Wednesday, September 25, 2019

నిర్వేదం


నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *21-09-2019*
*వారణాసి భానుమూర్తి
అంశం *నిర్వేదం*
శీర్షిక: *నిర్వేదం*

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


అనిశ్చతి  అభయారణ్యంలో
అవకాశ వాదుల క్రూర మృగాల మధ్య
బ్రతకడం కష్టమే !

నిర్భయంగా నడవాలనుకొన్నా
ఆటంకాల అవరోధాల లాండ్ మైన్లు
అడుగడుగునా ఆవరిస్తూనే ఉంటాయి

 *నిర్వేదాల*  వేదాలు
నైరాశ్యపు గీతాల్ని వినిపిస్తుంటే
ప్రతి శ్లోకమూ ఒక శోకమై
బ్రతుకు  భారమయిన వేళ
మనిషి పురోగమించడం  కష్టమే!

 గ్రహ మండలాలు దూరమయినా
మానవుడు కాలు మోపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు
అవకాశాలు అంచులో లేక పోయినా
అందుకోవడానికి  ప్రయత్నిస్తూనే వుండాలి

రానీ రాక పోనీ
కానీ  కాక పోనీ
నీ ప్రయత్నం వృధా కారాదు.








Tuesday, April 30, 2019

ఉత్తమ శిష్యుడు

ఉత్తమ శిష్యుడు 
----------------------
రచన : వారణాసి  భానుమూర్తి రావు 

----------------------------------------------------------------------------------------------------------------
పూర్వం నందవరం అనే గ్రామంలో  ఒక ఆచార్యుడు ఉండే వారు. అయన పేరు విష్ణు శర్మ . వారు సకల వేద వేదాంగ  పారంగతులు   . ఆయన దగ్గర చిన్నతనంలోనే శిష్యులుగా చేరిన ఎంతో   మంది   ప్రముఖ పండితులుగా , విద్వాంసులుగా  వివిధ రాజ్యాలలో రాజుల దగ్గర కొలువులు సంపాయించే వారు . అందుకే ఆ ప్రాంతమంతా  ఆయనంటే ఎనలేని గౌరవం. భక్తి.
అయన ఆశ్రమంలో ఎప్పుడూ  విద్యార్థుల వేదఘోషతో  శ్రవణానందంగా  ఉండేది .

ఒక నాడు వేకువ జామున  బ్రాహ్మి  ముహూర్తంలో  స్నానాదికాలు ముగించుకొన్న తన కిష్టమైన ఇద్దరి శిష్యులను  పిలిపించుకొన్నారు  గురువు గారు.    వినీలుడు  అనే  శిష్యుడిని పిలచి , వెంటనే పట్నం కు  వెళ్లి  యాగానికి కావాల్సిన సామానులన్ని   తీసుకుని రమ్మని  పురమాయించారు   గురువు గారు. తరువాత  సునీలుడు  అనే  శిష్యుడిని  పిలచి , అడవికి వెళ్లి యాగానికి   కావాల్సిన దర్భను కోసుకురమ్మని పురమాయించారు .

ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకొంటూ కాలి బాటన నగరానికి బయలు దేరాడు వినీలుడు.
సునీలుడు దర్భ కోసం అడవి బాటను పట్టాడు .

కొంచెం దూరం వెళ్ళాక   సునీలుడుకి  ఎవ్వరో పిలిచి నట్లయింది. వెనక్కి  తిరిగి  చూస్తే , వీరభద్రుడు రొప్పుతూ వస్తున్నాడు.

'' సునీలా.. ఆగు. '' అని గట్టిగా అరిచాడు  వీరభద్రుడు .

సునీలుడు ఆగి పోయి ' ఏమని ?' తల పంకించాడు .

'' సునీలా.. గురువుగారు దర్భ నన్ను కోసుకు రమ్మన్నారు . నీకొక ముఖ్య వార్త  చెప్పాలి''  అన్నాడు ఆయాసంతో.

'' ఏమా వార్త? '' సునీలుడుకి  ఏమీ  బోధ పడ్డం లేదు .

'' గుండె దిటువుచేసుకొని విను. గురువు గారు నీకీ  వార్త చెప్పమని,  ధైర్యంగా ఉండ మని చెప్పారు. మీ అమ్మ గారు స్నానం చేస్తూ  ......  నదిలో.... ''

అని చెబుతూ వెక్కిళ్లు  పెట్టి ఏడవసాగాడు వీరభద్రుడు.

''  ఏమైంది   మా అమ్మ గారికి? నదిలో  ... '' సునీలుడు ముఖమంతా స్వేదంతో నిండి పోయింది.

''ఏమని చెప్పను  సునీలా . అమ్మ గారు నదిలో పడి  కొట్టుకొని పోయిందట '' అన్నాడు వీరభద్రుడు .

'' ఆ .. శివ శివ ... నా  కెందుకీ శిక్ష విధించావయ్యా ' అని కూల బడి పొయ్యాడు సునీలుడు .
అతని శరీరమంతా వణుకు పుడుతోంది .

వీరభద్రుడు  ధైర్య  వచనాలు చెబుతూ సునీలుడిని  ఇంటికి వెళ్ళమన్నాడు . అడవికి తాను వెళ్లి దర్భలు కోసుకు వెడతానన్నాడు .

సునీలుడు వెను  తిరిగి పోలేదు .

'' గురువు గారి ఆజ్ఞ లేనిదే నేను వెను  తిరిగేది  లేదు . శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా  చిటుక్కు మనదు . గురువు గారు నాకు దేవుడుతో సమానం . అయన పని పూర్తయిన వెంటనే నేను ఇంటికి వెడతాను. దర్భ లేకుంటే యాగం జరగదు. గురువు గారు అప్రతిష్ట పాలు  కావడం నేను
చూడలేను  '' అని అడవి వైపు వడివడిగా అడుగు లేసాడు సునీలుడు .

సునీలుడి స్థిత ప్రజ్ఞకు, ఆత్మస్థైయిర్యానికి ఆశ్చర్య పొయ్యాడు వీరభద్రుడు. చేసేదేమీ లేక వెను  తిరిగి గురువు గారి ఆశ్రమం వైపు పరుగు లంఘించాడు  వీరభద్రుడు .

--------------------------------------------------------------------------------------------------------

పట్నం వైపు వడివడిగా అడుగులేస్తున్న వినీలుడు సూర్యతాపానికి తట్టుకొలేక పోతున్నాడు.
పట్నం ఇంకా  చాలా దూరంలో ఉంది . యాగానికి కావలసిన  వస్తువులన్నీ  దొరకాలంటే పట్ణణ మంతా వెతకాలి .

గురువుగారు ఈ  పనిని సునీలుడుకి  ఇచ్చి ఉంటే బాగుండేది అని అనుకొన్నాడు వినీలుడు.
అయినా అడవిలో ఏ పులో , పామో  కరిస్తే తన గతేమి  కాను , ఆ అడవిలో  దర్భ కొయ్యడం కన్నా పట్నానికి వెళ్లి సరుకులు తేవడమే మేలు అని తల పోశాడు వినీలుడు .

అంతలో '  వినీలా  వినీలా. ' అనే కేక విన బడింది . కేశవుడు రొప్పుకొంటూ తన వైపు వస్తున్నాడు  .
'' ఏమైంది .. కేశవా ? ఏమంత గాభరా ? '' అన్నాడు .

'' వినీలా. మీ నాన్నగారు ఆకులు  కొయ్యడానికి మర్రి చెట్టు ఎక్కి పైనుండి  క్రింద పడ్డడాడట. మనిషి చాల  అపాయంలో ఉన్నాడట. గురువు గారు నీకు  చెప్పి రమ్మన్నారు '' అన్నాడు  కేశవుడు .

 '' ఆ... ఎంత పని జరిగింది ? నాన్న గారికి ప్రాణా పాయం లేదు గదా ? అయితే ..నేను  మా ఊరుకి వెళ్లి పోతున్నానని గురువు గారితో చెప్పు. ఇంద .. రొఖ్కము .. సామానుల చిట్టా ''
అని కేశవుడికి అందించి దక్షిణం వైపున్న తన గ్రామానికి పరుగులు తీసాడు  కేశవుడు .

------------------------------------------------------------------------------------------------------------------
ఆ సాయంకాలం   సునీలుడు  ఆశ్రమం  చేరుకొని , తల మీదున్న దర్భల మోపుని క్రిందకు దించి గురువు గారి ముందు  ఉంచి వినయంగా  చేతులు  కట్టుకొని  నిలబడ్డాడు .

'' సునీలా. నువ్వు చాలా  పుణ్య కార్యం చేసావు. క్రూర మృగాలున్న అడవిలో ఒంటరిగా వెళ్ళి దర్భను సేకరించి యాగ నిర్వహణ నిమిత్తమై ఏంతో  మేలు చేసావు. '' అన్నాడు గురువు గారు ఆనందంగా .

'' గురువు గారు. తమరు అనుగ్రహిస్తే నేను మా గ్రామానికి వెళ్లి రావాలి . మా అమ్మ గారు నదిలో పడి ... '' అని కళ్లల్లో  నీళ్లు  తుడుచుకొంటూ  ఏడవసాగాడు  సునీలుడు .

''చ. ఏమిటా మాటలు నాయనా.. నీకు ఈ  గురువు గారి ఆశీస్సులున్నంత వరకు మీ అమ్మ గారికి ఏ ఆపదా  రాదు. పట్నానికి  వెళ్ళిన వినీలుడు తిరిగి రానీ . '' అన్నాడు గురువు గారు .

ఆ సాయంకాలం కేశవుడు రొప్పుతూ  నెత్తి     మీద సామానుల మూట  పెట్టుకొని అలసి పోయి , పీక్కుపోయిన ముఖంతో వచ్చాడు . వినీలుడు వారి నాన్న విషయం చెప్పగానే గ్రామానికి పరుగెత్తాడని గురువు గారితో చెప్పాడు.

మరుసటి రోజు వినీలుడు తిరిగి వచ్చి సంగతంతా గురువు గారికి చెప్పి క్షమించమని వేడుకొన్నాడు . వార్త విన్న వెంటనే పట్టణానికి  వెళ్లి సరుకులు తేవాలని తోచ లేదన్నాడు .
గురువు గారు అంతా  విని నవ్వు కొన్నాడు .

'' చూడు వినీలా .. నీకు  పనిలో  అశ్రద్ధ , గురువు గారి పట్ల అవిశ్వాసం ఎక్కువున్నాయి. ఉత్తమ శిష్యుడుకు కావలసినవి  స్థిత ప్రజ్ఞత , ఆత్మ స్థైర్యం , క్రమ శిక్షణ , అవగాహన . బల హీనత మనిషిని  అశక్తుడ్ని , అసమర్థుడ్ని చేస్తుంది . అమ్మ నదిలో  పడి  కొట్టుకొని పోయిందనే  వార్త విని గూడా , సునీలుడు స్థిరమైన  చిత్తంతో  గురువు గారి ఆజ్ఞను మన్నించి , తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. పనిలో అంకిత భావం , ఓర్పు, సహనం , క్రమశిక్షణ  ఇవి మనిషిని ఉత్తమ వ్యక్తిగా తీర్చు దిద్దుతాయి. ఈ  సుగుణాలన్నీ సునీలుడిలో పుష్కలంగా ఉన్నాయి. ఇక నీ  విషయానికి  వస్తే వినీలా, మీ నాన్న చెట్టు మీద నుండి పడ్డాడనే  వార్త విని నాకు   గూడా  చెప్పకుండా నీ  గ్రామానికి వెళ్లి నీ  కర్తవ్యాన్ని విస్మరించావు . మనిషి మనస్సును జయించలేక పొతే నిర్వీర్యుడై   పోతాడు . మిమ్మల్ని పరీక్షించాడానికే ఈ  రెండు అబద్ధాలు ఆడ  వలసి వచ్చింది . ఈ  పరీక్షలో సునీలుడే   గెలిచాడు . ఈ  ఆశ్రమానికి నా  తరువాత సునీలుడే  వారసుడు. అతనే ఉత్తమ శి ష్యుడు . '' అన్నాడు  గురువు గారు.

గురువు గారి తరువాత , సునీలుడు ఆశ్రమ ధర్మాలన్నీ చక్కగా నిర్వర్తించి  మంచి పేరు తెచ్చుకొన్నాడు .


--------------------------------------------------------------------------------------------------------------

వారణాసి భానుమూర్తి రావు 
99890 73105
హైదరాబాదు 
















Monday, January 28, 2019

జై హింద్ !

*నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది :   26- 1-2019 
వారణాసి భానుమూర్తి రావు
అంశం : గణ తంత్ర రాజ్యం

శీర్షిక : జై హింద్ !
--------------------------------------------

వందే మాతరం అని ఎలుగెత్తి చాటాలి
జైహింద్ జైహింద్‌ జైహింద్ అని‌  పిడికిలి బిగించి గర్జించాలి
వ్యయ ప్రయాసలు..ఆత్మ బలి దానాలు
గుండెల్లో గునపాలు... మంటల్లో మాడిన అనాధ శవాలు
తెల్ల వారి దుర్మార్గాలకు బలి అయిన స్వరాజ్య యోధులు
అమ్మా ...భారతమ్మ.... నీ బిడ్డల వూపిరికి
ఉరి త్రాళ్ళు బిగించిన బ్రిటీషు ప్రభుత్వం
గుర్రపు డెక్కల క్రింద నలిగిన దిక్కు లేని భారతం
బూట్లను నాకించిన తెల్ల వాడి అహంకారం
జలియన్ వాలా భాగ్ లో బుల్లెట్ల వర్షాలు
బాపూజీ అహింసా వాదం తెచ్చింది స్వతంత్ర్యం
అయినా తప్పలేదు  రక్త పాతం
మతాల చిచ్చులో బలి అయిన జన పాతం
రెండుగా విరిగి ముక్కలయిన అఖండ భారతం
అర్థరాత్రి  ఎగిరింది జాతి మువ్వన్నెల జెండా
గణతంత్ర రాజ్యమై ప్రజా రాజ్యమయింది
డెబ్బై  వసంతాలు నిండి
ప్రపంచ పటంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమయింది.! 

-------------------------------------------------------------------------
వారణాసి భానుమూర్తి రావు

కాలు గాలిన పిల్లులు

తేది : *  24-1-2019* *గురు వారం*
*వారణాసి భానుమూర్తి రావు*

శీర్షిక : *కాలు గాలిన పిల్లులు*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


కొందరు రాజకీయ నాయకులు 
కాలు గాలిన పిల్లిలా
గంతులేస్తుంటారు

నీ దగ్గర  పాలు  త్రాగి 
వాడి దగ్గర తృప్తిగా భోంచేసి
ఇద్దర్నీ కడుపు మీద తన్ని 
మూడో వాడి‌ పంచన చేరుతాడు

ఈ కాలు గాలిన పిల్లులు
రాజకీయ విలువల్ని తుంగలో తొక్కి
అన్నం బదులు అవినీతి గబ్బుతో
కడుపు నింపు కొంటారు

కొందరు రాజకీయ నాయకులు
గమ్యం తెలియని అవకాశ వాదులు

కొందరు రాజకీయ నాయకులు 
కాలు గాలిన పిల్లిలా
నిలకడ లేని నిరర్థకులు

మానసిక శాంతి లేని
మంద బుద్దులు.

వారణాసి భానుమూర్తి రావు
24.1.2019

ఎదుటి వారికి చెప్పేటందుకే!

తేది : *  25-1-2019* *శుక్ర వారం*
*వారణాసి భానుమూర్తి రావు*
----------------------------------------------
ఎదుటి వారికి చెప్పేటందుకే!

-------------------------------------------------
నేల నవ్వింది
ఏరు నవ్వింది
చేలు నవ్వింది
చేప నవ్వింది
చేవ చచ్చిన ఈ రాజకీయ నాయకులని చూసి
ఇచ్చిన మాటను   నిలబెట్టు కోలేని 
ఈ ప్రబుద్దులని చూసి.....

వోట్ల కోసం గాలం వేసి 
నీతి వాక్యాలు వల్లించి
ప్రజాసేవే పరమార్థం అని బురిడీ  కొట్టించి
ప్రజల్ని అడ్డంగా మోసం చేస్తున్న 
ఈ అభినవ దుశ్శాసనులు
ఎదుటి వారి కోసం నీతులు వల్లిస్తారు
తమ దాకా వస్తే తల కాయలు తరుగు తారు

అవినీతి మడుగులో 
పందుల వలే పొర్లుతూ దొర్లుతూ  వున్న 
అధికారులు దొరక నంత వరకూ దొరలే!

యోగ ముద్రలో దేవుడి అవతారం అని 
చీకటి ముసుగులో చేసే  రతి క్రీడలు
నిత్యానంద బాపూజీలు 

*వైద్యో నారాయణో హరి*  అన్న  వైద్య శిఖామణులు
*గురు దేవో మహేశ్వరా*  అన్న గురు దేవులు
అధికార పెత్తనం చేస్తూ  ఆఫీసుల్లో తిరిగే మృగాళ్ళు
కామంతో కన్నులు మూసుకొని
అబలల, చిన్నారుల  మానాన్ని చెరచే  రాక్షసులు

ఎదుటి వారికి చెప్పేవి శ్రీరంగ నీతులు 
దూరేవి దొమ్మర గూళ్ళు

రెండు తలకాయలు గల ఈ పెద్ద మనుషుల్ని‌ 
గుంతల్లో  పెట్టి పొగ పెట్టాలి
సమాజాన్ని జాగృత పరచాలి
ఈ నల్ల మరకల్ని కడిగెయ్యాలి.
------------------------------++++++-----

వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు

Thursday, January 24, 2019

దృష్టి కోణం

వారణాసి భానుమూర్తి రావు
శీర్షిక : దృష్టి కోణం 
-----------------------------------------


నువ్వు చూస్తున్న  ఈ ప్రపంచం 
నిత్యం  సత్య మయం

నేను చూస్తున్న ఈ ప్రపంచం
నిత్యం అసత్య మయం

నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం
మధుర మనోజ్న  మంజుల  సీమ

నేను చూస్తున్న ఈ ప్రపంచం
బాధా సర్ప ద్రష్తుల నిప్పుల కుంపటి

ఈ‌‌ ప్రపంచం  ఒక పుస్తకం
అక్కడి నుండి సువర్ణాక్షరాలు రాలి పడి
సాహిత్య పుష్పాలు విరిసాయి

ఈ ప్రపంచం ఒక  పర్వతం
అక్కడి నుండి ఎర్రని లావా ఎగిసి పడి
విప్లవ సూర్యుడ్లు వెలిగారు

ఆకాశం పురివిప్పిన 
నెమలిలా ఉంది

ఆకాశం రక్తం 
పులుముకొన్న రాక్షసిలా ఉంది

చంద్రుడు తెల్లని వెన్నెలను తాగి
నక్షత్రాలతో సరసాలుతున్నాడు

చంద్రుడు ఎర్రని రక్తాన్ని
అకాశం నిండా ఒంపుతున్నాడు.

మనిషి ఒక దేవుడే!
చూసే దృష్టి కోణాన్ని‌ బట్టే 
మంచీ చెడూ !! 
------------------------------------------------------------

Wednesday, January 9, 2019

అతను ... ఆమె .. సెక్షన్ 497

అతను ... ఆమె .. సెక్షన్ 497
-----------------------------------


''ఈమేరా నా భార్య - కోమలి '' క్రొత్తగా పెళ్లి చేసుకొన్న రాజారావు పరిచయం చేసాడు తనని  మధుకి .

'' నమస్తే '' మధు  చూశాడు ఆమె వైపు.

ప్రతి నమస్కరిస్తున్న ఆమెను చూసి  నిస్చేష్టుడై   పొయ్యాడు మధు.

అజంతా శిల్ప సుందరిలా , తీర్చి దిద్దిన   బాపు బొమ్మలా ఉందామె. తలంటు  పోసుకోందేమో గాలికి ఆమె ఉంగరాల జుట్టు ఆమె ముఖం మీద  పడి      మరింత అందాన్ని ఇస్తోంది. లేత బుగ్గల మీద పడి  దొర్లిపోతున్నాయి వంకీల్లా తిరిగిన ఆమె ఉంగరాల జుట్టు. వయసుకు తగ్గ శరీర సౌష్టవం  , పరువం తెచ్చి  పెట్టిన అందాల అవయవ సొంపులతో పసిడి బొమ్మలా కళ  కళ  లాడి పోతోంది ఆమె.

కళ్ళు గూడా ఆర్పకుండా  ఆమెనే తదేకంగా చూస్తున్న  మధును రాజారావు గమనించాడు .

'' కూర్చోరా ! ''  కుర్చీ చూపించాడు రాజారావు. వాళ్లిద్దరూ  మధు ముందున్న సోఫా లో కూర్చొన్నారు .

'' వీరే నన్న మాట మీ ప్రియ మిత్రుడు '' ఆమె నవ్వింది మధు వంక చూసి.

ట్యూబ్ లైట్ వెలుగులో    ఆమె అందాల పలు వరస తళుక్కున మెరిసి మాయమయింది .

'' అబ్బా .. ఎంత అందమైన పలు వరస.. ఎంత అందమైన నవ్వు ''

నిజంగా ఆ నవ్వులో కోటి వీణియల మృదు ,మధుర నాదం మీటినట్లు, లేత చిగురులు తిని మత్తెక్కిన కోయిలల కల కూజిత రావములు విన్నట్లు ఉంది .

'' ఉండండి .. కాఫీ తెస్తాను ''

ఆమె లోపలికి  వెళ్లి పోయింది.

'' రాజా.. నువ్వు నిజంగా అదృష్ట వంతుడివిరా ! హార్టీ  కంగ్రాట్యులేషన్స్  ఫర్ యువర్ సెలెక్షన్'' అన్నాడు మధు .

మనసులో కాస్తా ఈసుగా  ఉన్నా   కనబడ  నీయ  కుండా  అభినందించాడు మధు .

ఎంతటి విశాల హృదయుడైనా  , రాజా రావుని చూసి ఈర్ష్య  పడక తప్పదు. ఎందుకంటే రాజారావుకు , కోమలికి     ' కాకి ముక్కుకు దొండ పండు '  చందంగా ఉంటుంది .

రాజారావుకు , కోమలి తగిన భర్త   గాదని మధు అభిప్రాయం. కారణం కోమలి అప్సరసలా ఉండడం, రాజారావు  అందుకు భిన్నంగా  ఉండడమే ! రాజారావు నల్లగా, పళ్ళు ఎత్తుగా , నవ్వనంత వరకే అందంగా  ఉంటాడు. గారపట్టిన ఒక్కటి , రెండు పళ్ళు, చెల్లా చెదురుగా       ఉండే జుత్తు .

ఇలాంటి రాజు గాడికి అలాంటి అందమైన అప్సరస దొరకడమా? భగవంతుడా ఏమిటయ్యా నీ  లీల ? ఏమిటీ  విచిత్ర బంధం ?

'' అందుకే నేమో ? పెళ్లిళ్లన్నీ స్వర్గం లోనే జరుగుతాయంటారు ''

రాజారావు కంటే తనే ఏంతో అందంగా ఉంటాడు. , కాలేజీ రోజుల్లో , ఇప్పుడు ఆఫీసులో గూడా తనను శోభన్ బాబులా ఉన్నావని అంటారు. అందుకే తన అందాన్నికాపా డుకోవడం కోసం  ప్రతి రోజు  రెండు గంటలయినా శ్రమ పడాతాడు మధు .


ఆలోచనా పరంపరలతో  వేగి పోతున్నాడు మధు.
' ఏమిటా ఆలోచిస్తున్నావు ?

గతుక్కు మన్నాడు  రాజారావు పలకరింపుతో .

' ఈవిడ మీ బంధువులమ్మాయేనట్రా ? అడిగాడు మధు .

'అవునురా .. దూరపు బంధువులు'.
అంటుండగానే  ఆమె  ట్రే  లో  రెండు కాఫీ కప్పుల్తో , ఒక ప్లేట్లో  కొన్ని  బిస్కట్లతో ప్రత్యక్ష  మయింది .

'  ప్లీజ్..హావ్ ఇట్ ' అంది ఆమె  మధు వంక చూస్తూ .

'క్రొత్త పెళ్లికొడుకులా  సిగ్గు పడుతున్నారేమిటండి ' అని కిల కిల మని నవ్వుతు కాఫీ కప్పు మధు చేతికి అందించింది ఆమె.

మధు జంకుతూనే అందుకొన్నాడు కాఫీ కప్పు. ఆ తొట్రు పాటు లో  ఆమె   కొస  వ్రేళ్ళు  తన చేతికి తగిలాయి.

ఆ  తగలడంతో ఆమె  తన కేసి ఒక చిరు నవ్వు నవ్వింది .

నవ్వు- మందహాసం - చిరునవ్వు లాంటి పదాలు ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు పాఠాల్లో చదువు కొన్నా  అర్థం కాలేదు. కానీ ఆమె పెదవుల మీద అలా చిరునవ్వు దొర్లి పడుతుంటే అర్థమయింది మధుకి .

' థాంక్స్ ' అన్నాడు కాఫీ త్రాగుతూ .

'మీ ఫెండ్ పెళ్లి     అయిపొయింది గదా ! మరి మీరు  ఎప్పుడు చేసుకొంటున్నారు ? ' మళ్ళీ  కిల కిల మని నవ్వింది ఆమె.

మధు దగ్గర  జవాబు రాలేదు. ఆమె నవ్వే తన చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది .

వాడు అంతే ! ఆడవాళ్ళతో మాట్లాడాలంటే జంకు.. భయం.. సిగ్గు మా వాడికి ' అన్నాడు రాజా రావు బిగ్గరగా నవ్వుతూ .

రాజారావు  మాటలకి ఆమె మళ్ళీ  కిల కిల మని నవ్వింది..


'వస్తానురా ! టైం అయిపొయింది 'అని వాచీ  కేసి  చూసుకొంటూ పైకి లేచాడు మధు.
' మంచిది రా.. అప్పుడప్పుడు వస్తు ఉండు .. ముగ్గురం కలిసి చతుర్ముఖ పారాయణం చేస్తాం  . నెక్స్ట్ సండే  రారా !'  అన్నాడు రాజా రావు .

' తప్పకుండా రావాలి.. ' అందామె .

 ' ష్యుర్  ..  అలాగే వస్తాను. ' చిన్నపిల్లాడిలా తలూపాడు మధు .
ఆమె మళ్ళీ  నవ్వింది .

అదే నవ్వు..అదే అదే ...

--------------------------------------------------------------------------------------------------------------
 
మధుకి ఇంకా  పెళ్లి కాలేదు . ఎన్ని సంబంధాలు వస్తున్నా తనకి నచ్చిన పిల్ల దొరకడం లేదు. తాను ఒక ఊహా  సుందరిని తన హృదయంలో ప్రతిష్టిoచు      కొన్నాడు. అలాంటి పిల్ల  దొరికే వరకు తాను  పెళ్లి చేసుకో గూడదని  ప్రామిస్ చేసుకొన్నాడు. ఎలాంటి అందమైన పిల్లను  తన పేరెంట్స్  వెతికి చూపించినా  ఏదో ఒక వంకతో వద్దని కాన్సి ల్ చేస్తున్నాడు .

రాజారావు , మధు హైస్కూలు నుండి  కాలేజీ వరకు ఫ్రెండ్స్ . డిగ్రీ  అయినా తరువాత వారిద్దరి  మధ్య కాంటాక్ట్స్ బొత్తిగా  తగ్గి పొయ్యాయి. మధు   ఉద్యోగ  వేటలో హైదరాబాదు కు వెళ్లి పోయాడు . రాజారావు  నెల్లూరు లో బిజినెస్ చేస్తూ  వున్నాడు . మధు  బ్యాంకు ఎంప్లాయిగా చేరి పొయ్యాడు . కొన్ని రోజుల తరువాత మధు నెల్లూరు కి ట్రాన్సఫర్  మీద వచ్చాడు .  అది గూడా కాకతాళీయంగా  మధు వాళ్ళ  బ్యాంకులో  అకౌంట్ ఓపినింగ్  కోసమని మధు  కౌంటర్ దగ్గరకి వచ్చాడు రాజారావు.   ఇద్దరి నోట మాట రాలేదు. ఆశ్చర్యంగా  ఒక్కరి నొక్కరు చూసుకొని తరువాత విశేషాల్ని పంచుకొన్నారు  .

రాజారావుకి తన వయస్సే ! చక్క గా పెళ్లి చేసు కొని ఒక్క సంవత్సర మయ్యింది .   ఇక్కడే బిజినెస్  చేస్తూ  సెటిల్ అయ్యాడు .  వాడు  పెద్ద ఎలెక్ట్రికల్ కాంట్రాక్టర్. ఇక్కడున్న  పవర్ కంపెనీలన్నింటితోనూ   చక్కని  వ్యాపార సంబంధాలు ఉన్నాయట రాజారావుకి .  కోట్లల్లో టర్నోవర్ ఉందట వాడికి. వాడి అదృష్టం కొద్దీ వాడికి అప్సరస లాంటి  అమ్మాయి దొరికింది . మధు గూడా అల్లాంటి అమ్మాయి కోసం సంబంధాలు వెతుకుతున్నాడు గాని , ఏ అమ్మాయి అతనికి నచ్చడం లేదు .


ఇన్ని రోజుల తరువాత  తన క్లోజ్ ఫ్రెండ్ని   కలవడం మధుకి చాలా సంతోషంగా  ఉంది.

-------------------------------------------------------------------------------------------------------------------

భోంచేసి  రూమ్  లో పడుకొన్నాడన్న మాటే గాని  నిద్ర రావడం లేదు  మధుకి .
మధు ఒక్కడే  ఏకాం తంగా బెడ్ మీద పడుకొన్నాడన్న మాటే గాని రాజారావును కోమలి  ఎలా ఒప్పుకొందబ్బా  అని ఆలోచిస్తూ  వున్నాడు . ఆలోచనలు ఎక్కువయితే సిగరెట్ త్రాగడం అతని హాబీ . ఒక  సిగరెట్  వెలిగించాడు .

మనుషులు అంతా  ఒక్కటే ! ఒక్కటే తెలివి .. ఒక్కటే  జ్ఞానం. కానీ దేవుడు ఒక్కొక్క వ్యక్తికీ ఒక్కొక్క బ్రతుకును ఇస్తాడు. వారి జీవితాలు  అలా  వారికి  ఎదురయిన  అవకాశాలని బట్టి   మారిపోతూ ఉంటాయి .   వచ్చిన అవకాశాల్ని  సద్వినియోగ పరచు  కొన్న  వాడే  సక్సెస్ ఫుల్  పర్సన్  అవుతాడు . సంఘంలో పేరు ప్రతిష్టలు  వస్తాయి. అలాంటి కోవ లోకి చెందిన వాడే రాజారావు.

--------------------------------------------------------------------------------------------------------------------

ఆదివారం  రానే వచ్చింది .
ట్రిమ్ గా షేవ్ చేసుకొని నీట్ గా ఫ్రెష్ అప్ అయి , వైట్ షర్ట్  ఫుల్ హాండ్స్  బ్లాక్ పాంట్   మీద టక్ చేసుకొన్నాడు. ఇంపోర్టెడ్ పెర్ఫ్యూమ్ రాసుకొని  సినిమా హీరో లా తయారయ్యాడు .

రాజారావు ఇల్లు చేరుకొనే సరికి  ఉదయం పదుకొండు గంటలు కావస్తోంది . గోడ మీదున్న     బజర్ నొక్కాడు. తెలుపు తెరచు కొంది  .

 తలుపు తెరచిన కోమలిని చూసి నోట మాట రాక స్థాణువులా నిలచి పొయ్యాడు మధు.

తలంటు పోసుకొని చిరు గాలికి చిలిపిగా వూగిస లాడుతూ , పాల భాగం మీద నాట్యం చేస్తున్న ఆమె ముంగురులు , రోజ్  కలర్ బొట్టు , గులాబీ రంగు లిప్ స్టిక్  తో దొండ పండులా మెరుస్తున్న ఆమె అధరాలు, రోజ్ కలర్ యూ  నెక్  డిజైన్ బ్లౌజ్ ,  మాచింగ్  షిఫాన్  జార్జెట్  చీర , మృదు మధురమైన  గులాబీ పువ్వులా  విరిసినట్లున్న కోమలిని చూస్తూ అల్లాగే ఉండి  పొయ్యాడు బయట  మధు.

కోమలి నవ్వింది .. ' ఏమండి.. అలాగే ఉండి  పొయ్యారు ? ప్లీజ్ కం  ఇన్సైడ్ ' అంది .

ఊహా జగత్తులో నుండి వాస్తవ ప్రపంచంలోకి వూడి  పడ్డాడు మధు.

' రావచ్చా .. '

'భలే వారే ..రండి '

' ఇంత  సేపు మీకోసమే వెయిట్  చేశారు రాజ్ .. ఇప్పుడే వెళ్లారు ఒక పని మీద . మీరొస్తే  ఉండమన్నారు '    అంది కోమలి .

ఆమె హాల్లోకి అడుగులు వేసింది. ఆమె వెనకాలే మధు అనుసరించాడు .

 పొడుగాటి జడ , ఆ జడలో తురిమిన కనకాంబరం పూలు మదిని నివ్వెర పొయ్యేట్లు చేశాయి.

' ఇంతకీ రాజారావు ఎక్కడికి వెళ్ళాడు ? '   మధు  అడిగాడు సోఫాలో కూర్చొంటూ .

ఒక అరగంటలో వస్తానన్నారు. అయన కథ మీకు తెలుసు గదా ! ఎప్పుడు బిజి నెస్ ! ఓ క్షణం  గూడా  వృధా  చెయ్యరు. టైం  ఈజ్ మనీ  అంటారు . ఇంటి గురించి  ధ్యాసే      లేదు. ఆదివారం గూడా సరదాగా కాలక్షేపం  చెయ్యరు ' అంది కోమలి .

'
వాట్ యు వుడ్ లైక్ టు  హావ్ ? కాఫీ ఆర్ ఫ్రూట్ జ్యూస్ ?'

'అబ్బె...  నాకేం వద్దండి' .

' డోంట్  ఫీల్  షై  మధు గారు '  అని ఆమె వడి వడిగా కిచెన్ వైపు వెళ్లింది .
ఆమె పాదాలకు వేసుకొన్న గజ్జెల చప్పుడు మధు గుండెల్లో పులకింతలని రేపుతోంది .

' అబ్బా .. ఎంత అందమైన నడక ? ఎంత అందమైన నవ్వు ? ఎంత అందమైన విగ్రహం ? బ్రహ్మ ఎలా సృజియించాడు ఈమెను  ? నిజంగా కందనపు బొమ్మ. పసిడి పరువంపు పూబంతి '

ఓ  ఐదు నిముషాల్లో  జ్యూస్ గ్లాసుతో తిరిగి వచ్చింది  కోమలి.

' తీసుకోండి ' అందామె .

గ్లాసు తీసుకొంటున్నపుడు  ఆమె చేతి   వ్రేళ్ళను గమనించాడు. ఎంతో  మృదువుగా ఉన్న ఆమె  చేతి  వ్రేళ్ళు , పొడుగ్గా నాజూగ్గా కత్తరించి      ఉన్న ఆమె గోర్లు, వాటికీ అప్లై చేసిన గులాబీ రెండు నైల్ పోలిష్.

 మధు కుడి చే త్తో కొన  చేతి వ్రేళ్ళ ను  సుతారంగా తాకి   జ్యూస్ గ్లాసు    అందు కొన్నాడు. ఆ స్పృశిం చడంలో ఏదో విద్యుత్ ప్రాకి నట్లయింది. వాళ్లంతా గగుర్పాటు అయినట్లుంది.

నవ్వడానికి ప్రయత్నిస్తూ కోమలి ముఖం వైపు చూసాడు.
కోమలి ముఖంలో ఏ భావం చదువ లేక పొయ్యాడు మధు .
ఆమె తిరిగి ముందున్న కుర్చీలో కూర్చింది .
అంతలో రాజా రావు వచ్చాడు .

' ఎంత సేపయిందిరా నువ్వొచ్చి. పది గంటలే వస్తా నన్నావు  గదా ' రాజారావన్నాడు .
' అరగంట అయింది రా' రాజారావు వచ్చి తన  పక్కనే కూర్చొన్నాడు .
ఆ మాటా ఈ  మాటా మాట్లాడుకున్నారు ఇద్దరూ  .
లంచ్ తరువాత కొంతసేపు కార్డ్స్ ఆడు కొన్నారు ముగ్గురు .

' సాయంత్రం సినిమా కు వెడుతున్నాం రా ! నువ్వు వస్తావా ? ' అన్నాడు రాజారావు.

' పానకంలో పుడక  లా గా  మీ మధ్యలో నేనేందుకు గాని మీరెళ్ళండి. ' అన్నాడు మధు.

' మీ ఫ్రెండ్  మీరు లేక పొతే  సినిమా చూడలేడేమో  .. రండి నేనే మీ  అనుకోను   ' మళ్ళి     కిల కిల మని నవ్వింది కోమలి .

అదే నవ్వు తనని పిచ్చి వాణ్ణి చేస్తోంది .
ఆ కపుల్ కి బై  చెప్పేసి  బైక్ ఎక్కి స్టార్ట్ చేసి వెళ్లి పొయ్యాడు మధు.
---------------------------------------------------------------------------------------------------------------

వరూధిని ప్రవరాఖ్య  నవల చదువుతున్నాడు.  పాదాలకు పసరు రాసుకున్న  ప్రవరాఖ్యుడు తెలియకుండా హిమాలయాల్లో దారి తప్పి  పోతాడు. పాదాలకు పూసిన పసురు ఆ మంచు గడ్డల మీద నడకతో  కరిగి పోతుంది.  ఏ దిక్కు తోచని ప్రవరాఖ్యుడికి  వరూధిని పరిచయమవుతుంది.  తనతో రతి క్రీడలు జరిపమని  , గాంధర్వ  వివాహం చేసుకొమ్మని శత  విధాల ప్రయత్నిస్తుంది . పరమ నిష్టా గరిష్టుడైన  బ్రాహ్మణోత్తముడు  ప్రవరాఖ్యుడు . ఆమెకు  లోబడకండా  తన వూరికి వెళ్ళి పోతాడు.   ఇదంతా గమనిస్తున్న ఒక  గంధర్వుడు మారువేషంలో  ప్రవరాఖ్యుడిలా    వెళ్లి వరూధినితో రతి క్రీడలు జరిపాడు .  వరూధిని ప్రవరాఖ్యుడే తన  మనసు మార్చుకొని  తిరిగి వచ్చాడని  ఆనందంగా  తన తనువును , మనసును సమర్పిస్తుంది.

ఏ పురాణం చూసినా అనైతిక సంబంధాలు లేవా ? గౌతముని భార్య అహాల్యను  ఇంద్రుడు మోహించలేదా ?  రావణాసురుడు   పెళ్లయిన సీతమ్మను మోహించా లేదా ?  కుంతీ  ఎలా బిడ్డలని కన్నది ? వాయు దేవుడు , అగ్ని దేవుడు, సూర్యదేవుడు   ద్వారా ఎలా బిడ్డల్ని కన్నది ?



తను గూడా  గంధర్వుడులా మారిపోయి   కోమలిని ...అలా మోసం చెయ్య వచ్చా ?
ఛ .. ఛ..  పనికి రాని  ఆలోచనలు.  ఒక స్నేహితుడి భార్యను అలా మోసం చేయవచ్చా ?
రాత్రంతా ఆలోచిస్తూ నిద్ర పట్టక  అలాగే  కోమలిని గురించి ఆలోచిస్తూ  ఉండి  పొయ్యాడు . ఒక పాకెట్ సిగరెట్లు స్మోక్ చేసాడు రాత్రంతా.
-------------------------------------------------------------------------------------------------------


రోజులు గడిచే కొద్దీ కోమలిని చూడ లేకుండా ఉండ లేక పోతున్నాడు మధు  . కోమలి తన మనసంతా ఆక్రమించేస్తోంది.  ఏమి చేసినా  అంతా  కోమలి మీదనే ధ్యాస పోతోంది. తప్పని అంతరాత్మ  చెబుతున్నా  , మనసుకి నచ్చిన పని చేయడం తప్పు లేదని మనస్సు చెబుతోంది.

అక్కినేని పాట  ఎక్కడో వినబడుతోంది వివిధ బారతిలో .

'' భూమ్మీద  సుఖ పడితే తప్పు లేదురా ! బుల బాటం  తీర్చుకొంటే తప్పు లేదురా !'' అని . ఈ  పాటంటే  మధుకి చాలా ఇష్టం .

అవును... తప్పెంటి? మనసుకు నచ్చిన పని చేయడంలో తప్పులేదు గదా  ?

ఈ  మధ్య వచ్చిన  సుప్రిమ్  కోర్టు తీర్పు గూడా తనకి బాగా నచ్చింది. పెళ్లయిన స్త్రీ  పురుషుడి సొత్తు గాదు . ఆమె ఇష్టా ఇష్టాల బట్టి ఆమె ప్రవర్తించవచ్చు. ఇద్దరి మేజర్లు ఒకరి నొకరు  ఒప్పుకొంటే  వారు శారీర సంబంధానికి అడ్డు చెప్పే హక్కు  ఎవరికి   లేదు  '' అని  పీనల్  కోడ్  సెక్టన్ 497 రాజ్యాంగ విరుద్ధ మని  సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

లాప్టాప్ తీసి గూగుల్  లో సుప్రీం కోర్టు అడల్ట్రీ మీద సెర్చ్ చేసాడు మధు.
'
'Adultery is no longer a crime. The supreme court declared that section 497 of the Indian penal code is unconstitutional .  Husband is not  the master of a wife. ''

ఆరాత్రి  హాయిగా నిద్ర పొయ్యాడు మధు .

------------------------------------------------------------------------------------------------------------

ఒక ఆదివారం.

సినిమా హీరోలా రొమాంటిక్ గా తయారయి కోమలి  ఇంటికి వెళ్ళాడు  మధు. తనకి తెలుసు రాజారావు బిజి నెస్ ట్రిప్ మీద   సింగపూర్  వెళ్లాడని. కానీ  కోమలిని చూడకుండా ఉండ లేక పోయాడు . అందుకే ముందు ఇన్ ఫార్మ్ చెయ్యకుండా కోమలి ఇంటి ముందు ఆగి బజర్ నొక్కాడు .
ఎప్పటి లాగే కోమలి తలుపు తీసింది.

' మే ఐ కమ్ ఇన్ ? ' అన్నాడు మధు.

'  ఏమిటి ? చెప్ప పెట్టకుండా వచ్చేసారు హీరో గారు ' అంది కోమలి కిల కిల మని నవ్వుతు .

 ఆయన మీకు చెప్పలేదా ? సింగపూర్ వెళ్ళారు  . ' అంది కోమలి.
' చెప్పాడనుకొండి . రాజా లేకపోతే     రాగూడదా ? ' అని చిలిపిగా అడిగాడు మధు.
ఆబ్బె .. అదేం లేదండి ' అంది కోమలి .

కోమలి ని ముగ్గు లోకి  దింపడానికి  ఇదే సమయం అనుకొన్నాడు మధు.
'టైమ్  వేస్ట్ చేసుకోవద్దు ' అని అంటోంది మనసు.
 ' కాఫీ .. హార్లిక్స్ ''అడిగింది కోమలి

' అబ్బె ... ఏమి వద్దండి .. నా ఎదురుగా కోర్చిని  మాట్లడండి. నాకదే చాలు ' మధు అన్నాడు హేర్  స్టయిల్ సరి చేసు కొంటూ .  అతని మనసులో కోరికలు గుర్రాలవుతున్నాయి.

' నా మీద మీ అభిప్రాయం ? ' అని అడిగాడు మధు.
' మీ  కేంటండి .. యంగ్ హీరో లా ఉంటారు . యద్దనపూడి  గారి నవలా హీరో రాజా శేఖరాన్ని  మించి పొయ్యారు ' అంది కోమలి నవ్వుతూ .

 మధు కి  ధైర్యం  వచ్చింది . తన మీద మంచి అభిప్రాయం ఉందని తెలిసింది .
' మా ఆఫీసులో అందరు నన్ను రొమాంటిక్ హీరో అని పిలుస్తా రండి ' అన్నాడు మధు కోమలి కళ్ల ల్లో  కళ్ళు పెట్టి నవ్వుతూ

కోమలి  నవ్వుతూ ' బలే వారే'  అని అంది.

ఇంకొంచెం పర్సనల్ అడగాలనుకొన్నాడు .

 ''మరి మీరు ఇంత  బ్యూటిఫుల్  ఉంటారు కదా ? ఆ రాజారావు ఎలా  నచ్చాడు మీకు ?  పర్సనల్ విషయాన్ని అడిగాననుకోకండి '  అన్నాడు మధు.

కోమలి జవాబు ఇవ్వలేదు. ముభావంగా ఉంది .

 ' చాలా తల నొప్పిగా ఉంది. కోమలి .. రాత్రంతా నిద్ర పోలేదు .. నేను వస్తా.. ' అని అన్నాడు  మధు

' ఉండండి .  మెడిసిన్ తెస్తాను. టాబ్లేట్ వేసుకొంటారా ? ''

' జండూ బామ్. అమృ తాంజన్ ఉంటే  ఇవ్వండి . చాలు . ' అన్నాడు మధు   .

 హడావుడిగా   సోఫా లో  లేచిన కోమలి  పయ్యెద సర్రున క్రిందకు  జారి  పోయింది.
బల మైన ఆమె స్తన ద్వయం , ఆ మధ్యలో  రెండు పర్వతాల మధ్య  లోయలాంటి  ఇరుకైన గాడిని చూసి మధు మతి చలించినట్లయింది.

' అబ్బా .. ఎంత అందమైన వక్ష  స్థలం ? ఆ వక్షస్థలం లో  తాను ఒక మల్లె  పూవు లా ఇరుక్కుపోతే ఎంత బాగుంటుందో ! ' అనుకొన్నాడు మధు .

తటుక్కున జారిపోయిన పైటను సర్దుకొని హాల్లోకి వీలు మెడికల్ కిట్ తెచ్చి ఇచ్చింది కోమలి .

' నా జబ్బుకు మీదగ్గ ర మందు ఉందా ' అని నవ్వుతు నర్మ గర్భంగా  అడిగాడు మధు .

' ఉండండి .. ఒక్క క్షణంలో కాఫీ తెస్తాను ' అని కిచెన్ లోకి వెళ్ళింది కోమలి .

ఆమె వెళ్లిన వైపే చూస్తున్నాడు మధు
.
ఆలోచనలతో సత మతమై పోతున్నాడు. హార్ట్ బీ ట్ బలంగా కొట్టు  కొంటోంది. చేసే తప్పుడు  ఆలోచన వల్ల  వళ్లంతా షివరింగు వచ్చినట్లయింది. అయినా గుండె బిగువుతో ఊపిరి బలంగా తీసుకోని లేని శక్తిని కూడా గొట్టుకొంటున్నాడు.

' ఈ  రోజు ఎదో ఒక్కటి జరగాలి. కోమలి ని ఎలాగైనా తన వైపుకు తిప్పు కోవాలి . కోమలి ని వశీకరణం చేసుకోవాలి అని అనుకొన్నాడు మధు .

ఎదలో జరిగే ఈ  ఆరాటాన్ని ఎలా చెప్పాలో , ఎలా  సంభాషణ మొదలు పెట్టాలో తెలియక తిక మక పడుతున్నాడు .

కోమలికి  గూడా  తనంటే చాలా ఇష్టం అని ఎన్నో సార్లు ఆమె చర్యల ద్వారా తెలుసు కొన్నాడు . తన ప్రేమను ఏ  ఆడదీ  బహిరంగంగా చెప్పుకోలేదు . ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని అందుకే పెద్ద వాళ్ళన్నారు.  ఆడదాని హృదయం అగాధం అని గూడా అన్నారు.

కోమలి ని ఈ  రోజు నోరు తెరచి అడిగెయ్యాలి  అని అనుకొన్నాడు మధు.

కోమలి కాఫీ తో ప్రత్యక్ష మయింది.

.
' థాంక్స్ ' అన్నాడు మధు

' మీ లాంటి అప్సరస కోసం నా లైఫ్  పార్ట్నర్ గా ఐదేళ్ల  నుండీ  నేను వెతుకుతూనే ఉన్నాను. నాకు దొరకడం లేదు. ఏమైనా రాజారావు చాలా అదృష్ట వంతుడు ' అన్నాడు మధు.

 ' ఉహు ' కోమలి ఏమి మాట్లాడంలేదు .

కాఫీ గ్లాసు తీసుకోని కిచెన్ లోకి  తిరిగింది  కోమలి.

' కో--- మ---- లీ  '

మొట్ట మొదటి సారిగా ఏక వచన  ప్రయోగానికి ఆశ్చ్య ర్య పోయింది కోమలి

''కోమలి.. నీ  ..నీతో ఒక విషయం మాట్లాడాలి . వస్తావా ?'

కోమలి ముఖంలో రంగులు మారాయి.

' అందమైన వాళ్ళంటే  నాకు  చాలా ఇష్టం . మరీ  నిన్ను  చూసినప్పటి నుండి నాకు ఎన్నో జన్మల నుండి నిన్ను చూసి నట్లుంది . నా  కెందుకో నిన్ను  చూడకుండా ఉండ లేక   పోతున్నాను  '
 అన్నాడు మధు . మాటలు తడ  బడు  తున్నాయి. నోటిలో  తడి ఆరి పోతోంది.

' ఈ  మధ్య సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది అడల్ట్రీ  మీద . మీరు చదివారా ?  మధు శత  విధాలా ప్రయత్నిస్తు న్నాడు  కోమలిని ముగ్గు లోకి దించ  డానికి.

కోమలి 'యెస్'  అంటే తన కౌగిలి లోకి తీసుకోని  ప్రేమ సామ్రాజ్యంలో ముంచెత్తాలి అని మనసులో అనుకొన్నాడు మధు.

ఉన్నట్లుండి కోమలి చెయ్యి పట్టుకొని ' ఐ లవ్ యు  కోమలి ' అని అన్నాడు  మధు.

ఈ  అసంకిల్పిత  చర్య కి బొమ్మలా నిలిచి ఉండి  పోయింది కోమలి. ఏం  చెయ్యాలో పాలు పోవడం లేదు.

మధు గట్టిగా తన కేసి హాగ్  చేసు  కొంటున్నాడు. అతని బిగి కండరాలు  తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఒక్క ఉదుటున  విడిపించికోని  మధు చెంప  మీద చెళ్ళున వాయించింది కోమలి .

' ఐ థింక్ యు అర్ అన్  ఇడియట్ ' ఉగ్ర కాళికలా  అరిచింది కోమలి .

 ' రాజారావు నాకు దేవుడు. ఎన్ని సుప్రీం కోర్టులు తీర్పులు ఇచ్చినా  భారతీయ  స్త్రీ మనస్తత్వం మారదు . అగ్ని  సాక్షిగా  వివాహం చేసుకొన్న రాజారావు నాకు దేవుడు. హిందూ వివాహం ప్రకారం ఏడడుగులు వేసి, వేదోక్త ప్రకారం నా మెడలో  మంగళ సూత్రం కట్టి  ఒక్క జంట  గా మారిన  మా ది జన్మ జన్మల బంధం . అది విడదీయ రాని  సంభంధం . మధు నువ్వు నీ  ఫ్రెండ్ కి చేయరాని ద్రోహం తల పెట్టావు. ఐ  కాంట్  పార్దన్  యూ ' అన్నది కోమలి ఏడుస్తూ .

' రాజారావు నీకు నచ్చాడా ?'

' మధు..వెర్రి ప్రశ్న  వెయ్యకు. రాజారావు నాకు దేవుడు. తల్లి తండ్రి లేని నన్ను ఒక అనాధ  శరణాలయంలో చూసి  పెళ్లి  చేసుకొన్నాడు. ఆయనకు  కుల మత పట్టింపులు లేవు . డౌరీ  అన్న అసహ్యం  . అతనికి కావసినది అతడిని అర్థం చేసుకొనే ఒక ఇల్లాలు . అలాంటి  మా ఆయన  నాకు దేవుడే ! . నీ  లాంటి పోకిరి గాళ్ళు ఎంత మంది చెప్పినా మా వివాహ బంధాన్ని ఏమి  బ్రేక్ చెయ్యలేవు ' అంది  కోమలి.
'

కోమలి ... ఒక్క సారి ఆలోచించు ప్లీజ్'

''ఐ సే యు గెట్ అవుట్ అఫ్ ది హౌస్ . ఇంకో క్షణం  ఇక్కడ ఉన్నావంటే  పోలీసు వాళ్లకి కంప్లైంట్ ఇస్తాను '' అపర రుద్ర కాళిలా  గర్జించింది కోమలి.

మధు ఒక్క ఉదుటున లేచి బయటకు పరుగెత్తాడు .

--------------------------------------------------------------------------------------------------------
వారణాసి  భానుమూర్తి  రావు
హైదరాబాదు

-------------------------------------------------------------------------------------------------------

       
( ఈ  కథ ఎవ్వరిని  ఉద్దేశించి రాసినది గాదు . ఇందులోని  పాత్రలు , పేర్లు , పరిసరాలు , సంఘటనలు కేవలం కల్పితం.  ఈ  కథ కేవలం  కల్పితం  )