సంస్కార సమేత రెడ్డి నాయుడు (23)
ఇరవై మూడవ భాగం
-------------------------------------------------------------
పాతికేళ్ళ తరువాత ...
ఒక్క రోజు రెడ్డప్ప నాయుడు గారు మణెమ్మను పిలిచి నాడు గది లోకి.
" మణెమ్మా..."
" అయ్యా!"
" పదహారేళ్ళప్పుడు ఇంటికి వచ్చి మాతోనే కట్టమో..నష్టమో మా తోనే ఉండావు. పెళ్ళి గూడా సేసు కోకుండా మా కోసం నీ జీవితం త్యాగం చేసినావు..మేము ఎంత జేసినా నీ ఋణం తీర్చు కోలేము అమ్మా! " అని చెబుతూ వుంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగి నాయి. బొంగురు పోయిన కంఠంతో వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటు తువ్వాలుతో కన్నీళ్ళను తుడుచుకొన్నాడు ఎనభైఏళ్ళ రెడ్డప్ప నాయుడు గారు.
" అట్లా అనొద్దు అయ్యా...ఆ రోజు మీరు ఈ ఇంటిలో నన్ను నమ్మి నాకొక స్తానం ఇచ్చినారు. లేదంటే నా జీవితం కుక్కలు సింపిన ఇస్తరి అయి పొయ్యేది" అని రెండు చేతులూ ఎత్తి దండం పెట్టింది. మణెమ్మ కు గూడా దుఃఖం ఆగింది కాదు..చీర కొంగుతో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొనింది.
" నువ్వు సావధానంగా విను మణెమ్మా! ..నీకు ఒక రహస్యం చెప్పుతాను. ఈ రహస్యం ఇంత వరకూ ఎవ్వరికీ తెలియదు ..నువ్వు గూడా ఎవ్వరికీ చెప్పోద్దు .." అన్నాడు రెడ్డప్ప నాయుడు.
" నాకు వయసు అయి పోతా ఉండాది. నాకు ఆరోగ్యం గూడా బాగా లేదు. రేపో మాపో సావు దగ్గరకు వస్తుంది.వీర కేశవ రెడ్డి ఆరోగ్యం ఏం బాగాలేదు ..ఆయన మంచాన పడి శ్యానా రోజులు అయ్యింది. ఈ పొద్దో ..రేపో అన్నట్లున్నాము ఇద్దరమూ..అందుకే ఈ రహస్యం నీకు చెబుతున్నా"
మణెమ్మ ఆశ్చ్యర్యంతో చూసింది రెడ్డప్ప నాయుడు గారిని.
నాయుడు గారు మొత్తం పైన జరిగిన కథ అంతా వివరంగా చెప్పినారు మణెమ్మకు ..బాహుదా నదిలో ఎట్లా బిడ్డల్ని మార్చుకొనిందీ ..ఎందుకు మార్చ వలసి వచ్చిందీ ..ఎట్లా మణెమ్మకు , తన భార్యకు గూడా తెలీకుండా బిడ్డను మార్చిందీ అంతా వివరంగా చెప్పినాడు.
మణెమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు బొట బొట మని రాలాయి.
" ఈ రహస్యం అమ్మ గారికి గూడ చెప్పకుండా ఎట్ల దాచినారు అయ్యా? "
" బిడ్డల భవిష్యత్తు కోసం " అన్నాడు రెడ్డప్ప నాయుడు గారు.
" ఇదో ఈ రాగి రేకులో ఆ రహస్యం అంతా రాసినా. ఈ వెండి పెట్టెలో ఈ రాగి రేకు పెట్టి తాళం వేసినా .. నేను సచ్చి పోయినాక నా సమాధిలో దాచి పెట్టు"
అన్నాడు రెడ్డప్ప నాయుడు.
" అలాగే అయ్యా" అని ఆ చిన్న పెట్టెను తీసుకొని తన గదిలో ఒక రహస్య మాళిగలో దాచి పెట్టింది.
ఆరు నెలల తరువాత రెడ్డప్ప నాయుడు..ఆ తరువాత రెండు నెలలకు వీర కేశవ రెడ్డి కాలం చేశారు.
ఒక రోజు అర్థ రాతిరి మణెమ్మ రెడ్డప్ప నాయుడు సమాధిని తవ్వి వెండి పెట్టెను లోపల దాచి పెట్టి మళ్ళీ సున్నంతో కప్పి ఏమీ తెలీనట్లు వచ్చి పడుకొనింది.
***********************************************
" ఇదమ్మా ..జరిగిన కథ " అని మణెమ్మ రమను హత్తుకొని ఏడుస్తూ అంది.
" పెద్దమ్మా..ఇంత రహస్యాన్ని కడుపులో ఎట్లా ఇన్నేళ్ళు దాచుకొన్నావు? అంది రమ.
" వీర కేశవ రెడ్డి కొడుకుగా రెడ్డప్ప నాయుడు కొడుకు, రెడ్డప్ప నాయుడు కొడుకుగా వీర కేశవ రెడ్డి కొడుకు ఒకరికి తెలియ కుండా ఇంకొక్కరు పెరుగుతున్నారు. ఈ రహస్యం ఒక్క పెద్దోళ్ళ కిద్దరికేనా తెలిసిండేది? నాయనకు గూడా తెలీదా తన జన్మ రహస్యం ? " అంది రమ.
" అవునమ్మా..తెలీదు" అంది మణెమ్మ.
" ఈ రహస్యం ఒక్క పెద్దోళ్ళ కిద్దరికే తెలుసు.వాళ్ళూ సచ్చి పోయినారు. వుండేది నువ్వే..పెద్దమ్మా..ఈ హత్యలు..రాజ కీయాలు ఈ రహస్యం తెలిస్తే నిలచి పోతాయా? " అని అడిగింది రమ.
" తలకాయలు నరుక్కొనే కాడికి వచ్చినారు గదమ్మా..ఈ కత చెప్పితే నమ్ముతారా? కట్టుకత అని నా తల నరుకు తారు" అని చెప్పింది మణెమ్మ.
రమ కి ఏమీ అర్థం కాలేదు..ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలీక మణెమ్మ ఒడిలో పడుకొని అలాగే నిద్ర పోయింది.
********************************************
***********************************************(తరువాత ఏమయ్యిందో రేపు ఇరవై నాలుగవ భాగంలో చూద్దాం ! )
***********************************************
( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల , ఏ వర్గ , ఏ సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)
(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష తెలుపు తారు గదూ? )
రచయిత: వారణాసి భానుమూర్తి రావు
జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా
ప్రస్థుత నివాసం : హైదరాబాదు.
కాపీ హక్కులు @రచయితవి.
Copy Rights with Author
No comments:
Post a Comment