Sunday, March 29, 2015

ఆకలికి విరుగుడు

ఆకలికి  విరుగుడు
----------------------------------------------------------

పంటల్ని , పొలాల్ని   దున్నేసి
పల్లెల్ని , రైతుల్ని  , ఆవుల్ని , పశువుల్ని మింగేసి
చెరువుల్ని   ,  వాగుల్ని  పూడ్చేసి
కాంక్రిటు  జంగుల్స్  ని పండిస్తాం
ఇక   భవనాలకు  వేళ్ళాడే
శవాల్ని  పెరుక్కొని  తింటాం
బువ్వను  పెట్టె రైతన్నలు  లేరు
అన్నాన్ని  అందించే అన్నపూర్ణ లేదు
ఇక మార్కెట్ లో   మనకు  దొరికేవి


ఆకలికి  విరుగుడుకు   రెండు మాత్రలే !!
తాగడానికి  రీ సైకల్డ్   మురుగు  నీరే !!



భాను వారణాసి



 

Saturday, March 21, 2015

బిడ్డా నిన్ను సూసి .....

(మాతృ   దినోత్సవం  సందర్భంగా -2017 )


బిడ్డా  నిన్ను  సూసి .....

-------------------------------------------

కట్టె మోసినాను  -  గంజి తాగినాను
మట్టి మోసినాను - పస్తులుండినాను
రాళ్ళు మోసినాను - మేస్తిరి కాళ్ళు మొక్కినాను
కొండ  ఎక్కినాను  - బండ మొక్కినాను

ఎక్కడ  బోతివో  కొడుకో - నన్ను  సూడ  కుండ  గాను
ఏమై  బోతివో  కొడుకో - నీ  పానం సల్లగుండగాను

మీ అయ్య సచ్చిపోతే -  నేను జోలె  పట్టినాను
ఒక్క  కొడుకువని - నిన్ను  మురిపెంగ  సాకినాను
పనికి బంప లేక  - నిన్ను  బడికి అంపినాను
రకతం  ధార బోసి - నీకు  సదువు  సెప్పించినాను

ఎక్కడ  బోతివో  కొడుకో - నన్ను  సూడ  కుండ  గాను
ఏమై  బోతివో  కొడుకో - నీ  పానం సల్లగుండగాను

తిండి  లేక నేను - బిచ్చ  మెత్తు తున్నా
గూడు లేక నేను - మోరి కింద  ఉన్నా
బొక్క లన్నీ  అరిగి - ముసలి దాని నైతి
ఒక్క సారి  వచ్చి - 'అమ్మా ' అంటే సాలు
బిడ్డా నిన్ను  సూసి - పాన  మొదులుతాను

ఎక్కడ  బోతివో  కొడుకో - నన్ను  సూడ  కుండ  గాను
ఏమై  బోతివో  కొడుకో - నీ  పానం సల్లగుండగాను


ఎక్కడున్న నీవు -  సల్లగుంటె  సాలు
కొలువు లోన నువ్వు - మంచి  గుంటె  మేలు
ఒక్కసారి  వచ్చి - పలకరించు  కొడుకో
బిడ్డా నిన్ను  సూసి - పాన మొదులుతాను
ఆసలన్నీ నీ మీదే -పెట్టుకొంటి తండ్రి
పాన మొదిలె  సంది - దగ్గరాయెను కొడుకో
ఒక్క సారి వచ్చి - సూసి పోరి నాయనా
బిడ్డా నిన్ను  సూసి - పాన  మొదులుతాను

ఎక్కడ  బోతివో  కొడుకో - నన్ను  సూడ  కుండ  గాను
ఏమై  బోతివో  కొడుకో - నీ  పానం సల్లగుండగాను



భాను వారణాసి
09.06 . 2009


(ఆంధ్ర  జ్యోతి లో 09. 06 . 2009  వచ్చిన ఒక  అనాధ తల్లి కథనాన్ని  చదివి )










అహం బ్రహ్మాస్మి !

అహం  బ్రహ్మాస్మి !
---------------------------------------

అర్చనలు  చేసుకొని  బతికే  వాణ్ని
ప్రసాదాలు తిని  పొట్ట నింపుకొనే   వాణ్ని
నేను గుడిలో  పూజారిని
నేను  పారాడే  విగ్రహాన్ని
అగ్ర కులాల వాడి నయినా
సాంకేతిక విద్యకు నోచు కోలేని  వాణ్ని
ధవళ వస్త్రం తప్ప  అన్య వస్త్రాలు  లేని  వాణ్ని
అన్ని జాతుల  వారి  సౌభాగ్యాన్ని  కోరు కొనే  వాణ్ని
' సర్వే జనాః  సుఖినోభవంతు ' అని సర్వదా  స్మరంచు కొనే వాణ్ని
అగ్ర కులంలో  పుట్టినా  అర్ధాకలితో అలమటించే  బాపడిని
భక్తులిచ్చే  అణా పైసలతో  పబ్బం  గడుపు కొనే  వాణ్ని
గర్భ గుడిలో  నాలుగు  గోడలు  తప్ప
వేరే  ప్రపంచం   తెలియని  అమాయకుడ్ని
అభిషేకాలు , అర్చనలు , తీర్థ ప్రసాదాలు , బ్రహ్మోత్సవాలు
అష్టోత్తర జప  నామాలు , వేద మంత్రాలు  తప్ప
వేరే     లౌక్యం  తెలియని  వాణ్ణి
సమాజ హితాన్ని కోరుకొన్నాను  గానీ  సమాజ  హతాన్ని  గాదే !
అంతా  భగవదర్పితం  అనుకొన్నాను గానీ స్వయం స్వాహా అనుకోలేదే !!
కాని నన్నే నమ్ముకొన్న నా  వాళ్ళను నట్టేట  ముంచుతున్నాను
ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చెయ్యలేక  అందరి ఇళ్ళకు  వెళ్లి అడుక్కోంటున్నాను
చదివించే స్తోమత లేక  పిల్లాడ్ని గుడినే  నమ్ముకోమన్నాను
వయసుడిగిన తల్లి తండ్రిని పోషించే  స్థోమత లేక కాశీ లో  వదిలేశాను
అర్చక వృత్తి నా  కడుపు  నింపనపుడు
మాట్లాడలేని  భగవంతుడు కి  ఏమని  మొరలిడుదు ?
అర్చక  వృత్తినే  నమ్ముకొన్న  బాపడ్లని యాచకులుగా మారుస్తున్న సమాజమా !
ఇకనైనా  కళ్ళు  తెరు !
సంస్కృతీ  సమాజ  వారధులుగా  ఉన్న  అర్చక  స్వాముల ఆకలి కేకలు విను !
అందుకే ....
నా స్వేదంలో పుడుతోంది  ఒక   విష్ణు  సహస్ర నామం
నా  రక్తంలో  మ్రోగుతోంది   ఒక  నమకం చమకం
నా గొంతులో  వినబడుతోంది  ఆకలి వేదం
నా  ఎదలో  మరుగుతోంది నిరాశా  నిర్వేదం
నా మదిలో  రగులుతోంది  మరో విప్లవం !!

( after seeing a priest's family in a temple)

భాను వారణాసి
21. 02.  2015
 

Wednesday, March 18, 2015

గాయత్రి మంత్ర మహిమ

గాయత్రి  మంత్ర మహిమ

------------------------------------------
ఓం భూర్బు వస్సువః
ఓం  తత్స  వితు ర్వరేణ్యం
భర్గో  దేవస్య ధీమహి
ధియో  యోనః  ప్రచోదయాత్

ఇది  గాయత్రి  దివ్య మహా మంత్రం . ఈ  గాయత్రి  మహా మంత్రంలో  ఇరవై  నాలుగు  దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా  ఉంటుంది . ఈ  ఇరవై  నాలుగు  గాయత్రి మూర్తులను చతుర్వింశతి  గాయత్రి  అని పేరు . ఈ ఇరవై నాలుగు  మూల మైన గాయత్రీ  మంత్రాన్ని  జపిస్తే కీర్తి , దివ్య తేజస్సు , సకల సంపదలు  , శుభాలు  కలుగుతాయి

1. తత్ = విఘ్నేశ్వరుదు
2. స = నరసింహ స్వామి
3. వి = శ్రీ మహా  విష్ణువు
4. తు = శివుడు
5. వ = శ్రీ  కృష్ణుడు
6. రే = రాధ  దేవి
7. ణ్యం = శ్రీ లక్ష్మి
8.  భ = అగ్ని దేవుడు
9. ర్గః = ఇంద్రుడు
10.  దే = సరస్వతి  దేవి
11.  వ= దుర్గా  దేవి
12. స్వ = ఆంజ నేయ స్వామి
13. ధీ = భూదేవి
14. మ = సూర్య భగవానుడు
15. హి = శ్రీ రాముడు
16. థి  = సీతా  దేవి
17. యో = చంద్రుడు
18. యో =యముడు
19. న = బ్రహ్మ
20. ప్ర = వరుణుడు
21. చో  = శ్రీ మన్నారాయణుడు
22. ద = హయగ్రీవుడు
23. యా = హంస దేవత
24. త్ = తులసి మాత 

Monday, March 16, 2015

ఆశ - నిరాశ

ఆశ - నిరాశ / భాను  వారణాసి
---------------------------------------------------

నీ ప్రతిబింబం
నిన్ను వెక్కిరించినపుడు
మనసు  'పోక్రాన్'  పొలిమేరలు దాటినట్లన్పిస్తుంది

గుండె  సవ్వడులను
ప్లాస్టిక్ సంచులలో   నింపి
అనుభూతుల  మొక్కల్ని పెంచాలనిపిస్తుంది


ప్రతి  సమస్యా
అవధానం  చేసినట్లు
సమస్యా పూరణం  చేత గాక
అసంతృప్తిగా మిగిలి పోతున్నట్లన్పిస్తుంది


నిమ్మకు  నీ రెత్తినట్లు
నిమ్మళంగా ఉన్న ఈ  బ్రతుకు
మఱ్ఱి  చెట్టు  ఊడల్ని  లాగి  పారెయ్యాలనిపిస్తుంది


సముద్రపు  కెరటాలు
ఉవ్వెత్తున  లేచి
ఆకాశానికి  ఎగురుతున్నపుడు
ఎక్కడో  ఒక  ఆశా కిరణం
ఇంద్ర  ధనస్సులో  కరిగి పోయి నట్లనిపిస్తుంది


శూన్యం  కేసి  చంద మామ ను
చూస్తూం త  సేపూ
ఒక  'నీల్ ఆర్మ్  స్ట్రాంగ్ ' లా
చంద్ర లోకం లో పచార్లు కొట్టాలనిపిస్తుంది !


( నా 'సముద్ర ఘోష' కవితా సంకలనం  నుండి )




this is my English translation 

Hope and Despair





When my own shadow
is making mockery about me
my heart is running away  from the borders of Hiroshima

Keeping the  vibrations of my heart
in a polythene cover, in the nursery of my life
I feel like to grow the plants of experiences

Every problem I face
is just like a poetry with complicated rhythms
desperately I am remained as unsuccessful poet

The waves of Ocean
while touching the sky
somewhere a ray of hope is  sparkling
in the rainbow of my life

While I was looking into the space
counting  the stars in the sky
like a ' Neil Arm Strong'
I feel like roaming on the land of Moon.

Saturday, March 7, 2015

నేను మగ వాడిని !

  నేను మగ వాడిని !
----------------------------------------------
అనుకొంటాను నేను
నా శ్రీమతిని కష్ట పెట్టవద్దని
అనుకొంటాను నేను
నా శ్రీమతికి వంటింట్లో సహాయం చేయాలని
అనుకొంటాను నేను
నా శ్రీమతిని   ఒక ఫారిన్ టూర్ కైనా పిలుచుకు పోవాలని
అనుకొంటాను నేను
ఆఫీసు  నుండి  తొందరగా ఇంటికి వచ్చెయాలని
అనుకొంటాను నేను
మా చిన్నోడి  డైపెర్లు  నేనే మార్చాలని
అనుకొంటాను నేను
మా పెద్దోడి  షూ నేనే  పాలిష్  చెయ్యాలని
అనుకొంటాను నేను
నా చోక్కా  బొత్తాలు నేనే  కుట్టు కోవాలని
అనుకొంటాను నేను
నా శ్రీమతిని ఇక విసుక్కోగూడదని
అనుకొంటాను నేను
నాకు జ్వరం వచ్చి నప్పుడల్లా నా శ్రీమతి నాకు చేసే సపర్యలు
నేను గూడా శ్రీమతి కి   అలాగే చేయ్యాలని
అనుకొంటాను నేను
మా మామయ్య అత్తమ్మ వచ్చి  నపుడు
వ్యంగంగా నర్మ గర్భంగా  మాట్లాడ గూడదని
అనుకొంటాను నేను
నా శ్రీమతిని  ప్రతి చిన్న విషయానికి విసుక్కోగూడదని 
అనుకొంటాను నేను
నా శ్రీమతిని  పక్కింటి  మాధురి తో పొల్చగూడదని
అనుకొంటాను నేను
సినిమా చూసి నపుడల్లా ఆ హీరోయిన్ అందాల్ని పొగడగూడదని
అనుకొంటాను నేను
కట్నం పేరుతొ  నా శ్రీమతిని నొప్పించ గూడదని
అనుకొంటాను నేను
పది మందిలో నా  శ్రీమతిని  కించ పరచ గూడదని
గానీ ...
నేను  మా నాయన కంటే చాలా మంచోణ్ణి !
ఎందుకంటే ....
నేను ఇంట్లోకి రాగానే కాళ్ళని కడగ మన లేదు
నా ఎంగిలి కంచంలో అన్నం తిన మన లేదు
నాకు టవల్  అందించ మన లేదు
నా  స్నానానికి  నీళ్ళు  తోడ మన లేదు
నా బట్టలు ఇస్త్రి  చెయ్య మన లేదు
భొంచేస్తున్నపుడు  విసన కర్రతో  విసర మన లేదు
భోజనం అయిన తర్వాత చిలకలు చుట్టి తాంబూలం ఇవ్వ మన లేదు
నా కాళ్ళు వత్త  మన లేదు
పండగలప్పుడు  అభ్యంగన స్నానం చేయించమని చెప్పలేదు
నెలకు  మూడు రోజులు ముట్టు, మైల  అని బయట ఉండమని చెప్పలేదు
నా శ్రీమతి అంటే  నాకు చాలా  ఇష్టం , ఆమె నా ప్రాణం
గానీ ...
ఎక్కడో  నాలో ఒక మగ అహంకారం నన్ను తట్టి లేపుతోంది
నేను మగ వాడి నని !!!


( 08.03 . 2015 - అంతర్జాతీయ  మహిళా  దినోత్సవం  నాడు రాసిన కవిత , మాతృ మూర్తి  లందరికీ  అంకితం )
 

Friday, March 6, 2015

వారకాంతలు

వారకాంతలు

---------------------------------------------------------------------------
కొన్ని నిముషాలు అడకత్తెరలో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నాయి
కొన్ని విషయాలు గొంతు  గోడల్లో చిక్కుకొని మాటలై  వేలాడుతున్నాయి
కన్ను సంద్రాలు  ఆవిరై పోతున్నా  మొహాన నవ్వులు  ఒయాసిస్సులై నాయి
రహస్య సంభాషణలు రతి మన్మధుల తనువుల వలపులై పోతున్నాయి
కృత్తిమ గోడల మధ్య చిత్తరువులు చిట్టి పాపలై జోగాడుతున్నాయి
ఎర్ర వీధులన్ని  చీకటి  కలుగులతో జన్మాంతర  సహవాసం  చేస్తున్నాయి
వాళ్ళ గుండెల్లో  కాకీ పోలీసుల బూట్ల  చప్పుడు  వినబడుతోంది
కనబడే మహా ప్రస్థానం కనబడని కథలకు ముగింపు పలుకుతోంది

*********

ఒక్కొక్క గుండె  ఒక్కొక్క  విషాద యోగాన్ని మోసుకొస్తోంది
ఒక్కొక్క హృదయం  ఒక  ఉదయం కోసం పరితపిస్తోంది
ఒక్కొక్క  తనువు  ఇంకొక్క  తనువు తోడు కోరుతోంది

*********

కొన్ని జీవితాలు  తెగిన  గాలిపటాల్లా  ఎగురుతూనే  ఉంటాయి
మాంజా దారంలో  చిక్కుకొని విలవిల లాడుతూ  రెక్కలు తెగిన విహంగాలై
రక్త  కన్నీరు పెడుతూనే  ఉంటాయి !
వారకాంతలకు  శాప విమోచనం  లేదోమో  ఈ  జన్మకి !!




 

Wednesday, March 4, 2015

మమ్మల్ని సూసి నవ్వకండి సారూ !!

మమ్మల్ని సూసి  నవ్వకండి  సారూ !!
--------------------------------------------

జీవితం  రొచ్చు
బ్రతుకు  రొచ్చు
మనుషులు రొచ్చు
పశువులు రొచ్చు
అంతా  రొచ్చే !


జలగలు , దోమలు , ఈగలు
పందులు , కుక్కలు ,పిల్లులు , పిల్లలు
నాలా పక్కనే  గుడిసెలు
విరిగిన నులక మంచాలు
బొమికలు  మిగిలిన  జీవశ్చవాలు

ఊపిరి ఉంది  బతకాలి
బతకడం  అనేది పెద్ద  సమస్య
కుడితి నీళ్ళయినా   సరే ... తాగి  బతకాలె
ఎంగిలి  మెతుకులైనా  సరే ... తిని బతకాలె
మురుగు నీటి తోనైనా  సరే ...  వొళ్ళు కడగాలె
మల మూత్రాదులున్నా  సరే ... అక్కడే తొంగుండాలె
బురద గుంటలైనా  సరే ... మా పిల్లోల్లు ఆడుకోవాలె

బొంతలు కింద పరసుకొని
రాళ్ళ దిండు మీద  తల ఆంచాల
చిల్లులు పడిన  కంబళ్ళు కప్పుకొవాలె
ఆకలి  భూతం  నిద్రను  మింగేస్తే
అడుక్కోవడానికి  అర్థరాత్రి తిరగాలె
'దేహీ ' అని పైస  లడిగితే  'దున్నపొతు' అని
సిదరించు  కొనే వాళ్ళే  ఎక్కువ
మా బోటోళ్ళను  జూసి  బాధ  పడకండి సారూ !
దమ్మం  సెయ్యక పోతే  మానె
మమ్మల్ని  సూసి  నవ్వకండి  సారూ !!



భాను వారణాసి
02. 03 . 2015
 

Monday, March 2, 2015

సభ్యత్వం

సభ్యత్వం
------------------------------------------
అయిన వాళ్ళ కోసం వెతకాలనిపిస్తోంది
అందరూ  కాని వాళ్ళే  కనిపిస్తున్నారు
మనసు విప్పి  మాట్లాడాలనిపిస్తోంది
గుప్పెట్లో  బందించి మరీ   గుండెల్ని  తీసుకెళ్ళుతున్నారు
అక్కడ  కొన్ని   వాదాల్ని   తక్కెడలల్లో  పెట్టి  అమ్ముతున్నారు
అవి  ఎందుకు  అమ్ముతున్నారో  నా  కర్థం కావడం  లేదు
అక్కడ వ్యాపారస్థులు   కొన్నింటిని   కల్తీ  చేసి అమ్ముతున్నారు
నిజాన్ని  అబద్ధంతో
న్యాయాన్ని అన్యాయంతో
ధర్మాన్ని అధర్మంతో
అంతే  గాదు ... అక్కడ
మనుషులు  మనుషులు తో  పోటీ  పడి
మనసుల్ని  అమ్మకాలకు  పెట్టారు

******

మనుషుల్లో  పరివర్తన   గురించి  ఆలోచించాలి
పరివర్తన లో  ప్రవర్తన  గురించి    పరికించాలి
వృత్తి  ఏదయినా  ప్రవృత్తి  బాగుండాలి
ప్రతి మనిషి ఒక చరిత్ర కావాలి
ఆ చరిత్రలొ  ఒక సువర్ణ  అధ్యాయాన్ని  సృష్టించాలి

******
అందుకే
మనం  తొందరగా నూతన  సమాజాన్ని  సృష్టించు కోవాలి
రండి  .. సభ్యత్వం  కోసం  క్రొత్త  మనుషులను తీసుకొందాం   !


22. 02. 2015
వారణాసి  భానుమూర్తి  రావు