బ్రతుకు ... బ్రతికించు
-----------------------------
జాలరి వాళ్ల గాలానికి చిక్కిన చేపలు నల్లధనం కట్టలు
గంగమ్మ తల్లి మింగిన కాలకూట విషాన్ని ప్రక్షాళన
చెయ్యడానికి మోడీ మంత్రం తంత్రం
కోట్లు మింగిన మొసళ్ళు
నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు
ఒక్క దెబ్బతో కడిగేసిన కుళ్ళు
సమానత్వం ఉపన్యాసాలతో రాదు
కార్ల్ మార్క్స్ సిద్ధాంతం బూర్జువా ఇనప్పెట్టెల్లో
తర తరాలుగా బూజు పట్టి ఉంది
సబ్బు పెట్టి ఉతికితే మురికి పోతుందేమో గానీ
మనిషి ఉగ్ర స్వార్థ ఉన్మాదం ఎలా సమసి పోతుంది ??
పనికి రాని కాగితాల్లా నిన్నటి పెద్ద కరెన్సీలు
ఎక్కడ గాని తక్కెడ కెక్కని రంగుల కాగితాలు
ఎందుకు కొరగాని కొరివి దయ్యాలు
నల్ల ధనం అవకాయ ఊటలా ఊరుతుంటే
ఎక్కడ మెత్తుకొవాలో తెలియక
పిగిలి పోయిన నల్ల కుబేరుల జాతకాలు
ఒక జాతి హీనాతి హీన మయింది
ఒక నీతి నిర్విర్వమై పోయింది
కొన్ని వాదాలు నిజమై నిర్భాగ్యుల ఉసురు తీసింది
మానవత్వం నోట్ల కట్టల్లో మాడి పోయింది
ఒక అభాగ్యుడు డబ్బులేక భార్య శవాన్ని భుజాల మీద మోస్తే
ఒక తల్లి పుట్టిన పేగు బంధాన్ని పురిటిలోనే తుంచేస్తే
ఒక తండా విష జ్వరాల బలి అయిపోతే
ఒక చెల్లి ఒక తమ్ముడు ఒక అన్న ఒక అక్క
డబ్బు లేని అసమర్థ యాత్రను ఉరి వేస్తుంటే
ఒక సామాన్యుడి జీవనయాత్ర నరకానికేనా ??
డబ్బు లేని మనిషి శవంతో సమాన మేనా ??
కోట్లు మూగుతూ మూల్గుతూ తాగుతూ తూగుతూ తేలుతూ
బడా వ్యాపారుల రాజకీయ నాయకుల లంచాధి కారుల
శకం ముగిసి నట్లేనా ??
నిర్భాగ్యుల నట్టింట్లో నవ్వులు పండేనా ??
సమ సమాజం రేపటి సంధ్యలో ఉదయించేనా ??
మనిషి సామూహిక బ్రతుకు సాగిస్తాడా ??
(On Demonetisation of Currency notes of Rs.500 and Rs.1000 by Modi Government on 08.11.2016)
No comments:
Post a Comment