సిందే!

ఇక మనం సునామీలా విరుచుకు పడాల్సిందే!

సింహంలా జూలు విదిల్చి  పులిలా గాండ్రించాల్సిందే!

కొవ్వెక్కిన మృగాళ్ళ అరాచకాలకు బలి అయిన అబలలు రాక్షస సంహారం చెయ్యాల్సిందే!

అభం శుభం తెలియని పసి పిల్లల్ని చిదిమేస్తున్న నర హంతకుల భరతం పట్టాల్సిందే!

నవ మాసాలు మోసి పెంచిన తల్లిని చంపుకొన్న  కిరాతకుడి చేతులు కాళ్ళు తెగ్గొట్టాల్సిందే!

ఆఫీసుల్లో  అమ్మాయిల్ని  కామ కేళీ వస్తువులుగా వాడుకొంటున్న మర్యాద మదన కామ రాజుల్ని  ఇరగ దీయాల్సిందే!

బలవంతపు మత మార్పిడి చేస్తూ  పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న మత పిశాచులను  సిలువ వెయ్యాల్సిందే!

వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తూ వావి వరుసలు మరచి చెలరేగే గార్దభాల్ని  నట్టేట ముంచాల్సిందే!

ప్రజ్వరిల్లిన ప్రచండ భయంకర అక్షరాలు కత్తులై , చుర కత్తులై నరాధముల కుత్తుకలు కత్తరించాల్సిందే!

ఎదురేగుతున్నాను నేను సముద్రాల దిగంతాలకు , ఎగజిమ్ముతున్న లావాల పర్వతాల శిఖరాలకు

నన్ను నేను ఆహుతి చేసుకొని బూడిదగా తిరిగి ఈ మట్టిలో మళ్ళీ వాలుతాను

అప్పుడయినా ప్రక్షాళన చేసుకొన్న సమాజాన్ని చూడడానికి ఒక చెట్టుగా పుడతాను.

వారణాసి భానుమూర్తి రావు

06.01.2023


---------------------------------------------------------