Thursday, October 22, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు(16)

సంస్కార సమేత రెడ్డి నాయుడు లో రమ.



 సంస్కార సమేత రెడ్డి నాయుడు

పదహారవ  భాగం (16)


కాలాన్ని ఆపడం ఎవ్వరి తరమూ గాదు. మనం ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా కాలం తన పని తాను చేసుకు పోతుంది.


ప్రజలందరూ భయంతో కాలం గడుపుతున్నందు వలన ఒక ఆటా, ఒక పాటా లేక పోయింది . ఎవర్ని చూసినా నిరాశ..నిస్పృహ...నిస్సారంగా బతుకులు బతుకు తున్నారు. పది మంది కలిసి మాట్లాడు కోవాలంటేనే భయంగా ఉంది.


రెండు పల్లెల మధ్య వైరం ఇంకా ఎక్కువవుతోంది గానీ తగ్గడం లేదు.  ఈ పల్లె సరిహద్దులు ఆ పల్లె వాళ్ళు దాటాలంటే భయం . ఎక్కడ చంపేస్తారేమో నని..భయం..


ఆ పల్లెలో కాపుర ముంటున్న కొడుకుని ఈ పల్లెలో కాపుర ముంటున్న తండ్రి  చూడ లేక పోతున్నాడు. అలాగా కాపురాలు విడి పోయినాయి.


ఒక రోజు ఒక ఎనభై ఏళ్ళ ముసలమ్మ నడుము వంగి పోయి చేతి కర్ర పట్టుకొని వంగుతూ నడవ లేక నాయుడు గారి పల్లెలో ఏదో పని మీద  ఏటిలో  గుండా ఇసుకలో నడుస్తూ ఏరు దాటుతోంది. ఇంకొక ఫర్లాంగు దూరంలో నాయుడు గారి పల్లె కనబడుతోంది.


కానీ ఆ ముసలమ్మను నాయుడు గారు నియమించిన కిరాయి  గూండాలు అడ్డగించినారు.


" ముసలమ్మా.. మీ పల్లికి పో...ఇక  ఈ పల్లె లోపలికి రావద్దు.." అని అడ్డగించినారు.


ముసలమ్మకు చాలా కోపం వచ్చింది. 


" ఏందయ్యా..ఈ గూండా తనం..మా తాత కాలం నుండీ చూస్తా ఉండా..ఇట్లా ఎప్పుడూ జరగలా..ఈ పల్లేమన్నా మీ నాయుడు గారి జాగీరా? ఎందుకు నన్ను ఆపేస్తా ఉండారు? " అని గద్దించింది.


ముసలమ్మ భయ పడకుండా ముందుకు పోతా ఉండాది.

కొందరు కిరాయి గూండాలు మళ్ళీ అడ్డగించి వెనక్కు లాగినారు.


ముసలమ్మ కూతురు నాయుడు గారి పల్లెలో కాపురం ఉంటుంది. కొడుకు, మనమడు తో ముసలవ్వ రెడ్డి వారి పల్లెలో కాపురం ఉంటారు.


ఒక్క కిరాయి  గూండా తోపుతో ముసలమ్మ కింద బడింది.


ఇంకో  కిరాయి గూండా రెడ్డి గారి పల్లె వైపు తిరిగి వెళ్ళమని ముందుకు  తోశాడు.


ఈ తోపు లాటలో ఒక్క రాయి తీసుకొని ఆ గూండాను కొట్టింది ముసలమ్మ.


గూండా తలకు తగిలింది ఆ రాయి.  అతని ముఖమంతా రక్తం తో నిండి పోయింది.


ఈ అనుకోని సంఘటనతో బెంబేలెత్తిన కిరాయి గూండా తన చేతిలో ఉన్న నాటు తుపాకితో ఆమెకు గురి పెట్టి తల మీద కాల్చాడు.


ఒక్క సారిగా కుప్ప కూలి పోయింది ముసలమ్మ.


ఆ ముసలమ్మను  ఎత్తుకొని రెడ్డి వారి పల్లి సరిహద్దుల్లో విసిరి వేశాడు కిరాయి గూండా.


కొన వూపిరితో ఉన్న ముసలమ్మ ప్రాణాలు విడచింది.


*****************************************************


ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి ముసలమ్మ మనవడికి గూడ తెలిసింది.


పరుగు పరుగున వచ్చి ముసలమ్మ శవాన్ని ఎత్తుకొని రెడ్డి గారింటికి చేరి ఆమెను బయట పండబెట్టి పొలో మని ఏడ్చాడు.


ఇంట్లో ఉన్న రాజ శేఖర్ రెడ్డితో పాటు ..జీత గాళ్ళు. అశోక్ రెడ్డి..వాళ్ళమ్మ గారు ఏమయిందో నని పరుగు పరుగున వచ్చారు.


" అయ్యా ...సూడు..మా అవ్వను సంపేసినారు ఆ దొంగ నా కొడుకులు.. నాయుడు గారి గూండాలు. అవ్వ పని మీద ఆ వూరికి బొయ్యెస్తా అని చెప్పి పోయింది. ఇంత లోనే పీనుగై తిరిగొచ్చింది.." అని గుండెలవిసేలా ఏడ్చాడు ముసలమ్మ మనమడు.


రెడ్డి గారికి కోపం కట్టలు తెంచుకొని ప్రవహించింది.


ఇంతలో ఊరు ఊరంతా అక్కడకి చేరి పొయ్యారు.

అందరిలో ప్రతీకార జ్వాల మండి పోయింది.


"అన్నా..నువ్వు ఊ అను..మన తడాఖ చూపిస్తాం. నాలుగైదు తల కాయలు ఎగిరి పోవల్ల" అన్నాడు అందులో ఒకాయన.


" వద్దప్పా..ఆగు..ఇది సమయం కాదు..కొంచెం ఆగల్ల..కోపం పనికి రాదు" అన్నాడు బలరామ రెడ్డి చిన్నాయన.


ఆ శవ సంస్కారాలను చూడమని తన మనిషిని  పురమాయించాడు బల రామ రెడ్డి.


రాజ శేఖర రెడ్డి గారు ముసలమ్మ హత్యను జీర్ణించుకోలేక పొయ్యాడు.తన ఆంతరంగికులతో కూర్చొని చాలా సేపు ఏం చెయ్యాలో మాట్లాడుకొన్నారు.

****************************************************

రెండు మూడు రోజుల తరువాత ఓ అర్ధ రాత్రి నాయుడి గారి గడ్డి వాములు, వరి పొలాలు,  ధాన్యపు మూటల్ని ఎవ్వరో అగ్గి పెట్టి కాల్చి పడేశారు.


బూడిదయి పోయిన ఫలసాయమంతా చూసి నాయుడి గారికి దుఖం వచ్చింది.


" రెడ్డి గారు ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు" అన్నాడు నాయుడు గారి మనుషుల్లో ఒక్కడు.


" నిన్న ..మొన్న రెడ్డి గారి‌ సిన్నాయన‌ ఈ పక్క తిరగతానే ఉండాడు.నా కప్పుడే డౌట్ అనుమానం వచ్చింది" అని ఇంకొక్క పాలేరు అన్నాడు.


ఆ రాత్రంతా పొద్దు పొయ్యేవరకు నాయుడు గారు ఇద్దరు ముగ్గురు తన ఆంతరంగికులతో మాట్లాడతానే ఉన్నాడు.

***********************************************


వారం రోజుల తర్వాత ..రెడ్డి వారి పల్లె లో 

తెల్లవారి  భద్ర కాళి అమ్మోరు గుడికి వచ్చిన వాళ్ళ గుండెలు ఝల్లు మన్నాయి.


అమ్మోరు  విగ్రహం ముందు ఒక తెగిన తల పడి ఉంది. అ తల మీద కుంకుమ చల్లినట్లు ఎర్రగా ఉంది.


దగ్గరగా చూసిన తరువాత అది రెడ్డి గారి చిన్నాయన బల రామి రెడ్డి తల అని తెలుసు కొన్నారు.


పల్లెలో ఉన్న వారందరికి ఆ విషయం దావానలంలా వ్యాపించింది.


బలరామి రెడ్డి బంధువులు..రాజ శేఖర్ రెడ్డి ..కుటుంబ సభ్యులు..తలుపులకు గొళ్ళెం వేసుకొని వూరు వూరంతా గుడి కాడికి చేరు కొన్నారు.


అంతలోనే కొందరు బల రామి రెడ్డి మొండాన్ని మోసుకొచ్చారు.


అంతే...అందరూ ఒక్క సారిగా  ఒక్కటే ఏడ్పులు..పెడ బొబ్బలు...రోదనలు..


" ఈ అన్నాయం ఎప్పుడూ సూడ లేదన్నా..ఇలా మనుసుల్ని సంపుకొంటా పోతే ఎట్లా ? " అని ఒక పెద్దాయన రాజ శేఖర రెడ్డిని నిలదీశాడు.


రెడ్డి గారు ఏమి మాట్లాడ లేదు.


చేతులెత్తి అందరికీ దండం పెట్టాడు.


అతని కళ్ళల్లోంచి కన్నీరు ధారాపాతంగా వర్షిస్తోంది.


*****************************************************


తరువాత ఏమయ్యిందో రేపు  పదిహేడవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి

Copy Rights @Author


No comments:

Post a Comment