Sunday, December 7, 2014

kavyam - కావ్యం


నేను భౌతికంగా ఈ ప్రపంచంలో లేక పోయినా
నా రచన లన్నీ శాశ్వితంగా ఉంటాయి
ఒక పాఠకుడు నా గ్రంధాన్ని బీ రువాలో దాచుకొన్నా
ఒక పాఠకుడు గుండెల్లో భద్రంగా దాచుకొంటాడు
ఒక భావం ఉద్రేకాన్ని కలిగించినా
ఇంకొక భావం మస్తిష్కం లో ఉండి పొతుంది శాశ్వితంగా
కవి వ్రాసిన కావ్యం
అందరికీ ఇష్టమవుతుందని నేను అనుకోను
వంద మందిలో ఒక్కడయినా చదివి
జీవితాన్ని మార్సుకోన్నా అది కవి చేసుకొన్న అదృష్టం
కావ్యానికి కళ్ళు లేవు
అది నడచు కొంటు వెళ్ళదు
కావ్యానికి నోరు లేదు
అది మాట్లాడదు
కానీ కావ్యానికి అక్షరాల భాష ఉంది
అది పాఠ కుడి హృదయాన్ని తాకుతుంది
అరలలో అమ్ముడు పోకుండా పేరుకుపోయి వుండొచ్చు ఆ కావ్యం
గానీ పుస్తకం తెరచి పుటల హృదయాలను చదివితే
ఈ జన్మకి చాలినంత సంతృప్తి దొరకవచ్చు
కవి రాసిన కావ్యం
కొందరి జీవితాలలో అమృత వర్షం కురిపించ వచ్చు
కవి రాసిన గేయం
కొందరిని మానవతా మూర్తులుగా మార్చవచ్చు !



నా ‘సాగర మథనం ‘కవితా సంపుటి ఆవిష్కరణ మహోత్సవ సందర్భంగా రాసిన కవిత
10.4.2000


Thursday, December 4, 2014

రాసపల్లి కథలు ( 2 ) - మా ఇస్కూలు

రాసపల్లి కథలు  ( 2 ) - మా ఇస్కూలు


మా  పల్లిలో   అదేనండి మా రాసపల్లి లో ఐదవ తరగతి వరకే ఇస్కూలు ఉన్ది. మాకు అరవ తరగతి నుండి సదవా లంటే మేము మూడు మైళ్ళు  దూరంలో ఉండె  మాలు కు  కు బోయి సదవాల్సిందే !. అప్పుడు నేను   ఐదవ తరగతిలో  సదుతున్న .    ఇక్కడుండే  ఇస్కూలు లో గుడా మా సారు బడికి ఒస్తే గదా? వారానికి  రెండు , మూడు  రొజులొస్తాడు. మిగతా  రోజుల్లో    మమ్మల్నే  సదుకొమంటా డు .  నాకు బలే కోప మోచ్చేది . మీకు  గొవేర్నమెంటు  వొళ్లు  జీతాలు ఎందుకిస్తా   ఉండారు సార్  ? అని దయిర్నం జేసి అడిగినాను . మా సారుకి దానికి బలే కోపమొచ్చింది . సింత బర్ర తీసుకోని నాలుగు బెరికి నాడు.  మా నాయనకు జెప్పినా  ఈ  ఇసయమన్తా. మా నాయన నన్నే తిట్టి నాడు .' గురుల్ని  ఏమన గూడదు నాయనా! ఆళ్ళు మనకు సదువు సేప్పే వోళ్ళు . పోయి చమించమని అడుగు  అని చెప్పినాడు మా నాయన . మా నాయన మీద  నాకు శానా కోప మొచ్చింది . సరే నని ఆ మర్న్యాడు పోయి  చమించమని  అడిగినాను . సరే అని సెప్పి సిచ్చగా నాకు గోడ  కుర్సీ ఎయ్యమన్నాడు. ఏమనుకోన్నాడో  ఏమో గాని , నన్ను మరుసటి రోజు నుండి స్కూలు  లీడెర్ని సేసి నాడు .

స్కూలు లీడర్ని అయిన్యాక , నాకు బలే పని  ఆయింది . ఇస్కూలు కు  పిల్లోల్లు  వస్తా ఉండారా , లేదా అని సూసుకోవల్ల . రాలేదంటే వాళ్ళ ఇల్లకేల్లె ఆళ్ళను .

ఈడ్సుకొని రావల్ల . సారు ఇస్కూల్ కు ఎప్పుడొస్తాడో రాడో తెలీదు .

రానప్పుడు నా సావు  నేనే సావల్ల. ఒక్కో సారి మా సారు ఇంట్లో  , బయట  పనులన్నీ సూసుకో ని  వస్తాడు. ఆయప్పకు ఇస్కూలు పనుల కంటే  బయట పనులే  ఎక్కువ .

పొద్దున్నే ప్యార్తన అయినాక , నేను పిల్లోల్లందరికి క్లాసుల వారి కుస్సోమని , వాళ్ళకి ఏదో  ఒక  పాటమో  , లెక్కలో రాసు కొమంటాను. సారు  వస్తాడేమో నని మద్యాన్నం దాకా కాసు కొని ఉంటాను . రాలేదంటే మా తంటాలు మేమే పడి  ఇంటికి పొయ్యే బెల్లు ముందు గానే వాయిస్తా. కొందరు పిల్లోల్లు సాయంకాలం వర్కు కోతి కొమ్మా , కబాడీ , జిల్లా కోడి ఆట ఆడతా ఉంటారు  . ఆడ పిల్ల కాయలయితే దొంగాట , ముక్కు గిల్లె ఆట, కుంటాట, తొక్కు బిళ్ళ ఆట ఆడు కొంటారు .

అందుకే మా ఇస్కోల్లో ఐదవ తరగతి పాసు అయ్యి, ఆరవ తరగతి లో సేరి నోళ్ళు సాన తక్కువ. సదివే దానికి , రాసే దానికి  ఒస్తే  చాలని ఐదు కాడికే ఆపేసి సేద్యానికి తొల్తారు. నాకు మటుకు నాకు బాగా సదోకొని , పెద్ద ఉద్దోగం సేయ్యల్ని ఉండాది . ఎట్లయినా  సారు ని మంచి సేసు కొని అన్ని నేర్చుకోవల్లని , ఐదవ తరగతి గట్టేక్కేస్తే , అరవ తరగతి లో ఐ స్కూల్లో బాగా సదువు కోవల్లని ఉండాది .

ఒక రోజు ఆ  రోజు మంగళ వారం అనుకొంటా . సారు  నిన్న బడికి వచ్చినాడు గాబట్టి , ఈ రోజు రాడు  అని నాకు తెలుసు. అందుకె పిల్ల కాయలు గూడా రాలేదు.మొత్తం మీద పది మంది పిల్లోల్లు  గూడా లేరు . నేను ఉన్న పిల్లోల్లకు ఎక్కాలు నేర్పిస్తున్నా . ' రెండు  ఒక్కట్ళా  రెండు ... రెండు  రెండ్ల  నాల్గు .. రెండు మూడ్ల ఆరు...' అని  నేర్పిస్తున్న . అంత లోనే ఒక పెద్ద ఆయప్ప , ఆ ఆయప్ప ఎనకాల ఒక  బంట్రోతు వచ్చి నారు  మా బడిలోకి .

' మీ సార్ ఎక్కడ్రా  ?'  అని నన్ను అడిగాడు  ఆయన కోపంగా .

అబద్దం సేప్పాలో ,నిజం సెప్పాలో తెలిలేదు నాకు .

'ఇప్పుడే వస్తానని సెప్పినాడు సార్ ' అని సెప్పినా .

ఆ సారు నా వంక చూసి నిజం చెప్పు ఆని ఉరిమి నాడు . నాకు బయం ఏసి ఉన్న ఇసయం అంతా సెప్పెసినాను.

'ఇలాంటి టీచర్లు ఉండ బట్టే , దేశం ఇలా తగల బడి  పోయింది ' అన్యాడు పెద్ద సార్ .

వాళ్ళిద్దరూ మా ఇస్కూల్లో ఉన్న మా హాజరు బుక్కులు , మిగతా రి కా ర్డు లన్ని తనికి సేసినారు .
ఏమయ్యిందో ఏమో గాని , మా ఇస్కూలికి ఒక నెల వరకు మా సారు రానే  రాలేదు.

ఒక రోజు , ఒక  కొత్త  సారు   మా బడికి  వచ్చి నాడు . వయసులో శానా సిన్న వాడు గా ఉండాడు .

'ఈ  రోజు నుండి నేను మీకు కొత్త టిచర్ని . నేను  ప్రతి రోజు స్కూలు కి వస్తాను. మీ ఉర్లోనే ఇల్లు తీసుకోని ఉంటాను . మా ఇంటికి వచ్చి  రాత్రి పూట గూడా చదువుకొండి ' అన్నాడు కొత్త టిచేరు .

ఆ సారికి మా బడిలో ఐదవ  తరగతి పది మంది ఉంటె అందరమూ పాస్  అయి మాల్లో ఆరవ తరగతి లో జెరినాము. ఇదంతా కొత్త సారు  దయ వల్లనే .

ఇంతకూ మా పాత సారు ఏమయ్యాడో అని మా కొత్త సారుని అడిగాను .

'ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది ' అని చెప్పాడు మా కొత్త సార్ .ఆ  వచ్చిన వాళ్ళు డి ఇ ఒ  సార్ ' అన్న్యాడు మళ్ళి .

నాకు ఈ రెండు ఇంగిలి పీసు  పదాలు అర్థం కాలేదు .

                                 ****************************************

Wednesday, December 3, 2014

భాను బాణీలు 3 - చిరు కవితలు


 భాను  బాణీలు 3 -  చిరు కవితలు


ఈ  సృష్టిలో  ప్రతిదీ
ఒక అనుభూతే
చివరకు  మరణం  గూడా
ఒక అనుభూతే !


కనీసం నువ్వు
నలుగురుతో నైనా బాగుంటే
నీ పాడె  మొయ్యడానికయినా  
పనికొస్తారు!

అమ్మ ఒడిలో
ప్రపంచాన్ని మరచి పొయ్యావు
పెళ్ళాం   కౌగిలిలో
అమ్మనే మరచి పోయ్యావు !

నాకింకా 
నా బాల్యం గుర్తు
నేనిప్పుడు తొంభై ఏళ్ళ
పసి బాలుడ్ని !

నరికేసిన చెట్లు
మన ఇంటికి వసారాలు
గానీ  రేపటి తరానికి
ఆశనిపాతాలు !

నాన్న నీకు ATM
నువ్వు చదివే దాకా
నువ్వు ఉద్యోగంలొ చేరాక
నాన్న నీకు  outdated  machine !

మొదటి కాన్పులో
ఆడబిడ్డ  శ్రీ లక్ష్మి
రెండవ కాన్పులో
ఆడ బిడ్డ  దరిద్రపు మొహం !


03.12. 2014
వారణాసి  భానుమూర్తి  రావు










Sunday, November 30, 2014

రాస పల్లి కథలు ( 1) - ఎద్ద ల బండి

రాస  పల్లి   కథలు ( 1)    - ఎద్ద ల  బండి 




నేను ఎనిమిదో  తరగతి సదివే టప్పుడు  అనుకొంటా ,  మా అత్తోల్లింటికి  పోవాలనుకొన్న. పతి సమ్మత్సరము నేను పోతాను  . మా ఉరికి పది   మైళ్ళు ఉంటుంది ఆ ఊరు. మాకు పొద్దున్నే పది  గంటలకు ఒక బస్సు ఉండాది. ఆ బస్సు పేరు సలామత్  బస్సు. మదనపల్లి కాడికి  పోయి , మళ్ళా రాత్రి  ఆరు  గంట లకు మా ఉరొస్తె , ఎనిమిది గంట కొట్టే సరికి మా అత్తోల్ల ఊరు సెరుతున్ది. మెల్లగా ఎద్దల బండి మాదిరి పోతుంది ఆ బస్సు.

నా గహ చారమో ఏమో గాని , ఆ రోజు తోమ్మోదయినా బస్సు రాలా. మా నాయనకు కోపోమోస్తా ఉండాది.

'ఎంతసేపు ఆ రాస పల్లి క్రాస్ రోడ్డులో కుసొవాలి. రేపు ఎల్ల బారదు వు లే రా నాయనా!'  అన్నాడు మా నాయన.

నాకేమో ఒకటే బయ్యం . అప్పడే సంకురాతరి  సెలవులు మూడు రోజులు అయి పోయి నాయి. మా అత్తోల్లింటికి పోతే మా బావ , మా మరదలు , మా బావ మరుదులు తో బాగా ఆడు కొవచ్చు. వాళ్ళు బాగా భూములున్నొళ్ళు , మంచి సే ద్యగాళ్ళూను. నాకు అక్కడికి పొతే చేన్లు , మడ్లు , సెరుకు తోటలు చూడచ్చు . పచ్చి సేనిక్కాయలు తెమ్పుకొని , అక్కడే సెత్త , సేదారం , ముళ్ళ కంపలు ఏసీ , పచ్చి సేనిక్కాయలు కాల్చో కొని తింటా ము.

మా నాయనకు  కోపం బాగా వస్తా ఉండాది .
'ఆ తిక్క నాయాలు బస్సు ఎక్కడో చచ్చిన్ది. ఆ గలీజు నా కొడుకులు రిపేర్ ఇప్పుడే చెయ్యర్ర . నువ్వు ఈ రోజు బయలు దేరిన ఏ లా ఇసేశం గూడా బాగా లెదు. అ   మంగలోళ్ళ పిల్లి  అడ్డం వచ్చి  నప్పుడే అనుకొన్యాను. నువ్వు పయా నం మాను కొంటె మంచిదని .'
 మా నాయన కు కోప మోస్తే , మనిషే గాడు . చేతిలో ఏది  కాన బడితే , దాంతో కొడతాడు.
ఒక్క సారి , నేను అల్లరి బాగా చేస్తే , చింత బరికె తో గొడ్డు ను కొట్టినట్లు కొట్టాడు. ఇంకో సారి,  ఎద్దులని తోలే సెల్ల కోడి తో కొట్టినాడు .
సరే నని ' అట్లాగే నాయనా. అయితే రేపు మల్లి బోతా .. నన్ను నువ్వే బస్సు ఎక్కించాల ' అన్నాను నెను.
మా నాయన తో బాటు తిరుక్కోని , మా రాచ పల్లి లో అడుగు బెట్టె సరికి ఆ బస్సు సర్రున బొయిన్ది. నాకు చానా కొపమొచింన్ది. కొంసేపు ఉండ్యుం టే , మా ఆత్తొళ్ల ఇంట్లో హాయిగా పడుకొని కతలు సేప్పుకొనే వాల్లమ్. మా అత్తోల్లు గుడా సెప్పిన రోజు కి రాలేదని , ఈ రాత్రంతా నిద్రపోరు .

సరే నని మరుసటి రోజు మా నాయన పిలేటి కి వచ్చి , పిలేటి బస్టాండ్ లో ఇంకో బస్సు ఎక్కించి , నా పక్కనున్న ఆసామి కి సెప్పి , మా పిల్లోడ్ని పలానా వాళ్ళ ఇంట్లో వదులు తావా సామీ అని అడుక్కొన్నాదు. పాపం ఆయన సాన మంచోడు గా ఉన్నట్లుంది . మా నాయన నాకు సేనిక్కయాల పొట్లం , కమ్మర కట్లు రెండు, సుట్టలు కొనిచ్చి నాడు .
' జా గరత్త నాయన . పోతానే అత్తకు సెప్పు , నాకు నువ్వు సెరి నట్లు జాబు రాయమని. లేదంటే ఎవరయినా మన్నూ రో ళ్ళు వస్తా వుంటే సెప్పిమ్చంను . '

పది గంట లకు అత్తోల్ల ఊ రికి సెరినా . అత్తా , మామ , మా బావ , నా మరదలు అందరు శానా కుసాలు పడి  పోయి నారు. అం దారితో  కూసోని , అన్నం తిన్యాను . మా అత్తా వాళ్ళు నా కోసం సద్ద సంగటి , రాగి సంగటి , మజ్జిగ పులుసు , పచ్చి పులుసు సేసినారు . నాకు ఎరాబద్దకు , పచ్చి  సేనిక్కాయల పుల్లకూర  ఇష్ట మని రేపు చేస్తానాని  సెప్పింది మా అత్త .

నాకు శానా కుసాలుగా ఉన్ది. మా అత్త  ఆ రోజు ఎక్కడికో బోవల్ల అని అన్ది. ఆళ్ళ జీతగాడ్ని పిలిసి, ఎద్దల బండ్లి ని కట్టమన్ది .

'ఒరేయ్ రాజు , నువ్వు బావోల్లతో ఆడుకొంటూ ఉండు , నేను పక్క పల్లె కొమిటోడ్ల అంగడికి బొయ్యెస్తా '
నాకు బండి తోలల్ల అంటే శా నా ఇష్టం . మా అత్తతో మురిపెంగా అడుక్కొన్నా  . ' అత్తా అత్తా నేనొస్తా 'అన్నా . అత్త ' సరే ' అన్ది.

సరే నని రెండు గంటలకు ఎద్దల బండి రడి చేసినాడు ఆళ్ళ జీతగాడు . నేను , మా అత్తా బండ్ళో కూసోని పోతా  ఉండాము .
ట్టర్ర్ ..... ట్టర్ర్ .... పద ...పదా ... అని సాన ఉషారుగా ఆడు బండి తొలత ఉండాడు ..

బండి ఊరు  దాటి , ఒక్క మెయిలు దూరం పొయింది . తెల్ల ఎడ్లు సాన బాగా  పర్గేత్తతా ఉండాయి . నా కేమో బండి తోలల్ల అని బలే కోరిక గా ఉన్డాది . అత్త ఏమంటు దో అని నాకు బయ్యం . దైర్న్యం సేసి అత్తను అడిగినాను .

' నీ  కలవాటు లేదురా నాయనా . ఆ గిత్తలు నీ మాట ఇనవు. ' అంది మా అత్త.
నేను మా అత్త మాట ఇనలా. ఏడుస్తా ఉండా ను .

'పోనిలేమ్మ , పిల్లోడు అడగతా ఉండాడు . నేను పక్కన కుస్సోని బండి తోలిపిస్తా!' అన్నాడు జీతగాడు .
మా అత్త బయ్యం గానే , ' సరే నాయన , జాగ్రత్తగా నడుపు ' అనిన్ది.

నాకు బలే కుసాలు అయ్యిన్ది. వెంటనే ఆయన దగ్గర నుండి ముక్కు తాడ్లు పట్టుకొని, ఒక చేత్తో చల్ల కోడి తో ' డ రర్ ... డ రర్ ... అంటూ నాలిక తో వింత సబ్ధం సేసుకొంటా బండి నడు పుతుండా ను .

కొంచెం దూరం పోయిన్నాక , ఏమయిందో ఏమో, బండి సేక్రం ఒక పెద్ద రాయి మీద ఎక్కి , ఒక పక్కకి వంగి పడి  పొయింది . కాడిమాను మెడ మీద ఒక ఎద్దు మొయ్య లేక కింద పడి పొయిన్ది. నేను,  మా అత్తా ఇసిత్రిం గా ఇసిరేసినట్లు ఒక పక్కకు పడి పొయినాము. దెబ్బలు ఏమి తగల్లేదు గాని సెర్మము సీక్కొని పొయిన్ది. మా అత్త ఒక్కటే ఏడ్పు . సెపితే ఇన్నావా ? అదృస్టం  బాగుండి , బతికి బట్ట గట్టినాము గాని, లేకుంటే సచ్చి పొయ్యే వాళ్ళం గదరా ?' అనింది మా యత్త  ఏడుస్తా .

పాపం మా జీ త గాడు ,ఎద్దల్ని లేపి , వాటిని దువ్వి ,' లేదురా రాముడు , ఏమి కాలేదు' , అని కాడి మాను గట్టిగా బిగించి నన్ను ఎనక్కు కూర్చో మని  బండి తోలినాడు . ఇంక మా యత్త , ఈ రోజు సేకునం బాగా లేదు , ఇంటికి మళ్ళించు అనింది .

మరుసటి రోజు ఏమయిందో ఏమో గానీ ,ఆళ్ళ జీత గాడ్ని  తోడిచ్చి , బస్సు ఎక్కింఛి , మా ఊరు పంపించేసింది మా యత్త.

రచన: వారణాసి భాను మూర్తి రావు
30. 11. 2014

ఇందు లోని పాత్ర దారులు కేవలం కల్పితాలే , ఎవ్వరిని ఉద్దేశించి రాసినది గాదు. ఈ కథ నిజంగా నా నిజ జీవితం లో జరిగినది . ఈ కథ ఇటివలే పరమ పదించిన మా మేనత్త గారికి అంకితం .

Friday, November 28, 2014

Oka Sri Sri Mali pudathada?

ఒక శ్రీ శ్రీ  మళ్ళి పుడతాడా ?


ఒక శ్రీ శ్రీ  మళ్ళి పుడతాడా?
ఒక మహా ప్రస్తానం మళ్లి వస్తుందా ?


ఒక విప్లవం  మళ్లి  చూస్తామా ?
ఒక   నవ్య ప్రపంచం మళ్లి  కంటామా ?

ఒక సూర్యుడు  మళ్లి ఉదయిస్తాడా ?
ఒక ప్రభాతం  మళ్లీ  పుడుతుందా ?

ఒక సమతా రాగం  మళ్లి  వినిపిస్తుందా ?
ఒక నవతా భావం మళ్లి  కలుగుతుందా ?

వారణాసి భాను మూర్తి
28. 11. 2014


Wednesday, November 26, 2014

విషం కురిసిన రాత్రి ( visham kurisina raatri)



విషం కురిసిన రాత్రి


అక్కడ  దెయ్యాలు వేదాలు  వల్లిస్తున్నాయి
ఇక్కడ  వేదాలు దెయ్యాలకు నేర్పిసున్నాయి
ఈ రాత్రి ఎక్కడయినా అమృతం కురుస్తుందేమో నని వెతుకుతున్నాను
శ్లోకాలన్నీ శోకాలై  వినబడుతున్నాయి
గేయాలన్ని గాయా లై బాధ పెడుతున్నాయి
ఒక కవితా వస్తువు దొరుకుతుందేమో నని
ఈ రాత్రంతా వెతుకు తున్నాను
సత్య హరిశ్చంద్రులు కాటిక కాపరులై తచ్చాడుతున్నారు
బృహన్నలు   వీధుల్లో విహారం చేస్తున్నారు
నా కక్కడ భార్యల్ని చంపిన భర్తలు
భర్తల్ని చంపిన భార్యలు
బిడ్డల్ని చంపిన తండ్రులు
తల్లి తండ్రుల్ని చంపిన బిడ్డలు
బ్రతకడం చేతకాని విద్యా  వంతులు
అందరు కన బడుతున్నారు
ఈ రాత్రి కాళ  రాత్రి కానే  కాదు
పున్నమి రాత్రి విష నాగులు నాట్యం చేస్తా  యంటారు
ఇక్కడ విష పురుగులు తిరుగుతున్నాయి
మనసంతా వితండ వాదమే
విధి రాసిన రాతలు అని పాత  పాట పాడుతున్నాడొక్కడు
మనం రాసుకొన్న  రాత అని వాడికి బహుశా తెలియదు
వీధి కుక్కలు పేవ్మెంట్ల మీద మొరుగుతున్నాయి
వాటితో పాటు దిక్కు మొక్కు లేని అడ్రస్ లేని మనుషులు
ఈ దేశం లో అడుక్కోవడం కొందరికి  జన్మ హక్కు
రెక్కలు తెగిన పక్షుల్లాగా ఉడిగి పోయిన  అమ్మా నాన్నల్ని
గెంటేసిన బిడ్డలు
 రైల్వే ఫ్లా ట్ ఫామ్ లు గాక ఇంకెవ్వరు చేర దీస్తా రు ?
అన్న పెట్టే రైతన్నలకు అడుక్కు తినే కాలం వచ్చింది
ఏ బస్టాండ్ లో చూసినా వాళ్ళే !
రోడ్డు పక్కన నిలబడి చీకట్లో బే రా లడుతున్న ఒక స్త్రీ
బహుశా  ఆర్ధిక శాస్త్రం బాగా ఔపసన పట్టింది
ఇన్ ఫ్లేష న్ (inflation ) అంటే ఎమిటొ ఆమెకు బాగా అర్థం అయ్యుంటుంది
 ఈ దేశానికీ పట్టిన దౌర్భాగ్యం దరిద్రం
అస్తవ్యస్త మైన వ్యవస్థ  బాగు పడే వరకు
ప్రతి రాత్రి విషం కురుస్తునే ఉంటుంది!


రచన  ---------వారణాసి భానుమూర్తి రావు
26. 11.2014






Sunday, November 23, 2014

చిన్నారి మనసు

చిన్నారి మనసు

అమ్మ జోల పాటల బదులు
ఐ పాడ్ లో 'జానీ  జానీ , ఎస్ పాపా' లు వినబడుతున్నాయి
'చంద మామ రావే' పాటకి చంద్రుడుంటే గద వినడానికి
పాలే లేని   అమ్మ  తనం డబ్బా పాల తో  పాప కడుపు నిండింది
అమ్మ నాన్న ల ఉద్యోగాల తో
చిన్న పాపా బాల్య మంతా బేబీ కేర్ సెంటర్ లో ముగిసింది
అమ్మమ్మ బామ్మా తా తయ్యలకు
స్కైప్ లోనే చిన్నారుల  ముచ్చట్లు  తీరాయి
పసి పిల్లల మౌన భాష
మన కెలా అర్థమవుతుంది... .?