Wednesday, May 13, 2020

కరోనా మంచిదే!

కరోనా మంచిదే!
---------------------------

ఎన్ని సార్లు ఆకాశం
కుప్ప కూలిందో ?

ఎన్ని సార్లు కరి మబ్బులు
ఆమ్ల వర్షాన్ని కురిపించాయో?

ఎన్ని సార్లు భూమి తల్లి
ఉక్కిరి బిక్కిరి అయ్యిందో ?

ఎన్ని సార్లు అడవులు
కార్చిచ్చులై కాలిపొయ్యాయో?

ఎన్నిసార్లు కన్నీటి సంద్రాలు
ఉప్పెనలై ఉరికాయో?

ఎన్ని సార్లు నదీమ తల్లులు
పాషాణాలతో ప్రవహించాల్సి వచ్చిందో?

ఎన్ని సార్లు గాలి
విషపు సమీరాల్ని మోసుకు వెళ్ళిందో?

జీవ వైవిధ్యం తప్పి పోయి
ప్రకృతి ఎన్నిసార్లు ఏడ్చిందో ?

మానవ జాతి మనుగడకు
ఎన్ని జంతువులు బలి అయిపొయ్యాయో?

ఓజోను పొర చీలి పోయినప్పుడు
మంచు ఖండాలు ఎన్ని సార్లు ఏడ్చాయో?

మానవ జాతి ఎన్ని తప్పులు చేసినా
మన్నించిన ధరిత్రీ!

కళ్ళకు కనబడని  అతి సూక్ష్మ జీవి
కరోనా పేరుతో  ప్రపంచం మీద దాడి చేస్తోంటే

బయటకు తిరగలేని  జనాల్ని
స్వీయ గృహ నిర్బంధం లోకి నెట్టేశావు

మనుషుల మధ్య దూరాన్ని  పెంచి
ప్రకృతికి  దాసోహం చేశావు

మనుషులు నాలుగు గోడల మధ్య దాగుంటే
జనారణ్యాల లోకి జంతువుల్ని పచార్లు చేయించావు

పచ్చని ప్రకృతి హరిత  హారమై  నవ్వుతుంటే
నగరాలను  నాలుగు గోడల మధ్య బందీలను చేశావు

 భయంతో  రోజూ పెరుగుతున్న శవాల గుట్టలు 
 కరోనాతో కళతప్పిన బ్రతుకుల సమాధులు

ఒక యుద్దం తరువాత శాంతి ఒప్పందం వున్నట్లుగా
కరోనా నిష్క్రమణకు ఒక ఒప్పందానికి వస్తాం

నాకు తెలిసీ
మానవ జాతిలో‌ ఇంత మార్పు ఎప్పుడూ
కనబడ లేదు

ప్రకృతిని కాపాడుకొంటాం!
ప్రకృతిని కాపాడుకొంటాం!
ఉన్న ఒక్క ఈ జీవ గ్రహాన్ని రక్షించు కొంటాం!!



వారణాశి భానుమూర్తి రావు
హైదరాబాదు

05.04.2020








No comments:

Post a Comment