Thursday, October 22, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు(17)

 










సంస్కార సమేత రెడ్డి నాయుడు

పదిహేడవ భాగం(17)


రెండు మూడు నెలలయినా రమను ఆ రోజు అశోక్ భిక్ష గాడి వేషంలో కలిసి నప్పటి నుండి బయటకు పంపడం లేదు నాయుడు గారు. 


రమ బంగారు పంజరంలో చిక్కు కొన్న చిలక లాగా , అశోక వనం లో బంధింప బడ్డ సీతమ్మ లాగా  అయ్యింది.


నాయుడు గారు మణెమ్మను తప్ప లోనికి ఎవ్వర్నీ అనుమతించడం లేదు. ఏదయినా నోరు తెరచి గట్టిగా  మాట్లాడాలంటే గూడా రమకు , మణెమ్మకు భయం వేస్తోంది.


ఈ మధ్య జరిగే కొట్లాటలు , హత్యలు  వింటున్న రమ భయంతో బిక్క చిక్కి పోయింది.


రమ   భోజనానికి కావలసిన ఆహార పదార్థాలన్నీ వెండి పళ్ళెంలో పెట్టుకొని  రమ గది లోనికి వెళ్ళింది మణెమ్మ.


" పెద్దమ్మా.. నా గతి ఇంతేనా? ఎన్ని రోజులు నాకీ శిక్ష..." అని మణెమ్మ ను హత్తుకొంటూ ఏడ్చింది.


" నా బంగారూ.. ఏడ్వకమ్మా..నిన్ను చూస్తూంటే  నా గుండె తరిగి పోతోంది..అను కోకుండా ఇన్ని కట్టాలు వచ్చినాయి మనకు.. అమ్మ గూడా కంటికి కునుకు లేకుండా ఏడుస్తోంది." అని మణెమ్మ రమ తల నిమురుతూ ఏడ్చింది.


" అమ్మను చూడల్ల అనిపిస్తుంది పెద్దమ్మా" అంది రమ.


' నాయనకు తెలిస్తే మన ముగ్గుర్నీ సంపేస్తాడు.కొన్ని రోజులు ఆగమ్మా..అంతా మంచే జరుగు తుంది " అని ఓదారుస్తూ అన్నం తినిపించింది.


అమ్మ తనూ ఒకే ఇంటిలో  ఉన్నా రమ అమ్మను కలవడానికి వీల్లేక పోయింది.


రమకు అన్నం తినాలనిపించడం లేదు. మనసంతా అధైర్యంగా వుంది.


మణెమ్మ బలవంతం‌ చేస్తే కొంచెం మింగుడు పడింది రమ.  ప్రక్కనున్న విసన కర్ర తో రమకు విసురుతూ తల నిమురుతోంది మణెమ్మ.


" ఇన్నేళ్ళుగా నా మనసులో దాచుకొన్న రహస్యం ఒక్కటి నీకు చెబుతాను తల్లీ. ఇంత వరకూ ఈ రహస్యం మీ నాయనకు గూడా తెలీదు. నేను ఈ ఇంటి ఋణం తీర్చు కోవాలంటే ఈ రహస్యం నీకు చెప్పాల్సిందే.. యాభై ఐదు ఏళ్ళు నా గుండెల్లో పెట్టుకొన్నాను. ఇక  నా వల్ల కాదమ్మా! "


రమ  ఒక్క సారిగా లేచి కూర్చొంది.


" ఇట్టాగైనా మన కట్టాలు తీరి పోతాయేమో నని ఆ పోలెరమ్మకు మొక్కొంటున్నా.. మీ నాయన మనసు మారి మళ్ళీ మంచోడు అయితే బాగుంటుందమ్మా.. నాకు వయసు ముదురుతోంది. ఎప్పుడు సస్తానో ఏమో... ఈ రహస్యం నీకు చెప్పి నేను సచ్చినా నాకేం పరవాలేదు. శాంతంగా సచ్చి పోతా.." అని కనుగుడ్ల నీరు  ఉబుకుతూంటే కంఠం పూడుకు బోతా వుంది. మణెమ్మ మాట్లాడ లేక కొంచెం సేపు ఆగింది రొప్పుతూ ఆయాసంతో.


" సత్తె ప్రమాణికంగా ఎవ్వరి తోనూ చెప్పను అంటే చెప్పతా" అంది మణెమ్మ.


రమకు ఆ రహస్యం ఏమిటో తెలుసు కోవాలని మనసు ఆరాట పడింది.


" మన కుల దేవత పోలేరమ్మ తల్లి సాక్షిగా మా అమ్మ నాయన సాక్షిగా  ఎవ్వరికీ చెప్పను పెద్దమ్మా" అని చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసింది రమ. 


అమ్మా..రమమ్మా..ఇది యాభై ఐదు  ఏళ్ళ క్రితం జరిగిన కథ.చెప్పతా విను" 


మణెమ్మ గత స్మృతుల్లోకి  జారి పోయి..ఒక్కొక్క సంఘటనే జరిగిన కథంతా చెప్ప సాగింది.

**********************************************తరువాత ఏమయ్యిందో రేపు  పదునెనిమిదవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి

Copy Rights @Author


No comments:

Post a Comment