Thursday, July 28, 2016

ప్రస్థానం

ప్రస్థానం
---------------------

నలిగిన , నలిపిన
చింపిన, చించిన
పగిలిన , పిగిలిన
ఒక  వస్తువు ...   విపణి వీధిలో ....
ఒక అంగడి బొమ్మ
నిన్నటి వరకు
ఆడుతూ , తూలుతూ
అందమైన  లోకాన్నీ
అందులోని  ఆర్ణవాన్ని
మాత్రమే  తెలుసు కొన్న  పిచ్చిపిల్ల !
రంగుల  అద్దాల  వెనుక
దాగిన  కలల  ప్రపంచం
రేపటి తన  ఆశల్ని  విస్కీలో  కలిపేసింది
తనకు' రేపు '  గురించే  తెలుసు !
'రేప్'  గురించి అసలు తెలీదే !
కొంత మంది  అమ్మలకు పుట్టిన వాళ్ళు గాదు
కొంత మందికి అప్ప చెల్లెళ్ళ  గురించి అసలు తెలీదు
ఆ  రాక్షసులు   అమ్మ స్తన్యం లో  కామాన్ని తాగి బతికారు
అప్ప చెల్లెళ్ళ  అనురాగాలు మరచి  రొమాన్స్ రౌడీల్లా  తెగ బలిశారు
ఆడతనానికి  వక్ర  భాష్యాలు చెపుతూ  వీధి కుక్కల్లా  విర్ర వీగారు
అన్నయ్య  ల  అనుబంధమే తెలిసిన   ఆ చిన్న తల్లి
గ్యాంగ్ రేపుల  సైకో గాళ్ళ కాళ్ళ  క్రింద  పువ్వై  నలిగి పోయింది
ఇపుడు  చిన్నారులకు కావాల్సింది  కాన్వెంట్ పాఠాలు గాదు
సాఫ్ట్ స్కిల్స్  గాదు , సరిగమలు గాదు  , కూచి పూడి  గాదు
పులి తోలు కప్పుకొన్న నల్ల నక్కల  బిహేవియర్  స్టడీ చెయ్యాలి
అర్థ రాత్రి బెడ్ రూమ్ లో  తన వంటి  మీద పారాడు తున్న మగ  చేతుల్ని నరకాలి
వావి వరసులు మరచి మర్మ స్థానాన్ని  తడుముతున్న మామయ్యల ముఖం మీద ఆసిడ్ పొయ్యాలి
తొడ పాయసాలు పెట్టే  గురువుల  కళ్ళు పొడవాలి
స్నేహం పేరుతొ  బాడీ మాసాజ్ లు చేసే బాయ్ ఫ్రెండ్స్ ని చర్ల పల్లి జైలు  కి చేర్చాలి
వెకిలి చేష్టలు చేసే అంకుళ్ల  బట్ట తల మీద నిప్పుల కుంపటి బోర్లించాలి
ప్రతి  చిన్నారీ  అఘోరాలా  మదాంధుల  శవాల మధ్య  తపస్సు చెయ్యాలి
తల్లు  లారా !  ప్రతి  అమ్మాయికి  అ , ఆ  లతో పాటు అకృత్యాలు , అఘాయిత్యాలు  గురించి చెప్పండి
ఏబీసీడీ  తో పాటు  మృగాళ్లను  కని  పెట్టడం ఎలా  అని  నేర్పించండి
అందమైన  లోకంలో  బ్రహ్మ  జెముడు చెట్లున్నాయని చెప్పండి
అమాంతం నోట్లోకి  లాక్కొనే  విష పుష్పాలు  ఉన్నాయని  చెప్పండి
అంతే  గాదు  ...   కార్నివోరౌస్  లాంటి చెట్లు  మన మధ్య తిరుగుతూ ఉంటాయని చెప్పండి !
ఒక  నవ ప్రస్థానానికి  దారి  చూపండి !!








Saturday, July 16, 2016

కవి హృదయం

కవి  హృదయం


కవి అన్న వాడు సర్వములు తెలిసిన వాడు.  విశ్వ మానవుడు.  విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణినీ , మనుషులయినా , జంతువు అయినా,  చెట్లు చేమ లయినా  ప్రేమించే  మనస్త్వత్వం  కలిగిన   విశ్వ ప్రేమికుడు.  అపుడే జరిగినసంయోగంలో ఫలదీకరణం చెందిన చిన్న అణు మాత్రమయిన పిండాన్ని , తొమ్మిది నెలలు అది పడే బాధల్ని , ఆనందాల్ని  గురించి రాయ గలిగిన వాడు కవి . చెట్టు కొమ్మల్లో ఎక్కడో విరగ బూసిన  పుష్పాన్ని , అందులోని మకరందాన్ని  జుర్రు కొనే  భ్రమరాన్ని , పర పరాగ  సంపర్కాన్ని  రాయ  గలిగిన  వాడు కవి. వెయ్యి సంవత్సరాలకు ముందు , వెయ్యి సంవత్సరాల  తరువాత  గూడా , తన అంతః  దృష్టి  తో  భావ ప్రకంపనాల్ని  కురిపించగలిగిన   మహాత్  భాగ్యాన్ని  కలిగిన  మహా జ్ఞాని  కవి. మట్టి మనసులో దూరి  మట్టి ఆవేదనను విన గలిగే  శక్తి ఉన్నవాడు కవి. రంపపు కోతకు బలి అయ్యే చెట్ల  తపనను , మానవుల  స్వార్థానికి బలి అయ్యే జంతువుల  ఆవేదనను  విని కవి హృదయంతో  దుఃఖించే వాడే కవి. పుష్ప విలాపం , జంతు విలాపం, అభాగ్య జీవుల విలాపం....  ప్రపంచంలో  పీడిత తాడిత బాధా సర్ప ద్రష్టల  విలాపాన్ని  ఎపుడు విన గలిగిన వాడే కవి..

నేను పబ్బుల్లో  తిరుగుతున్నా
నేను  క్లబ్బుల్లో  తిరుగుతున్నా
విచ్చల విడి శృంగార  చేష్టలల్లో పాల్గొన్న గుంపుల్ని  చూస్తున్నా !
కానీ నా కంటికి   కనిపించేవి అవి ...
నా  కవి కంటికి కనిపించే  బొమ్మలు వేరే ...
ఎండిన పెదాలను లిప్ స్టిక్ తో పూసుకొని రసిక ప్రియులకు
క్యాబరే డాన్స్ లు చేస్తూ  బలుపెక్కిన    బండ రాళ్లకు బలి అవుతూ
స్తన్యం కోసం బరువెక్కిన  బ్రాలు   ముక్క లవుతున్నా
సొమ్ము సిల్లి , కళ్ళు తిరిగిన  గుక్క పెట్టి ఏడుస్తున్నచిన్నారులకు
 ఏమని జవాబు చెప్పగలదు ఈ  డాన్సర్  అమ్మ ?
అమ్మ కాదు ...  అందాల బొమ్మ
జీతాల మాటున దాగిన జీవితాలు
అసత్యాలు మాటున దాగిన సత్యాలు
లేరా  మీకు అమ్మలు ?  లేరా మీకు అక్కలు ??
అయ్యల్లారా  ! వదలండి ...
చిన్నారులకు  చను  బాలు  త్రాగించి  వచ్చే వరకు ఆగండి !

ఇలా  కవి హృదయం  ఆక్రోశిస్తుంది ! కవి హృదయం మీద  మళ్ళీ ఎప్పుడయినా రాస్తాను