Saturday, October 24, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు(20)


 సంస్కార సమేత రెడ్డి నాయుడు(20)

ఇరవై భాగం

--------------------------------------------------------

ఇటు రెడ్డి వారి వర్గం,  అటు నాయుడు గారి వర్గం  మహా  ఆనందంగా ఉన్నారు. ఈ సారి ఆ మహా తల్లుల కడుపులు పండి మంచి మగ బిడ్డలకు జన్మ నిస్తే రెండు గ్రామాల బాగోగులు చూడడానికి వారసులు పుడతారని  కనబడిన కొండకు..బండకు .. పూజలు చేస్తున్నారు.


వీర కేశవ  రెడ్డి కి ఏదో అనుమానంగా ఉంది. ఎందుకో రెండు కుటుంబాలల్లో బిడ్డలు పుడుతూనే చచ్చి పోతున్నారు.ఏమన్నా  వూరి గ్రామ దేవతలు కన్నెర్ర చేస్తున్నారా? లేదా కుల దేవతలు శపిస్తున్నారా? లేదా పితృదేవతలు సంతోషంగా లేరా? 


ఈ ప్రశ్నలు ఆయన మదిని తొలుస్తూనే ఉన్నాయి. అదే విధంగా రెడ్డప్ప  నాయుడికి గూడా సందేహాలు వస్తున్నాయి.


ఒక్కరోజు రెడ్డి గారు పంతులు గారిని పిలిపించారు.


పంతులు గారు జాతకాలు చూసినారు. పుట్టిన తేదీ..గర్భం దాల్చిన తేదీ గంటలు , నిముషాలతో లెక్కించి పంతులు గారు తెల్ల మొహం వేశాడు. 


" అయ్యా..ఈ సారి గూడా తమకి పుత్ర యోగం కన బడడం లేదు..ఏదో శక్తి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని  బాధిస్తోంది "  అన్నాడు వినయంగా.


" పంతులు గారూ...ఎలాగైనా ఈ సారి నేను నా బిడ్డను కాపాడుకోవాలి. చెప్పండి..ఏ పరిహార మైనా చేద్దాం"  రెడ్డిగారు రెండు చేతులెత్తి నమస్కరిస్తూ వణుకు తున్న కంఠం తో అన్నాడు.


" తమరు పెద్ద వారు..అలా భయ పడకండి. ఈ విషయంలో ఈ వూరి గ్రామ దేవతకు మీరు సరిగ్గా పూజలు చెయ్య లేదని పిస్తోంది" అన్నాడు పంతులు గారు.


' అవును..రెండు మూడేళ్ళ నుండి వర్షాలు సరిగ్గ లేవు..పంటలు సరిగా లేవు గదా? అందుకే గంగమ్మ తల్లిని శాంత పరచ లేదు." అన్నాడు రెడ్డి గారు కాసింత పశ్చాత్తాపం నిండిన మొహంతో.


" గ్రామ దేవతలు చాలా శక్తి సంపన్న మైన వారు. తిరుపతిలో చూడండి..గంగమ్మ తల్లి జాతర తప్పని సరి. అలాగే చౌడమ్మ తల్లి..రెడ్డమ్మ తల్లి...ప్రతి వూర్లో వారి శక్తి దేవతలకు పూజలు చేస్తూనే ఉంటారు. " అన్నాడు పంతులు గారు.


" ఆషాఢ మాసం వస్తోంది.అమ్మ వారి బోనాలు ఎత్తండి.అంతా మంచే జరుగుతుంది.." అని ఆశీర్వదించి సెలవు తీసుకొన్నాడు పంతులు గారు.


వీర కేశవ రెడ్డి గారు అమ్మ వారికి బోనాల పండుగ చెయ్యడానికి నిశ్చయించాడు.

**************************************************


నాయుడు గారి పల్లెలో  రెడ్డప్ప నాయుడు గారు వరండా లో కూర్చొని లెక్కలు చూసుకొంటున్నాడు.


అంతలో ఒక వయసు మళ్ళినాయన లోపలికి వచ్చి చేతులెత్తి దండాలు పెట్టాడు.


" ఏమి ఓబులేసూ? బాగున్నావా? " అని అడిగాడు నాయుడు గారు.


ఓబులేసు వెనకాల ఒక  అడపిల్ల వచ్చింది. ముఖం కళగానే వుంది ..గోధుమ రంగులో ఉంది గానీ సరయిన తిండి లేక శుష్కించ పోయి నట్లుంది. వయసు సుమారుగా  పదహారేళ్ళు ఉండవచ్చు.


" ఈ పిల్ల నా అన్న కూతురు అప్పా...మొన్న కరువులో వీళ్ళ అమ్మా..నాయనా..అవ్వా..తాతా అంతా సచ్చి పోయినారు" అన్నాడు ఓబులేసు.


" అమ్మీ..అయ్య గారికి దండం పెట్టు" 


" కూసో అమ్మీ" అన్నాడు నాయుడు గారు.


" ఈ అమ్మికి నా అనే వాళ్ళు లేరప్పా..మీరే దయ పెట్టి ఈ అమ్మికి ఏదో పని సూపించాల.. నాకు ఈ  అమ్మిని సాకేదానికి అయ్యేటట్లు లేదు.  రేపో మాపో నేను సచ్చి పోతే ఈ అమ్మిని సూసే దానికి ఎవరూ దిక్కు ఉండరు" అని రెండు చేతులూ ఎత్తి దండం పెట్టినాడు ఓబులేసు.


" సరే ..ఓబులేసు..పనులన్నీ బాగ సేస్తావా..అమ్మీ" అని అడిగాడు నాయుడు గారు.


ఎలాగూ రెడ్డప్ప నాయుడు భార్య కడుపుతో ఉన్నది. ఈ పిల్లను పెట్టు కొంటే అన్నీ చూసుకుంటూ ఉంటుంది అని మనసులో  అనుకొన్నాడు నాయుడు గారు.


" సరే..మనింట్లోనే ఉంటుంది..అన్నీ నేను చూసుకొంటాను. కానీ అమ్మ చెప్పిన పనులు చెయ్యాల.."   అన్నాడు నాయుడు గారు.


ఓబులేసు సంతోషంగా నాయుడు గారి పాదాలకు  నమస్కరించడానికి ముందుకు వంగాడు.

నాయుడు గారు వారించాడు.


" ఇంతకూ మీ అమ్మి పేరు చెప్పనే లేదు"  అన్నాడు రెడ్డప్ప నాయుడు గారు నవ్వుతూ..


" మణెమ్మ" అంటూ  ఓబులేసు సెలవు తీసుకొన్నాడు.

*********************************************

**********************************************తరువాత ఏమయ్యిందో రేపు  ఇరవై  ఒకటవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి.

Copy Rights with Author.

No comments:

Post a Comment