Saturday, March 21, 2015

అహం బ్రహ్మాస్మి !

అహం  బ్రహ్మాస్మి !
---------------------------------------

అర్చనలు  చేసుకొని  బతికే  వాణ్ని
ప్రసాదాలు తిని  పొట్ట నింపుకొనే   వాణ్ని
నేను గుడిలో  పూజారిని
నేను  పారాడే  విగ్రహాన్ని
అగ్ర కులాల వాడి నయినా
సాంకేతిక విద్యకు నోచు కోలేని  వాణ్ని
ధవళ వస్త్రం తప్ప  అన్య వస్త్రాలు  లేని  వాణ్ని
అన్ని జాతుల  వారి  సౌభాగ్యాన్ని  కోరు కొనే  వాణ్ని
' సర్వే జనాః  సుఖినోభవంతు ' అని సర్వదా  స్మరంచు కొనే వాణ్ని
అగ్ర కులంలో  పుట్టినా  అర్ధాకలితో అలమటించే  బాపడిని
భక్తులిచ్చే  అణా పైసలతో  పబ్బం  గడుపు కొనే  వాణ్ని
గర్భ గుడిలో  నాలుగు  గోడలు  తప్ప
వేరే  ప్రపంచం   తెలియని  అమాయకుడ్ని
అభిషేకాలు , అర్చనలు , తీర్థ ప్రసాదాలు , బ్రహ్మోత్సవాలు
అష్టోత్తర జప  నామాలు , వేద మంత్రాలు  తప్ప
వేరే     లౌక్యం  తెలియని  వాణ్ణి
సమాజ హితాన్ని కోరుకొన్నాను  గానీ  సమాజ  హతాన్ని  గాదే !
అంతా  భగవదర్పితం  అనుకొన్నాను గానీ స్వయం స్వాహా అనుకోలేదే !!
కాని నన్నే నమ్ముకొన్న నా  వాళ్ళను నట్టేట  ముంచుతున్నాను
ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చెయ్యలేక  అందరి ఇళ్ళకు  వెళ్లి అడుక్కోంటున్నాను
చదివించే స్తోమత లేక  పిల్లాడ్ని గుడినే  నమ్ముకోమన్నాను
వయసుడిగిన తల్లి తండ్రిని పోషించే  స్థోమత లేక కాశీ లో  వదిలేశాను
అర్చక వృత్తి నా  కడుపు  నింపనపుడు
మాట్లాడలేని  భగవంతుడు కి  ఏమని  మొరలిడుదు ?
అర్చక  వృత్తినే  నమ్ముకొన్న  బాపడ్లని యాచకులుగా మారుస్తున్న సమాజమా !
ఇకనైనా  కళ్ళు  తెరు !
సంస్కృతీ  సమాజ  వారధులుగా  ఉన్న  అర్చక  స్వాముల ఆకలి కేకలు విను !
అందుకే ....
నా స్వేదంలో పుడుతోంది  ఒక   విష్ణు  సహస్ర నామం
నా  రక్తంలో  మ్రోగుతోంది   ఒక  నమకం చమకం
నా గొంతులో  వినబడుతోంది  ఆకలి వేదం
నా  ఎదలో  మరుగుతోంది నిరాశా  నిర్వేదం
నా మదిలో  రగులుతోంది  మరో విప్లవం !!

( after seeing a priest's family in a temple)

భాను వారణాసి
21. 02.  2015
 

No comments:

Post a Comment