Saturday, December 27, 2014

అమ్మా నన్ను క్షమిస్తావా ?

అమ్మా  నన్ను   క్షమిస్తావా ?

 నవ మాసాలు మోసి
నీ  రక్తంతో  నన్నునీ  గర్భంలో  పెంచి 
నీ  బొడ్డుతో  అనుబంధం  పెంచుకొని
 నీ  పేగులు త్రుంచుకొని ప్రసవ మిచ్చిన
 తల్లీ   నీకు నమస్కారం

 కన్నా పాలు త్రాగు  తండ్రీ
 నా కన్నా  బంగారు కొండా
అను గుండెల్ని హత్తుకొని
నీ చనుబాలతో  నా ప్రాణాన్ని కాపాడిన
తల్లీ  నీకు నమస్కారం

పచ్చి బాలింత వయినా
పురిటి నొప్పులతో  భాద  పడినా
అత్తా మామలకు ఊడిగాలు  చేస్తూ
నాన్న  పురుషా ధిక్యానికి  సలాం చేస్తూ
నా కేలోటూ  రానియ్యకుడా  కంటికి రెప్పలా చూసుకొన్న
తల్లీ నీకు నమస్కారం

నేను పది కాలాల పాటు చల్లగా ఉండాలని
గుడులకు దర్గాలకు  తిరిగి
నా మెడలో తాయెత్తులు  కట్టించి
నా కోసం నోములు ఉపవాసాలు చేసి నన్ను రక్షించిన
తల్లీ నీకు నమస్కారం

నా చదువు కోసం  నువ్వు నాన్న దగ్గర చివాట్లు తిన్నావు
నా ఉన్నత విద్య కోసం నీ కున్న ఒక్క గొలుసులు  అమ్మేసావు
నన్ను గొప్పవాడి గా చూడాలని
నన్ను ఒక ఇంటివాడ్ని చెయ్యాలని  సదా కోరుకొన్న
తల్లీ  నీకు నమస్కారం


గానీ

తల్లీ  నేను సుదూర తీరాలకు ఉద్యోగ నిమిత్తం వె డుతున్నపుడు
నీ ఎదలో  దాగిన వేదనాగ్ని  నా కర్థం కాలేదే !

ఎక్కడున్నా నువ్వు సుఖంగా వుండు నాయనా
అని నువ్వు దీవించి నపుడు నువ్వు ఎలా ఉన్నవమ్మా
అని ఒక్కసారి గూడా నిన్ను అడగ లేక పోయ్యనే !

నువ్వు  నా పిల్లలను  ప్రేమతో హత్తుకోన్నపుడు
బామ్మ unhigeinic అన్నపుడు నీ  కళ్లల్లో ఉబికి వచ్చిన
కన్నీటిని  అర్థం చేసుకోలేక  పొయ్యానే !


నువ్వు దగ్గుతూ ఆయాస పడుతూ 
నవ్వుతూ మాకు సపర్యలు చేస్తున్నా
నీ ఆరోగ్యం ఎలా ఉందని అడగ లేక పొయ్యానే !

నా కోసం ఉపవాసాలు చేసావు
నా కోసం జాగరణలు చేసావు
గానీ  ని కోసం మేము ఏమి చెయ్యలేదని చింతిస్తున్నా!

బోలెడన్ని కతలు నువ్వు చెప్తానన్నా
ఐపాడ్  లోనో, యు ట్యూబ్ లోనో బాబా బ్లాక్ షీప్ వింటున్న నా పిల్లలకు
 బామ్మ కతలు వినమని చెప్పలెనందుకు  సిగ్గు పడుతున్నా!

రాముడన్నా , కృష్ణుడన్నా , తెలుగు అన్నా , అమ్మ అన్నా , నాన్న అన్నా
భరత భూమి అన్నా , అత్త అన్నా , మామయ్య అన్నా , బాబాయ్ అన్నా
అన్నమా చార్య కీర్తన అన్నా , గోవిందు డన్నా , గోదావరి అన్నా
అసలు మన సంసృతి అన్నా , మన అచారాలన్నా
బొత్తిగా తెలియని  జ్ఞానాంధ కారంలో నా బిడ్డల్ని పెంచుతున్నా!
అసలు అమ్మకు గాని , అమ్మ భాష కు గాని
అర్థం గాని బ్రతుకు బ్రతుకుతున్నా  అమ్మా!
నన్ను క్షమిస్తావా !
నన్ను నీ  గుండెలకి హత్తు కొంటావా ?
ఇంకొక  జన్మ అంటూ
నువ్వు నా కూతురు గా పుట్టు తల్లీ
నీ ఋణం  నేను తీ ర్చు కొంటా  నమ్మా !!


28. 12. 2014   - భాను  వారణాసి



 

No comments:

Post a Comment