Monday, February 27, 2017

మా ఇల్లు మళ్ళీ నవ్వింది !


మా ఇల్లు  మళ్ళీ  నవ్వింది !
------------------------------------

మా ఇంటి  గవాక్షం  గుండా
స్వర్గ సీమ ను చూశాను
మట్టి గోడల  మధ్య
మమతల  దివిటీలను చూశాను
మా ఇంటి  అణువణువులో
పరమాణువై  పరవశించాను
మా ఇంటి  లోగిళ్ల  సంక్రాంతి  ముగ్గుల్లో
గుమ్మడిపూల  గొబ్బెమ్మలను పలకరించాను
మా ఇంటి  వెనుక
ఒక పూల వనం  వసంతమై  వికసించేది
మా ఇంటిలో  రాత్రి వేళ
లాంతరు  బుడ్డీలు  మణి  దీపాలై   వెలిగేవి
గుడ్డి లాంతర్ల  వెలుగులోనే
మా చదువులు  తెల్లవారేవి
అమ్మ కలిపి పెట్టిన  గోరుముద్దల్లో
గోకులం  గుర్తుకు  వచ్చేది
లేత  దూడల  పిలుపుకు
తల్లి ఆవుల ప్రేమకు  మురిసి పొయ్యే వాడిని
మా ఇల్లు నాకొక   బృందావనంలా  అనిపించేది
కాలం  కరిగి పోయింది
 ఇల్లు విడచి -ఊరు  వదలి
అమ్మ నొదలి -అయ్య నొదలి
గొడ్డు నొదలి - పంట   నొదలి
చదువు  కోసం - బ్రతుకు  తెరువు కోసం
నగర మొచ్చి - నరకం చూసి
నలభై ఏళ్ల  పయనంలో
సంసారం సాగర మయిన నాకు
విచిత్రంగా  ఇల్లు గుర్తుకొచ్చింది !
శిధిల మైన  నా ఇల్లు
శ్మశాన  మైన నా ఇల్లు
అమ్మా  నాన్నలకింకా  ఆలంబనమైన నా ఇల్లు
నెర్రెలు చీలిన  నా ఇల్లు
దుమ్ము  పట్టిన నా ఇల్లు
బూజు  పట్టిన నా ఇల్లు
నెల నెలా పంపిన  డబ్బు
నా వాళ్ళను మురిపించ లేదు
తూట్లు పడిన దేహంలా  నా ఇల్లు
మూలుగుతున్న దేహాలతో  నా వాళ్ళు
డబ్బు మనిషిని  బ్రతికిస్తుందేమో  గానీ
ప్రేమ మనస్సుని జయిస్తుందన్న  నగ్న సత్యం
నాకు గోచరించింది !
ఇన్నేళ్లకు మా ఇల్లు  మళ్ళీ చిగురించింది
అమ్మానాన్నల స్వచ్ఛ  మైన నవ్వులా
మా ఇల్లు  నవ్వింది
ఇంటిల్ల పాది మా వాళ్లందరితో
మళ్ళీ  గృహ ప్రవేశం  జరిగింది
మా ఇల్లు మళ్ళీ నవ్వింది !



రచన : వారణాసి భాను మూర్తి  రావు














Monday, February 20, 2017

మూడు పొద్దులూ !

మూడు పొద్దులూ / bhanu varanasi

మూడు పొద్దులూ నాకు సమానమే
ఉదయం , అపరాహ్నం మరియు సాయంత్రం
సమాంతరంగా సూర్యుని ఎదలో
పడుకున్నప్పుడు
ముప్పొద్దులూ నాకు సమానమే
ఉదయ భానుడు అందించిన
చిరు చిరు కాంతులు
పాదరసంలా జారి పోతున్నప్పుడు
దిక్కు తెలియని మందార పూవులా నేను
పాలి పోతున్నాను
అపరాహ్నం వేళ
'చేతి వెన్న ముద్ద' లా ఉన్న సూర్య గోళాన్ని
గళంలో వేసుకున్నప్పుడు
నీలకంఠుడు నేనే అనుకొని
మురిసి పొయ్యాను నేను
సాయంకాలపు వేళ
సముద్ర తీరంలో ఏకాకినై
సంచరిస్తున్నపుడు
ఓ పెద్ద అగ్ని గోళం
పసుపు నీళ్లతో చిలకరించుకొని
స్నానం చేస్తున్నట్లు అనిపిస్తోంది నాకు
రంగు రంగుల మేఘాల పరివృత్తంలో
ఆకాశం నీలి రంగు ముసుగు వేసుకొని
చిక్కని చీకట్ల కౌగిలి లోకి
ఇమిడి పోతోంది !

(This poem was written on 20.09.1996  . Just got that piece of paper in the old files  and like to post here.)

Monday, February 6, 2017

రాస పల్లి కథలు ( 3 ) - కొలిమి ఆచారన్న

రాస పల్లి కథలు ( 3 )  - కొలిమి ఆచారన్న 

నేను మా రాస పల్లి లో సిన్నప్పుడు స్యానా సంగతులు జరిగినాయి . నా కపుడు ఎనిమిది ఏళ్ళు . ఒక సారి ఏమయిందంటే మా ఊర్లో కొలిమి గురువాచారి అనే ఆసామీ ఉండేవాడు . ఆయన కొలిమిలో కమ్మీలను కాల్చి రైతులకు కావల్సిన ఇనుప పనిముట్లను చేసిచ్చే వాడు. ఆ పనికి రైతులు రూపాయో , అర్థ రూపాయి దుడ్లు ఇచ్చేవారు . ఆ రోజుల్లో అర్ధణా , అణా అంటే శ్యానా ఇలువ ఉండేది . అర్ధణా ఆంటే మూడు పైసలు, అణా అంటే ఆరు పైసలు. రూపాయికి పదహరు అణాలు ఇచ్చేవారు. బొట్టు అనేది గూడా ఉండేది. మధ్యలో రాగి నాణేనికి బొక్క ఉండేది. మా నాయన నా కెప్పుడో గాని దుడ్లు ఇచ్చేవాడు గాడు. ' నీ కెందుకబ్బా దుడ్లు? అనేవాడు . నాకు కోపం వచ్చేది బాగా . కమ్మర కట్లు, పాగం పప్పు, ఉడక బెట్టిన గెనుసు గడ్డలు , పబ్బిల్లలు అమ్మే వాళ్ళు సాయబులు . నాకు కొనుక్కొని తినల్ల అని బలే ఆశ. కానీ మా నాయన దుడ్లు ఇస్తే గదా ! దుడ్ల కోసం నేను సింతకాయలు కొట్టేవాడిని సింత తోపుల్లో . పండు సింత కాయలకు మా ఊళ్ళో ఇపుడు సెప్పిన వన్నీ ఇచ్చేవాళ్ళు . గానీ సింత తోపుల్లో రెడ్లు సూసి నారంటే , నా పని అయిపోయినట్లే ! సింత బరీకే తీసుకోని గొడ్డును కొట్టినట్లు కొడతారు. అందుకే నేను సింత మాన్లు ఎక్కి కాయలు కొయ్యాలనుంటే గూడా స్యానా బయ పడే వాడ్ని. అందుకే రాళ్లు ఇసిరి కాయలు ఎన్ని కింద పడాతాయో , అవన్నీ ఏరుకొని , షరాయి జోబీల్లో నింపుకొనేవాడిని . ఊర్లో బుట్టల్లో అమ్ముకోనే సాయబుల దగ్గర కావల్సినివి సింతకాయలు ఇచ్చి తినే టోడిని . నేను స్కూలు నుండి వస్తానే , మా ఇంటి పక్కనన్నే ఉండే గురువాచారన్న కొలిమి దగ్గర కుసుండే వాడ్ని . నాకు ఎర్రగా కాలే ఇనప కడ్డీల్ని , పెద్ద సుత్తితో గట్టిగా సాగదీస్తూ కొట్టే శబ్దాన్ని ఇనాలంటే స్యానా కుసాలుగా ఉండేది . కొలిమి ఆచారి కొడుకు గాలి కోసం తోలు తిత్తుల్ని పైకి కిందకు ఊదే వాడు . అయి నిప్పుల్ని రాసుకొని బాగా మండేవి . ఆ నిప్పుల్లో ఇనుప కడ్డీల్ని పెట్టి కావాల్సిన మడక సామాన్లు జేసే వాడు మా గురువాచారన్న . ఒక్క రోజు , గురవన్న కొడుకు ర్యాల ! అప్పుడు నన్ను పిలిచి నాడు ఆచారాన్న .
' రేయ్ సామి! నువ్ ఊదతావా కొలిమి తిత్తి ? ' అన్నాడు .
నాకు స్యానా కుసాలు అన్పించింది .
' నేను ఊదతా అన్నా ' అన్నాను.
'సరే ఊదరా ' అన్నాడు .
'ఒక తిత్తి పైకెత్తితే గాలిని పీల్సి , ఇంకో తిత్తి కింద వదిలితే గాలిని కొలిమి లోకి వదలు ' అని ఆ పనిని నాకు నేర్పించి నాడు .
నాకు స్యాన నవ్వు వచ్చింది . పైకి కిందకు ఒక అర్థ గంట తోలు తిత్తుల్ని తిప్పినాను . అపుడే భుజాలు లాగుతుండాయి. సేతులు నొప్పి పుడతా ఉండాయి .
'ఉ ...ఊదాక్ ' అని గట్టిగా అరసినాడు గురవన్న .
బయపడి ఊదడం నిలిపినాను .
మళ్లి గట్టిగా 'ఊదు ' అన్నాడు గురవన్న.
నేను ఎక్కడో చూస్తూ తిత్తుల్ని ఊదలేదు .
' నీకు పప్పులు , కమ్మర కట్లు కొనిస్తా లేరా ! ఊదు సామీ ' అన్నాడు గురవన్న .
ఆ మాట ఇంటానె నాకు ఎక్కడ లేని సక్తి వచ్చి , గట్టిగా స్పీడు గ తిత్తుల్ని ఊదినాను . అంతలో ఆ ఊదుడుకు ఒక పెద్ద అగ్గి రవ్వ గురవన్న రొమ్ము మీద పడింది .
అంతే , 'అమ్మ నా కొడకా , సంపితివి గదరా .... ఆపు ...యూదాక్ ' అని గట్టిగా తిట్టినాడు .
నాకు బయ్యం ఏసీ , ఒక్క సారి పైకి లేసి పరిగెత్తినాను .
' పట్టు కొండి , దొంగ ముండా కొడుకుని ' అని గురవన్న నిప్పు తొక్కిన కోతి లా అరసినాడు .
నాకు ఒళ్ళంతా కంపరం వచ్చి , మా ఇంటి ఎనకాల ఉన్న గడ్డి వాములో దాక్కొన్నాను . రాత్రంతా అక్కడే ఉండాను బయపడి . మా అమ్మ , నాయన ఒకటే ఏడ్పు . గురవన్న తిట్టని తిట్టు తిట్టకుండా శాపనార్థాలు పెట్టినారు . పొద్దున కోడి కూస్తానే , మా యమ్మ , నాయనకు తెలియకుండా నా సాప మీద పడుకొని నిద్ర పొయినాను . తర్వాత గురవాచారన్న మొహం సూడనే లేదు . పదేళ్ల తర్వాత గురవా చారన్న నన్ను గుర్తు పట్టి , ఆ విషయం సెప్పుకోని ఒకటే నవ్వు.
కూలబడి నవ్వి, నవ్వి సచ్చి నాము మేమిద్దరమూ ఆ రోజు .
---------------------------------------------------------------------------------------------------------------------------------

Thursday, January 5, 2017

ఎదురు చూస్తున్నా ! (Awaiting )

ఎదురు చూస్తున్నా ! (Awaiting )
--------------------------------------------


ప్రతి రోజు  కవిత్వం  రాయాలనుకొన్నా
రాయ లేక పోతున్నాను
ప్రతి  ఉదయం  అందుకే  హృదయ  తీరాన
నిలబడి భావ తపస్సు చేస్తున్నా!
అక్షరాల  నక్షత్రాల  మధ్య
ఒక  కవితా  జాబిలిని వెతుకుతున్నా!
రాత్రి కల గన్న  స్వప్నాలను ఏరుకొని
తోలి పొద్దు  తరుముతున్న చీకట్లను వెంబడిస్తున్నా!
ఎందుకో  మస్తిష్కం మొద్దు బారి పోయింది
ఎండిపోయిన అక్షరాల  బీజాల  మధ్య
సాహితి సేద్యాన్ని  చెయ్యలేక పోతున్నా!
నిర్వేద  ముద్రలో  ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నా!
వాకిటలో  ఎదురు చూస్తూ  నిలుచున్నా
నా కవితా  కన్యాగమనాసక్తుడనై !


వారణాసి భానుమూర్తి  రావు 

Saturday, November 19, 2016

బ్రతుకు ... బ్రతికించు!


  బ్రతుకు ... బ్రతికించు
-----------------------------

జాలరి వాళ్ల   గాలానికి  చిక్కిన  చేపలు నల్లధనం  కట్టలు
గంగమ్మ తల్లి మింగిన  కాలకూట  విషాన్ని ప్రక్షాళన
చెయ్యడానికి  మోడీ  మంత్రం తంత్రం
కోట్లు మింగిన మొసళ్ళు
నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు
ఒక్క దెబ్బతో  కడిగేసిన కుళ్ళు
సమానత్వం ఉపన్యాసాలతో రాదు
కార్ల్ మార్క్స్ సిద్ధాంతం  బూర్జువా ఇనప్పెట్టెల్లో
తర  తరాలుగా  బూజు పట్టి ఉంది
సబ్బు పెట్టి ఉతికితే  మురికి పోతుందేమో  గానీ
మనిషి  ఉగ్ర స్వార్థ  ఉన్మాదం ఎలా సమసి పోతుంది ??
పనికి రాని కాగితాల్లా  నిన్నటి   పెద్ద కరెన్సీలు
ఎక్కడ గాని తక్కెడ కెక్కని  రంగుల కాగితాలు
ఎందుకు కొరగాని కొరివి దయ్యాలు
నల్ల ధనం  అవకాయ  ఊటలా  ఊరుతుంటే
ఎక్కడ  మెత్తుకొవాలో తెలియక
పిగిలి  పోయిన  నల్ల కుబేరుల  జాతకాలు
ఒక జాతి  హీనాతి హీన మయింది
ఒక నీతి  నిర్విర్వమై  పోయింది
కొన్ని వాదాలు  నిజమై  నిర్భాగ్యుల  ఉసురు తీసింది
మానవత్వం  నోట్ల కట్టల్లో  మాడి పోయింది
ఒక అభాగ్యుడు  డబ్బులేక  భార్య శవాన్ని భుజాల మీద మోస్తే
ఒక తల్లి పుట్టిన పేగు బంధాన్ని  పురిటిలోనే  తుంచేస్తే
ఒక తండా విష జ్వరాల బలి అయిపోతే
ఒక  చెల్లి  ఒక తమ్ముడు ఒక అన్న ఒక అక్క
డబ్బు లేని అసమర్థ యాత్రను  ఉరి  వేస్తుంటే
ఒక సామాన్యుడి  జీవనయాత్ర  నరకానికేనా ??
డబ్బు లేని  మనిషి  శవంతో  సమాన మేనా ??
కోట్లు మూగుతూ  మూల్గుతూ  తాగుతూ తూగుతూ  తేలుతూ
బడా వ్యాపారుల రాజకీయ నాయకుల లంచాధి కారుల
శకం ముగిసి నట్లేనా ??
నిర్భాగ్యుల నట్టింట్లో   నవ్వులు పండేనా ??
సమ సమాజం  రేపటి  సంధ్యలో  ఉదయించేనా ??
మనిషి  సామూహిక బ్రతుకు   సాగిస్తాడా ??



(On Demonetisation of Currency notes of  Rs.500 and Rs.1000 by Modi Government on 08.11.2016)


నదిగా మారింది !




నదిగా  మారింది !

నా  శరీరం మీద ఒక నది నిలువునా ప్రవహిస్తోంది
పాయలు పాయలుగా ప్రవహించినా
నది  ఒక  చోట కలిసి  ముందుకు ఉరుకుతోంది
గుండె బద్దలయిన చోట
 ఒక సుమాని గా  మారుతోంది
వికృత ధర్మాల్ని ఒంపుకొన్న వళ్ళు  
సుడిగుండమై   కంపించింది
కళ్ళు  కర్కశ దృశ్యాల్ని నమిలి నపుడు
జల ప్రళయమై  జ్వలించింది
నా శరీరమిపుడు
నదిగా మారింది!

Tuesday, October 25, 2016

మెయిల్ నాట్ డెలివెర్డ్ ( Mail not delivered )

మెయిల్ నాట్ డెలివెర్డ్ ( Mail  not  delivered )
---------------------------------------------------------

మరణించే దాకా తెలియదు అతనికి  ఒక జీవితం ఉండిందని
అతనకి  ఇంకొన్ని శ్వాసలు మిగిలాయి   బ్రతకడానికి
నూకలు ఎప్పుడో చెల్లి పొయ్యాయి గాని  అతి కష్టం మీద
వెంటిలేటర్ల  దయ మీద  ప్రాణం వేలాడుతోంది
అతని  ఆలోచనలు  ఎనభై ఏళ్ళ  జీవిత ప్రస్థానం  వైపు పాకుతున్నాయి
ఇంత  తొందరగా  చావు వస్తుందని అనుకోలేదు
మొన్నటికి మొన్న  నిప్పులు చెరిగి కొందరి  బ్రతుకుల్ని మసి చేసాడు
నిన్నటికి నిన్న  కోట్లాది నల్ల ధనాన్ని  బాత్రూం గోడల్లో దాచి  సున్నాలు కొట్టాడు
ఎప్పుడయినా  నవ్వడం  అంటే  అమ్మ  కడుపులోనే అనుకొంటా
బయట కొచ్చాక ఏడుపు ... మనుషుల్ని చూసి  ఏడ్పు....
కుక్కల్ని చూసి ఏడ్పు.. కోతుల్ని చూసి ఏడ్పు ...
ఏడవంది  దేనికి ??
తెల్లార్లు  ఎవడి కడుపు కొట్టాలో  అనే  ఆలోచనలు
రాత్రంతా  జాగారం చేసి  రాసుకున్న  చిట్టా
అమలు కోసం  పొద్దున్నే    విప్పదీసిన  నోట్ల కట్ట
భూమికి సమాంతరంగా  ఇంకొక భూమిని  తయారు చేసి
ప్లాట్లు  చేసి అమ్మెయ్య గల బడా  వ్యాపారి
గ్రహాల  మధ్య చిచ్చు పెట్ట గల  పెద్దమనిషి
అమృతం అమ్ముతారంటే  దేవలోకం వెళ్లి  కొన గల  సమర్థుడు
డాక్టర్లు  ఆ దేవతా మూర్తిని  బ్రతికించ డానికి  నానా  తంటాలు
కెనడా  నుండి కిడ్నీ , అమెరికా నుండి  గుండెకాయ
లివర్ లండన్ నుండి ,  బ్రెయిన్ బ్రెజిల్ నుండి
అయినా ఆ మనిషికి  అతకడం లేదు
రక్త దానం కోసం వేలాది  మంది రక్తాసురులు
కాళ్ళు పైన తల క్రింద పెట్టి నడుస్తున్నారు
ఆ మనిషి మరణాన్ని జయించడానికి  యముడికి  ఇమెయిల్ పంపిస్తే
నాట్ డెలివరెడ్ అని వచ్చింది
ఇన్ని ఏళ్ళు  బ్రతికి  ఏమి  సాధించాడని ?
గుట్టలు గుట్టలు గా పేరుకు పోయిన అవినీతి సొమ్ము తప్ప
తనకు తెలుసు ... గుండె ఆగిపోతోంది ... మరణం కొద్దీ సేఫుట్లో  ..
పల్స్ రేట్ జీరో  సర్ ... డాక్టర్ అనడం విన బడింది
నల్లని చీకటి కళ్లలో ... అంధకారం ...  గాఢాంధ కారం
ప్రాణం  లేని ఆ మనిషి శవం ...మార్చురీ  గదుల్లోకి ...