Wednesday, December 31, 2014

కాలమా !

కాలమా !



కాలం  ముందుకు వెడుతోంది
ఆనందాల్ని , అనుభవాల్ని
విషాదాల్ని , విషయాల్ని
తనతో పాటే తీసుకెళ్ళు తోంది
భారంగా బ్రతుకు
ముందుకు అడుగులు వేస్తోంది
సెకనులు , గంటలు , రోజులు
నెలలు, సంవత్సరాలు
ముందుకు పోతున్నాయి
కాలం ముందుకు సాగి పొయ్యే రైలు బండి
రైలు బండి లోని ప్రయణీ కుల్లగా
మన జీవితాల్లో ఏంతో  మంది
వస్తుంటారు , పోతుంటారు
కలకాలం గుర్తుండేది ఏ  ఒక్కరో !
కాలం వెనక్కి తిరిగి చూడలేని  సాగర కెరటం
ఒక్కొక్క సారి  ఆ కెరటం ఉవ్వెత్తున లేచి
ఉప్పనలా  మారుతుంది
లేచిన కెరటం తీరాన్ని తప్పక చేరుతుంది
అనుభూ తుల్ని  వడగట్టి చూస్తే  మిగిలేది
జీవన సారాంశం
జీవితాన్ని ఒక  పాటగా పాడుకొంటే
ఒడు దుడుకుల్ని అవలీలగా అధిగామిస్తావు
జీవితాన్ని  ఒక  మంచి కవితగా చదువు కొంటే
ఆశయ సిద్ధికై  పరుగులు తీస్తావు
ఆగిపోదు కాలం నీతోనే  నేస్తమా !
ఆగిపోని కాలానికి నేస్తాలు
మనం  ,  మన చరిత్ర
మనం  ఉన్నామని   ఏదయినా చేసి  చూపిస్తే
కాల మనే మార్గంలో మనం గూడా మై లు రాళ్ళు !
నూతన సంవత్సర శుభాకాంక్షలతో
2014 కు వీడ్కోలు !
2015 కు ఆహ్వానం !!


   31. 12. 2014             భాను వారణాసి
 

Tuesday, December 30, 2014

భాను బాణీలు



భాను బాణీలు


1
మనకు కనబడే చంద్రుడు కవులకు కవితా వస్తువు
రసజ్ఞులకు రసాస్వాదనుడు
ప్రేమికులకు శృంగారోద్ధీపకుడు
గానీ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని మీద దిగ గానే
దర్శన మిచ్చింది రాళ్ళు రప్పలూ!


2
సముద్రాలుండేది మానవజాతికి ఆలంబనగా
సముద్ర జీవరాశులకు కన్న తల్లిగా
కల్మష మైపోతున్న సముద్ర జలాలు
నిర్వీర్వమైపొతున్న సముద్రాలు
మనిషి ప్రగతిని ఎప్పుడొ ఒకప్పుడు ముంచేస్తాయి!


3
నువ్వు చచ్చిన తర్వాత నీక్కావలసింది ఆరడుగల నేల
పాతిపెట్తడానికి-
ప్రపంచమంతా నీక్కావాలనే దురాశ నీకెందుకు?


4
ఆణు బాంబుల నిల్వలు బాగానే పెంచుకొంటున్నాయి దేశాలు
మానవ జాతికి మరణ శాసనాలు అందరూ బాగానే వ్రాస్తున్నారు!



5
నువ్వు తినే ప్రతి అన్నం మెతుకులో
నువ్వు తినే ప్రతి గొధుమ గింజలో
రైతన్న రక్తం దాగుందని మరచిపోకు నేస్తమా!



6
తండ్రికి తెలీదు
బిడ్దకు తెలీదు
పురిటి నెప్పుల బాధ
మాతృమూర్తికే తెలుసు!


7
సిజరిన్ ఆపరేషన్ లో
జన్మ నిచ్చిన తల్లి
పునర్జన్మ పొందింది మళ్ళీ!
అయినా ఇంకో బిడ్డకు జన్మ నివ్వడానికి
తయారయింది మళ్ళీ మళ్ళీ!



8
పదిమంది సంతాన్నయినా
ఆనందంగా పొషిస్తారు తల్లీ తండ్రీ
గానీ ఆ తల్లీ తండ్రి అవసాన దశలో చాకడానికి
పోటీలు వేసుకొంటారు ఆ పిల్లా జెల్లా!




9
సూర్యుడు మండుతుంటే గదా
ప్రపంచం ముందుకు వెళుతుంది
కానీ ఆ సూర్యుడు ఒక్కసారిగా ఆగిపోతే
భయంకర నిశ్శబ్ధం, కటిక చీకటి.



రచన : భాను వారణాశి
05.07.2013
 

 




 

    Monday, December 29, 2014

    తెలుగు పదా లండీ !

    తెలుగు  పదా లండీ !

    ----------------------------------
    విక్ర మార్కుడ్ని
    విక్ర  మూర్ఖు డు అనలేనే !
    పండు కొంటావా
    పడు కొంటావా  అన్న పదాలను
    సందర్భాను సారంగా  వాడాలి
    కల వరించిన  నా ప్రేయసి
    కలవరించిందా ?
    తెలుగు భాష  గొప్పది అన్నానే  గానీ
    తెగులు భాష   అనలేదే!
    ఎరిగిన వాడు లెండి
    అన్న పదంలో' ఏ ' అని రాస్తే
    కొంప లంటు కు పోతాయి
    కులాలని   బట్టి
    ఒరేయ్ తురేయ్  అని పిలిస్తే 
    తలకాయలు పగిలే కాలం 
    కొత్త పదాల్ని మనం
    సృ ష్టిం చ లేమా ?
    కొందరు  సినీ మహా కవుల
    హలా , సువ్వి లాంటి  పదాల్ని ...
    అ ఆ ఇ ఈ అన్న అక్షరాల్ని  నేర్చుకొంటున్నపుడే
    అమ్మ  ఆవు ఇల్లు ఈగ  అని కంట స్థం  పెట్టాలి
    ' ఆది వారం నాడు అరటి 'మొలచినది
    అని ఎంత మం దికి  గుర్తుందో !
    'ఆలు లేదు చూలు లేదు , కొడుకు పేరు సోమలింగం '
    అన్న మన సామెతలు మన కాపి రైట్ గాదా ?
    అక్షరాల  దోషాలు ఉండొచ్చు
    ముద్రా రాక్షసాలు  ఉండోచ్చు
    గానీ  ఒక్కసారి కవితను కళ్ళ ల్లో  పెట్టుకొని చూడండి
    కవితామ  తల్లి ని  ఒక్క సారి ప్రార్థించండీ ఇలా
    ' అజ్ఞాని నామ యా దోషాన .... క్ష మస్వత్వం  క్ష మస్వతం '

    29. 12. 2014  భాను  వారణాసి








     

    Saturday, December 27, 2014

    అమ్మా నన్ను క్షమిస్తావా ?

    అమ్మా  నన్ను   క్షమిస్తావా ?

     నవ మాసాలు మోసి
    నీ  రక్తంతో  నన్నునీ  గర్భంలో  పెంచి 
    నీ  బొడ్డుతో  అనుబంధం  పెంచుకొని
     నీ  పేగులు త్రుంచుకొని ప్రసవ మిచ్చిన
     తల్లీ   నీకు నమస్కారం

     కన్నా పాలు త్రాగు  తండ్రీ
     నా కన్నా  బంగారు కొండా
    అను గుండెల్ని హత్తుకొని
    నీ చనుబాలతో  నా ప్రాణాన్ని కాపాడిన
    తల్లీ  నీకు నమస్కారం

    పచ్చి బాలింత వయినా
    పురిటి నొప్పులతో  భాద  పడినా
    అత్తా మామలకు ఊడిగాలు  చేస్తూ
    నాన్న  పురుషా ధిక్యానికి  సలాం చేస్తూ
    నా కేలోటూ  రానియ్యకుడా  కంటికి రెప్పలా చూసుకొన్న
    తల్లీ నీకు నమస్కారం

    నేను పది కాలాల పాటు చల్లగా ఉండాలని
    గుడులకు దర్గాలకు  తిరిగి
    నా మెడలో తాయెత్తులు  కట్టించి
    నా కోసం నోములు ఉపవాసాలు చేసి నన్ను రక్షించిన
    తల్లీ నీకు నమస్కారం

    నా చదువు కోసం  నువ్వు నాన్న దగ్గర చివాట్లు తిన్నావు
    నా ఉన్నత విద్య కోసం నీ కున్న ఒక్క గొలుసులు  అమ్మేసావు
    నన్ను గొప్పవాడి గా చూడాలని
    నన్ను ఒక ఇంటివాడ్ని చెయ్యాలని  సదా కోరుకొన్న
    తల్లీ  నీకు నమస్కారం


    గానీ

    తల్లీ  నేను సుదూర తీరాలకు ఉద్యోగ నిమిత్తం వె డుతున్నపుడు
    నీ ఎదలో  దాగిన వేదనాగ్ని  నా కర్థం కాలేదే !

    ఎక్కడున్నా నువ్వు సుఖంగా వుండు నాయనా
    అని నువ్వు దీవించి నపుడు నువ్వు ఎలా ఉన్నవమ్మా
    అని ఒక్కసారి గూడా నిన్ను అడగ లేక పోయ్యనే !

    నువ్వు  నా పిల్లలను  ప్రేమతో హత్తుకోన్నపుడు
    బామ్మ unhigeinic అన్నపుడు నీ  కళ్లల్లో ఉబికి వచ్చిన
    కన్నీటిని  అర్థం చేసుకోలేక  పొయ్యానే !


    నువ్వు దగ్గుతూ ఆయాస పడుతూ 
    నవ్వుతూ మాకు సపర్యలు చేస్తున్నా
    నీ ఆరోగ్యం ఎలా ఉందని అడగ లేక పొయ్యానే !

    నా కోసం ఉపవాసాలు చేసావు
    నా కోసం జాగరణలు చేసావు
    గానీ  ని కోసం మేము ఏమి చెయ్యలేదని చింతిస్తున్నా!

    బోలెడన్ని కతలు నువ్వు చెప్తానన్నా
    ఐపాడ్  లోనో, యు ట్యూబ్ లోనో బాబా బ్లాక్ షీప్ వింటున్న నా పిల్లలకు
     బామ్మ కతలు వినమని చెప్పలెనందుకు  సిగ్గు పడుతున్నా!

    రాముడన్నా , కృష్ణుడన్నా , తెలుగు అన్నా , అమ్మ అన్నా , నాన్న అన్నా
    భరత భూమి అన్నా , అత్త అన్నా , మామయ్య అన్నా , బాబాయ్ అన్నా
    అన్నమా చార్య కీర్తన అన్నా , గోవిందు డన్నా , గోదావరి అన్నా
    అసలు మన సంసృతి అన్నా , మన అచారాలన్నా
    బొత్తిగా తెలియని  జ్ఞానాంధ కారంలో నా బిడ్డల్ని పెంచుతున్నా!
    అసలు అమ్మకు గాని , అమ్మ భాష కు గాని
    అర్థం గాని బ్రతుకు బ్రతుకుతున్నా  అమ్మా!
    నన్ను క్షమిస్తావా !
    నన్ను నీ  గుండెలకి హత్తు కొంటావా ?
    ఇంకొక  జన్మ అంటూ
    నువ్వు నా కూతురు గా పుట్టు తల్లీ
    నీ ఋణం  నేను తీ ర్చు కొంటా  నమ్మా !!


    28. 12. 2014   - భాను  వారణాసి



     

    Friday, December 26, 2014

    ఎక్కడైతే!

     ఎక్కడైతే !

     
     
    ఎక్కడైతే  కవిత్వం కరాళ నృత్యం  చేస్తుందో
    అక్కడ  నేనుంటాను 

    ఎక్కడైతే  కవిత్వం  శివ తాండవం  చేస్తుందో
    అక్కడ నేనుంటాను 

    ఎక్కడై తే    కవిత్వం మట్టి   గీతాలు  రాస్తుందో
    అక్కడ  నేనుంటాను 

    ఎక్కడైతే   కవిత్వం    గజరాజులా  ఘీంకరిస్తుందో
    అక్కడ   నేనుంటాను 

    ఎక్కడైతే   కవిత్వం మత్త కోకిల్లా   పాడుతుందో
    అక్కడ   నేనుంటాను 

    ఎక్కడైతే  కవిత్వం అఘొరాల్లా   స్మశాన  నృత్యం  చేస్తుందో
    అక్కడ    నేనుంటాను 

    ఎక్కడైతే  కవిత్వం    దరిద్రుల ఆకలి కేకలు తగ్గిస్తుందొ
    అక్కడ  నేనుంటాను 

    ఎక్కడైతే  కవిత్వం శ్రామిక  తాడిత పీడిత  జనాల్లొ కలుస్తుందో
    అక్కడ  నేనుంటాను 
     
    ఎక్కడైతే   కవిత్వం  ఆనాధలైన  చిన్నారులకు  తోడవుతుందో
    అక్కడ  నేనుంటాను 

    ఎక్కడైతే  కవిత్వం  వ్యభిచారానికి బలయిపొయిన  ఆడపిల్లలకి అండగా ఉంటుందో
    అక్కడ  నేనుంటాను 

    ఎక్కడైతే  కవిత్వం  వృద్దాశ్రమాల్లో తల్లి తండ్రులకు తోడుగా ఉంటుందో
    అక్కడ  నేనుంటాను 

    ఎక్కడైతే కవిత్వం  బాల కార్మికుల   నరకాన్ని గురించి రాస్తుందో
    అక్కడ  నేనుంటాను 
     
    ఎక్కడైతే  కవిత్వం మత కలహాల  నిర్భాగ్యుల వెతలు  తీరుస్తుందో
    అక్కడ    నేనుంటాను 
     
    27. 12. 2014      @భాను వారణాసి 

    Thursday, December 25, 2014

    స్వర్గ సీమ

    స్వర్గ సీమ
    ---------------------------------

    ఒక్కొక్క మంచు రేణువు
    పైన్ చెట్ల మీద  కురుస్తుంటే
    నక్షత్రాలు  నింగి నుండి గుత్తులు గుత్తులు గా రాలి నట్లున్నాయి
    దూరంగా కనబడే పర్వతాలు
    తె లి మంచు  దుప్పట్లలో దూరినట్లుంది!
    నల్లటి తారు రోడ్లన్నీ
    తెల్లటి మంచు జరీ  అంచు  చీర కట్టు కొన్నట్లుంది!
    పైన్ చెట్ల మిద నుండి
    జాలు వారుతున్న మంచు
    శ్వేత పళ్ళు రాలినట్లు అన్పిస్తోంది
    పర్వతాల మిద కన బడె  మంచు  అంచులు
    విచిత్ర మైన కాంతిని వెదజల్లుతున్నాయి
    స్వర్గం నుండి అమృత జల్లులు కురిసినట్లుగా
    ఆకాశం నుండి శ్వేత పుష్పాలు పుప్పొడి జల్లి నట్లుగా
    విచిత్రమైన అనుభూతి!
    వింత లోకంలో  ఉన్నట్లు ఒక పరవశం!
    ఎవరో  ఆ   సృష్టికర్త ?
    ఎవరో  ఆ   శిల్పి ?
    మలయ మారుతాలు
    నందన వనాలు
    పిల్ల గాలులు
    అల్లరి  జల్లులు
    స్వర్గ దామమా ?
    ఇది మరో ప్రపంచమా?
    దేవతలు దిగి వచ్చిన చోటా ఇది ?
    మనం  దారి తప్పి ఇచటకు  వచ్చామా?
    ఏటవాలు  కప్పుల మిద నుండి  మంచు రేణువులు
    తెల్లని ముత్యాల్లా  క్రిందకు జాలు వారుతున్నాయి
    అవి మంచు  గడ్డలై  సూర్య కిరణాలకు
    ముత్యపు గనుల్లా మెరుస్తున్నాయి
    మంచు కరిగిన నిరు  
    జల పాటలు పాడుకొంటూ ముందుకు సాగి సాగి
    సెల ఏరై , ఏరై , జల పాతంలో కలసి
    ఒక  శ్రా వ్యమైన సంగీతాన్ని వినిపిస్తున్నాయి !


    SEATTLE  కి అరవై మైళ్ళ దూరంలో ఉన్న మంచు పర్వతాల్ని , జల పాతాన్ని ఈ  రోజు  చూసి  స్పందించి రాసిన కవిత .
    25. 12. 2014  ---భాను వారణాసి










     

    Tuesday, December 23, 2014

    తస్మాత్ జాగ్రత్త!

    తస్మాత్ జాగ్రత్త!



    బ్రతుక్కి పారమార్థం లేకుండా
    ప్రతి రోజు జనాలు బ్రతికేస్తున్నారు
    కొందరు  తిండి కోసమే బ్రతుకుతారు
    కొందరు బ్రతకడం కోసమే  తింటారు
    కొందరు డబ్బు కోసం గడ్డి తింటారు
    కొందరు  డబ్బు కోసం  వొళ్ళు నమ్ము కొంటారు
    కొందరు  ఆలిని , కొందరు కన్న పిల్లల్ని
    కొందరు తల్లిని , తండ్రిని అమ్ము కొంటారు
    కొందరు  అంగాంగాల్ని అమ్ముకొంటారు
    కొందరు అంగాల్ని  దొంగలిస్తారు
    కొందరు  డబ్బు కోసం  కాళ్ల మీద పడతారు
    కొందరు దొంగ నమస్కారాలతో   నీ కూష్మాండం బద్దలు కొడతారు
    కొందరు నువ్వు వినా వేరే దేవుడు లేదంటారు
    కొందరు నువ్వే  దేవుడంటారు
    కొందరు నీ చెప్పులు మోస్తారు
    కొందరు నిన్ను పల్లికిలో మోస్తారు
    కొందరు నిన్ను ఆకాశానికి ఎగరేస్తారు
    కొందరు నిన్ను మునగ చెట్టు  ఎక్కించేస్తారు
    కొందరు డబ్బు కోసం ఉన్నవి లేనట్లు , లేనివి ఉన్నట్లు కల్పిస్తారు
    కొందరు నిజాల్ని అబద్దం లా చెబుతారు
    కొందరు అబద్ధా ల్ని  నిజంలా  చూపుతారు
    కొందరు రాజకీయాలు చేస్తారు
    కొందరు  అరాచకాలు  చేస్తారు
    డబ్బు కోసం నానా విధ వేషంబులు
    వేస్తున్న నాటాకాల రాయుళ్లతొ
    తస్మాత్ జాగ్రత్త !

    24. 12. 2014




     

    Monday, December 22, 2014

    అకల్మష మానవత

    అకల్మష  మానవత
    -----------------------------------------------


    మడి కట్టిన సనాతన సంప్రదాయాలు
    మనల్ని ముందుకు నడిపించవు మిత్రమా!
    కులాల గోతిలొ
    మతాల నూతిలో
    నిన్ను నువ్వే స్వయం సమాధి చేసుకొంటున్నావు
    నీ కులపోడి తెగులు
    నీ మతమోడి జాడ్యం
    మనుషుల మధ్య
    మనసు ద్వారాల్ని మూసి వేస్తున్నాయి
    ఎక్కడ చూసినా అంతహ్ సమీకరణాలే
    నువ్వు విప్పిన బూతుల పంచాంగం వినలేక
    జాలి గుండెలు కొన్ని వాన పురుగులై పొయ్యాయి
    పర జాతి సమస్తము
    మన జాతి కాదనుకొన్నప్పుడు
    మన కేమున్నది గర్వ కారణము?
    నా కొద్దీ కులము
    నా కొద్దీ మతము
    నా కొద్దీ ప్రాంతీయ భాషా విద్వేషాలు
    నా కొద్దీ దేశాల మధ్య యుద్ధాలు
    నా కొద్దీ  కరెన్సీ ల మధ్య ఆధిపత్యాలు
    నా కొద్దీ కుల మత  వైషమ్యాలు
    నా కొద్దీ జాతుల పోరాటాలు
    నా కావలసింది నీ చల్లని స్పర్శ
    పులకరింతల పలకరింత
    అకల్మష మానవత!
    23.12.2014

    Thursday, December 18, 2014

    కవిత్వ మంటే! ( kavitva Mante!)

    కవిత్వ మంటే!
    -------------------------------
    కవిత్వ మంటే
    గడ్డి పువ్వు మీది జాలు వారుతున్న
    తెలి మంచులా ఉండాలి


    కవిత్వ మంటే
    సన్న జాజి తీగకు వికసింఛిన
    జాజి పువ్వుల్లా ఉండాలి

    కవిత్వమంటే
    తొలకరి జల్లులో తడిచిన
    మట్టి వాసనలా ఉండాలి

    కవిత్వమంటే
    పున్నమి నాటి గొదావరిలా
    ప్రకాశించాలి

    కవిత్వమంటే
    సురభి నాటకంలా
    అహ్లాదంగా ఉండాలి

    కవిత్వమంటే
    అమ్మ చేతి గోరు ముద్దలా
    కమ్మగా ఉండాలి

    కవిత్వమంటే
    పల్లె పడుచులంత
    నిర్మలంగా ఉండాలి

    కవిత్వమంటే
    మంచుతో కడిగిన
    మేలి ముత్యంలా ఉండాలి

    కవిత్వమంటే
    ప్రియురాలి తొలి ముద్దులా
    హాయిగా ఉండాలి

    కవిత్వమంటే
    ఏటి ఒడ్డున పారే
    నీటి గల గలలా ఉండాలి


    భాను వారణాసి





    ., 19.12.2014

    Monday, December 15, 2014

    నేను మానవత్వాన్ని!


    నేను మానవత్వాన్ని!
    ------------------------
    నేను భాషను
    నేను భావాన్ని
    నేను అక్షరాన్ని
    నేను పద్యాన్ని
    నేను గేయాన్ని
    నేను గీతాన్ని
    ఏది ఏమైనా
    ఎలా వ్రాసుకొన్నా
    ఎలా పాడుకొన్నా
    నేను మాన వత్వాన్ని!!

    15.12.2014

     

    Saturday, December 13, 2014

    నాకున్నది నువ్వే ! (NAA KUNNADI NUVVE)


    నాకున్నది   నువ్వే ! (NAA KUNNADI NUVVE)


    ప్రేమంటే ఏమిటో తెలియని రోజున
    ఒక గులాబై నన్ను పలకరించావు
    నవ్వంటే తెలియని రోజున
    గోదావరి లా నన్ను మరిపించావు
    నీవు వస్తున్నావంటే
    నా గుండె నయగారా జల పాతమై పొతుంది
    నువ్వు నా ప్రక్కన ఉంటే
    నేను అల్ప్స్ పర్వత శ్రేణుల్ని మరచిపోతాను
    నీ చిలిపి తనం నన్ను
    ప్రవరాఖ్యుడిలా హిమాలయాలకు తీసుకెళ్తుంది
    నీ వదనార బింబం
    నన్ను ఒక వేటూరి లా ప్రేమ గీతాల్ని రాయిస్తుంది
    నువ్వు మౌనంగా అలోచిస్తూంటే
    నాకు గ్రాండ్ కాన్యొన్ లాంటి అగాధ లొయలు గుర్తుకు రావు
    నువ్వు నన్ను కౌగిలిలో వాటేసుకొన్నప్పుడు
    నాకు ఈ ప్రపంచం మీద నమ్మకం పొతుంది
    నువ్వు కొంటెగా మాట్లాడి నప్పుడు
    శ్రీ నాథుని శృంగార నైషధం గుర్తుకు రాదు
    నువ్వు ఇక రావని తెలిస్తే
    నేను ఈజిప్టు పిరమిడ్లో మమ్మీ నైపొతాను!


     

    Thursday, December 11, 2014

    నడి చొచ్చే సూర్యుడు ( NADI COCCHE SURYUDU)

    నడి చొచ్చే సూర్యుడు



    దోషాలున్నాయని
    ద్వేషాలు పెంచుకోవద్దు
    అవిశ్రాంత  రాజకియ నాయకులు
    ఊక  దంపుడు ఉపన్యాసాలిస్తారు
    మర మనుషులు కాలాన్ని అమ్ముకొంటారు
    వాళ్ళ  జెండాల్ని  మోయ డానికి
    ఎన్నాళ్ళని ఈ ముళ్ల కంచెల్ని  దాటలేవో
    అన్నాళ్లూ నీ పరిస్థితి మారదు
    చీపుర్లు రాజకీయం చెస్తున్నాయి
    చెప్పులు విసిరేసి కొందరు
    సిరాలు విసిరేసి కొందరు
    తమ నైరాశ్యాన్ని చూపిస్తున్నారు
    రాజ కియం నేడు
    అబద్ధాలే చెబుతుంది
    నిజాలు నిప్పయినా
    అవి మసి పూసిన మారేడు కాయలే
    రాజకీయం సామాన్యుడిని
    అనాది నుండి సందిగ్థం లోనే పడేస్తోంది
    చూసిన కళ్ళు నిజమని నమ్మవు
    అయినా ఆశల ఒయాసిస్సులు 
    నిన్ను ఎడారి దాకా నడిపిస్తాయి
    ఈ ఫ్రయాణం ఆపేసి తూర్పు దిక్కు కెళ్ళు
    నడి చొచ్చే సూర్యుడు నీ కొసం వేచి ఉంటాడు!




    రచన: వారణాశి భాను మూర్తి
    12.12.2014






     

    Tuesday, December 9, 2014

    AMMAA! (అమ్మా!)



    అమ్మా!
    గాంధీ పుట్టిన దేశంలో
    ఒక రాత్రి నిన్ను చిదిమేసింది
    ఒక ఉన్మాదం నిన్ను కబళించింది
    కామాంధులైన గురువుల అకృత్యాలతో
    బడి లొనే నీ బాల్యం సమాధి చెయ్యబడింది
    మృగాళ్ళ తిరిగే ఈ సమాజం లో
    నీ రోదన అరణ్య రోదనే అయింది!
    రేపటి రోజున
    ఏ రేపుల కథ వినాల్నొ?
    నిన్న జరిగిన
    నిర్భయ కథ ముగియక ముందే
    ఏ తల్లి ఉరి వెసుకొంటుందో?
    ఏ చిన్నారి బడి కెళ్ళి శవమై వస్తుందో?
    ఏ అమ్మాయి ఆఫీసు కెళ్ళి భవనం నుంచి దూకుతుందో?
    అమ్మా!
    నిన్ను కన్నందుకు మాకు
    సంతొషమా? సంతాపమా??
    అమ్మ కడుపులొనే
    నువ్వు పురిటి పాఠాలు నేర్చుకో!
    ఉగ్గు పాల తోనే నిన్ను నువ్వు రక్షించడం నేర్చుకో!
    మృగ సమాజం లో
    లేడిపిల్లలా భయపడకు
    పులి పిల్లలా మృగాళ్ళను వేటాడు!


    09.12.2014


     

    Sunday, December 7, 2014

    kavyam - కావ్యం


    నేను భౌతికంగా ఈ ప్రపంచంలో లేక పోయినా
    నా రచన లన్నీ శాశ్వితంగా ఉంటాయి
    ఒక పాఠకుడు నా గ్రంధాన్ని బీ రువాలో దాచుకొన్నా
    ఒక పాఠకుడు గుండెల్లో భద్రంగా దాచుకొంటాడు
    ఒక భావం ఉద్రేకాన్ని కలిగించినా
    ఇంకొక భావం మస్తిష్కం లో ఉండి పొతుంది శాశ్వితంగా
    కవి వ్రాసిన కావ్యం
    అందరికీ ఇష్టమవుతుందని నేను అనుకోను
    వంద మందిలో ఒక్కడయినా చదివి
    జీవితాన్ని మార్సుకోన్నా అది కవి చేసుకొన్న అదృష్టం
    కావ్యానికి కళ్ళు లేవు
    అది నడచు కొంటు వెళ్ళదు
    కావ్యానికి నోరు లేదు
    అది మాట్లాడదు
    కానీ కావ్యానికి అక్షరాల భాష ఉంది
    అది పాఠ కుడి హృదయాన్ని తాకుతుంది
    అరలలో అమ్ముడు పోకుండా పేరుకుపోయి వుండొచ్చు ఆ కావ్యం
    గానీ పుస్తకం తెరచి పుటల హృదయాలను చదివితే
    ఈ జన్మకి చాలినంత సంతృప్తి దొరకవచ్చు
    కవి రాసిన కావ్యం
    కొందరి జీవితాలలో అమృత వర్షం కురిపించ వచ్చు
    కవి రాసిన గేయం
    కొందరిని మానవతా మూర్తులుగా మార్చవచ్చు !



    నా ‘సాగర మథనం ‘కవితా సంపుటి ఆవిష్కరణ మహోత్సవ సందర్భంగా రాసిన కవిత
    10.4.2000


    Thursday, December 4, 2014

    రాసపల్లి కథలు ( 2 ) - మా ఇస్కూలు

    రాసపల్లి కథలు  ( 2 ) - మా ఇస్కూలు


    మా  పల్లిలో   అదేనండి మా రాసపల్లి లో ఐదవ తరగతి వరకే ఇస్కూలు ఉన్ది. మాకు అరవ తరగతి నుండి సదవా లంటే మేము మూడు మైళ్ళు  దూరంలో ఉండె  మాలు కు  కు బోయి సదవాల్సిందే !. అప్పుడు నేను   ఐదవ తరగతిలో  సదుతున్న .    ఇక్కడుండే  ఇస్కూలు లో గుడా మా సారు బడికి ఒస్తే గదా? వారానికి  రెండు , మూడు  రొజులొస్తాడు. మిగతా  రోజుల్లో    మమ్మల్నే  సదుకొమంటా డు .  నాకు బలే కోప మోచ్చేది . మీకు  గొవేర్నమెంటు  వొళ్లు  జీతాలు ఎందుకిస్తా   ఉండారు సార్  ? అని దయిర్నం జేసి అడిగినాను . మా సారుకి దానికి బలే కోపమొచ్చింది . సింత బర్ర తీసుకోని నాలుగు బెరికి నాడు.  మా నాయనకు జెప్పినా  ఈ  ఇసయమన్తా. మా నాయన నన్నే తిట్టి నాడు .' గురుల్ని  ఏమన గూడదు నాయనా! ఆళ్ళు మనకు సదువు సేప్పే వోళ్ళు . పోయి చమించమని అడుగు  అని చెప్పినాడు మా నాయన . మా నాయన మీద  నాకు శానా కోప మొచ్చింది . సరే నని ఆ మర్న్యాడు పోయి  చమించమని  అడిగినాను . సరే అని సెప్పి సిచ్చగా నాకు గోడ  కుర్సీ ఎయ్యమన్నాడు. ఏమనుకోన్నాడో  ఏమో గాని , నన్ను మరుసటి రోజు నుండి స్కూలు  లీడెర్ని సేసి నాడు .

    స్కూలు లీడర్ని అయిన్యాక , నాకు బలే పని  ఆయింది . ఇస్కూలు కు  పిల్లోల్లు  వస్తా ఉండారా , లేదా అని సూసుకోవల్ల . రాలేదంటే వాళ్ళ ఇల్లకేల్లె ఆళ్ళను .

    ఈడ్సుకొని రావల్ల . సారు ఇస్కూల్ కు ఎప్పుడొస్తాడో రాడో తెలీదు .

    రానప్పుడు నా సావు  నేనే సావల్ల. ఒక్కో సారి మా సారు ఇంట్లో  , బయట  పనులన్నీ సూసుకో ని  వస్తాడు. ఆయప్పకు ఇస్కూలు పనుల కంటే  బయట పనులే  ఎక్కువ .

    పొద్దున్నే ప్యార్తన అయినాక , నేను పిల్లోల్లందరికి క్లాసుల వారి కుస్సోమని , వాళ్ళకి ఏదో  ఒక  పాటమో  , లెక్కలో రాసు కొమంటాను. సారు  వస్తాడేమో నని మద్యాన్నం దాకా కాసు కొని ఉంటాను . రాలేదంటే మా తంటాలు మేమే పడి  ఇంటికి పొయ్యే బెల్లు ముందు గానే వాయిస్తా. కొందరు పిల్లోల్లు సాయంకాలం వర్కు కోతి కొమ్మా , కబాడీ , జిల్లా కోడి ఆట ఆడతా ఉంటారు  . ఆడ పిల్ల కాయలయితే దొంగాట , ముక్కు గిల్లె ఆట, కుంటాట, తొక్కు బిళ్ళ ఆట ఆడు కొంటారు .

    అందుకే మా ఇస్కోల్లో ఐదవ తరగతి పాసు అయ్యి, ఆరవ తరగతి లో సేరి నోళ్ళు సాన తక్కువ. సదివే దానికి , రాసే దానికి  ఒస్తే  చాలని ఐదు కాడికే ఆపేసి సేద్యానికి తొల్తారు. నాకు మటుకు నాకు బాగా సదోకొని , పెద్ద ఉద్దోగం సేయ్యల్ని ఉండాది . ఎట్లయినా  సారు ని మంచి సేసు కొని అన్ని నేర్చుకోవల్లని , ఐదవ తరగతి గట్టేక్కేస్తే , అరవ తరగతి లో ఐ స్కూల్లో బాగా సదువు కోవల్లని ఉండాది .

    ఒక రోజు ఆ  రోజు మంగళ వారం అనుకొంటా . సారు  నిన్న బడికి వచ్చినాడు గాబట్టి , ఈ రోజు రాడు  అని నాకు తెలుసు. అందుకె పిల్ల కాయలు గూడా రాలేదు.మొత్తం మీద పది మంది పిల్లోల్లు  గూడా లేరు . నేను ఉన్న పిల్లోల్లకు ఎక్కాలు నేర్పిస్తున్నా . ' రెండు  ఒక్కట్ళా  రెండు ... రెండు  రెండ్ల  నాల్గు .. రెండు మూడ్ల ఆరు...' అని  నేర్పిస్తున్న . అంత లోనే ఒక పెద్ద ఆయప్ప , ఆ ఆయప్ప ఎనకాల ఒక  బంట్రోతు వచ్చి నారు  మా బడిలోకి .

    ' మీ సార్ ఎక్కడ్రా  ?'  అని నన్ను అడిగాడు  ఆయన కోపంగా .

    అబద్దం సేప్పాలో ,నిజం సెప్పాలో తెలిలేదు నాకు .

    'ఇప్పుడే వస్తానని సెప్పినాడు సార్ ' అని సెప్పినా .

    ఆ సారు నా వంక చూసి నిజం చెప్పు ఆని ఉరిమి నాడు . నాకు బయం ఏసి ఉన్న ఇసయం అంతా సెప్పెసినాను.

    'ఇలాంటి టీచర్లు ఉండ బట్టే , దేశం ఇలా తగల బడి  పోయింది ' అన్యాడు పెద్ద సార్ .

    వాళ్ళిద్దరూ మా ఇస్కూల్లో ఉన్న మా హాజరు బుక్కులు , మిగతా రి కా ర్డు లన్ని తనికి సేసినారు .
    ఏమయ్యిందో ఏమో గాని , మా ఇస్కూలికి ఒక నెల వరకు మా సారు రానే  రాలేదు.

    ఒక రోజు , ఒక  కొత్త  సారు   మా బడికి  వచ్చి నాడు . వయసులో శానా సిన్న వాడు గా ఉండాడు .

    'ఈ  రోజు నుండి నేను మీకు కొత్త టిచర్ని . నేను  ప్రతి రోజు స్కూలు కి వస్తాను. మీ ఉర్లోనే ఇల్లు తీసుకోని ఉంటాను . మా ఇంటికి వచ్చి  రాత్రి పూట గూడా చదువుకొండి ' అన్నాడు కొత్త టిచేరు .

    ఆ సారికి మా బడిలో ఐదవ  తరగతి పది మంది ఉంటె అందరమూ పాస్  అయి మాల్లో ఆరవ తరగతి లో జెరినాము. ఇదంతా కొత్త సారు  దయ వల్లనే .

    ఇంతకూ మా పాత సారు ఏమయ్యాడో అని మా కొత్త సారుని అడిగాను .

    'ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది ' అని చెప్పాడు మా కొత్త సార్ .ఆ  వచ్చిన వాళ్ళు డి ఇ ఒ  సార్ ' అన్న్యాడు మళ్ళి .

    నాకు ఈ రెండు ఇంగిలి పీసు  పదాలు అర్థం కాలేదు .

                                     ****************************************

    Wednesday, December 3, 2014

    భాను బాణీలు 3 - చిరు కవితలు


     భాను  బాణీలు 3 -  చిరు కవితలు


    ఈ  సృష్టిలో  ప్రతిదీ
    ఒక అనుభూతే
    చివరకు  మరణం  గూడా
    ఒక అనుభూతే !


    కనీసం నువ్వు
    నలుగురుతో నైనా బాగుంటే
    నీ పాడె  మొయ్యడానికయినా  
    పనికొస్తారు!

    అమ్మ ఒడిలో
    ప్రపంచాన్ని మరచి పొయ్యావు
    పెళ్ళాం   కౌగిలిలో
    అమ్మనే మరచి పోయ్యావు !

    నాకింకా 
    నా బాల్యం గుర్తు
    నేనిప్పుడు తొంభై ఏళ్ళ
    పసి బాలుడ్ని !

    నరికేసిన చెట్లు
    మన ఇంటికి వసారాలు
    గానీ  రేపటి తరానికి
    ఆశనిపాతాలు !

    నాన్న నీకు ATM
    నువ్వు చదివే దాకా
    నువ్వు ఉద్యోగంలొ చేరాక
    నాన్న నీకు  outdated  machine !

    మొదటి కాన్పులో
    ఆడబిడ్డ  శ్రీ లక్ష్మి
    రెండవ కాన్పులో
    ఆడ బిడ్డ  దరిద్రపు మొహం !


    03.12. 2014
    వారణాసి  భానుమూర్తి  రావు