(మాతృ దినోత్సవం సందర్భంగా -2017 )
బిడ్డా నిన్ను సూసి .....
-------------------------------------------కట్టె మోసినాను - గంజి తాగినాను
మట్టి మోసినాను - పస్తులుండినాను
రాళ్ళు మోసినాను - మేస్తిరి కాళ్ళు మొక్కినాను
కొండ ఎక్కినాను - బండ మొక్కినాను
ఎక్కడ బోతివో కొడుకో - నన్ను సూడ కుండ గాను
ఏమై బోతివో కొడుకో - నీ పానం సల్లగుండగాను
మీ అయ్య సచ్చిపోతే - నేను జోలె పట్టినాను
ఒక్క కొడుకువని - నిన్ను మురిపెంగ సాకినాను
పనికి బంప లేక - నిన్ను బడికి అంపినాను
రకతం ధార బోసి - నీకు సదువు సెప్పించినాను
ఎక్కడ బోతివో కొడుకో - నన్ను సూడ కుండ గాను
ఏమై బోతివో కొడుకో - నీ పానం సల్లగుండగాను
తిండి లేక నేను - బిచ్చ మెత్తు తున్నా
గూడు లేక నేను - మోరి కింద ఉన్నా
బొక్క లన్నీ అరిగి - ముసలి దాని నైతి
ఒక్క సారి వచ్చి - 'అమ్మా ' అంటే సాలు
బిడ్డా నిన్ను సూసి - పాన మొదులుతాను
ఎక్కడ బోతివో కొడుకో - నన్ను సూడ కుండ గాను
ఏమై బోతివో కొడుకో - నీ పానం సల్లగుండగాను
ఎక్కడున్న నీవు - సల్లగుంటె సాలు
కొలువు లోన నువ్వు - మంచి గుంటె మేలు
ఒక్కసారి వచ్చి - పలకరించు కొడుకో
బిడ్డా నిన్ను సూసి - పాన మొదులుతాను
ఆసలన్నీ నీ మీదే -పెట్టుకొంటి తండ్రి
పాన మొదిలె సంది - దగ్గరాయెను కొడుకో
ఒక్క సారి వచ్చి - సూసి పోరి నాయనా
బిడ్డా నిన్ను సూసి - పాన మొదులుతాను
ఎక్కడ బోతివో కొడుకో - నన్ను సూడ కుండ గాను
ఏమై బోతివో కొడుకో - నీ పానం సల్లగుండగాను
భాను వారణాసి
09.06 . 2009
(ఆంధ్ర జ్యోతి లో 09. 06 . 2009 వచ్చిన ఒక అనాధ తల్లి కథనాన్ని చదివి )
No comments:
Post a Comment