Sunday, November 30, 2014

రాస పల్లి కథలు ( 1) - ఎద్ద ల బండి

రాస  పల్లి   కథలు ( 1)    - ఎద్ద ల  బండి 




నేను ఎనిమిదో  తరగతి సదివే టప్పుడు  అనుకొంటా ,  మా అత్తోల్లింటికి  పోవాలనుకొన్న. పతి సమ్మత్సరము నేను పోతాను  . మా ఉరికి పది   మైళ్ళు ఉంటుంది ఆ ఊరు. మాకు పొద్దున్నే పది  గంటలకు ఒక బస్సు ఉండాది. ఆ బస్సు పేరు సలామత్  బస్సు. మదనపల్లి కాడికి  పోయి , మళ్ళా రాత్రి  ఆరు  గంట లకు మా ఉరొస్తె , ఎనిమిది గంట కొట్టే సరికి మా అత్తోల్ల ఊరు సెరుతున్ది. మెల్లగా ఎద్దల బండి మాదిరి పోతుంది ఆ బస్సు.

నా గహ చారమో ఏమో గాని , ఆ రోజు తోమ్మోదయినా బస్సు రాలా. మా నాయనకు కోపోమోస్తా ఉండాది.

'ఎంతసేపు ఆ రాస పల్లి క్రాస్ రోడ్డులో కుసొవాలి. రేపు ఎల్ల బారదు వు లే రా నాయనా!'  అన్నాడు మా నాయన.

నాకేమో ఒకటే బయ్యం . అప్పడే సంకురాతరి  సెలవులు మూడు రోజులు అయి పోయి నాయి. మా అత్తోల్లింటికి పోతే మా బావ , మా మరదలు , మా బావ మరుదులు తో బాగా ఆడు కొవచ్చు. వాళ్ళు బాగా భూములున్నొళ్ళు , మంచి సే ద్యగాళ్ళూను. నాకు అక్కడికి పొతే చేన్లు , మడ్లు , సెరుకు తోటలు చూడచ్చు . పచ్చి సేనిక్కాయలు తెమ్పుకొని , అక్కడే సెత్త , సేదారం , ముళ్ళ కంపలు ఏసీ , పచ్చి సేనిక్కాయలు కాల్చో కొని తింటా ము.

మా నాయనకు  కోపం బాగా వస్తా ఉండాది .
'ఆ తిక్క నాయాలు బస్సు ఎక్కడో చచ్చిన్ది. ఆ గలీజు నా కొడుకులు రిపేర్ ఇప్పుడే చెయ్యర్ర . నువ్వు ఈ రోజు బయలు దేరిన ఏ లా ఇసేశం గూడా బాగా లెదు. అ   మంగలోళ్ళ పిల్లి  అడ్డం వచ్చి  నప్పుడే అనుకొన్యాను. నువ్వు పయా నం మాను కొంటె మంచిదని .'
 మా నాయన కు కోప మోస్తే , మనిషే గాడు . చేతిలో ఏది  కాన బడితే , దాంతో కొడతాడు.
ఒక్క సారి , నేను అల్లరి బాగా చేస్తే , చింత బరికె తో గొడ్డు ను కొట్టినట్లు కొట్టాడు. ఇంకో సారి,  ఎద్దులని తోలే సెల్ల కోడి తో కొట్టినాడు .
సరే నని ' అట్లాగే నాయనా. అయితే రేపు మల్లి బోతా .. నన్ను నువ్వే బస్సు ఎక్కించాల ' అన్నాను నెను.
మా నాయన తో బాటు తిరుక్కోని , మా రాచ పల్లి లో అడుగు బెట్టె సరికి ఆ బస్సు సర్రున బొయిన్ది. నాకు చానా కొపమొచింన్ది. కొంసేపు ఉండ్యుం టే , మా ఆత్తొళ్ల ఇంట్లో హాయిగా పడుకొని కతలు సేప్పుకొనే వాల్లమ్. మా అత్తోల్లు గుడా సెప్పిన రోజు కి రాలేదని , ఈ రాత్రంతా నిద్రపోరు .

సరే నని మరుసటి రోజు మా నాయన పిలేటి కి వచ్చి , పిలేటి బస్టాండ్ లో ఇంకో బస్సు ఎక్కించి , నా పక్కనున్న ఆసామి కి సెప్పి , మా పిల్లోడ్ని పలానా వాళ్ళ ఇంట్లో వదులు తావా సామీ అని అడుక్కొన్నాదు. పాపం ఆయన సాన మంచోడు గా ఉన్నట్లుంది . మా నాయన నాకు సేనిక్కయాల పొట్లం , కమ్మర కట్లు రెండు, సుట్టలు కొనిచ్చి నాడు .
' జా గరత్త నాయన . పోతానే అత్తకు సెప్పు , నాకు నువ్వు సెరి నట్లు జాబు రాయమని. లేదంటే ఎవరయినా మన్నూ రో ళ్ళు వస్తా వుంటే సెప్పిమ్చంను . '

పది గంట లకు అత్తోల్ల ఊ రికి సెరినా . అత్తా , మామ , మా బావ , నా మరదలు అందరు శానా కుసాలు పడి  పోయి నారు. అం దారితో  కూసోని , అన్నం తిన్యాను . మా అత్తా వాళ్ళు నా కోసం సద్ద సంగటి , రాగి సంగటి , మజ్జిగ పులుసు , పచ్చి పులుసు సేసినారు . నాకు ఎరాబద్దకు , పచ్చి  సేనిక్కాయల పుల్లకూర  ఇష్ట మని రేపు చేస్తానాని  సెప్పింది మా అత్త .

నాకు శానా కుసాలుగా ఉన్ది. మా అత్త  ఆ రోజు ఎక్కడికో బోవల్ల అని అన్ది. ఆళ్ళ జీతగాడ్ని పిలిసి, ఎద్దల బండ్లి ని కట్టమన్ది .

'ఒరేయ్ రాజు , నువ్వు బావోల్లతో ఆడుకొంటూ ఉండు , నేను పక్క పల్లె కొమిటోడ్ల అంగడికి బొయ్యెస్తా '
నాకు బండి తోలల్ల అంటే శా నా ఇష్టం . మా అత్తతో మురిపెంగా అడుక్కొన్నా  . ' అత్తా అత్తా నేనొస్తా 'అన్నా . అత్త ' సరే ' అన్ది.

సరే నని రెండు గంటలకు ఎద్దల బండి రడి చేసినాడు ఆళ్ళ జీతగాడు . నేను , మా అత్తా బండ్ళో కూసోని పోతా  ఉండాము .
ట్టర్ర్ ..... ట్టర్ర్ .... పద ...పదా ... అని సాన ఉషారుగా ఆడు బండి తొలత ఉండాడు ..

బండి ఊరు  దాటి , ఒక్క మెయిలు దూరం పొయింది . తెల్ల ఎడ్లు సాన బాగా  పర్గేత్తతా ఉండాయి . నా కేమో బండి తోలల్ల అని బలే కోరిక గా ఉన్డాది . అత్త ఏమంటు దో అని నాకు బయ్యం . దైర్న్యం సేసి అత్తను అడిగినాను .

' నీ  కలవాటు లేదురా నాయనా . ఆ గిత్తలు నీ మాట ఇనవు. ' అంది మా అత్త.
నేను మా అత్త మాట ఇనలా. ఏడుస్తా ఉండా ను .

'పోనిలేమ్మ , పిల్లోడు అడగతా ఉండాడు . నేను పక్కన కుస్సోని బండి తోలిపిస్తా!' అన్నాడు జీతగాడు .
మా అత్త బయ్యం గానే , ' సరే నాయన , జాగ్రత్తగా నడుపు ' అనిన్ది.

నాకు బలే కుసాలు అయ్యిన్ది. వెంటనే ఆయన దగ్గర నుండి ముక్కు తాడ్లు పట్టుకొని, ఒక చేత్తో చల్ల కోడి తో ' డ రర్ ... డ రర్ ... అంటూ నాలిక తో వింత సబ్ధం సేసుకొంటా బండి నడు పుతుండా ను .

కొంచెం దూరం పోయిన్నాక , ఏమయిందో ఏమో, బండి సేక్రం ఒక పెద్ద రాయి మీద ఎక్కి , ఒక పక్కకి వంగి పడి  పొయింది . కాడిమాను మెడ మీద ఒక ఎద్దు మొయ్య లేక కింద పడి పొయిన్ది. నేను,  మా అత్తా ఇసిత్రిం గా ఇసిరేసినట్లు ఒక పక్కకు పడి పొయినాము. దెబ్బలు ఏమి తగల్లేదు గాని సెర్మము సీక్కొని పొయిన్ది. మా అత్త ఒక్కటే ఏడ్పు . సెపితే ఇన్నావా ? అదృస్టం  బాగుండి , బతికి బట్ట గట్టినాము గాని, లేకుంటే సచ్చి పొయ్యే వాళ్ళం గదరా ?' అనింది మా యత్త  ఏడుస్తా .

పాపం మా జీ త గాడు ,ఎద్దల్ని లేపి , వాటిని దువ్వి ,' లేదురా రాముడు , ఏమి కాలేదు' , అని కాడి మాను గట్టిగా బిగించి నన్ను ఎనక్కు కూర్చో మని  బండి తోలినాడు . ఇంక మా యత్త , ఈ రోజు సేకునం బాగా లేదు , ఇంటికి మళ్ళించు అనింది .

మరుసటి రోజు ఏమయిందో ఏమో గానీ ,ఆళ్ళ జీత గాడ్ని  తోడిచ్చి , బస్సు ఎక్కింఛి , మా ఊరు పంపించేసింది మా యత్త.

రచన: వారణాసి భాను మూర్తి రావు
30. 11. 2014

ఇందు లోని పాత్ర దారులు కేవలం కల్పితాలే , ఎవ్వరిని ఉద్దేశించి రాసినది గాదు. ఈ కథ నిజంగా నా నిజ జీవితం లో జరిగినది . ఈ కథ ఇటివలే పరమ పదించిన మా మేనత్త గారికి అంకితం .

Friday, November 28, 2014

Oka Sri Sri Mali pudathada?

ఒక శ్రీ శ్రీ  మళ్ళి పుడతాడా ?


ఒక శ్రీ శ్రీ  మళ్ళి పుడతాడా?
ఒక మహా ప్రస్తానం మళ్లి వస్తుందా ?


ఒక విప్లవం  మళ్లి  చూస్తామా ?
ఒక   నవ్య ప్రపంచం మళ్లి  కంటామా ?

ఒక సూర్యుడు  మళ్లి ఉదయిస్తాడా ?
ఒక ప్రభాతం  మళ్లీ  పుడుతుందా ?

ఒక సమతా రాగం  మళ్లి  వినిపిస్తుందా ?
ఒక నవతా భావం మళ్లి  కలుగుతుందా ?

వారణాసి భాను మూర్తి
28. 11. 2014


Wednesday, November 26, 2014

విషం కురిసిన రాత్రి ( visham kurisina raatri)



విషం కురిసిన రాత్రి


అక్కడ  దెయ్యాలు వేదాలు  వల్లిస్తున్నాయి
ఇక్కడ  వేదాలు దెయ్యాలకు నేర్పిసున్నాయి
ఈ రాత్రి ఎక్కడయినా అమృతం కురుస్తుందేమో నని వెతుకుతున్నాను
శ్లోకాలన్నీ శోకాలై  వినబడుతున్నాయి
గేయాలన్ని గాయా లై బాధ పెడుతున్నాయి
ఒక కవితా వస్తువు దొరుకుతుందేమో నని
ఈ రాత్రంతా వెతుకు తున్నాను
సత్య హరిశ్చంద్రులు కాటిక కాపరులై తచ్చాడుతున్నారు
బృహన్నలు   వీధుల్లో విహారం చేస్తున్నారు
నా కక్కడ భార్యల్ని చంపిన భర్తలు
భర్తల్ని చంపిన భార్యలు
బిడ్డల్ని చంపిన తండ్రులు
తల్లి తండ్రుల్ని చంపిన బిడ్డలు
బ్రతకడం చేతకాని విద్యా  వంతులు
అందరు కన బడుతున్నారు
ఈ రాత్రి కాళ  రాత్రి కానే  కాదు
పున్నమి రాత్రి విష నాగులు నాట్యం చేస్తా  యంటారు
ఇక్కడ విష పురుగులు తిరుగుతున్నాయి
మనసంతా వితండ వాదమే
విధి రాసిన రాతలు అని పాత  పాట పాడుతున్నాడొక్కడు
మనం రాసుకొన్న  రాత అని వాడికి బహుశా తెలియదు
వీధి కుక్కలు పేవ్మెంట్ల మీద మొరుగుతున్నాయి
వాటితో పాటు దిక్కు మొక్కు లేని అడ్రస్ లేని మనుషులు
ఈ దేశం లో అడుక్కోవడం కొందరికి  జన్మ హక్కు
రెక్కలు తెగిన పక్షుల్లాగా ఉడిగి పోయిన  అమ్మా నాన్నల్ని
గెంటేసిన బిడ్డలు
 రైల్వే ఫ్లా ట్ ఫామ్ లు గాక ఇంకెవ్వరు చేర దీస్తా రు ?
అన్న పెట్టే రైతన్నలకు అడుక్కు తినే కాలం వచ్చింది
ఏ బస్టాండ్ లో చూసినా వాళ్ళే !
రోడ్డు పక్కన నిలబడి చీకట్లో బే రా లడుతున్న ఒక స్త్రీ
బహుశా  ఆర్ధిక శాస్త్రం బాగా ఔపసన పట్టింది
ఇన్ ఫ్లేష న్ (inflation ) అంటే ఎమిటొ ఆమెకు బాగా అర్థం అయ్యుంటుంది
 ఈ దేశానికీ పట్టిన దౌర్భాగ్యం దరిద్రం
అస్తవ్యస్త మైన వ్యవస్థ  బాగు పడే వరకు
ప్రతి రాత్రి విషం కురుస్తునే ఉంటుంది!


రచన  ---------వారణాసి భానుమూర్తి రావు
26. 11.2014






Sunday, November 23, 2014

చిన్నారి మనసు

చిన్నారి మనసు

అమ్మ జోల పాటల బదులు
ఐ పాడ్ లో 'జానీ  జానీ , ఎస్ పాపా' లు వినబడుతున్నాయి
'చంద మామ రావే' పాటకి చంద్రుడుంటే గద వినడానికి
పాలే లేని   అమ్మ  తనం డబ్బా పాల తో  పాప కడుపు నిండింది
అమ్మ నాన్న ల ఉద్యోగాల తో
చిన్న పాపా బాల్య మంతా బేబీ కేర్ సెంటర్ లో ముగిసింది
అమ్మమ్మ బామ్మా తా తయ్యలకు
స్కైప్ లోనే చిన్నారుల  ముచ్చట్లు  తీరాయి
పసి పిల్లల మౌన భాష
మన కెలా అర్థమవుతుంది... .?









కొందరు


 కొందరు

కొందరు  కలకాలం గుర్తు ఉండి పోతారు
కొందరు కొంతకాలమే  గుర్తుంటారు
మరి కొందరు అసలే గుర్తుండరు !  

కొందరి పరిచయం మహద్భాగ్యంగా ఉంటుంది
కొందరి  పరిచయం విజ్ఞాన గని లా ఉంటుంది
కొందరి  పరిచయం అన్ని విధాల మనల్ని ఆదు కొంటునే ఉంటుంది !

మంచు మేఘాలు చల్లని గాలితో కలిసి వర్షాన్ని కురిపిస్తాయి
సూర్యుని కిరణాలు నీటి జల్లులతో కలిసి ఇంద్ర ధనుస్సై మెరుస్తుంది
వసంత కాలం లో లేలేత ఆకుల్ని తిని కోయిలమ్మ మధుర రాగాల్ని పలికిస్తుంది !

అందరి కోసం అందరు ఉన్నా
కొందరి కోసమే కొందరు పుడతారు
మనసులో ఎన్ని తలపు లున్నా
ఒక్క తలపే  మధురానుభూతై మిగులుతుంది !






Friday, November 21, 2014

మా ముత్తా త ( MAA MUTTATA)

మా ముత్తా త

మా ముత్తాత
ఏకంగా  చేన్లో పదహారు గంటలు పని చేసి
నాలుగు రాగి సంగటి ముద్దలు పచ్చి పులుసు తిని
ఆరోగ్యంగా వంద ఏళ్ళు ఏళ్ళు బ్రతికాడు


మా తాత
ఒక సేరు బెల్లం  కాఫీ త్రాగి
ఒక దోసెడు నెయ్యి ఎర్ర బియ్యమన్నం లో
గొడ్డు కారం కలుపు కొని సేద్యం చేసి
తొంభై ఏళ్లు దర్జాగా బ్రతికాడు!


మా నాన్న
ఇంగ్లీష్ దొరలతో తిరిగి
కాఫీ టీ లతో పాటు విస్కీలు బ్రాం దీలు త్రాగి త్రాగి
గుండె పోటుతో  యాభై  ఏళ్లకే  గుటుక్కు  మన్నాడు!

నేను ఫా రిన్ కెళ్ళి కోట్లు సంపాయిచ్చి తిరిగోచ్చా
కడుపు కాల్చి అన్నం బదులు పిజ్జాలు వైన్లు త్రాగి
బిపి షుగర్ రక రకాల వ్యాధులు తో
దిన మొక గండంగా గడుపుతున్నా!



Tuesday, November 18, 2014

ఒక్క సారి గుర్తు తెచ్చుకో !

ఒక్క సారి   గుర్తు  తెచ్చుకో !



ఒక్క  సారి నువ్వు  ఏకాంతంగా కూర్చున్నప్పుడు
దూది పింజల్లా నీ  జ్ఞాపకాలు ఎగురుతున్నప్పుడు
ఏదో  తెలియని  ఆనందం!
ఏదో తెలియని  బా ధ !!

ఒక్క సారి మనం మన జన్మ భూమి కెళ్ళినప్పుడు
ఏదో తెలియని మమకారం
మనం తిరిగిన ఆ మట్టి వాసన మనల్ని  చుట్టుకొంటుంది
మనం ఉన్న మన ఇల్లు మనల్ని  కౌగలించు కొంటుంది

ఒక్క సారి నువ్వు  చదువు కొన్న బడి కెళ్లి  నప్పుడు
బడి గంటలు నిన్ను  చూసి మ్రోగుతాయి
ఒక్క సారి నువ్వు  ఆడు కొన్న ఆట స్థలాల్ని చూసి నప్పుడు
డ్రిల్లు మాస్టారు  నేర్పించిన ఆటలు గుర్తు కొస్తాయి

నాన్న  కష్ట పడి  క ట్టించిన ఇల్లు
బోసి పోయి నీకు ద ర్శ న మి స్తుంది
అమ్మ మురిపెంగా పెంచుకొన్న మొక్కలు
మోడు వారి పోయి నిర్జీవంగా నిన్ను చూస్తాయి

నిన్ను క ని పెంచిన నీ పల్లె
నిన్ను చూసి బావురు మంటుంది
నిన్ను  మనిషిని చేసిన నీ జన్మ భూమి
నీ రాక కోసం వేయి కళ్ళతో వేచి ఉంటూనే ఉంటుంది !







Monday, November 17, 2014

BHANU SWAGATHALU- AMERIKA

భాను స్వగతాలు

.
ఈ మధ్యనే రెండవ సారి అమెరిక వచ్చాను . మా అబ్బాయి గూడా అందరి లాగే ఇక్కడకి వచ్చి పెద్ద ఉద్యోగంలో చెరాడు. అన్ని బాగా నే ఉన్నా యి  గాని ఎక్కడో ఏదో లోపం ఉందని అన్పిస్తుంది  నా కు ఇక్కడ. మన భారత దేశానికి ,ఇక్కడికి పోలికలేంటి అని బేరీజు వెసుకొన్నాను.చాలా విషయాల్లో మనం వెనక బడి ఉన్నా మనిపిస్తున్నది. మన వాళ్ళకి  పిల్లలు అమెరిక వెళ్లకుంటే ఏదో ప్రెస్టేజ్ పోయినట్లుగా ఫీల్ అవుతున్నారు. మా ఆఫీసు లో అయితే ప్రతి ఉద్యోగస్తుడి కొడుకో , కూతురో  అమెరికాలో ఉన్నా ర ని గర్వంగా చెపుతుంటా రు . ఇది ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపొయిం ది . మా వాడు  ఎం ఎస్  వర్జీనియా  యూనివర్సిటీ లో వచ్చిందం డీ ! ఇంకా చాలా యూనివర్సిటీ కి అప్లై చెసాడు. బ్యాంకు లోన్ కి గుడా అప్లై చెసాను. మా వాడ్ని అమెరిక లో నే  చదివించాలి, ఎంత ఖర్చయినా సరే  అమెరికా కి పిల్లల్ని పం పడ మనేది ఇప్పుడు ఫాషన్ అయిపొయింది . మా ఫ్రెండ్ ఒకాయన 50 లక్షలు ఖర్చు చెసాడు. ఆ అబ్బాయి ఇంకా ఉద్యోగ వేటలో ఉన్నాడు  . స్టూడెంట్  వీసా మీద నే తంటాలు పదుతున్నాడు. కొందరు పిల్లలు హోటళ్ళలో సర్వర్ లాగా నో లేదా పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నారు. మన పిల్లలకి ఇక్కడికి వచ్చాక డిగ్నిటి  అఫ్ లేబర్ అంటే ఏమిటో బాగా అర్థం అవుతోంది అక్కడ రుపీ వేల్యూ తెలియని వాళ్ళు ఇక్కడ డాలర్ వేల్యూ తెలుస్తొంది. అమెరిక అంటే మన వాళ్ళకి అంత  క్రేజ్ మరి.

పోతే  అమెరికా లో ఉన్న మన వాళ్ళు  behavior పాటర్న్ చూస్తె అసలు మనకి నవ్వు వస్తుంది. ఒక్కరితో ఒక్కరు మాట్లాడు కొరు. పక్కింటి  వాళ్ళు ఎవ్వరో మనకి తెలిదు. ఎవ్వరు ఏమి చేస్తున్నారో   తెలిదు. నిన్న ఒక్క టెంపుల్ కి వెడితే అందరు  మన తెలుగు వాళ్ళే ! . కాని ఒక్కరితో ఒక్కరు గూడా చూసు కోవడం లెదు. నేనే ఒక్క ఫామిలీ తో మాట్లాడడానికి ప్రయత్నించా !కాని మాట్లాడితే ముత్యాలు రాలతాయి న్నట్లుగా ముక్తిసరిగా జవా బిచ్చాడు. నాకేం మాట్లాడానికి అవకాశము ఇవ్వలేదు ఆతను . గట్టిగా మాట్లాడితే nusense  కేసు ప్రక్కింటి వాళ్ళు  పెడతారంటారు .
దేవుడికి అగర బత్తి లు వెలిగిస్తే , స్మోకింగ్ sensors ఉన్నయంటారు. రోడ్లల్లో కార్లు తప్ప మనుషులు కన బడరు. మనుషులకు తోడూ పెట్ డాగ్స్ తప్ప మనుషులు కన బడరు. మన ఇండియా లో అయితే సోషల్ behaviour విభిన్నంగా ఉoటుంది . అడ్రెస్స్ అడిగితే ఇంటి దగ్గరికి దింపి వెడతారు . ఇక్కడ GPS మీ దనే ఆధార పడా లి. అక్క డ పండగలు అని , పబ్బాలని స్నేహితులు , బంధువులు  కలుస్తారు . బతుకమ్మ పండుగ, దసరా దండియా  లాంటి పండుగలు అందరిని ఒక్కటి  చేస్తాయి .

ఏది ఏమయినా , మన దేశం లో ఉన్న స్వాతంత్ర్యము ఇతర దేశాలల్లో మనకు ఉండదేమో !













Sunday, November 16, 2014

సంభవామి

సంభవామి



మొదళ్ళు  కత్త రించినా
మళ్లీ చిగుర్లు వెయ్యక మానను
సుడి గుండాలు ఎదురయినా
తీరం చే రక మానను
సూర్యుడు ఉద యించడం మానేస్తే
వెలుతురు కోసం తూర్పు దిక్కు దివిటీ నవుతాను
గుండె గుండె లోని  గాయాల్ని తుడిచేసి
ఒక చరుకుడ నవుతాను
ఒక సారి మరణించినా
మళ్లి మళ్లి పుడతాను !




17. 11.20 14





Friday, November 14, 2014

జీవన ప్రయాణం


జీవన  ప్రయాణం 

ఈ  ప్రయాణం 
ఏదో ఒక కొత్త గ్రహానికి చేరుకోను న్నట్లు
గ్రహాం తరాలకు ప్రయాణి  స్తున్నట్లు
ఈ అమెరికా ప్రయాణం అన్పిస్తోంది
విహంగ వీక్షణం చేస్తున్నపుడు
తెల్లని మేఘాలు గుంపులు గుంపులుగా
పురివిప్పి నాట్యం చేస్తున్నట్లు
ఏదో సందేశాన్ని మానవాళికి చేరుస్తున్నట్లు
భూ మ్యాకాశాల మధ్య సర్రున దూసుకు పోయే
విహంగ రాజాన్ని చూస్తుంటే
మన నాగరికత ఏంతో  వేగంగా దూసుకు పోతున్నట్లన్న్పిస్తోంది !
సప్తసముద్రాలు దాటి ప్రయాణిస్తున్నప్పుడు
జీవన వేదం ఒక నాదంలా శ్రావ్యంగా విన్పిస్తోంది
ఆత్మ లన్ని కలిసి పరమాత్మ దర్శనం కోసం
పరుగులు పెడుతున్నారేమో అన్పిస్తోంది
సమస్త  విశ్వంలో  చై తన్యం వెల్ల విరుస్తోంది
రాత్రి పగలు తేడా లేకుండా
సముద్రాల మధ్య కాంతి పుంజాలు
భూమ్మీద చీకటి  వెలుగులు
కనపడుతున్నాయి
నా  దేశం  ఈ విశాల విశ్వంలో
చిన్న బిందువు లాగా కన్పిస్తోంది
మనిషి మహోన్నతుడు
ఈ విశాల విశ్వాన్ని ఒక గ్రామంగా మలిచేసాడు
మానవాళి సౌభాగ్యానికి
ఎన్నెన్ని మేధస్సులు పని చేస్తున్నాయో !
ప్రతి బంధ కాల్ని అవకాశాలుగా వినియోగిస్తూ
ముందుకు సాగడమే మనిషి పని !!

--------------------భాను వారణాసి
10. 11. 2014 నాడు అమెరికాకు వచ్చిన సందర్భంగా 

నా అమెరికా ప్రయాణం (NAA AMERICA PRAYANAM)

 నా  అమెరికా ప్రయాణం

ఒక ఖండాన్ని దాటి
ఇంకొక ఖండాన్ని చేరాం!
ఒక సముద్రాన్ని దాటి
ఇంకొక సముద్ర తీరాన్ని చేరాం !
భూగోళానికి అటు వైపు
మనకి పగలయితే
ఇక్కడ  రాత్రి
ఇక్కడ రాత్రయితే
మనకి పగలు
చిత్ర మైన  విశ్వం
ఎన్నో పాటాల్ని నేర్పిస్తోంది !
అనంత విశ్వంలో
ఎన్నో వింతలూ , విశేషాలు
ఇక్కడ పగలు రాత్రి  ఒక్కటిగానే ఉంది
పగలు సూర్యుడు  వెన్నలని కురిపిస్తున్నాడు
రాత్రి భయంకర మైన చలిలో చంద్రుడి జాడే లేదు
ఎముకలు కోరికే చలిలో
మనిషి జీవితం సాగుతూనే ఉంది
బ్రతుకు పోరాటం సాగుతూనే ఉంది
ఎండిన ఆకుల సవ్వడి తప్ప
నాకే శబ్దము వినబడ లేదు
నిటారుగా నిలబడిన చెట్లను చూసి జాలేస్తోంది
ఒక గంట వెచ్చని సూర్యుని కోసం
నిరీక్షణలో నిస్థాణు వులా  వేచి ఉన్నాయి
శీ తల కాలం తెచ్చే ఉపద్రవం
ఎప్పుడు ముగుస్తుందో అని వేఛి  ఉన్నట్లున్నాయి
మంచు ముక్కలు  రాలి తెగి పడుతున్నాయి
ఆకాశం లో మంచు పర్వతాలు బద్ధ లయినట్లుగా !
భూమి చివరి అంచు లో నిలబడి నట్లయింది నాకు

14.11.2014  SEATTLE