సంస్కార సమేత రెడ్డి నాయుడు (25)
చివరి భాగం.
అంతకు ముందే సుధాకర్ , దివాకర్ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం కిరాయి గూండాలు గుర్రాల మీద వచ్చారు. వారి చేతుల్లో నాటు తుపాకీలు అటూ ఇటూ తిప్పుకొంటూ బయట నిలబడి మాట్లాడుతున్న ఆశోక్ రెడ్డిని గూడా దయ్యాల గుట్ట వైపు తీసుకు వెళ్ళారు కిరాయి గూండాలు.
" ఈ ఇద్దరి వలనే అంట ఈ రెండు వూర్లల్లో మర్డర్లు ..అల్లర్లు చేసుకొని మనుషులు శాంతంగా బతక లేక పోతున్నారంట..ఇద్దర్నీ ఒకే సారి ఏసెయ్య మన్నారు దివాకర్ సారు.." అన్నాడు అందులో ఒక కిరాయి గూండా.
గుట్ట మీద ఒక పాడు బడిన సత్రం ఉంది. ఆ సత్రం దగ్గరకు పోవాలంటే అక్కడి జనాలకు భయం. అక్కడ దయ్యాలు తిరుగుతా వుంటాయని జనాలల్లో పుకారు పుట్టించి నారు.
అందుకే దానికి దయ్యాల గుట్ట అనే పేరు వచ్చింది.
" దివాకరన్న , సుధాకరన్న మిమ్మల్నీ ఇద్దరి తలలు నరికి బాహదా నది ఇసుకలో పూడ్చెయ్య మన్నారు " అన్నాడు ఒక కిరాయి గూండా . సారాయి పాకెట్ నోటితో చించి గడగడ మని తాగుతూ తూలు తున్నాడు. రమ అశోక్ ల వంక చూస్తూ భయంకరంగా అరుస్తున్నాడు. వాడి చేతిలో పెద్ద సాన పెట్టిన కత్తి ఉంది.
అశోక్ ..రమ పెనుగు లాడుతున్నారు. వారు వేసుకొన్న దుస్తులు చినిగి పొయ్యాయి. ఆ పెనుగులాటలో చర్మం గీసుకొని పోయి రక్తం కారుతోంది.
" మిమ్మల్ని ఇద్దర్నీ సంపెయ్యమని మాకు చెప్పినారు. దేవుడ్ని తలచు కోండి..మీ తల కాయలు నరికేస్తాము" అని ఒక్క వుదుటున వారి ముందరికి దూకాడు ఒక్కడు.
అంతే..బిర బిర మని రెండు పల్లెల నుండి వచ్చిన యువకులు, రైతులు , పాలేర్లు, పిల్లలు, జీత గాళ్ళు పొలో మని వారి వారి చేతుల్లో ఉన్న ఆయుధాలతో ఆ రౌడీలను చితక బాదారు.
కొందరు రౌడీలు పలాయనం చిత్త గించారు.
అంతలోనే ..పరుగు పరుగున రాజ శేఖర రెడ్డి..జయ రామ నాయుడు వచ్చారు. ఆమ్మా..రమా..తల్లీ ..బాగున్నావా ..నన్ను క్షమించమ్మా" అని బావురుమని రమను హత్తుకొని చిన్న పిల్లలా ఏడ్చాడు జయరామ నాయుడు.
రాజ శేఖర రెడ్డి గూడా అశోక్ రెడ్డిని పట్టుకొని" దెబ్బలు ఏం తగల్లేదు గదా నాయనా? " అని గట్టిగా హత్తుకొని కళ్ళళ్ళో నీళ్ళు పెట్టుకొన్నాడు.
ఆయాసంతో రొప్పుతూ వున్న తండ్రిని చూసి " నా కేమీ కాలేదు నాయనా" అని ధైర్యం చెప్పింది రమ.
అంత లోనే ఇద్దరి పల్లెల దివాన్లు వచ్చారు.
" ఇప్పటి కైనా అర్థం అయ్యింది కదా? రహస్యం తెలిసింది గదా? కొట్లాటలు మాని అందరూ సుఖంగా ఉందాం. రెండు పల్లెల ప్రజల్ని సుఖ పెట్టుదాం. బీదా బిక్కీ ఈ కొట్లాటల్లో నలిగి పోతున్నారు" అన్నాడు శర్మ గారు.
" రాజ శేఖరా...నన్ను క్షమించు" అని నాయుడు గారు రెడ్డి గారిని గట్టిగా హత్తుకొని ఏడ్చి నాడు.
" నువ్వే నన్ను క్షమించాలి...ఇద్దరమూ ఒక్కరినొక్కరు అర్థం చేసు కోకుండా ఎచ్చులకు పోయి పల్లెల్లో జనాల బతుకుల్ని బజారు పాలు చేశాము..కక్షలు ..కోపాలు మన కొద్దు..ప్రశాంతంగా జీవిద్దాం.' అన్నాడు రెడ్డి గారు నాయుడి గారి కళ్ళు తుడుస్తూ.
" నాయనా..దీని కంతటికీ కారణం మేము.. ఉన్నవీ లేనివీ మీకు కల్పించి అబద్దాలు చెప్పి అన్న దమ్ముల్లాంటి మీ మనసుల్ని పాడు చేసినాము...మీ మధ్య కొట్లాటలు పెట్టాము. అవింత దూరం పోతాయని అను కోలేదు. చెల్లమ్మా ..నన్ను క్షమించు..అశోక్ ..నన్ను క్షమించు.."
అని రమను, అశోక్ ను హత్తుకొంటు క్షమాపణలు కోరినారు సుధాకర్ , దివాకర్ అన్నదమ్ములిద్దరూ.
ఆనందంతో మళ్ళీ రెండు పల్లెల వారు పోలేరమ్మ ఆశీస్సుల కోసం నాయిడు గారి పల్లెకు బయలు దేరినారు.
బ్రహ్మాండమైన స్వాగతాలతో ..భాజా భజంత్రీలతో ...ప్రతి ఒక్కరూ రెండు కుటుంబాల వారికీ స్వాగతం పలుకుతూ , అందరి మీదా పూల జల్లును కురిపించారు.
రెండు కుటుంబాల వారి అమ్మ వారి ఆశీస్సులు అందుకొన్నారు.
దేవతలు ఆశీస్సులు అంద చేసి నట్లుగా సన్నని వర్షపు జల్లు కురిసింది.
**************************************************
మూడేళ్ళ తరువాత
రమ కి అశోక్ తో అంగరంగ వైభవోపేతంగా వివాహం జరిపించారు. పది పల్లెల వాళ్ళు పది వేల మంది పెళ్ళికి హాజరయ్యారు.
పెళ్ళి జరిగిన తీరు , విందు భోజనాల గురించి కథలు కథలుగా చెప్పుకొన్నారు జనాలు.
సంవత్సరం తిరగక ముందే పండంటి బిడ్డకు జన్మ ఇచ్చింది రమ.
బారసాల ఘనంగా చేశారు రాజ శేఖర రెడ్డి గారు.
బాబుని పొత్తిళ్ళ లోకి తీసుకొంటూ " ఏమి పేరు పెడదాము? " అని అడిగాడు జయ రామ నాయుడ్ని.
కొందరు వారికి ఇష్టమైన పేర్లు చెప్పారు.
కొందరు రెడ్డి వీర శేఖర అని ఇద్దరి ముత్తాతల పేర్లు వచ్చేటట్లు పెడితే బాగుంటుంది అన్నారు.
రాజ శేఖర రెడ్డి బాబుని చూస్తూ.." నా మనమడికి నేనే పేరు పెడతా" అన్నాడు.
అందరూ ఆయన ఏమి పేరు పెడతాడో అని వేచి ఉన్నారు.
" రెడ్డి నాయుడు" అని గట్టిగా నవ్వాడు.
ఆ పరిసరాలన్నీ ఆనందంతో చప్పట్లతో మారు మోగి పోయింది.
బాబుని అందరూ " ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధి రస్తు" అని అక్షింతలతో దీవించారు.
***********************************************
శుభం భూయాత్!
అందరూ సుఖ సంతోషాలతో ఉందురు గాక!!
వారణాసి భానుమూర్తి రావు
రచయిత
(ఈ కథలోని ఏ భాగాన్నైనా , ఏ సన్ని వేశాన్ని అయినా రచయిత వ్రాత పూర్వక అంగీకారం లేకుండా ఎక్కడయినా వాడుకొన్నా, సంగ్రహించినా , ఏ సినిమా లోనూ , ఏ టీవీ సీరియళ్ళలోనూ కొన్ని సన్ని వేశాల్ని కాపీ చేసినా , అనుసరణ చేసినా ఎలాంటి కాపీ హక్కులు ఉల్లంఘించినా చట్టరీత్యా చర్యలు తీసుకోబడును..)
25 రోజులుగా 5.10.2020 నుండి 30.10.2020 వరకు ఈ నా ధారావాహిక ను ప్రోత్సహిస్తూ వచ్చిన పాఠక దేవుళ్ళకూ, నా ఈ ధారావాహికను ప్రచురించడానికి అనుమతి తెలిపిన అనంత సాహిత్య వేదిక రధ సారధి శ్రీ హరి హర గారికి నా ధన్య వాదములు తెలుపు కొంటున్నాను. అలాగే మిగతా అడ్మిన్ లకు నా ధన్యవాదములు. ఈ నవలను పుస్తక రూపంలో తేవడానికి ప్రయత్నిస్తాను. ఇది నా మొదటి నవలా ప్రక్రియ.ఆదరించిన కవి మితృలకు అభివందనాలు.
వారణాసి భానుమూర్తి రావు
రచయిత
హైదరాబాదు.
30.10.2020
No comments:
Post a Comment