Friday, October 30, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (25)

సంస్కార సమేత రెడ్డి నాయుడు  (25)

చివరి భాగం.








అంతకు ముందే   సుధాకర్ , దివాకర్ నుండి  వచ్చిన ఆదేశాల ప్రకారం కిరాయి గూండాలు  గుర్రాల మీద వచ్చారు. వారి చేతుల్లో నాటు తుపాకీలు అటూ ఇటూ తిప్పుకొంటూ బయట నిలబడి మాట్లాడుతున్న ఆశోక్ రెడ్డిని గూడా దయ్యాల గుట్ట వైపు తీసుకు వెళ్ళారు కిరాయి గూండాలు.



" ఈ ఇద్దరి వలనే అంట ఈ రెండు వూర్లల్లో మర్డర్లు ..అల్లర్లు చేసుకొని మనుషులు శాంతంగా బతక లేక పోతున్నారంట..ఇద్దర్నీ  ఒకే సారి ఏసెయ్య మన్నారు  దివాకర్ సారు.." అన్నాడు అందులో ఒక కిరాయి గూండా.


గుట్ట మీద ఒక పాడు బడిన సత్రం ఉంది.  ఆ సత్రం  దగ్గరకు పోవాలంటే అక్కడి జనాలకు భయం. అక్కడ దయ్యాలు తిరుగుతా వుంటాయని జనాలల్లో పుకారు పుట్టించి నారు.


అందుకే దానికి దయ్యాల గుట్ట అనే పేరు వచ్చింది. 


"  దివాకరన్న , సుధాకరన్న మిమ్మల్నీ ఇద్దరి తలలు నరికి బాహదా నది ఇసుకలో పూడ్చెయ్య మన్నారు " అన్నాడు ఒక కిరాయి గూండా  . సారాయి పాకెట్ నోటితో చించి గడగడ మని  తాగుతూ తూలు తున్నాడు.  రమ అశోక్ ల  వంక చూస్తూ భయంకరంగా అరుస్తున్నాడు. వాడి చేతిలో పెద్ద సాన పెట్టిన  కత్తి ఉంది. 


అశోక్ ..రమ పెనుగు లాడుతున్నారు. వారు వేసుకొన్న దుస్తులు చినిగి పొయ్యాయి. ఆ పెనుగు‌లాటలో చర్మం గీసుకొని‌ పోయి రక్తం కారుతోంది.


" మిమ్మల్ని ఇద్దర్నీ సంపెయ్యమని మాకు చెప్పినారు. దేవుడ్ని తలచు కోండి..మీ తల కాయలు నరికేస్తాము" అని‌ ఒక్క‌ వుదుటున వారి ముందరికి దూకాడు  ఒక్కడు.


అంతే..బిర బిర మని రెండు పల్లెల నుండి వచ్చిన యువకులు, రైతులు , పాలేర్లు, పిల్లలు, జీత గాళ్ళు పొలో మని వారి వారి చేతుల్లో ఉన్న ఆయుధాలతో ఆ రౌడీలను‌ చితక బాదారు.


కొందరు రౌడీలు పలాయనం చిత్త గించారు.


అంతలోనే ..పరుగు పరుగున రాజ శేఖర రెడ్డి..జయ రామ నాయుడు వచ్చారు. ఆమ్మా..రమా..తల్లీ ..బాగున్నావా ..నన్ను క్షమించమ్మా" అని బావురుమని‌  రమను‌ హత్తుకొని చిన్న పిల్లలా ఏడ్చాడు జయరామ నాయుడు.


రాజ శేఖర రెడ్డి‌ గూడా అశోక్ రెడ్డిని పట్టుకొని‌" దెబ్బలు ఏం తగల్లేదు గదా నాయనా? " అని గట్టిగా హత్తుకొని కళ్ళళ్ళో నీళ్ళు పెట్టుకొన్నాడు.


ఆయాసంతో రొప్పుతూ వున్న తండ్రిని  చూసి " నా కేమీ కాలేదు నాయనా" అని ధైర్యం చెప్పింది రమ. 


అంత లోనే ఇద్దరి పల్లెల దివాన్లు వచ్చారు.


" ఇప్పటి కైనా అర్థం అయ్యింది కదా? రహస్యం తెలిసింది గదా? కొట్లాటలు మాని అందరూ సుఖంగా ఉందాం. రెండు పల్లెల ప్రజల్ని సుఖ పెట్టుదాం. బీదా బిక్కీ ఈ కొట్లాటల్లో నలిగి పోతున్నారు" అన్నాడు శర్మ గారు.


" రాజ శేఖరా...నన్ను క్షమించు" అని నాయుడు గారు రెడ్డి గారిని గట్టిగా హత్తుకొని ఏడ్చి నాడు.


" నువ్వే నన్ను క్షమించాలి...ఇద్దరమూ ఒక్కరినొక్కరు అర్థం చేసు కోకుండా ఎచ్చులకు పోయి  పల్లెల్లో  జనాల బతుకుల్ని బజారు పాలు చేశాము..కక్షలు ..కోపాలు మన కొద్దు..ప్రశాంతంగా జీవిద్దాం.'  అన్నాడు రెడ్డి గారు నాయుడి గారి కళ్ళు తుడుస్తూ.


" నాయనా..దీని కంతటికీ కారణం మేము.. ఉన్నవీ లేనివీ మీకు కల్పించి అబద్దాలు చెప్పి అన్న దమ్ముల్లాంటి మీ మనసుల్ని పాడు చేసినాము...మీ మధ్య కొట్లాటలు పెట్టాము. అవింత దూరం పోతాయని అను కోలేదు. చెల్లమ్మా ..నన్ను క్షమించు..అశోక్ ..నన్ను క్షమించు.."  


అని రమను, అశోక్ ను హత్తుకొంటు క్షమాపణలు కోరినారు సుధాకర్ , దివాకర్ అన్నదమ్ములిద్దరూ.


ఆనందంతో మళ్ళీ రెండు పల్లెల వారు‌ పోలేరమ్మ ఆశీస్సుల కోసం  నాయిడు గారి పల్లెకు బయలు దేరినారు.


బ్రహ్మాండమైన స్వాగతాలతో ..భాజా భజంత్రీలతో ...ప్రతి ఒక్కరూ రెండు కుటుంబాల వారికీ స్వాగతం పలుకుతూ , అందరి మీదా పూల జల్లును కురిపించారు.


రెండు కుటుంబాల వారి అమ్మ వారి ఆశీస్సులు అందుకొన్నారు.


దేవతలు ఆశీస్సులు అంద చేసి నట్లుగా సన్నని వర్షపు జల్లు కురిసింది.

**************************************************

మూడేళ్ళ తరువాత

రమ కి అశోక్ తో అంగరంగ వైభవోపేతంగా వివాహం జరిపించారు. పది పల్లెల వాళ్ళు పది వేల మంది పెళ్ళికి హాజరయ్యారు. 


పెళ్ళి  జరిగిన తీరు , విందు భోజనాల గురించి కథలు కథలుగా చెప్పుకొన్నారు జనాలు.


సంవత్సరం తిరగక ముందే పండంటి బిడ్డకు జన్మ ఇచ్చింది రమ.


బారసాల ఘనంగా చేశారు రాజ శేఖర రెడ్డి గారు.


బాబుని పొత్తిళ్ళ లోకి తీసుకొంటూ " ఏమి పేరు పెడదాము? " అని అడిగాడు జయ రామ నాయుడ్ని.

కొందరు వారికి ఇష్టమైన పేర్లు చెప్పారు.


కొందరు రెడ్డి వీర శేఖర అని ఇద్దరి ముత్తాతల పేర్లు వచ్చేటట్లు పెడితే బాగుంటుంది అన్నారు.


రాజ శేఖర రెడ్డి బాబుని చూస్తూ.." నా మనమడికి నేనే పేరు పెడతా" అన్నాడు.


అందరూ ఆయన ఏమి పేరు పెడతాడో అని వేచి ఉన్నారు.


" రెడ్డి నాయుడు" అని గట్టిగా నవ్వాడు.


ఆ పరిసరాలన్నీ ఆనందంతో చప్పట్లతో మారు మోగి పోయింది.


బాబుని అందరూ " ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధి రస్తు" అని అక్షింతలతో దీవించారు.

***********************************************

                           శుభం  భూయాత్!

        అందరూ సుఖ సంతోషాలతో ఉందురు గాక!!


వారణాసి భానుమూర్తి రావు

రచయిత



(ఈ కథలోని ఏ భాగాన్నైనా , ఏ సన్ని వేశాన్ని అయినా రచయిత వ్రాత పూర్వక అంగీకారం లేకుండా ఎక్కడయినా వాడుకొన్నా, సంగ్రహించినా , ఏ సినిమా లోనూ , ఏ టీవీ సీరియళ్ళలోనూ  కొన్ని సన్ని వేశాల్ని కాపీ చేసినా , అనుసరణ చేసినా ఎలాంటి  కాపీ హక్కులు ఉల్లంఘించినా చట్టరీత్యా చర్యలు తీసుకోబడును..) 


25 రోజులుగా 5.10.2020 నుండి 30.10.2020 వరకు ఈ నా   ధారావాహిక ను ప్రోత్సహిస్తూ వచ్చిన పాఠక దేవుళ్ళకూ,  నా ఈ ధారావాహికను ప్రచురించడానికి అనుమతి తెలిపిన అనంత సాహిత్య వేదిక రధ సారధి శ్రీ హరి హర గారికి నా ధన్య వాదములు తెలుపు కొంటున్నాను. అలాగే  మిగతా అడ్మిన్ లకు నా ధన్యవాదములు. ఈ నవలను పుస్తక రూపంలో తేవడానికి  ప్రయత్నిస్తాను. ఇది నా మొదటి నవలా ప్రక్రియ.ఆదరించిన కవి మితృలకు అభివందనాలు.


వారణాసి భానుమూర్తి రావు

రచయిత

హైదరాబాదు.

30.10.2020


సంస్కార సమేత రెడ్డి నాయుడు (24)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు (24)


ఇరవై నాలుగవ భాగం

--------------------------------------------------

రాజకీయ కక్షలతో, హత్యలతో ఉట్టడుకుతున్న రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గున మండే టట్లు ఉన్నది.


ఈ చర్యలు , ప్రతీకార చర్యలు   ఇంతటితో ఆగేటట్లు లేవు. ఈ వర్గాల పోరు గురించి చిత్తూరు జిల్లా గాకుండా రాయల సీమలో అంతా కథలు కథలు గా చెప్పుకొంటున్నారు. 


ఈ సారి  ఆషాడ మాసంలో పోలేరమ్మ కు బోనాల పండగ ఘనంగా చెయ్యాలను కొన్నారు జయరామ నాయుడు గారు.


ఎంత ఘనంగా అంటే రెడ్డి వారి పల్లెలో వాళ్ళంతా కుళ్ళి కుళ్ళి సావల్ల అనేట్లు....ధూంధాం  చెయ్యల్ల అని అను కొన్నాడు జయరామ  నాయుడు గారు . సుధాకర్ ,  దివాకర్ మరియు మిగతా గ్రామ పెద్దల్ని పిలచి అందరూ కలసి కూర్చొని  మాట్లాడుకొన్నారు.



" అయితే ఒక కండిషన్..ఆ పల్లెలోంచి  ఒక్క పురుగు ఇక్కడ కనబడినా కాల్చి పారేస్తారు మనోళ్ళు. అక్కడి కాకులు గూడా పల్లె మీద వాలడానికి వీల్లేదు నాయనా" అని అన్నాడు సుధాకర్ కోపంగా..


అప్పుడు అశోక్ రెడ్డి బిక్షగాడి వేషంలో వచ్చినట్లు ఈ సారి వస్తే తుపాకీతో కాల్చి పారేస్తానన్నాడు  దివాకర్.


కోపంతో అన్న దమ్ములు ఇద్దరూ వూగి పోతున్నారు.


" ఈ సారి పెద్ద ..చిన్న అని చూసేది లేదు అన్నా.. కనబడినోళ్ళను  నిలబెట్టి నరకడమే..ఎట్ల అమ్మోరు బలి కోరుకొంటుంది గదా" అన్నాడు ఆ గుంపులో ఒక పెద్దాయన.


ఇంటి ముందర వరండాలో కూర్చొన్న ఈ పెద్ద మనుషుల మాటలన్నీ మణెమ్మ విని‌ భయంతో వణికి పోయింది. ముచ్చెమటలు పట్టి ఒళ్ళంతా కంపర మిచ్చింది. ఎన్ని తలకాయలు తెగి పోతాయో...ఇంకా ఏమి ఉపద్రవం ముంచు కొస్తుందో అని భయ పడి పోయింది.


ఆ నోటా ఈ నోటా ఈ విషయం ప్రాకి రాజ శేఖర రెడ్డి గారి  చెవిన పడింది.


" ఈ సారి పోలేరమ్మ జాతర ఘనంగా చేసు కొంటారంట.ఏమైనా తేడా వస్తే రెండు పెద్ద తల కాయల్ని లేపేస్తామని అని మాట్లాడు కొంటున్నారంట వాళ్ళు " అని‌ ఒకాయన రెడ్డి గారి కి ఈ వార్త అందించాడు.


రాజ శేఖర రెడ్డి కోపంతో రగిలి పొయ్యాడు. నిప్పు తొక్కిన వాడిలా కోపంతో వూగి పొయ్యాడు.


" ఇక్కడ ఎవ్వరూ గాజులు తొడుక్కోలేదు అని చెప్పు..రెండు తల కాయలు మనవి తెగితే వాళ్ళవి  ఆరు తలకాయలు తెగుతాయి. ఆడ మగ అని చూడకుండా లేపేస్తాం. మన సీమ రెడ్ల కత ఇంకా  తెలీదేమో..మంచికి ప్రాణం ఇస్తాం.. లేదంటే అడ్డంగా నరుకు తాం" అని నాగు పాములా బుసలు కొట్టాడు రాజ శేఖర రెడ్డి.


ఆ రోజు పది మంది తన నమ్మక మైన వాళ్ళను  పిలిపించుకొని , వారితో దీర్ఘంగా రహస్య సమాలోచన చేశాడు.


" మనూర్లో ఉండే వాళ్ళకందరికీ చెప్పండి..ఏరు దాటి ఆ పల్లె పరిసరాలకు గూడా పోవద్దని. వాళ్ళు పోలేరమ్మ బోనాలు చేసుకొన్నా , ఇంకేమి చేసుకొన్నా ఎవ్వరూ అక్కడికి పోవద్దని చెప్పండి. సావు కొని తెచ్చు కోవద్దని చెప్పండి. ఇంకో ముఖ్య మైన విషయం ఏమిటంటే ..ప్రతి ఇంట్లో కొడవలో , గొడ్డలో , కత్తో, బాకో , చింత కాయలు కోసే దోటి కొడవలో ఏదో ఒకటి బాగా నూరుకోని పదును పెట్టుకొమ్మని చెప్పండి. ఏ క్షణాన ఏ యుద్దం జరుగు తుందో చెప్పలేం " అని రహస్యంగా మాట్లాడుకొన్నారు రెడ్డి గారు తనకు కావలిసిన నమ్మక మైన వాళ్ళతో..



రాత్రికి రాత్రే వూరంతా గుప్పు మనింది ఈ వార్త. కానీ ఎవ్వరూ ఎవ్వరితో మాట్లాడ డానికి సాహసించడం లేదు. ఎవరింట్లో వాళ్ళు కత్తులు , కటారులు పదును పెట్టు కొంటున్నారు. ఒక పెద్ద చెకి ముకి రాయి నున్నగా ఉంటుంది.. ఆ రాయికి పెట్టి కత్తులు నూరుతారు పల్లెల్లో.


" నిజం ఎవ్వరూ చెప్పడం లేదు..చుట్టాలు వస్తా వుండారు. అందుకే జీవాల్ని కొయ్యల్ల ..అందుకే కత్తులు నూరు కొంటా వుండాము" అని అడిగితే చెప్పతా వున్నారు.


పల్లె పల్లెంతా రాత్రంతా ప్రతి ఇంటినుండి ' సుయ్ సుయ్'   అనే కత్తులు ..కోడవళ్ళు పదును పెట్టడానికి నూరుతున్న శబ్ధాలు వినబడుతున్నాయి. గుండెలు ఝల్లుమనే ఆ శబ్ధాలు విని పల్లెలోని ముసలోళ్ళ ప్రాణాలు పైననే పోతున్నాయి.


*****************************************************


పోలేరమ్మ బోనాల పండగ రానే వచ్చింది.


నాయుడు గారి పల్లె అంతా సంబరాలలో మునిగి పొయ్యారు. అందరూ స్నానాలు ముగించుకొని కొత్త బట్టలు తొడుక్కొన్నారు.


పిల్లలు , పెద్దలూ పరుగులు పెట్టుకొంటూ పోలేరమ్మ  గుడికి చేరు కొంటున్నారు. 


సుధాకర్..దివాకర్ ..ఎక్కడ చూసినా వారే పనుల్ని చూసుకొంటూ అందరినీ పరామర్శిస్తూ కలియ తిరుగు తున్నారు.


అమ్మవారి విగ్రహం భయంకరంగా ఉంది.  ఆరడుగుల విగ్రహం , నల్ల రాతితో చేసిన పోలేరమ్మ విగ్రహం ..మెడలో నిమ్మ కాయల దండ..వేపాకు మండలు..కుంకుమ ..పసుపు ..ధూప దీప నైవేద్యాలు తో అమ్మవారు మిల మిల మెరుస్తా ఉంది.

గుడి బయట విశాల మైన రాతి బండల అరుగును ఏర్పాటు చేసినారు. అక్కడే కోడ్లను..మేకల్ని బలి ఇస్తారు అమ్మ వారికి.


' అయ్యా..వూరు వూరంతా అమ్మ వారి పండగ చేసుకొంటున్నారు. రమను గూడా  గుడికి పంపుదాము. అది ఏడుస్తా ఉండాది" అంది మణెమ్మ.


" సరే...అమ్మి తో నువ్వే కాపలా ఉండు. అమ్మిని జాగ్రత్తగా చూసుకో! " అన్నాడు జయ రామ నాయుడు.


రమ ..మణెమ్మల సంతోషానికి అవధులు  లేవు. 


స్నానాలు చేసుకొని మంచి పట్టు లంగా, వోణి వేసుకొని , బంగారు గాజులు, ముత్యాల హారం , మామిడి పిందెల బంగారు హారం  వేసుకొనింది రమ. ముహాన ఎర్ర కుంకుమ బొట్టు పెట్టుకొని, చెంపల మీద చందనం రాసుకొనింది. మణెమ్మ , నిర్మలమ్మ ఆశ్చర్య పొయ్యారు రమను చూస్తూ..


" అచ్చం..  కనక దుర్గమ్మ తల్లిలా ఉన్నావు. నీ ముహంలో ఏదో దివ్య శక్తి ఉందమ్మా" అని నిర్మలమ్మ. కూతుర్ని హత్తుకొని దీవించింది.


ఇంటిలో కెళ్ళి పళ్ళెంలో సున్నము , పసుపు నీళ్ళు కలుపు కొని మూడు సార్లు దిష్టి తీసింది నిర్మలమ్మ.


నిర్మలమ్మ ఒక్క  పసుపు, కుంకుమ ,వేపాకులు కలిపిన నీళ్ళు ఒక కుండలో నింపి నెత్తిన పెట్టుకొనింది.


మణెమ్మ అన్నం, బెల్లం , పెరుగు కలిపిన అన్నాన్ని ఒక బుట్టలో పెట్టుకొని నెత్తిన పెట్టుకొనింది.


రమ అమ్మ వారికి సమర్పించే పూలు, పళ్ళు, టెంకాయలు వున్న  సంచీని పట్టుకొంది.


నిర్మలమ్మ, మణెమ్మలు గూడా పట్టు చీరలు కట్టుకొని , రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టు పెట్టుకొని, మెడలో రెండు పేటల బంగారు హారం వేసుకొని  గుడి వైపు బయలు దేరారు .‌


ఈ సారి గుడి ప్రత్యేకంగా అలంకరించారు. గుడి పరిసరాలు  శుభ్రం చేసి గుడికి రంగులు వేశారు.


విశాల మైన చలువ తాటాకు వెదురు పందిళ్ళు..రంగు రంగుల కాగితాలు వ్రేలాడుతున్నాయి.


ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే అప్పుడే కొత్తగా వచ్చిన గ్రామ్ ఫోన్ రికార్డ్లు, ఆహుజా వారి లౌడ్ స్పీకర్లు. అందులోంచి వచ్చే సినిమా పాటలు, భక్తి పాటలు నాలుగైదు వూర్ల దూరంలో గూడా విన బడుతోంది.


రెడ్డి వారి పల్లె కు గూడా విన బడుతోంది ఆ పాటల శబ్ధం..

రాత్రిళ్ళు వెలుగు కోసం గ్రామాని కంతా సరిపొయ్యే పెట్రో మాక్సు లైట్లు ఓ యాభై తెప్పించి అక్కడక్కడా వేలాడ దీశారు.


రంగం సిద్ద మయ్యింది.

నాయుడు గారిబ్పల్లెలో మామూలుగా అమ్మవారు ఈరన్న కుటుంబం లో వారికి వస్తుంది.


బాగా అలంకరించి..ముగ్గులు పెట్టిన తావు లోకి వచ్చి చెబుతాడు ఈరన్న.గుంపులు గుంపులు చేరి ఈరన్న కోసం కాచుకొని ఉన్నారు.


నాయుడు గారి కుటుంబ సభ్యులు అందరూ అక్కడే కుర్చీలల్లో కూర్చొని ఈరన్న కోసం కాచుకొని ఉన్నారు.


సుధాకర్ గట్టిగా అరచాడు.."పదుకొండు దాటి పోతావుంది..అమ్మోరు ఏం చెప్పుతుందో అని అందరూ కాచు కోని ఉండారు.. ఎక్కడా ఆ ఈరన్న..పోయి పిలుచు కోని రండి" అని తన మనుషుల్ని పంపినాడు.



కొంతమంది  " అమ్మా తల్లీ కాపాడు.. " అని గట్టిగా అరుస్తూ టెంకాయలు కొడుతున్నారు. కొంత మంది అమ్మ వారిని చూస్తూనే పూనకం పట్టినట్లు వూగి పోతున్నారు. కొంత మంది పోత రాజులు డప్పు పలకల దరువుతో ఎగురుతూ నృత్యం చేస్తున్నారు.


లౌడ్ స్పీకర్లు ఎవ్వరో కట్టేశారు. వద్దని దివాకర్ చెప్పడంతో.

" రంగం లోకి ఈరన్న కొంచెం సేపట్లో వస్తాడు..అందరూ నిశ్శబ్ధంగా ఉండండి.అమ్మోరు మనల్ని దీవిస్తారు. అమ్మోరు చెప్పేది అందరూ బాగా చెవులు బెట్టి వినండి" అని సుధాకర్ గట్టిగా అన్నాడు.


అంతే..ఒక్క సారిగా నిశ్శబ్దంగా మారి పొయ్యాయి ఆ పరిసరాలు. ఎవ్వరూ మాట్లాడ డానికి సాహసించ లేదు.


అందరూ ఈరన్న కోసం కాచుకొని ఉన్నారు. కానీ ఈరన్న రాలేదు.


ఒక్క సారిగా రమ ఎగిరి గంతేసింది. చేతుల్లో ఉన్న పళ్ళేన్ని విసిరి వేసింది. ఆమె ముఖం ఒక్క సారిగా రౌద్రం దాల్చింది. ముక్కు పుటాలు, కను బొమలు అదురు తున్నాయి . నోరు వంకరలు పోతోంది. చేతులూ..కాళ్ళూ తిప్పుతూ నృత్యం చేస్తోంది.


అక్కడున్న  వారికి అర్థం అయి పోయింది.అమ్మ వారు రమలో ఆవాహన అయ్యిందని అందరికీ తెలిసి పోయింది.


అంతలో అక్కడున్న వారికి  ఈరన్న తెలివి తప్పి పడి పొయ్యాడని తెలిసింది. తెలివి వచ్చినాక రంగంకి వస్తాడని తెలిసింది.


" అమ్మా..ఏదో తప్పు జరిగింది..శాంతించు తల్లీ" అని అక్కడున్న ప్రజలు  రమకు దండాలు  వంగి వంగి పెడుతున్నారు.


రమలో శక్తి ఇంకా ఎక్కువయ్యింది.


పది మంది ఆడ వాళ్ళు పట్టుకొన్నా వారి చేత కావడం లేదు..


వారి పట్టు విదిలించుకొని రమ రంగం మీదకు పోయింది.


" ఒరేయ్ ..ఈ రోజు నేను భవిష్యత్తు చెబుతాను. శాంతంగా వినండి. ఈరన్నను నేనే రావద్దన్నాను. " అంది  రమ వూగి పోతూ.


" అమ్మా..మా వల్ల ఏమైన తప్పు జరిగుంటే క్షమించు..మేమేమి సెయ్యాల్నో సెప్పు" అన్నాడు ఒక పెద్దాయన రమ పక్కన నిల బెడి దండం పెడుతూ..


" గ్రామ ప్రజ లారా..మీకు ఒక రహస్యం చెప్తాను. రెడ్డప్ప నాయుడు చని పోతూ ఒక రహస్యం దాచి నారు. అది ఆయన సమాధి కుడి పక్క వెండి పళ్ళెం లో దాచి పెట్టినాడు..పోయి తీసుకు రండి" అంది రమ.


అందరూ ఆశ్చ్యర్య పోయ్యారు.


సుధాకర్ , దివాకర్ ఇంకా కొంత మంది పెద్ద మనుషులతో వారి తాత గారి సమాధికి వెళ్ళి కుడి వైపు గునపంతో తవ్వి వెండి పెట్టెను పైకి తీశారు.


పరుగు పరుగున రొప్పుకొంటూ ఆ పెట్టెను జయరామ నాయుడికి ఇచ్చారు.


ఆ చిన్న పెట్టెను పగల గొట్టి లోపల రాగి రేకు మీదున్న ఉత్తరాన్ని చదివాడు.


అంతే..ఆ రహస్యం చదివిన జయ రామ నాయుడు కళ్ళు తిరిగి పడి పోయ్యాడు


ఏమిటి?? జయరామ నాయుడు తండ్రి గారు వీర కేశవ రెడ్డీనా? రాజ శేఖర రెడ్డి తండ్రి గారు రెడ్డప్ప నాయుడా? అని అక్కడున్న ప్రజలంతా ముక్కున వేలేసుకొన్నారు.


ఆ రహస్యం అందరికీ తెలిసి పోయింది.


" ఇది అమ్మోరు కలలో చెప్పిందంటా ఆ రోజు..అట్లా చేస్తే బిడ్డలు బతుకు తారంట..." అని అక్కడున్న జనాలంతా మాట్లాడు కొంటున్నారు.


ఇంతలో ఒక పాత జీపులో ఒక పది మంది  గూండాల్లా ఉన్నారు.పొలో మని దిగినారు. వాళ్ళ చేతుల్లో నాటు తుపాకీలు ఉన్నాయి. అక్కడున్న ప్రజలంతా భయపడి పోయి తలకు ఒక దిక్కు పారి పొయ్యారు.


ఆ కిరాయి గూండాలు రమను ఎత్తుకొని జీపులో ఎత్తి వేసి క్షణాల్లో అక్కడి నుండి మాయ మయ్యారు.


వూర్లోని యువకులు , పెద్దోళ్ళు, పిల్లోళ్ళు చేతికి ఏది దొరికితే ఆ ఆయుధాన్ని తీసుకొని ఆ జీపు వెంబడీ పరుగెత్తారు.


కొందరి చేతుల్లో కత్తులు , కటార్లు, కట్టెలు, బాకులు, రాళ్ళు తీసుకొని పరుగెత్తారు.


బాహుదా నది పక్క మట్టి రోడ్డు వెంబడీ  రెండు మైళ్ళు పోయి దయ్యాల గుట్ట కింద జీపు ఆపి  గుట్ట పైకి మెడ బట్టి లాక్కోని పొయ్యారు రమను  ఆ గూండాలు. రమ చేస్తున్న ఆర్త నాదాలతో ఆ  దయ్యాల గుట్ట ప్రతిధ్వనిస్తోంది.. పులి నోట్లో   చిక్కుకొన్న లేగ దూడ  వలే రమ గడ గడ మని వణికి పోతోంది.

**********************************************************************************************(తరువాత ఏమయ్యిందో రేపు  ఇరవై  ఐదవ భాగం ( చివరి? ) లో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి.

Copy Rights with Author 

Wednesday, October 28, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (23)


 సంస్కార సమేత రెడ్డి నాయుడు (23)

ఇరవై మూడవ భాగం

-------------------------------------------------------------


  పాతికేళ్ళ తరువాత ...


ఒక్క రోజు రెడ్డప్ప నాయుడు గారు మణెమ్మను పిలిచి నాడు గది లోకి.


" మణెమ్మా..." 


" అయ్యా!"


" పదహారేళ్ళప్పుడు  ఇంటికి వచ్చి మాతోనే కట్టమో..నష్టమో మా తోనే ఉండావు. పెళ్ళి గూడా సేసు కోకుండా మా కోసం నీ జీవితం త్యాగం చేసినావు..మేము ఎంత జేసినా నీ ఋణం తీర్చు కోలేము అమ్మా! " అని చెబుతూ వుంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగి నాయి. బొంగురు పోయిన కంఠంతో వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటు తువ్వాలుతో కన్నీళ్ళను తుడుచుకొన్నాడు ఎనభైఏళ్ళ రెడ్డప్ప నాయుడు గారు.



" అట్లా అనొద్దు అయ్యా...ఆ రోజు మీరు ఈ ఇంటిలో నన్ను నమ్మి నాకొక స్తానం ఇచ్చినారు. లేదంటే నా జీవితం కుక్కలు సింపిన ఇస్తరి అయి పొయ్యేది" అని రెండు చేతులూ ఎత్తి దండం పెట్టింది. మణెమ్మ కు గూడా దుఃఖం ఆగింది కాదు..చీర కొంగుతో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొనింది.



" నువ్వు సావధానంగా విను మణెమ్మా! ..నీకు ఒక రహస్యం చెప్పుతాను. ఈ రహస్యం ఇంత వరకూ ఎవ్వరికీ తెలియదు ..నువ్వు గూడా ఎవ్వరికీ చెప్పోద్దు .." అన్నాడు రెడ్డప్ప నాయుడు.


" నాకు వయసు అయి పోతా ఉండాది. నాకు ఆరోగ్యం గూడా బాగా లేదు. రేపో మాపో సావు దగ్గరకు వస్తుంది.‌వీర కేశవ రెడ్డి ఆరోగ్యం ఏం బాగాలేదు ..ఆయన మంచాన పడి శ్యానా రోజులు అయ్యింది.  ఈ పొద్దో ..రేపో అన్నట్లున్నాము ఇద్దరమూ..అందుకే ఈ రహస్యం నీకు చెబుతున్నా" 

మణెమ్మ ఆశ్చ్యర్యంతో చూసింది రెడ్డప్ప నాయుడు గారిని.


నాయుడు గారు మొత్తం  పైన జరిగిన కథ అంతా వివరంగా చెప్పినారు మణెమ్మకు ..బాహుదా నదిలో ఎట్లా బిడ్డల్ని మార్చుకొనిందీ ..ఎందుకు మార్చ వలసి వచ్చిందీ ..ఎట్లా మణెమ్మకు , తన భార్యకు గూడా తెలీకుండా బిడ్డను మార్చిందీ అంతా వివరంగా చెప్పినాడు.


మణెమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు బొట బొట మని రాలాయి.


" ఈ రహస్యం అమ్మ గారికి గూడ చెప్పకుండా ఎట్ల దాచినారు అయ్యా? "


" బిడ్డల భవిష్యత్తు కోసం " అన్నాడు రెడ్డప్ప నాయుడు గారు.


" ఇదో ఈ రాగి రేకులో ఆ రహస్యం అంతా రాసినా. ఈ వెండి పెట్టెలో ఈ రాగి రేకు పెట్టి తాళం వేసినా .. నేను సచ్చి పోయినాక నా సమాధిలో దాచి పెట్టు" 

అన్నాడు రెడ్డప్ప నాయుడు.


" అలాగే అయ్యా" అని ఆ చిన్న పెట్టెను తీసుకొని తన గదిలో ఒక రహస్య మాళిగలో దాచి పెట్టింది.


ఆరు నెలల తరువాత రెడ్డప్ప నాయుడు..ఆ  తరువాత రెండు నెలలకు వీర కేశవ రెడ్డి కాలం చేశారు. 


ఒక రోజు అర్థ రాతిరి మణెమ్మ రెడ్డప్ప నాయుడు సమాధిని తవ్వి  వెండి పెట్టెను లోపల దాచి పెట్టి మళ్ళీ సున్నంతో కప్పి ఏమీ తెలీనట్లు వచ్చి పడుకొనింది.

***********************************************



" ఇదమ్మా ..జరిగిన కథ " అని‌ మణెమ్మ  రమను హత్తుకొని ఏడుస్తూ అంది.


" పెద్దమ్మా..ఇంత రహస్యాన్ని  కడుపులో ఎట్లా ఇన్నేళ్ళు  దాచుకొన్నావు?   అంది రమ.


" వీర కేశవ రెడ్డి కొడుకుగా రెడ్డప్ప నాయుడు కొడుకు, రెడ్డప్ప నాయుడు  కొడుకుగా వీర కేశవ రెడ్డి కొడుకు ఒకరికి తెలియ కుండా ఇంకొక్కరు పెరుగుతున్నారు. ఈ రహస్యం ఒక్క పెద్దోళ్ళ కిద్దరికేనా తెలిసిండేది?  నాయనకు గూడా తెలీదా తన జన్మ రహస్యం ? " అంది రమ.


" అవునమ్మా..తెలీదు" అంది మణెమ్మ.


" ఈ రహస్యం ఒక్క పెద్దోళ్ళ కిద్దరికే తెలుసు.వాళ్ళూ సచ్చి పోయినారు. వుండేది నువ్వే..పెద్దమ్మా..ఈ హత్యలు..రాజ కీయాలు ఈ రహస్యం తెలిస్తే  నిలచి పోతాయా? " అని అడిగింది రమ.


" తలకాయలు నరుక్కొనే కాడికి వచ్చినారు గదమ్మా..ఈ కత చెప్పితే నమ్ముతారా? కట్టుకత అని నా తల నరుకు తారు" అని చెప్పింది  మణెమ్మ. 


రమ కి ఏమీ అర్థం కాలేదు..ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలీక మణెమ్మ ఒడిలో పడుకొని అలాగే నిద్ర పోయింది. 

********************************************

***********************************************(తరువాత ఏమయ్యిందో రేపు  ఇరవై  నాలుగవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి.

Copy Rights with Author 


Tuesday, October 27, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (22)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు 

ఇరవై రెండవ భాగం(22)

--------------------++++++-------------------------





ఆ రోజు రాత్రి పడుకొన్నాడన్న మాటే గానీ వీర కేశవ రెడ్డి గారికి నిద్ర పట్ట లేదు. అమ్మవారు రంగంలో చెప్పిన విషయం ఇంకా అర్థం కావడం లేదు. అలాగే ఆ రాత్రంతా అదే ఆలోచిస్తూ నిద్ర పొయ్యాడు.


ఆ రాత్రి  వేకువ జామున రెడ్డి గారికి. ఒక కల వచ్చింది.   ఎవ్వరో ఒక దివ్య శక్తి   కన బడి మీకు పుట్టబొయ్యే బిడ్డల్ని మార్చుకోండి నాయనా..అంతా మంచి జరుగుతుంది‌ అని చెప్పి నట్లయింది.  ..ఒక్క సారిగా ఉలిక్కి పడి లేచాడు. అంతే .ఆ తరువాత నిద్ర పోకుండా ఈ విషయమే ఆలోచించాడు. తెల్లవారి ఝామున వచ్చే కలలు నిజమవుతుందని అంటారు . తెల తెల్ల వారుతోంది. ఆ కల నిగూడార్థం ఇప్పుడిప్పుడే అర్థ మవుతోంది..


అమ్మ వారు చెప్పినట్లు రెండు కుండలు మార్చు కోవాలి..అంటే..అంటే... ఈ విషయం చెబితే నాయుడు గారు ఒప్పుకొంటాడా? అసలు తమ భార్యలు ఈ మార్పిడిని అసలు ఒప్పుకోరు. తొమ్మిది నెలలు మోసి  ప్రసవించిన స్వంత బిడ్డను వేరే వారికి ఇవ్వడానికి ఏ తల్లయినా ఎలా ఒప్పుకొంటుంది? కానీ మళ్ళీ  అదే జరిగితే ఈ పుత్ర శోకాన్ని భరించ లేము..ఈ సారి  ఏదయినా జరగ రానిది జరిగితే తమ భార్యలు భరించ గలరా? 


తెల్ల వారింది.


పరుగు పరుగున కాలకృత్యాలు ,  అల్పాహారం ముగించు కొని వీర కేశవ రెడ్డి  నాయుడు గారి పల్లెకు బయలు దేరారు. ఇంటిలో గూడా ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్ళి పొయ్యాడు.


నాయుడు గారి పల్లెకు ఇంత తెల్ల వారుతూనే  అర్ధాంతరంగా వచ్చిన రెడ్డి గారిని చూసి రెడ్డప్ప నాయుడు ఆశ్చ్యర్య‌ పొయ్యాడు. 


" కబురంపితే నేనే వస్తిని గద అప్పా ? " అన్నాడు రెడ్డప్ప నాయుడు.


" కొంచెం పని ఉండాదిలే అన్నా ..అందుకే వచ్చినాను. నీతో కొన్ని రహస్యాలు మాట్లాడల్ల" అనగానే ఇద్దరూ ఒక రహస్య గది లోనికి వెళ్ళి మాట్లాడుకొన్నారు.


నిన్న రంగం లో జరిగిన కథ, అమ్మ వారు తన కలలో కనబడిన విషయం..కుండలు మార్చు కోవడమంటే పుట్టే బిడ్డల్ని మార్చు కొంటే పుత్ర శోకం ఉండదని ..జరిగిన దంతా వివరంగా చెప్పాడు వీర కేశవ  రెడ్డి.


ఆశ్చ్యర్యంగా అంతా విన్నాడు నాయుడు గారు.

"అది జరుగుతుందా? అసలు ఈ అడోళ్ళు ఒప్పుకొంటారా? "అన్నాడు రెడ్డప్ప నాయుడు గారు.


" అదంతా నేను చూసు కొంటానులే అన్నా" అన్నాడు రెడ్డి గారు.

***************************************************

తొమ్మిది నెలలు గడిచాయి.


ఆ రోజు ఉదయం నుండే   ఇటు రెడ్డి గారి భార్యకు, అటు నాయుడు గారి భార్యకు పురిటి నొప్పులు ప్రారంభ మయ్యాయి. 


" జాగ్రత్త వహించాలి ఈ సారయినా..మొన్న పంతులు గారు చెప్పిన ప్రకారం నువ్వు పండ్రెండు గంటలు బిడ్డ మొహం చూడగూడదంట..మొదటి సారి చూసే టప్పుడు అద్దంలో నీ బిడ్డ మొహం చూడల్లంట" 

అని చెప్పునాడు వీర కేశవ రెడ్డి..


" అట్లాగే...బిడ్డ బాగు కంటేనా? " అని తలూపుంది రెడ్డి గారి భార్య.

**************************************************

నాయుడు గారి పల్లెలో గూడ రెడ్డప్ప నాయుడు భార్య పక్కన కూర్చొని ఇదే విషయం చెప్పినాడు.


" ఇన్ని రోజులూ బిడ్డలు లేరని బాధ పడుతున్నాం ..పండ్రెండు గంటలు చూడకుండా వుండ లేనా ? " అన్నదామె.


ఇద్దరూ నాలుగైదు గంటల తేడాతో పండంటి మగ బిడ్డల్ని ప్రసవించారు. మంత్ర సానులంతా తమ పనులు చేసుకొని ఇళ్ళకు వెళ్ళి పొయ్యారు మళ్ళీ పొద్దున్నే వస్తామని.


అర్థ  రాత్రి దాటింది. వూరంతా గాఢంగా నిద్ర పోతోంది.

గాఢాంధ కారం. కుక్కలు ఎక్కడో పోట్లాడుకొంటున్న శబ్ధం. వీర కేశవ రెడ్డి గారి ఒక పెద్ద కుండను రెండుగా విడదీసి అందులో గడ్డి వేసి దానిమీద మెత్తటి గుడ్డలు వేసి అప్పుడే పుట్టిన పురిటి పసి బిడ్డను తీసుకొని అందులో పండ బెట్టి, నెత్తిన తలపాగా చుట్టుకొని , కుండను నెత్తిన పెట్టుకొని దొడ్డి దారిన గాడాంధ కారంలో కలిసి పొయ్యాడు.


ఒక చరిత్ర తిరిగి రాయాలంటే కొందరు వ్యక్తులు త్యాగాలు చెయ్యాలి. అనూహ్య మైన నిర్ణయాలు తీసు కోవాలి.


అలనాడు శ్రీ కృష్ణ పరమాత్ముని వసుదేవుడు కంసుని బారి నుండి రక్షించడానికి ఒక గంపలో యమునా నదిని దాటి యశోదమ్మ చేతిలో పెట్టాడు గదా! ఆ. చరిత్రే ఇప్పుడు రెండు వంశాలకు, రెండు గ్రామాలకు పునరావృతమయ్యింది.


అదే ఇప్పుడు రెండు కుటుంబాల క్షేమం కొరకు, భవిష్యత్తు కొరకు, రెండు గ్రామాల ప్రజల క్షేమం కొరకు వీర కేశవ  రెడ్డి గారు, రెడ్డప్ప నాయుడు గారు గొప్ప నిర్ణయం తీసుకొన్నారు.


చుట్టూ గాడాంధ కారం.. కప్పలు బెక బెకమంటున్నాయి. ఎక్కడో నక్కలు అరుస్తున్నాయి.  కీచు రాళ్ళ శబ్ధం విన బడుతోంది..తీతవ పక్షులు రాగాలు తీసుకొంటూ ఆకాశంలో  అరుచు కొంటూ వెడుతున్నాయి. రెడ్డి గారు‌ బాహుదా నది వైపు వడివడిగా అడుగులు వేశాడు.


నాయుడు గారి పల్లె నుండి  రెడ్డప్ప నాయుడు గారు అలానే బయలు దేరి నారు.


రాళ్ళు రప్పలు దాటుకొంటూ బాహుదా నదిలో దిగారు ఇద్దరూ..మోకాలి నీటిలో నడచు కొంటూ  ఒక్క సారిగా ఇద్దరూ ఎదురెదురుగా నిలుచున్నారు.


నక్షత్రాల వెలుగు తప్ప వెన్నెల వెలుగు గూడా లేదు. గాఢమైన మబ్బుల మధ్య చందమామ కనబడడం  లేదు.


వణుకు తున్న చేతులతో ఇద్దరూ బిడ్డల్ని కుండలతో సహా మార్చుకొని వెంటనే బయలు దేరారు.


ఆ హృదయాలు ఎంత వేదన చెందుతున్నాయో..ఆ కళ్ళల్లో తడిని ఇద్దరూ గమనించ లేక పొయ్యారు.


ఇద్దరి గమ్యం మూడవ కంటికి తెలియ కుండా ఇల్లు చేరడమే..


రాత్రి మూడు గంటలు దాటింది.‌ 


వీర కేశవ రెడ్డి గారు ఇల్లు చేరి బిడ్డను తన భార్య పక్కన పండ బెట్టి ఏమీ తెలియని వాడిలా తన గది లోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించాడు.


అట్లాగే  రెడ్డప్ప నాయుడు గారు గూడా పొంగుతున్న దుఖాన్ని ఆపుకొంటూ బిడ్డను తల్లి పక్కన చేర్చి పడుకొన్నాడు.


విధి ఎలా ఆడిస్తే అలా ఆడాలి మనుషులు. ఏది ఎలా జరుగు తుందో అలాగే  జరుగుతుంది..మనుషులు మనం  నిమిత్త మాత్రులం!


వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకొన్నాడనే సామెత ఇలాంటి సందర్భంలో గుర్తుకు వస్తుంది గదా! 

***********************************************(తరువాత ఏమయ్యిందో రేపు  ఇరవై  మూడవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి.

Copy Rights with Author.

Monday, October 26, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (21)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు 


ఇరవై ఒకటవ భాగం(21)


అనుకొన్నట్లుగానే వీర కేశవ రెడ్డి  రెండు రోజుల తరువాత రెండు గ్రామాల్లోను దండోరా వేయించాడు. 


" వచ్చే ఆషాఢం నెలలో మొదటి ఆది వారం నాడు  మన రెడ్డి వారి పల్లిలో   గంగమ్మ పూజలు జరుగు తాయి. అందరూ మీ కుటుంబాలతో ..బంధువుల తో అమ్మోరికి బోనాలు ఇచ్చుకొవల్ల హో..."  అని పలకలు కొట్టుకొంటూ వెళ్ళాడు.


పిల్లోళ్ళు..పెద్దోళ్ళు...ముసలీ ముతకా ఆనందానికి హద్దే లేక పోయింది. ఎన్ని రోజులకో  గంగమ్మ జాతర జరుగుతా ఉండాది మనూర్లో అని పొంగి పోయినారు వూర్లోని ప్రజలు.


గంగమ్మ  బోనాలుకు పెద్ద జాతర జరుగుతుంది..ఎక్కడ నుండో  చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొనే వాళ్ళు..దాసరోళ్ళు...పూసలు అమ్ముకొనే వాళ్ళు..రంగుల రాట్నం పెట్టే కడప  సాయిబూలు, కమ్మర కట్లు ..మిఠాయిలు అమ్మే మహాల్ సాయిబూలు..గాజులు అమ్మే వాళ్ళు..మూలికలు అమ్మే  చెంచు తెగోళ్ళు..జ్యోతీష్యం చెప్పే కోయ రాజులు అందరూ  వారం రోజుల ముందే అంగళ్ళు పెట్టు కొంటారు.


రెడ్డి వారి పల్లె అమ్మ వారి గుడి ముందర రెండు మూడు ఎకరాలు‌ మైదానం ఉంది. అక్కడే ఈ అంగళ్ళను పెట్టు కొంటారు.


గంగమ్మ పండగ అంటే ఆ చుట్టు ప్రక్కల పది గ్రామాల వాళ్ళూ చేరుతారు.


వీర కేశవ రెడ్డి కుటుంబం అంతా గంగమ్మ పండగ పనుల్లో మునిగి పొయ్యారు.


ఇక పండగ వారం రోజులు ఉన్నందువలన  పనులు చక చక మని చెయ్యాల్సి వస్తోంది.


తాటాకు పందిళ్ళు వెయ్యడం..రంగు కాగితాలు అంటించడం..చలువ నీటి కేంద్రాలు..కొత్త కుండలు కొనేది ...వెదురు బుట్టలు..ఇంకా అమ్మోరి పండక్కి కావలసిన పక్క నున్న  పెద్ద ఊర్లకు పోయి కొనుక్కొస్తున్నారు. గంగమ్మ అమ్మోరి విగ్రహం   గుడి బయట ఉంటుంది.. ఆ విగ్రహాన్ని బాగా కడిగి ..నీళ్ళు పోసి ...వేపాకు మండలు..నిమ్మ కాయలు ..మామిడి ఆకులు  కడతారు.‌ అమ్మోరికి ఎండ తగల కుండా పెద్ద చలువ పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు.


వీర కేశవ  రెడ్డి ..రెడ్డప్ప నాయుడు కలిసి ఈ పండగ ను నిర్వర్తిస్తారు. ఖర్చులుకు వెనక్కి తగ్గరు. రెండు గ్రామాల ప్రజలు తమకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తారు. మూడు రోజులు గంగమ్మ పండగ జరుగుతుంది.. మూడు రోజులు ఇళ్ళళ్ళో పొయ్యి వెలిగించరు. ఇక్కడే ఆమ్మోరికి బలి ఇచ్చే కోడ్లు..మేక పోతుల్ని వండి వడ్డిస్తారు.


ఆది వారం రానే వచ్చింది.


వీర కేశవరెడ్డి కుటుంబమంతా శుభ్రంగా స్నానాదులు ముగించుకొని అమ్మవారి గుడికి చేరారు. అక్కడ జరగ వలసిన పనులన్నీ చూస్తున్నారు. అంతలోనే రెడ్డప్ప నాయుడు కుటుంబ సభ్యులు గూడా వచ్చారు. రెండు గ్రామాల ప్రజలే కాకుండా మిగతా గ్రామ ప్రజలతో సందడిగా ఉంది.  తోలు పలకల శబ్ధాలు..పులి వేష గాళ్ళు, పోత రాజులు, పగటి వేషగాళ్ళు  వాయిస్తున్న డప్పులతో  విపరీతమైన శబ్ధంతో ఆ ప్రదేశం కోలాహలంగా వుంది.


అంతలో ఆ వూరి పెద్దాయన రంగన్న  రంగం లోకి దిగినాడు.అతని వళ్ళంతా కుంకుమ , పసుపు తో నిండి పోయింది. గోచీ కట్టుకొని వేపాకు మండలను మొల చుట్టూ కట్టు కొన్నాడు.పెద్ద పెద్ద వేపాకు కట్టలను రెండు చేతుల్లో పట్టుకొని అందరిని అదిలిస్తూ ..బెదిరిస్తూ ఎర్రగా ఉన్న తన నాలుకను బయటకు చాచి ..చూసే వాళ్ళకు భయం కొలిపేటట్లు వున్నాడు. తన చుట్టూ ఉన్న డప్పుల దరువు అనుగుణంగా ఎగురుతూ చేతులు ఊపుతున్నాడు.


రంగన్న   రంగం లోకి దిగుతూనే అమ్మ వారు  ఆవాహన అయి భవిష్యత్తు గురించి చెబుతాడు.అందుకే ఆయన అంటే అందరికి భక్తి..భయము.


గంగమ్మ వారి విగ్రహం పెద్ద రాతి ఆరుగు మీద నిలబెట్టి ఉంచారు. ఈ రాతి విగ్రహం ఎప్పుడో పూర్వీకులు చెక్కించి ప్రతిష్ఠించారంట.


నల్ల విగ్రహం నాలుక సాచి ఎర్రని కళ్ళతో నిలబడుకొని , ఒక చేతిలో రాక్షసుని తల, ఇంకొక చేతిలో త్రిశూలం ఉంటుంది. మెడలో నిమ్మ కాయల దండ..పూల దండలు..వేపాకు మండలు ఉంచినారు.


ముందర యాట్లు కోసిన జంతువులు రక్తం కారుతూ పడి ఉన్నాయి.


రంగన్న  అమ్మ వారి విగ్రహం ముందర కూర్చొన్నాడు


" అమ్మా ఒక్కొక్కరే రండి" అని పిలిచాడు ఒకాయన.


మొదటి ఇల్లు వీర కేశవ రెడ్డి భార్య ఒక్క కడవ నిండుకు  పసుపు ..వేపాకు కలిపిన నీళ్ళు అతని మీద కుమ్మరించింది.


తరువాత రెండవ ఇల్లు రెడ్డప్ప నాయుడు గారి భార్య కుమ్మరించింది


మిగతా వూర్లోని అమ్మలక్కలంతా ఒక్కరి వెంట ఒక్కరు నిలబడుకొని రంగన్న మీద కడవల కడవల పసుపు , వేపాకులతో కలిపిన  నీళ్ళు   కుమ్మరిస్తున్నారు.


" నూటొక్క గడపలు వచ్చాయా? నూటోక్క గడపలు బోనాలు తెచ్చినారా" అని రంగన్న గట్టిగా అరచి నాడు.అప్పుడే ఆయనకు అమ్మవారు పూనకం పట్టినట్లు వూగుతున్నాడు.


" అమ్మా..కోప్పడకు తల్లీ..అందరూ బోనాలు గూడా తెచ్చినారు" అనగానే ఆ వూరి అమ్మలక్కలు నెత్తిన పెట్టుకొన్న బోనాలను అమ్మ వారి విగ్రహం ప్రక్కన పరచిన ఈత చాపల మీద కుమ్మరించారు.  కొత్త కుండలో..కొత్త బియ్యం..బెల్లం ..పెరుగు కలిపిన అన్నాన్ని అమ్మ వారికి ప్రసాదంగా అర్పించారు.


ఒక పెద్ద గుట్ట లాగా అన్నం అమ్మ  వారి ముందర  సమర్పించారు.


ఒకాయన అమ్మవారికి పెట్టిన అన్నం మీద కుంకుమ .పసుపు చల్లి నాడు.


ఈ ప్రసాదాన్ని తరువాత అందరికీ‌ పంచుతారు. వారి వారి  పొలాల్లో..ఇండ్ల చుట్టూరూ..గోడ్ల సావిడ్ల చుట్టూ చల్లుతారు.


" అమ్మా..సంతోషమా? లేదా? ఏమయినా కొరత ఉంటే చెప్పు తల్లీ" అని అడిగాడు ఆ పెదాయన పూనకం వచ్చిన రంగన్నని.


" యాట్లు కొయ్య  లేదా? రక్తం కావాలి రా!  ....అన్నాడు పూనకం  రంగన్న రొప్పుతూ .


"అమ్మా ..మేక పోతులు బలి ఇచ్చినాము..కోడి పుంజులు ఇచ్చినాము . ఇగ పెద్ద యాట్లు వద్దను కొన్నాము తల్లీ"  అన్నాడు పెద్దాయన.


మామూలుగా దున్న పోతును అమ్మ వారికి బలి ఇస్తారు.


కానీ ఈ సారి వద్దను కొన్నారు రెడ్డి గారు.


" సరే..." అన్నాడు రంగన్న.


" అమ్మా . రంగంలోకి వచ్చి మమ్మల్ని దీవించు.....నీ మాటలు ఇనల్ల అని పల్లె ప్రజలు అంతా కాసుకో నుండారు" అన్నాడు ఆ పెద్దాయన రెండు చేతులూ ఎత్తి దండాలు  పెడుతూ..


రంగన్న పూనకంతో వూగి పోతున్నాడు. ఇద్దరు ముగ్గురు పట్టుకొన్నా  వారికి చాత కావడం లేదు. 


నలుగైదుగురు మనుషులు గట్టిగా పట్టుకొన్నారు  రంగన్నను..ముగ్గులు వేసి పసుపు కుంకుమ గుండ్రంగా వేసి పూలు చల్లిన ఒక తావులో మూత మూసిన కుండ మీద నిలబెట్టారు రంగన్నను.


" అమ్మా..రంగం లోకి వచ్చి నావు..మాకు ఏమయినా చెప్పు తల్లీ ! రెండు మూడేళ్ళుగా వానలు లేవు..పజలు కట్టాలు పడుతున్నారు " అని అడిగాడు ఆ పెద్దాయన.


అంతే..అందరూ నిశ్శబ్ధమై పొయ్యారు..ఆకు పడితే గూడా అకు పడిన  శబ్ధం విన బడుతోంది. అందరూ చెవులు రిక్కించి వింటున్నారు.


" నా బిడ్డల క్షేమమే నా క్షేమం..మీరు బాగుండాలి. నాకు పూజలు చేసేది మరచి పోయినార్ర!  అందుకే మీకు కట్టాలు వచ్చినాయి" అన్నాడు పూనకం పట్టిన రంగన్న.


" అమ్మా..నన్ను క్షమించు..దానికి నేనే కారణం..వానలు లేవు ..పంటలు లేవు. జనాలు చానా  కష్టపడుతున్నారు" అన్నాడు వీర శేఖర రెడ్డి రెండు చేతులు జోడించి.


" నా కర్థ మయింది నాయనా..ఇక మీకు ఏ కష్టం రాదు.మీ గ్రామాలను బాగా కాపాడుతాను. మీరు ఇంక  ఏ సీకు సింతా లేకుండా బతకండి."  అమ్మవారు  అవాహన పూనిన రంగన్న అన్నాడు.


" అమ్మా ..ఈ సారి వానలు బాగా పడతాయా? పంటలు బాగా పండుతాయా? " 


' ఈ సారి అంతా బాగుంటుంది. నేను చూసుకొంట" 

రంగన్న బలంగా వూగు తున్నాడు.


" అమ్మా .ఒక ప్రశ్న అడగాల..మా వూర్లకు రెండు కళ్ళ వంటి వారు  వీర కేశవన్న.. రెడ్డన్న..వాళ్లను దయ సూడు తల్లి..ఈ సారి ఇద్దరికీ కడుపు పండింది.‌నువ్వే ఆ పిల్లోళ్ళను కాపాడల్ల..ప్రతి కానుపులో పిల్లోళ్ళు సచ్చి పోతా ఉండారు" అన్నాడు ఆ పెద్దాయన.


" నా బిడ్డలకు కట్ట మొస్తే నాకు కట్టమే..ఈ సారి మీ బిడ్డలు బతకాలంటే రెండు కుండలూ మార్చు కోండి నాయనా"  అని‌  పూనకం వచ్చిన రంగన్న ఆవేశంతో వూగి పోతూ రంగం నుండి బయట కొచ్చారు.


రంగన్నకు దిష్టి తీసి , కర్పూర హారతులు వెలిగించి..టెంకాయలు పగల గొట్టి కాళ్ళ మీద పడి దండాలు పెట్టినారు ఆ గ్రామాల ప్రజలు.

*******************************************


తరువాత ఏమయ్యిందో రేపు  ఇరవై  రెండవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి.

Copy Rights with Author.

Saturday, October 24, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు(20)


 సంస్కార సమేత రెడ్డి నాయుడు(20)

ఇరవై భాగం

--------------------------------------------------------

ఇటు రెడ్డి వారి వర్గం,  అటు నాయుడు గారి వర్గం  మహా  ఆనందంగా ఉన్నారు. ఈ సారి ఆ మహా తల్లుల కడుపులు పండి మంచి మగ బిడ్డలకు జన్మ నిస్తే రెండు గ్రామాల బాగోగులు చూడడానికి వారసులు పుడతారని  కనబడిన కొండకు..బండకు .. పూజలు చేస్తున్నారు.


వీర కేశవ  రెడ్డి కి ఏదో అనుమానంగా ఉంది. ఎందుకో రెండు కుటుంబాలల్లో బిడ్డలు పుడుతూనే చచ్చి పోతున్నారు.ఏమన్నా  వూరి గ్రామ దేవతలు కన్నెర్ర చేస్తున్నారా? లేదా కుల దేవతలు శపిస్తున్నారా? లేదా పితృదేవతలు సంతోషంగా లేరా? 


ఈ ప్రశ్నలు ఆయన మదిని తొలుస్తూనే ఉన్నాయి. అదే విధంగా రెడ్డప్ప  నాయుడికి గూడా సందేహాలు వస్తున్నాయి.


ఒక్కరోజు రెడ్డి గారు పంతులు గారిని పిలిపించారు.


పంతులు గారు జాతకాలు చూసినారు. పుట్టిన తేదీ..గర్భం దాల్చిన తేదీ గంటలు , నిముషాలతో లెక్కించి పంతులు గారు తెల్ల మొహం వేశాడు. 


" అయ్యా..ఈ సారి గూడా తమకి పుత్ర యోగం కన బడడం లేదు..ఏదో శక్తి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని  బాధిస్తోంది "  అన్నాడు వినయంగా.


" పంతులు గారూ...ఎలాగైనా ఈ సారి నేను నా బిడ్డను కాపాడుకోవాలి. చెప్పండి..ఏ పరిహార మైనా చేద్దాం"  రెడ్డిగారు రెండు చేతులెత్తి నమస్కరిస్తూ వణుకు తున్న కంఠం తో అన్నాడు.


" తమరు పెద్ద వారు..అలా భయ పడకండి. ఈ విషయంలో ఈ వూరి గ్రామ దేవతకు మీరు సరిగ్గా పూజలు చెయ్య లేదని పిస్తోంది" అన్నాడు పంతులు గారు.


' అవును..రెండు మూడేళ్ళ నుండి వర్షాలు సరిగ్గ లేవు..పంటలు సరిగా లేవు గదా? అందుకే గంగమ్మ తల్లిని శాంత పరచ లేదు." అన్నాడు రెడ్డి గారు కాసింత పశ్చాత్తాపం నిండిన మొహంతో.


" గ్రామ దేవతలు చాలా శక్తి సంపన్న మైన వారు. తిరుపతిలో చూడండి..గంగమ్మ తల్లి జాతర తప్పని సరి. అలాగే చౌడమ్మ తల్లి..రెడ్డమ్మ తల్లి...ప్రతి వూర్లో వారి శక్తి దేవతలకు పూజలు చేస్తూనే ఉంటారు. " అన్నాడు పంతులు గారు.


" ఆషాఢ మాసం వస్తోంది.అమ్మ వారి బోనాలు ఎత్తండి.అంతా మంచే జరుగుతుంది.." అని ఆశీర్వదించి సెలవు తీసుకొన్నాడు పంతులు గారు.


వీర కేశవ రెడ్డి గారు అమ్మ వారికి బోనాల పండుగ చెయ్యడానికి నిశ్చయించాడు.

**************************************************


నాయుడు గారి పల్లెలో  రెడ్డప్ప నాయుడు గారు వరండా లో కూర్చొని లెక్కలు చూసుకొంటున్నాడు.


అంతలో ఒక వయసు మళ్ళినాయన లోపలికి వచ్చి చేతులెత్తి దండాలు పెట్టాడు.


" ఏమి ఓబులేసూ? బాగున్నావా? " అని అడిగాడు నాయుడు గారు.


ఓబులేసు వెనకాల ఒక  అడపిల్ల వచ్చింది. ముఖం కళగానే వుంది ..గోధుమ రంగులో ఉంది గానీ సరయిన తిండి లేక శుష్కించ పోయి నట్లుంది. వయసు సుమారుగా  పదహారేళ్ళు ఉండవచ్చు.


" ఈ పిల్ల నా అన్న కూతురు అప్పా...మొన్న కరువులో వీళ్ళ అమ్మా..నాయనా..అవ్వా..తాతా అంతా సచ్చి పోయినారు" అన్నాడు ఓబులేసు.


" అమ్మీ..అయ్య గారికి దండం పెట్టు" 


" కూసో అమ్మీ" అన్నాడు నాయుడు గారు.


" ఈ అమ్మికి నా అనే వాళ్ళు లేరప్పా..మీరే దయ పెట్టి ఈ అమ్మికి ఏదో పని సూపించాల.. నాకు ఈ  అమ్మిని సాకేదానికి అయ్యేటట్లు లేదు.  రేపో మాపో నేను సచ్చి పోతే ఈ అమ్మిని సూసే దానికి ఎవరూ దిక్కు ఉండరు" అని రెండు చేతులూ ఎత్తి దండం పెట్టినాడు ఓబులేసు.


" సరే ..ఓబులేసు..పనులన్నీ బాగ సేస్తావా..అమ్మీ" అని అడిగాడు నాయుడు గారు.


ఎలాగూ రెడ్డప్ప నాయుడు భార్య కడుపుతో ఉన్నది. ఈ పిల్లను పెట్టు కొంటే అన్నీ చూసుకుంటూ ఉంటుంది అని మనసులో  అనుకొన్నాడు నాయుడు గారు.


" సరే..మనింట్లోనే ఉంటుంది..అన్నీ నేను చూసుకొంటాను. కానీ అమ్మ చెప్పిన పనులు చెయ్యాల.."   అన్నాడు నాయుడు గారు.


ఓబులేసు సంతోషంగా నాయుడు గారి పాదాలకు  నమస్కరించడానికి ముందుకు వంగాడు.

నాయుడు గారు వారించాడు.


" ఇంతకూ మీ అమ్మి పేరు చెప్పనే లేదు"  అన్నాడు రెడ్డప్ప నాయుడు గారు నవ్వుతూ..


" మణెమ్మ" అంటూ  ఓబులేసు సెలవు తీసుకొన్నాడు.

*********************************************

**********************************************తరువాత ఏమయ్యిందో రేపు  ఇరవై  ఒకటవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి.

Copy Rights with Author.

Friday, October 23, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (19)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు 


పంతొమ్మవ భాగం(19)

------------------------------------------------------------


ఇద్దరూ ఏటి గట్టున ఉన్న మిట్ట కాడికి చేరుకొన్నారు.

రెడ్డప్ప నాయుడు ...వీర కేశవ రెడ్డికి ఒక అనుబంధం ఉంది. ఇద్దరూ కొన్ని గంటల తేడాతో ఒకే రోజు పుట్టారు. పల్లె ప్రజలంతా రామ లక్ష్మణులు పుట్టారని పండగ చేసుకొన్నారంట ఆ కాలంలో.


నాయుడు గారే కొన్ని గంటలు పెద్ద.

అందుకే అన్నా అని పిలుస్తాడు రెడ్డి గారు.


మణెమ్మ కొంత సేపు ఆగింది ..  దగ్గరున్న మంచి నీళ్ళ గ్లాసు తీసుకొని నీరు తాగి జరిగిన కథను మళ్ళీ చెప్ప సాగింది.


మణెమ్మ పెద్దగా చదువు కోక పోయినా ఆమెకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏ సంవత్సరంలో ఏమి జరిగింది అని ఖచ్చితంగా చెప్పుతుంది.


" రాయల సీమలో అనావృష్టి వలన  రెండు మూడు ఏళ్ళుగా వర్షాలు లేవు. సీమలో కరువుతో చాలా మంది ఆకలి చావులతో సచ్చినారు. 1837 లో రాయల సీమలో వచ్చిన కరువుకు లక్షలాది మంది పానాలు  విడిచినారంట. అపట్లో దూబ కరువు..దొక్కల కరువు..వలసల కరువు అని కరువులు చాలా సార్లు వచ్చిందట. మా పెద్దోళ్ళు సెప్పంగా వినినాను.అప్పుడు ఆ ప్రజలు గంజి గడ్డలు, దెదరాకు జముడు కాయలు  తిని బతికి నారంట. బలిసాకు తినయినా బతకచ్చు అనే సామెత ఈ కరువుల వల్లనే  పుట్టిందేమో !" 


" మీ లాంటి ఈ కాలం పిల్లలు ఈ కత లన్నీ ఇనల్ల...ఈ తరమోళ్ళకు తెలవల్ల.. మన పెద్దోళ్ళు ఎన్ని కట్టాలు పడితేనే గదమ్మా..మనం బతికి బట్ట కట్టింది. మా యమ్మ  పస్తులుండి నాకు గంజి తాపిచ్చేదట" అని మణెమ్మ వాళ్ళ అమ్మను తలచు కొని ఏడ్చింది.


" మొన్న యాభై మూడు (1953) లో గూడా గంజి కరువు వచ్చిందమ్మా!నాలుగైదేళ్ళు వానలు లేవు.  జనాలకు తిండి లేదు. అప్పటికి మేము గూడా సిన్న పిల్లోల్లమే.....ఆ గంజి కరువు కత గూడా చెప్పతా విను.." అంది మణెమ్మ.


మణెమ్మ చెప్పడం ఆపింది ..ఆమె గుండెల్లొ దుఖం ఎగదన్నుకొస్తోంది..కొంత సేపు మాట్లాడలేక నిశ్శభ్ధంగా వుంది.


"మా యమ్మ ..మా నాయన..మా తాత..మా యవ్వ తినేదానికి ఆకులు అలములు గూడా దొరక్క ఆ కరువుకు సచ్చి పోయినారమ్మా? " అని చిన్న పిల్లలా ఏడ్చింది.


ఆమె కళ్ళల్లోంచి  కన్నీళ్ళు బొట బొట మని కారి పోతున్నాయి. చీర కొంగు తో కళ్ళు మాటి మాటికి తుడుచు కొంటోంది. అయినా కన్నీళ్ళు ఆగడం లేదు.


" పెద్దమ్మా.. ఏడ్చద్దు...అవన్నీ తలచు కొని ఏడవద్దు.." అనీ తనూ ఏడుస్తూ మణెమ్మ కళ్ళు తుడిచింది.


" 60 ఏళ్లలో కానరాని ఇంతటి కరువు .బాయి లన్నీ ఎండి పాయె. తాగే దానికి నీళ్ళు లేవు.బాహుదా నది ఎండి పాయె ..సుక్క నీరు గూడా దొరకలా..ఎక్కడో తేమ ఉంటే అక్కడకి పోయి చెలిమి తవ్వి చిప్ప తో నీళ్ళు తోడుకొని తాగే వాళ్ళం.  దిగుడు బాయిలు గూడా ఎండి పాయె.కనుచూప మేరా.. పొలాలు బీళ్లే. గంజి కరువులో  ముసలోల్ల కట్టాలు చెప్పేదానికి లేదు.


గంజి కరువు..  రాయలసీమ ప్రాంతం ఎడారి అయిపాయె. ఎండల్లో మనుషులు పురుగల్ల సచ్చి పాయిరి.  బావులు, సెరువులు, కుంటలు సుక్క నీళ్లు లేక ఎండిపాయె .


" చేన్లు , మళ్ళు  బీళ్లు పడినాయి.కంటికి కనపడినంత దూరం పొలాలు బీళ్ళుగా  ఉండేవి.ప్రజలంతా తిండికోసం  ఏడ్చి ఏడ్చి సచ్చినారు" 


" ఈ దుర్బర పరిస్థితుల్లో  అప్పట్లో పెధాని ఎవరో  నెహ్రూ అంట.. ఆయన ప్రతి గామంలో  గంజి కేంద్రాలు ఏర్పాటు సేసినాడు ..మహాను బావుడు.... పజలను ఆకలి చావుల బారి నుండి రక్షించినాడు..ఇప్పటికీ  నా వయసోల్లను అడుగు ...గంజి కరువు గురించి  కతలు కతలు సెప్పు తారు. " అని చెప్పి ఆపింది మణెమ్మ.


" 1951, 52, 53, 54 లో స్యానా పెద్ద  కరువు వచ్చింది. అయితే అప్పుడప్పుడు  ఏదో పడీ పడనట్లుగా వానలు కురిసేవి . ఆ వానలకు పంటలు పండేవి కావు. దీంతో అప్పట్లో ఆహార ధాన్యలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఏ పల్లెలో చూసినా ఆకలితో అలమటించే వాళ్లు. దీంతో నెహ్రూ ప్రభుత్వం రెండు, మూడు గ్రామాలకు కలిసి ఒకచోట గ్రామచావిడిలో ప్రజలకు జొన్నలతో చేసిన గంజిని పోసేవారు. ప్రతి రోజు మధ్యాహ్నం గంజిని పోసేవారు. నాకు ఇంకా బాగా గుర్తుకు ఉంది. గంజి కోసం చిన్న పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరమూ మట్టిముంతలు తీసుకుని వెళ్లే వాళ్లం. రోజుకు ఒక పూట మాత్రమే గంజితాగి బతికినాము.  అప్పట్లో కూడా కొంత మంది ఆ గంజి చాలక చనిపోయారు. మరికొంత మంది గంజి సక్రమంగా లేక (కొన్ని సార్లు గంజిలో చిన్నచిన్న పురుగులు ఉండేవి.) అతిసారతో మరణించినారు." 


" 1953లో  కుప్పం గ్రామం కొండుగారిపల్లెకు చెందిన సుబ్బన్న అనే ఆయన  పిల్లలను పోషించలేక.. గంజితో పిల్లల ఆకలి తీర్చలేక.. ఊరికి దగ్గర్లో ఉన్న చాకలదానిగుట్టపై నుంచి ఇద్దరు కొడుకులతో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఎక్కడ చూసినా ఇదే ఇసయమై మాట్లాడుకునే వాళ్ళు." 


" మనూర్లో  పొట్లి కొండ్రెడ్డి ఉండాడు  గదా..ఆయనకు అప్పుడు  12 సంవత్సరాల వయసు.  ఆ పిల్లోడు..నేను  గంజి ఎప్పుడు పోస్తారా..  అని కాసుకోని వుండే వాళ్ళం. ఊరిలోని పెద్ద ఇసుక మర్రిమాను దగ్గర అప్పుడు సర్కారు వాళ్లు గ్రామ ప్రజలందరికీ గంజిపోసేవాళ్లు. ఆ గంజికోసం మేమందరం ఉదయం నుంచి వేచి ఉండేవాళ్ళము. ఆ మర్రి చెట్టు దగ్గరే చేదుడు బావి కూడా ఉండేది. గంజి తాగి.... ఆ బావిలోని నీళ్లు తాగేవాళ్లం.ఒకరోజు రాగి గంజి.. ఒకరోజు జొన్న గంజి ఇచ్చేవాల్లు." 


 ఇంట్లో అందరమూ ముంతలు తీసుకుని వెళ్లే వాళ్లం. ఒక రోజు రాగి గంజి, ఇంకో రోజు జొన్న గంజి పోసే వాళ్లు. అదే అప్పట్లో అమృతంతో సమానం. వరి అన్నం ఎప్పడో పండుగలకు తినే వాళ్లం. ఇదమ్మా  కరువు కత..." మణెమ్మ కళ్ళు చెరువులై పొయినాయి.


" ఇప్పుడు మళ్ళా మన కత లోనికి వస్తాం.." అని జరిగిన కథ చెప్ప సాగింది రమకు.


" రెడ్డప్ప నాయుడు  అంటే మీ తాత...వీర కేశవ రెడ్డి మిట్ట కాడికి  వచ్చి నారని సెప్పినాను గదా! అప్పుడు గూడా కరువే.. మూడేళ్ళ నుండి వానల్లేక  నీళ్ళు లేవు బావుల్లో..ఏరు ఎండి పోయింది...అందుకే  పెద్దోళ్ళు ఇద్దరూ కూర్చోని మాట్లాడినారు.


" వానలు కురవక పోతే అన్నాయం అయి పోతాము అన్న..అన్ని బూములూ బీడ్లు పడి పోతావుండాయి.‌కలి కాలం గదా..అందుకే ఇన్ని కట్టాలు..." 


" మనోళ్ళంతా దిక్కు లేని సావులు సస్తారు" అన్నాడు నాయుడు గారు.


" ఇంతకు ముందు గూడా కరువు వస్తే మా తాత వరుణ యాగం చేయించి నాడంట. మనం గూడా చేయిద్దామా? " అన్నాడు రెడ్డప్ప నాయుడు.


" అట్లాగే అన్నా..రోజు మేఘాలు కన బడతాయి గానీ ..వాన  పడదు.' అన్నాడు రెడ్డి గారు కొంచెం నిరుత్సాహంగా.


" మన పంతులు గారిని పిలిపించి అడుగుతాను. మంచి రోజు..దానికి కావలసిన సామాగ్రి అంతా ఏమి కావల్నో అడుగు దాము.."  అన్నాడు నాయుడు గారు.


" అట్లాగే అన్నా!" అని ఎవ్వరి గ్రామానికి వారు వెళ్ళి పొయ్యారు.

**************************************************

మరుసటి రోజు పంతులు గారిని పిలిపించి ముహూర్తం ఖరారు చేశారు.


వచ్చే నెల  ద్వాదశి రోజున ముహూర్తం బాగుందని చెప్పడంతో పంతులు గారికే ఆ భాధ్యతను అప్పగించాడు నాయుడు గారు.


పోలేరమ్మ గుడికి అనుకొనే  రాముల వారి గుడి గూడా ఉంది. ఆ గుడి ముందర విశాలమైన మైదానం గుడి ప్రాంగణంలోనే ఉన్నది. అక్కడే వరుణ యాగం చేద్దామని పంతులు గారు అన్నారు. ఆ కార్య క్రమానికి ఇంకా  కొన్ని రోజులు సమయం ఉంది. ఈ లోపల యాగం జరిపించే బ్రాహ్మణులందరికీ కబురంపినారు.‌వారు తిరుపతి..చిత్తూరు ..పలమ నేరు..మదన పల్లి.. మేడికుర్తి ..వాయల్పాడు ...పరిసర ప్రాంతాల్లోంచి రావాలి.


వరుణ యాగానికి జరగ వలసిన కార్య క్రమాలన్నీ చక చక మని జరుగుతున్నాయి.ప్రాంగణం అంతా వెదురు పందిళ్ళు..తాటాకులతో ..రంగు రంగుల కాగితాలతో  అలంకరించారు. ఆ ప్రాంగణ మంతా దేదీప్యమానంగా ఉంది.


ద్వాదశి రోజు రానే వచ్చింది.వరుణ యాగం ప్రారంభ మయ్యింది. వేద ఘోషతో ఆ ప్రాంగణ మంతా మారు  మోగి పోతోంది.మూడు రోజులు వరుణ యాగం బ్రహ్మాండంగా జరిగింది. వీర కేశవ రెడ్డి గారి  కుటుంబం  మరియు ఆ గ్రామ ప్రజలు ..రెడ్డప్ప నాయుడు గారి  కుటుంబం  మరియు ఈ గ్రామ ప్రజలు అందరూ కలిసి యాగం భక్తి శ్రద్దలతో  చేసుకొన్నారు. 


మూడు రోజుల అయిన తర్వాత ఆ రోజు రాత్రి ఆశ్చ్యరంగా కుంభ వృష్టి కురిసింది. గ్రామ ప్రజలంతా సంతోషంగా వీధుల్లోకి వచ్చి  డప్పులు కొట్టుకొంటూ నృత్యం చేశారు.

***********************************************


అదేమి అదృష్టమో గానీ ఆ వరుణ యాగం చేసిన రోజునే ఒక శుభ వార్త తెలిసింది రెండు కుటుంబాల వాళ్ళకు.


అది  రెడ్డప్ప నాయుడి గారి భార్య గర్భవతి అయిన విషయం..అదే రెండు మూడు  రోజుల తర్వాత వీర శేఖర రెడ్డి భార్య గూడా గర్భవతి అయిన విషయం వూర్లు వూర్లంతా తెలిసి పోయింది.


అక్కడున్న ఆ  రెండు వూర్ల ప్రజల ఆనందానికి అంతే లేక పోయింది.


" ఈ సారయినా పండంటి మగ బిడ్డను కనాలి అన్నా..మాకు యువ రాజు కావాలి" అని రెడ్డి వారి పల్లె  గ్రామస్థులు ..వారు అంతా సంబరాలు చేసు కొన్నారు.


అలాగే  నాయుడు గారి పల్లెలో గూడా పండంటి బిడ్డను కనాలి అని గుడిలోకి వెళ్ళి గ్రామస్థులందరూ టెంకాయలు కొట్టి, అమ్మ వారికి పూజలు చేసి మొక్కులు మొక్కు కొన్నారు.


ఈ సంబరాలకు కారణం లేక పోలేదు.


ఇంతకు ముందే నాయుడు గారి భార్యకు రెండు, మూడు  సార్లు గర్భం వచ్చింది.  కానీ దేవుడు అనుగ్రహించ లేదు. మూడవ నెల లోనే గర్బ స్రావం అయిపొయ్యేది. 


అలాగే రెడ్డి గారి భార్యకు రెండు కానుపులు అయినా పురిట్లోనే బిడ్డలు సచ్చి పొయ్యేవాళ్ళు.‌ 


ఇద్దరు అమ్మలు గూడా చెయ్యని పూజ లేదు..చూడని గుడి లేదు..ఎన్నో దానాలు బ్రాహ్మణులకు ఇచ్చారు. 


ఏదో శాపమో..ఏదో దోషమో ఉందేమో నని మనసులో గూడా ఒక్క భయం ఉండేది ఆ రెండు కుటుంబాలకు.


" బగమంతుడా ..ఈ సారయినా ఇద్దరి అమ్మల కడుపులు పండల్ల ..మంచి బిడ్డలు పుట్టల్ల ....." అని వేడుకొన్నారు ఆ రెండు గ్రామ ప్రజలు.

***********************************************

**********************************************తరువాత ఏమయ్యిందో రేపు  ఇరవై భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి.

Copy Rights with Author.


సంస్కార సమేత రెడ్డి నాయుడు(18)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు


పదునెనిమిదవ భాగం(18)


రెడ్డివారి పల్లె ..నాయుడు గారి పల్లెలు అనాదిగా శ్రీ కృష్ణ దేవరాయల కాలం నుండీ వున్నాయని పెద్దలు చెప్పతా వుంటారు. అప్పట్లో  బాహుదా నది జీవ నదిలా ప్రవహిస్తూ ఉండేదట. అందుకే ప్రజలు పాడిపంటలతో ..సిరిసంపదలతో తూగే వారు.


 ముందుగా పన్నులు కట్టే వాటిలో ఈ రెండు గ్రామాలు వుండే వట. ఆ చుట్టు ప్రక్క ఉన్న  పల్లెల కంటే పండిన పంటలను బట్టి ఈ రైతులు  ఎక్కువగా కట్టే వారంట. అందుకే ఈ పల్లె ప్రజలకు  ఒక గౌరవం ఉండేది.


 తరువాత మదరాసు ప్రెసిడెంసీ    ఏర్పడిన తరువాత  బ్రిటీషు ప్రభుత్వము వారు రెవెన్యూ  చట్టాన్ని తెచ్చారు.  జమీన్ దారులే బ్రిటీష్ ప్రభుత్వానికి కట్టవలసిన శిస్తులు ..పన్నులు రైతుల దగ్గర నుండి  వసూలు చేసే వాళ్ళు. ఇది వీరి రెండు కుటుంబాలకు జమిందారీ తనం  తాతల కాలం నుండీ పరంపరగా వస్తున్నది.


అధికార పెత్తనం చెలాయించడానికి ఈ జమిందారీ తనాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. బాధ్యతతో తమ కర్తవ్యాన్ని నిర్వహించే వారని అందరూ అంటూండే వారు.


జమిందారీ విధానంలో ఆ పల్లెల్లోని భూములన్నింటికీ జమీన్ దారే హక్కు దారు. అతనే అన్ని పన్నులు రైతుల దగ్గర నుండి  వసూళ్ళు చెయ్యాలి.వసూలు చేసిన పన్నులు ఒక్క భాగం జమీన్ దారుకు, మిగతా పది భాగాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి వెడుతుంది.


 తరువాత జమిందారి విధానాన్ని తీసి వేసి రైత్వారీ విధానం..మహల్వారీ విధానాన్ని ప్రవేశ పెట్టినారు. మహల్వారీ విధానంలో కొన్ని గ్రామాలు కలిపి ఒక మహల్ అని , ఆ మహల్ క్రింద వచ్చే భూములన్నింటికీ గ్రామ కమిటిలను నియమించి, ఆ కమిటీ వారే శిస్తులు వసూలు చెయ్యాలి. ఇక్కడ రైతులే వారి భూములకు హక్కు దారులు.


ఏ విధానం  వచ్చినా ఈ రెండు కుటుంబాల వారే బాధ్యత తీసుకొని రైతులకు  అండగా నిలిచే వారు.


ఈ పల్లెలు ఇంత  సర్వతోముఖాభివృద్ధి కి కారణం  శ్రీ వీర కేశవ  రెడ్డి గారు. రెడ్డి వారిపల్లెకు మరియు ఉత్తరం వైపున్న ఆ చుట్టు ప్రక్కల ఉన్న చిన్న చితకా పల్లెలకు  పెద్ద దిక్కుగా  ఉండే వారు. అలాగే నాయుడు గారి పల్లెకు  మరియు దక్షిణం వైపున్న చిన్నా చితకా పల్లెల కన్నింటికీ  శ్రీ రెడ్డప్ప నాయుడు గారు పెద్ద దిక్కుగా  ఉండే వారు.


జమిందారీ వ్యవస్థ తరువాత రద్దయినా ఈ రెండు కుటుంబాల ఆ గౌరవాన్ని అలాగే నిలుపు కొన్నారు.


 అప్పుడు గూడా ఈ పల్లెలకు మంచి ఆదరణ ఉండేది. ఇక్కడ పని చేసే కరణాలకు జమాబందీ కి పోయినప్పుడు తహసిల్దారే దగ్గరుండి కావలసిన వన్నీ సమకూర్చే వారట.


 అలాంటి ఆర్థిక స్వయం సమృద్ది గల  పల్లెలుగా ఎలా మారాయాని ఇతర సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు,  కరణాలు, తహసిల్దార్లు  అన్ని రకాలుగా నేర్చు కొని పొయ్యే వారంట. 


రెండు గ్రామాల మధ్య ఎలాంటి శతృత్వం లేకుండా..పొరపొచ్చాలు లేకుండా అన్నదమ్ముల వలే కలిసి మెలిసి ఉండే వారు.


ఒక్క రోజు..

రచ్చ బండ దగ్గర పంచాయతీ జరుగుతోంది రెడ్డి వారి పల్లెలో. ఒక పెద్ద కుర్చీలో ఆసీను లయ్యారు వీర కేశవ రెడ్డి గారు.


ఆయన క్రింద చాపల మీద ప్రజలంతా కూర్చొన్నారు.


అంతలో రొప్పుతూ ..ఏడుస్తూ ఒక కుటుంబం వచ్చి నిలబడింది.


" మీరే నా కూతురు జీవితం నిల బెట్టాలి అయ్యా.. సంవత్సరం కూడా కాలా ...పెళ్ళి సేసి..నా అల్లుడు‌ మా అమ్మిని రోజూ వళ్ళు పగల గొడుతున్నాడు." అని పిల్ల తండ్రి ఏడుస్తూ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొన్నాడు.


ఆయన అల్లుడు తల వంచుకొని‌ నిల బడ్డాడు. కూతురు, ఆయన భార్య  రెండు చేతులూ జోడించి ఏడుస్తున్నారు.


" పనీ చెయ్యడు..వొళ్ళు వంచడు...సేద్యం సేసే దానికి రాదు.. రోజూ అమ్మి  కూలికి పోతే ఆ దుడ్లు లాక్కోని తాగేస్తాడు" అని ఆ ముసలాయన అల్లుడి వైపు కొర కొర చూస్తూ అన్నాడు.


" ఏమయ్యా..నీ బాధ..నువ్వు మగోడేనా? పని చెయ్యకుండా ఇంట్లో కూసోని తినే దానికి నీకు సిగ్గు ఎయ్యడం లేదా? " అని అల్లుడ్ని తిట్టాడు రెడ్డి గారు.


అల్లుడు తల వంచుకొని నేల చూపులు చూస్తున్నాడు.

"మీరే ఏదన్న పనిలో పెట్టించాలి అయ్యా" అన్నాడు ముసలాయన.


" మా మామిడి తోట కాడ కాపురం పెట్టు. అక్కడే ఉండి తోటను చూసుకో..ఈ సంవత్సరం కాపుకి వస్తుంది తోట. అక్కడే మీరుండేదానికి వసతి ఉంది.  బాగా పని చేసుకొంటే నీ పెళ్ళాం..పిల్లలు  బాగుంటారు. తాగుడు మానాలి. తాగితే సెడి పోతావు. పో..పని చేసుకో పో .." అన్నారు రెడ్డి గారు.


ఎవ్వరయినా ఏ సహాయం కావాలని అడిగినా వెంటనే వారికి ఒక దారి చూపే మంచి హృదయం కల వాడు వీర కేశవ రెడ్డి.


కొందరికి జోబీలో ఎంత డబ్బు ఉంటే అంత ఎత్తి ఇచ్చేస్తాడు. ఆకలి గొన్న  వాళ్ళకు భారీగా అన్నసమారాధన చేస్తాడు. బీద కుటుంబాల్లో పెళ్ళిళ్ళు ఆయనే ముందుండి చేయిస్తాడు.


ఆయన ఒకటే మాట అంటాడు."  మీ అందరి సహకారం వల్లనే నా భూములు పండు తున్నాయి. తోటలు కాపు కాస్తున్నాయి. దానిలో వచ్చిన ఫలసాయం మీ అందరిది. మీరు గూడా ఆ ఫలితాన్ని  అనుభవించాలి. " 

 

తనతో పాటు  పని చేసే రైతు కూలీలను, కౌలు దారులను బాగా చూసుకొంటాడు.


అందుకే ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లో రెడ్డి గారికి మంవి పేరుంది.


సంతోషంగా రెడ్డి గారి కాళ్ళకు దండం పెడుతూ ఆ ముసలాయన కుటుంబం వెళ్ళి పోయింది. 


అంతలో అందంగా అలంకరించి..మంచి బల మైన ఎర్రని గుర్రం మీద స్వారి చేస్తూ మెరుపు లాగా వచ్చాడు‌ ఒక పెద్ద మనిషి.


తలపాగా..పట్టు జుబ్బా.. తెల్లని ధోవతి సైకల్ కట్టు కట్టుకొని మీసాలు మెలి వేసుకొంటూ రచ్చ బండ దగ్గరకు వచ్చాడు.


ఆజాను బాహుడు..మెరిసి పోతున్న ముఖం. చంద్ర బింబం లాంటి ఆ మొహం లో  రాజరికపు వర్చస్సు..స్పుర ద్రూపి.‌


ఆయనే రెడ్డప్ప నాయుడు గారు.


" రా...అన్నా..చెప్పకుండానే వస్తివి..ఏమి సమాచారం?" రెడ్డి గారు లేచి నిల బడుతూ నాయుడు గారిని అహ్వానించారు.


ఇద్దరిదీ‌ ఒక్కటే వయస్సే...కానీ ఆప్యాయత కొద్దీ అన్నా అని పిలుచు కొంటాడు రెడ్డి గారు.


నాయుడు గారు గుర్రం దిగి..రెడ్డి గారిని అప్యాయంగా చూస్తూ నమస్కరిస్తూ కౌగలించుకొన్నాడు.


రెడ్డి గారి మనిషి గుర్రాన్ని ఒక చోట కట్టి దానికి పచ్చ గడ్డిని వేశాడు.


అంత లోనే రెడ్డి గారింటి నుండి ఒకతను  ఒక పెద్ద వెండి గ్లాసులో మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చాడు.


" నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి" అన్నాడు నాయుడు గారు.


" ఇక్కడే కూర్చొందామా? " అన్నాడు రెడ్డి గారు.


" లేదు .బాహుదా నది గట్టున మిట్ట కాడ కూర్చొని మాట్లాడు కొందాం రా" అని రెడ్డి గారిని తన గుర్రం మీదనే కూర్చో బెట్టుకొని వూరు దాటారు.


ఆ  అపురూప దృశ్యాన్ని పల్లె ప్రజలు ముక్కు మీద వేలేసు కొని చూశారు. రామలక్ష్మణుల్లా ఒకే గుర్రం మీద ఇద్దరూ కూర్చొనడం‌ చూసి ఆశ్చర్య పొయ్యారు.


ఒకింత ఆశ్చ్యరంతొ ..ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయి పొయ్యారు ఆ గ్రామ‌ప్రజలు.

***********************************************


( తరువాత ఏమయ్యిందో రేపు  పంతొమ్మిదవ  భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి

Copy Rights @Author

Thursday, October 22, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు(17)

 










సంస్కార సమేత రెడ్డి నాయుడు

పదిహేడవ భాగం(17)


రెండు మూడు నెలలయినా రమను ఆ రోజు అశోక్ భిక్ష గాడి వేషంలో కలిసి నప్పటి నుండి బయటకు పంపడం లేదు నాయుడు గారు. 


రమ బంగారు పంజరంలో చిక్కు కొన్న చిలక లాగా , అశోక వనం లో బంధింప బడ్డ సీతమ్మ లాగా  అయ్యింది.


నాయుడు గారు మణెమ్మను తప్ప లోనికి ఎవ్వర్నీ అనుమతించడం లేదు. ఏదయినా నోరు తెరచి గట్టిగా  మాట్లాడాలంటే గూడా రమకు , మణెమ్మకు భయం వేస్తోంది.


ఈ మధ్య జరిగే కొట్లాటలు , హత్యలు  వింటున్న రమ భయంతో బిక్క చిక్కి పోయింది.


రమ   భోజనానికి కావలసిన ఆహార పదార్థాలన్నీ వెండి పళ్ళెంలో పెట్టుకొని  రమ గది లోనికి వెళ్ళింది మణెమ్మ.


" పెద్దమ్మా.. నా గతి ఇంతేనా? ఎన్ని రోజులు నాకీ శిక్ష..." అని మణెమ్మ ను హత్తుకొంటూ ఏడ్చింది.


" నా బంగారూ.. ఏడ్వకమ్మా..నిన్ను చూస్తూంటే  నా గుండె తరిగి పోతోంది..అను కోకుండా ఇన్ని కట్టాలు వచ్చినాయి మనకు.. అమ్మ గూడా కంటికి కునుకు లేకుండా ఏడుస్తోంది." అని మణెమ్మ రమ తల నిమురుతూ ఏడ్చింది.


" అమ్మను చూడల్ల అనిపిస్తుంది పెద్దమ్మా" అంది రమ.


' నాయనకు తెలిస్తే మన ముగ్గుర్నీ సంపేస్తాడు.కొన్ని రోజులు ఆగమ్మా..అంతా మంచే జరుగు తుంది " అని ఓదారుస్తూ అన్నం తినిపించింది.


అమ్మ తనూ ఒకే ఇంటిలో  ఉన్నా రమ అమ్మను కలవడానికి వీల్లేక పోయింది.


రమకు అన్నం తినాలనిపించడం లేదు. మనసంతా అధైర్యంగా వుంది.


మణెమ్మ బలవంతం‌ చేస్తే కొంచెం మింగుడు పడింది రమ.  ప్రక్కనున్న విసన కర్ర తో రమకు విసురుతూ తల నిమురుతోంది మణెమ్మ.


" ఇన్నేళ్ళుగా నా మనసులో దాచుకొన్న రహస్యం ఒక్కటి నీకు చెబుతాను తల్లీ. ఇంత వరకూ ఈ రహస్యం మీ నాయనకు గూడా తెలీదు. నేను ఈ ఇంటి ఋణం తీర్చు కోవాలంటే ఈ రహస్యం నీకు చెప్పాల్సిందే.. యాభై ఐదు ఏళ్ళు నా గుండెల్లో పెట్టుకొన్నాను. ఇక  నా వల్ల కాదమ్మా! "


రమ  ఒక్క సారిగా లేచి కూర్చొంది.


" ఇట్టాగైనా మన కట్టాలు తీరి పోతాయేమో నని ఆ పోలెరమ్మకు మొక్కొంటున్నా.. మీ నాయన మనసు మారి మళ్ళీ మంచోడు అయితే బాగుంటుందమ్మా.. నాకు వయసు ముదురుతోంది. ఎప్పుడు సస్తానో ఏమో... ఈ రహస్యం నీకు చెప్పి నేను సచ్చినా నాకేం పరవాలేదు. శాంతంగా సచ్చి పోతా.." అని కనుగుడ్ల నీరు  ఉబుకుతూంటే కంఠం పూడుకు బోతా వుంది. మణెమ్మ మాట్లాడ లేక కొంచెం సేపు ఆగింది రొప్పుతూ ఆయాసంతో.


" సత్తె ప్రమాణికంగా ఎవ్వరి తోనూ చెప్పను అంటే చెప్పతా" అంది మణెమ్మ.


రమకు ఆ రహస్యం ఏమిటో తెలుసు కోవాలని మనసు ఆరాట పడింది.


" మన కుల దేవత పోలేరమ్మ తల్లి సాక్షిగా మా అమ్మ నాయన సాక్షిగా  ఎవ్వరికీ చెప్పను పెద్దమ్మా" అని చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసింది రమ. 


అమ్మా..రమమ్మా..ఇది యాభై ఐదు  ఏళ్ళ క్రితం జరిగిన కథ.చెప్పతా విను" 


మణెమ్మ గత స్మృతుల్లోకి  జారి పోయి..ఒక్కొక్క సంఘటనే జరిగిన కథంతా చెప్ప సాగింది.

**********************************************తరువాత ఏమయ్యిందో రేపు  పదునెనిమిదవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి

Copy Rights @Author


సంస్కార సమేత రెడ్డి నాయుడు(16)

సంస్కార సమేత రెడ్డి నాయుడు లో రమ.



 సంస్కార సమేత రెడ్డి నాయుడు

పదహారవ  భాగం (16)


కాలాన్ని ఆపడం ఎవ్వరి తరమూ గాదు. మనం ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా కాలం తన పని తాను చేసుకు పోతుంది.


ప్రజలందరూ భయంతో కాలం గడుపుతున్నందు వలన ఒక ఆటా, ఒక పాటా లేక పోయింది . ఎవర్ని చూసినా నిరాశ..నిస్పృహ...నిస్సారంగా బతుకులు బతుకు తున్నారు. పది మంది కలిసి మాట్లాడు కోవాలంటేనే భయంగా ఉంది.


రెండు పల్లెల మధ్య వైరం ఇంకా ఎక్కువవుతోంది గానీ తగ్గడం లేదు.  ఈ పల్లె సరిహద్దులు ఆ పల్లె వాళ్ళు దాటాలంటే భయం . ఎక్కడ చంపేస్తారేమో నని..భయం..


ఆ పల్లెలో కాపుర ముంటున్న కొడుకుని ఈ పల్లెలో కాపుర ముంటున్న తండ్రి  చూడ లేక పోతున్నాడు. అలాగా కాపురాలు విడి పోయినాయి.


ఒక రోజు ఒక ఎనభై ఏళ్ళ ముసలమ్మ నడుము వంగి పోయి చేతి కర్ర పట్టుకొని వంగుతూ నడవ లేక నాయుడు గారి పల్లెలో ఏదో పని మీద  ఏటిలో  గుండా ఇసుకలో నడుస్తూ ఏరు దాటుతోంది. ఇంకొక ఫర్లాంగు దూరంలో నాయుడు గారి పల్లె కనబడుతోంది.


కానీ ఆ ముసలమ్మను నాయుడు గారు నియమించిన కిరాయి  గూండాలు అడ్డగించినారు.


" ముసలమ్మా.. మీ పల్లికి పో...ఇక  ఈ పల్లె లోపలికి రావద్దు.." అని అడ్డగించినారు.


ముసలమ్మకు చాలా కోపం వచ్చింది. 


" ఏందయ్యా..ఈ గూండా తనం..మా తాత కాలం నుండీ చూస్తా ఉండా..ఇట్లా ఎప్పుడూ జరగలా..ఈ పల్లేమన్నా మీ నాయుడు గారి జాగీరా? ఎందుకు నన్ను ఆపేస్తా ఉండారు? " అని గద్దించింది.


ముసలమ్మ భయ పడకుండా ముందుకు పోతా ఉండాది.

కొందరు కిరాయి గూండాలు మళ్ళీ అడ్డగించి వెనక్కు లాగినారు.


ముసలమ్మ కూతురు నాయుడు గారి పల్లెలో కాపురం ఉంటుంది. కొడుకు, మనమడు తో ముసలవ్వ రెడ్డి వారి పల్లెలో కాపురం ఉంటారు.


ఒక్క కిరాయి  గూండా తోపుతో ముసలమ్మ కింద బడింది.


ఇంకో  కిరాయి గూండా రెడ్డి గారి పల్లె వైపు తిరిగి వెళ్ళమని ముందుకు  తోశాడు.


ఈ తోపు లాటలో ఒక్క రాయి తీసుకొని ఆ గూండాను కొట్టింది ముసలమ్మ.


గూండా తలకు తగిలింది ఆ రాయి.  అతని ముఖమంతా రక్తం తో నిండి పోయింది.


ఈ అనుకోని సంఘటనతో బెంబేలెత్తిన కిరాయి గూండా తన చేతిలో ఉన్న నాటు తుపాకితో ఆమెకు గురి పెట్టి తల మీద కాల్చాడు.


ఒక్క సారిగా కుప్ప కూలి పోయింది ముసలమ్మ.


ఆ ముసలమ్మను  ఎత్తుకొని రెడ్డి వారి పల్లి సరిహద్దుల్లో విసిరి వేశాడు కిరాయి గూండా.


కొన వూపిరితో ఉన్న ముసలమ్మ ప్రాణాలు విడచింది.


*****************************************************


ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి ముసలమ్మ మనవడికి గూడ తెలిసింది.


పరుగు పరుగున వచ్చి ముసలమ్మ శవాన్ని ఎత్తుకొని రెడ్డి గారింటికి చేరి ఆమెను బయట పండబెట్టి పొలో మని ఏడ్చాడు.


ఇంట్లో ఉన్న రాజ శేఖర్ రెడ్డితో పాటు ..జీత గాళ్ళు. అశోక్ రెడ్డి..వాళ్ళమ్మ గారు ఏమయిందో నని పరుగు పరుగున వచ్చారు.


" అయ్యా ...సూడు..మా అవ్వను సంపేసినారు ఆ దొంగ నా కొడుకులు.. నాయుడు గారి గూండాలు. అవ్వ పని మీద ఆ వూరికి బొయ్యెస్తా అని చెప్పి పోయింది. ఇంత లోనే పీనుగై తిరిగొచ్చింది.." అని గుండెలవిసేలా ఏడ్చాడు ముసలమ్మ మనమడు.


రెడ్డి గారికి కోపం కట్టలు తెంచుకొని ప్రవహించింది.


ఇంతలో ఊరు ఊరంతా అక్కడకి చేరి పొయ్యారు.

అందరిలో ప్రతీకార జ్వాల మండి పోయింది.


"అన్నా..నువ్వు ఊ అను..మన తడాఖ చూపిస్తాం. నాలుగైదు తల కాయలు ఎగిరి పోవల్ల" అన్నాడు అందులో ఒకాయన.


" వద్దప్పా..ఆగు..ఇది సమయం కాదు..కొంచెం ఆగల్ల..కోపం పనికి రాదు" అన్నాడు బలరామ రెడ్డి చిన్నాయన.


ఆ శవ సంస్కారాలను చూడమని తన మనిషిని  పురమాయించాడు బల రామ రెడ్డి.


రాజ శేఖర రెడ్డి గారు ముసలమ్మ హత్యను జీర్ణించుకోలేక పొయ్యాడు.తన ఆంతరంగికులతో కూర్చొని చాలా సేపు ఏం చెయ్యాలో మాట్లాడుకొన్నారు.

****************************************************

రెండు మూడు రోజుల తరువాత ఓ అర్ధ రాత్రి నాయుడి గారి గడ్డి వాములు, వరి పొలాలు,  ధాన్యపు మూటల్ని ఎవ్వరో అగ్గి పెట్టి కాల్చి పడేశారు.


బూడిదయి పోయిన ఫలసాయమంతా చూసి నాయుడి గారికి దుఖం వచ్చింది.


" రెడ్డి గారు ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు" అన్నాడు నాయుడు గారి మనుషుల్లో ఒక్కడు.


" నిన్న ..మొన్న రెడ్డి గారి‌ సిన్నాయన‌ ఈ పక్క తిరగతానే ఉండాడు.నా కప్పుడే డౌట్ అనుమానం వచ్చింది" అని ఇంకొక్క పాలేరు అన్నాడు.


ఆ రాత్రంతా పొద్దు పొయ్యేవరకు నాయుడు గారు ఇద్దరు ముగ్గురు తన ఆంతరంగికులతో మాట్లాడతానే ఉన్నాడు.

***********************************************


వారం రోజుల తర్వాత ..రెడ్డి వారి పల్లె లో 

తెల్లవారి  భద్ర కాళి అమ్మోరు గుడికి వచ్చిన వాళ్ళ గుండెలు ఝల్లు మన్నాయి.


అమ్మోరు  విగ్రహం ముందు ఒక తెగిన తల పడి ఉంది. అ తల మీద కుంకుమ చల్లినట్లు ఎర్రగా ఉంది.


దగ్గరగా చూసిన తరువాత అది రెడ్డి గారి చిన్నాయన బల రామి రెడ్డి తల అని తెలుసు కొన్నారు.


పల్లెలో ఉన్న వారందరికి ఆ విషయం దావానలంలా వ్యాపించింది.


బలరామి రెడ్డి బంధువులు..రాజ శేఖర్ రెడ్డి ..కుటుంబ సభ్యులు..తలుపులకు గొళ్ళెం వేసుకొని వూరు వూరంతా గుడి కాడికి చేరు కొన్నారు.


అంతలోనే కొందరు బల రామి రెడ్డి మొండాన్ని మోసుకొచ్చారు.


అంతే...అందరూ ఒక్క సారిగా  ఒక్కటే ఏడ్పులు..పెడ బొబ్బలు...రోదనలు..


" ఈ అన్నాయం ఎప్పుడూ సూడ లేదన్నా..ఇలా మనుసుల్ని సంపుకొంటా పోతే ఎట్లా ? " అని ఒక పెద్దాయన రాజ శేఖర రెడ్డిని నిలదీశాడు.


రెడ్డి గారు ఏమి మాట్లాడ లేదు.


చేతులెత్తి అందరికీ దండం పెట్టాడు.


అతని కళ్ళల్లోంచి కన్నీరు ధారాపాతంగా వర్షిస్తోంది.


*****************************************************


తరువాత ఏమయ్యిందో రేపు  పదిహేడవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి

Copy Rights @Author


Monday, October 19, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు(15)



                   సంస్కార సమేత రెడ్డి నాయుడు


అశోక్ ఇంత ధైర్యంగా రమను కలవడానికి వచ్చాడని తెలిసి నప్పటి నుండి నాయుడు గారు తోక తొక్కిన త్రాచులా ఎగిరి పడుతున్నాడు.‌


తన ఆంతరంగీకులతో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసు కొన్నాడు.


 ఈ విషయాలు ..పుకార్లు చినుకు చినుకుగా  చిలికి ఎక్కడ గాలివాన గా మారుతుందో అని పల్లె వాళ్ళంతా భయ పడినారు. 


భయ పడి నట్లు గానే  సాకిరేవులో గుడ్డలు ఉతుకుతున్న ఎల్లయ్య  ను ఎవ్వరో చంపేశారు.


సాకి రేవు కాడ్నే  శవం పడి ఉంది  . ఎల్లయ్య జయరామ  నాయుడు గారింట్లో బట్టలుతికే  రజకుడు. తాత ముత్తాతల కాలం నుండీ నాయుడు గారింట్లో రజక వృత్తి చేసుకొంటూ  బ్రతుకు తున్నారు ఎల్లయ్య కుటుంబం వాళ్ళు.


ఎల్లయ్య  కుటుంబం రెండు గ్రామాల్లోనూ రజక వృత్తి చేస్తారు. రెడ్డి వారి పల్లెలో కొన్ని రైతు కుటుంబాలకు గూడా గుడ్డలు ఉతుకు తారు. 


కానీ  రాజ శేఖర రెడ్డి ఇంటికి మటుకు ఎల్లయ్య దాయాదులు వెంకట్రాముడు వాళ్ళు పని చేస్తారు.


ఎల్లయ్య..వెంకట్రాములు ఎన్నోసార్లు  కొట్లాడుకొన్నారు. రెడ్డి వారి పల్లె లో ఎల్లయ్య ఎందుకు ఇళ్ళు పట్టుకొన్నాడు..అవి ధర్మంగా వెంకట్రాములకే  చెందాల అని పంచాయతీ గూడా పెట్టుకొన్నారు

అయినా ఎల్లయ్య ..వెంకట్రాముడి మాట పెడచెవిన పెట్టాడు.


"ఈ ఇళ్ళు మా తాతల కాలం నుండి వస్తున్నాయి ..ఇయ్యి వదిలే పసక్తే లేదు " అని ఎల్లయ్య‌ మొండిగా వాదించాడు.


ఇంకో విషయం ఏమిటంటే... ఎల్లయ్య చాకి రేవు  ..వెంకట్రాముడి చాకి రేవు పక్క పక్కనే ఉంటాయి. కాలువ ప్రక్కన్నే ఉబ్బకు పెట్టే గాడి పొయ్యిలు ఉంటాయి.


కాలువలో నీళ్ళు ఉన్నప్పుడు  కాలువలో ఉన్న బండలు  మీదనే గుడ్డలు ఉతకతారు. ఉబ్బ పక్కన్నే చవుడు మట్టి బాగా దొరుకు తుంది. చవుడు  మన్ను తో గుడ్డలు ఉబ్బకు పెట్టి ఉతుకు తారు.  గుడ్డలు ఉతికే సబ్బులు ఇంకా రాలేదు అప్పటికి.


అలాంటి సమయంలో ఎల్లయ్య చావు పెద్ద తంటా తెచ్చి పెట్టింది.


నాయుడు గారి చాకలోళ్ళ ఎల్లయ్యను రెడ్డి గారి మనుషులే చంపించి నారంట అనే వార్త దావానలంలా ఆ పల్లెల్నోనే  గాకుండా మిగతా చుట్టు పక్కల పల్లెలకు వ్యాపించింది.


రెండు గ్రామాల్లో జనాలకు పల్లె దాటి పోవాలంటే భయం కలిగింది. ఎక్కడ రౌడీలు వచ్చి చంపేస్తారో అన్న భయం  తో బయటికి ఎల్ల బారేదానికే జనం  జంకు తున్నారు.


నాయుడు గారి రజకుడు ఎల్లయ్యను ఎవ్వరో చంపడం   నాయుడి గారిని మానసికంగా క్రుంగ దీసింది. ఈ పని   రెడ్డి మనుషులే ఎవ్వరో కావాలనే చేసినారు అని ఉన్నవి, లేనివి కట్టు కథలు అల్లినారు జనాలు. ఆ వార్త దావానలంలా వ్యాపించి నాయుడు గారి చెవికి గూడా సోకింది.


నాయుడు గారు ఒక్క వారం తర్వాత వూర్లో దండోరా వేయించి నాడు.


" ఇది అందరూ సావధానంగా వినండహో...మీకు చెప్పేదేమిటంటే రేపు సోమ వారం నుండి ఈ వూర్లో వాళ్ళు ఆ వూరికి పోగూడదు..ఆ వూర్లో వాళ్ళు ఈ వూరికి రాగూడదు. వస్తే సావే గతి. ఇది నాయుడు గారి హుకుం ఓహో...." అని పలకలు కొట్టుకొంటూ దండోరా వేశాడు ఒకాయన.



మరుసటి రోజు నాయుడు గారి పల్లె కు చుట్టూ వెదురు స్థంభాలు నాటి జెండాలు పాతినారు.పల్లె  లోపలికి ఎవ్వరు రావాలన్నా  పర్మిషన్ తీసుకొని రావల్ల. ఏట్లో నుండి గూడా ఆ పల్లెకు ఈ పల్లెకు  కాలినడక మార్గాలు ఉన్నాయి . అవి గూడా మూపించేసి ఒక పది మంది కండలు తిరిగిన యువకుల్ని  కాపలాగా పెట్టినాడు నాయుడు గారు. ప్రతి ఒక్కరి చేతిలో నాటు తుపాకులు ఉన్నాయి.


ఈ దృశ్యం చూసి రెడ్డి గారి పల్లె జనాలు భయ పడి పొయినారు

.

" నాయుడు గారికి పిచ్చి పట్టినట్లుందన్నా..మనం ఏ తప్పు చెయ్య లేదు. కిరాయి గూండాలను పెట్టి మనల్ని చంపెయ్యాలని సూస్తావుండాడు. ఇట్లయితే మనం ఈ పల్లెలో బతక లేము రెడ్డన్నా! " అని రాజ శేఖర్ రెడ్డికి మొర పెట్టు కొన్నారు ఆ గ్రామ ప్రజలు.


" పొయ్యేకాలం దాపురించింది.. వినాశ కాలే విపరీత బుద్ది..మీరేమీ భయ పడకండి.ఈ సమస్యలు వాటి కంతే అవి సమసి పోతాయి" అని దివాన్ శర్మ గారు ధైర్యం చెప్పాడు.


రాజ శేఖర్ రెడ్డికి నాయుడు గారి‌ మీద చాలా కోపం వచ్చింది. లేని పోని మాటలు విని ..నాయుడు గారు‌ రెండు పల్లెల మీద యుద్ద వాతావరణం కలుగ చేశాడు. ఈ యుద్దం మొదలయ్యింది. ఇక ఎట్లా అంత మొవుతుందో అని ఆలోచించాడు.


అంతలో పది మంది అరవ  కాపుల కుటుంబాల వాళ్ళు , పిల్ల జెల్ల ..ఆడోళ్ళు..మేకలు ..కోడ్లు..పశువులు తోలుకొంటూ...తట్టా బుట్టా సర్దుకొని మూడు ఎద్దల బండ్లల్లో   సామానంతా నింపుకొని‌ రాజశేఖర రెడ్డి ఇంటి  ముందన్న మార్గంలో పోతున్నారు.


" యాడికి పోతా ఉండారు ఇళ్ళు  వదిలేసి. తీర్థ యాత్రలకు వెడతా ఉండారా చిన్నప్పా? " అని‌ ఒక పెద్దాయన బండిని నిలుపుతూ .


ఏం చెయ్యాల పెద్దయ్యా? నాయుడు గారి భూమిల్ని నమ్ము కోని తర తరాలుగా బతకతా ఉండాము. ఆయప్ప చెప్పినట్లు ఇనాలి గదా? ఇనక పోతే ఈ సారి భూములు కౌలుకి ఇవ్వరంట..ఇదే వూర్లో ఉంటే తలలు నరికి  అమ్మోరికి బలి ఇస్తారంట " అని మమ్మల్ని నాయుడి గారి మనుషులు కొందరు బెదిరించారు.


ఈ మాటలు విన్న రాజ శేఖర్ రెడ్డికి కోపం కట్టలు తెంచుకుని ప్రవహించింది.


" ఏమను కొంటా వుండాడు వాడు?  ఈ రెడ్డి తో పెట్టుకొంటే అంతే..నా పల్లెలో ఉండే జనాల్ని బెదిరిస్తాడా? ఎంత ధైర్యం? 

మంచికి మంచి ఈ రెడ్డి. కన్నుకు కన్ను ..కాలుకు కాలు తీసేస్తా..నాతో పెట్టు కోవద్దని చెప్పు మీ నాయుడు గారికి.." అని కోపంతో వూగి పొయ్యాడు రాజ శేఖర్ రెడ్డి.


" అవును రాజ శేఖర్  రెడ్డి ...ఎల్లయ్య  చచ్చి నప్పటి నుండీ నాయుడు గారు మన మీద పగ బట్టి నాడు. వాడ్ని ఎవ్వరు ఎందుకు చంపారో మనకు తెలీదు..ఎల్లయ్య ను మనమే చంపించి నామని వాళ్ళు అనుకొంటున్నారు. " అన్నాడు రెడ్డి గారి చిన్నాయన బల రామి రెడ్డి. 


వయసు డెబ్బై ఏళ్ళు దాటినా మనిషి ఇంకా దృడంగా ఉంటాడు. ఇంకా వ్యవసాయం పనులు చక చక మని చేస్తాడు. ఒక్క నిముషం గూడా విశ్రాంతి తీసుకోడు బల రామ రెడ్డి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తాడు. కొడుకు కోడళ్ళు ' పని చెయ్యొద్దు నాయనా..' అని అడుక్కొన్నా చెప్పిన మాట వినడు.  తెల్ల వారి ఝామున నాలుగు గంటలకే లేచి ఎద్దల్ని తోలుకొని ..బాయి కాడికి పోయి కపిల తోలుతాడు బలరామ రెడ్డి.  ఏదీ పని‌లేదంటే జనప నారతో పోగులు తీసి పెద్ద పెద్ద త్రాళ్ళు ఏకుతాడు..అంతటి కష్ట జీవి బలరామ రెడ్డి. వరసకు చిన్నాయన అవుతాడు రాజ శేఖర రెడ్డికి. మంచికీ చెడుకీ అన్నిటికీ ఆయన సలహాలు తీసుకొంటాడు రాజ శేఖర రెడ్డి.



దేనికయినా చిన్నాయనను  అడగందే ఏ విషయం లోనూ ముందు కెళ్ళడు  రాజ శేఖర రెడ్డి గారు.


రాజ శేఖర్ రెడ్డి ప్రతీకార జ్వాలతో రగిలి బోతున్నాడు. ఈ అవ మానాన్ని తట్టు కోలేక పోతున్నాడు.


***************************************************


ఇన్ని రోజులూ ఏ గ్రామం‌లో ఉన్నా కలిసి మెలిసి పని చేసుకోవడం ..తరతరాలుగా ఏ పొర పొచ్చాలు లేకుండా జరిగింది .కానీ ఇప్పుడు దేశ విభజన జరిగి నప్పుడు పాకిస్తాన్ మరియు భారత దేశం లో ప్రజలు ఏ దేశానికి వాళ్ళు వెళ్ళలేక పోవడం లా ఈ రెండు గ్రామ ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపు తున్నారు.


కంసాలి.వడ్రంగి..సాలె వాళ్ళు..బెస్త . ..చాకలి వాళ్ళు..మంగలి వాళ్ళు ..గానుగ ఆడే వాళ్ళు..రైతు కూలీలు...కౌలు రైతులు ...ఇలా ప్రతి చేతి వృత్తుల పనుల వాళ్ళు రెండు వూర్లను పంచు కోవలసి వచ్చింది. .ఎందుకంటే ఒక గ్రామం లో ఉన్న వాళ్ళు ఇంకో గ్రామం లోకి వెళ్ళి పని చెయ్య గూడదనే భయంతో ఇళ్ళు మార వలసి వచ్చింది. 


కొడుకు ఒక పల్లెలో ఉంటే నాయన ఇంకో పల్లెలో నివాసం ఉండాల్సి వచ్చింది.ఇలా  చెయ్యడం ఏమీ బాగా లేదని గుడ్ల నీరు కక్కు కొంటూ ఏడ్చినారు గ్రామ ప్రజలు. ఎంతో బాగుండే ఈ ప్రజలు రెండు పార్టీలై బద్ద శత్రువులై పోవడం పెద్ద వాళ్ళని కలవర పరచింది.


ఒక్క సారి పరిస్థితులు అదుపు తప్పితే శాంతికి ఎలా  విఘాతం  జరుగు తుందో ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి.అపార్థాలు ఎన్ని అనర్థాలకు దారి తీస్తోందో  గూడా అర్థ మవుతోంది.


నాయుడు గారి..రెడ్డి గారి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. పంతాలకు పోయి స్నేహితులుగా ఉన్న వారు బద్ధ శతృవులు అయి‌పొయ్యారు.


ఏది కాగూడదు అని కలలో గూడా అనుకోలేదో అది ఇప్పుడు నిజ మయ్యిందే అనిరెండు పల్లెల ప్రజలు భోరు మన్నారు.


రాయల సీమ ప్రజలకు ప్రేమించడం తెలుసు..అలాగే తేడా వస్తే తలలు తెగ్గొట్టడం తెలుసు.. మంచిగా   వుంటే ప్రాణాలు ఇస్తారు. చెడుగా నమ్మక ద్రోహం చేస్తే  ప్రాణాలు తీస్తారు.


ఆ మధ్య కత్తి వారి పల్లెలో నాలుగు తల కాయలు ఒకే ఇంటికి సంబంధించిన అన్నదమ్ములు తెగినాయి..ఎందుకో ఎవ్వరూ సరయిన సమాధానం చెప్పరు. కొందరు రాజకీయ పార్టీల వల్లని..కొందరు భూమి తగాదాలు అని..కొందరు ప్రేమ వ్యవహారం అని ఇలా చిలవలు పలవలుగా చెప్పుకొంటారు. 


మొన్న మేడికుర్తి లో గూడా ఒకర్ని‌ ఒక్కరు వాళ్ళ మనుషులు నరికి వేశారు. ఒక పెద్దాయన్ను ముక్కలు ముక్కలు గా నరికి కైమా చేసినారని వింటే గుండె నీరు కారి పోతుంది.  ఆ పెద్దాయన  బంధువులు ఆ ప్రత్యర్థుడ్ని  ఇంటి కాడ్నుంచి కంకర రోడ్డు మీద రెండు మైళ్ళు  ఈడ్చుకొని‌పోయి తల కాయ నరికి వేసినారు.


ఈ కథ లన్నీ విన్న ఈ రెండు గ్రామ ప్రజలకు కంట్లో నిద్ర లేకుండా పోతోంది.


ఈ సమస్యలకు కాలమే సమాధానం చెప్పాలి.

******************************************

***********************************************తరువాత ఏమయ్యిందో రేపు  పదహారవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )

Copy Rights@Author.

కాపీ హక్కులు @ రచయితవి.

సంస్కార సమేత రెడ్డి నాయుడు (14)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు 


పద్నాలుగవ భాగం (14)

----------------------------------------------------------


ఇంటికి చేరుతూనే అన్నలు ఇద్దరూ చెల్లెలు కోసం వేచి యున్నారు.


" రమ..ఏంది ఇంత సేపు గుడిలో ..సీకటి పడతా ఉండాది. ఇల్లు తొందరగా  సేరు కొవల్ల గదా? " అన్నాడు పెద్దన్న సుధాకర్


రమ మౌనంగా వెళ్ళి పోయింది.


ఆడపిల్లల్ని అతి గారాబం పేరుతో లేని పోని కట్టుబాట్లు తో  పెంచే వారు ఆ కాలంలో....


ఆడపిల్లలకు గూడా చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. స్నేహితులతో సరదాగా గడపాలని ఉంటుంది. ఆడ మగ అని లేకుండా స్నేహం చెయ్యాలని ఉంటుంది. కానీ‌ పెద్ద వారు ఆడపిల్లల్ని  అద్దం లాగా పెంచుతారు. అంటే ముట్టు కొంటే పగిలి పోతుందేమో నన్నంతగా. కానీ అదే మగ పిల్లలకి ఎక్కడ లేని స్వాతంత్ర్యం ఇస్తారు. అదే రమకు నచ్చదు. 


ఎన్నో సార్లు ఈ విషయం మీద ఇంట్లో పోట్లాడేది.


నాయుడు గారు ఒక్కటే చెబుతాడు.


" మన కులం..వంశ ప్రతిష్ట ..మన పరపతి..మన గౌరవం కాపాడు కోవాలంటే మనం  నియంత్రణలో ఉండాలి. ఆడపిల్లలు హద్దులు మీరి ప్రవర్తిస్తే అనుకోనిది జరిగితే అందరూ విషం త్రాగి మరణించాలి. నాకు నా కుల గౌరవం ముఖ్యం. " అని చాలా సార్లు పిల్లల్ని కూర్చో బెట్టి చెప్పాడు.


అదే ..మగ పిల్లలకూ వారసత్వంగా వచ్చింది. ఇంట్లో రమ బయట అడుగు పెట్టినా, ఎవ్వరయినా మగ వారితో మాట్లాడినా అసలు సహించరు.


అందుకే రమతో మాట్లాడడానికి ఆ వూర్లో మగ పిల్లలు ఎవ్వరూ సాహసించరు. 


పాలేరు సుధాకర్  చెవిలో ఏదో గుస గుస మని చెప్పాడు.


" ఏమో అయ్యా.. ఒక బిక్షగాడితో స్యానా సేపు మాట్లాడింది అమ్మగోరు" అన్నాడు.


" ఎవ్వడు ఆ నా కొడుకు..అడుక్కు తినే నా కొడుక్కి అంత ధైర్యమా? రమ నాయుడు గారి కూతురని తెలీదా? అంటూ నోటి కొచ్చినట్లు తిట్టుకొంటూ... పొడుగాటి దోటిని తీసుకొని గుడి వైపు పరుగెత్తారు అన్న దమ్ములు ఇద్దరూ..


వెనకనే పాలేరు పొడుగాటి వెదురు కట్టెను తీసుకొని పరిగెత్తాడు.


గుడి దగ్గరికి చేరి చూశారు. అక్కడ ఎవ్వరూ లేరు. వెంటనే గుడికి ఆనుకొనే ఉన్న ఏట్లోకి పరుగెత్తారు. 

అక్కడ రెడ్డి  వారి పల్లె వైపు ఒక బిక్షగాడు రొప్పుతూ పరుగెత్తడం చూసినారు.


" రేయ్..ఆగురా..ఎవడ్రా నువ్వు..నా చెల్లెలితో మాట్లాడడానికి ఎన్ని గుండెల్రా నీకు? " అని పరుగులు పెడుతూ గట్టిగా అరచారు.


బిక్షగాడిలా వేషం వేసుకొన్న అశోక్ కి తెలిసి పోయింది. రమ అన్నలు తనని వెంబడిస్తున్నారని.. వాళ్ళకు దొరికితే తనని చంపేస్తారని తెలుసు.


అంతే...ఒక్క సారిగా కుంటుతూ నడుస్తున్న అశోక్ ..పరుగు లంంఘించు కొని‌ తన గ్రామ పరిధి లోకి వెళ్ళి చింత తోపుల వైపు వెళ్ళి దాక్కొన్నాడు.


" వాడు బిక్షగాడు గాదన్నా..అశోకే ...నాకు తెలుసు..రమను కలవడానికి ఈ వేషంలో వచ్చాడు." అన్నాడు దివాకర్.


" అవును.. ఇది అశోక్ గాడి పనే...వాడికి మొన్న బిక్షగాడి వేషానికి స్కూల్లో గూడా ఫస్టు ప్రైజ్ వచ్చింది గదా? " అన్నాడు సుధాకర్.


అన్నా.పద..నాయనకు చెప్తాం..ఇలాంటి విషయాలు మొగ్గ లోనే తుంచెయ్యాల" అన్నాడు తమ్ముడు.


" పద ...నాయనకు చెబుదాం" 

అని ముగ్గురూ తమ పల్లె వైపు తిరిగి వెళ్ళారు.

***********************************************

ఇంటికి చేరుకొనే సరికి రాత్రి ఎనిమిది అయింది.

నాయుడు గారు గూడా అప్పుడే ఇంటికి వచ్చి కాళ్ళూ చేతులు శుభ్రం చేసుకొన్నారు.


భోజనం వేళ అయింది.


" పిల్లోళ్ళు ఏరీ? " అడిగాడు నాయుడు గారు.


" వచ్చే నాయానా" అంది రమ.


రమకు తన అన్న వాళ్ళు వారెక్కడికి పొయ్యారో తెలీదు. 

అంతలో గస పోసుకొంటూ దివాకర్ ..సుధాకర్ ఇంట్లోకి వచ్చారు.


కాళ్ళూ ..చేతులు ..ముఖం కడుక్కొన్నాక అందరూ భోజనానికి ఉపక్రమించారు.


" నాయనా..ఈ రోజు ఒక విషయం జరిగింది.అశోక్ మనూరికి వచ్చి నాడు." అన్నాడు దివాకర్ పళ్ళు పట పట మని‌ కొరుకుతూ.


" ఎందుకు?" 


" ఎందుకు ...ఏమి?చెల్లెల్ని కలిసి పోయినాడు" 

అన్నాడు సుధాకర్ కోపంగా చెల్లెలి వైపు చూస్తూ..


" అవునా..ఎట్లా..గొడవలు జరిగి మేము చస్తా ఉంటే వీళ్ళ డ్రామాలు ఏందంట? " అని గట్టిగా అరచాడు నాయుడు గారు కోపంతో..


" అమ్మీ..ఇది నిజమా? అశోక్ నిన్ను కలిసినాడా? " అని గద్దించాడు నాయుడు గారు.


" లే..లేదు..నాయనా ..ఎవరు చెప్పినారు? అంతా అబద్దం‌" అని భయంతో  చిగురు టాకులా వణికి పోతూ అంది. 


" నిజం సెప్పు అమ్మీ..ఆ బిక్షగాడు ఎవడు? ఆడితో నువ్వు గంటలు గంటలు ఎందుకు మాట్లాడినావో చెప్పు" అని గద్దించాడు దివాకర్.


ఈ అరుపులకు నిర్మలమ్మ..మణెమ్మ పరుగున వచ్చి రమ ప్రక్కన నిలబడ్డారు. ఏమి గలాటా జరుగు తుందో అని భయ పడి పొయ్యారు. 


" యాందమ్మీ..నీ యవ్వారాలు..నా కర్థం కాలేదు" అన్నాడు నాయుడు గారు.


" నేను ఎవ్వరినీ కలవ లేదు." అంది కొంచెం గట్టిగా రమ.

నాయుడు గారికి కోపం కట్టలు త్రెంచుకొని‌ ప్రవహించింది.


ఉన్న పళంగా లేచి రమ జట్టు పట్టుకొని  నాలుగైదు పిడి గుద్దులు గుద్దాడు జయరామ నాయుడు గారు.


" నా గౌరవాన్ని మంట కలపద్దు...రేపటి నుండి నువ్వు ఈ ఇల్లు గడప దాటడానికి వీల్లేదు.  ఈ చీకటి గది లోనే సావు" అని రమ గదికి తీసుకెళ్ళి లోపలికి తోసేసి బయట తాళం వేసేశాడు.


ఈ హఠాత్పరిణామానికి అక్కడ వున్న వారందరూ భయ పడి పొయ్యారు.


రమ బిగ్గరగా ఏడుస్తూ ఉంది. కాళ్ళూ చేతులు వణుకు తున్నాయి..కళ్ళ ల్లోంచి కన్నీరు ఏక ధాటిగా ప్రవహిస్తోంది.


" అది ఇంకా అన్నం గూడా తిన లేదు..దాన్ని గొడ్డును బాది నట్లు బాదుతారేంది? " అంది నిర్మలమ్మ ఏడుస్తూ.


" అది ఏ తప్పూ చెయ్యదు. మన బిడ్డ సంగతి మనకు తెలీదా అయ్యా..సెప్పుడు మాటలు ఇని ఆడబిడ్డను కొట్టడ మేంటి? అన్నది మణెమ్మ  ..దివాకర్ ..సుధాకర్ వైపు కొర కొర చూస్తూ.


" మణెమ్మ...నువ్వు తప్ప అమ్మి గది లోనికి ఎవ్వరూ వెళ్ళగూడదు..నిర్మలా..నువ్వు గూడా ఎల్ల డానికి ఈల్లేదు. అన్నీ పెద్దమ్మే చూసుకొంటుంది. ' అని హుకుం జారీ చేశాడు నాయుడు గారు.


మణెమ్మ తల వూపు కొంటూ ..వంట గది వైపు వెళ్ళింది. పళ్ళెంలో అన్నీ వడ్డించుకొని రమకు తినిపించడానికి  రమ గది లోకి వెళ్ళింది.

***********************************************తరువాత ఏమయ్యిందో రేపు  పదునైదవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీరైట్స్..రచయితవి

సంస్కార సమేత రెడ్డి నాయుడు (13)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు 


పదమూడవ  భాగం(13)


అశోక్ ఆ రాత్రంతా నిద్ర పోలేదు. ఎలాగైనా మూడవ కంటికి తెలియ కుండా ఎవ్వరికీ అనుమానం రాకుండా రమను ఎలా కలవాలో అర్థం కావడం లేదు. ఎవ్వరికైనా కాస్త తెలిసినా తల కాయలు ఎగిరి పోతాయి. కొడుకు , కూతురు ఎవ్వరయినా సరే శిక్ష పడుతుంది.రక్త సంబంధాలను గూడా చూడరు.


పున్నమి రోజు ఇంక రెండే రోజులుంది.


రమను కలవాలంటే కనీసం సాయంకాలం నాలుగు గంటలకు మెల్లగా బయలు దేరితే , ఐదు గంటలకు గుడి కాడికి చేరుతాడు.ఆ సాయంకాలం ఇంట్లో వాళ్ళకి తెలీకుండా వెళ్ళాలి. అందుకే ఒక ఉపాయం ఆలోచించాడు.  పదవ తరగతి స్కూలు పిల్లలు అందరూ స్కూలు దగ్గర కలవాలని ..భవిష్యత్తు లో ఏమి చెయ్యాలో మాట్లాడు కోవాలని అబద్ధం చెప్పి వెళ్ళాలని నిశ్చయించాడు అశోక్.


అంతలోనే  అన్న పూర్నమ్మ  పాల గ్లాసుతో వచ్చింది.‌

" నాయనా..పాలు తాగి పడుకో! " అంది.


" అమ్మా.. ఒక విషయం చెబుతా..వింటావా? " అని అడిగాడు తల్లిని.


" చెప్పు నాయనా"


" ఏం లేదు ..ఎల్లుండి నేను మహల్ కు పోవల్ల. మా క్లాసు పిల్లలంతా అక్కడికి వస్తారు. " అన్నాడు అశోక్

ఆమె ముహంలో రంగులు మారాయి.


" మీ అయ్యకు తెలిస్తే ఏమన్నా ఉందా? నీ కాళ్ళు ..చేతులు నరికేస్తాడు." అంది భయంగా.


" నాయనకు చెప్పొద్దు అమ్మా..ఎవ్వరికి తెలీదు..నేను మధ్యాహ్నంగా ఇంట్లోనే అన్నం తినేసి  వెళ్ళి  సాయంకాలం తిరుక్కోని  వస్తా!" అన్నాడు అశోక్


" అమ్మా..ఒక్క సారి ఊ అను. నాయనకు తెలీకుండా పోయి వస్తాను. " మళ్ళీ అడుక్కొన్నాడు దీనంగా.


అమ్మ మనసు కరిగి పోయింది.


" సరే..మీ అయ్యకు చెప్పను గానీ..నువ్వు తొందరగా రావల్ల నాయనా" అంది అన్న పూర్నమ్మ.


" ఎవ్వర్కీ చెప్పద్దే " అని అమ్మ రెండు చేతులూ పట్టుకొని అభ్యర్థించాడు.


అమ్మ నయితే ఒప్పించాడు గానీ..రమను ఎలా కలవాలో ఒక పట్టాన అర్థం కాలేదు.


చాలా సేపు ఆలోచనలో పడగా ఒక ఐడియా వచ్చింది.

రెండు నెలల క్రితం స్కూల్లో  తను బిక్షగాడి వేషం వేసిన దానికి ప్రధమ బహుమతి వచ్చింది.


ఆ వేషానికి సరి పడే వేష ధారణ ..గడ్డం..మీసాలు..చినిగి‌పోయిబ బట్టలు..తలకు చింపిరి‌ జుట్టు‌ విగ్గు అన్నీ అలాగే పెట్టెలో జాగ్రత్తగా

ఎత్తి పెట్టుకొన్నాడు. ఈ ఉపాయం తట్టి నందుకు ..దేవుడికి కృతజ్ణతలు  చెప్పు కొన్నాడు అశోక్.


పున్నమి రోజు బుధ వారం రానే  వచ్చింది.


భోజనాలయ్యాక అశోక్ రెడ్డి మెల్లగా అమ్మ చెవిలో తన స్కూలు ప్రయాణం గురించి చెప్పాడు.


అదృష్ట వశాత్తూ అశోక్ రెడ్డి నాయన ఏదో పని మీద పీలేరు వెళ్ళి నాడు. సాయంత్రం దాకా రాడు.


" జాగరత్త నాయనా..నాకేమో బయ్యం వేస్తా వుండాది" అంది అన్న పూర్ణమ్మ.


అశోక్ అప్పటికే సరంజామా , కొన్ని‌ పుస్తకాలు  బాగ్ లో దురుక్కోని ఇంటి వెనకాల నుండి దొడ్డి వాకిటలోంచి బయట పడ్డాడు.


ఎవ్వరితో మాట్లాడ కుండా..ఎవ్వరి వైపు కన్నెత్తి చూడకుండ,  వూరెనకాల ఉన్న  దయ్యాల తోపు లోపలికి వెళ్ళాడు. చింత చెట్లన్ని గుబురు గుబురుగా పెరిగి చీకటిగా ఉంటుంది ఆ చింత తోపు. అందుకే దాన్ని దయ్యాల తోపు అంటారు.


సాయంకాలం అయ్యిందంటే ఆ  తోపుల్లోకి ఎవ్వరూ అడుగు బెట్టరు. అందరికీ భయమే.


అశోక్ ఒక గుబురు చెట్ల లోకి వెళ్ళి అక్కడ చింత మాను మొదల్లో ఒక పెద్ద తొర్ర  ఉన్నది. అక్కడ నిలబడి తను తెచ్చు కొన్న బిక్ష గాడి వేషాన్ని చక్కగా వేసుకొని , తన బట్టలన్ని ఆ బ్యాగు లో దూర్చి , ఆ చెట్టు తొర్ర లోనే దాచి పెట్టి రమ ఉన్న నాయుడు గారి పల్లెకు కుంటుకొంటూ ఒక కట్టె అసరాతో నడుచు కొంటూ వెళ్ళాడు.



సమయానికి ఠంచనుగా ఐదు గంటలకు గుడి దగ్గరకు చేరు కొన్నాడు.


అప్పటికే రమ పూజ చేస్తోంది ..హారతి ..ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చింది.


" అమ్మా...దానం చెయ్యి మారాణీ" అని రమ వైపు గిన్నె చూపిస్తూ అడుక్కొన్నట్లు తన చేయిని చూపాడు.

చేతి మీద అశోక్ అని రాసి ఉంది. 


రమ సంతోషంతో ఉప్పొంగి పోయింది.

ఇన్ని రోజుల తర్వాత అశోక్ ని కళ్ళారా చూసింది. అశోక్ ని ఆ స్థితిలో చూస్తున్నందుకు కళ్ళల్లో నీళ్ళు ఉబుకు తున్నా తమాయించు కొంది.


" నిన్ను చూడాలంటే ‌ఇలా నేను అజ్ణాత వాసంలో పాండవుల్లా వేషం వెయ్యాల్సి వస్తుంది" అని నవ్వినాడు అశోక్.


" నీ వేషం బాగుంది. ఆ రోజు స్కూల్ లో వేసిన వేషం గదా? " అని నవ్వింది రమ.


" అది సరే గానీ..మన ఇద్దరి కోసం మన వాళ్ళు కొట్టుకొని సచ్చి పోతా ఉన్నారు. ఏమి చేద్దాం? " అంది రమ మళ్ళీ


" అందర్నీ ఒప్పించి పెళ్ళి చేసుకొందామా? " అన్నాడు అశోక్ నవ్వుతూ సరదాగా.


" ఇంకేమన్నా ఉందా? తలకాయలు పగిలి పోవూ? " అంది రమ.


" మనం ముందు ఈ కొట్లాటల్ని తగ్గించాలి. ఇరు వర్గాలు శాంతించాలి.మళ్ళీ మా నాయనా, మీ నాయనా ఒక్కటే గావాలి.అంత దాకా మన పెళ్ళి చేసు కోలేము" అంది రమ.


" నువ్వు నన్ను ఇష్ట పడుతున్నావా? మీ నాయన కులం..గోత్రం అంటున్నాడు" అన్నాడు అశోక్.


" అశోక్ ..ఈ పోలేరమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నా..చేసుకొంటే  నిన్నే పెళ్ళి చేసుకొంటా..కానీ మనకింకా  పెళ్ళి వయస్సు రాలేదు గదా..పెద్దోళ్ళు ఒప్పుకోరు. అందువలన మన మద్య ప్రేమ గీమ లేనట్లు కొన్ని రోజులు నటిస్తాం.అన్ని పరిస్థితులు అనుకూలిస్తే మన ప్రేమ సంగతి పెద్దోళ్ళకు చెబుతాం " అన్నది రమ.

రమ చెప్పింది అశోక్ కి సబబు గానే తోవింది.


" సరే..అట్లాగే రమా" అన్నాడు. 


అంతలో నాయుడు గారి పాలేరు అక్కడికి వచ్చాడు.

" ఏందమ్మ గోరూ..అన్న గార్లు పంపించారు.

" నన్ను..ఇక్కడేం చేస్తున్నారు? చాలా సేపు అయ్యింది గదా గుడికి వచ్చి.. ఈ బిక్షగాడితో ఏం మాట్లాడు తున్నారు అమ్మ గోరూ? " అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ..అశోక్ వైపు ఎగా‌దిగా చూశాడు.



పాపం ..ఈయన రెండు రోజులయ్యిందంట అన్నం తిని.అందుకే ఈ ప్రసాదము...అరటి పళ్ళు ఇచ్చేశాను" అంది రమ.


" పదండి ..అమ్మ గోరూ..ఇంటికి" అన్నాడు పాలేరు.


ఒక్కరి కొక్కరు చూస్తూనే వెనుతిరిగి మళ్ళీ మళ్ళీ తలలు తిప్పుతూ చూసుకొంటూ ఉంటే ..పాలేరుకు ఏదో అనుమానం వచ్చింది.


**************************************************తరువాత ఏమయ్యిందో రేపు  పదునాల్గవ

భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీరైట్స్..రచయితవి.