Friday, October 30, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (24)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు (24)


ఇరవై నాలుగవ భాగం

--------------------------------------------------

రాజకీయ కక్షలతో, హత్యలతో ఉట్టడుకుతున్న రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గున మండే టట్లు ఉన్నది.


ఈ చర్యలు , ప్రతీకార చర్యలు   ఇంతటితో ఆగేటట్లు లేవు. ఈ వర్గాల పోరు గురించి చిత్తూరు జిల్లా గాకుండా రాయల సీమలో అంతా కథలు కథలు గా చెప్పుకొంటున్నారు. 


ఈ సారి  ఆషాడ మాసంలో పోలేరమ్మ కు బోనాల పండగ ఘనంగా చెయ్యాలను కొన్నారు జయరామ నాయుడు గారు.


ఎంత ఘనంగా అంటే రెడ్డి వారి పల్లెలో వాళ్ళంతా కుళ్ళి కుళ్ళి సావల్ల అనేట్లు....ధూంధాం  చెయ్యల్ల అని అను కొన్నాడు జయరామ  నాయుడు గారు . సుధాకర్ ,  దివాకర్ మరియు మిగతా గ్రామ పెద్దల్ని పిలచి అందరూ కలసి కూర్చొని  మాట్లాడుకొన్నారు.



" అయితే ఒక కండిషన్..ఆ పల్లెలోంచి  ఒక్క పురుగు ఇక్కడ కనబడినా కాల్చి పారేస్తారు మనోళ్ళు. అక్కడి కాకులు గూడా పల్లె మీద వాలడానికి వీల్లేదు నాయనా" అని అన్నాడు సుధాకర్ కోపంగా..


అప్పుడు అశోక్ రెడ్డి బిక్షగాడి వేషంలో వచ్చినట్లు ఈ సారి వస్తే తుపాకీతో కాల్చి పారేస్తానన్నాడు  దివాకర్.


కోపంతో అన్న దమ్ములు ఇద్దరూ వూగి పోతున్నారు.


" ఈ సారి పెద్ద ..చిన్న అని చూసేది లేదు అన్నా.. కనబడినోళ్ళను  నిలబెట్టి నరకడమే..ఎట్ల అమ్మోరు బలి కోరుకొంటుంది గదా" అన్నాడు ఆ గుంపులో ఒక పెద్దాయన.


ఇంటి ముందర వరండాలో కూర్చొన్న ఈ పెద్ద మనుషుల మాటలన్నీ మణెమ్మ విని‌ భయంతో వణికి పోయింది. ముచ్చెమటలు పట్టి ఒళ్ళంతా కంపర మిచ్చింది. ఎన్ని తలకాయలు తెగి పోతాయో...ఇంకా ఏమి ఉపద్రవం ముంచు కొస్తుందో అని భయ పడి పోయింది.


ఆ నోటా ఈ నోటా ఈ విషయం ప్రాకి రాజ శేఖర రెడ్డి గారి  చెవిన పడింది.


" ఈ సారి పోలేరమ్మ జాతర ఘనంగా చేసు కొంటారంట.ఏమైనా తేడా వస్తే రెండు పెద్ద తల కాయల్ని లేపేస్తామని అని మాట్లాడు కొంటున్నారంట వాళ్ళు " అని‌ ఒకాయన రెడ్డి గారి కి ఈ వార్త అందించాడు.


రాజ శేఖర రెడ్డి కోపంతో రగిలి పొయ్యాడు. నిప్పు తొక్కిన వాడిలా కోపంతో వూగి పొయ్యాడు.


" ఇక్కడ ఎవ్వరూ గాజులు తొడుక్కోలేదు అని చెప్పు..రెండు తల కాయలు మనవి తెగితే వాళ్ళవి  ఆరు తలకాయలు తెగుతాయి. ఆడ మగ అని చూడకుండా లేపేస్తాం. మన సీమ రెడ్ల కత ఇంకా  తెలీదేమో..మంచికి ప్రాణం ఇస్తాం.. లేదంటే అడ్డంగా నరుకు తాం" అని నాగు పాములా బుసలు కొట్టాడు రాజ శేఖర రెడ్డి.


ఆ రోజు పది మంది తన నమ్మక మైన వాళ్ళను  పిలిపించుకొని , వారితో దీర్ఘంగా రహస్య సమాలోచన చేశాడు.


" మనూర్లో ఉండే వాళ్ళకందరికీ చెప్పండి..ఏరు దాటి ఆ పల్లె పరిసరాలకు గూడా పోవద్దని. వాళ్ళు పోలేరమ్మ బోనాలు చేసుకొన్నా , ఇంకేమి చేసుకొన్నా ఎవ్వరూ అక్కడికి పోవద్దని చెప్పండి. సావు కొని తెచ్చు కోవద్దని చెప్పండి. ఇంకో ముఖ్య మైన విషయం ఏమిటంటే ..ప్రతి ఇంట్లో కొడవలో , గొడ్డలో , కత్తో, బాకో , చింత కాయలు కోసే దోటి కొడవలో ఏదో ఒకటి బాగా నూరుకోని పదును పెట్టుకొమ్మని చెప్పండి. ఏ క్షణాన ఏ యుద్దం జరుగు తుందో చెప్పలేం " అని రహస్యంగా మాట్లాడుకొన్నారు రెడ్డి గారు తనకు కావలిసిన నమ్మక మైన వాళ్ళతో..



రాత్రికి రాత్రే వూరంతా గుప్పు మనింది ఈ వార్త. కానీ ఎవ్వరూ ఎవ్వరితో మాట్లాడ డానికి సాహసించడం లేదు. ఎవరింట్లో వాళ్ళు కత్తులు , కటారులు పదును పెట్టు కొంటున్నారు. ఒక పెద్ద చెకి ముకి రాయి నున్నగా ఉంటుంది.. ఆ రాయికి పెట్టి కత్తులు నూరుతారు పల్లెల్లో.


" నిజం ఎవ్వరూ చెప్పడం లేదు..చుట్టాలు వస్తా వుండారు. అందుకే జీవాల్ని కొయ్యల్ల ..అందుకే కత్తులు నూరు కొంటా వుండాము" అని అడిగితే చెప్పతా వున్నారు.


పల్లె పల్లెంతా రాత్రంతా ప్రతి ఇంటినుండి ' సుయ్ సుయ్'   అనే కత్తులు ..కోడవళ్ళు పదును పెట్టడానికి నూరుతున్న శబ్ధాలు వినబడుతున్నాయి. గుండెలు ఝల్లుమనే ఆ శబ్ధాలు విని పల్లెలోని ముసలోళ్ళ ప్రాణాలు పైననే పోతున్నాయి.


*****************************************************


పోలేరమ్మ బోనాల పండగ రానే వచ్చింది.


నాయుడు గారి పల్లె అంతా సంబరాలలో మునిగి పొయ్యారు. అందరూ స్నానాలు ముగించుకొని కొత్త బట్టలు తొడుక్కొన్నారు.


పిల్లలు , పెద్దలూ పరుగులు పెట్టుకొంటూ పోలేరమ్మ  గుడికి చేరు కొంటున్నారు. 


సుధాకర్..దివాకర్ ..ఎక్కడ చూసినా వారే పనుల్ని చూసుకొంటూ అందరినీ పరామర్శిస్తూ కలియ తిరుగు తున్నారు.


అమ్మవారి విగ్రహం భయంకరంగా ఉంది.  ఆరడుగుల విగ్రహం , నల్ల రాతితో చేసిన పోలేరమ్మ విగ్రహం ..మెడలో నిమ్మ కాయల దండ..వేపాకు మండలు..కుంకుమ ..పసుపు ..ధూప దీప నైవేద్యాలు తో అమ్మవారు మిల మిల మెరుస్తా ఉంది.

గుడి బయట విశాల మైన రాతి బండల అరుగును ఏర్పాటు చేసినారు. అక్కడే కోడ్లను..మేకల్ని బలి ఇస్తారు అమ్మ వారికి.


' అయ్యా..వూరు వూరంతా అమ్మ వారి పండగ చేసుకొంటున్నారు. రమను గూడా  గుడికి పంపుదాము. అది ఏడుస్తా ఉండాది" అంది మణెమ్మ.


" సరే...అమ్మి తో నువ్వే కాపలా ఉండు. అమ్మిని జాగ్రత్తగా చూసుకో! " అన్నాడు జయ రామ నాయుడు.


రమ ..మణెమ్మల సంతోషానికి అవధులు  లేవు. 


స్నానాలు చేసుకొని మంచి పట్టు లంగా, వోణి వేసుకొని , బంగారు గాజులు, ముత్యాల హారం , మామిడి పిందెల బంగారు హారం  వేసుకొనింది రమ. ముహాన ఎర్ర కుంకుమ బొట్టు పెట్టుకొని, చెంపల మీద చందనం రాసుకొనింది. మణెమ్మ , నిర్మలమ్మ ఆశ్చర్య పొయ్యారు రమను చూస్తూ..


" అచ్చం..  కనక దుర్గమ్మ తల్లిలా ఉన్నావు. నీ ముహంలో ఏదో దివ్య శక్తి ఉందమ్మా" అని నిర్మలమ్మ. కూతుర్ని హత్తుకొని దీవించింది.


ఇంటిలో కెళ్ళి పళ్ళెంలో సున్నము , పసుపు నీళ్ళు కలుపు కొని మూడు సార్లు దిష్టి తీసింది నిర్మలమ్మ.


నిర్మలమ్మ ఒక్క  పసుపు, కుంకుమ ,వేపాకులు కలిపిన నీళ్ళు ఒక కుండలో నింపి నెత్తిన పెట్టుకొనింది.


మణెమ్మ అన్నం, బెల్లం , పెరుగు కలిపిన అన్నాన్ని ఒక బుట్టలో పెట్టుకొని నెత్తిన పెట్టుకొనింది.


రమ అమ్మ వారికి సమర్పించే పూలు, పళ్ళు, టెంకాయలు వున్న  సంచీని పట్టుకొంది.


నిర్మలమ్మ, మణెమ్మలు గూడా పట్టు చీరలు కట్టుకొని , రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టు పెట్టుకొని, మెడలో రెండు పేటల బంగారు హారం వేసుకొని  గుడి వైపు బయలు దేరారు .‌


ఈ సారి గుడి ప్రత్యేకంగా అలంకరించారు. గుడి పరిసరాలు  శుభ్రం చేసి గుడికి రంగులు వేశారు.


విశాల మైన చలువ తాటాకు వెదురు పందిళ్ళు..రంగు రంగుల కాగితాలు వ్రేలాడుతున్నాయి.


ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే అప్పుడే కొత్తగా వచ్చిన గ్రామ్ ఫోన్ రికార్డ్లు, ఆహుజా వారి లౌడ్ స్పీకర్లు. అందులోంచి వచ్చే సినిమా పాటలు, భక్తి పాటలు నాలుగైదు వూర్ల దూరంలో గూడా విన బడుతోంది.


రెడ్డి వారి పల్లె కు గూడా విన బడుతోంది ఆ పాటల శబ్ధం..

రాత్రిళ్ళు వెలుగు కోసం గ్రామాని కంతా సరిపొయ్యే పెట్రో మాక్సు లైట్లు ఓ యాభై తెప్పించి అక్కడక్కడా వేలాడ దీశారు.


రంగం సిద్ద మయ్యింది.

నాయుడు గారిబ్పల్లెలో మామూలుగా అమ్మవారు ఈరన్న కుటుంబం లో వారికి వస్తుంది.


బాగా అలంకరించి..ముగ్గులు పెట్టిన తావు లోకి వచ్చి చెబుతాడు ఈరన్న.గుంపులు గుంపులు చేరి ఈరన్న కోసం కాచుకొని ఉన్నారు.


నాయుడు గారి కుటుంబ సభ్యులు అందరూ అక్కడే కుర్చీలల్లో కూర్చొని ఈరన్న కోసం కాచుకొని ఉన్నారు.


సుధాకర్ గట్టిగా అరచాడు.."పదుకొండు దాటి పోతావుంది..అమ్మోరు ఏం చెప్పుతుందో అని అందరూ కాచు కోని ఉండారు.. ఎక్కడా ఆ ఈరన్న..పోయి పిలుచు కోని రండి" అని తన మనుషుల్ని పంపినాడు.



కొంతమంది  " అమ్మా తల్లీ కాపాడు.. " అని గట్టిగా అరుస్తూ టెంకాయలు కొడుతున్నారు. కొంత మంది అమ్మ వారిని చూస్తూనే పూనకం పట్టినట్లు వూగి పోతున్నారు. కొంత మంది పోత రాజులు డప్పు పలకల దరువుతో ఎగురుతూ నృత్యం చేస్తున్నారు.


లౌడ్ స్పీకర్లు ఎవ్వరో కట్టేశారు. వద్దని దివాకర్ చెప్పడంతో.

" రంగం లోకి ఈరన్న కొంచెం సేపట్లో వస్తాడు..అందరూ నిశ్శబ్ధంగా ఉండండి.అమ్మోరు మనల్ని దీవిస్తారు. అమ్మోరు చెప్పేది అందరూ బాగా చెవులు బెట్టి వినండి" అని సుధాకర్ గట్టిగా అన్నాడు.


అంతే..ఒక్క సారిగా నిశ్శబ్దంగా మారి పొయ్యాయి ఆ పరిసరాలు. ఎవ్వరూ మాట్లాడ డానికి సాహసించ లేదు.


అందరూ ఈరన్న కోసం కాచుకొని ఉన్నారు. కానీ ఈరన్న రాలేదు.


ఒక్క సారిగా రమ ఎగిరి గంతేసింది. చేతుల్లో ఉన్న పళ్ళేన్ని విసిరి వేసింది. ఆమె ముఖం ఒక్క సారిగా రౌద్రం దాల్చింది. ముక్కు పుటాలు, కను బొమలు అదురు తున్నాయి . నోరు వంకరలు పోతోంది. చేతులూ..కాళ్ళూ తిప్పుతూ నృత్యం చేస్తోంది.


అక్కడున్న  వారికి అర్థం అయి పోయింది.అమ్మ వారు రమలో ఆవాహన అయ్యిందని అందరికీ తెలిసి పోయింది.


అంతలో అక్కడున్న వారికి  ఈరన్న తెలివి తప్పి పడి పొయ్యాడని తెలిసింది. తెలివి వచ్చినాక రంగంకి వస్తాడని తెలిసింది.


" అమ్మా..ఏదో తప్పు జరిగింది..శాంతించు తల్లీ" అని అక్కడున్న ప్రజలు  రమకు దండాలు  వంగి వంగి పెడుతున్నారు.


రమలో శక్తి ఇంకా ఎక్కువయ్యింది.


పది మంది ఆడ వాళ్ళు పట్టుకొన్నా వారి చేత కావడం లేదు..


వారి పట్టు విదిలించుకొని రమ రంగం మీదకు పోయింది.


" ఒరేయ్ ..ఈ రోజు నేను భవిష్యత్తు చెబుతాను. శాంతంగా వినండి. ఈరన్నను నేనే రావద్దన్నాను. " అంది  రమ వూగి పోతూ.


" అమ్మా..మా వల్ల ఏమైన తప్పు జరిగుంటే క్షమించు..మేమేమి సెయ్యాల్నో సెప్పు" అన్నాడు ఒక పెద్దాయన రమ పక్కన నిల బెడి దండం పెడుతూ..


" గ్రామ ప్రజ లారా..మీకు ఒక రహస్యం చెప్తాను. రెడ్డప్ప నాయుడు చని పోతూ ఒక రహస్యం దాచి నారు. అది ఆయన సమాధి కుడి పక్క వెండి పళ్ళెం లో దాచి పెట్టినాడు..పోయి తీసుకు రండి" అంది రమ.


అందరూ ఆశ్చ్యర్య పోయ్యారు.


సుధాకర్ , దివాకర్ ఇంకా కొంత మంది పెద్ద మనుషులతో వారి తాత గారి సమాధికి వెళ్ళి కుడి వైపు గునపంతో తవ్వి వెండి పెట్టెను పైకి తీశారు.


పరుగు పరుగున రొప్పుకొంటూ ఆ పెట్టెను జయరామ నాయుడికి ఇచ్చారు.


ఆ చిన్న పెట్టెను పగల గొట్టి లోపల రాగి రేకు మీదున్న ఉత్తరాన్ని చదివాడు.


అంతే..ఆ రహస్యం చదివిన జయ రామ నాయుడు కళ్ళు తిరిగి పడి పోయ్యాడు


ఏమిటి?? జయరామ నాయుడు తండ్రి గారు వీర కేశవ రెడ్డీనా? రాజ శేఖర రెడ్డి తండ్రి గారు రెడ్డప్ప నాయుడా? అని అక్కడున్న ప్రజలంతా ముక్కున వేలేసుకొన్నారు.


ఆ రహస్యం అందరికీ తెలిసి పోయింది.


" ఇది అమ్మోరు కలలో చెప్పిందంటా ఆ రోజు..అట్లా చేస్తే బిడ్డలు బతుకు తారంట..." అని అక్కడున్న జనాలంతా మాట్లాడు కొంటున్నారు.


ఇంతలో ఒక పాత జీపులో ఒక పది మంది  గూండాల్లా ఉన్నారు.పొలో మని దిగినారు. వాళ్ళ చేతుల్లో నాటు తుపాకీలు ఉన్నాయి. అక్కడున్న ప్రజలంతా భయపడి పోయి తలకు ఒక దిక్కు పారి పొయ్యారు.


ఆ కిరాయి గూండాలు రమను ఎత్తుకొని జీపులో ఎత్తి వేసి క్షణాల్లో అక్కడి నుండి మాయ మయ్యారు.


వూర్లోని యువకులు , పెద్దోళ్ళు, పిల్లోళ్ళు చేతికి ఏది దొరికితే ఆ ఆయుధాన్ని తీసుకొని ఆ జీపు వెంబడీ పరుగెత్తారు.


కొందరి చేతుల్లో కత్తులు , కటార్లు, కట్టెలు, బాకులు, రాళ్ళు తీసుకొని పరుగెత్తారు.


బాహుదా నది పక్క మట్టి రోడ్డు వెంబడీ  రెండు మైళ్ళు పోయి దయ్యాల గుట్ట కింద జీపు ఆపి  గుట్ట పైకి మెడ బట్టి లాక్కోని పొయ్యారు రమను  ఆ గూండాలు. రమ చేస్తున్న ఆర్త నాదాలతో ఆ  దయ్యాల గుట్ట ప్రతిధ్వనిస్తోంది.. పులి నోట్లో   చిక్కుకొన్న లేగ దూడ  వలే రమ గడ గడ మని వణికి పోతోంది.

**********************************************************************************************(తరువాత ఏమయ్యిందో రేపు  ఇరవై  ఐదవ భాగం ( చివరి? ) లో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి.

Copy Rights with Author 

No comments:

Post a Comment