Saturday, June 27, 2015

పుష్పించిన మనిషి


పుష్పించిన  మనిషి
------------------------------------------------

కొందరు మనుషులు  ఎడారుల్లో  పెరిగే
బ్రహ్మ  జెముడు  చెట్లల్లా  ఉంటారు
కొందరు  మనుషులు  రోడ్ల పక్కనే
పెరిగే  తుమ్మ  చెట్లల్లా  ఉంటారు
కొందరు  మనుషులు  ఉద్యానవనంలో
పెరిగే  మొగిలి  పూవుల్లా  ఉంటారు
కొందరు  మనుషులు   మన  ఇంట్లో పెరిగే
మల్లె పూవుల్లా  ఉంటారు

ఎందుకో మరి కొందరు
మనుషులను   దూరాలతో  కొలత బెడతారు
ఆ మనిషి  ముఖంలో
ఏ  ఋతువూ   విప్పారదు   సరి గదా
మోడు  వారినట్లు  జీవం  లేనట్లు  ఉంటుంది

కొందరు ఒక్క ఆలింగనం  తోనే
మమతలని  ఇచ్చి పుచ్చు కొంటారు
కొందరు  కోన  చూపు తోనే
ప్రేమ  వర్షాల్ని  కురిపిస్తారు

కొందరు  మాట్లాడుతుంటే
అనురాగ  చలమలు  ఊరుతుంటాయి
కొందరు   నవ్వుతుంటే
మమతల  సరోవరాలు   నిండి పోతాయి

మనసు నిండా పలకరిస్తే   పొయ్యే దేముంది
కొన్ని  మాటల  ఖర్చు తప్ప
గుండెను  గుండెతో పలకరిస్తే  పొయ్యే దేముంది
కొన్ని  క్షణాల  త్యాగం తప్ప

మనిషి మొగ్గ తొడగాలి
మనిషి పుష్పించాలి

మనిషి మనిషితో  మాట్లాడని వాడు
అసలు  మనిషేట్టా అవుతాడు ?

 27. 06. 2015
వారణాసి  భాను మూర్తి  రావు

 ( PUBLISHED IN SAARANGA WEB MAGAZINE ON 04.06.2015 EDITION)

No comments:

Post a Comment