Monday, February 27, 2017

మా ఇల్లు మళ్ళీ నవ్వింది !


మా ఇల్లు  మళ్ళీ  నవ్వింది !
------------------------------------

మా ఇంటి  గవాక్షం  గుండా
స్వర్గ సీమ ను చూశాను
మట్టి గోడల  మధ్య
మమతల  దివిటీలను చూశాను
మా ఇంటి  అణువణువులో
పరమాణువై  పరవశించాను
మా ఇంటి  లోగిళ్ల  సంక్రాంతి  ముగ్గుల్లో
గుమ్మడిపూల  గొబ్బెమ్మలను పలకరించాను
మా ఇంటి  వెనుక
ఒక పూల వనం  వసంతమై  వికసించేది
మా ఇంటిలో  రాత్రి వేళ
లాంతరు  బుడ్డీలు  మణి  దీపాలై   వెలిగేవి
గుడ్డి లాంతర్ల  వెలుగులోనే
మా చదువులు  తెల్లవారేవి
అమ్మ కలిపి పెట్టిన  గోరుముద్దల్లో
గోకులం  గుర్తుకు  వచ్చేది
లేత  దూడల  పిలుపుకు
తల్లి ఆవుల ప్రేమకు  మురిసి పొయ్యే వాడిని
మా ఇల్లు నాకొక   బృందావనంలా  అనిపించేది
కాలం  కరిగి పోయింది
 ఇల్లు విడచి -ఊరు  వదలి
అమ్మ నొదలి -అయ్య నొదలి
గొడ్డు నొదలి - పంట   నొదలి
చదువు  కోసం - బ్రతుకు  తెరువు కోసం
నగర మొచ్చి - నరకం చూసి
నలభై ఏళ్ల  పయనంలో
సంసారం సాగర మయిన నాకు
విచిత్రంగా  ఇల్లు గుర్తుకొచ్చింది !
శిధిల మైన  నా ఇల్లు
శ్మశాన  మైన నా ఇల్లు
అమ్మా  నాన్నలకింకా  ఆలంబనమైన నా ఇల్లు
నెర్రెలు చీలిన  నా ఇల్లు
దుమ్ము  పట్టిన నా ఇల్లు
బూజు  పట్టిన నా ఇల్లు
నెల నెలా పంపిన  డబ్బు
నా వాళ్ళను మురిపించ లేదు
తూట్లు పడిన దేహంలా  నా ఇల్లు
మూలుగుతున్న దేహాలతో  నా వాళ్ళు
డబ్బు మనిషిని  బ్రతికిస్తుందేమో  గానీ
ప్రేమ మనస్సుని జయిస్తుందన్న  నగ్న సత్యం
నాకు గోచరించింది !
ఇన్నేళ్లకు మా ఇల్లు  మళ్ళీ చిగురించింది
అమ్మానాన్నల స్వచ్ఛ  మైన నవ్వులా
మా ఇల్లు  నవ్వింది
ఇంటిల్ల పాది మా వాళ్లందరితో
మళ్ళీ  గృహ ప్రవేశం  జరిగింది
మా ఇల్లు మళ్ళీ నవ్వింది !



రచన : వారణాసి భాను మూర్తి  రావు














No comments:

Post a Comment