Sunday, June 20, 2021

ముల్కీ ఉద్యమాలు

 



ముల్కీ ఉద్యమాలు

ఉద్యోగం అనేది వ్యక్తులను మానసికంగా బలవంతులను చేస్తుంది. భద్రతాభావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, సమాజంలో మంచి గుర్తింపుని సమకూర్చిపెడుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసిన అంశాలు మూడు. అవి. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. ఇందులో కూడా నియామకాలు లేదా నిధులు ప్రధానమైనవి. ఈ ప్రాంతంలో 1884లో, 1919లో, 1952లో, 1969లో జరిగిన ఉద్యమాల్లో ఉద్యోగాలు ప్రధాన పాత్రపోషించాయి. స్థానికుల ఉద్యోగాలు స్థానికేతరులు పొందారనే ఆందోళనలు జరిగాయి. అంతేకాదు తెలంగాణ ఉద్యమం తలెత్తిన ప్రతీసారి, ఉద్యోగాల మాట వచ్చినప్పుడల్లా ‘ముల్కీ’ అనే మాట వినపడేది. అసలు ముల్కీ అంటే ఏమిటి. ఈ పదం ఎలా మొదలైంది తెలుసుకుంటే ఉద్యోగాల వెనక ఉన్న ఆవేదన అర్థం అవుతుంది.


ముల్కీ ఎక్కడ మొదలైందంటే..

 

‘ముల్కీ’ అంటే స్థానికుడు అని అర్థం. ‘నానముల్కీ’, ‘గైర్‌ముల్కీ’ అంటే స్థానికేతరుడు. దక్కన్‌ రాజకీయ చరిత్రలోనే ముల్కీ ఉద్యమాలు ముఖ్యపాత్ర పోషించాయి. ‘ముల్కీ’ ఉద్యమ మూలాలు మనకు వందల సంవత్సరాల కిందటే కనిపిస్తాయి.. 1294-1351 మధ్య కాలంలో ఖిల్జీ, తుగ్లక్‌ సైన్యాలతోపాటు దక్షిణాదికి వచ్చి స్థిరపడిన వారందరినీ దక్కనీలు అన్నారు. వీరిలో హిందువులు, ముస్లింలు ఉన్నారు. వీరు బహమనీ సుల్తానుల కాలంలో దక్కనీలుగా అంటే స్థానికులుగా పదవులు, ఉద్యోగాలు నిర్వహించారు. ఈ బహమనీ సుల్తానుల పరిపాలన కాలంలోనే ఇరాక్‌, ఇరాన్‌, టర్కీ, అరేబియా దేశాల నుంచి అనేకులు వలస వచ్చి స్థిరపడ్డారు. వీరందరినీ ఆఫాకీలు అనేవారు. అంటే స్థానికేతరులు అని అర్థం. దక్కనీలను ముల్కీలుగా, ఆఫాకీలను గైర్‌ ముల్కీలుగా వ్యవహరించేవారు.

 

ఆ కాలంలో వర్తక, వాణిజ్యాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలు అందించేది. పన్నుల మినహాయింపు ఇచ్చి సౌకర్యాలు కల్పించేది. విదేశాల నుంచి వచ్చిన ఆఫాకీలు వర్తక వాణిజ్యాల్లో చేరి ఆర్థికంగా స్థితిమంతులయ్యారు. సైన్యంలో, ఇతర ఉద్యోగాల్లో ప్రముఖ స్థానాలు ఆక్రమించారు. మంత్రి పదవులు సంపాదించారు. దక్కనీలు అన్ని రంగాల్లో రెండో శ్రేణి పౌరులుగా ఉండేవారు. మొత్తం రాజ్య సంపదలో ఆఫాకీలదే పైచేయి. దక్కనీల వాటా అతి తక్కువ. వారికి చిన్నచిన్న ఉద్యోగాలు మాత్రమే లభించాయి. ప్రభుత్వంలో, పరిపాలనలో ఆఫాకీలే అధికం. వారు అన్ని రకాల ప్రయోజనాలను పొందారు. దీంతో ఆఫాకీలకు, దక్కనీలకు అంతరాలు పెరిగి శత్రుత్వం మొదలైంది. దీనికి మత విభేదాలు కూడా తోడయ్యాయి. ఆఫాకీలంతా షియాలు, దక్కనీలంతా సున్నీలు. ఒకటో అహ్మద్‌షా కాలంలోనే ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

 

ఆయన ప్రధాని హసన్‌ కూడా ‘ఆఫాకి’ వర్గీయుడే. ప్రధానమంత్రి హసన్‌ నాయకత్వంలో సుల్తాన్‌ గుజరాత్‌ మీదకు దండయాత్రకు సైన్యాన్ని పంపాడు. సైన్యంలో కిందిస్థాయి వారంతా దక్కనీలు. వారి సహాయనిరాకరణతో యుద్ధంలో ప్రధాని హసన్‌ ఓడిపోయాడు. ప్రధాని ఫిర్యాదుపై సుల్తాన్‌ అనేకమంది దక్కనీలను ఖైదు చేశాడు. ఉద్యోగాల నుంచి తొలగించాడు. రెండో ఆహ్మద్‌ షా(1436-58) కాలంలో ఈ వైషమ్యాలు మరింత తీవ్రమయ్యాయి. మళ్లీ గుజరాత్‌పై దాడి అదే ప్రధాని హసన్‌ నాయకత్వంలో జరిగింది. మొత్తం పది వేల మంది సైన్యంలో ఏడు వేల మంది దక్కనీలు.

 

మొత్తానికి యుద్ధంలో విజయం సాధించి రాజ్యానికి తిరిగి వస్తుండగా రాత్రిపూట అడవిలో ఒకచోట విశ్రాంతి తీసుకునే సమయంలో దక్కనీలు తమ సేనలతో ప్రధానికి, ఆఫాకీలకు విడిగా కొంతదూరంలో విడిది చేశారు. ఈ వార్త శత్రువులకు తెలిసి ప్రధాని హసన్‌పై దాడిచేసి, అతడిని మిగతా సైనికులను చంపేశారు. చావు తప్పించుకున్న కొంతమంది ఆఫాకీ సైనికులు, చాకన్‌ దుర్గంలో తలదాచుకుని ఆ వార్త సుల్తాన్‌కు చెప్పేందుకు ఇద్దరు దూతలను పంపారు. ఈలోగా దక్కనీలు సుల్తాన్‌కు లేఖ రాసి ప్రధాని హసన్‌కు చెప్పినా వినకుండా అడవిలో ప్రయాణం చేసి చావు తెచ్చుకున్నాడని మిగిలిన ఆఫాకీ సైనికులంతా శత్రువుకు లొంగిపోయే ఆలోచనతో చాకన్‌ దుర్గంలో తలదాచుకున్నారని తెలిపారు.

 

 

ఆ లేఖను నమ్మి సుల్తాన్‌ అక్కడకు వచ్చిన ఇద్దరు దూతలను వధించాడు. దాన్ని ప్రోత్సాహంగా తీసుకున్న దక్కనీ నాయకులు చాకన్‌ దుర్గంలో ఉన్న ఆఫాకీలను విందుకు పిలిచి, నరికి చంపారు. చివరకు నిజం తెలుసుకున్న సుల్తాన్‌ దక్కన్‌ సైనిక కుట్రదారులందరినీ చంపించి, మిగిలినవారిని ఖైదు చేశాడు. ఆఫాకీలకు సన్మానాలు చేసి పూర్వ వైభవాన్ని కల్పించాడు. మూడో అహ్మద్‌షా (1463-82) కాలంలో ప్రధానిగా మళ్లీ ఆఫాకీనే నియమించాడు. ఆయన పేరు గవాన్‌. ఈయన చొరవతో రాజధాని బీదర్‌లో మూడంతస్తుల పెద్ద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అందులో అతి పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఆచార్యులు, విద్యార్థులు అందరూ ఆఫాకీలే. చదువు పూర్తికాగానే వారందరూ రాజుగారి కొలువులో ఉన్నత ఉద్యోగాలు, పదవులు సంపాదించుకున్నారు.

 

 

దీంతో దక్కనీలకు చిన్న ఉద్యోగాలే దిక్కయ్యాయి. ప్రధానిగా గవాన్‌ అమలు చేసిన సంస్కరణలు దక్కనీలకు పూర్తి నష్టం కలిగించాయి. బీదర్‌ పట్టణంలో ఆఫాకీలకు, దక్కనీలకు ఘర్షణలు జరిగి అనేకమంది మరణించారు. ఇటువంటి ముల్కీ, గైర్‌ ముల్కీ అంతఃకలహాలు అనేకం జరిగి చివరకు 1521లో బహమనీ రాజ్యం అంతరించిపోయింది. దాని స్థానంలో ఐదు రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటిలో గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీ రాజ్యం ఒకటి.

 

కుతుబ్‌షాహీల కాలంలో ముల్కీ ఉద్యమాలు

1521లో గోల్కొండలో స్వతంత్ర ‘కుతుబ్‌షాహీ రాజ్యా’న్ని స్థాపించిన కులీకుతుబ్‌షా కూడా ఆఫాకీ అయినా, బహమనీ రాజ్యంలోని ముల్కీ, నాన్‌ముల్కీ ఉద్యమాల ఫలితంగా సంభవించిన రాజ్యపతనం నుంచి గుణపాఠాలు నేర్చుకుని, మళ్లీ అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఈయన స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాడు. స్థానిక తెలుగు భాషను ప్రోత్సహించాడు. అబుల్‌ హసన్‌ తానీషా కాలంలో మాదన్నమంత్రిగా, అక్కన్న పేష్కారుగా పనిచేశారు. కుతుబ్‌షాహీ రాజులు స్థానికుల చరిత్రను, భాష, సంస్కృతులను గౌరవించడంతో ముల్కీ సమస్య తలెత్తలేదు.

 

అసఫ్‌ జాహీల కాలంలో ముల్కీ ఉద్యమాలు

 

ఐదో నిజాం కాలంలోనే ముల్కీ సమస్య మళ్లీ తలెత్తి ఉద్య మాలు బయలుదేరాయి. మొదటి నిజాం దక్కన్‌కు వచ్చినప్పుడు తనవెంట విశ్వాసపాత్రులైన అనుచరులను తీసుకువచ్చారు. అందులో ముస్లింలతోపాటు హిందువులు ముఖ్యంగా కాయస్తులు ఉన్నారు. వీరంతా జాగీర్లు, మంత్రి పదవులతోపాటు ఉన్నత ఉద్యోగాలను చేజిక్కించుకున్నారు. 1857 సిపాయి విప్లవం తర్వాత మొఘల్‌ రాజ్యం అంతరించగానే ఢిల్లీ, లక్నో, ముర్షిదాబాద్‌, అవధ్‌ రాజ్యాల నుంచి పదవులు, ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ఏ కల్లోలం లేని నిజాం రాజ్యంలోకి వలస వచ్చారు. శాంతి భద్రతలతో జీవించడానికి వారికి దక్కన్‌ ఒక్కటే కనబడింది.

 

 

ఒక్క ఉద్యోగులే కాకుండా కవులు, కళాకారులు, వృత్తి విద్యానైపుణ్యం కలిగినవారంతా హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఐదో నిజాం కాలంలో ప్రధాని సర్‌ సాలర్‌జంగ్‌ చేపట్టిన పరిపాలన సంస్కరణల సమయంలో కాయస్తులు, ఖత్రీలు స్థాపించిన అలీగఢ్‌ విశ్వవిద్యాలయం నుంచి విద్యావంతులైన వారిని హైదరాబాద్‌కు ఆహ్వానించాడు. ఈ విధంగా వచ్చినవారు స్థానిక ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి, వారికి బాధ్యతలు అప్పగించి తిరిగి వెనక్కు పోతారని సాలర్‌జంగ్‌ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నాన్‌ముల్కీలు ఇక్కడే తిష్టవేసి, ఉన్న ఉద్యోగాలే కాక, రాబోయే వాటిలో కూడా తమవారినే నియమించుకుని స్థానికులకు అన్యాయం చేసి వారిని అణచివేశారు.

ఇటువంటి పరిస్థితుల్లో ముల్కీ, నాన్‌ ముల్కీ ఉద్యమాలు ఐదో నిజాం కాలంలో బలంగా తలెత్తాయి. ఆ రోజుల్లో నిజాం ఆంతరంగిక కార్యదర్శి పదవికి చాలా ప్రాధాన్యం ఉండేది. ఈ నియామకం విషయంలో నిజాం కు సాలర్‌జంగ్‌తో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. సాలర్‌జంగ్‌కు బ్రిటిషర్ల మద్దతు ఉండటంతో చివరకు ఆయన మాటే నెగ్గింది. నిజాం పరిస్థితి బలహీనమై, చేసేదిలేక పరిపాలన వ్యవహారాల్లో, ఉద్యోగ నియామకాల్లో దివాన్‌కు అన్ని అధికారాలు ఇచ్చాడు. దాంతో సాలర్‌జంగ్‌ అనేకమంది స్థానికులను ఉద్యోగాల నుంచి తొలగించి బయటివారిని నియమించాడు. ఈ కాలంలోనే ఉత్తరప్రదేశ్‌ నుంచి బిల్‌గ్రామి వంశానికి చెందిన అనేకమంది ఇక్కడకు వచ్చి ఉన్నతోద్యోగాలు ఆక్రమించారు.

 

 

బెంగాల్‌ నుంచి అఘోర్‌నాథ్‌ ఛటోపాధ్యాయ మొదలైనవారు, తమిళ దేశం నుంచి ఇంగ్లీష్‌ బాగా వచ్చినవారు హైదరాబాద్‌కు వలస వచ్చారు. దీంతో స్థానికుల జీవితాలు చిందరవందర ఆయ్యాయి. వారందరూ నిజాం నవాబుకు మొరపెట్టుకున్నారు. ఉద్యోగులందరూ ముల్కీ, నాన్‌ ముల్కీలుగా నిట్టనిలువుగా చీలిపోయారు.

 

 

ఆరో నిజాం మహబూబ్‌ అలీ కాలంలో 1880లో పార్సీ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మారింది. అది ప్రజల భాష. ఇంగ్లీష్‌ను తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టారు. అయితే ఉర్దూ, ఇంగ్లీష్‌లో ఏకకాలంలో సమానమైన ప్రావీణ్యం లేక ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం తగ్గడం మొదలైంది. కొంత సమయం, శిక్షణ, ప్రోత్సాహం ఇస్తే వారు తమ నైపుణ్యం పెంచుకునేవారు. అలా జరగకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఉద్యోగాలను ఆక్రమించడం ఎక్కువైంది. పైగా చేసేది ఒకే ఉద్యోగమైనా స్థానికేతరులకు ఎక్కువ జీతభత్యాలు ఇచ్చి స్థానికులను రెండో తరగతి పౌరులుగా అవమానించారు. ముల్కీ ఉద్యమాన్ని శాంతపరచడానికి ప్రభుత్వం ప్రత్యేక హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసును ఏర్పాటుచేసింది. 1888లో ప్రత్యేక గెజిట్‌ను ప్రకటించి ఇక ఈ ఉద్యోగాలన్నీ అర్హతల ప్రకారం నాన్‌ ముల్కీల జోక్యం లేకుండా ముల్కీలకే ఇవ్వాలని నిర్ణయించింది.

 

 

1910 చివరి దశకంలో మహారాజా సర్‌ కిషన్‌ పర్‌షాద్‌ ముల్కీలకు మద్దతుగా కొండంత అండగా నిలిచాడు. స్థానికేతరులపై ఆయన యుద్ధం ప్రకటించాడు. ఇదేకాలంలో బ్రిటిషర్లు కూడా ఆంగ్లేయులను, ఇతరులను హైదరాబాద్‌ రప్పించి ఉద్యోగాల్లో జొప్పించారు. 1901లో కాసన్‌ వాకర్‌ నైజాం దర్బార్‌లో ఫైనాన్స్‌ సెక్రటరీగా నియమితుడై, ఆ తర్వాత ఫైనాన్స్‌ మినిస్టర్‌గా చేశారు. ఇతను 1912 వరకు పదవిలో కొనసాగి ఇష్టం వచ్చినట్లు బయటివారిని ఉద్యోగాల్లో నియమించి అరాచకం సృష్టించాడు. నాన్‌ముల్కీ విషయం ప్రజల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. విద్యావంతుల్లో భయాందోళనలు నెలకొని ఇక తమకు ఉద్యోగాలు దొరకవన్న నిరాశ, నిస్పృహల చివరి అంచుకు చేరుకున్నారు.

 

 

 

ముల్కీ ఉద్యోగులు కూడా తమకు ఇక పదోన్నతులు రావని అభద్రతా భావంలో మునిగిపోయారు. జీతభత్యాల వ్యత్యాసం కూడా వారిని అవమానపరిచింది. అసంతృప్తి సర్వత్రా వ్యాపించి ప్రభుత్వ పాలన యంత్రాంగం ముల్కీ, నాన్‌ ముల్కీలుగా స్పష్టంగా రెండు ముక్కలైంది. మహారాజా సర్‌ కిషన్‌ పర్‌షాద్‌కు, వాకర్‌కు మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైంది. అందుకే మహారాజా సర్‌ కిషన్‌ను ‘‘ముల్కీ ఉద్యమ గాడ్‌ఫాదర్‌’’గా పిలుస్తారు.

 

 

ఈ కాలంలోనే ఓ చిరుద్యోగి నెలకు 200 రూపాయల జీతంతో హోం శాఖలో మొహతమీమ్‌గా పని చేసి, ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, దివాన్‌ కిషన్‌ పర్‌షాద్‌కు అండగా నిలిచాడు. అతను స్వయంగా కవి. నాన్‌ ముల్కీలపై ద్వేషంతో అతను ఉర్దూలో రాసిన కవిత ఇది...

 

‘‘మా ఉద్యోగాలన్నీ అపహరించి మీవారికి అప్పగించావు

నీ కుట్రలన్నీ అమలైతే ఇక చిరుద్యోగాలే మా గతి

నీ వైస్రాయికి భయపడి ఈ దుర్మార్గం చేస్తున్నావేమో

అది నీ అథోగతి స్థానికుల అష్టకష్టాలకూ కొంచెం కనికరించు

ఏదో ఒకరోజు నువ్వు నీ అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలి’’

 

 

ఈ కవిత వాకర్‌ను ఉద్దేశించి రాసినదే. దీన్ని ఒక రాజకీయ కవితగా అందరూ గుర్తించారు. ఆ రోజుల్లో ఇది ముల్కీ ఉద్యమ గీతంగా, ఉద్యోగుల ఉద్యమ గీతంగా ప్రచారం పొందింది. తత్ఫలితంగా ఈ కవిత్వం రాసిన ఆ చిరుద్యోగిని క్రమశిక్షణ చర్య కింద దూర ప్రాంతానికి బదిలీ చేశారు.

 

మహారాజా సర్‌ కిషన్‌ పర్‌షాద్‌ కారణంగా ఆ ఉద్యమం పాక్షికంగా విజయం సాధించింది. నాన్‌ ముల్కీల ఉద్యోగాలన్నీ తాత్కాలిక ఉద్యోగాలుగా పరిగణించారు. తర్వాత కాలంలో రాజకీయ నియామకాల ద్వారా కాకుండా రాతపరీక్షల ద్వారా ప్రభుత్వం ఉద్యోగాల్లో నియామకాలు మొదలయ్యాయి. ప్రమోషన్లలో స్థానిక ఉద్యోగులకు న్యాయం జరిగింది. స్థానిక అభ్యర్థులకు తగినన్ని అర్హతలు ఉంటే బయటివారిని నియమించరాదని ఆజ్ఞలు జారీ అయ్యాయి.

 

 

ఉర్దూ భాషకు కూడా ముల్కీ, నాన్‌ ముల్కీ రంగులు పూశారు. భాషను రెండుగా చీల్చి ఉత్తరాది ఉర్దూ, దక్షిణాది ఉర్దూ అని విభజన చేశారు. నాగరికులు మాత్రమే లఖ్నవీ ఉర్దూ మాట్లాడతారని, అనాగరికులు, అజ్ఞానులు మాత్రం దక్కనీ ఉర్దూ మాట్లాడతారని యాస, భాషలను గాయపరిచారు. 1918లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ బోధన భాషగా ప్రారంభమైంది. అనేక శాస్త్ర గ్రంథాలను ఉర్దూలో అనువదించడానికి, కొత్త గ్రంథాలు ఉర్దూలో రాయడానికి ఉత్తర భారతం నుంచి పండితుల్ని రప్పించగా వారంతా లఖ్నవీ ఉర్దూనే ప్రయోగించారు. 1948లో పోలీసు చర్య జరిగేవరకూ ఉస్మానియా వర్సిటీలో నాన్‌ ముల్కీలదే పెత్తనం.

 

 

ముల్కీహక్కుల పరిరక్షణకు ఏడో నిజాం ఫర్మానా

ముల్కీ హక్కుల పరిరక్షణ కోసం ఏడో నిజాం మీర్‌ ఉస్మాన అలీఖాన 1919లో ఒక ఫర్మానా జారీ చేశాడు. అవే ముల్కీ నిబంధనలు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం ముల్కీలనే నియమించాలని ఆదేశించారు.

 

ఈ ఫర్మానా ప్రకారం ముల్కీలు అంటే....

1. హైదరాబాద్‌ రాష్ట్రంలో జన్మించినవారు మాత్రమే ముల్కీలు

2. ముల్కీ పురుషునికి కలిగిన సంతానం.

3. వలస వచ్చి 15 సంవత్సరాలు సంస్థానంలో స్థిర నివాసం ఉండి తిరిగి తమ ప్రాంతానికి వెళ్లనని ప్రమాణపత్రంపై సంతకం చేసినవారు.

4. ముల్కీ పురుషుని భార్య

ముల్కీలుగా గుర్తింపు పొందాలంటే తాలూక్‌దార్‌(కలెక్టర్‌) స్థాయి అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొని సమర్పించాలనే నియమం పెట్టారు. ఇంకా ముల్కీలు ఎవరు కాదో కూడా ఫర్మానాలో వివరంగా తెలిపాడు. కింది స్థాయి ఉద్యో గాల్లో ఈ ఫర్మానాను కచ్చితంగా అమలు చేశారు.

1930 మొదటి దశకంలో పంజాబ్‌కు చెందిన ఖాన్‌సాహెబ్‌లను నేరుగా అనేక ఉన్నత ఉద్యోగాల్లో నియమించడంతో మళ్లీ గొడవలు తలెత్తాయి. స్థానికుల ప్రమోషన్లు దెబ్బతిన్నాయి. అన్ని శాఖల్లో పరిస్థితి అలాగే ఉంది.

 

1933 ఫర్మానా

ఈ సమయంలో నిజాం రాజు ఒక ఫర్మానా తీసి రాష్ట్ర ఉద్యోగ నియామకాల్లో సమర్థులైన ముల్కీలకే ప్రాధాన్యం ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. ఈ చర్యకు రాష్ట్రమంతా ముల్కీలవైపు నుంచి గొప్ప ప్రతిస్పందన వచ్చి నిజాం నవాబుకు కృతజ్ఞతలు తెలిపారు.



నిజాం ప్రజల సంఘం (ద నిజాం సబ్జెక్ట్స్‌ లీగ్‌)

ముల్కీ ఉద్యమం సాధించిన ఆ విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో 1934లో నిజాం ప్రజల సంఘం(ద నిజాం సబ్జెక్ట్స్‌ లీగ్‌) సంస్థను స్థాపించారు. దీనినే ఉర్దూలో ‘‘జమీయత్‌ రిఫాయామే నిజాం’’ అంటారు. ఈ సంఘం ‘‘హైదరాబాద్‌ ఫర్‌ హైదరాబాదీస్‌’’ అని సంచలనాత్మక నినాదం ఇచ్చింది. చాలామంది మేధావులు ఈ సంఘంలో చురుగ్గా పనిచేశారు. సర్‌ నిజామత్‌ జంగ్‌ ఈ సంస్థకు అధ్యక్షుడు. మాజీ కొత్వాల్‌ రావ్‌ బహదూర్‌ వెంకట్రాంరెడ్డి, మాడపాటి హనుమంతరావు, వామన్‌ నాయక్‌, కాశీనాథ్‌రావ్‌ వైద్య మొదలైనవారు ఇందులో సభ్యులు. ముల్కీల హక్కుల రక్షణే ఈ సంస్థ లక్ష్యం. ఇది 1939 వరకూ చురుగ్గా పనిచేసినా, మజ్లిస్‌ ఆవిర్భావంతో నిర్వీర్యమైంది.

 

ఈ సంస్థ లక్ష్యాలు

1. నిజాం సంస్థానంలోని అనేక కులాల, వర్గాలతో కూడిన ప్రజల్లో స్నేహభావాలను పెంపొందించి ఒకరినొకరు సహకరించుకునేట్లు ప్రయత్నించడం

2. సంస్థానంలోని వివిధ వర్గాల, కులాల పరిస్థితిని బాగుచేయడానికి, వివిధ రకాల ప్రణాళికలు రూపొందించడం.

3. దేశీయుల హక్కులను కాపాడటం, వాటితో ఉత్పన్నమైన బాధ్యతల గురించి తెలియజేయడం

4. ప్రభుత్వం శాసనసభకు బాధ్యత వహించేలా రాజ్యాంగ స్థాపనకు ప్రయత్నించడం

5. హైద్రాబాద్‌ రాష్ట్ర రాజరికపు హక్కులను కాపాడటానికి ప్రయత్నించడం

ఏడో నిజాం కాలం నాటి మరో ఉదంతం కూడా ఉంది. ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రతిరోజు నమాజ్‌ చదివిన తర్వాత దేవుడా! మద్రాసీలను క్షేమంగా ఉంచు’ అని మొక్కేవాడనే కథనం ప్రచారంలో ఉంది. అంటే అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్లని అర్థం. నిజాం ప్రార్థనలోని అంతరార్థం ఆయన అంతరంగికులకు కూడా అర్థం కాలేదు. ఒకనాడు ఒక అంతరంగికుడు దీనిపై ప్రశ్నించడంతో నిజాం ఇలా సమాధానం చెప్పాడు.

‘‘మద్రాసీలు బాగుంటే వాళ్ల తిండి వాళ్లు తింటారు. వాళ్లకు ఏమాత్రం అటూఇటూ అయినా నా ప్రజల నోటి దగ్గర అన్నం గుంజుకుంటారు. నా ప్రజలు అమాయకులు. వీళ్లకు ఏ కష్టం రాకూడదనే అల్లాను ప్రార్థిస్తున్నా’’ మద్రాసు రాష్ట్ర ఆంధ్రుల గుణాన్ని ఏడో నిజాం అనాడే కనిపెట్టాడని చెబుతూ ఈ ఉదంతాన్ని వివరిస్తుంటారు.

 

 

1952 గైర్‌ ముల్కీ ఉద్యమం

సైనిక చర్య తర్వాత నిజాం రాజ్యం భారతదేశంలో విలీనం అయింది. 1949లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో స్థానిక భాషల్లో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బోధన కోసం, ఇతర ప్రభుత్వ వ్యవహారాల కోసం ఇలా ఆంధ్రా ప్రాంతం నుంచి మిడుతల దండులా వచ్చిన తెలంగాణ ప్రాంతానికి వలసలు పెరిగిపోయాయి. దీంతో తెలంగాణలో చదువుకున్న వారికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. విద్యార్థుల్లో అసహనం ప్రారంభమైంది. 1952 జూన్‌ 26 నుంచి ఐదు రోజులపాటు వరంగల్‌ విద్యార్థులు నిరసన, ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఉద్యమానికి మద్దతుగా ‘‘గైర్‌ ముల్కీ గో బ్యాక్‌’’ ఉద్యమం మొదలైంది.

 

 

హైదరాబాద్‌ హితరక్షణ సమితి

పూర్వపు నైజాం ప్రభుత్వంలోని లాయక్‌ అలీ మంత్రివర్గంలో పనిచేసి, 1952లో శాసనసభ్యుడిగా ఉన్న రామాచారి అనే నాయకుడు 1952 ఆగస్టు చివ రి వారంలో ‘‘హైద్రాబాద్‌ హితరక్షణ సమితి’’ని స్థాపించి గైర్‌ ముల్కీలంతా వెనక్కు పోవాలనే నినాదాన్ని ప్రారంభించాడు. వరంగల్‌లో హయగ్రీవాచారి ఆ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గంలోని సభ్యులైన కొండా వెంకటరంగారెడ్డి, డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి పరోక్షంగా ఆ ఉద్యమానికి చేయూతనిచ్చారు. హైద్రాబాదు రాష్ట్రంలో బ్రాహ్మణుల పెత్తనా న్ని అడ్డుకుని తమ పలుకుబడి పెంచుకోవాలనే ఆశతో ఆ ఇద్దరూ ఉద్యమాన్ని ప్రోత్సహించారంటారు. అయితే ఆ తర్వాత అధిష్ఠానం బెరిరింపులతో, బుజ్జగింపులతో మౌనం వహించి తటస్థంగా మారిపోయారు.

 

 

వరంగల్‌లో ఉద్యమానికి శ్రీకారం

మొదట ఈ ఉద్యమం విద్యార్థుల ఆధ్వర్యంలో 1952 జూన్‌ 26న వరంగల్‌లో ప్రారంభమైంది. ఐదు రోజులు కొనసాగి జూలై 31న కింది తీర్మానాన్ని ఆమోదిస్తూ ఉద్యమాన్ని విరమించారు.

 

1. పోలీసు చర్య తర్వాత ప్రభుత్వోద్యాగాల్లో దొంగ ముల్కీ సర్టిఫికెట్ల ద్వారా ప్రవేశించిన సంస్థానేతరులపై విచారణ జరపాలి. అలాంటివారిని ప్రభుత్వం తొలగించి, సంస్థానవాసుల నిరుద్యోగ సమస్య తీర్చాలి.

2. ఇకముందు సరైన రుజువు లేకుండా ముల్కీ సరిఫికెట్ల ఇవ్వరాదని విద్యార్థి యూనియన్‌ కోరుతోంది. ఈ తీర్మానాన్ని వరంగల్‌ కాంగ్రెస్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఎ. బుచ్చయ్య ప్రవేశపెట్టి విద్యార్థులతో అంగీకరింపజేశారు. అంతే కాకుండా హన్మకొండ హైస్కూల్‌ విద్యార్థులతో కూడా అంగీకరింపజేశారు.

1952 ఆగస్టు 7న మళ్లీ ఈ ఉద్యమం ఖమ్మం మెట్టు పట్టణంలో తలెత్తింది. ఇవన్నీ స్పాంటేనియస్‌ ఉద్యమాలు. హైద్రాబాదు రాష్ట్ర ప్రభుత్వంలో ఇతర రాష్ట్ర ఉద్యోగులకు అవకాశం ఇస్తున్నందుకు, అలాగే ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఇక్కడి స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు ఇస్తున్నందుకు నిరసనగా స్థానిక విద్యార్థులు రెండు రోజులు సమ్మె చేశారు. నినాదాలు చేస్తూ వీధుల్లో ప్రదర్శనలు చేశారు. ఆ రాత్రి కొందరు విద్యార్థులు సెలవులో ఉన్న స్థానిక ఇన్‌స్పెక్టర్‌పై దౌర్జన్యం చేశారు.

1952 ఆగస్టు 8న వరంగల్‌ జిల్లా మానుకోటలో స్థానిక విద్యార్థులు సుమారు వెయ్యి మంది స్కూళ్లకు పోకుండా వీధుల్లో ప్రదర్శనలు చేస్తూ ‘నాన్‌ ముల్కీలు వాపసు పోవాలి’ అని నినాదాలు చేశారు. వరంగల్‌ విద్యార్థి సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఆ సమ్మె జరిగింది.

 

 

 

అదే రోజు దినపత్రికల్లో ‘‘ముల్కీ సర్టిఫికెట్ల జారీ నిబంధనల బిగింపు’’ అని వార్త వచ్చింది. ముల్కీ సర్టిఫికెట్లు ఇచ్చే నిబంధనలను దృఢతరం చేసే ఉద్దేశంతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వార్త వచ్చింది. ఆగస్టు చివరి వారంలో హైద్రాబాద్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వరంగల్‌ వచ్చి ఒక సభలో ప్రసంగిస్తూ... విద్యార్థులు ఉద్వేగాలకు లోనుకావద్దనీ, అనవసర వివాదాలు మానుకోవాలని, కొత్త సంగతులు తెలుసుకోవడానికి కాలం వినియోగించుకోవాలని సలహాలు ఇచ్చారు.

 

 

1952 ఆగస్టు 22న హైద్రాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో సమ్మె మొదలైంది. చాలామంది విద్యార్థులు క్లాసులకు హాజరుకాకుండా సమ్మె చేశారు. సికింద్రాబాద్‌లో నాన్‌ ముల్కీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపు చేశారు. అక్కడక్కడ అల్లర్లు జరిగాయి. ఔరంగాబాద్‌లో కూడా ప్రదర్శనలు జరిగాయి. 1952 ఆగస్టు 27న వరంగల్‌లో మళ్లీ విద్యార్థులు సమ్మె చేశారు. ముఖ్యమంత్రి ఎన్ని హామీలు ఇచ్చినా పరాయివారికి సంస్థానంలో ఉద్యోగాలు ఇస్తు న్నందుకు నిరసనగా ఆ రోజు నుంచి నిరవధిక సమ్మె చేయాలని విద్యార్థుల ఐక్యకార్యాచరణ సమితి నిర్ణయించింది.

 

 

1952 ఆగస్టు 29న గైర్‌ ముల్కీ ఆందోళనను కఠినంగా అణచాలని ప్రభుత్వం పోలీసులకు ఆధికారాలు ఇచ్చింది. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై, బస్సులపై, గోడలపై నినాదాలు రాసేవారిని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా ఆగస్టు 30న హన్మకొండ హైస్కూలు విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సంగతి తెలుసుకున్న హైదరాబాద్‌ విద్యార్థులు అగ్గిపిడుగులయ్యారు. అప్పటికే వారు మూడు రోజులుగా సమ్మెలో ఉన్నారు. ఆ రోజు సైఫాబాద్‌ కాలేజీ నుంచి పెద్ద ఊరేగింపు చేశారు.

 

 

అందులో చాలామంది విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఊరేగింపు ఫతేమైదాన్‌ చేరుకోగానే నిజాం కాలేజీ గేట్లు విరగ్గొట్టి లోపలకు దూసుకుపోయారు. తరగతులకు హాజరవుతున్న విద్యార్థులను ఇవతలకు గుంజారు. కుర్చీలు, బెంచీలు విరగ్గొట్టారు. ఆ కాలేజీ విద్యార్థులను కూడా కలుపుకొని ‘‘ఇడ్లీ, సాంబార్‌ గో బ్యాక్‌, గోంగూర పచ్చడి గో బ్యాక్‌’’ అని నినాదాలు చేస్తూ అబిడ్స్‌ వరకూ వెళ్లారు. ఆ రోజు జరిగిన బహిరంగ సభలో అనేకమంది పుర ప్రముఖులు, మేధావులు, విద్యార్థులు ప్రసంగించారు. పోలీసు దౌర్జన్యాన్ని ఖండిస్తూ గైర్‌ ముల్కీలంతా వెనక్కు వెళ్లిపోవాలని తీర్మానించారు. పెద్దపల్లి, సూర్యాపేట లాంటి పట్టణాల్లో కూడా ప్రదర్శనలు, ఊరేగింపులు జరిగాయి.

 

 

సిటీ కాలేజీ ఘటన

1952 సెప్టెంబరు 4న హైద్రాబాదు పాతనగరంలోని సిటీ కాలేజీ విద్యార్థులు తెలంగాణ వారికే ఉద్యోగాలు దొరకాలి, ముల్కీలు కానివారు వెనక్కు పోవాలని నినాదాలు చేస్తూ ఒక ఊరేగింపు నిర్వహించారు. అందులో ఒక విద్యార్థిగా కేశవరావు జాదవ్‌కూడా పాల్గొన్నారు. ఆ ఊరేగింపు మదీనా హోటల్‌ వద్దకు చేరుకోగానే ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే పోలీసులు కాల్పులు జరపడంతో ఒక విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.

 

 

ఈ అల్లర్లతో పక్కనే ఉన్న హైకోర్టులో పని ఆగిపోయింది. దుకాణాలన్నీ మూసేశారు. విద్యార్థులు హాస్పిటల్‌ను చుట్టుముట్టి మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలిసి హాస్పిటల్‌ దగ్గరకు హోం మినిస్టర్‌ దిగంబర్‌ రావ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యదర్శి బాకర్‌ అలీ మీర్జా, అసెంబ్లీలో పిడిఎఫ్‌ ప్రతిపక్ష నాయకుడు వి.డి. దేశ్‌పాండే, పద్మజా నాయుడు వచ్చి మృతదేహాలను బంధువులకు అప్పగిస్తారని, విద్యార్థులంతా ప్రశాంతంగా వెనక్కు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని లెక్కచేయని విద్యార్థులు ఆవేశంతో పత్తర్‌గట్టీ పోలీస్‌స్టేషన్‌ వైపు ఊరేగింపుగా వెళ్లి దానిని తగులబెట్టారు. మదీనా వద్ద జరిగిన పోలీసు కాల్పులకు ఆ స్టేషన్‌ పోలీసులే కారణం. స్టేషన్‌ దహనం అవుతున్నప్పుడు మళ్లీ కాల్పులు జరిగాయి. అందులో మరో విద్యార్థి మరణించాడు. ఆ రోజు మొత్తం నాలుగుసార్లు లాఠీచార్జిలు, రెండు మూడుసార్లు కాల్పులు జరిగాయి. సైన్యం వచ్చింది. మర్నాడు నగరం అంతా సంపూర్ణ హర్తాళ్‌ జరిగింది. దుకాణాలు మూసివేశారు.

 

 

 

వర్తక సంఘాలు తమ మద్దతును పూర్తిగా తెలియజేశాయి. సెప్టెంబరు 5న జంట నగరాల్లో 16 గంటల కర్ఫ్యూ విధించారు. అల్లర్లు ఆగకపోవడంతో మళ్లీ కాల్పులు జరిగాయి. ఈసారి మరో నలుగురు చనిపోయారు. అనేకమందికి గాయాలయ్యాయి. ఆరోజు సుమారు 30 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. రాళ్లు రువ్విన ఘనటల్లో పోలీసు కమిషనర్‌ శివకుమార్‌కు కూడా గాయాలయ్యాయి. ఆ సాయంత్రం ఫతేమైదాన్‌లో బహిరంగసభ జరిగింది. రాజకీయ నాయకులు ప్రసంగించారు. పిడిఎఫ్‌ నాయకుడు వి.డి. దేశ్‌పాండే మాట్లాడుతూ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న విద్యార్థుల డిమాండ్‌ న్యాయమైనదే అని ఒప్పుకొన్నారు.

 

 

సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మహాదేవ్‌సింగ్‌ పోలీసు కాల్పులను ఖండించాడు. గైర్‌ ముల్కీ ఉద్యమానికి సోషలిస్టు పార్టీ తమ సంపూర్ణ మద్దతును తెలిపింది. అరోజు సుల్తాన్‌ బజారులో కృష్ణదేవరాయుల భాషానిలయం స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల హాజరయ్యారు. ఆయన కారును ఆందోళనకారులు తగులబెట్టారు. ఆ రాత్రి ఆయన రేడియోలో ప్రసంగిస్తూ, ‘‘రజాకార్‌, ఆజాద్‌ హైద్రాబాద్‌ సంఘ విద్రోహ శక్తులు ఆ అల్లర్లకు కారణం’’ అని నిందించారు.

 

 

హైద్రాబాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు స్వామి రామానంద్‌ తీర్థ కూడా విద్యార్థులను సంఘ విద్రోహ శక్తులు రెచ్చగొడుతున్నాయని వ్యాఖ్యానించాడు. తర్వాత ఆయన ఉప ఎన్నికల ప్రచారానికి వరంగల్‌ వెళ్లినప్పుడు కోపగించుకున్న ప్రజలు ఆయన కారును తగులబెట్టారు. చివరికి ఆయన సగం కాలిపోయిన కారులోనే హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నారు. హైద్రాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పులకు నిరసనగా బీదర్‌, ఔరంగాబాద్‌లలో కూడా విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు.

 

 

వరంగల్‌లో ఐదు వేల మంది అజంజాహీ మిల్లు కార్మికులు అరగంటసేపు తమ పనిని ఆపి ప్రదర్శనలు, సమ్మె చేశారు. సెప్టెంబరు 8న హన్మకొండలో పది వేల మంది విద్యార్థులు, పౌరులతో పెద్ద ఊరేగింపు, బహిరంగ సభ జరిగింది. అందులో కాళోజీ నారాయణరావు కూడా ఉన్నారు. ఆ నిరసన సభలో కాకతీయ పత్రిక సంపాదకుడు శ్రీనివాసరావు, వ్యాపార సంఘం కార్యదర్శి మృత్యుంజయలింగం, యువజన సంఘం కార్యదర్శి ఆబాగి సత్యనారాయణ ప్రసంగించారు. అలాగే పౌర సంఘాల ఆధ్వర్యంలో కూడా నిరసన సభ జరిగింది. ఆ ఉద్యమంలో జయశంకర్‌ కూడా ఒక విద్యార్థిగా చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరిగే ఒక ప్రదర్శనలో పాల్గొనడానికి ఆయన బస్సులో హన్మకొండ నుంచి వస్తుండగా భువనగిరిలో బస్సు ఆపేశారు.

 

 

ప్రభుత్వ నిర్బంధ విధానం

ఈ ఆందోళనలో 18 మంది చనిపోయారని, వందలాది మంది గాయపడ్డారని అంచనా. జంట నగరాల్లో వారం రోజులపాటు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. సుమారు 350 మంది విద్యార్థులను, పత్రికా విలేకరులను, యువకుల ను అరెస్ట్‌ చేసి వేధించారు. ఉద్యమం ఆగిన తర్వాత సెప్టెంబరు 13న ఎమ్‌.ఎల్‌.ఎ. సయ్యద్‌ హుస్సేనను ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం కింద అరెస్టు చేశారు. ఈయన ’ఆవామ్‌‘ ఉర్దూ పత్రిక సంపాదకుడు. మరో ఉర్దూ పత్రిక సంపాదకురాలు బేగం సాదిక్‌ జహాన్‌ను కూడా పి.డి. చట్టం కింద అరెస్టు చేశారు. హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడంతో ఆమె తర్వాత విడుదల అయ్యారు. తమ పత్రికల్లో నిజాలు రాయడమే వారు చేసిన నేరం.

 

 

ముల్కీ సమస్య రాజకీయ, మతసమస్య కాదని, ఆర్థిక పరమైన సమస్య అని ముఖ్యంగా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసుల్లో నమోదు చేసుకున్న 70 వేల మంది నిరుద్యోగుల సమస్య అని, నాన్‌ ముల్కీలు అందరినీ వెనక్కు పంపి ఆ స్థానాల్లో స్థానికులను నియమించాలని సెప్టెంబరు 11న విశాలాంధ్ర దినపత్రికలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు వి.డి. దేశ్‌పాండే, డాక్టర్‌ రాజ్‌బహదూర్‌ గౌర్‌, వి.కె. ధారే ఒక ప్రకటన చేశారు. ఆ విధంగా 1952 సెప్టెంబరులో జరిగిన గైర్‌ ముల్కీ ఆందోళన ఒక్క బూర్గుల మంత్రివర్గాన్నే గాక అన్ని రాజకీయ పార్టీలను ఒక కుదుపు కుదిపి, వాస్తవాలపై దృష్టి మరల్చింది. సెప్టెంబరు 26న హైద్రాబాద్‌కు వచ్చిన ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, సమస్య న్యాయ విచారణలో ఉన్నందున ప్రస్తుతం తానేమీ వ్యాఖ్యానించనని తప్పుకొన్నారు. అయినా నెహ్రూ ఎప్పుడూ విశాలాంధ్ర స్థాపన పట్ల సుముఖంగా ఉండేవారు కాదు. 1953 అక్టోబర్‌లో ఆయన పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, ‘‘విశాలాంధ్ర వాదన వెనుక దురాక్రమణోద్దేశ ప్రేరిత సామ్రాజ్యవాద తత్వం దాగి ఉంది.’’ అని వ్యాఖ్యానించారు. (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, 17 అక్టోబరు 1953).

 

 

మంత్రివర్గం ఉపసంఘం

గైర్‌ ముల్కీ గో బ్యాక్‌ ఆందోళన ఉధృతిని గమనించిన 1952 సెప్టెంబరు 7న ముల్కీ నిబంధనల పరిశీలన కోసం నలుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. దానిలో సభ్యులు 1. మెహదీ నవాబ్‌ జంగ్‌ బహదూర్‌ 2. కె.వి. రంగారెడ్డి 3. డాక్టర్‌ మెల్కోటే 4. పూల్‌చంద్‌ గాంధీ

అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను పరిశీలించడం, విద్యార్థులను ఇతర సంస్థలను కలుసుకుని వివిధ అభిప్రాయాలను సేకరించి, నివేదిక సమర్పించడం ఆ ఉపసంఘం బాధ్యత.

 

 

జగన్మోహనరెడ్డి కమిటీ

హైద్రాబాద్‌లో పోలీసు కాల్పుల ఘటనపై న్యాయవిచారణ కోసం 1952 సెప్టెంబరు 5న ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి పింగళి జగన్మోహనరెడ్డి కమిటీని నియమించింది. పోలీసు కాల్పుల్లో 18 మంది చనిపోయారని, వందలాది మంది గాయపడ్డారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది.




ముల్కీ అనే భావానికి బీజం ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం పడింది. 1294-1351 మధ్య కాలంలో ఖిల్జీ, తుగ్లక్‌

సైన్యాలతోపాటు దక్షిణాదికి వచ్చి స్థిరపడిన వారందరినీ దక్కనీలు అన్నారు. వీరిలో హిందువులు, ముస్లింలు ఉన్నారు. వీరు బహమనీ సుల్తానుల కాలంలో దక్కనీలుగా అంటే స్థానికులుగా పదవులు, ఉద్యోగాలు నిర్వహించారు. ఈ బహమనీ సుల్తానుల పరిపాలన కాలంలోనే ఇరాక్‌, ఇరాన్‌, టర్కీ, అరేబియా దేశాల నుంచి అనేకులు వలస వచ్చి స్థిరపడ్డారు. వీరందరినీ ఆఫాకీలు అనేవారు. అంటే స్థానికేతరులు అని అర్థం. దక్కనీలను ముల్కీలుగా, ఆఫాకీలను గైర్‌ ముల్కీలుగా వ్యవహరించేవారు.





ప్రస్తుత తెలుగు తరహాలోనే అప్పట్లో ఉర్దూ భాషకు కూడా ముల్కీ, నాన్‌ ముల్కీ రంగులు అంటాయి. నిజాం అధికార భాష అయిన ఉర్దును రెండుగా చీల్చి ఉత్తరాది ఉర్దూ, దక్షిణాది ఉర్దూ అని విభజన చేశారు. నాగరికులు మాత్రమే లఖ్నవీ ఉర్దూ మాట్లాడతారని, అనాగరికులు, అజ్ఞానులు మాత్రం దక్కనీ ఉర్దూ మాట్లాడతారని యాస, భాషలను గాయపరిచారు. 1918లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ బోధన భాషగా ప్రారంభమైంది.



(17-11-15... దిక్సూచి సంచికలో)

- తీగల జాన్‌రెడ్డి





జై ఆంధ్ర ఉద్యమం   మరియు ముల్కి స్త్రైక్ ( ముల్కి నియమాలకు విరుద్ధంగా) 


హైదరాబాదు సంస్థానంలో 1915లో నిజాము జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం ముల్కీ నియమాలు అమలు లోకి వచ్చాయి. వీటి ప్రకారం హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వారు కాని, హైదరాబాదులో కనీసం 15 ఏళ్ళుగా నివసిస్తూ, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. 1969లో ముల్కీ నియమాలు భారతదేశ ప్రజల మౌలిక హక్కులను కాలరాచేటట్లు ఉండటం వలన రాజ్యాంగ విరుద్ధమని[1] భారత అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో ప్రకటించడంతో మొదటి తెలంగాణా ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అయితే 1972లో వేరొక కేసులో అంతకు ముందు తాను చేసిన తీర్పును చెల్లుబాటు కాకుండా ముల్కీ నియమాలను హైదరాబాదులో ఎప్పటినుండో ఉన్న నియమ నిభందనలు కావున వాటిని గౌరవించాలనే ఉద్దేశంతో ముల్కీ నిబంధనలను అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది[2]. ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు పర్యవసానం జై ఆంధ్ర పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి దారితీయటం.


నేపథ్యం

స్వాతంత్ర్యానికి పూర్వమే అమల్లో ఉన్న ఈ నియమాలు రాజ్యాంగబద్ధమే అని 1971 అక్టోబరులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అన్యాయమని, తమ రాష్ట్ర రాజధానిలోనే తాము రెండవ తరగతి పౌరులుగా మారామనే ఆవేదనతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఉద్యమించారు.ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించటానికిశ్రీబాగ్‌ ఒడంబడిక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో- కోస్తా, రాయలసీమ, తెలంగాణ నాయకుల్ని సంతృప్తి పరచటానికి పెద్దమనుషుల ఒప్పందం లాగానే, జై ఆంధ్ర ఉద్యమాన్ని ఆపటంకోసం "ఆరుసూత్రాల పధకం" రచించారు. ఈ ఆరు సూత్రాల పథకం ముందు ఉన్న అన్ని నిబంధనలను రూపుమాపి అమలులోకి వచ్చింది.


ఉద్యమ ప్రస్థానం


కేంద్రప్రభుత్వం రాజీ ప్రతిపాదనగా ఈ నిబంధనల కాలపరిమితి రాజధానిలో 1977 వరకు, మిగతా తెలంగాణలో 1980 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని శాసనం చేసింది. అయితే ఈ ప్రతిపాదన ఆంధ్ర ప్రాంతం వారికి రుచించలేదు. విద్యార్థులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. శాసనసభ స్పీకరు బి.వి.సుబ్బారెడ్డి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ ప్రాంత శాసనసభ్యులంతా తిరుపతిలో సమావేశమై చర్చించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యధిక మంత్రులు రాజీనామా చేసారు.


ఉద్యమం హింసాత్మకంగా జరిగింది. సమైక్యవాదులపై దాడులు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా ఉద్యమాన్ని వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన రాష్ట్రహితం కాదని వాదించింది. ఆ పార్టీ పత్రిక విశాలాంధ్ర దినపత్రికలో ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాసింది. ఉద్యమకారులు పత్రిక ఆఫీసుపై దాడులు చేస్తామని బెదిరించారు.


పరిష్కారం

జనవరి 10 న కాంగ్రెసు పార్టీ తమ ముఖ్యమంత్రి, పి.వి.నరసింహారావు చేత రాజీనామా చేయించి రాష్ట్రపతి పాలన విధించింది. ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం దృఢంగా వ్యవహరించింది. ఉద్యమం ఆపివేయడానికి ఆరు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించింది. ఆ పథకం ఇది [3]:


ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ సంఘాలను రద్దు చేస్తారు.

నాన్ గజిటెడ్ ఉద్యోగాలు, సివిలు అసిస్టెంటు సర్జను ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే ఇస్తారు.

ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమిస్తారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కొరకు రాష్ట్రాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తారు.

హైదరాబాదులో కేంద్రవిశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి దోహదం చేస్తారు.

పై సూత్రాలను చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేస్తారు.

ఉద్యమ కార్యాచరణ సంఘం ఈ పథకాన్ని ఆమోదించింది. 1973 డిసెంబర్లో పార్లమెంటు ఈ ప్రణాళికను 33 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చింది. కేంద్రం రాష్ట్రపతి పాలన తొలగించి జలగం వెంగళరావు నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది.



Tuesday, June 1, 2021

Sanakara bhaashyam by Bharati Tirtha Swamiji , Sringeri



 ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటకీర్తి  ఎప్పుడూ అహంకార పడొద్దు సుమా!  అహంకారం  అనేక రకాలుగా వుంటుంది.నాకు డబ్బు ఉంది  అని కొంతమందికి అహంకారం, నాకు  విద్య వుంది అని కొంత మందికి అధికారం , నాకు శక్తి ఉంది  అని కొంత మందికి అహంకారం. శంకరులన్నారు , ఇవేవీ శాశ్వితం కాదురా నాయనా ,  డబ్బును చూసుకొని,  అధికారం చూసుకొని , బలం చూసుకొని , నీ పాండిత్యం చూసుకో ని  నువ్వు అహంకారం పడుతున్నావ్ ! ఇవి ఏవి శాశ్వతం కావు రా  నాయనా! వీటిని  చూసుకుని నువ్వు అహంకార పడ్డావు అంటే అది చాలా పెద్ద పొరపాటు. మాక్రో  ధన జన యౌవన గర్వం , హరతి నిమేషా కాల సర్వం ..ఇవి అన్నీ నిముషమ్లో హరించుకు పోతాయ్ రా నాయనా, వీటితో ఎందుకు అహంకార పడతావ్? అహంకారం   వచ్చింది అంటే  అప్పుడు మన వల్ల వతప్పు పనులు జరుగు తాయి.  ఈ అహంకారం ఉన్న వాడు తప్పులు చేస్తాడు. వాడు ఏమనుకొంటాడు  అంటే  నన్ను ఎవడు ఏమి చేస్తాడు? నా  ఇష్టం ,  నా దగ్గర డబ్బు ఉంది . నా చేతిలో అహంకారం ఉంది.‌నేను ఏదైనా చేస్తా...నన్ను  అడిగేవాడు లేడు ..కానీ  వాళ్ళందరికీ ఒక విషయం మాత్రం చెప్పాలి.నిన్ను ఇక్కడ ఎవ్వరూ అడిగే వారు లేక పోవచ్చు. కానీ నువ్వు శరీరం విడచి పోయిన తర్వాత అడిగే వాడు ఒకడు ఉన్నాడు.   అక్కడ నువ్వు జవాబు చెప్పాలి.  వాడి దగ్గరకు పోయి నువ్వు  నాకు అధికారం వుంది , నాకు విద్య వుంది,  నాకు డబ్బు వుంది అంటే అక్కడ పప్పులు ఏమీ ఉడకవు.  శంకరుల వారన్నారు.. ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని ఎప్పుడు అహంకారంతో మెలగ వద్దు. ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని తప్పు పనులు చెయ్యవద్దు..నీకు ఐశ్వర్యం  వచ్చింది అనుకుంటున్నావ్ ..ఇది దేవుడిచ్చిన  ఐశ్వర్యం రా నాయనా!   నీ విద్యను, నీ శక్తిని, నీ  ఐశ్వర్యాన్ని  సమాజసేవకు ఉపయోగించాలి. ఈ విధంగా శంకరులు మనకు సామాన్యమైన ఒక వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని గడపాలి అనటానికి అనేక విధమైనటువంటి ఉపదేశములను చేశారు . అందువల్లనే ఆయన కీర్తి  అజరామరము.  ఆయన అవతారం 12 శతాబ్దముల కంటే ఎక్కువ కాలం గడిచినప్పటికీ కూడా  ఆయన పేరు   ఇంకా మననం చేసుకొంటున్నాము.  ఆ శంకరులు ఏదైతే మనకోసం మార్గం చూపించారో  ఆ సన్మార్గంలో మనం వెళ్ళాలి.  దానివల్ల మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించి దీన్ని  ఆచరణ చేస్తూ అదే  విధంగా తమ యొక్క జీవితాలని  జరుపుకోవాలని నేను చెప్పడానికి అభిప్రాయపడుతూ ఈ ఉపన్యాసం ఇంతటితో ముగిస్తున్నాను.