Sunday, May 24, 2020

నేను సైతం

నేను సైతం
-----------------------
అమ్మ గారూ అంటూ పొద్దున్నే
తలుపు తట్టే మా పనమ్మాయి
ఎక్కడుందో?
కొన్ని అన్నం మెతుకులయినా
కొన్ని రొట్టెలయినా
తను కడుపు మాడ్చి
పిల్లల కడుపు నింపటం కోసం
తల్లి పక్షిలా తెచ్చుకొన్న సంచీలో
నింపుకొంటున్న ఆమె ఇప్పుడెట్లుందో?
నిద్ర పోతున్న లోకాన్ని
తట్టి లేపుతూ ప్రపంచాన్ని చూపించే
మా పేపరబ్బాయి ఎక్కడున్నాడో?
పాల పాకెట్లు  ఇంటిముందర
వదలి వెళ్ళే పాలబ్బాయి ఎక్కడున్నాడో?
చెత్తమ్మా అంటూ  చెత్తను
మునిసి పాలిటీ బండికి
ఎక్కించే చెత్తబ్బాయి ఏమయ్యాడో?
రోజూ వారి పనులు మానేసి
ఖాళీ కడుపులతో ఇంటికే
పరిమితమై పోయిన శ్రమ జీవుల
నిశ్శబ్ధ ఆర్తనాదాలు ఇంటి గోడలకే
వినబడుతున్నాయి
ఇంకెన్నాళ్ళీ గృహ నిర్బంధం?
ఇంకెన్నాళ్ళీ  స్వీయ నియంత్రణ?
రెక్కాడితే గానీ డొక్కాడని
బ్రతుకుల్లో ధ్యైర్యాన్ని నింపేదెవ్వరు?
ఆకలి మటల్ని చల్లార్చే
ఆపన్న హస్తం ఎవరివ్వ గలరు?
ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న
ఈ కరోనా మహమ్మారిని తరిమేదెవ్వరు?
ఖచ్చితంగా నేను సైతం ఒక మనిషిగా జీవిస్తాను
పని చెయ్యక పోయినా
వారి ఖాతాలకు నెల జీతం పంపిస్తాను
మన కోసం పని చేసే శ్రమ జీవుల్ని ఆదు కొంటాను
వీలయితే నేనూ ఒక  ఆపన్న హస్తాన్ని అందిస్తాను!
వారి బ్రతుకుల్లో ఆనంద జ్యోతుల్ని వెలిగిస్తాను! !

వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు

PUBLISHED IN PRAJA SAKTI VIJAYAWADA ON 15.04.2020








No comments:

Post a Comment