Monday, October 19, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (14)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు 


పద్నాలుగవ భాగం (14)

----------------------------------------------------------


ఇంటికి చేరుతూనే అన్నలు ఇద్దరూ చెల్లెలు కోసం వేచి యున్నారు.


" రమ..ఏంది ఇంత సేపు గుడిలో ..సీకటి పడతా ఉండాది. ఇల్లు తొందరగా  సేరు కొవల్ల గదా? " అన్నాడు పెద్దన్న సుధాకర్


రమ మౌనంగా వెళ్ళి పోయింది.


ఆడపిల్లల్ని అతి గారాబం పేరుతో లేని పోని కట్టుబాట్లు తో  పెంచే వారు ఆ కాలంలో....


ఆడపిల్లలకు గూడా చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. స్నేహితులతో సరదాగా గడపాలని ఉంటుంది. ఆడ మగ అని లేకుండా స్నేహం చెయ్యాలని ఉంటుంది. కానీ‌ పెద్ద వారు ఆడపిల్లల్ని  అద్దం లాగా పెంచుతారు. అంటే ముట్టు కొంటే పగిలి పోతుందేమో నన్నంతగా. కానీ అదే మగ పిల్లలకి ఎక్కడ లేని స్వాతంత్ర్యం ఇస్తారు. అదే రమకు నచ్చదు. 


ఎన్నో సార్లు ఈ విషయం మీద ఇంట్లో పోట్లాడేది.


నాయుడు గారు ఒక్కటే చెబుతాడు.


" మన కులం..వంశ ప్రతిష్ట ..మన పరపతి..మన గౌరవం కాపాడు కోవాలంటే మనం  నియంత్రణలో ఉండాలి. ఆడపిల్లలు హద్దులు మీరి ప్రవర్తిస్తే అనుకోనిది జరిగితే అందరూ విషం త్రాగి మరణించాలి. నాకు నా కుల గౌరవం ముఖ్యం. " అని చాలా సార్లు పిల్లల్ని కూర్చో బెట్టి చెప్పాడు.


అదే ..మగ పిల్లలకూ వారసత్వంగా వచ్చింది. ఇంట్లో రమ బయట అడుగు పెట్టినా, ఎవ్వరయినా మగ వారితో మాట్లాడినా అసలు సహించరు.


అందుకే రమతో మాట్లాడడానికి ఆ వూర్లో మగ పిల్లలు ఎవ్వరూ సాహసించరు. 


పాలేరు సుధాకర్  చెవిలో ఏదో గుస గుస మని చెప్పాడు.


" ఏమో అయ్యా.. ఒక బిక్షగాడితో స్యానా సేపు మాట్లాడింది అమ్మగోరు" అన్నాడు.


" ఎవ్వడు ఆ నా కొడుకు..అడుక్కు తినే నా కొడుక్కి అంత ధైర్యమా? రమ నాయుడు గారి కూతురని తెలీదా? అంటూ నోటి కొచ్చినట్లు తిట్టుకొంటూ... పొడుగాటి దోటిని తీసుకొని గుడి వైపు పరుగెత్తారు అన్న దమ్ములు ఇద్దరూ..


వెనకనే పాలేరు పొడుగాటి వెదురు కట్టెను తీసుకొని పరిగెత్తాడు.


గుడి దగ్గరికి చేరి చూశారు. అక్కడ ఎవ్వరూ లేరు. వెంటనే గుడికి ఆనుకొనే ఉన్న ఏట్లోకి పరుగెత్తారు. 

అక్కడ రెడ్డి  వారి పల్లె వైపు ఒక బిక్షగాడు రొప్పుతూ పరుగెత్తడం చూసినారు.


" రేయ్..ఆగురా..ఎవడ్రా నువ్వు..నా చెల్లెలితో మాట్లాడడానికి ఎన్ని గుండెల్రా నీకు? " అని పరుగులు పెడుతూ గట్టిగా అరచారు.


బిక్షగాడిలా వేషం వేసుకొన్న అశోక్ కి తెలిసి పోయింది. రమ అన్నలు తనని వెంబడిస్తున్నారని.. వాళ్ళకు దొరికితే తనని చంపేస్తారని తెలుసు.


అంతే...ఒక్క సారిగా కుంటుతూ నడుస్తున్న అశోక్ ..పరుగు లంంఘించు కొని‌ తన గ్రామ పరిధి లోకి వెళ్ళి చింత తోపుల వైపు వెళ్ళి దాక్కొన్నాడు.


" వాడు బిక్షగాడు గాదన్నా..అశోకే ...నాకు తెలుసు..రమను కలవడానికి ఈ వేషంలో వచ్చాడు." అన్నాడు దివాకర్.


" అవును.. ఇది అశోక్ గాడి పనే...వాడికి మొన్న బిక్షగాడి వేషానికి స్కూల్లో గూడా ఫస్టు ప్రైజ్ వచ్చింది గదా? " అన్నాడు సుధాకర్.


అన్నా.పద..నాయనకు చెప్తాం..ఇలాంటి విషయాలు మొగ్గ లోనే తుంచెయ్యాల" అన్నాడు తమ్ముడు.


" పద ...నాయనకు చెబుదాం" 

అని ముగ్గురూ తమ పల్లె వైపు తిరిగి వెళ్ళారు.

***********************************************

ఇంటికి చేరుకొనే సరికి రాత్రి ఎనిమిది అయింది.

నాయుడు గారు గూడా అప్పుడే ఇంటికి వచ్చి కాళ్ళూ చేతులు శుభ్రం చేసుకొన్నారు.


భోజనం వేళ అయింది.


" పిల్లోళ్ళు ఏరీ? " అడిగాడు నాయుడు గారు.


" వచ్చే నాయానా" అంది రమ.


రమకు తన అన్న వాళ్ళు వారెక్కడికి పొయ్యారో తెలీదు. 

అంతలో గస పోసుకొంటూ దివాకర్ ..సుధాకర్ ఇంట్లోకి వచ్చారు.


కాళ్ళూ ..చేతులు ..ముఖం కడుక్కొన్నాక అందరూ భోజనానికి ఉపక్రమించారు.


" నాయనా..ఈ రోజు ఒక విషయం జరిగింది.అశోక్ మనూరికి వచ్చి నాడు." అన్నాడు దివాకర్ పళ్ళు పట పట మని‌ కొరుకుతూ.


" ఎందుకు?" 


" ఎందుకు ...ఏమి?చెల్లెల్ని కలిసి పోయినాడు" 

అన్నాడు సుధాకర్ కోపంగా చెల్లెలి వైపు చూస్తూ..


" అవునా..ఎట్లా..గొడవలు జరిగి మేము చస్తా ఉంటే వీళ్ళ డ్రామాలు ఏందంట? " అని గట్టిగా అరచాడు నాయుడు గారు కోపంతో..


" అమ్మీ..ఇది నిజమా? అశోక్ నిన్ను కలిసినాడా? " అని గద్దించాడు నాయుడు గారు.


" లే..లేదు..నాయనా ..ఎవరు చెప్పినారు? అంతా అబద్దం‌" అని భయంతో  చిగురు టాకులా వణికి పోతూ అంది. 


" నిజం సెప్పు అమ్మీ..ఆ బిక్షగాడు ఎవడు? ఆడితో నువ్వు గంటలు గంటలు ఎందుకు మాట్లాడినావో చెప్పు" అని గద్దించాడు దివాకర్.


ఈ అరుపులకు నిర్మలమ్మ..మణెమ్మ పరుగున వచ్చి రమ ప్రక్కన నిలబడ్డారు. ఏమి గలాటా జరుగు తుందో అని భయ పడి పొయ్యారు. 


" యాందమ్మీ..నీ యవ్వారాలు..నా కర్థం కాలేదు" అన్నాడు నాయుడు గారు.


" నేను ఎవ్వరినీ కలవ లేదు." అంది కొంచెం గట్టిగా రమ.

నాయుడు గారికి కోపం కట్టలు త్రెంచుకొని‌ ప్రవహించింది.


ఉన్న పళంగా లేచి రమ జట్టు పట్టుకొని  నాలుగైదు పిడి గుద్దులు గుద్దాడు జయరామ నాయుడు గారు.


" నా గౌరవాన్ని మంట కలపద్దు...రేపటి నుండి నువ్వు ఈ ఇల్లు గడప దాటడానికి వీల్లేదు.  ఈ చీకటి గది లోనే సావు" అని రమ గదికి తీసుకెళ్ళి లోపలికి తోసేసి బయట తాళం వేసేశాడు.


ఈ హఠాత్పరిణామానికి అక్కడ వున్న వారందరూ భయ పడి పొయ్యారు.


రమ బిగ్గరగా ఏడుస్తూ ఉంది. కాళ్ళూ చేతులు వణుకు తున్నాయి..కళ్ళ ల్లోంచి కన్నీరు ఏక ధాటిగా ప్రవహిస్తోంది.


" అది ఇంకా అన్నం గూడా తిన లేదు..దాన్ని గొడ్డును బాది నట్లు బాదుతారేంది? " అంది నిర్మలమ్మ ఏడుస్తూ.


" అది ఏ తప్పూ చెయ్యదు. మన బిడ్డ సంగతి మనకు తెలీదా అయ్యా..సెప్పుడు మాటలు ఇని ఆడబిడ్డను కొట్టడ మేంటి? అన్నది మణెమ్మ  ..దివాకర్ ..సుధాకర్ వైపు కొర కొర చూస్తూ.


" మణెమ్మ...నువ్వు తప్ప అమ్మి గది లోనికి ఎవ్వరూ వెళ్ళగూడదు..నిర్మలా..నువ్వు గూడా ఎల్ల డానికి ఈల్లేదు. అన్నీ పెద్దమ్మే చూసుకొంటుంది. ' అని హుకుం జారీ చేశాడు నాయుడు గారు.


మణెమ్మ తల వూపు కొంటూ ..వంట గది వైపు వెళ్ళింది. పళ్ళెంలో అన్నీ వడ్డించుకొని రమకు తినిపించడానికి  రమ గది లోకి వెళ్ళింది.

***********************************************తరువాత ఏమయ్యిందో రేపు  పదునైదవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీరైట్స్..రచయితవి

No comments:

Post a Comment