Monday, September 21, 2015

అసలు నువ్వెవరు ?


అసలు నువ్వెవరు  ?


నేనామెకు మొదటి నుండి  చెబుతూనే ఉన్నాను
ఆమె నవ్వుల  పువ్వుల్ని  నా మొహం మీద  విసిరి వేయ వద్దని
అవి నా ఎదలో  అగ్ని పర్వతాల్ని  ఎగదోస్తాయని

ఆమె కట్టుకొన్న పరికిణి లోని  అందాలన్నీ
 సీతా కోక చిలుకలై  నా మీద  వాలి
నన్ను ఆమె తోట లోకి తీసుకెడతాయి

ఆమె  వయ్యారంగా  నడుస్తున్నపుడు
వేలాది  ఫ్లెమింగో  పక్షులు   ఆమె వెంట నడిచేవి

ఆమె  ఒక్క సారి  నవ్వితే
శశి రంలో రాలిన పువ్వులన్నీ
కొమ్మల  వైపు  వెళ్లి  మళ్లి చిగురిస్తాయి
ఆమె వున్న చోట వసంతం ఒక్క సారి ఆలోచిస్తుంది  రావాలా వద్దా అని

నేనామెకు మొదటి నుండి  చెబుతూనే ఉన్నాను
రోమన్ దేవత  వీనస్  గురించి  విన్నానే  గాని
నిన్ను చూసాకే  అర్థమయింది  వీనస్  దేవత  ఇలానే ఉంటుందని

నీతో  వెంట నడుస్తున్నపుడు
నీ  వెంట అజంతా ఎల్లోరా కుడ్యాలు పేలవంగా నడవడం చూసి
ఆశ్చర్య పోయాను
అవును .. రవి వర్మ  కళల సౌదమినివి నువ్వు

ప్రతి రోజు స్వప్నం లో  సాక్షాత్కారిస్తున్నావు  నువ్వు
అసలు నువ్వెవరు  ?













 

Friday, August 21, 2015

నాకు నేనే !


నాకు నేనే !
-----------------------------------------------

నాకు నేనే ఆకునై  , హరితమై , కొమ్మనై , చెట్టునై
నాకే నేనే  కోయిలనై , పాటనై , పల్లవినై , వసంతమై
నాకు నేనే  ఏరునై , నదినై , ప్రవాహమై , సముద్రమై
నాకు నేనే  ఆకాశమై ,  నక్షత్రమై , నీలమై , శూన్యమై
నాకు నేనే  అనంతమై , ఆదినై , అంతమై , అకాలమై

నా ఉనికి  ప్రభంజనమై
నా  నడక  ప్రస్తానమై
నా నడత  సంభ్రతమై
నా  కవిత  ప్రభాతమై

నాకు నేనే 
ప్రభ వించి , అస్తమించి
నాకు  నేనే 
స్ఖలించి  , సంగమించి
 నాకు నేనే
జనించి , జ్వలించి
నాకు నేనే
వెలుగునై , చీకటినై
నాకు నేనే 
దృశ్యమై , అదృశ్యమై
నాకు నేనే
శి లనై , శిలాజమై
నాకు నేనే
కాలమై , కాలాంతమై
నాకే నేనే
ప్రశ్ననై , జవాబునై  .....



భాను వారణాసి  / 21.08. 2015

 

Sunday, June 28, 2015

అమెరికాలో గ్రంధాలయాలు

 అమెరికాలో  గ్రంధాలయాలు
-------------------------------

అమెరిక మన కన్నా ఒక వంద సంవత్సరాలు  ముందు ఉన్నదనే దానికి  అక్కడి library  ల నిర్వహణ  ఒక ఉదాహరణా గా  చెప్పుకోవచ్చు  .  ఇక్కడ  library  లు అంతా  సిస్టం తోనే ఆపరేషన్  చెస్తారు. పుస్తాకాలు ఫిక్షన్ అని  నాన్  ఫిక్షన్ అని  , క్లాసిక్  అని  విభజిస్తారు.  ప్రతి పుస్తకానికి ఒక bar  code స్టికర్  అతికిస్తారు. ప్రతి బుక్ ఒక 7 డిజిట్  number ఉంటుంది .
ఫ్క్లాష్ స్కాన్  సిస్టం  ( flash  scan  system )  ద్వారా మనం తీసుకొనే పుస్తాకల్లు స్కాన్ చేసి  direct  గా ఎవరి ప్రమేయం  లేకుండా  40  పుస్తకాల వరకు తీసుకెళ్ల వచ్చు .  ఈ  40 పుస్తకాల్లో  DVD , CD  లు లాంటివి  గుడా  తిసుకొవచ్చు.  పెనాల్టీ  లేకుండా  20  రోజుల వరకు పుస్తకాలు మన  దగ్గర పెట్టుకొని  తిరిగి ఇవ్వాలి. అక్కడ బుక్స్ రిటర్న్ అనే కౌంటర్ లో ఇస్తే అవి మన account  స్కాన్  చెయ్యబడి  returned   అని entry  వేసుకోంటాయి . ప్రతి ఒక్కరు ముందుగా సరి అయిన ధ్రువ పత్రాలు సమర్పించి ఒక  స్కాన్  కార్డు  మన పేరుతొ  తీసుకొవచ్చు. చిల్ద్రేన్  కి seperate  section  ఉంది . అక్కడ పిల్లలు  డ్రాయింగ్ , painting  లాంటి  వి  చేస్తూ  ఉంటారు . పది వేల  పుస్తకాలతో , ప్రపంచం లోని  ముఖ్య మైన  బాషలలో  పుస్తకాలు దొరుకుతాయి.  ఇన్ని  సేవలు  మనకి ఫ్రీ  గానే  ఇస్తారు .  లేట్ గా  books  submit  చేస్తే ,  పెనాల్టీ కట్టాల్సి  వస్తుంది . మరి మన లాంటి వాళ్ళకి  కాల క్షేపం  పుస్తకాలే గదా !

Bhanu varanasi
 

Saturday, June 27, 2015

పుష్పించిన మనిషి


పుష్పించిన  మనిషి
------------------------------------------------

కొందరు మనుషులు  ఎడారుల్లో  పెరిగే
బ్రహ్మ  జెముడు  చెట్లల్లా  ఉంటారు
కొందరు  మనుషులు  రోడ్ల పక్కనే
పెరిగే  తుమ్మ  చెట్లల్లా  ఉంటారు
కొందరు  మనుషులు  ఉద్యానవనంలో
పెరిగే  మొగిలి  పూవుల్లా  ఉంటారు
కొందరు  మనుషులు   మన  ఇంట్లో పెరిగే
మల్లె పూవుల్లా  ఉంటారు

ఎందుకో మరి కొందరు
మనుషులను   దూరాలతో  కొలత బెడతారు
ఆ మనిషి  ముఖంలో
ఏ  ఋతువూ   విప్పారదు   సరి గదా
మోడు  వారినట్లు  జీవం  లేనట్లు  ఉంటుంది

కొందరు ఒక్క ఆలింగనం  తోనే
మమతలని  ఇచ్చి పుచ్చు కొంటారు
కొందరు  కోన  చూపు తోనే
ప్రేమ  వర్షాల్ని  కురిపిస్తారు

కొందరు  మాట్లాడుతుంటే
అనురాగ  చలమలు  ఊరుతుంటాయి
కొందరు   నవ్వుతుంటే
మమతల  సరోవరాలు   నిండి పోతాయి

మనసు నిండా పలకరిస్తే   పొయ్యే దేముంది
కొన్ని  మాటల  ఖర్చు తప్ప
గుండెను  గుండెతో పలకరిస్తే  పొయ్యే దేముంది
కొన్ని  క్షణాల  త్యాగం తప్ప

మనిషి మొగ్గ తొడగాలి
మనిషి పుష్పించాలి

మనిషి మనిషితో  మాట్లాడని వాడు
అసలు  మనిషేట్టా అవుతాడు ?

 27. 06. 2015
వారణాసి  భాను మూర్తి  రావు

 ( PUBLISHED IN SAARANGA WEB MAGAZINE ON 04.06.2015 EDITION)

Saturday, May 30, 2015

మట్టి వేదం


  మట్టి వేదం
----------------------------------
మట్టి లోనే పుడతావు
మట్టి లోనే పెరుగు తావు
ఎవరినో  అమ్మా అంటావు
ఎవరినో  నాన్నా అంటావు
ఎవరో నీకు  అన్నా చెల్లి అవుతారు
ఎవరినో  పెళ్లి చేసు కొంటావు
ఆమెవరో నీకు అంతవరకూ  తెలియదు
అయినా జీవితాంతం ఆమెతో  బ్రతుకుతావు
ఎవరినో కంటావు
వాళ్ళ కోసం  నానా యాతన పడుతావు
వాళ్ళే  జీవిత సర్వస్వం అనుకొంటావు
నా అనుకోన్న  వాళ్ళు గూడా నీకు దూరం అవుతారు
నిన్ను నమ్ముకొన్న నీ  ఇల్లాలు నిన్ను వదలి శాశ్వితంగా  వెళ్లి పోతుంది
అపుడు నీది  ఒంటరి బ్రతుకు అవుతోంది
అపుడు  నువ్వు శూన్యంతో సహా జీవనం చేస్తావు
జీవన సత్యాలు  అపుడు నీకు గోచర మవుతాయి
అపుడు అనుకొంటావు  నువ్వు ...
మరణం సత్య మని ...!
మరణం నిత్య మని ...!
మట్టి కోసం నీ మనో నేత్రం  తెరచు  కొంటుంది
మట్టి  దైవత్వ మని
మట్టి పవిత్ర మని
మట్టి బంధ మని
మట్టి అనుబంధ  మని
మట్టి జీవిత మని
మట్టి  బ్రతుకు అని
మట్టి రాగ మని
మట్టి అనురాగ మని
మట్టి లో పుట్టావని
మట్టి లోనే నిర్యాణ మని !!


వారణాసి భాను మూర్తి
31.. 5. 2015

Friday, May 15, 2015

లంచావతారం అను ఒక శత సహస్రావతారం !

లంచావతారం  అను ఒక  శత సహస్రావతారం !
---------------------------------------------------------
ఇన్సులిన్ సూదులు  గుచ్చుకొంటూ
బి పి  , షుగర్    మాత్రలు   మింగుకొంటూ
ఉబ్బసాలు , శ్వాస కొస  వ్యాధులు  శక్తిని  హరిస్తుంటే
డిప్రెషన్  సైతాను   సతాయిస్తుంటే
బతుకు బండిని  లాగ లేక 
చస్తూ బతుకుతూ
బతుకుతూ  చస్తూ
నిర్జీవమైన   జీవితాన్ని గదుపుతున్న  ఓ అధికారీ !
కోట్లు కూడబెట్టావు
లంచాలు మరిగి   విల్లాలు , ప్లాట్లు , అపార్ట్మెంట్లు ,  ఫారం లాండ్లు
ఇల్లంతా  వజ్ర వైడుర్యాలు  పొదిగిన   అలంకరణలు
నీ ఆస్తుల  జాబితా  వెల కట్ట లేనిది
బంగారు కంచాల్లొ  భోంచేసిన  అదృష్ట  జాతకుడివి నువ్వు
అప్పనంగా వచ్చిన  లక్ష్మిని   నీ  ఇంట్లో  చూసి మురిసిపోయావు
ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని  , అధికారంతో , అహంకారంతో
అందల మెక్కావు !
అమాయకుల రక్తం పిండి  లంచాల్ని తిన్నావు
గాని ఓ అధికారి !
చివరకు ఏమయింది ?
బ్రెస్ట్  కాన్సర్   తో  నీ  శ్రీమతి  నలబై ఏటనే  చని  పోయింది
వయసోచ్చి న నీ  కూతురు  నీ  కారు  డ్రైవర్  తో  లేచి పోయింది
రాజ కుమారుడి లా  పెరిగిన  నీ  కొడుకు  కార్ రేస్ అని  ఔటర్ రింగ్ రోడ్డు
ఆక్సిడెంట్  లో  మరణించాడు
ఇపుడు  నువ్వు ఏకాకివి
కోట్లు ఉన్నా  కడుపు నిండా  తిన లేని వాడివి
ఈ   విశ్రాంత  దశలో  నువ్వు అవిశ్రాంతంగా  నరక యాతన  పడుతున్నావు
గాని ఒక్క సూత్రం  గుర్తు  పెట్టుకో
లంచాన్ని  రక్షించు
ఆ లంచం నిన్ను శిక్షి స్తుంది !
ధర్మాన్ని  రక్షించు
ఆ ధర్మం  నిన్ను కాపాడుతుంది !!




భాను వారణాసి
15.05. 2015




 

Monday, May 11, 2015

ఆ కిటికీ

 ఆ కిటికీ
---------------------


ఆ కిటికీ
నా  కంటికి  కునుకు   రానియ్యడం లేదు
 కిర్రు మని  శబ్దం  చేస్తున్నపుడల్లా
నా గుండె  వేగంగా  కొట్టు  కొంటోంది

ఆ కిటికీ  తెరచు  కొంటె చాలు
నాలో  నవ నాడులు  ఉద్రిక్తమయినట్లు  అన్పిస్తుంది

ఆ కిటికీ ప్రతి రోజు  కొత్తగా అన్పిస్తుంది
కొన్ని గంటల్లో  వైకుంఠ  ద్వారాలు  తెరు స్తున్నట్లుగా  అన్పిస్తుంది
ఆ కిటికీ  తలుపులు  తెరచి నప్పుడల్లా !

ఆ కిటికీ నా బ్రతుకుని  శాసించ  నట్లే ఉంటుంది
కిటికీ లోంచి ఆమె ముఖారవిందం  ఒక్కసారయినా చూడందే  నాకు
బ్రతుకు  లేనట్లు అన్పిస్తుంది

ఆమె ఒకసారి కిటికీ తలుపులు తెరచి
సుందర సుమనోహర  కళ్ళతో  పలకరిస్తే చాలు
నా హ్రదయం  అమృత మథనం  లో  క్రొంగొత్త  జీవితాన్ని అవిష్కరింప జేస్తుంది

ఆమె ఎవరో ?
ఇది ఏ  నాటి అనుబంధమో ??
ఆమె నవ్వే  నన్ను  ఆశల  చిగురులు  వేయిస్తోంది

ఒక్క  రోజు
ఆమె కిటికీ తలుపుల్ని  శాశ్వితంగా  మూసి వేసింది
ఆమె ఇంటి ముందర   నాదస్వరాలు , మామిడి తోరణాలు , వేద మంత్రాలు

నా హృదయం  ముక్క చెక్కలయి పోయింది
ప్రేమించడం గాదు
ప్రేమించబడడం  గొప్ప అదృష్టం

అలాంటి ప్రేమను పొందే వాళ్ళే   గొప్ప అదృష్ట వంతులు
కిటికీ  నిర్వికారంగా  నా వైపే చూసి  నవ్వు తోంది !!