సంస్కార సమేత రెడ్డి నాయుడు
ఇరవై ఒకటవ భాగం(21)
అనుకొన్నట్లుగానే వీర కేశవ రెడ్డి రెండు రోజుల తరువాత రెండు గ్రామాల్లోను దండోరా వేయించాడు.
" వచ్చే ఆషాఢం నెలలో మొదటి ఆది వారం నాడు మన రెడ్డి వారి పల్లిలో గంగమ్మ పూజలు జరుగు తాయి. అందరూ మీ కుటుంబాలతో ..బంధువుల తో అమ్మోరికి బోనాలు ఇచ్చుకొవల్ల హో..." అని పలకలు కొట్టుకొంటూ వెళ్ళాడు.
పిల్లోళ్ళు..పెద్దోళ్ళు...ముసలీ ముతకా ఆనందానికి హద్దే లేక పోయింది. ఎన్ని రోజులకో గంగమ్మ జాతర జరుగుతా ఉండాది మనూర్లో అని పొంగి పోయినారు వూర్లోని ప్రజలు.
గంగమ్మ బోనాలుకు పెద్ద జాతర జరుగుతుంది..ఎక్కడ నుండో చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొనే వాళ్ళు..దాసరోళ్ళు...పూసలు అమ్ముకొనే వాళ్ళు..రంగుల రాట్నం పెట్టే కడప సాయిబూలు, కమ్మర కట్లు ..మిఠాయిలు అమ్మే మహాల్ సాయిబూలు..గాజులు అమ్మే వాళ్ళు..మూలికలు అమ్మే చెంచు తెగోళ్ళు..జ్యోతీష్యం చెప్పే కోయ రాజులు అందరూ వారం రోజుల ముందే అంగళ్ళు పెట్టు కొంటారు.
రెడ్డి వారి పల్లె అమ్మ వారి గుడి ముందర రెండు మూడు ఎకరాలు మైదానం ఉంది. అక్కడే ఈ అంగళ్ళను పెట్టు కొంటారు.
గంగమ్మ పండగ అంటే ఆ చుట్టు ప్రక్కల పది గ్రామాల వాళ్ళూ చేరుతారు.
వీర కేశవ రెడ్డి కుటుంబం అంతా గంగమ్మ పండగ పనుల్లో మునిగి పొయ్యారు.
ఇక పండగ వారం రోజులు ఉన్నందువలన పనులు చక చక మని చెయ్యాల్సి వస్తోంది.
తాటాకు పందిళ్ళు వెయ్యడం..రంగు కాగితాలు అంటించడం..చలువ నీటి కేంద్రాలు..కొత్త కుండలు కొనేది ...వెదురు బుట్టలు..ఇంకా అమ్మోరి పండక్కి కావలసిన పక్క నున్న పెద్ద ఊర్లకు పోయి కొనుక్కొస్తున్నారు. గంగమ్మ అమ్మోరి విగ్రహం గుడి బయట ఉంటుంది.. ఆ విగ్రహాన్ని బాగా కడిగి ..నీళ్ళు పోసి ...వేపాకు మండలు..నిమ్మ కాయలు ..మామిడి ఆకులు కడతారు. అమ్మోరికి ఎండ తగల కుండా పెద్ద చలువ పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు.
వీర కేశవ రెడ్డి ..రెడ్డప్ప నాయుడు కలిసి ఈ పండగ ను నిర్వర్తిస్తారు. ఖర్చులుకు వెనక్కి తగ్గరు. రెండు గ్రామాల ప్రజలు తమకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తారు. మూడు రోజులు గంగమ్మ పండగ జరుగుతుంది.. మూడు రోజులు ఇళ్ళళ్ళో పొయ్యి వెలిగించరు. ఇక్కడే ఆమ్మోరికి బలి ఇచ్చే కోడ్లు..మేక పోతుల్ని వండి వడ్డిస్తారు.
ఆది వారం రానే వచ్చింది.
వీర కేశవరెడ్డి కుటుంబమంతా శుభ్రంగా స్నానాదులు ముగించుకొని అమ్మవారి గుడికి చేరారు. అక్కడ జరగ వలసిన పనులన్నీ చూస్తున్నారు. అంతలోనే రెడ్డప్ప నాయుడు కుటుంబ సభ్యులు గూడా వచ్చారు. రెండు గ్రామాల ప్రజలే కాకుండా మిగతా గ్రామ ప్రజలతో సందడిగా ఉంది. తోలు పలకల శబ్ధాలు..పులి వేష గాళ్ళు, పోత రాజులు, పగటి వేషగాళ్ళు వాయిస్తున్న డప్పులతో విపరీతమైన శబ్ధంతో ఆ ప్రదేశం కోలాహలంగా వుంది.
అంతలో ఆ వూరి పెద్దాయన రంగన్న రంగం లోకి దిగినాడు.అతని వళ్ళంతా కుంకుమ , పసుపు తో నిండి పోయింది. గోచీ కట్టుకొని వేపాకు మండలను మొల చుట్టూ కట్టు కొన్నాడు.పెద్ద పెద్ద వేపాకు కట్టలను రెండు చేతుల్లో పట్టుకొని అందరిని అదిలిస్తూ ..బెదిరిస్తూ ఎర్రగా ఉన్న తన నాలుకను బయటకు చాచి ..చూసే వాళ్ళకు భయం కొలిపేటట్లు వున్నాడు. తన చుట్టూ ఉన్న డప్పుల దరువు అనుగుణంగా ఎగురుతూ చేతులు ఊపుతున్నాడు.
రంగన్న రంగం లోకి దిగుతూనే అమ్మ వారు ఆవాహన అయి భవిష్యత్తు గురించి చెబుతాడు.అందుకే ఆయన అంటే అందరికి భక్తి..భయము.
గంగమ్మ వారి విగ్రహం పెద్ద రాతి ఆరుగు మీద నిలబెట్టి ఉంచారు. ఈ రాతి విగ్రహం ఎప్పుడో పూర్వీకులు చెక్కించి ప్రతిష్ఠించారంట.
నల్ల విగ్రహం నాలుక సాచి ఎర్రని కళ్ళతో నిలబడుకొని , ఒక చేతిలో రాక్షసుని తల, ఇంకొక చేతిలో త్రిశూలం ఉంటుంది. మెడలో నిమ్మ కాయల దండ..పూల దండలు..వేపాకు మండలు ఉంచినారు.
ముందర యాట్లు కోసిన జంతువులు రక్తం కారుతూ పడి ఉన్నాయి.
రంగన్న అమ్మ వారి విగ్రహం ముందర కూర్చొన్నాడు
" అమ్మా ఒక్కొక్కరే రండి" అని పిలిచాడు ఒకాయన.
మొదటి ఇల్లు వీర కేశవ రెడ్డి భార్య ఒక్క కడవ నిండుకు పసుపు ..వేపాకు కలిపిన నీళ్ళు అతని మీద కుమ్మరించింది.
తరువాత రెండవ ఇల్లు రెడ్డప్ప నాయుడు గారి భార్య కుమ్మరించింది
మిగతా వూర్లోని అమ్మలక్కలంతా ఒక్కరి వెంట ఒక్కరు నిలబడుకొని రంగన్న మీద కడవల కడవల పసుపు , వేపాకులతో కలిపిన నీళ్ళు కుమ్మరిస్తున్నారు.
" నూటొక్క గడపలు వచ్చాయా? నూటోక్క గడపలు బోనాలు తెచ్చినారా" అని రంగన్న గట్టిగా అరచి నాడు.అప్పుడే ఆయనకు అమ్మవారు పూనకం పట్టినట్లు వూగుతున్నాడు.
" అమ్మా..కోప్పడకు తల్లీ..అందరూ బోనాలు గూడా తెచ్చినారు" అనగానే ఆ వూరి అమ్మలక్కలు నెత్తిన పెట్టుకొన్న బోనాలను అమ్మ వారి విగ్రహం ప్రక్కన పరచిన ఈత చాపల మీద కుమ్మరించారు. కొత్త కుండలో..కొత్త బియ్యం..బెల్లం ..పెరుగు కలిపిన అన్నాన్ని అమ్మ వారికి ప్రసాదంగా అర్పించారు.
ఒక పెద్ద గుట్ట లాగా అన్నం అమ్మ వారి ముందర సమర్పించారు.
ఒకాయన అమ్మవారికి పెట్టిన అన్నం మీద కుంకుమ .పసుపు చల్లి నాడు.
ఈ ప్రసాదాన్ని తరువాత అందరికీ పంచుతారు. వారి వారి పొలాల్లో..ఇండ్ల చుట్టూరూ..గోడ్ల సావిడ్ల చుట్టూ చల్లుతారు.
" అమ్మా..సంతోషమా? లేదా? ఏమయినా కొరత ఉంటే చెప్పు తల్లీ" అని అడిగాడు ఆ పెదాయన పూనకం వచ్చిన రంగన్నని.
" యాట్లు కొయ్య లేదా? రక్తం కావాలి రా! ....అన్నాడు పూనకం రంగన్న రొప్పుతూ .
"అమ్మా ..మేక పోతులు బలి ఇచ్చినాము..కోడి పుంజులు ఇచ్చినాము . ఇగ పెద్ద యాట్లు వద్దను కొన్నాము తల్లీ" అన్నాడు పెద్దాయన.
మామూలుగా దున్న పోతును అమ్మ వారికి బలి ఇస్తారు.
కానీ ఈ సారి వద్దను కొన్నారు రెడ్డి గారు.
" సరే..." అన్నాడు రంగన్న.
" అమ్మా . రంగంలోకి వచ్చి మమ్మల్ని దీవించు.....నీ మాటలు ఇనల్ల అని పల్లె ప్రజలు అంతా కాసుకో నుండారు" అన్నాడు ఆ పెద్దాయన రెండు చేతులూ ఎత్తి దండాలు పెడుతూ..
రంగన్న పూనకంతో వూగి పోతున్నాడు. ఇద్దరు ముగ్గురు పట్టుకొన్నా వారికి చాత కావడం లేదు.
నలుగైదుగురు మనుషులు గట్టిగా పట్టుకొన్నారు రంగన్నను..ముగ్గులు వేసి పసుపు కుంకుమ గుండ్రంగా వేసి పూలు చల్లిన ఒక తావులో మూత మూసిన కుండ మీద నిలబెట్టారు రంగన్నను.
" అమ్మా..రంగం లోకి వచ్చి నావు..మాకు ఏమయినా చెప్పు తల్లీ ! రెండు మూడేళ్ళుగా వానలు లేవు..పజలు కట్టాలు పడుతున్నారు " అని అడిగాడు ఆ పెద్దాయన.
అంతే..అందరూ నిశ్శబ్ధమై పొయ్యారు..ఆకు పడితే గూడా అకు పడిన శబ్ధం విన బడుతోంది. అందరూ చెవులు రిక్కించి వింటున్నారు.
" నా బిడ్డల క్షేమమే నా క్షేమం..మీరు బాగుండాలి. నాకు పూజలు చేసేది మరచి పోయినార్ర! అందుకే మీకు కట్టాలు వచ్చినాయి" అన్నాడు పూనకం పట్టిన రంగన్న.
" అమ్మా..నన్ను క్షమించు..దానికి నేనే కారణం..వానలు లేవు ..పంటలు లేవు. జనాలు చానా కష్టపడుతున్నారు" అన్నాడు వీర శేఖర రెడ్డి రెండు చేతులు జోడించి.
" నా కర్థ మయింది నాయనా..ఇక మీకు ఏ కష్టం రాదు.మీ గ్రామాలను బాగా కాపాడుతాను. మీరు ఇంక ఏ సీకు సింతా లేకుండా బతకండి." అమ్మవారు అవాహన పూనిన రంగన్న అన్నాడు.
" అమ్మా ..ఈ సారి వానలు బాగా పడతాయా? పంటలు బాగా పండుతాయా? "
' ఈ సారి అంతా బాగుంటుంది. నేను చూసుకొంట"
రంగన్న బలంగా వూగు తున్నాడు.
" అమ్మా .ఒక ప్రశ్న అడగాల..మా వూర్లకు రెండు కళ్ళ వంటి వారు వీర కేశవన్న.. రెడ్డన్న..వాళ్లను దయ సూడు తల్లి..ఈ సారి ఇద్దరికీ కడుపు పండింది.నువ్వే ఆ పిల్లోళ్ళను కాపాడల్ల..ప్రతి కానుపులో పిల్లోళ్ళు సచ్చి పోతా ఉండారు" అన్నాడు ఆ పెద్దాయన.
" నా బిడ్డలకు కట్ట మొస్తే నాకు కట్టమే..ఈ సారి మీ బిడ్డలు బతకాలంటే రెండు కుండలూ మార్చు కోండి నాయనా" అని పూనకం వచ్చిన రంగన్న ఆవేశంతో వూగి పోతూ రంగం నుండి బయట కొచ్చారు.
రంగన్నకు దిష్టి తీసి , కర్పూర హారతులు వెలిగించి..టెంకాయలు పగల గొట్టి కాళ్ళ మీద పడి దండాలు పెట్టినారు ఆ గ్రామాల ప్రజలు.
*******************************************
తరువాత ఏమయ్యిందో రేపు ఇరవై రెండవ భాగంలో చూద్దాం ! )
***********************************************
( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల , ఏ వర్గ , ఏ సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)
(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష తెలుపు తారు గదూ? )
రచయిత: వారణాసి భానుమూర్తి రావు
జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా
ప్రస్థుత నివాసం : హైదరాబాదు.
కాపీ హక్కులు @రచయితవి.
Copy Rights with Author.
No comments:
Post a Comment