సంస్కార సమేత రెడ్డి నాయుడు
పంతొమ్మవ భాగం(19)
------------------------------------------------------------
ఇద్దరూ ఏటి గట్టున ఉన్న మిట్ట కాడికి చేరుకొన్నారు.
రెడ్డప్ప నాయుడు ...వీర కేశవ రెడ్డికి ఒక అనుబంధం ఉంది. ఇద్దరూ కొన్ని గంటల తేడాతో ఒకే రోజు పుట్టారు. పల్లె ప్రజలంతా రామ లక్ష్మణులు పుట్టారని పండగ చేసుకొన్నారంట ఆ కాలంలో.
నాయుడు గారే కొన్ని గంటలు పెద్ద.
అందుకే అన్నా అని పిలుస్తాడు రెడ్డి గారు.
మణెమ్మ కొంత సేపు ఆగింది .. దగ్గరున్న మంచి నీళ్ళ గ్లాసు తీసుకొని నీరు తాగి జరిగిన కథను మళ్ళీ చెప్ప సాగింది.
మణెమ్మ పెద్దగా చదువు కోక పోయినా ఆమెకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏ సంవత్సరంలో ఏమి జరిగింది అని ఖచ్చితంగా చెప్పుతుంది.
" రాయల సీమలో అనావృష్టి వలన రెండు మూడు ఏళ్ళుగా వర్షాలు లేవు. సీమలో కరువుతో చాలా మంది ఆకలి చావులతో సచ్చినారు. 1837 లో రాయల సీమలో వచ్చిన కరువుకు లక్షలాది మంది పానాలు విడిచినారంట. అపట్లో దూబ కరువు..దొక్కల కరువు..వలసల కరువు అని కరువులు చాలా సార్లు వచ్చిందట. మా పెద్దోళ్ళు సెప్పంగా వినినాను.అప్పుడు ఆ ప్రజలు గంజి గడ్డలు, దెదరాకు జముడు కాయలు తిని బతికి నారంట. బలిసాకు తినయినా బతకచ్చు అనే సామెత ఈ కరువుల వల్లనే పుట్టిందేమో !"
" మీ లాంటి ఈ కాలం పిల్లలు ఈ కత లన్నీ ఇనల్ల...ఈ తరమోళ్ళకు తెలవల్ల.. మన పెద్దోళ్ళు ఎన్ని కట్టాలు పడితేనే గదమ్మా..మనం బతికి బట్ట కట్టింది. మా యమ్మ పస్తులుండి నాకు గంజి తాపిచ్చేదట" అని మణెమ్మ వాళ్ళ అమ్మను తలచు కొని ఏడ్చింది.
" మొన్న యాభై మూడు (1953) లో గూడా గంజి కరువు వచ్చిందమ్మా!నాలుగైదేళ్ళు వానలు లేవు. జనాలకు తిండి లేదు. అప్పటికి మేము గూడా సిన్న పిల్లోల్లమే.....ఆ గంజి కరువు కత గూడా చెప్పతా విను.." అంది మణెమ్మ.
మణెమ్మ చెప్పడం ఆపింది ..ఆమె గుండెల్లొ దుఖం ఎగదన్నుకొస్తోంది..కొంత సేపు మాట్లాడలేక నిశ్శభ్ధంగా వుంది.
"మా యమ్మ ..మా నాయన..మా తాత..మా యవ్వ తినేదానికి ఆకులు అలములు గూడా దొరక్క ఆ కరువుకు సచ్చి పోయినారమ్మా? " అని చిన్న పిల్లలా ఏడ్చింది.
ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్ళు బొట బొట మని కారి పోతున్నాయి. చీర కొంగు తో కళ్ళు మాటి మాటికి తుడుచు కొంటోంది. అయినా కన్నీళ్ళు ఆగడం లేదు.
" పెద్దమ్మా.. ఏడ్చద్దు...అవన్నీ తలచు కొని ఏడవద్దు.." అనీ తనూ ఏడుస్తూ మణెమ్మ కళ్ళు తుడిచింది.
" 60 ఏళ్లలో కానరాని ఇంతటి కరువు .బాయి లన్నీ ఎండి పాయె. తాగే దానికి నీళ్ళు లేవు.బాహుదా నది ఎండి పాయె ..సుక్క నీరు గూడా దొరకలా..ఎక్కడో తేమ ఉంటే అక్కడకి పోయి చెలిమి తవ్వి చిప్ప తో నీళ్ళు తోడుకొని తాగే వాళ్ళం. దిగుడు బాయిలు గూడా ఎండి పాయె.కనుచూప మేరా.. పొలాలు బీళ్లే. గంజి కరువులో ముసలోల్ల కట్టాలు చెప్పేదానికి లేదు.
గంజి కరువు.. రాయలసీమ ప్రాంతం ఎడారి అయిపాయె. ఎండల్లో మనుషులు పురుగల్ల సచ్చి పాయిరి. బావులు, సెరువులు, కుంటలు సుక్క నీళ్లు లేక ఎండిపాయె .
" చేన్లు , మళ్ళు బీళ్లు పడినాయి.కంటికి కనపడినంత దూరం పొలాలు బీళ్ళుగా ఉండేవి.ప్రజలంతా తిండికోసం ఏడ్చి ఏడ్చి సచ్చినారు"
" ఈ దుర్బర పరిస్థితుల్లో అప్పట్లో పెధాని ఎవరో నెహ్రూ అంట.. ఆయన ప్రతి గామంలో గంజి కేంద్రాలు ఏర్పాటు సేసినాడు ..మహాను బావుడు.... పజలను ఆకలి చావుల బారి నుండి రక్షించినాడు..ఇప్పటికీ నా వయసోల్లను అడుగు ...గంజి కరువు గురించి కతలు కతలు సెప్పు తారు. " అని చెప్పి ఆపింది మణెమ్మ.
" 1951, 52, 53, 54 లో స్యానా పెద్ద కరువు వచ్చింది. అయితే అప్పుడప్పుడు ఏదో పడీ పడనట్లుగా వానలు కురిసేవి . ఆ వానలకు పంటలు పండేవి కావు. దీంతో అప్పట్లో ఆహార ధాన్యలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఏ పల్లెలో చూసినా ఆకలితో అలమటించే వాళ్లు. దీంతో నెహ్రూ ప్రభుత్వం రెండు, మూడు గ్రామాలకు కలిసి ఒకచోట గ్రామచావిడిలో ప్రజలకు జొన్నలతో చేసిన గంజిని పోసేవారు. ప్రతి రోజు మధ్యాహ్నం గంజిని పోసేవారు. నాకు ఇంకా బాగా గుర్తుకు ఉంది. గంజి కోసం చిన్న పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరమూ మట్టిముంతలు తీసుకుని వెళ్లే వాళ్లం. రోజుకు ఒక పూట మాత్రమే గంజితాగి బతికినాము. అప్పట్లో కూడా కొంత మంది ఆ గంజి చాలక చనిపోయారు. మరికొంత మంది గంజి సక్రమంగా లేక (కొన్ని సార్లు గంజిలో చిన్నచిన్న పురుగులు ఉండేవి.) అతిసారతో మరణించినారు."
" 1953లో కుప్పం గ్రామం కొండుగారిపల్లెకు చెందిన సుబ్బన్న అనే ఆయన పిల్లలను పోషించలేక.. గంజితో పిల్లల ఆకలి తీర్చలేక.. ఊరికి దగ్గర్లో ఉన్న చాకలదానిగుట్టపై నుంచి ఇద్దరు కొడుకులతో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఎక్కడ చూసినా ఇదే ఇసయమై మాట్లాడుకునే వాళ్ళు."
" మనూర్లో పొట్లి కొండ్రెడ్డి ఉండాడు గదా..ఆయనకు అప్పుడు 12 సంవత్సరాల వయసు. ఆ పిల్లోడు..నేను గంజి ఎప్పుడు పోస్తారా.. అని కాసుకోని వుండే వాళ్ళం. ఊరిలోని పెద్ద ఇసుక మర్రిమాను దగ్గర అప్పుడు సర్కారు వాళ్లు గ్రామ ప్రజలందరికీ గంజిపోసేవాళ్లు. ఆ గంజికోసం మేమందరం ఉదయం నుంచి వేచి ఉండేవాళ్ళము. ఆ మర్రి చెట్టు దగ్గరే చేదుడు బావి కూడా ఉండేది. గంజి తాగి.... ఆ బావిలోని నీళ్లు తాగేవాళ్లం.ఒకరోజు రాగి గంజి.. ఒకరోజు జొన్న గంజి ఇచ్చేవాల్లు."
ఇంట్లో అందరమూ ముంతలు తీసుకుని వెళ్లే వాళ్లం. ఒక రోజు రాగి గంజి, ఇంకో రోజు జొన్న గంజి పోసే వాళ్లు. అదే అప్పట్లో అమృతంతో సమానం. వరి అన్నం ఎప్పడో పండుగలకు తినే వాళ్లం. ఇదమ్మా కరువు కత..." మణెమ్మ కళ్ళు చెరువులై పొయినాయి.
" ఇప్పుడు మళ్ళా మన కత లోనికి వస్తాం.." అని జరిగిన కథ చెప్ప సాగింది రమకు.
" రెడ్డప్ప నాయుడు అంటే మీ తాత...వీర కేశవ రెడ్డి మిట్ట కాడికి వచ్చి నారని సెప్పినాను గదా! అప్పుడు గూడా కరువే.. మూడేళ్ళ నుండి వానల్లేక నీళ్ళు లేవు బావుల్లో..ఏరు ఎండి పోయింది...అందుకే పెద్దోళ్ళు ఇద్దరూ కూర్చోని మాట్లాడినారు.
" వానలు కురవక పోతే అన్నాయం అయి పోతాము అన్న..అన్ని బూములూ బీడ్లు పడి పోతావుండాయి.కలి కాలం గదా..అందుకే ఇన్ని కట్టాలు..."
" మనోళ్ళంతా దిక్కు లేని సావులు సస్తారు" అన్నాడు నాయుడు గారు.
" ఇంతకు ముందు గూడా కరువు వస్తే మా తాత వరుణ యాగం చేయించి నాడంట. మనం గూడా చేయిద్దామా? " అన్నాడు రెడ్డప్ప నాయుడు.
" అట్లాగే అన్నా..రోజు మేఘాలు కన బడతాయి గానీ ..వాన పడదు.' అన్నాడు రెడ్డి గారు కొంచెం నిరుత్సాహంగా.
" మన పంతులు గారిని పిలిపించి అడుగుతాను. మంచి రోజు..దానికి కావలసిన సామాగ్రి అంతా ఏమి కావల్నో అడుగు దాము.." అన్నాడు నాయుడు గారు.
" అట్లాగే అన్నా!" అని ఎవ్వరి గ్రామానికి వారు వెళ్ళి పొయ్యారు.
**************************************************
మరుసటి రోజు పంతులు గారిని పిలిపించి ముహూర్తం ఖరారు చేశారు.
వచ్చే నెల ద్వాదశి రోజున ముహూర్తం బాగుందని చెప్పడంతో పంతులు గారికే ఆ భాధ్యతను అప్పగించాడు నాయుడు గారు.
పోలేరమ్మ గుడికి అనుకొనే రాముల వారి గుడి గూడా ఉంది. ఆ గుడి ముందర విశాలమైన మైదానం గుడి ప్రాంగణంలోనే ఉన్నది. అక్కడే వరుణ యాగం చేద్దామని పంతులు గారు అన్నారు. ఆ కార్య క్రమానికి ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది. ఈ లోపల యాగం జరిపించే బ్రాహ్మణులందరికీ కబురంపినారు.వారు తిరుపతి..చిత్తూరు ..పలమ నేరు..మదన పల్లి.. మేడికుర్తి ..వాయల్పాడు ...పరిసర ప్రాంతాల్లోంచి రావాలి.
వరుణ యాగానికి జరగ వలసిన కార్య క్రమాలన్నీ చక చక మని జరుగుతున్నాయి.ప్రాంగణం అంతా వెదురు పందిళ్ళు..తాటాకులతో ..రంగు రంగుల కాగితాలతో అలంకరించారు. ఆ ప్రాంగణ మంతా దేదీప్యమానంగా ఉంది.
ద్వాదశి రోజు రానే వచ్చింది.వరుణ యాగం ప్రారంభ మయ్యింది. వేద ఘోషతో ఆ ప్రాంగణ మంతా మారు మోగి పోతోంది.మూడు రోజులు వరుణ యాగం బ్రహ్మాండంగా జరిగింది. వీర కేశవ రెడ్డి గారి కుటుంబం మరియు ఆ గ్రామ ప్రజలు ..రెడ్డప్ప నాయుడు గారి కుటుంబం మరియు ఈ గ్రామ ప్రజలు అందరూ కలిసి యాగం భక్తి శ్రద్దలతో చేసుకొన్నారు.
మూడు రోజుల అయిన తర్వాత ఆ రోజు రాత్రి ఆశ్చ్యరంగా కుంభ వృష్టి కురిసింది. గ్రామ ప్రజలంతా సంతోషంగా వీధుల్లోకి వచ్చి డప్పులు కొట్టుకొంటూ నృత్యం చేశారు.
***********************************************
అదేమి అదృష్టమో గానీ ఆ వరుణ యాగం చేసిన రోజునే ఒక శుభ వార్త తెలిసింది రెండు కుటుంబాల వాళ్ళకు.
అది రెడ్డప్ప నాయుడి గారి భార్య గర్భవతి అయిన విషయం..అదే రెండు మూడు రోజుల తర్వాత వీర శేఖర రెడ్డి భార్య గూడా గర్భవతి అయిన విషయం వూర్లు వూర్లంతా తెలిసి పోయింది.
అక్కడున్న ఆ రెండు వూర్ల ప్రజల ఆనందానికి అంతే లేక పోయింది.
" ఈ సారయినా పండంటి మగ బిడ్డను కనాలి అన్నా..మాకు యువ రాజు కావాలి" అని రెడ్డి వారి పల్లె గ్రామస్థులు ..వారు అంతా సంబరాలు చేసు కొన్నారు.
అలాగే నాయుడు గారి పల్లెలో గూడా పండంటి బిడ్డను కనాలి అని గుడిలోకి వెళ్ళి గ్రామస్థులందరూ టెంకాయలు కొట్టి, అమ్మ వారికి పూజలు చేసి మొక్కులు మొక్కు కొన్నారు.
ఈ సంబరాలకు కారణం లేక పోలేదు.
ఇంతకు ముందే నాయుడు గారి భార్యకు రెండు, మూడు సార్లు గర్భం వచ్చింది. కానీ దేవుడు అనుగ్రహించ లేదు. మూడవ నెల లోనే గర్బ స్రావం అయిపొయ్యేది.
అలాగే రెడ్డి గారి భార్యకు రెండు కానుపులు అయినా పురిట్లోనే బిడ్డలు సచ్చి పొయ్యేవాళ్ళు.
ఇద్దరు అమ్మలు గూడా చెయ్యని పూజ లేదు..చూడని గుడి లేదు..ఎన్నో దానాలు బ్రాహ్మణులకు ఇచ్చారు.
ఏదో శాపమో..ఏదో దోషమో ఉందేమో నని మనసులో గూడా ఒక్క భయం ఉండేది ఆ రెండు కుటుంబాలకు.
" బగమంతుడా ..ఈ సారయినా ఇద్దరి అమ్మల కడుపులు పండల్ల ..మంచి బిడ్డలు పుట్టల్ల ....." అని వేడుకొన్నారు ఆ రెండు గ్రామ ప్రజలు.
***********************************************
**********************************************తరువాత ఏమయ్యిందో రేపు ఇరవై భాగంలో చూద్దాం ! )
***********************************************
( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల , ఏ వర్గ , ఏ సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)
(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష తెలుపు తారు గదూ? )
రచయిత: వారణాసి భానుమూర్తి రావు
జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా
ప్రస్థుత నివాసం : హైదరాబాదు.
కాపీ హక్కులు @రచయితవి.
Copy Rights with Author.
No comments:
Post a Comment