సంస్కార సమేత రెడ్డి నాయుడు
పదునెనిమిదవ భాగం(18)
రెడ్డివారి పల్లె ..నాయుడు గారి పల్లెలు అనాదిగా శ్రీ కృష్ణ దేవరాయల కాలం నుండీ వున్నాయని పెద్దలు చెప్పతా వుంటారు. అప్పట్లో బాహుదా నది జీవ నదిలా ప్రవహిస్తూ ఉండేదట. అందుకే ప్రజలు పాడిపంటలతో ..సిరిసంపదలతో తూగే వారు.
ముందుగా పన్నులు కట్టే వాటిలో ఈ రెండు గ్రామాలు వుండే వట. ఆ చుట్టు ప్రక్క ఉన్న పల్లెల కంటే పండిన పంటలను బట్టి ఈ రైతులు ఎక్కువగా కట్టే వారంట. అందుకే ఈ పల్లె ప్రజలకు ఒక గౌరవం ఉండేది.
తరువాత మదరాసు ప్రెసిడెంసీ ఏర్పడిన తరువాత బ్రిటీషు ప్రభుత్వము వారు రెవెన్యూ చట్టాన్ని తెచ్చారు. జమీన్ దారులే బ్రిటీష్ ప్రభుత్వానికి కట్టవలసిన శిస్తులు ..పన్నులు రైతుల దగ్గర నుండి వసూలు చేసే వాళ్ళు. ఇది వీరి రెండు కుటుంబాలకు జమిందారీ తనం తాతల కాలం నుండీ పరంపరగా వస్తున్నది.
అధికార పెత్తనం చెలాయించడానికి ఈ జమిందారీ తనాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. బాధ్యతతో తమ కర్తవ్యాన్ని నిర్వహించే వారని అందరూ అంటూండే వారు.
జమిందారీ విధానంలో ఆ పల్లెల్లోని భూములన్నింటికీ జమీన్ దారే హక్కు దారు. అతనే అన్ని పన్నులు రైతుల దగ్గర నుండి వసూళ్ళు చెయ్యాలి.వసూలు చేసిన పన్నులు ఒక్క భాగం జమీన్ దారుకు, మిగతా పది భాగాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి వెడుతుంది.
తరువాత జమిందారి విధానాన్ని తీసి వేసి రైత్వారీ విధానం..మహల్వారీ విధానాన్ని ప్రవేశ పెట్టినారు. మహల్వారీ విధానంలో కొన్ని గ్రామాలు కలిపి ఒక మహల్ అని , ఆ మహల్ క్రింద వచ్చే భూములన్నింటికీ గ్రామ కమిటిలను నియమించి, ఆ కమిటీ వారే శిస్తులు వసూలు చెయ్యాలి. ఇక్కడ రైతులే వారి భూములకు హక్కు దారులు.
ఏ విధానం వచ్చినా ఈ రెండు కుటుంబాల వారే బాధ్యత తీసుకొని రైతులకు అండగా నిలిచే వారు.
ఈ పల్లెలు ఇంత సర్వతోముఖాభివృద్ధి కి కారణం శ్రీ వీర కేశవ రెడ్డి గారు. రెడ్డి వారిపల్లెకు మరియు ఉత్తరం వైపున్న ఆ చుట్టు ప్రక్కల ఉన్న చిన్న చితకా పల్లెలకు పెద్ద దిక్కుగా ఉండే వారు. అలాగే నాయుడు గారి పల్లెకు మరియు దక్షిణం వైపున్న చిన్నా చితకా పల్లెల కన్నింటికీ శ్రీ రెడ్డప్ప నాయుడు గారు పెద్ద దిక్కుగా ఉండే వారు.
జమిందారీ వ్యవస్థ తరువాత రద్దయినా ఈ రెండు కుటుంబాల ఆ గౌరవాన్ని అలాగే నిలుపు కొన్నారు.
అప్పుడు గూడా ఈ పల్లెలకు మంచి ఆదరణ ఉండేది. ఇక్కడ పని చేసే కరణాలకు జమాబందీ కి పోయినప్పుడు తహసిల్దారే దగ్గరుండి కావలసిన వన్నీ సమకూర్చే వారట.
అలాంటి ఆర్థిక స్వయం సమృద్ది గల పల్లెలుగా ఎలా మారాయాని ఇతర సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, కరణాలు, తహసిల్దార్లు అన్ని రకాలుగా నేర్చు కొని పొయ్యే వారంట.
రెండు గ్రామాల మధ్య ఎలాంటి శతృత్వం లేకుండా..పొరపొచ్చాలు లేకుండా అన్నదమ్ముల వలే కలిసి మెలిసి ఉండే వారు.
ఒక్క రోజు..
రచ్చ బండ దగ్గర పంచాయతీ జరుగుతోంది రెడ్డి వారి పల్లెలో. ఒక పెద్ద కుర్చీలో ఆసీను లయ్యారు వీర కేశవ రెడ్డి గారు.
ఆయన క్రింద చాపల మీద ప్రజలంతా కూర్చొన్నారు.
అంతలో రొప్పుతూ ..ఏడుస్తూ ఒక కుటుంబం వచ్చి నిలబడింది.
" మీరే నా కూతురు జీవితం నిల బెట్టాలి అయ్యా.. సంవత్సరం కూడా కాలా ...పెళ్ళి సేసి..నా అల్లుడు మా అమ్మిని రోజూ వళ్ళు పగల గొడుతున్నాడు." అని పిల్ల తండ్రి ఏడుస్తూ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొన్నాడు.
ఆయన అల్లుడు తల వంచుకొని నిల బడ్డాడు. కూతురు, ఆయన భార్య రెండు చేతులూ జోడించి ఏడుస్తున్నారు.
" పనీ చెయ్యడు..వొళ్ళు వంచడు...సేద్యం సేసే దానికి రాదు.. రోజూ అమ్మి కూలికి పోతే ఆ దుడ్లు లాక్కోని తాగేస్తాడు" అని ఆ ముసలాయన అల్లుడి వైపు కొర కొర చూస్తూ అన్నాడు.
" ఏమయ్యా..నీ బాధ..నువ్వు మగోడేనా? పని చెయ్యకుండా ఇంట్లో కూసోని తినే దానికి నీకు సిగ్గు ఎయ్యడం లేదా? " అని అల్లుడ్ని తిట్టాడు రెడ్డి గారు.
అల్లుడు తల వంచుకొని నేల చూపులు చూస్తున్నాడు.
"మీరే ఏదన్న పనిలో పెట్టించాలి అయ్యా" అన్నాడు ముసలాయన.
" మా మామిడి తోట కాడ కాపురం పెట్టు. అక్కడే ఉండి తోటను చూసుకో..ఈ సంవత్సరం కాపుకి వస్తుంది తోట. అక్కడే మీరుండేదానికి వసతి ఉంది. బాగా పని చేసుకొంటే నీ పెళ్ళాం..పిల్లలు బాగుంటారు. తాగుడు మానాలి. తాగితే సెడి పోతావు. పో..పని చేసుకో పో .." అన్నారు రెడ్డి గారు.
ఎవ్వరయినా ఏ సహాయం కావాలని అడిగినా వెంటనే వారికి ఒక దారి చూపే మంచి హృదయం కల వాడు వీర కేశవ రెడ్డి.
కొందరికి జోబీలో ఎంత డబ్బు ఉంటే అంత ఎత్తి ఇచ్చేస్తాడు. ఆకలి గొన్న వాళ్ళకు భారీగా అన్నసమారాధన చేస్తాడు. బీద కుటుంబాల్లో పెళ్ళిళ్ళు ఆయనే ముందుండి చేయిస్తాడు.
ఆయన ఒకటే మాట అంటాడు." మీ అందరి సహకారం వల్లనే నా భూములు పండు తున్నాయి. తోటలు కాపు కాస్తున్నాయి. దానిలో వచ్చిన ఫలసాయం మీ అందరిది. మీరు గూడా ఆ ఫలితాన్ని అనుభవించాలి. "
తనతో పాటు పని చేసే రైతు కూలీలను, కౌలు దారులను బాగా చూసుకొంటాడు.
అందుకే ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లో రెడ్డి గారికి మంవి పేరుంది.
సంతోషంగా రెడ్డి గారి కాళ్ళకు దండం పెడుతూ ఆ ముసలాయన కుటుంబం వెళ్ళి పోయింది.
అంతలో అందంగా అలంకరించి..మంచి బల మైన ఎర్రని గుర్రం మీద స్వారి చేస్తూ మెరుపు లాగా వచ్చాడు ఒక పెద్ద మనిషి.
తలపాగా..పట్టు జుబ్బా.. తెల్లని ధోవతి సైకల్ కట్టు కట్టుకొని మీసాలు మెలి వేసుకొంటూ రచ్చ బండ దగ్గరకు వచ్చాడు.
ఆజాను బాహుడు..మెరిసి పోతున్న ముఖం. చంద్ర బింబం లాంటి ఆ మొహం లో రాజరికపు వర్చస్సు..స్పుర ద్రూపి.
ఆయనే రెడ్డప్ప నాయుడు గారు.
" రా...అన్నా..చెప్పకుండానే వస్తివి..ఏమి సమాచారం?" రెడ్డి గారు లేచి నిల బడుతూ నాయుడు గారిని అహ్వానించారు.
ఇద్దరిదీ ఒక్కటే వయస్సే...కానీ ఆప్యాయత కొద్దీ అన్నా అని పిలుచు కొంటాడు రెడ్డి గారు.
నాయుడు గారు గుర్రం దిగి..రెడ్డి గారిని అప్యాయంగా చూస్తూ నమస్కరిస్తూ కౌగలించుకొన్నాడు.
రెడ్డి గారి మనిషి గుర్రాన్ని ఒక చోట కట్టి దానికి పచ్చ గడ్డిని వేశాడు.
అంత లోనే రెడ్డి గారింటి నుండి ఒకతను ఒక పెద్ద వెండి గ్లాసులో మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చాడు.
" నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి" అన్నాడు నాయుడు గారు.
" ఇక్కడే కూర్చొందామా? " అన్నాడు రెడ్డి గారు.
" లేదు .బాహుదా నది గట్టున మిట్ట కాడ కూర్చొని మాట్లాడు కొందాం రా" అని రెడ్డి గారిని తన గుర్రం మీదనే కూర్చో బెట్టుకొని వూరు దాటారు.
ఆ అపురూప దృశ్యాన్ని పల్లె ప్రజలు ముక్కు మీద వేలేసు కొని చూశారు. రామలక్ష్మణుల్లా ఒకే గుర్రం మీద ఇద్దరూ కూర్చొనడం చూసి ఆశ్చర్య పొయ్యారు.
ఒకింత ఆశ్చ్యరంతొ ..ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయి పొయ్యారు ఆ గ్రామప్రజలు.
***********************************************
( తరువాత ఏమయ్యిందో రేపు పంతొమ్మిదవ భాగంలో చూద్దాం ! )
***********************************************
( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల , ఏ వర్గ , ఏ సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)
(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష తెలుపు తారు గదూ? )
రచయిత: వారణాసి భానుమూర్తి రావు
జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా
ప్రస్థుత నివాసం : హైదరాబాదు.
కాపీ హక్కులు @రచయితవి
Copy Rights @Author
No comments:
Post a Comment