Sunday, February 1, 2015

నీ పాసున్గులా !


నీ పాసున్గులా !
-------------------------------------------
ఓరి నీ  పాసున్గూలా
ఎన్ని దినాలయందయ్యా నిన్ను సూసి
యాడి కేల్లి నావిన్ని రోజులూ
సిన్నప్పుడు మా భుజాల మీద  తిరిగేటోడివి
ఈ రోజు పెద్దోడియిపోయినావే !

సూడు మన  తీగమల్లి  సెట్టు
నువ్వొస్తావని   అట్లానే  పాకుతా ఉంది
కసిరి కట్ల పాములా
సూస్తివా  మన  రాము 
నువ్వొస్తావని  తోక తిప్పతా మొరగాతానే ఉండాడు

ముసిలోళ్ళు అంతా సచ్సిపోయినారు
పిల్లోల్లు  అంతా ఉద్దోగాలకని బయట కెల్లి పోయిన్యారు
పల్లెలో ఏముండాది  సామీ
నెర్లు సీలిన మిద్దెలు , ఎండిపోయిన గుడిసెలు
బక్క సిక్కిన మనుసులు , వట్టి పోయిన పసువులు
వానా లేదు వంగడా లేదు
సేన్లన్ని, మడ్లన్ని  బీడ్లు బాయె
బతకతా ఉండామో , సస్తా ఉండామో మాకే తెలీదు
మా సావు మేము సావాల్సీందే
ఒక్కడన్నా  మన పల్లెకు దిగ బడనే లేదు
మా కట్టాలు తిరేనే లేదు

సామి నువ్వేక్కిన  మర్రి సెట్టు గుర్తుందా
ఊ డలు పట్టుకొని  ఉయ్యాలూగి
మర్రాకులు కోసుకొని  అక్కడే రాగి సంగటి  తిన్యాము గదా
మన ఎట్లో నిల్లె లేవు సామీ
కంది కెళ్ళి , ఊట  బావుల్ల్కేల్లి  ఈతాడతా  ఉన్యాము గదా
సేరకు తోటల్లోకేల్లి గడలు తెంపి
గానుగుల దగ్గర లక్కిల్ల బెల్లం తినే వాళ్ళం  జ్ఞప్తికుందా
ఆయప్ప నిన్ను కొట్టిండ్లా
మామిడి కాయలు తెంపుకొని తిన్యావని
గుడ్లో బొరుగులు ,బెల్లం , కొబ్బరి  పసాదం కోసం
నువ్వు నేను  కొట్టుకోల్యా
మా  సిన్నమ్మ నీకోసం  జొన్న పేలాలు సేస్తే
నేను నీకు సుట్టలు , అలసంద వడలు తేస్తే
అందరం కలిసి సింత తోపులో తిన్యాము గుర్తుండాదా


నువ్వు పుట్టింది ఈడ్నే
నువ్వు పెరిగింది ఈడ్నే
తల్లి  లాంటిది  సామీ  పల్లి
పల్లిని    మరసిపోవద్దు
అమ్మను  వదులు కోవద్దు


భాను వారణాసి
01. 02 . 2015
 

No comments:

Post a Comment