Monday, October 19, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (13)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు 


పదమూడవ  భాగం(13)


అశోక్ ఆ రాత్రంతా నిద్ర పోలేదు. ఎలాగైనా మూడవ కంటికి తెలియ కుండా ఎవ్వరికీ అనుమానం రాకుండా రమను ఎలా కలవాలో అర్థం కావడం లేదు. ఎవ్వరికైనా కాస్త తెలిసినా తల కాయలు ఎగిరి పోతాయి. కొడుకు , కూతురు ఎవ్వరయినా సరే శిక్ష పడుతుంది.రక్త సంబంధాలను గూడా చూడరు.


పున్నమి రోజు ఇంక రెండే రోజులుంది.


రమను కలవాలంటే కనీసం సాయంకాలం నాలుగు గంటలకు మెల్లగా బయలు దేరితే , ఐదు గంటలకు గుడి కాడికి చేరుతాడు.ఆ సాయంకాలం ఇంట్లో వాళ్ళకి తెలీకుండా వెళ్ళాలి. అందుకే ఒక ఉపాయం ఆలోచించాడు.  పదవ తరగతి స్కూలు పిల్లలు అందరూ స్కూలు దగ్గర కలవాలని ..భవిష్యత్తు లో ఏమి చెయ్యాలో మాట్లాడు కోవాలని అబద్ధం చెప్పి వెళ్ళాలని నిశ్చయించాడు అశోక్.


అంతలోనే  అన్న పూర్నమ్మ  పాల గ్లాసుతో వచ్చింది.‌

" నాయనా..పాలు తాగి పడుకో! " అంది.


" అమ్మా.. ఒక విషయం చెబుతా..వింటావా? " అని అడిగాడు తల్లిని.


" చెప్పు నాయనా"


" ఏం లేదు ..ఎల్లుండి నేను మహల్ కు పోవల్ల. మా క్లాసు పిల్లలంతా అక్కడికి వస్తారు. " అన్నాడు అశోక్

ఆమె ముహంలో రంగులు మారాయి.


" మీ అయ్యకు తెలిస్తే ఏమన్నా ఉందా? నీ కాళ్ళు ..చేతులు నరికేస్తాడు." అంది భయంగా.


" నాయనకు చెప్పొద్దు అమ్మా..ఎవ్వరికి తెలీదు..నేను మధ్యాహ్నంగా ఇంట్లోనే అన్నం తినేసి  వెళ్ళి  సాయంకాలం తిరుక్కోని  వస్తా!" అన్నాడు అశోక్


" అమ్మా..ఒక్క సారి ఊ అను. నాయనకు తెలీకుండా పోయి వస్తాను. " మళ్ళీ అడుక్కొన్నాడు దీనంగా.


అమ్మ మనసు కరిగి పోయింది.


" సరే..మీ అయ్యకు చెప్పను గానీ..నువ్వు తొందరగా రావల్ల నాయనా" అంది అన్న పూర్నమ్మ.


" ఎవ్వర్కీ చెప్పద్దే " అని అమ్మ రెండు చేతులూ పట్టుకొని అభ్యర్థించాడు.


అమ్మ నయితే ఒప్పించాడు గానీ..రమను ఎలా కలవాలో ఒక పట్టాన అర్థం కాలేదు.


చాలా సేపు ఆలోచనలో పడగా ఒక ఐడియా వచ్చింది.

రెండు నెలల క్రితం స్కూల్లో  తను బిక్షగాడి వేషం వేసిన దానికి ప్రధమ బహుమతి వచ్చింది.


ఆ వేషానికి సరి పడే వేష ధారణ ..గడ్డం..మీసాలు..చినిగి‌పోయిబ బట్టలు..తలకు చింపిరి‌ జుట్టు‌ విగ్గు అన్నీ అలాగే పెట్టెలో జాగ్రత్తగా

ఎత్తి పెట్టుకొన్నాడు. ఈ ఉపాయం తట్టి నందుకు ..దేవుడికి కృతజ్ణతలు  చెప్పు కొన్నాడు అశోక్.


పున్నమి రోజు బుధ వారం రానే  వచ్చింది.


భోజనాలయ్యాక అశోక్ రెడ్డి మెల్లగా అమ్మ చెవిలో తన స్కూలు ప్రయాణం గురించి చెప్పాడు.


అదృష్ట వశాత్తూ అశోక్ రెడ్డి నాయన ఏదో పని మీద పీలేరు వెళ్ళి నాడు. సాయంత్రం దాకా రాడు.


" జాగరత్త నాయనా..నాకేమో బయ్యం వేస్తా వుండాది" అంది అన్న పూర్ణమ్మ.


అశోక్ అప్పటికే సరంజామా , కొన్ని‌ పుస్తకాలు  బాగ్ లో దురుక్కోని ఇంటి వెనకాల నుండి దొడ్డి వాకిటలోంచి బయట పడ్డాడు.


ఎవ్వరితో మాట్లాడ కుండా..ఎవ్వరి వైపు కన్నెత్తి చూడకుండ,  వూరెనకాల ఉన్న  దయ్యాల తోపు లోపలికి వెళ్ళాడు. చింత చెట్లన్ని గుబురు గుబురుగా పెరిగి చీకటిగా ఉంటుంది ఆ చింత తోపు. అందుకే దాన్ని దయ్యాల తోపు అంటారు.


సాయంకాలం అయ్యిందంటే ఆ  తోపుల్లోకి ఎవ్వరూ అడుగు బెట్టరు. అందరికీ భయమే.


అశోక్ ఒక గుబురు చెట్ల లోకి వెళ్ళి అక్కడ చింత మాను మొదల్లో ఒక పెద్ద తొర్ర  ఉన్నది. అక్కడ నిలబడి తను తెచ్చు కొన్న బిక్ష గాడి వేషాన్ని చక్కగా వేసుకొని , తన బట్టలన్ని ఆ బ్యాగు లో దూర్చి , ఆ చెట్టు తొర్ర లోనే దాచి పెట్టి రమ ఉన్న నాయుడు గారి పల్లెకు కుంటుకొంటూ ఒక కట్టె అసరాతో నడుచు కొంటూ వెళ్ళాడు.



సమయానికి ఠంచనుగా ఐదు గంటలకు గుడి దగ్గరకు చేరు కొన్నాడు.


అప్పటికే రమ పూజ చేస్తోంది ..హారతి ..ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చింది.


" అమ్మా...దానం చెయ్యి మారాణీ" అని రమ వైపు గిన్నె చూపిస్తూ అడుక్కొన్నట్లు తన చేయిని చూపాడు.

చేతి మీద అశోక్ అని రాసి ఉంది. 


రమ సంతోషంతో ఉప్పొంగి పోయింది.

ఇన్ని రోజుల తర్వాత అశోక్ ని కళ్ళారా చూసింది. అశోక్ ని ఆ స్థితిలో చూస్తున్నందుకు కళ్ళల్లో నీళ్ళు ఉబుకు తున్నా తమాయించు కొంది.


" నిన్ను చూడాలంటే ‌ఇలా నేను అజ్ణాత వాసంలో పాండవుల్లా వేషం వెయ్యాల్సి వస్తుంది" అని నవ్వినాడు అశోక్.


" నీ వేషం బాగుంది. ఆ రోజు స్కూల్ లో వేసిన వేషం గదా? " అని నవ్వింది రమ.


" అది సరే గానీ..మన ఇద్దరి కోసం మన వాళ్ళు కొట్టుకొని సచ్చి పోతా ఉన్నారు. ఏమి చేద్దాం? " అంది రమ మళ్ళీ


" అందర్నీ ఒప్పించి పెళ్ళి చేసుకొందామా? " అన్నాడు అశోక్ నవ్వుతూ సరదాగా.


" ఇంకేమన్నా ఉందా? తలకాయలు పగిలి పోవూ? " అంది రమ.


" మనం ముందు ఈ కొట్లాటల్ని తగ్గించాలి. ఇరు వర్గాలు శాంతించాలి.మళ్ళీ మా నాయనా, మీ నాయనా ఒక్కటే గావాలి.అంత దాకా మన పెళ్ళి చేసు కోలేము" అంది రమ.


" నువ్వు నన్ను ఇష్ట పడుతున్నావా? మీ నాయన కులం..గోత్రం అంటున్నాడు" అన్నాడు అశోక్.


" అశోక్ ..ఈ పోలేరమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నా..చేసుకొంటే  నిన్నే పెళ్ళి చేసుకొంటా..కానీ మనకింకా  పెళ్ళి వయస్సు రాలేదు గదా..పెద్దోళ్ళు ఒప్పుకోరు. అందువలన మన మద్య ప్రేమ గీమ లేనట్లు కొన్ని రోజులు నటిస్తాం.అన్ని పరిస్థితులు అనుకూలిస్తే మన ప్రేమ సంగతి పెద్దోళ్ళకు చెబుతాం " అన్నది రమ.

రమ చెప్పింది అశోక్ కి సబబు గానే తోవింది.


" సరే..అట్లాగే రమా" అన్నాడు. 


అంతలో నాయుడు గారి పాలేరు అక్కడికి వచ్చాడు.

" ఏందమ్మ గోరూ..అన్న గార్లు పంపించారు.

" నన్ను..ఇక్కడేం చేస్తున్నారు? చాలా సేపు అయ్యింది గదా గుడికి వచ్చి.. ఈ బిక్షగాడితో ఏం మాట్లాడు తున్నారు అమ్మ గోరూ? " అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ..అశోక్ వైపు ఎగా‌దిగా చూశాడు.



పాపం ..ఈయన రెండు రోజులయ్యిందంట అన్నం తిని.అందుకే ఈ ప్రసాదము...అరటి పళ్ళు ఇచ్చేశాను" అంది రమ.


" పదండి ..అమ్మ గోరూ..ఇంటికి" అన్నాడు పాలేరు.


ఒక్కరి కొక్కరు చూస్తూనే వెనుతిరిగి మళ్ళీ మళ్ళీ తలలు తిప్పుతూ చూసుకొంటూ ఉంటే ..పాలేరుకు ఏదో అనుమానం వచ్చింది.


**************************************************తరువాత ఏమయ్యిందో రేపు  పదునాల్గవ

భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీరైట్స్..రచయితవి.


No comments:

Post a Comment