Saturday, February 28, 2015

ఎంత కష్టం ? ఎంత కష్టం ??

ఎంత  కష్టం ? ఎంత  కష్టం ??

----------------------------------------------

దారి దాపున   చెత్త కుప్పల
చిత్తు  చిరుగుల  నేరు కుంటూ
చిట్టి కొడుకును  చంక  మోసి
అలిసి  పోయే  మాతృ మూర్తికి 
ఎంత కష్టం ? ఎంత  కష్టం ??

చిరిగిపొయి  మాసిపోయిన
చీరకొంగును  బొడ్డు దోపి
పాలు  గారే చిట్టి బిడ్డను
బొంత  మీద  పండ  బెట్టి
మట్టి  రాళ్ళను  మోసుకెళ్ళే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత  కష్టం ??


నెత్తి మీదను  మోపు  బెట్టి
కాలి నడకను  ఊర్లు  తిరిగి
చంక  జొలెన  బిడ్డ  నొదలక
కడుపు  కూటికి చీపుర్లనమ్మే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత  కష్టం ??

పందులున్నా కుక్కలున్నా
దోమలున్నా  ఈగలున్నా
పలుగు పరకతో  రొచ్చు  తీసి
పాయి ఖానాలను  శుభ్రం  చేసే  మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత  కష్టం ??

మంచు లోనా   ,ఎండ  లోనా
రాత్రి  అయినా , పగలు  అయినా
పిల్ల పాపల నొదలి   పెనిమిటిని  వదలి
చీపురెట్టి  నగర  రోడ్లను  శుభ్రం  చేసే  మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత  కష్టం ??


భూమి  తల్లిని  నమ్ము కోని
ఎండ  గాని వాన  గానీ
దుక్కి దున్ని  నాట్లు  వేసి 
కలుపు  తీసి  కండె  జూసి పంట  కోసి
ఎండ బెట్టి  ఎండి  బొయ్యే  రైతు  తల్లికి
ఎంత కష్టం ? ఎంత  కష్టం ??


 పచ్చ రవిక  తొడిగి  తెల్ల చీర  కట్టి
 మల్లెపూలు  సిగన  ముడిచి ముస్తాబు చేసి
పసి  వాడని పసిడి  తల్లిని  మాతమ్మను  చేసి
ఆచారం  పేరిట  అంగడి బొమ్మయిన  ఆ  చిన్న   తల్లికి
ఎంత కష్టం ? ఎంత  కష్టం ??

ఆడపిల్ల  కెవ్వు  మంటే వడ్ల  గింజను  నోట దోసి
పురిటి  పసికందు  ప్రాణాలు  తీసే తల్లిదండ్రుల దాష్టికానికి
బలి  అయిన అన్నెం పున్నెం  ఎరుగని  ఆడ పిల్ల కు
ఎంత కష్టం ? ఎంత  కష్టం ??

05. 01. 2005
భాను వారణాసి
 

Monday, February 23, 2015

దాడి

దాడి
--------------------------


కొన్ని  వాదాలు  ఎందుకు  పుడతాయో  తెలీదు
వితండ  వాద మనీ  , పిడి  వాదమనీ
వాడి  వాదం  వాడి  వేదం  అయినపుడు
వాడి వాదాన్ని  పట్టుకొని  వాడు  ఊగుతూ  ఉంటాడు ఈ  లోకంలో
నిజమే ...
కొందరు  మనుషులు  వింతగా ప్రవర్తిస్తూ  ఉంటారు
అర్థాలకు  పెడర్థాలు  తీస్తూ
పెడర్థాలకు  విపరీత అర్థాలు  తీస్తూ

వాడు బ్రతకడం  శాశ్వితం  అనుకొంటాడు
అందుకే  వాడు  బ్రతికున్నంత  కాలమూ  
వాడి  వాదంలో  మనం  బ్రతకాల్సిందే !

అసలు  మనం జంతువులను  చూసి  ఎందుకు భయ పడాలి ?
మనుషుల్ని  చూసి  భయ పడాలి గానీ !
ఆలోచిస్తే  జంతువు  ఆకలయితేనే  దాడి చేస్తుంది
కానీ  మనిషి  నిరంతరం   దాడి  చేస్తూనే  ఉంటాడు !


భాను  వారణాసి
22.02 . 2015



 

Saturday, February 21, 2015

గుర్తు కొస్తున్నాయి

గుర్తు కొస్తున్నాయి
----------------------------------------------------------------
అమ్మ అపురూపంగా చూసుకొనే తన పుట్టింటి  పట్టు చీరను నీ  కిచ్చి నపుడు
అల్మారా లో భద్రంగా దాచుకొని  అప్పుడప్పుడు  చూసుకొంటూ
అమ్మను తలచుకొని  అమ్మను నీలో  ఆవాహన చేసుకొనేందుకు
ఆ పట్టు చీరె   చూసినప్పుడల్లా  అమ్మ నీకు గుర్తు కొస్తుంది

నాన్న నీ కిచ్చిన తన  హెచ్ ఎం టి  వాచ్
నీ  జీవితాన్ని  కాలంతో పరుగులు తియ్యమని
చెపుతున్నట్లు  నాన్న నీతోనే ఉండి నిన్ను
నడిపిస్తున్నట్లు  నీకు  ఆ  వాచ్  ని  చూసి నప్పుడల్లా నాన్న గుర్తుకొస్తాడు

ఆరవ తరగతిలో  నీ  జామెట్రీ బాక్సు
లలిత కుఇచ్చావని  నాన్న నిన్ను చివాట్లు పెడితే
ఇప్పటికీ భద్రంగా  దాచుకొన్న ఆ  జామెట్రీ బాక్సు ను చూసినప్పుడల్లా
ఏడుస్తూ  సారీ  చెప్పి తిరిగి ఇచ్చేసిన  లలిత గుర్తుకొస్తుంది

టూరింగ్ టాకీస్ లో మొదటి ఆట మొదలు పెట్టేముందు
పరుగులు తీసి నెల టికెట్ కొని ఆ సినిమా చూసిన బాల్యమంతా
గుర్తుకొస్తుంది  నీ కిపుడు  ఆ సినిమా  పేరు విన్నప్పుడు గానీ
లేదా అ సినిమా లోని పాట విన్నపుడు గానీ

 నువ్వు ఎసి  కార్లో  కూర్చొని  ఎఫ్ ఎం లో ఒక
ప్రేమనగర్ పాటో దసరా బుల్లోడు  పాటో విన్నప్పుడు
నీ  కాలేజీ  జీవితం  ,నీ  మదురమైన యౌవనం రోజులు
గుర్తు కొచ్చి  అలా  పరిసరాల్ని మైమరచి పోతావు

ఆకాశ వాణి ప్రభాత గీతం విన్నా  , సిగ్నేచర్ గీతం విన్నా
నీ మనస్సు  పరుగులు  తీస్తుంది  గతం వైపు
ఒక రైలు కూత విన్నా , గుడిలో గంటల నాదం  విన్నా
మసీదులో నమాజు  పిలుపు విన్నా , సుప్రభాతం విన్నా
ఒక కవిత చదివినా , ఒక పాత పాట విన్నా
తనువు పులకరించిపొతుంది , మనసు  పరవశించిపోతుంది
ఒక్క సారిగా గతం తాలూకు స్మృ తులు
గుర్తు కొచ్చి మనల్ని  మైమరిపిస్తాయి !!

భాను  వారణాసి
18. 02. 2015
 

Thursday, February 19, 2015

నన్ను మళ్ళి పుట్టించకు !


నన్ను మళ్ళి పుట్టించకు !
-------------------------------


నేను నగ్నంగా  ఆకాశపు  అంచుల  నుండి  జారిపోతున్నప్పుడు
నక్షత్ర  కోనలు నన్ను  కొంతసేపు  ఆపాయి
విశాలమైన  తమ హృదయ  తటాకాల్ల్లొ  నన్ను ముంచెత్తినాయి
ప్రేమ  గదుల్లోకి తీసుకెళ్ళి  మమతల వర్షాన్ని కురిపించాయి
నేను నగ్నంగా  నక్షత్ర  లోకం నుండి  జారి పడుతున్నపుడు
జాబిల్లి వెలుగులు నన్ను పొదివి పట్టుకొన్నాయి
వెలుగు  కలుగుల లోకి నన్ను తీసుకోని వెళ్ళాయి
నేను  అమాయాకంగా  ఒక ప్రశ్న  అడిగాను  వెన్నెలమ్మను
నేనెవరిని  అని ?
నువ్వు  పవిత్ర ఆత్మవి !
మరి నేనెక్కడికి  వెళుతున్నాను ?
అందమైన భూలోకానికి  !
నేను నగ్నంగా  జాబిల్లి వెలుగ రేకుల నుండి జారి పడినపుడు
ఎగిరిపోయే మేఘ మాలికలు నన్ను పొదివి పట్టుకొన్నాయి 
తుషార బిందువులు  చిలకరిస్తూ
సప్త వర్ణ శొభితమైన  ఇంద్ర ధనస్సు మీద  నన్ను కూర్చోబెట్టి
ప్రపంచాన్ని అంతా  ఒకసారి తిప్పాయి
అత్యంత  మనోహర మనోజ్ఞ భూమిని చూస్తూ
పరవశించి పొయ్యాను
కానీ ...
దుర్బర దారిద్ర నరక బాధలు  అనుభవిస్తూ కొన్ని ఆత్మలు  అధోగతిన
ప్రయాణి స్తున్నాయి
వాటి ఆక్రందనల  ఆవేదనా  సమస్త గాధలు నాకర్థ మయ్యాయి
హే భగవాన్ ! నన్ను మళ్లి  పుట్టించకు!
ఈ బాధా తప్త సర్ప ద్రష్ట కుటిల కుతంత్ర  లోకంలోకి  నన్ను విసిరి వెయ్యకు !!

 

Monday, February 16, 2015

కాసనోవ ( Casanova )


కాసనోవ ( Casanova )
---------------------------------------------------------
నిన్ను లేపడానికి  సుప్రభాతం  పాడు కొంటూ
నీ  బాగు కోసం తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ
నా  ఉనికిని మరచిపోయి  నీ కోసం  కర న్యాసం  , అంగ న్యాసం  చేస్తాను
కేశవ నామాలు చెప్పుకొంటూ
నా బాధల్ని   అర్ఘ్యం తో ' స్వాహా ' అను కొంటూ  మింగుతాను
నా ఆరోగ్యాన్ని  వంట  ఇంట్లోనే వండి వార్చుతాను
నోము లని ఉపవాసాలు చేసి  నీ బాగు కోసం ఆకలి దేవుడ్ని కోలుస్తాను
ఏడు అడుగులు నీతో  నడచిన  రోజు నుండి ఏడవని రోజంటూ లేదు
ఎ  సూత్రం  అమలు చేశావో గానీ , నువ్వు  కట్టిన
మంగళ సూత్రం మటుకు  అర్థం  గాని లాజిక్కు లో పడేసింది
మగ మహారాజు  అనే బిరుదు  ముందు
పద్మ శ్రీ , పద్మ  విభూషణ్   దిగ దుడుపే !
కర్ర పెత్తనం చెయ్యవు గానీ
మాటల ఈటెలతొ  పోటు  పొడుస్తూనే  ఉంటావు
అనసూయ , అరుంధతి , సతి సావిత్రి
పతివ్రతల కథలు మాటి మాటికి  చెబు తావు  గానీ
నీ  భాగవతం  గురించి  చెప్పనివ్వవు
నీ ముఖ పుస్తకం , నీ వాట్స్ అప్  లో
నీ మొబైల్ ఎస్ ఎం ఎస్ లే   నీ  సుందర కాండను  చెబుతాయి
కట్టు , బొట్టు , పట్టు , పెట్టు  అంటావు  గానీ
నీ రట్టు , గుట్టు  నాకు తెలియంది  గాదు
నోరు నొక్కేసి  పతి  సేవ మహిమ లు చేబుదావు గానీ
సతి సేవ  గురించి  మాట్లాడ నియ్యవు
నువ్వు క్షేమంగా  ఉండాలని  నేను పారాయణాలు  చేస్తే
నువ్వు  మందు విందు  పొందు అంటూ చిందులేస్తావు
నిన్ను  కాసనోవా అనాలా !
లేదా  నిన్ను  హద్దులు లేని మగ మహా రాజు అనాలా ?
నీ  విశృంఖల  విజృంభణ   అంతః  కరణ  చతుష్టయ  పురుష అహంకారానికి
ఇదే  నా అల్టిమేటం!
అణిగి మణిగి ఉండే దాకానే  ఆడది!
ఎదురు తిరిగితే  ఆది పరాశక్తి !!




17. 02. 2015

 

Sunday, February 15, 2015

కుక్కలు

కుక్కలు


కొన్ని కుక్కలు  అంతే
తోక   జాడించుకొంటూ , నాలుక  సాగదీస్తూ బతికేస్తాయి
కొన్ని కుక్కలు వరండాలోనో ,  గేట్ల ల్లోనో
మెడ చుట్టూ  బెల్ట్ వేసుకొని
బిత్తర చూపులు  చూస్తూ  ఉంటాయి
కొన్ని కుక్క లకి విశ్వాసం  మరి ఎక్కువ
యజమాని  రాగానే సాగిలపడి  నమస్కారం చేస్తాయి
అంతే  గాదు , కాళ్ళని  చుట్టేసుకొని పాదాల్ని  నాకేస్తాయి
కొన్ని  కుక్కలు పడేసే  పాలు బిస్కత్తు ల  కోసం 
రకరకాల  విన్యాసాలు చేస్తాయి
కొన్ని కుక్కలు అమ్మగారి బెడ్ రూం లోనే కాలక్షే పం  చేస్తాయి
కొన్ని  కుక్కలు  ఏసీ కార్లల్లొ తిరుగుతాయి
కొన్ని కుక్కలు  వీధుల్లో  పడి మొరుగుతు  ఉంటాయి
కొన్ని కుక్కలు  అస్తమానం ఏడుస్తూ  ఉంటాయి
కొన్ని కుక్కలు  రోడ్లల్లో  పొయ్యే  వాళ్ళని  దొంగల్లా  చూస్తాయి
కొన్ని మొరిగే కుక్కలు అసలు కరవనే కరవవు
అసలు మడిసికి  కుక్కకి ఎక్కడో
అవినాభావ సంబంధం  ఉందేమో !
ఒక్కసారి DNA  పరీక్ష చెయిస్తే  సరిపోలా !!

భాను  వారణాసి
16. 02. 2015

 

Saturday, February 14, 2015

ఒకా నొక ఒక

ఒకా నొక ఒక

-------------------

ఒక నిద్ర
ఒక మెలుకువ
ఒక వెలుతురు
ఒక చీకటి

ఒక ప్రేమ
ఒక త్యాగం
ఒక  రాగం
ఒక భోగం

ఒక  కల
ఒక నిజం
ఒక  ఖేదం 
ఒక  మోదం


ఒక  రాత్రి
ఒక పగలు
ఒక  క్షణం
ఒక దినం


ఒక శ్వాస
ఒక  ఊపిరి
ఒక జీవితం
ఒక మరణం

 

Wednesday, February 11, 2015

కలలు

కలలు
----------------------------------------------------

అసలు నువ్వెందుకు  కలలు  కంటావో
అసలు కలలు  నీకెందుకు వస్తాయో  నా కర్థం  గాదు
కలల్లో  నీ  ఏడ్పులు , నీ  నవ్వులు
నీ మాటలు , నీ  పాటలు
నీ వెటకారాలు , నీ  హాస్యోక్తులు
నువ్వెందుకు  ఏడుస్తావో
అంతలోనే  ఎందుకు  నవ్వుతావో  నా  కర్థం గాదు
కల కల్ల  అని తెలిసి గూడా
కలల్ని  కంటూనే  ఉంటావు
పొద్దున్నే లేచి  ఏమి తెలియని వాడిలా  నటిస్తావు
అవునా నేనా ఎడ్చానా , నవ్వానా అని
తిరిగి నాకే ప్రశ్నలు
కలల్ని కను
గాని ఆ కలల్ని సాకారం చెయ్యి
అని గదా పెద్ద వాళ్ళు  అన్నారు
నువ్వు మాత్రం కలల్ని  కని నీ  కళ్ళు ఉబ్బి పొయ్యాయి
కలలో నువ్వు  మాట్లాడుతున్నావో , ఏడుస్తున్నావో
అని నేను చెప్పేవరకూ  నీకేమీ  తెలియదు
అసలు నీకు కలలు ఎందుకు వస్తాయో !
వచ్చినా నీకు ఎందుకు గుర్తు ఉండదో !

నిన్ను  కలలు  కనడం చూసిన  వారు  మాత్రం
శాశ్వితంగా కలలు  కనడం  మానేస్తారు !



భాను వారణాసి
12. 02. 2015
 

Tuesday, February 10, 2015

సంఘర్షణ

సంఘర్షణ
---------------------------------------------
నిన్నటి వరకు నీడలా ఉన్నవాడు
ఈ రోజు మాయమయ్యాడు
నిన్నటి దాక  కబుర్లు చెప్పిన వాడు
ఈ రోజు కనుమరగయ్యాడు

కొన్ని క్షణాలు
ఏంతో  విలువైనవి
పోగుట్టుకొంటే
మళ్లి  అసలు తిరిగిరావు

కని  పెంచిన  నీ  కూతుర్ని అత్తవారింటికి పంపించే సమయాన
నీ  గుండెల్ని పిండి చేసే స్తుంది
అల్లారుముద్దుగా  పెరిగిన నీ కొడుకు
అమెరికానో మరేదో సుదూర తీరాలకు వెళ్ళే సమయాన
నీ దుఃఖం కట్టలు  తెంచుకొని  పారుతుంది
నీ సమస్యలు  తనవిగా భావించిన  నీ నేస్తం దూరమయిన సమయాన
నీ  కన్నీరు కట్టలు తెగి  ప్రవహిస్తుంది

జీవితంలో కొన్ని  ఘట్టనలు , సన్నివేశాలు
మనల్ని అలానే కట్టి పడివెస్తాయి
మనం మనవే , మనవారే అనుకొన్న వన్నీ
మనల నుంచి  దూరమవుతాయి
మనల్ని  మానసిక క్షోభ కు గురి చేస్తాయి

మన వాళ్ళే కాదు , మనం పెంచుకొన్న పిల్లి కూనలు
కుక్క పిల్లలు , లేగ దూడలు ,చిట్టి చిలకమ్మలు
ఆసాంతం మనల్ని  ప్రేమ గుహల్లోకి  తోసి వేస్తాయి
వాటితో మన అనుభందం  ఇక లేదని తెలిసి నపుడు
ఆ గుహల్లోనే మనల్ని  శాశ్వి తంగా సమాధి చేసేస్తాయి

ఒక్కొక్కసారి మనింట్లో పెరుగుతున్న
పారిజాతం చెట్టు , మందార పూలు
నిన్ను పలకరించినట్లే ఉంటాయి
గాలికి వూగు తున్న కొబ్బరి ఆకుల సవ్వడి
వేప చెట్టు నుండి వస్తున్న  చల్లని గాలి
నీతో మాట్లాడు  తూనే  ఉన్నట్లు ఉంటుంది
అపార్ట్ మెంట్ ల కోసం ఆ ఇంటిని పగుల కొట్టినపుడు
మూగగా రోదిస్తున్న మొక్కలు  నిన్ను పిచ్చి వాణ్ని చేస్తాయి

కలలు కనే  రాత్రిళ్ళు  మనల్ని  నిద్రపోనియ్యవు
పాత జ్ఞాపకాలు  వెంటపడి మనల్ని ఏడిపిస్తూ ఉంటాయి
జ్ఞాపకాల పరిష్వంగణాలల్లొ మన మనస్సు వాటి కోసం ఆక్రందన చెందుతుంది
అనుభూతుల కారకాలు మన నుండి దూరంగావెళ్లి పొయ్యాక
మనకు మిగిలింది  శూన్యమే అని అన్పిస్తుంది

 చివరకు  మన  నీడ గూడా మనల్ని వదలి పెట్టి వెళ్లి పోతుందేమో !


భాను  వారణాసి
10. 02. 2015

Sunday, February 8, 2015

నాన్నా అమ్మా !

నాన్నా అమ్మా !
-------------------------------------------------

నాన్నా అమ్మా !
మీరో క్కక్కసారి  ఒకరకంగా  ఎందుకు మారతారో 
నా చిన్న  బుర్రకు  అర్థం కాదు
ఎండా కాలంలో  వడగళ్ళ వాన  కురిసినట్లు
వానా కాలంలో  వడ గాల్పులు ఉన్నట్లు
ముద్దులొలికె మా బాబు అంటూ  ముద్దాడ తారు
మారాం చేస్తే  ఎక్కడ ఎలా కొడతారో తెలియదు
తోడ పాయసం అంటూ నా చర్మం  కమిలి పోయ్యేట్లు  గిల్లుతారు
తప్పు ఏమిటంటే  నాన్న   కళ్ళద్దాలు  పగలగోట్టానని
నా కెట్లా తెలుసు నాన్న అద్దాలు పగిలి పోతాయని ?
నేను  అన్నం తినలేదంటూ నోట్లో  కుదిపి కుదిపి పెడతారే
అన్నం రుచిగా లేదంటూ నేనెలా చెప్పేది ?
నా కంత  జ్ఞానం లేదే !
అన్నం తిన లేదని అమ్మ నా మీద అలిగింది
అమ్మ కెలా చెప్పాలి  నేను ఏ  తప్పు చేయ లేదని !
అల్లరి  చేసానంటే  డాక్టర్ సూది  వేస్తానంటారు 
డాక్టర్  సూది  అంటేనే నాకెంత భయం అని మీకెలా  తెలిపేది ?
మీ టివి  సీరియల్స్  కి ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో నని
నన్ను నిద్ర పొమ్మంటారు
నిద్ర పోక పోతే  బూచాడో స్తాడంటారు
రాత్రంతా  నాకు బూచి కలలు  వస్తున్నాయని నేనలా మీకు చెప్పేది ?
రాత్రిళ్ళు నేను  నిద్ర పోవడం లేదని  గట్టిగా మీరు తిట్టు కొంటారు
మీరలా  ఫైటింగ్  చేస్తుంటే నా చిన్ని గుండె గట్టిగా కొట్టుకొంటుందని మీకెలా  చెప్పేది ?
అసలు  మీది  ప్రేమనా లేదా  కోపమా ?
క్రమశిక్షణ తో గూడిన  ప్రేమనా ?
అర్థం  కాలేదని  మీ కెలా చెప్పేది ?
మీ భుజాల మిద వాలి పోవాలని ప్రేమగా మీ దగ్గరికొస్తే
ఆఫీసు  టెన్షన్  అంటూ  నాన్న నన్ను విసిరివేస్తారు 
నేను పడిన బాధ మీకెలా చెప్పను ?
బుడి బుడి అడుగుల  వాణ్ని
ఇంకా నడక గూడా  సరిగా రాని  వాణ్ని
మాటలు గూడా సరిగా పలక లే ని వాణ్ని
రెండేళ్ళు  గూడా నిండని  మీ గారాల  పుత్రుణ్ణి
నన్నర్థం  చేసుకోండి  నాన్న అమ్మా !
క్రమ శిక్షణ పేరుతొ నన్ను నా బాల్యాన్ని
నరకం చేస్తున్న  నా ప్రియమైన నాన్నా అమ్మా !
నన్నర్థం  చేసుకొంటారు గదూ  ?


భాను వారణాసి
09. 02. 2015

నియంత్రణ

నియంత్రణ
--------------------------------------------------------
మనిషిని  వ్యక్తీకరించడమో ,అవ్యక్తీకరించడమో
సాహసం తో చేసే పని
అభివ్యక్తం అనేది  అగ్గిపెట్టెలో దాచిన పట్టు చీర లాంటిది
మన  చిన్నతనమప్పుడు
నిర్మోహ మాటంగా  మాటల్ని ఎగ జిమ్మినా
అంత చేతనా వస్థ  ఉండేది  గాదు మన మాటలకి
కానీ  వయసొచ్చాక పద ప్రయోగాలను  మైక్రో స్కో పిక్ చెయ్యాల్సిందే
దారం కట్టి ఎగర వేసిన జీరంగిలా
రెక్కల ల్లార్చుకొని  గీ పెట్టాల్సి వస్తుంది  పద అప్రయోగంతో
మాటలకి   చేతలకి  పొంతన ఉండదు కొంత మంది  అభివ్యక్తీకరణలో
ప్రయోగశాలలో కప్పల్ని కోసిన జంతు శాస్త్ర విద్యార్టిలా ఎగిరి గంతేసినా
నీ గొంతుని శాశ్వితంగా నొక్కడానికి  డిస్సెక్సన్ పరికరాలు ఉండనే ఉంటాయి
నిశ్శ బ్ధం గూడా  ఒక్కొక్కసారి మాట్లాడుతుంది
దేహం , కళ్ళు గూడా  మాట్లాడుతూనే  ఉంటాయి
మాటల మూటలు  కట్టుకొన్నా  కొన్ని అలా వొరిగి పోతూనే ఉంటాయి
విచిత్రమేమిటంటే  మాట ప్రయోగం అనేది  సంక్లిష్ట ప్రక్రియ
మనిషి  ఎదిగే కొద్దీ మాట రూపాంతరం చెందాలి
అస్త్రాలని సంధించే టప్పుడు ఇక తిరుగు మంత్రాలుండవు
నరం లేని నాలుక మీద బీజాక్షరాలు  వ్రాయడానికి  అదృశ్య శక్తులుండవు

నువ్వెంత పెద్ద మర్రి చెట్టు వయినా ఒక్కొక్క  సారి  బొన్సాయి చెట్టులా  పడి ఉండాల్సిందే !!

భాను వారణాసి
08. 02. 2015




 

Thursday, February 5, 2015

అవును అది జరుగు తుంది

అవును అది  జరుగు తుంది
------------------------------------
కారణాలు చెప్పలేను గానీ
అక్కడున్న  నుసి గట్టిన దీపం నుండి
అసృశ్య తా  కిరణాలు   ఇంకా వెలుగుతూ నే ఉన్నాయి
సిద్దా ర్థు డి  ఆలోచనలు  మస్తిష్కం  నిండా  నింపుకొని
పచ్చి గోంతుకల  రాగం  విందామని   అర్థరాత్రి  ఇల్లు వదలి పొయ్యాను
రొచ్చు రోప్పులతో
శ్మశానా న్ని తలపిసున్నాయి ఇంకా కొన్ని లోగిళ్ళు
కొందరు రాతి మనుషులు 
వర్ణ వ్యవస్థ  తో  ఇంకా  అభిషేకాలు  చేసుకొంటున్నారు
కొందరు   మర మనుషులు
మతం   మత్తులో  మారణ హోమాలు చేస్తున్నారు  
కొందరు   విప్లవ గీతాలు  పాడుకొంటూ
కొత్త  ఉదయం కోసం  ఇంకా వేచి ఉన్నారు
 నా కన్పిస్తుంది   ఇప్పుడూ  , ఎప్పుడూ
మన మధ్య  రంగుల గోడలు లేవు , ఉండవని
ఈ విశాల ప్రపంచం లో రంగు రుచి  వాసన  తెలియని   
క్రొత్త మనుషుల క్రొంగొత్త  మతాన్ని  పునః ప్రతిష్టించు కొంటామని
అవును అది జరిగి తీరుతుంది !

------------------------------
 భాను వారణాసి
05 feb 2015








Wednesday, February 4, 2015

ఆయప్ప మంచోడు కాదు

ఆయప్ప మంచోడు  కాదు
---------------------------------------------

ఆయప్ప మంచోడు  కాదు
సాయంకాలం  కాగానే  కన్ను కొట్టి
గడ్డి వాము ఎనక్కి రమ్మంటాడు
బచ్చట్లో  తానం సేస్తావుంటే
పిట్ట గోడెక్కి  తొంగి తొంగి సూస్తాడు
ఎట్లేకి  బొయ్యి గుడ్డ లుతకతా  ఉండా
నీల్ల కి తడిసి పోయిన
నా వల్లును సుస్తానే ఉండాడు
ఆడు మంచోడు  కాదని సెబితే
ఇనె వాల్లు ఎవరు  నా మాట
నేను మడ్లోకి ఎల్లి 
పిక్కల దాక సీర  ఎగ్గట్టి  కట్టి
బురద తోక్కతా  ఉంటే
కిందా పైనా నా అయిపే  సూస్తాడు
పల్లి కవతల  దిగుడు  బాయి  కెల్లి
మంచి నీల్లు  కడవతో  నిమ్పుకోనస్తా ఉంటే
ఎవరు లెంది సూసి  నా పైట పట్టుకొని  లాగుతాడు
నా మానం బోతుంది ఎయరైన సూస్తే
అంటే  గూడా  బయపన్నే బయపడ్డు
మన యిసయం ఎవరికీ  తెలిదులే అంటాడు
సేన్లో మొన్న  గోడ్ల మేపతా ఉంటే
నక్కి నక్కి వచ్చి నన్ను వాటేసు కొన్యాడు
మా  నాయనకు తెలిస్తే
నిన్ను నన్ను నరికేస్తాడు  అని సెప్పినా
అయినా బయ్యం లేదన్యాడు
నేనేక్కడికి బోతే  నా ఎనకాలే  ఎంట బడతా ఉండాడు
గడ్డి కోసుకోను బయటకేల్లితే
కొడవలి తీసుకొని గడ్డి కోసి నానెత్తిన బెట్టినాడు
దొంగోడు మాదిరొచ్చి నా సంకల్లో సక్కల గిల్లి పెట్న్యాడు
ఒక్క రోజు మా పసుల కోట్నం లో దూరి
ఎద్దులు ఎనుములతో  రాత్రంతా
నా కోసం జాగారం సేసి నాడు
మా బండల మిద్దె మిదేక్కి
గవాచ్చం గుండా తొంగి తొంగి సూస్తాడు
కలకడ త్తిర్నాలకు
వస్తావ లేదా అని ఒకటే పోరు
రాను సామి నన్ను ఓది లేయ్యప్పా  అంటే ఇన్నే ఇనడు
ఎం సావు రాసి బెట్టిందో ఈ యప్పతో !!
మా నాయనొల్ల దగ్గర సెప్పు దేబ్బలు తినాల్నో ఏమో !!
నా కయితే బలే  బయ్యం ఏస్తా  ఉండాది .



భాను  వారణాసి
3 feb  2015

Monday, February 2, 2015

మనిషికి గ్రహణం !

మనిషికి  గ్రహణం !
---------------------------------------

కొన్ని సంబంధాలు
చిల్లర పెంకుల్లాంటివి
ఊరికనే పగిలి పోతాయి
కొన్ని  సంబంధాలు
పీచు మిఠాయి లాంటివి
సులభంగా  కరిగి పోతాయి
అసలు బంధాలుంటే   గదా  సంబంధాలుండేది
నావకు లంగరు వేస్తేనే గద  నిలబడేది
కొంత మన్ను కొంత  ప్రేమ
కలిస్తేనే గదా  మంచి కుండలు తయారయ్యేది
మమతల మడత బెట్టి
కాలిస్తేనే గద మన్నిక
ఎన్నయినా చెప్పు
మనసు  కొంచెం తడిసి
చేమ్మగిల్లితేనే   అనురాగం పుడుతుంది
కొన్ని క్షణాలు  నీవి  కాదంటేనే
నీకు  బహుమానం అందేది
పరిధిని వృత్త లేఖిని తో  గీసావనుకో
వ్యాసాలు వ్యాసార్థాలు  లెక్క పెట్ట్టు కోవాల్సిందే
తక్కెడ లో పెట్టి
మనుషుల్ని కొలిచావనుకో
నీ  వాణిజ్యం ముగిసినట్లే
మాటల్ని  ముంతల్లొ  దాచి
పొదుపుగా  వాడితే
నీ  జీవితం ఒక ముద్రిత రచనే !

అసలు ఎంత మంది  ఈ  లోకంలో
మనిషిగా మనిషి వైపు నడుస్తున్నారు  ?

ప్రతి మనిషి  గ్రహణం పట్టినట్లు
రాహు కేతువుల్ని   జోబిల్లో దాచుకొంటున్నారు !



భాను వారణాసి
02. 02. 2015

Sunday, February 1, 2015

నీ పాసున్గులా !


నీ పాసున్గులా !
-------------------------------------------
ఓరి నీ  పాసున్గూలా
ఎన్ని దినాలయందయ్యా నిన్ను సూసి
యాడి కేల్లి నావిన్ని రోజులూ
సిన్నప్పుడు మా భుజాల మీద  తిరిగేటోడివి
ఈ రోజు పెద్దోడియిపోయినావే !

సూడు మన  తీగమల్లి  సెట్టు
నువ్వొస్తావని   అట్లానే  పాకుతా ఉంది
కసిరి కట్ల పాములా
సూస్తివా  మన  రాము 
నువ్వొస్తావని  తోక తిప్పతా మొరగాతానే ఉండాడు

ముసిలోళ్ళు అంతా సచ్సిపోయినారు
పిల్లోల్లు  అంతా ఉద్దోగాలకని బయట కెల్లి పోయిన్యారు
పల్లెలో ఏముండాది  సామీ
నెర్లు సీలిన మిద్దెలు , ఎండిపోయిన గుడిసెలు
బక్క సిక్కిన మనుసులు , వట్టి పోయిన పసువులు
వానా లేదు వంగడా లేదు
సేన్లన్ని, మడ్లన్ని  బీడ్లు బాయె
బతకతా ఉండామో , సస్తా ఉండామో మాకే తెలీదు
మా సావు మేము సావాల్సీందే
ఒక్కడన్నా  మన పల్లెకు దిగ బడనే లేదు
మా కట్టాలు తిరేనే లేదు

సామి నువ్వేక్కిన  మర్రి సెట్టు గుర్తుందా
ఊ డలు పట్టుకొని  ఉయ్యాలూగి
మర్రాకులు కోసుకొని  అక్కడే రాగి సంగటి  తిన్యాము గదా
మన ఎట్లో నిల్లె లేవు సామీ
కంది కెళ్ళి , ఊట  బావుల్ల్కేల్లి  ఈతాడతా  ఉన్యాము గదా
సేరకు తోటల్లోకేల్లి గడలు తెంపి
గానుగుల దగ్గర లక్కిల్ల బెల్లం తినే వాళ్ళం  జ్ఞప్తికుందా
ఆయప్ప నిన్ను కొట్టిండ్లా
మామిడి కాయలు తెంపుకొని తిన్యావని
గుడ్లో బొరుగులు ,బెల్లం , కొబ్బరి  పసాదం కోసం
నువ్వు నేను  కొట్టుకోల్యా
మా  సిన్నమ్మ నీకోసం  జొన్న పేలాలు సేస్తే
నేను నీకు సుట్టలు , అలసంద వడలు తేస్తే
అందరం కలిసి సింత తోపులో తిన్యాము గుర్తుండాదా


నువ్వు పుట్టింది ఈడ్నే
నువ్వు పెరిగింది ఈడ్నే
తల్లి  లాంటిది  సామీ  పల్లి
పల్లిని    మరసిపోవద్దు
అమ్మను  వదులు కోవద్దు


భాను వారణాసి
01. 02 . 2015