Sunday, May 24, 2020

నేను సైతం

నేను సైతం
-----------------------
అమ్మ గారూ అంటూ పొద్దున్నే
తలుపు తట్టే మా పనమ్మాయి
ఎక్కడుందో?
కొన్ని అన్నం మెతుకులయినా
కొన్ని రొట్టెలయినా
తను కడుపు మాడ్చి
పిల్లల కడుపు నింపటం కోసం
తల్లి పక్షిలా తెచ్చుకొన్న సంచీలో
నింపుకొంటున్న ఆమె ఇప్పుడెట్లుందో?
నిద్ర పోతున్న లోకాన్ని
తట్టి లేపుతూ ప్రపంచాన్ని చూపించే
మా పేపరబ్బాయి ఎక్కడున్నాడో?
పాల పాకెట్లు  ఇంటిముందర
వదలి వెళ్ళే పాలబ్బాయి ఎక్కడున్నాడో?
చెత్తమ్మా అంటూ  చెత్తను
మునిసి పాలిటీ బండికి
ఎక్కించే చెత్తబ్బాయి ఏమయ్యాడో?
రోజూ వారి పనులు మానేసి
ఖాళీ కడుపులతో ఇంటికే
పరిమితమై పోయిన శ్రమ జీవుల
నిశ్శబ్ధ ఆర్తనాదాలు ఇంటి గోడలకే
వినబడుతున్నాయి
ఇంకెన్నాళ్ళీ గృహ నిర్బంధం?
ఇంకెన్నాళ్ళీ  స్వీయ నియంత్రణ?
రెక్కాడితే గానీ డొక్కాడని
బ్రతుకుల్లో ధ్యైర్యాన్ని నింపేదెవ్వరు?
ఆకలి మటల్ని చల్లార్చే
ఆపన్న హస్తం ఎవరివ్వ గలరు?
ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న
ఈ కరోనా మహమ్మారిని తరిమేదెవ్వరు?
ఖచ్చితంగా నేను సైతం ఒక మనిషిగా జీవిస్తాను
పని చెయ్యక పోయినా
వారి ఖాతాలకు నెల జీతం పంపిస్తాను
మన కోసం పని చేసే శ్రమ జీవుల్ని ఆదు కొంటాను
వీలయితే నేనూ ఒక  ఆపన్న హస్తాన్ని అందిస్తాను!
వారి బ్రతుకుల్లో ఆనంద జ్యోతుల్ని వెలిగిస్తాను! !

వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు

PUBLISHED IN PRAJA SAKTI VIJAYAWADA ON 15.04.2020








Wednesday, May 20, 2020

లాక్ డౌన్

లాక్ డౌన్
-----------------------;
బ్రతుకు మీద ఆశ మెల్ల మెల్లగా సన్న గిల్లుతోంది
బ్రతుకు  నిప్పుల కుంపటి లా  చురుక్కు మంటోంది
ఆకాశంలో రంగురంగుల హరి విల్లును చూడ లేకపోతున్నందుకు
భూమి పచ్చదనాన్ని తనివి తీరా పలకరించ లేక పోతున్నప్పుడు
సమూహాల్లోంచి బయటకు నన్ను విసిరి వేసి నప్పుడు
నేను ఏదో విలువైన జీవితాన్ని కోల్పొయ్యాననిపిస్తోంది
ఇంటిలో కూర్చొని కిటికీ ఊచల్ని లెక్క పెడుతున్నపుడు
నేనొక నేరస్థుడిగా హౌస్ అరెస్టు అయినప్పుడు
నా అయిన వాళ్ళతోనే  నేను దూరాన్ని పాటిస్తున్నప్పుడు
నేనేమి కోల్పొయ్యానో నా కర్థం అయింది.
చేతుల కంటుకొన్న క్రిముల్ని వదల గొడుతున్నప్పుడు
పాల పాకెట్ల మీద తిష్ట వేసిన సూక్ష్మ జీవిని డెట్టాల్ తో తోముతున్నప్పుడు
కూరగాయల్ని సబ్బు నీళ్ళల్లో నాన బెడుతున్నప్పుడు
ప్రకృతి నా కేదో గుణ పాఠం నేర్పిసుందన్నట్లనిపిస్తోంది
మనిషిని చూసి భయ పడే రోజు
లిఫ్టు బటన్లను చూసి జడుసు కొనేరోజు
డోరు  హాండిళ్ళను చూసి డీలా పడే రోజు
చంద్ర మండలం మీద అడుగు పెట్టి విర్ర వీగినమనిషి
ఒక చిన్న సూక్ష్మ జీవి  కరోనాకు తల వంచాల్సి వస్తోంది
ప్రకృతి    మనిషికి గుణ పాఠాలు నేర్పిస్తోంది
లాక్ డౌన్ పీరియడ్  మనిషి మూలాల్ని చూపిస్తోంది
ప్రకృతి మనల్ని అరెస్టు చేసి ఇంట్లో బంధించింది
మనిషి జీవితం  ప్రస్థుతం  లాక్ డౌన్లో ఉంది.



Vaaranaasi

Sunday, May 17, 2020

దీప కాంతి

దీప కాంతి
-----++++++----------
 దేవతలు నిజంగా ఆశ్చర్య పొయ్యారేమో?
నిన్న ప్రజ్వరిల్లిన దీప కాంతికి
నక్షత్రాలు వెల వెల బొయ్యాయి
ఆకాశం ముద్ద మందార మయ్యింది

అఖండ భారతం ఒక్కటై
కరోనా భూతాన్ని  తరిమి వేసిన దృశ్యం
దీప కాంతులు నిండిన ఈ దేశం
సంకల్ప బలం కరోనా రాక్షసిని ఓడించడమే!

మానవ సంకల్పానికి
దైవత్వపు ఆశీస్సులు తోడయితే
మనదేగా విజయం?

నూట ముప్పై కోట్ల భారతీయుల
హృదయ ఘోష  మిన్ను ముట్టింది
కరుణ లేని కరోనాకు భయం కలిగింది!

చైనా గోడలు దూకి  ప్రపంచాన్ని అంతం చెయ్యాలనుకొన్నావేమో !
వూహ కందనంతగా వూహాన్ నగరాన్ని దాటి
మారణ హోమాన్ని సాగిద్దామనుకొన్నావేమో?

కరోనా... నువ్వు భరత జాతిని
తక్కువగా అంచనా వేస్తున్నావు!
మా స్వయం నియంత్రణ తో
నిన్ను నియంత్రిస్తాం!

శుభ్రత పాటించి నిన్ను
అంత మొందిస్తాం!
సామాజిక దూరాన్ని పాటించి
నిన్ను ఆమడ దూరం పెడతాం!
ప్రజలంతా ఏకమై
నిన్ను‌ నిర్మూలి స్తాం!


On 05.04.2020, our Prime minister asked Indians to lit 9 lamps at 9 pm to drive sway carona monster.This poem dedicated to all one billian Indians.



వైరస్ లేని సమాజం!

వైరస్ లేని సమాజం!
------------------------------------------
కరోనా భయం
 కళ్ళల్లో కనబడినా
చావు భయం మాత్రం
ముఖంలో ప్రస్పుట మవుతోంది 
మనుషుల్ని  భౌతికంగా
విడదీసిన కరోనా
 మనసుల్ని దగ్గర చేసింది         
కరోనా యుద్ధానికి
ప్రపంచ మంతా  బలి అయినా
ఖండాంతరాల్ని కలిపింది           
అణ్యాయుధాలు వదలకున్నా
కరోనా మనిషి జాతి మీద
జీవాయుధాల్ని పంపించింది
మనిషి పుట్టుక
 ఏ దేశం లో నయినా
చావు మాత్రం అందరిదీ అయ్యింది
మానవ జాతి‌ మనుగడకు
ప్రమాద ఘంటికలు  మ్రోగించిన కరోనా
జాతి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తోంది 
చైనాలో పుట్టిన కరోనా
అగ్ర రాజ్యాల వెన్నులో
వణుకు పుట్టిస్తోంది                     
బాల్కనీల నుండి చావు కేకలు
వీధుల్లో పారాడుతున్నాయి
నిరంతరం ప్రవహించే జన ప్రవాహం
మంచు నయాగారా జలపాతంలా
 స్థంభించి పోయింది                       
గాలికి పెట్టిన దీపాల్లా
మనుషుల  ప్రాణాలు
గాల్లో కలిసి పోతున్నాయి             
కరోనా నేర్పించింది ప్రపంచానికి
ఒక ఉన్నత సంప్రదాయం
కరచాలనం వద్దు
నమస్తే ముద్దు
ఆలింగనాలు‌ వద్దు
ఆరడుగుల దూరం కద్దు
బయట తిరుగుళ్ళు మాను
ఇంటి వరకే  వుంటే
 నీ బ్రతుకు పదిల మౌను
చేతులు కడుక్కొనే వైనం
చెబుతుంది నీ ఆరోగ్య నియమం!
పాటిస్తే స్వచ్చ స్వయం ఆరోగ్య సూత్రాలు
చూస్తావు నిండు నూరేళ్ళు బ్రతుకు సిత్రాలు !
జాతి మొత్తం ఏకమై
కరోనా భూతాన్ని  తరిమేద్దాం !
స్వచ్చ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ
వైరస్ లేని సమాజాన్ని నిర్మిద్దాం !!

Friday, May 15, 2020

కరోనా లేని రేపటి ఉదయం

కరోనా లేని రేపటి ఉదయం
-------------------------------------------
ఈ రోజు  నిన్నటి లాగా ఉండదు
ప్రపంచమంతా నిశ్శబ్ధం ఆవరించిన వేళ
రేపు  ఈ రోజులా  ఉండక పోవచ్చు
సమస్త మానవాళికి కరోనా నేర్పించిన గుణ పాఠం
కథలు కథలు గా చెప్పుకొంటారు రేపటి తరం వారు
మరణం అంచుల దాకా వెళ్ళిన వాడికి తెలుస్తుంది
జీవితపు విలువ
నవ్వుల పూలను నలిపి వేసి బంధాలను విరగ్గొట్టి
ఇలాగే బతకాలేమో అని అనుకొన్న వాళ్ళం ఇన్నాళ్ళూ !
డబ్బు కాగితాల పూల కోసం అర్రులు చాచి పరుగెత్తాం!
నాలుగు గోడల  మధ్య సమాధులు‌ కట్టుకొన్నాం ఇన్నాళ్ళూ !
మానవ సంబంధాలను  ఆర్థిక సంబంధాలతో  ముడి పెట్టాం!
నోటికి పూసిన ప్లాస్టిక్ నవ్వులతో మనుషుల్ని‌ బురిడీ కొట్టించాం!
నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చాం!
కరోనా మనిషికి నేర్పించింది ఏదయినా ఉంది అంటే
కొన్ని రోజులు ప్రకృతిని ప్రశాంతంగా బతక నిచ్చింది
ఆకాశాన్ని కబ్జా చేసుకొని తిరిగే విమానాల్ని కట్టడి చేసింది
భూమిని హింసించే వాహనాల రద్దీని తగ్గించింది
నదీ నదాల్ని స్వచ్చంగా మార్చింది
మళ్ళీ ప్రకృతిని  పునరుజ్జీవింప  చేస్తోంది
మనిషిని మనిషిగా మారుస్తోంది
జీవితానికి మరో నూతన అధ్యాయాన్ని రాస్తోంది
ఇక నైనా ఒక క్రొత్త తరం  ఉదయిస్తుందేమో చూడాలి!
కరోనా లేని రేపటి ఉదయాన్ని ఆహ్వానించాలి!


Vaaranaasi

Wednesday, May 13, 2020

కరోనా క్యా హోనా?

కరోనా క్యా హోనా?
------------------------------------------
కరోనా భయం కళ్ళల్లో కనబడినా
చావు భయం మాత్రం
ముఖంలో ప్రస్పుట మవుతోంది

మనుషుల్ని  భౌతికంగా
విడదీసిన కరోనా
మనసుల్ని దగ్గర చేసింది

కరోనా యుద్ధానికి
ప్రపంచ మంతా  బలి అయినా
ఖండాంతరాల్ని కలిపింది

అణ్యాయుధాలు వదలకున్నా
కరోనా మనిషి జాతి మీద
జీవాయుధాల్ని పంపించింది

మనిషి పుట్టుక
ఏ దేశం లో నయినా
చావు మాత్రం అందరిదీ అయ్యింది

మానవ జాతి‌ మనుగడకు
ప్రమాద ఘంటికలు   ంరోగించిన కరోనా
జాతి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తోంది

చైనాలో పుట్టిన కరోనా
అగ్ర రాజ్యాల వెన్నులో
వణుకు పుట్టిస్తోంది

బాల్కనీల నుండి చావు కేకలు
వీధుల్లో పారాడుతున్నాయి
నిరంతరం ప్రవహించే జన ప్రవాహం
మంచు నయాగారా జలపాతంలా
స్థంభించి పోయింది

గాలికి పెట్టిన దీపాల్లా
మనుషుల  ప్రాణాలు
గాల్లో కలిసి పోతున్నాయి

జాతి మొత్తం ఏకమై
కరోనా భూతాన్ని  తరిమేద్దాం !
స్వచ్చ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ
వైరస్ లేని సమాజాన్ని నిర్మిద్దాం !!

రచన:  వారణాశి భానుమూర్తి రావు
15.03.2020

చైనాలో కరోనా మహమ్మారి పుట్టింది డిశంబర్ 2019 లో ఊహాన్ అనే నగరంలో . ఇది చైనా నుండి ప్రాకి మొత్తం ప్రపంచ మంతా వ్యాపిచింది. దీని వలన వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. లక్షలాది మందికి ఈ వైరస్ సోకింది. ఈ ప్రాణాంతక వైరస్ త్వరలోనే తగ్గుముఖం పట్టాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిద్దాం. ఈ విశ్వం మీద మళ్ళీ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్తిద్దాం.

( ఆంధ్రప్రభ దిన పత్రిక సాహితీ లో ప్రచురించిన కవిత)

ఈనిన దుబ్బలు

ఈనిన దుబ్బలు
వారణాసి భానుమూర్తి రావు
03.05.2019
-----------+++++++------------+++++++----------
ఈనిన వరి  దుబ్బలు రక్తంతో తడచి పోయి నట్లున్నాయి
మోపులకు కట్టిన గడ్డి కొనలు ఉరిత్రాళ్ళయినట్లున్నాయి
ఎడమ కన్ను కంట్లో సూరీడు‌ కొడవలి పట్టుకొన్నాడు
ఆ అర్థ రాత్రి చంద్రుడు శవమై  ఆకాశానికి నల్ల రంగు‌ 
పులిమేశాడు
పల్లె ఎప్పటిలాగే వొళ్ళు విరచుకొని నిద్ర లేచింది
షరా మామూలే ...
అక్కడ నవ్వులు పూయడం లేదు
తెగుళ్ళు పట్టి బ్రతుకులు పుచ్చి పోయినాయి.

అక్కా..బయటకెల్ల మాక!

అక్కా..బయటకెల్ల మాక!
----------------------------------------------------
సూరీడు ఆకాసం లోకి వచ్చినా బయమే
సెంద్రుడు మేగాల్లో కనబడినా బయమే
పగలయినా బయమే...రాత్రి అయినా బయమే
బయం...బయం...బయం...
దిన దిన గండం..ఈ రోజు
ఎట్లా గడుస్తుందిరా బగమంతుడా?
పగలు రాత్రీ ఒక్కటే ఆయె
సట్ళోకి బియ్యపు గింజలు లేవు
పిల్లోడికి పాలు లేవు..నీళ్ళు లేవు
బతుకులు ఆగమాయమాయె
పను ల్లేవు ..పైసల్లేవు
రోడ్డు మీద కెడితే పోలీసులు ..లాఠీ దెబ్బలు
ఇంట్లో వుంటే ఏడుపులు...పెడబొబ్బలు
ఎప్పుడన్నా ఇసువంటి రోగం కంటిమా? వింటిమా?
మాయదారి రోగం... కరోనా అంట అక్కా!
దూరంగా ఉండాలంట..సేతులు కడుక్కోవాలంట
తుమ్మ గూడదంట ...సీదా గూడదంట
మడిసిని  మడిసి ముట్టు కోగూడదంట
సేతులకు అంటుకొంటే ముక్కు లోపలకి పోయి
వూపిరి బిగ బెడ్తుందంట..సావే గతంట..
మందుల్లేవు..మాకుల్లేవు అంట ఈ రోగానికి
కలికాలం అక్కా ..పొయ్యే కాలమే!
అసలు నాకు తెలీకడుగుతా సామీ?
దేవుడెందుకు గిట్లా  పరీచ్చలు పెడతాడు?
జనాల్ని పరేషాన్ చేస్తాడు?
నీ బాంచను ..కాల్మొక్తా దేవుడా
కరోనాను కబరస్తాన్ కి పంపురీ!
అన్నా...అక్కా..ఓపిక బట్టుండ్రి
కరోనా  ఎల్లి పోతుందంట
ఇంటి పట్టునే ఉండుడ్రి!
బయటకు రాకండ్రి!
కరోనాను తరిమేద్దాం!
రండ్రి..రండ్రి..రండ్రి.!









కరోనా మంచిదే!

కరోనా మంచిదే!
---------------------------

ఎన్ని సార్లు ఆకాశం
కుప్ప కూలిందో ?

ఎన్ని సార్లు కరి మబ్బులు
ఆమ్ల వర్షాన్ని కురిపించాయో?

ఎన్ని సార్లు భూమి తల్లి
ఉక్కిరి బిక్కిరి అయ్యిందో ?

ఎన్ని సార్లు అడవులు
కార్చిచ్చులై కాలిపొయ్యాయో?

ఎన్నిసార్లు కన్నీటి సంద్రాలు
ఉప్పెనలై ఉరికాయో?

ఎన్ని సార్లు నదీమ తల్లులు
పాషాణాలతో ప్రవహించాల్సి వచ్చిందో?

ఎన్ని సార్లు గాలి
విషపు సమీరాల్ని మోసుకు వెళ్ళిందో?

జీవ వైవిధ్యం తప్పి పోయి
ప్రకృతి ఎన్నిసార్లు ఏడ్చిందో ?

మానవ జాతి మనుగడకు
ఎన్ని జంతువులు బలి అయిపొయ్యాయో?

ఓజోను పొర చీలి పోయినప్పుడు
మంచు ఖండాలు ఎన్ని సార్లు ఏడ్చాయో?

మానవ జాతి ఎన్ని తప్పులు చేసినా
మన్నించిన ధరిత్రీ!

కళ్ళకు కనబడని  అతి సూక్ష్మ జీవి
కరోనా పేరుతో  ప్రపంచం మీద దాడి చేస్తోంటే

బయటకు తిరగలేని  జనాల్ని
స్వీయ గృహ నిర్బంధం లోకి నెట్టేశావు

మనుషుల మధ్య దూరాన్ని  పెంచి
ప్రకృతికి  దాసోహం చేశావు

మనుషులు నాలుగు గోడల మధ్య దాగుంటే
జనారణ్యాల లోకి జంతువుల్ని పచార్లు చేయించావు

పచ్చని ప్రకృతి హరిత  హారమై  నవ్వుతుంటే
నగరాలను  నాలుగు గోడల మధ్య బందీలను చేశావు

 భయంతో  రోజూ పెరుగుతున్న శవాల గుట్టలు 
 కరోనాతో కళతప్పిన బ్రతుకుల సమాధులు

ఒక యుద్దం తరువాత శాంతి ఒప్పందం వున్నట్లుగా
కరోనా నిష్క్రమణకు ఒక ఒప్పందానికి వస్తాం

నాకు తెలిసీ
మానవ జాతిలో‌ ఇంత మార్పు ఎప్పుడూ
కనబడ లేదు

ప్రకృతిని కాపాడుకొంటాం!
ప్రకృతిని కాపాడుకొంటాం!
ఉన్న ఒక్క ఈ జీవ గ్రహాన్ని రక్షించు కొంటాం!!



వారణాశి భానుమూర్తి రావు
హైదరాబాదు

05.04.2020








తస్మాత్ జాగ్రత్త!

తస్మాత్ జాగ్రత్త!
-----------------------------------------------
ఈ జనారణ్యంలో  మనుషులు ఎందుకు తిరగడం లేదు?
ఈ మనుషులకు ఏమయ్యింది?
ఈ నగరానికి ఏమయ్యింది?
రోడ్లన్నీ నిర్మానుష్యంగా  ..నిశ్శబ్ధాన్ని నములు తున్నాయి
ఒక క్రిమి  మానవ సంహారం చేస్తోంది
నాకు మించిన వాడు లేడనే వాడిని
ముప్పు తిప్పలు పెట్టేస్తోంది
ప్రపంచానికి పట్టిన ఈ జబ్బు  ప్రతి మనిషినీ శాసిస్తోంది
పల్లకీలో ఎక్కిన వాడూ ..పల్లకీ మోసిన వాడు సమానమే
కుబేరులయినా..యాచకు లయినా సమానమే
బహు కణాల సమాహారమే మనిషి శరీరం
కణ కణాన్ని కరోనా వైరస్సు చేస్తోంది నిర్వీర్యం
ప్రయోగ శాలల్లో  ఇంకా మొలక వెయ్యని అంటీ డోట్స్
వాక్సిన్ లేని జబ్బును జాతి మీద వదలిన ప్రకృతి
హరించుకు పోయిన ప్రాణాలెన్నో?
క్షణ క్షణానికి పైకెగబడుతున్న మరణాల గ్రాఫ్
పాజిటివ్ కేసులతో  పరుగులు పెడుతున్న జనం
నియంత్రణ కోల్పోయిన జీవితాలు
ఇంటి గుమ్మం దాట లేని బ్రతుకులు
రోడ్డు దాటితే కాకీ బట్టల లాటీ దెబ్బలు
ఇంట్లో‌ ఉంటే ఆకలి దప్పుల కడుపు మంటలు
పేదలకు తగిలిన అశనిపాతం ఈ శాపం
మైళ్ళు‌ నడచిన వలస కార్మీకుల బాధా
సర్ప దష్ట పీడితుల ఆకలి  ఆక్రందనలు
వడగళ్ళ కడగళ్ళలో దెబ్బలు తగిలి
రోడ్ల మీద ఆశగా చూస్తున్న నిత్య దరిద్రులు
జన జీవితాన్ని అతలా‌కుతలం‌ చేసిన కరోనా
కట్టడికి నడుం బిగిద్దాం!
కరోనా కాలిపొయ్యేదాకా ...కరోనా పారి పొయ్యేదాకా
ఇంటి పట్టున వుందాం..కొత్త బంధాలకు ప్రాణం‌ పోద్దాం!
మన ఇంటి వాకిళ్ళు చిగురులు వేయనీ !
మన ఇంటి గడపలు మొలకెత్తనీ!
మన బాంధవ్యాలు మెరుగు పడనీ!!
మన జీవితాలు బాగుపడనీ!!











Tuesday, May 12, 2020

కరోనాను తరిమేద్దాం!

శీర్షిక : కరోనాను తరిమేద్దాం!
పేరు: వారణాసి భానుమూర్తి రావు






ప్రపంచాన్నే శాసించిన మనిషి
సృష్టికి ప్రతిసృష్టి చేసిన మనిషి
బ్రతుకు  చిత్రాన్నే మార్చిన మనిషి
ఈ వేళ చిన్న వైరస్ ముందు ఓడి పోతున్నాడు

సముద్రాల్ని మధించిన మనిషి
ఆకాశాన  రాకెట్లతో ఎగిరిన  మనిషి
చంద్ర మండలం మీద అడుగేసిన  మనిషి
ఈ వేళ చిన్న వైరస్ ముందు ఓడి పోతున్నాడు

నీటితో విద్యుత్తు కని పెట్టిన మనిషి
గాలిలో విమానాల్లో తిరిగిన మనిషి
సముద్ర అగాధంలో సబ్ మెరైన్లలో గడిపిన మనిషి
ఈ వేళ చిన్న వైరస్ ముందు ఓడి పోతున్నాడు

గుండెను మార్చి బ్రతికించిన మనిషి
టెస్ట్ టూబ్ లల్లో  బేబీలను సృష్టించిన మనిషి
 జీవిత కాలాన్ని పొడిగించిన మనిషి
ఈ వేళ చిన్న వైరస్ ముందు ఓడి పోతున్నాడు

మనిషి మేధో తనం ఎప్పటికీ  ఓడి పోదు
ఇది జీవాయుధమైనా , జీవన్మరణ సమస్య అయినా
మనిషి ఓటమి ఒప్పుకోడు
ఈ కరోనా మహమ్మారికి విరుగుడు కని పెడతాం

ప్రకృతి మనకు ఒక పాఠం నేర్పిస్తోంది
ఒక్కరి కొక్కరు స్వీయ నియంత్రణ పాటిద్దాం
చేతులు శుభ్రంగా కడుక్కొందాం
మన సమాజం‌ కోసం కొన్ని రోజులు
లాక్ ఔట్ పాటిద్దాం

నీకు నువ్వే బలి కాబోకు సోదరా!
నువ్వు నీ వారిని బలి చేసు కోకు
నిన్ను నువ్వు నియంత్రించుకో!
ఇంట్లో సామాజిక దూరాన్ని పాటించు
కరోనా మహమ్మారిని తరిమి గొట్టు!

రచన: వారణాసి భానుమూర్తి రావు
14.04.2020
హైదరాబాదు.



నాన్నా ..ఇంట్లోనే వుండండి !

నాన్నా ..ఇంట్లోనే వుండండి !
---------------------------------------
రచన: వారణాసి భానుమూర్తి రావు
----------------------------------------------------------
చిన్న పిల్లవాడు నాని ఐదేళ్ళ కొడుకు .. పోలీసు కానిస్టేబుల్ గాపని చేస్తూ  ఉన్న రమేష్ ని చూసి ఏడుస్తూ ఉన్నాడు .

"  నాన్నా.వెళ్ళకండి..నాన్నా.బయటకి వెళ్ళకండి. కరోనా వుందంట బయట"
" నిన్న వెళ్ళారు. ఈ రోజు వచ్చారు.‌ నాతో ఆడుకోవడం లేదు. నన్ను ఎత్తుకోని కిస్ ఇవ్వడం లేదు. నాకు కథలు చెప్పడం లేదు. ఎక్కడికి వెడుతున్నారు? ' అని అడిగాడు.

నాన్న దగ్గరకు వెళ్ళ డానికి ట్రై చేస్తున్నాడు.కానీ దూర దూరంగా రమేష్ జరుగుతున్నాడు రమేష్ కరోనా భయంతో.

"చూడు అమ్మా..నాన్న నా దగ్గరికి రావడం లేదు . బయటనే ఉండి అన్నం తింటున్నారు.నన్ను ఎత్తుకోవడం లేదు" అని వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చాడు నాని.‌

లలితకు అర్థం అయినా పిల్ల వాడ్ని ఎత్తుకొని సముదాయిస్తోంది.

"   మన ఊర్లో కరోనా బూచి వచ్చిందంట..నాన్న ఆ బూచిని మన ఊర్లోంచి తరిమేసి వస్తాడంట"

" లేదు అమ్మా ..బోలెడంత మంది పోలీసు మావయ్యలు ఉన్నారు. నాన్న ఇంట్లోనే ఉండాలి" ఏడుస్తున్నాడు నాని.

బిర బిర మని తినేసి లలితకు సైగ చేశాడు రమేష్ కుర్రాడిని ఇంటి లోకి తీసుకెళ్ళమని.

లలిత కళ్ళ నీరు తుడుచు కొంటూ లోపలికి వెళ్ళి పోయింది.
*******************************************
రమేష్ ముహానికి  మాస్క్ కట్టుకొని స్కూటర్ ఎక్కి హెల్మెట్  వేసుకొని లాఠీ తీసుకొని బయటకు వెళ్ళాడు.

బయట మార్కెట్  దగ్గర గుంపులు గుంపులు గా ఉన్న జనాన్ని చూసి చాలా కోపం వచ్చింది. చాలా మంది ఫేస్  మాస్కులు  వేసు కోకుండా  తిరుగు తున్నారు.

" ఏమయ్యా..మీకు బుద్ది లేదా? కరోనా అంటే ఏమను కొంటున్నారు? మనిషిని చంపేస్తుంది. తెలిసి తెలిసి చావు కొని తెచ్చు కొంటారా?

" ఒక మనిషికి ఒక మనిషికి ఒక ఐదు అడుగుల దూరం ఉండాలి.  ఎవరి కయినా ఆ వ్యాధి ఉన్న వారు దగ్గినా , తుమ్మినా మన కందరికీ వస్తుంది. చేతులు చేతులు కలప కండి. చేతులు ప్రతి అర్థ గంటకూ సబ్బుతో కడుక్కోవాలి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మందికి వచ్చింది"  అన్నాడు రమేష్

రమేష్ మాటల్ని ఎవ్వరూ పెడ చెవిన పెట్ట లేదు. గుంపులు  గుంపులు గా తిరుగుతూ..రాసు కొంటూ, పూసు కొంటూ తిరుగు తున్నారు.

" లాక్‌ డౌన్ విషయం మీకు తెలుసా? ఇలా బయటకు   తిరగ గూడదని మీకు తెలీదా? దయ చేసి ఇళ్ళకు వెళ్ళి పోండీ " అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు రమేష్.

" మేము ఏమి తిని బ్రతకల్ల సార్! ఇంట్లో  కూర్చొంటే పనులు పనులు ఎట్ల జరుగు తాయ్? " అన్నాడు ఒక్కడు దురుసుగా.

ప్రక్కన్నే ఇద్దరు రౌడీలు రమేష్ ని పక్కకు  తోశాడు.
రమేష్ కి చాలా కోపం వచ్చింది.

" ఏరా ..నన్నే పక్కకు‌తోస్తావా? " అన్నాడు కోపంగా.

" ఏంది నువ్వు పీక్కొనేది? మా అన్నకు చెబితే నీ ఉద్యోగం వూడి పోతుంది.." అన్నాడు ఒక రౌడీ.

" ఎవడ్రా మీ అన్న "  ఆ ఇద్దర్నీ లాఠీ తో వెనక్కి తోశాడు రమేష్.

"  మా అన్న కోటి రెడ్డి.. ఏమ్ ఏల్ ఏ~" అన్నాడు ఆ రౌడీ రమేష్ ని ముందరకి తోస్తూ.

రమేష్ లాఠీ కి పని చెప్పి బాగా కొట్టాడు కనిపింవిన వారిని . గుంపులుగా ఉన్న వారిని చెదర గొట్టాడు.

ఒక రౌడీ మొబైల్ తీసుకొని ఎవ్వరికో ఫోన్ చేశాడు.
పది నిముషాల్లో ఐదారుగురు రౌడీలు వచ్చి రమేష్ ని
చితగ్గొట్టి ముహాన ఉమ్మి వెళ్ళి పొయ్యారు.

రక్త మోడుతున్న రమేష్ ని అక్కడ కొంత మంది గవర్న మెంటు  హాస్పిటల్ కి తీసు కెళ్ళారు.
***********************************************
డాక్టర్ గారు కరోనా సూట్ వేసుకొనే ఉన్నారు ముందు జాగ్రత్తగా . అన్ని పరికరాలతో   పరీక్ష చేశాడు రమేష్ ని.

విపరీత మైన జ్వరం..గొంతు‌నొప్పి..శ్వాస తీసు కోవడం లో ఇబ్బంది ఏమైనా ఉన్నదా అని వివరాలు అడిగాడు.

' దేవుడి దయ వలన అలాంటిదేమీ లేదు సార్" అన్నాడు రమేష్
రమేష్ పోలీసు యూనిఫార్మ్ లోనే ఉన్నాడు. బట్టల మీద రక్తం మరకలు ఉన్నాయి.

గాయాలన్నీ తుడిచి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు డాక్టరు గారు.

" రాత్రి పగలు లేకుండా నెల రోజుల నుండి జనాలని కంట్రోల్  చేస్తున్నారు.‌ చాలా మంది పోలీసులు అన్న పానీయాలు లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు. మీ త్యాగం మరువ లేనిది సార్" అన్నాడు డాక్టర్ గారు.

" ప్రజలు మమ్మల్ని అర్థం చేసు కోవడం లేదండీ..లాఠీతో కొడుతున్నామని తెగ బాధ పడి పోతున్నారు. ఇంట్లో ఒక్కడికి వచ్చినా ఇంటిల్ల పాదీ అవస్థ పడుతారు"

అంరలో రమేష్ బాస్ సబ్ ఇన్ స్పెక్టర్ వచ్చి సారీ చెప్పాడు   రమేష్ కి.

"ఎవ్వరో  రౌడీలు మిమ్మల్ని కొట్టారని విన్నాను. వారి డిటైల్స్ ఇవ్వండి .కేసు పెడదాము"
అన్నాడు సబ్ ఇన్ స్పెక్టర్ .

" చూడండి సార్..మీ‌పోలీసు డిపార్టుమెంటుకు ప్రజలు చాలా ఋణ పడి ఉన్నారు. మీరు‌ కంట్రోల్ చెయ్యక పోతే , కరోనా బాధితులు లక్షల్లో ఉండే వారు.‌ మీరు గూడా  కొంచెం దూరం పాటించి ప్రజలని కంట్రోల్ చెయ్యండి. సానిటైజర్ , చేతులకు గ్లౌసులు , ఫేస్ మాస్క్ మరచి పోకండి. మీరు బాగుంటే మన దేశం బాగుంటుంది." అని అన్నారు డాక్టరు గారు కృతజ్ణతా భావంతో వారిద్దరికీ వీడ్కోలు చెబుతూ.

***********************************************
రెండు రోజుల తర్వాత పోలీసు స్టేషన్ కి తీసుకొచ్చారు ఆ రౌడిలను .

" మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని కొట్టాము సార్..మమ్మల్ని క్షమించండి. మీ ప్రాణాల్ని తెగించి మీరు సమాజ సేవ చేస్తున్నారు.  కరోనా వ్యాధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు ." అన్నారు ఆ ఇద్దరు రౌడీలు .

అంతలో ఆ  ఇద్దరు రౌడీలు కళ్ళు తిరిగి మెలికలు తిరుగుతూ పడి పొయ్యారు.

" మాకు కరోనా వ్యాధి వచ్చింది. కరోన ఉందని తెలిసినా గుంపుల్లో తిరిగాము. సామాజిక బాధ్యత మరచి జంతువుల్లా ప్రవర్తించాము. మాకు ఏ శిక్ష వేస్తారో మీ ఇష్టం " అని అన్నారు ఏడుస్తూ

అంతలో అక్కడి కొచ్చిన వైద్య సిబ్బందిని వాళ్ళను క్వారంటైన్ హోమ్ కి తరలించారు . ఆ ఇద్దరి రౌడీలకు  కరోనా వ్యాధి వచ్చిందని తెలిసినా వైద్యుల్ని సంప్రదించకుండా వ్యాధిని‌ ముదర  పెట్టుకొన్నారు. కరోనా దెబ్బకు వారు ప్రాణాలు వదిలారు.

వారింకా ఎంత మందికి కరోనాను అంటించారో అని పోలీసు డిపార్ట్మెంటు తల పట్టుకు కూర్చొన్నది.

కరోనా కట్టడిలో‌పోలీసు వారి పాత్ర మరువ లేనిది.
************************************************

 రచయిత...వారణాసి భానుమూర్తి రావు
కాపీ రైట్స్: రచయితవి.
22.04.2020 @ 9.40 pm