సంస్కార సమేత రెడ్డి నాయుడు
అశోక్ ఇంత ధైర్యంగా రమను కలవడానికి వచ్చాడని తెలిసి నప్పటి నుండి నాయుడు గారు తోక తొక్కిన త్రాచులా ఎగిరి పడుతున్నాడు.
తన ఆంతరంగీకులతో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసు కొన్నాడు.
ఈ విషయాలు ..పుకార్లు చినుకు చినుకుగా చిలికి ఎక్కడ గాలివాన గా మారుతుందో అని పల్లె వాళ్ళంతా భయ పడినారు.
భయ పడి నట్లు గానే సాకిరేవులో గుడ్డలు ఉతుకుతున్న ఎల్లయ్య ను ఎవ్వరో చంపేశారు.
సాకి రేవు కాడ్నే శవం పడి ఉంది . ఎల్లయ్య జయరామ నాయుడు గారింట్లో బట్టలుతికే రజకుడు. తాత ముత్తాతల కాలం నుండీ నాయుడు గారింట్లో రజక వృత్తి చేసుకొంటూ బ్రతుకు తున్నారు ఎల్లయ్య కుటుంబం వాళ్ళు.
ఎల్లయ్య కుటుంబం రెండు గ్రామాల్లోనూ రజక వృత్తి చేస్తారు. రెడ్డి వారి పల్లెలో కొన్ని రైతు కుటుంబాలకు గూడా గుడ్డలు ఉతుకు తారు.
కానీ రాజ శేఖర రెడ్డి ఇంటికి మటుకు ఎల్లయ్య దాయాదులు వెంకట్రాముడు వాళ్ళు పని చేస్తారు.
ఎల్లయ్య..వెంకట్రాములు ఎన్నోసార్లు కొట్లాడుకొన్నారు. రెడ్డి వారి పల్లె లో ఎల్లయ్య ఎందుకు ఇళ్ళు పట్టుకొన్నాడు..అవి ధర్మంగా వెంకట్రాములకే చెందాల అని పంచాయతీ గూడా పెట్టుకొన్నారు
.
అయినా ఎల్లయ్య ..వెంకట్రాముడి మాట పెడచెవిన పెట్టాడు.
"ఈ ఇళ్ళు మా తాతల కాలం నుండి వస్తున్నాయి ..ఇయ్యి వదిలే పసక్తే లేదు " అని ఎల్లయ్య మొండిగా వాదించాడు.
ఇంకో విషయం ఏమిటంటే... ఎల్లయ్య చాకి రేవు ..వెంకట్రాముడి చాకి రేవు పక్క పక్కనే ఉంటాయి. కాలువ ప్రక్కన్నే ఉబ్బకు పెట్టే గాడి పొయ్యిలు ఉంటాయి.
కాలువలో నీళ్ళు ఉన్నప్పుడు కాలువలో ఉన్న బండలు మీదనే గుడ్డలు ఉతకతారు. ఉబ్బ పక్కన్నే చవుడు మట్టి బాగా దొరుకు తుంది. చవుడు మన్ను తో గుడ్డలు ఉబ్బకు పెట్టి ఉతుకు తారు. గుడ్డలు ఉతికే సబ్బులు ఇంకా రాలేదు అప్పటికి.
అలాంటి సమయంలో ఎల్లయ్య చావు పెద్ద తంటా తెచ్చి పెట్టింది.
నాయుడు గారి చాకలోళ్ళ ఎల్లయ్యను రెడ్డి గారి మనుషులే చంపించి నారంట అనే వార్త దావానలంలా ఆ పల్లెల్నోనే గాకుండా మిగతా చుట్టు పక్కల పల్లెలకు వ్యాపించింది.
రెండు గ్రామాల్లో జనాలకు పల్లె దాటి పోవాలంటే భయం కలిగింది. ఎక్కడ రౌడీలు వచ్చి చంపేస్తారో అన్న భయం తో బయటికి ఎల్ల బారేదానికే జనం జంకు తున్నారు.
నాయుడు గారి రజకుడు ఎల్లయ్యను ఎవ్వరో చంపడం నాయుడి గారిని మానసికంగా క్రుంగ దీసింది. ఈ పని రెడ్డి మనుషులే ఎవ్వరో కావాలనే చేసినారు అని ఉన్నవి, లేనివి కట్టు కథలు అల్లినారు జనాలు. ఆ వార్త దావానలంలా వ్యాపించి నాయుడు గారి చెవికి గూడా సోకింది.
నాయుడు గారు ఒక్క వారం తర్వాత వూర్లో దండోరా వేయించి నాడు.
" ఇది అందరూ సావధానంగా వినండహో...మీకు చెప్పేదేమిటంటే రేపు సోమ వారం నుండి ఈ వూర్లో వాళ్ళు ఆ వూరికి పోగూడదు..ఆ వూర్లో వాళ్ళు ఈ వూరికి రాగూడదు. వస్తే సావే గతి. ఇది నాయుడు గారి హుకుం ఓహో...." అని పలకలు కొట్టుకొంటూ దండోరా వేశాడు ఒకాయన.
మరుసటి రోజు నాయుడు గారి పల్లె కు చుట్టూ వెదురు స్థంభాలు నాటి జెండాలు పాతినారు.పల్లె లోపలికి ఎవ్వరు రావాలన్నా పర్మిషన్ తీసుకొని రావల్ల. ఏట్లో నుండి గూడా ఆ పల్లెకు ఈ పల్లెకు కాలినడక మార్గాలు ఉన్నాయి . అవి గూడా మూపించేసి ఒక పది మంది కండలు తిరిగిన యువకుల్ని కాపలాగా పెట్టినాడు నాయుడు గారు. ప్రతి ఒక్కరి చేతిలో నాటు తుపాకులు ఉన్నాయి.
ఈ దృశ్యం చూసి రెడ్డి గారి పల్లె జనాలు భయ పడి పొయినారు
.
" నాయుడు గారికి పిచ్చి పట్టినట్లుందన్నా..మనం ఏ తప్పు చెయ్య లేదు. కిరాయి గూండాలను పెట్టి మనల్ని చంపెయ్యాలని సూస్తావుండాడు. ఇట్లయితే మనం ఈ పల్లెలో బతక లేము రెడ్డన్నా! " అని రాజ శేఖర్ రెడ్డికి మొర పెట్టు కొన్నారు ఆ గ్రామ ప్రజలు.
" పొయ్యేకాలం దాపురించింది.. వినాశ కాలే విపరీత బుద్ది..మీరేమీ భయ పడకండి.ఈ సమస్యలు వాటి కంతే అవి సమసి పోతాయి" అని దివాన్ శర్మ గారు ధైర్యం చెప్పాడు.
రాజ శేఖర్ రెడ్డికి నాయుడు గారి మీద చాలా కోపం వచ్చింది. లేని పోని మాటలు విని ..నాయుడు గారు రెండు పల్లెల మీద యుద్ద వాతావరణం కలుగ చేశాడు. ఈ యుద్దం మొదలయ్యింది. ఇక ఎట్లా అంత మొవుతుందో అని ఆలోచించాడు.
అంతలో పది మంది అరవ కాపుల కుటుంబాల వాళ్ళు , పిల్ల జెల్ల ..ఆడోళ్ళు..మేకలు ..కోడ్లు..పశువులు తోలుకొంటూ...తట్టా బుట్టా సర్దుకొని మూడు ఎద్దల బండ్లల్లో సామానంతా నింపుకొని రాజశేఖర రెడ్డి ఇంటి ముందన్న మార్గంలో పోతున్నారు.
" యాడికి పోతా ఉండారు ఇళ్ళు వదిలేసి. తీర్థ యాత్రలకు వెడతా ఉండారా చిన్నప్పా? " అని ఒక పెద్దాయన బండిని నిలుపుతూ .
ఏం చెయ్యాల పెద్దయ్యా? నాయుడు గారి భూమిల్ని నమ్ము కోని తర తరాలుగా బతకతా ఉండాము. ఆయప్ప చెప్పినట్లు ఇనాలి గదా? ఇనక పోతే ఈ సారి భూములు కౌలుకి ఇవ్వరంట..ఇదే వూర్లో ఉంటే తలలు నరికి అమ్మోరికి బలి ఇస్తారంట " అని మమ్మల్ని నాయుడి గారి మనుషులు కొందరు బెదిరించారు.
ఈ మాటలు విన్న రాజ శేఖర్ రెడ్డికి కోపం కట్టలు తెంచుకుని ప్రవహించింది.
" ఏమను కొంటా వుండాడు వాడు? ఈ రెడ్డి తో పెట్టుకొంటే అంతే..నా పల్లెలో ఉండే జనాల్ని బెదిరిస్తాడా? ఎంత ధైర్యం?
మంచికి మంచి ఈ రెడ్డి. కన్నుకు కన్ను ..కాలుకు కాలు తీసేస్తా..నాతో పెట్టు కోవద్దని చెప్పు మీ నాయుడు గారికి.." అని కోపంతో వూగి పొయ్యాడు రాజ శేఖర్ రెడ్డి.
" అవును రాజ శేఖర్ రెడ్డి ...ఎల్లయ్య చచ్చి నప్పటి నుండీ నాయుడు గారు మన మీద పగ బట్టి నాడు. వాడ్ని ఎవ్వరు ఎందుకు చంపారో మనకు తెలీదు..ఎల్లయ్య ను మనమే చంపించి నామని వాళ్ళు అనుకొంటున్నారు. " అన్నాడు రెడ్డి గారి చిన్నాయన బల రామి రెడ్డి.
వయసు డెబ్బై ఏళ్ళు దాటినా మనిషి ఇంకా దృడంగా ఉంటాడు. ఇంకా వ్యవసాయం పనులు చక చక మని చేస్తాడు. ఒక్క నిముషం గూడా విశ్రాంతి తీసుకోడు బల రామ రెడ్డి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తాడు. కొడుకు కోడళ్ళు ' పని చెయ్యొద్దు నాయనా..' అని అడుక్కొన్నా చెప్పిన మాట వినడు. తెల్ల వారి ఝామున నాలుగు గంటలకే లేచి ఎద్దల్ని తోలుకొని ..బాయి కాడికి పోయి కపిల తోలుతాడు బలరామ రెడ్డి. ఏదీ పనిలేదంటే జనప నారతో పోగులు తీసి పెద్ద పెద్ద త్రాళ్ళు ఏకుతాడు..అంతటి కష్ట జీవి బలరామ రెడ్డి. వరసకు చిన్నాయన అవుతాడు రాజ శేఖర రెడ్డికి. మంచికీ చెడుకీ అన్నిటికీ ఆయన సలహాలు తీసుకొంటాడు రాజ శేఖర రెడ్డి.
దేనికయినా చిన్నాయనను అడగందే ఏ విషయం లోనూ ముందు కెళ్ళడు రాజ శేఖర రెడ్డి గారు.
రాజ శేఖర్ రెడ్డి ప్రతీకార జ్వాలతో రగిలి బోతున్నాడు. ఈ అవ మానాన్ని తట్టు కోలేక పోతున్నాడు.
***************************************************
ఇన్ని రోజులూ ఏ గ్రామంలో ఉన్నా కలిసి మెలిసి పని చేసుకోవడం ..తరతరాలుగా ఏ పొర పొచ్చాలు లేకుండా జరిగింది .కానీ ఇప్పుడు దేశ విభజన జరిగి నప్పుడు పాకిస్తాన్ మరియు భారత దేశం లో ప్రజలు ఏ దేశానికి వాళ్ళు వెళ్ళలేక పోవడం లా ఈ రెండు గ్రామ ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపు తున్నారు.
కంసాలి.వడ్రంగి..సాలె వాళ్ళు..బెస్త . ..చాకలి వాళ్ళు..మంగలి వాళ్ళు ..గానుగ ఆడే వాళ్ళు..రైతు కూలీలు...కౌలు రైతులు ...ఇలా ప్రతి చేతి వృత్తుల పనుల వాళ్ళు రెండు వూర్లను పంచు కోవలసి వచ్చింది. .ఎందుకంటే ఒక గ్రామం లో ఉన్న వాళ్ళు ఇంకో గ్రామం లోకి వెళ్ళి పని చెయ్య గూడదనే భయంతో ఇళ్ళు మార వలసి వచ్చింది.
కొడుకు ఒక పల్లెలో ఉంటే నాయన ఇంకో పల్లెలో నివాసం ఉండాల్సి వచ్చింది.ఇలా చెయ్యడం ఏమీ బాగా లేదని గుడ్ల నీరు కక్కు కొంటూ ఏడ్చినారు గ్రామ ప్రజలు. ఎంతో బాగుండే ఈ ప్రజలు రెండు పార్టీలై బద్ద శత్రువులై పోవడం పెద్ద వాళ్ళని కలవర పరచింది.
ఒక్క సారి పరిస్థితులు అదుపు తప్పితే శాంతికి ఎలా విఘాతం జరుగు తుందో ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి.అపార్థాలు ఎన్ని అనర్థాలకు దారి తీస్తోందో గూడా అర్థ మవుతోంది.
నాయుడు గారి..రెడ్డి గారి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. పంతాలకు పోయి స్నేహితులుగా ఉన్న వారు బద్ధ శతృవులు అయిపొయ్యారు.
ఏది కాగూడదు అని కలలో గూడా అనుకోలేదో అది ఇప్పుడు నిజ మయ్యిందే అనిరెండు పల్లెల ప్రజలు భోరు మన్నారు.
రాయల సీమ ప్రజలకు ప్రేమించడం తెలుసు..అలాగే తేడా వస్తే తలలు తెగ్గొట్టడం తెలుసు.. మంచిగా వుంటే ప్రాణాలు ఇస్తారు. చెడుగా నమ్మక ద్రోహం చేస్తే ప్రాణాలు తీస్తారు.
ఆ మధ్య కత్తి వారి పల్లెలో నాలుగు తల కాయలు ఒకే ఇంటికి సంబంధించిన అన్నదమ్ములు తెగినాయి..ఎందుకో ఎవ్వరూ సరయిన సమాధానం చెప్పరు. కొందరు రాజకీయ పార్టీల వల్లని..కొందరు భూమి తగాదాలు అని..కొందరు ప్రేమ వ్యవహారం అని ఇలా చిలవలు పలవలుగా చెప్పుకొంటారు.
మొన్న మేడికుర్తి లో గూడా ఒకర్ని ఒక్కరు వాళ్ళ మనుషులు నరికి వేశారు. ఒక పెద్దాయన్ను ముక్కలు ముక్కలు గా నరికి కైమా చేసినారని వింటే గుండె నీరు కారి పోతుంది. ఆ పెద్దాయన బంధువులు ఆ ప్రత్యర్థుడ్ని ఇంటి కాడ్నుంచి కంకర రోడ్డు మీద రెండు మైళ్ళు ఈడ్చుకొనిపోయి తల కాయ నరికి వేసినారు.
ఈ కథ లన్నీ విన్న ఈ రెండు గ్రామ ప్రజలకు కంట్లో నిద్ర లేకుండా పోతోంది.
ఈ సమస్యలకు కాలమే సమాధానం చెప్పాలి.
******************************************
***********************************************తరువాత ఏమయ్యిందో రేపు పదహారవ భాగంలో చూద్దాం ! )
***********************************************
( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల , ఏ వర్గ , ఏ సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)
(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష తెలుపు తారు గదూ? )
Copy Rights@Author.
కాపీ హక్కులు @ రచయితవి.
No comments:
Post a Comment