Thursday, February 18, 2021

ఇలాగే ఉండనీ!!



 ఇలాగే ఉండనీ!!

-------------------------------------


మరు మల్లెలు గొలిపే నీ సొగసు

ఇంకా ఓ మారు తిలకించాలని  వుంది ప్రియా! 


కమనీయ రమణీయ శృంగార భృంగారపు మాటలు

మళ్ళీ మళ్ళీ ఒక మారు వినాలని ఉంది ప్రియా!


అజంతా ఎల్లోరా శిల్పుల వేల్పువై

బెదురు లేక ఎదురుగా నీవు నిలుచుంటే 

మళ్ళీ ఒక మారు చూడాలని ఉంది ప్రియా!


నీ గాజుల సవ్వడి గంగామ గల గల రవలతో 

మళ్ళీ మళ్ళీ ఓ మారు వినాలని ఉంది ప్రియా! 


భానుని కిరణాల కాంతులతో ముకిళిత కలువ 

వికసిత మైన నీ నగు మోమును 

మళ్ళీ ఓ మారు  తిలకించాలని ఉంది ప్రియా!


నీ పాదాలకు పారాణి నా హృదయ రాణివైన నీకు

మళ్ళీ ఒక మారు పూయాలని ఉంది ప్రియా! 


రతీ మన్మధుల వలే మన దాంపత్య జీవితం 

ఇలాగే ఉండాలని ఉంది ప్రియా! 


------------------------------------------------------------------

వ్రాసిన కాలం....01.07.1975 

( నా వయస్సు అప్పుడు 19 )

వారణాసి భానుమూర్తి రావు.


Tuesday, December 29, 2020

మూగ బోయిన బడులు


 



శీర్షిక: మూగ బోయిన బడులు 

రచన: వారణాసి భానుమూర్తి రావు

హైదరాబాదు.

 29.12.2020

---------------------------------------------------


స్కూళ్ళన్నీ ఇళ్ళల్లో  లాప్ టాప్ లై కూర్చొన్నాయి

పిల్లల చదువులు అంతర్జాల మెక్కి అందల మెక్కాయి

బడిగంటల శభ్ధం  మూల  పడి సన్నగా మూలుగు తోంది

ఆటపాటలు లేని మైదానాలు బోసి పొయ్యాయి


పిల్లలు లేని బడులు శిధిల మైన సత్రాల్లా ఉన్నాయి

టీచర్లు కన బడని పిల్లల బడి పాఠాలు బరువెక్కాయి

స్నేహితులతో మాటా మంతీ కాకమ్మ కథల్లా మిగిలాయి

పిల్లల్లేక మా టేబుల్ బేంచీలు బోసి పొయ్యాయి


మా బడులు  మళ్ళీ మాకు కావాలి..

మా చదువులు తరగతి గదిలోనే సాగాలి

అమ్మ ల్లారా ..నాన్నల్లారా మమ్మల్ని బడికి పంపండి

కరోనాకు భయపడి ఇంట్లో బందీలయ్యాము

కరోనా...మమ్మల్ని బడికి పంపించవూ ప్లీజ్! 






Saturday, December 12, 2020

సమాజానికి మీరెంతో అవసరం!



 


---------+++--++-----------------------

అంశం : పారిశుద్ధ కార్మీకులు

శీర్షిక: సమాజానికి మీరెంతో అవసరం! 

తేది..07.12.2020

రచన: వారణాశి భానుమూర్తి రావు

ఊరు: హైదరాబాదు 

------------------------------------------------------------


కడుపులో ఆకలి కత్తులు పొడుస్తున్నా

ఇంట్లో పిల్లల ఏడ్పులు ఎద గిల్లుతున్నా

రోడ్ల మీద చీపుర్లు పని చేస్తూనే ఉంటాయి


తాము రోగాల బారిన పడినా మనల్ని రోగాల 

నుంచి రక్షించే దేవతలు పారిశుద్ధ కార్మీకులు


కలరా వచ్చినా కరోనా వచ్చినా

వానొచ్చినా వరద లొచ్చినా

వెరవక తాము బెదరక  పని చేసే దేవుళ్ళు 

మన పారిశుద్ధ కార్మీకులు


మురుగు నీటిని అభిషేకం చేసుకొంటూ 

కల్మషాలను కట్టడి చేసే శివ లింగాలు

మన పారిశుద్ధ కార్మీకులు


చెత్తను నెత్తిన మోసి 

నగరాన్ని అందంగా మెరుగులు దిద్దే 

స్వచ్చ భారతీయులు మన పారిశుద్ధ కార్మీకులు 


స్వచ్చ భారత్ కోసం అహర్నిశలూ శ్రమిస్తూ 

కొవ్వొత్తిలా కరిగి పోతూ వెలుగులు ఇస్తున్న 

ఆరోగ్య రథ సారధులు మన పారిశుద్ద కార్మీకులు


పరిసరాల శుభ్రతలో  సమాజానికి 

సేవలందిస్తున్న మన పారిశుద్ద కార్మీకులు

సమాజానికి ఎంతో అవసరం‌ ! 

వారికి చేయూత నిద్దాం... అక్కున చేర్చుకొని 

స్వచ్చ భారతాన్ని నిర్మిద్దాం! 


---------+++----------++++++++-----


Monday, November 16, 2020

ఆదివారం అగచాట్లు ( హాస్య కథ)


 


ఆదివారం అగచాట్లు ( హాస్య కథ)

రచన : వారణాసి భానుమూర్తి రావు

హైదరాబాదు

15.11.2020 

**********************************************


బ్రహ్మానందం రెండు పాల పాకెట్లు కొని 100 రూపాయలు ఇచ్చాడు. పాలు అమ్మే వ్యాపారి  50 రూపాయలు పట్టుకొని పరధ్యానంలో 150 రూపాయలు ఎక్కువ  ఇచ్చేశాడు. 


అది తెలిసి గూడా ఆ నోట్లను జోబీలో కుక్కుకొన్నాడు బ్రహ్మానందం. వెంటనే పూలు కొనుక్కోవడానికి వంద రూపాయల నోటు ఇచ్చాడు. పరధ్యానంలో  పూల అమ్మాయి ఇచ్చిన   చినిగి పోయిన 50 రూపాయల  నోటు తీసుకొని జోబీలో పెట్టుకొని తరువాత చూసి బాధపడ్డాడు. 


ఆ చినిగి పోయిన నోటును ఎలాగైనా ఎవరికైనా అంట గట్టాలని నిమ్మ పళ్ళు కొన్నాడు. వాడు పరధ్యానంలో ఆ చినిగి పోయిన  50 రూపాయల నోటును  తీసుకొని పది నిమ్మపళ్ళకు ఇరవై పట్టుకొని 30 రూ.లు వాపస్ ఇచ్చాడు. 


బ్రహ్మానందం అక్కడున్న దానిమ్మ పళ్ళను‌ చూసి మూడు దానిమ్మ పళ్ళను కొన్నాడు. సంతోషంగా తన తెలివికి మురిసి పొయ్యాడు బ్రహ్మానందం. ఈ రోజు నక్కను తొక్కి వచ్చాడనుకొని సంతోష పడి పొయ్యాడు. 


ఇంటికి వచ్చిన తను దానిమ్మ పళ్ళను కట్ చేస్తే అన్నీ పుచ్చులే..పనికి రానివి తగల గట్టాడు వాడు. అవన్నీ డస్ట్ బిన్ లో పడేశాడు.


" ఏమండీ పాలు విరిగి పొయ్యాయి..ఎప్పటి పాలో ఏమో ! ఫ్రెష్ పాలు తీసుకు రండి " అని శ్రీమతి వంటింట్లోంచి అరుపు. 


పాంట్ జోబీలో పెట్టుకొన్న 500 రూపాయల కోసం వెతికాడు.. గుండె వేగంగా కొట్టుకొనింది.‌ 


" కనబడ లేదు..సుశీ ..నా జోబీలో 500 రూపాయల నోటు చూశావా? " అని గట్టిగా అరచాడు..."


 లేదండీ ..నేను చూడ లేదు..మీ పరధ్యానం పాడు గానూ..ఆ రైతు బజార్ లో పోగొట్టు కొన్నారేమో! పోయి వెతకండి..లేదంటే ఏ పిక్ పాకెట్ గాడు కొట్టేశాడేమో " అంది శ్రీమతి బ్రహ్మానందం వైపు కొర కొర చూస్తూ..


" వెళ్ళి వెతికి వస్తా..ఎక్కడైనా పడి పోయిందేమో నని..ఈ రోజు లేచిన వేళా విశేషం బాగా లేదు. అన్నట్టు..పాలు కావాలన్నావు కదా? " 


బ్రహ్మానందం మళ్ళీ బయటకు వెళ్ళి పొయ్యాడు.


ఒక అర్థ గంట తరువాత రొప్పుతూ ఆయాసంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి భయ పడింది సుశీల.


" ఏమైయ్యిందండీ" అంది పాల పాకెట్లు ఉన్న సంచీని తీసుకొంటూ..


గ్లాసు మంచి నీళ్ళు తీసి భర్తకు అందించింది.


" 500 రూపాయల నోటు కోసం వెతక డానికి స్కూటర్లో వెళ్ళానా? ఈ రోజు ఎవరి ముహం చూశానో ఏమో..అన్నీ కష్టాలే...రైతు బజారు కెళ్ళాక స్కూటర్ పంచరయి చచ్చింది.ఈ రోజు ఆదివారం గదా! పంచర్ వేసే వాడు ఎవ్వడూ కనబడ లేదు..అలాగే రొప్పుతూ తోసుకొని వచ్చే సరికి నా ప్రాణం పోయింది" అని  గ్లాసు లోని నీళ్ళు గడ గడ మని త్రాగేశాడు.


" పోతే పోయింది పాడు 500 రూపాయలు.. ఈ మధ్య మీకు మతి మరుపు ఎక్కువయ్యింది" అంది సుశీల.


" మతి మరుపా ..నా బొందా.. పొద్దున్నే పాల వాడ్ని మోసం చేశాను..తెలిసి గూడా వాడిచ్చిన డబ్బును నా జోబీలో తెలీనట్లు కుక్కు కొన్నాను.‌ వున్నదీ పోయే..వుంచుకొన్నదీ పోయె " అన్నట్లు అయింది నా బ్రతుకు ఈ రోజు


" అంతే ..150 రూపాయలు కు కక్కుర్తి పడితే వేయి రూపాయలు బొక్క పడింది.ఇక నైనా నిజాయితీగా ఉండండి..బీదా బిక్కీ..చిరు చిరు వ్యాపారస్థులకు మోసం చెయ్యకండి" అంది సుశీల.


" ఉండండి..కాఫీ ఇస్తాను" అంటూ వంటింట్లోకి వెళ్ళి పోయింది సుశీల.


" అలాగే" అంటూ వెంకటేశ్వర స్వామి ఫోటో కేసి చూస్తూ లెంప లేసుకొన్నాడు బ్రహ్మానందం.

*********************************************




Friday, October 30, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (25)

సంస్కార సమేత రెడ్డి నాయుడు  (25)

చివరి భాగం.








అంతకు ముందే   సుధాకర్ , దివాకర్ నుండి  వచ్చిన ఆదేశాల ప్రకారం కిరాయి గూండాలు  గుర్రాల మీద వచ్చారు. వారి చేతుల్లో నాటు తుపాకీలు అటూ ఇటూ తిప్పుకొంటూ బయట నిలబడి మాట్లాడుతున్న ఆశోక్ రెడ్డిని గూడా దయ్యాల గుట్ట వైపు తీసుకు వెళ్ళారు కిరాయి గూండాలు.



" ఈ ఇద్దరి వలనే అంట ఈ రెండు వూర్లల్లో మర్డర్లు ..అల్లర్లు చేసుకొని మనుషులు శాంతంగా బతక లేక పోతున్నారంట..ఇద్దర్నీ  ఒకే సారి ఏసెయ్య మన్నారు  దివాకర్ సారు.." అన్నాడు అందులో ఒక కిరాయి గూండా.


గుట్ట మీద ఒక పాడు బడిన సత్రం ఉంది.  ఆ సత్రం  దగ్గరకు పోవాలంటే అక్కడి జనాలకు భయం. అక్కడ దయ్యాలు తిరుగుతా వుంటాయని జనాలల్లో పుకారు పుట్టించి నారు.


అందుకే దానికి దయ్యాల గుట్ట అనే పేరు వచ్చింది. 


"  దివాకరన్న , సుధాకరన్న మిమ్మల్నీ ఇద్దరి తలలు నరికి బాహదా నది ఇసుకలో పూడ్చెయ్య మన్నారు " అన్నాడు ఒక కిరాయి గూండా  . సారాయి పాకెట్ నోటితో చించి గడగడ మని  తాగుతూ తూలు తున్నాడు.  రమ అశోక్ ల  వంక చూస్తూ భయంకరంగా అరుస్తున్నాడు. వాడి చేతిలో పెద్ద సాన పెట్టిన  కత్తి ఉంది. 


అశోక్ ..రమ పెనుగు లాడుతున్నారు. వారు వేసుకొన్న దుస్తులు చినిగి పొయ్యాయి. ఆ పెనుగు‌లాటలో చర్మం గీసుకొని‌ పోయి రక్తం కారుతోంది.


" మిమ్మల్ని ఇద్దర్నీ సంపెయ్యమని మాకు చెప్పినారు. దేవుడ్ని తలచు కోండి..మీ తల కాయలు నరికేస్తాము" అని‌ ఒక్క‌ వుదుటున వారి ముందరికి దూకాడు  ఒక్కడు.


అంతే..బిర బిర మని రెండు పల్లెల నుండి వచ్చిన యువకులు, రైతులు , పాలేర్లు, పిల్లలు, జీత గాళ్ళు పొలో మని వారి వారి చేతుల్లో ఉన్న ఆయుధాలతో ఆ రౌడీలను‌ చితక బాదారు.


కొందరు రౌడీలు పలాయనం చిత్త గించారు.


అంతలోనే ..పరుగు పరుగున రాజ శేఖర రెడ్డి..జయ రామ నాయుడు వచ్చారు. ఆమ్మా..రమా..తల్లీ ..బాగున్నావా ..నన్ను క్షమించమ్మా" అని బావురుమని‌  రమను‌ హత్తుకొని చిన్న పిల్లలా ఏడ్చాడు జయరామ నాయుడు.


రాజ శేఖర రెడ్డి‌ గూడా అశోక్ రెడ్డిని పట్టుకొని‌" దెబ్బలు ఏం తగల్లేదు గదా నాయనా? " అని గట్టిగా హత్తుకొని కళ్ళళ్ళో నీళ్ళు పెట్టుకొన్నాడు.


ఆయాసంతో రొప్పుతూ వున్న తండ్రిని  చూసి " నా కేమీ కాలేదు నాయనా" అని ధైర్యం చెప్పింది రమ. 


అంత లోనే ఇద్దరి పల్లెల దివాన్లు వచ్చారు.


" ఇప్పటి కైనా అర్థం అయ్యింది కదా? రహస్యం తెలిసింది గదా? కొట్లాటలు మాని అందరూ సుఖంగా ఉందాం. రెండు పల్లెల ప్రజల్ని సుఖ పెట్టుదాం. బీదా బిక్కీ ఈ కొట్లాటల్లో నలిగి పోతున్నారు" అన్నాడు శర్మ గారు.


" రాజ శేఖరా...నన్ను క్షమించు" అని నాయుడు గారు రెడ్డి గారిని గట్టిగా హత్తుకొని ఏడ్చి నాడు.


" నువ్వే నన్ను క్షమించాలి...ఇద్దరమూ ఒక్కరినొక్కరు అర్థం చేసు కోకుండా ఎచ్చులకు పోయి  పల్లెల్లో  జనాల బతుకుల్ని బజారు పాలు చేశాము..కక్షలు ..కోపాలు మన కొద్దు..ప్రశాంతంగా జీవిద్దాం.'  అన్నాడు రెడ్డి గారు నాయుడి గారి కళ్ళు తుడుస్తూ.


" నాయనా..దీని కంతటికీ కారణం మేము.. ఉన్నవీ లేనివీ మీకు కల్పించి అబద్దాలు చెప్పి అన్న దమ్ముల్లాంటి మీ మనసుల్ని పాడు చేసినాము...మీ మధ్య కొట్లాటలు పెట్టాము. అవింత దూరం పోతాయని అను కోలేదు. చెల్లమ్మా ..నన్ను క్షమించు..అశోక్ ..నన్ను క్షమించు.."  


అని రమను, అశోక్ ను హత్తుకొంటు క్షమాపణలు కోరినారు సుధాకర్ , దివాకర్ అన్నదమ్ములిద్దరూ.


ఆనందంతో మళ్ళీ రెండు పల్లెల వారు‌ పోలేరమ్మ ఆశీస్సుల కోసం  నాయిడు గారి పల్లెకు బయలు దేరినారు.


బ్రహ్మాండమైన స్వాగతాలతో ..భాజా భజంత్రీలతో ...ప్రతి ఒక్కరూ రెండు కుటుంబాల వారికీ స్వాగతం పలుకుతూ , అందరి మీదా పూల జల్లును కురిపించారు.


రెండు కుటుంబాల వారి అమ్మ వారి ఆశీస్సులు అందుకొన్నారు.


దేవతలు ఆశీస్సులు అంద చేసి నట్లుగా సన్నని వర్షపు జల్లు కురిసింది.

**************************************************

మూడేళ్ళ తరువాత

రమ కి అశోక్ తో అంగరంగ వైభవోపేతంగా వివాహం జరిపించారు. పది పల్లెల వాళ్ళు పది వేల మంది పెళ్ళికి హాజరయ్యారు. 


పెళ్ళి  జరిగిన తీరు , విందు భోజనాల గురించి కథలు కథలుగా చెప్పుకొన్నారు జనాలు.


సంవత్సరం తిరగక ముందే పండంటి బిడ్డకు జన్మ ఇచ్చింది రమ.


బారసాల ఘనంగా చేశారు రాజ శేఖర రెడ్డి గారు.


బాబుని పొత్తిళ్ళ లోకి తీసుకొంటూ " ఏమి పేరు పెడదాము? " అని అడిగాడు జయ రామ నాయుడ్ని.

కొందరు వారికి ఇష్టమైన పేర్లు చెప్పారు.


కొందరు రెడ్డి వీర శేఖర అని ఇద్దరి ముత్తాతల పేర్లు వచ్చేటట్లు పెడితే బాగుంటుంది అన్నారు.


రాజ శేఖర రెడ్డి బాబుని చూస్తూ.." నా మనమడికి నేనే పేరు పెడతా" అన్నాడు.


అందరూ ఆయన ఏమి పేరు పెడతాడో అని వేచి ఉన్నారు.


" రెడ్డి నాయుడు" అని గట్టిగా నవ్వాడు.


ఆ పరిసరాలన్నీ ఆనందంతో చప్పట్లతో మారు మోగి పోయింది.


బాబుని అందరూ " ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధి రస్తు" అని అక్షింతలతో దీవించారు.

***********************************************

                           శుభం  భూయాత్!

        అందరూ సుఖ సంతోషాలతో ఉందురు గాక!!


వారణాసి భానుమూర్తి రావు

రచయిత



(ఈ కథలోని ఏ భాగాన్నైనా , ఏ సన్ని వేశాన్ని అయినా రచయిత వ్రాత పూర్వక అంగీకారం లేకుండా ఎక్కడయినా వాడుకొన్నా, సంగ్రహించినా , ఏ సినిమా లోనూ , ఏ టీవీ సీరియళ్ళలోనూ  కొన్ని సన్ని వేశాల్ని కాపీ చేసినా , అనుసరణ చేసినా ఎలాంటి  కాపీ హక్కులు ఉల్లంఘించినా చట్టరీత్యా చర్యలు తీసుకోబడును..) 


25 రోజులుగా 5.10.2020 నుండి 30.10.2020 వరకు ఈ నా   ధారావాహిక ను ప్రోత్సహిస్తూ వచ్చిన పాఠక దేవుళ్ళకూ,  నా ఈ ధారావాహికను ప్రచురించడానికి అనుమతి తెలిపిన అనంత సాహిత్య వేదిక రధ సారధి శ్రీ హరి హర గారికి నా ధన్య వాదములు తెలుపు కొంటున్నాను. అలాగే  మిగతా అడ్మిన్ లకు నా ధన్యవాదములు. ఈ నవలను పుస్తక రూపంలో తేవడానికి  ప్రయత్నిస్తాను. ఇది నా మొదటి నవలా ప్రక్రియ.ఆదరించిన కవి మితృలకు అభివందనాలు.


వారణాసి భానుమూర్తి రావు

రచయిత

హైదరాబాదు.

30.10.2020


సంస్కార సమేత రెడ్డి నాయుడు (24)

 సంస్కార సమేత రెడ్డి నాయుడు (24)


ఇరవై నాలుగవ భాగం

--------------------------------------------------

రాజకీయ కక్షలతో, హత్యలతో ఉట్టడుకుతున్న రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గున మండే టట్లు ఉన్నది.


ఈ చర్యలు , ప్రతీకార చర్యలు   ఇంతటితో ఆగేటట్లు లేవు. ఈ వర్గాల పోరు గురించి చిత్తూరు జిల్లా గాకుండా రాయల సీమలో అంతా కథలు కథలు గా చెప్పుకొంటున్నారు. 


ఈ సారి  ఆషాడ మాసంలో పోలేరమ్మ కు బోనాల పండగ ఘనంగా చెయ్యాలను కొన్నారు జయరామ నాయుడు గారు.


ఎంత ఘనంగా అంటే రెడ్డి వారి పల్లెలో వాళ్ళంతా కుళ్ళి కుళ్ళి సావల్ల అనేట్లు....ధూంధాం  చెయ్యల్ల అని అను కొన్నాడు జయరామ  నాయుడు గారు . సుధాకర్ ,  దివాకర్ మరియు మిగతా గ్రామ పెద్దల్ని పిలచి అందరూ కలసి కూర్చొని  మాట్లాడుకొన్నారు.



" అయితే ఒక కండిషన్..ఆ పల్లెలోంచి  ఒక్క పురుగు ఇక్కడ కనబడినా కాల్చి పారేస్తారు మనోళ్ళు. అక్కడి కాకులు గూడా పల్లె మీద వాలడానికి వీల్లేదు నాయనా" అని అన్నాడు సుధాకర్ కోపంగా..


అప్పుడు అశోక్ రెడ్డి బిక్షగాడి వేషంలో వచ్చినట్లు ఈ సారి వస్తే తుపాకీతో కాల్చి పారేస్తానన్నాడు  దివాకర్.


కోపంతో అన్న దమ్ములు ఇద్దరూ వూగి పోతున్నారు.


" ఈ సారి పెద్ద ..చిన్న అని చూసేది లేదు అన్నా.. కనబడినోళ్ళను  నిలబెట్టి నరకడమే..ఎట్ల అమ్మోరు బలి కోరుకొంటుంది గదా" అన్నాడు ఆ గుంపులో ఒక పెద్దాయన.


ఇంటి ముందర వరండాలో కూర్చొన్న ఈ పెద్ద మనుషుల మాటలన్నీ మణెమ్మ విని‌ భయంతో వణికి పోయింది. ముచ్చెమటలు పట్టి ఒళ్ళంతా కంపర మిచ్చింది. ఎన్ని తలకాయలు తెగి పోతాయో...ఇంకా ఏమి ఉపద్రవం ముంచు కొస్తుందో అని భయ పడి పోయింది.


ఆ నోటా ఈ నోటా ఈ విషయం ప్రాకి రాజ శేఖర రెడ్డి గారి  చెవిన పడింది.


" ఈ సారి పోలేరమ్మ జాతర ఘనంగా చేసు కొంటారంట.ఏమైనా తేడా వస్తే రెండు పెద్ద తల కాయల్ని లేపేస్తామని అని మాట్లాడు కొంటున్నారంట వాళ్ళు " అని‌ ఒకాయన రెడ్డి గారి కి ఈ వార్త అందించాడు.


రాజ శేఖర రెడ్డి కోపంతో రగిలి పొయ్యాడు. నిప్పు తొక్కిన వాడిలా కోపంతో వూగి పొయ్యాడు.


" ఇక్కడ ఎవ్వరూ గాజులు తొడుక్కోలేదు అని చెప్పు..రెండు తల కాయలు మనవి తెగితే వాళ్ళవి  ఆరు తలకాయలు తెగుతాయి. ఆడ మగ అని చూడకుండా లేపేస్తాం. మన సీమ రెడ్ల కత ఇంకా  తెలీదేమో..మంచికి ప్రాణం ఇస్తాం.. లేదంటే అడ్డంగా నరుకు తాం" అని నాగు పాములా బుసలు కొట్టాడు రాజ శేఖర రెడ్డి.


ఆ రోజు పది మంది తన నమ్మక మైన వాళ్ళను  పిలిపించుకొని , వారితో దీర్ఘంగా రహస్య సమాలోచన చేశాడు.


" మనూర్లో ఉండే వాళ్ళకందరికీ చెప్పండి..ఏరు దాటి ఆ పల్లె పరిసరాలకు గూడా పోవద్దని. వాళ్ళు పోలేరమ్మ బోనాలు చేసుకొన్నా , ఇంకేమి చేసుకొన్నా ఎవ్వరూ అక్కడికి పోవద్దని చెప్పండి. సావు కొని తెచ్చు కోవద్దని చెప్పండి. ఇంకో ముఖ్య మైన విషయం ఏమిటంటే ..ప్రతి ఇంట్లో కొడవలో , గొడ్డలో , కత్తో, బాకో , చింత కాయలు కోసే దోటి కొడవలో ఏదో ఒకటి బాగా నూరుకోని పదును పెట్టుకొమ్మని చెప్పండి. ఏ క్షణాన ఏ యుద్దం జరుగు తుందో చెప్పలేం " అని రహస్యంగా మాట్లాడుకొన్నారు రెడ్డి గారు తనకు కావలిసిన నమ్మక మైన వాళ్ళతో..



రాత్రికి రాత్రే వూరంతా గుప్పు మనింది ఈ వార్త. కానీ ఎవ్వరూ ఎవ్వరితో మాట్లాడ డానికి సాహసించడం లేదు. ఎవరింట్లో వాళ్ళు కత్తులు , కటారులు పదును పెట్టు కొంటున్నారు. ఒక పెద్ద చెకి ముకి రాయి నున్నగా ఉంటుంది.. ఆ రాయికి పెట్టి కత్తులు నూరుతారు పల్లెల్లో.


" నిజం ఎవ్వరూ చెప్పడం లేదు..చుట్టాలు వస్తా వుండారు. అందుకే జీవాల్ని కొయ్యల్ల ..అందుకే కత్తులు నూరు కొంటా వుండాము" అని అడిగితే చెప్పతా వున్నారు.


పల్లె పల్లెంతా రాత్రంతా ప్రతి ఇంటినుండి ' సుయ్ సుయ్'   అనే కత్తులు ..కోడవళ్ళు పదును పెట్టడానికి నూరుతున్న శబ్ధాలు వినబడుతున్నాయి. గుండెలు ఝల్లుమనే ఆ శబ్ధాలు విని పల్లెలోని ముసలోళ్ళ ప్రాణాలు పైననే పోతున్నాయి.


*****************************************************


పోలేరమ్మ బోనాల పండగ రానే వచ్చింది.


నాయుడు గారి పల్లె అంతా సంబరాలలో మునిగి పొయ్యారు. అందరూ స్నానాలు ముగించుకొని కొత్త బట్టలు తొడుక్కొన్నారు.


పిల్లలు , పెద్దలూ పరుగులు పెట్టుకొంటూ పోలేరమ్మ  గుడికి చేరు కొంటున్నారు. 


సుధాకర్..దివాకర్ ..ఎక్కడ చూసినా వారే పనుల్ని చూసుకొంటూ అందరినీ పరామర్శిస్తూ కలియ తిరుగు తున్నారు.


అమ్మవారి విగ్రహం భయంకరంగా ఉంది.  ఆరడుగుల విగ్రహం , నల్ల రాతితో చేసిన పోలేరమ్మ విగ్రహం ..మెడలో నిమ్మ కాయల దండ..వేపాకు మండలు..కుంకుమ ..పసుపు ..ధూప దీప నైవేద్యాలు తో అమ్మవారు మిల మిల మెరుస్తా ఉంది.

గుడి బయట విశాల మైన రాతి బండల అరుగును ఏర్పాటు చేసినారు. అక్కడే కోడ్లను..మేకల్ని బలి ఇస్తారు అమ్మ వారికి.


' అయ్యా..వూరు వూరంతా అమ్మ వారి పండగ చేసుకొంటున్నారు. రమను గూడా  గుడికి పంపుదాము. అది ఏడుస్తా ఉండాది" అంది మణెమ్మ.


" సరే...అమ్మి తో నువ్వే కాపలా ఉండు. అమ్మిని జాగ్రత్తగా చూసుకో! " అన్నాడు జయ రామ నాయుడు.


రమ ..మణెమ్మల సంతోషానికి అవధులు  లేవు. 


స్నానాలు చేసుకొని మంచి పట్టు లంగా, వోణి వేసుకొని , బంగారు గాజులు, ముత్యాల హారం , మామిడి పిందెల బంగారు హారం  వేసుకొనింది రమ. ముహాన ఎర్ర కుంకుమ బొట్టు పెట్టుకొని, చెంపల మీద చందనం రాసుకొనింది. మణెమ్మ , నిర్మలమ్మ ఆశ్చర్య పొయ్యారు రమను చూస్తూ..


" అచ్చం..  కనక దుర్గమ్మ తల్లిలా ఉన్నావు. నీ ముహంలో ఏదో దివ్య శక్తి ఉందమ్మా" అని నిర్మలమ్మ. కూతుర్ని హత్తుకొని దీవించింది.


ఇంటిలో కెళ్ళి పళ్ళెంలో సున్నము , పసుపు నీళ్ళు కలుపు కొని మూడు సార్లు దిష్టి తీసింది నిర్మలమ్మ.


నిర్మలమ్మ ఒక్క  పసుపు, కుంకుమ ,వేపాకులు కలిపిన నీళ్ళు ఒక కుండలో నింపి నెత్తిన పెట్టుకొనింది.


మణెమ్మ అన్నం, బెల్లం , పెరుగు కలిపిన అన్నాన్ని ఒక బుట్టలో పెట్టుకొని నెత్తిన పెట్టుకొనింది.


రమ అమ్మ వారికి సమర్పించే పూలు, పళ్ళు, టెంకాయలు వున్న  సంచీని పట్టుకొంది.


నిర్మలమ్మ, మణెమ్మలు గూడా పట్టు చీరలు కట్టుకొని , రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టు పెట్టుకొని, మెడలో రెండు పేటల బంగారు హారం వేసుకొని  గుడి వైపు బయలు దేరారు .‌


ఈ సారి గుడి ప్రత్యేకంగా అలంకరించారు. గుడి పరిసరాలు  శుభ్రం చేసి గుడికి రంగులు వేశారు.


విశాల మైన చలువ తాటాకు వెదురు పందిళ్ళు..రంగు రంగుల కాగితాలు వ్రేలాడుతున్నాయి.


ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే అప్పుడే కొత్తగా వచ్చిన గ్రామ్ ఫోన్ రికార్డ్లు, ఆహుజా వారి లౌడ్ స్పీకర్లు. అందులోంచి వచ్చే సినిమా పాటలు, భక్తి పాటలు నాలుగైదు వూర్ల దూరంలో గూడా విన బడుతోంది.


రెడ్డి వారి పల్లె కు గూడా విన బడుతోంది ఆ పాటల శబ్ధం..

రాత్రిళ్ళు వెలుగు కోసం గ్రామాని కంతా సరిపొయ్యే పెట్రో మాక్సు లైట్లు ఓ యాభై తెప్పించి అక్కడక్కడా వేలాడ దీశారు.


రంగం సిద్ద మయ్యింది.

నాయుడు గారిబ్పల్లెలో మామూలుగా అమ్మవారు ఈరన్న కుటుంబం లో వారికి వస్తుంది.


బాగా అలంకరించి..ముగ్గులు పెట్టిన తావు లోకి వచ్చి చెబుతాడు ఈరన్న.గుంపులు గుంపులు చేరి ఈరన్న కోసం కాచుకొని ఉన్నారు.


నాయుడు గారి కుటుంబ సభ్యులు అందరూ అక్కడే కుర్చీలల్లో కూర్చొని ఈరన్న కోసం కాచుకొని ఉన్నారు.


సుధాకర్ గట్టిగా అరచాడు.."పదుకొండు దాటి పోతావుంది..అమ్మోరు ఏం చెప్పుతుందో అని అందరూ కాచు కోని ఉండారు.. ఎక్కడా ఆ ఈరన్న..పోయి పిలుచు కోని రండి" అని తన మనుషుల్ని పంపినాడు.



కొంతమంది  " అమ్మా తల్లీ కాపాడు.. " అని గట్టిగా అరుస్తూ టెంకాయలు కొడుతున్నారు. కొంత మంది అమ్మ వారిని చూస్తూనే పూనకం పట్టినట్లు వూగి పోతున్నారు. కొంత మంది పోత రాజులు డప్పు పలకల దరువుతో ఎగురుతూ నృత్యం చేస్తున్నారు.


లౌడ్ స్పీకర్లు ఎవ్వరో కట్టేశారు. వద్దని దివాకర్ చెప్పడంతో.

" రంగం లోకి ఈరన్న కొంచెం సేపట్లో వస్తాడు..అందరూ నిశ్శబ్ధంగా ఉండండి.అమ్మోరు మనల్ని దీవిస్తారు. అమ్మోరు చెప్పేది అందరూ బాగా చెవులు బెట్టి వినండి" అని సుధాకర్ గట్టిగా అన్నాడు.


అంతే..ఒక్క సారిగా నిశ్శబ్దంగా మారి పొయ్యాయి ఆ పరిసరాలు. ఎవ్వరూ మాట్లాడ డానికి సాహసించ లేదు.


అందరూ ఈరన్న కోసం కాచుకొని ఉన్నారు. కానీ ఈరన్న రాలేదు.


ఒక్క సారిగా రమ ఎగిరి గంతేసింది. చేతుల్లో ఉన్న పళ్ళేన్ని విసిరి వేసింది. ఆమె ముఖం ఒక్క సారిగా రౌద్రం దాల్చింది. ముక్కు పుటాలు, కను బొమలు అదురు తున్నాయి . నోరు వంకరలు పోతోంది. చేతులూ..కాళ్ళూ తిప్పుతూ నృత్యం చేస్తోంది.


అక్కడున్న  వారికి అర్థం అయి పోయింది.అమ్మ వారు రమలో ఆవాహన అయ్యిందని అందరికీ తెలిసి పోయింది.


అంతలో అక్కడున్న వారికి  ఈరన్న తెలివి తప్పి పడి పొయ్యాడని తెలిసింది. తెలివి వచ్చినాక రంగంకి వస్తాడని తెలిసింది.


" అమ్మా..ఏదో తప్పు జరిగింది..శాంతించు తల్లీ" అని అక్కడున్న ప్రజలు  రమకు దండాలు  వంగి వంగి పెడుతున్నారు.


రమలో శక్తి ఇంకా ఎక్కువయ్యింది.


పది మంది ఆడ వాళ్ళు పట్టుకొన్నా వారి చేత కావడం లేదు..


వారి పట్టు విదిలించుకొని రమ రంగం మీదకు పోయింది.


" ఒరేయ్ ..ఈ రోజు నేను భవిష్యత్తు చెబుతాను. శాంతంగా వినండి. ఈరన్నను నేనే రావద్దన్నాను. " అంది  రమ వూగి పోతూ.


" అమ్మా..మా వల్ల ఏమైన తప్పు జరిగుంటే క్షమించు..మేమేమి సెయ్యాల్నో సెప్పు" అన్నాడు ఒక పెద్దాయన రమ పక్కన నిల బెడి దండం పెడుతూ..


" గ్రామ ప్రజ లారా..మీకు ఒక రహస్యం చెప్తాను. రెడ్డప్ప నాయుడు చని పోతూ ఒక రహస్యం దాచి నారు. అది ఆయన సమాధి కుడి పక్క వెండి పళ్ళెం లో దాచి పెట్టినాడు..పోయి తీసుకు రండి" అంది రమ.


అందరూ ఆశ్చ్యర్య పోయ్యారు.


సుధాకర్ , దివాకర్ ఇంకా కొంత మంది పెద్ద మనుషులతో వారి తాత గారి సమాధికి వెళ్ళి కుడి వైపు గునపంతో తవ్వి వెండి పెట్టెను పైకి తీశారు.


పరుగు పరుగున రొప్పుకొంటూ ఆ పెట్టెను జయరామ నాయుడికి ఇచ్చారు.


ఆ చిన్న పెట్టెను పగల గొట్టి లోపల రాగి రేకు మీదున్న ఉత్తరాన్ని చదివాడు.


అంతే..ఆ రహస్యం చదివిన జయ రామ నాయుడు కళ్ళు తిరిగి పడి పోయ్యాడు


ఏమిటి?? జయరామ నాయుడు తండ్రి గారు వీర కేశవ రెడ్డీనా? రాజ శేఖర రెడ్డి తండ్రి గారు రెడ్డప్ప నాయుడా? అని అక్కడున్న ప్రజలంతా ముక్కున వేలేసుకొన్నారు.


ఆ రహస్యం అందరికీ తెలిసి పోయింది.


" ఇది అమ్మోరు కలలో చెప్పిందంటా ఆ రోజు..అట్లా చేస్తే బిడ్డలు బతుకు తారంట..." అని అక్కడున్న జనాలంతా మాట్లాడు కొంటున్నారు.


ఇంతలో ఒక పాత జీపులో ఒక పది మంది  గూండాల్లా ఉన్నారు.పొలో మని దిగినారు. వాళ్ళ చేతుల్లో నాటు తుపాకీలు ఉన్నాయి. అక్కడున్న ప్రజలంతా భయపడి పోయి తలకు ఒక దిక్కు పారి పొయ్యారు.


ఆ కిరాయి గూండాలు రమను ఎత్తుకొని జీపులో ఎత్తి వేసి క్షణాల్లో అక్కడి నుండి మాయ మయ్యారు.


వూర్లోని యువకులు , పెద్దోళ్ళు, పిల్లోళ్ళు చేతికి ఏది దొరికితే ఆ ఆయుధాన్ని తీసుకొని ఆ జీపు వెంబడీ పరుగెత్తారు.


కొందరి చేతుల్లో కత్తులు , కటార్లు, కట్టెలు, బాకులు, రాళ్ళు తీసుకొని పరుగెత్తారు.


బాహుదా నది పక్క మట్టి రోడ్డు వెంబడీ  రెండు మైళ్ళు పోయి దయ్యాల గుట్ట కింద జీపు ఆపి  గుట్ట పైకి మెడ బట్టి లాక్కోని పొయ్యారు రమను  ఆ గూండాలు. రమ చేస్తున్న ఆర్త నాదాలతో ఆ  దయ్యాల గుట్ట ప్రతిధ్వనిస్తోంది.. పులి నోట్లో   చిక్కుకొన్న లేగ దూడ  వలే రమ గడ గడ మని వణికి పోతోంది.

**********************************************************************************************(తరువాత ఏమయ్యిందో రేపు  ఇరవై  ఐదవ భాగం ( చివరి? ) లో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి.

Copy Rights with Author 

Wednesday, October 28, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (23)


 సంస్కార సమేత రెడ్డి నాయుడు (23)

ఇరవై మూడవ భాగం

-------------------------------------------------------------


  పాతికేళ్ళ తరువాత ...


ఒక్క రోజు రెడ్డప్ప నాయుడు గారు మణెమ్మను పిలిచి నాడు గది లోకి.


" మణెమ్మా..." 


" అయ్యా!"


" పదహారేళ్ళప్పుడు  ఇంటికి వచ్చి మాతోనే కట్టమో..నష్టమో మా తోనే ఉండావు. పెళ్ళి గూడా సేసు కోకుండా మా కోసం నీ జీవితం త్యాగం చేసినావు..మేము ఎంత జేసినా నీ ఋణం తీర్చు కోలేము అమ్మా! " అని చెబుతూ వుంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగి నాయి. బొంగురు పోయిన కంఠంతో వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటు తువ్వాలుతో కన్నీళ్ళను తుడుచుకొన్నాడు ఎనభైఏళ్ళ రెడ్డప్ప నాయుడు గారు.



" అట్లా అనొద్దు అయ్యా...ఆ రోజు మీరు ఈ ఇంటిలో నన్ను నమ్మి నాకొక స్తానం ఇచ్చినారు. లేదంటే నా జీవితం కుక్కలు సింపిన ఇస్తరి అయి పొయ్యేది" అని రెండు చేతులూ ఎత్తి దండం పెట్టింది. మణెమ్మ కు గూడా దుఃఖం ఆగింది కాదు..చీర కొంగుతో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొనింది.



" నువ్వు సావధానంగా విను మణెమ్మా! ..నీకు ఒక రహస్యం చెప్పుతాను. ఈ రహస్యం ఇంత వరకూ ఎవ్వరికీ తెలియదు ..నువ్వు గూడా ఎవ్వరికీ చెప్పోద్దు .." అన్నాడు రెడ్డప్ప నాయుడు.


" నాకు వయసు అయి పోతా ఉండాది. నాకు ఆరోగ్యం గూడా బాగా లేదు. రేపో మాపో సావు దగ్గరకు వస్తుంది.‌వీర కేశవ రెడ్డి ఆరోగ్యం ఏం బాగాలేదు ..ఆయన మంచాన పడి శ్యానా రోజులు అయ్యింది.  ఈ పొద్దో ..రేపో అన్నట్లున్నాము ఇద్దరమూ..అందుకే ఈ రహస్యం నీకు చెబుతున్నా" 

మణెమ్మ ఆశ్చ్యర్యంతో చూసింది రెడ్డప్ప నాయుడు గారిని.


నాయుడు గారు మొత్తం  పైన జరిగిన కథ అంతా వివరంగా చెప్పినారు మణెమ్మకు ..బాహుదా నదిలో ఎట్లా బిడ్డల్ని మార్చుకొనిందీ ..ఎందుకు మార్చ వలసి వచ్చిందీ ..ఎట్లా మణెమ్మకు , తన భార్యకు గూడా తెలీకుండా బిడ్డను మార్చిందీ అంతా వివరంగా చెప్పినాడు.


మణెమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు బొట బొట మని రాలాయి.


" ఈ రహస్యం అమ్మ గారికి గూడ చెప్పకుండా ఎట్ల దాచినారు అయ్యా? "


" బిడ్డల భవిష్యత్తు కోసం " అన్నాడు రెడ్డప్ప నాయుడు గారు.


" ఇదో ఈ రాగి రేకులో ఆ రహస్యం అంతా రాసినా. ఈ వెండి పెట్టెలో ఈ రాగి రేకు పెట్టి తాళం వేసినా .. నేను సచ్చి పోయినాక నా సమాధిలో దాచి పెట్టు" 

అన్నాడు రెడ్డప్ప నాయుడు.


" అలాగే అయ్యా" అని ఆ చిన్న పెట్టెను తీసుకొని తన గదిలో ఒక రహస్య మాళిగలో దాచి పెట్టింది.


ఆరు నెలల తరువాత రెడ్డప్ప నాయుడు..ఆ  తరువాత రెండు నెలలకు వీర కేశవ రెడ్డి కాలం చేశారు. 


ఒక రోజు అర్థ రాతిరి మణెమ్మ రెడ్డప్ప నాయుడు సమాధిని తవ్వి  వెండి పెట్టెను లోపల దాచి పెట్టి మళ్ళీ సున్నంతో కప్పి ఏమీ తెలీనట్లు వచ్చి పడుకొనింది.

***********************************************



" ఇదమ్మా ..జరిగిన కథ " అని‌ మణెమ్మ  రమను హత్తుకొని ఏడుస్తూ అంది.


" పెద్దమ్మా..ఇంత రహస్యాన్ని  కడుపులో ఎట్లా ఇన్నేళ్ళు  దాచుకొన్నావు?   అంది రమ.


" వీర కేశవ రెడ్డి కొడుకుగా రెడ్డప్ప నాయుడు కొడుకు, రెడ్డప్ప నాయుడు  కొడుకుగా వీర కేశవ రెడ్డి కొడుకు ఒకరికి తెలియ కుండా ఇంకొక్కరు పెరుగుతున్నారు. ఈ రహస్యం ఒక్క పెద్దోళ్ళ కిద్దరికేనా తెలిసిండేది?  నాయనకు గూడా తెలీదా తన జన్మ రహస్యం ? " అంది రమ.


" అవునమ్మా..తెలీదు" అంది మణెమ్మ.


" ఈ రహస్యం ఒక్క పెద్దోళ్ళ కిద్దరికే తెలుసు.వాళ్ళూ సచ్చి పోయినారు. వుండేది నువ్వే..పెద్దమ్మా..ఈ హత్యలు..రాజ కీయాలు ఈ రహస్యం తెలిస్తే  నిలచి పోతాయా? " అని అడిగింది రమ.


" తలకాయలు నరుక్కొనే కాడికి వచ్చినారు గదమ్మా..ఈ కత చెప్పితే నమ్ముతారా? కట్టుకత అని నా తల నరుకు తారు" అని చెప్పింది  మణెమ్మ. 


రమ కి ఏమీ అర్థం కాలేదు..ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలీక మణెమ్మ ఒడిలో పడుకొని అలాగే నిద్ర పోయింది. 

********************************************

***********************************************(తరువాత ఏమయ్యిందో రేపు  ఇరవై  నాలుగవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. ఈ కథ కేవలం కల్పితం)


(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )


రచయిత: వారణాసి భానుమూర్తి రావు 

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

కాపీ హక్కులు @రచయితవి.

Copy Rights with Author