Monday, February 2, 2015

మనిషికి గ్రహణం !

మనిషికి  గ్రహణం !
---------------------------------------

కొన్ని సంబంధాలు
చిల్లర పెంకుల్లాంటివి
ఊరికనే పగిలి పోతాయి
కొన్ని  సంబంధాలు
పీచు మిఠాయి లాంటివి
సులభంగా  కరిగి పోతాయి
అసలు బంధాలుంటే   గదా  సంబంధాలుండేది
నావకు లంగరు వేస్తేనే గద  నిలబడేది
కొంత మన్ను కొంత  ప్రేమ
కలిస్తేనే గదా  మంచి కుండలు తయారయ్యేది
మమతల మడత బెట్టి
కాలిస్తేనే గద మన్నిక
ఎన్నయినా చెప్పు
మనసు  కొంచెం తడిసి
చేమ్మగిల్లితేనే   అనురాగం పుడుతుంది
కొన్ని క్షణాలు  నీవి  కాదంటేనే
నీకు  బహుమానం అందేది
పరిధిని వృత్త లేఖిని తో  గీసావనుకో
వ్యాసాలు వ్యాసార్థాలు  లెక్క పెట్ట్టు కోవాల్సిందే
తక్కెడ లో పెట్టి
మనుషుల్ని కొలిచావనుకో
నీ  వాణిజ్యం ముగిసినట్లే
మాటల్ని  ముంతల్లొ  దాచి
పొదుపుగా  వాడితే
నీ  జీవితం ఒక ముద్రిత రచనే !

అసలు ఎంత మంది  ఈ  లోకంలో
మనిషిగా మనిషి వైపు నడుస్తున్నారు  ?

ప్రతి మనిషి  గ్రహణం పట్టినట్లు
రాహు కేతువుల్ని   జోబిల్లో దాచుకొంటున్నారు !



భాను వారణాసి
02. 02. 2015

No comments:

Post a Comment