Friday, September 13, 2013

మా గుడిసె

మా గుడిసె

మా గుడిసె మాకు గుడి!
మా గుడిసె మాకు తల్లి వొడి !
తాటాకు మండెలు తంబూరాలు మీటుతుంటె
గుడిసె గుండెల్లో నిద్రపోతాము మేము

గుడిసె చూరు మీద నుండి
జాలు వారే నీటి బొట్టులే
మా ఎద లయల్ని తాకే రాగలీనాలు 
కట్టెల పొయ్యి లోంచి గుడిసె పైకి
ఎగజిమ్మే పొగల సాక్షిగా
మా గుడిసే మాకు గుడి
మా గుడిసే మాకు తల్లి వొడి
తెల్లటి సున్నాలు వేసుకొన్న మట్టి గోడలే
మాకు దివ్యమైన ప్రాకారాలు
తెల్లని గోడల మీద వేసుకొన్న ఎర్రటి చారలే   
మాకు చిత్ర కళా రూపాలు 
చూరు మధ్యలో వేలాడే లాంతరు బుడ్డీయే 
మాకు వెలుగు నిచ్చే బతుకు దీపాలు
మిణుగురు పురుగుల వెదజల్లే వెలుతురు లోనే
మా జీవితాల్ని తెరచి చూస్తాం
వాన పడ్డప్పుడు భూకన్నాల్లోంచి ఒక్కసారిగా
బయట పడ్ద రెక్కల పురుగులే మా ఆశా కిరణాలు 
వెదురు కర్రల తలుపుల కిర్రు కిర్రు శభ్ధాలే 
మా జీవితాలను పలకరించె మధుర నాదాలు
గుడిశె గర్భగుడిలో నిదురోతున్న 
నందీశ్వరులు మా పిల్లలు  
వానా కాలంలో మా గుడిసె ఉగ్ర గోదారే !
కట్టుకొన్న మట్టి గోడలు కూలిపోతే
ఆకాశ మంత పందిరి కనపడుతుంది-  
మా మొండి గోడల గుడిసెకు
అప్పుడు మా గుడిసె సౌధాన్ని వీడి
ఎక్కడొ తల దాచుకొంటాం !
వాన విరిసీ విరియ గానే
మా గుడిసె గూడును కట్టుకొంటాం
 
మా గుడిసె మాకు గుడి!
మా గుడిసె మాకు తల్లి వొడి !

12.09.2013

Saturday, August 3, 2013

పునరపి జననం

పునరపి జననం

నా  కింకా అక్కడే ఉన్నట్లు జ్ఞాపకం
నా బాల్యం లోని గత  స్మృ తుల్ని నెమరువేసు కొంటున్నట్లు జ్ఞాపకం
గతంలో జార విడిచిన స్వప్న సింధూరాలు
మళ్లి   శ్వాసిస్తున్నట్లు జ్ఞాపకం
మస్తిష్కం లో తళుక్కు మంటున్న గతానుభవాల స్మృతులు
నన్ను అమృత సరస్సులో నిలువెత్తున ముంచెత్తుతున్న అనుభూతులు
మానస సరోవరంలో  ఆనంద బ్రహ్మ కమలాలను
స్పృశిస్తున్నట్లుగా  జ్ఞాపకం
నా కింకా నా గుండెల్లో నేను  కరగి పోయినట్లు
నా తనువు  నా ఆత్మతో సంగమిస్తున్నట్లు
 నా మదిలో  జాగృతమైన ఆలోచనా తరంగాలు
ఒక భావ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లుగా జ్ఞాపకం
సిద్ద యోగిలా తనువు  నొదిలి నా ఆత్మ ఎక్కడికో
సుదూర తీరాలకు ప్రయాణం చేస్తున్నట్లు
రాత్రి పగలు మమేకమయ్యే సుందర తీరానికి చేరుకోన్నట్లు
సముద్రపు మధ్యన నిలబడి అలల మిద కూర్చొని పయనం సాగిస్తున్నట్లు
ఎగిరి ఎగిరి ఆకాశం లో ముందుకు సాగే కరిమబ్బుల  వెనకాల దాగొన్నట్లు
శూన్యం లోకి అడుగులు వేసి సుదూర గ్రహాల్ని దాటి
ఆత్మ సందర్శనం చేసుకొన్నట్లు జ్ఞాపకం !


 

Sunday, July 28, 2013

చెట్లు శపిస్తాయి

చెట్లు
తపిస్తాయి
చెట్లు
శపిస్తాయి
నీటి కోసం
తపిస్తాయి
ఎండి పొతే
శపిస్తాయి
చెట్లు మాట్లాడుతాయి
చెట్లు ఏడుస్తాయి
అషాడంలో ఆడుకొంటాయి
వైశాఖంలొ ఏడ్చుకొంటాయి
దయలేని మానవుల్లారా !
మా గుండెల్ని చీల్చకండి
మా తలల్ని నరకకండి
కొమ్మల చిట్టి తల్లులు
ముద్దులొలుకుతున్న
మా చిన్నారి పూమొగ్గల్ని
చిదమకండి
మా గొంతు తడపడానికి
చుక్క నీరందకుండా
సిమెంటు రోడ్లు తో  నింపేశారే!
పచ్చని  చెట్లున్నఅడవుల్ని
అభివృద్ధి పేరుతొ
దహించి వేసారే!
దయ లేని మనుష్యు లారా !
మీ కిది న్యాయమా?
కాకులు దూరని కారడువులు లేవు
చీమలు దూరని చిట్టడవుల్లేవు
పచ్చని చెట్ల మీద  వాలే పక్షులు లేవు
తళ తళ లాడే తటాకులు లేవు
మమ్మల్ని కాపాడే  ఆదివాసీలు  లేరు
మనిషి  మళ్లి మనిషయితే  తప్ప
మా  బ్రతుకులు  మళ్లి  చిగురింపవు!






 

Wednesday, July 24, 2013

సమస్యా పూరణం


సమస్యల
రహస్యాలెమిటో
ఇంతవరకూ నాకర్థం గావడం లేదు
జీవిత మంతా
సమస్యల వలయమే!
ఒక్కొక్క సమస్యా
జారుడు మెట్లులా
వదల గొడుతూంటే
పిల్లాడొదుల్తున్న
సబ్బు బుడగల్లా
మళ్ళీ పుట్టుకొస్తున్నాయి
దూది పింజల్లా
గాలి లోకి సర్రున ఎగురుతున్నాయి
ఆశల మిణుగురు పురుగులు
ఈత చెట్లల్లో తిరుగుతున్నప్పుడు
ఆ కటిక చీకట్లలో
అక్కడక్కడా వెలుతురు చుక్కలు
కనపడుతున్నాయి
ప్రతి సమస్యా
ఒక సిస పద్యమై 
ఛందస్సు రాక
సమస్యా పూరణం చేత గాక 
అసంతృప్తి పురాణాన్ని
వ్రాస్తూనే  వున్నాను .

24.07.2013
( నా 'సాగర మథనం' సంకలనం నుండి -1990 లొ రాసినది )    


 

Tuesday, July 23, 2013

జెనెరేషన్ గ్యాప్

జెనెరేషన్ గ్యాప్


మా భవనాలు మొలుస్తున్నాయి
మా పునాదులు పూస్తున్నాయి
మా కాంక్రీట్ తో కట్టిన గోడలు
పగల బడి నవ్వుతున్నాయి
మా రంగుల కొంపలు
సీతాకోక చిలుకల్లా ఎగురుతున్నాయి
మేము కట్టుకొన్న అశా సౌధాలు
మా శవ పేటికలో భద్రంగా దాచ బడ్డాయి
మేము నిలబెట్టిన సిమెంట్ దిమ్మెలు
మా శరీరాలకు వెన్నెముక గా నిలబడ్దాయి
మా చెమట బిందువులతో తడిసిన
ఈ తోట బంగారు కాయలు కాచింది
మా అడుగుల ముద్రలతొ
ఈ నేల పచ్చని చిత్తరువుగా మారింది
మేము కట్టుకొన్న ఆశాసౌధాల్లో
కొన్నేళ్ళ్ తర్వాత మా ఆత్మలు తిరుగుతాయి
మెము మరణించిన తర్వాత
మా ముని మనమలు మా చిరునామా కోసం వెదుకుతారు
మేము వదలి పోయిన వెండి కంచాల్లొ
వాళ్ళు పంచ భక్ష్య పరమాన్నాలు తింటారు
మేము రహస్య పేటికలలో దాచుకొన్న
స్వర్ణ స్మృతులను వాళ్ళు బయటికి విసిరి వెస్తారు
మెము కాపాడిన సభ్యతను
వాళ్లు ఫినాయిల్ తో కడిగి వేస్తారు
మేము పెంచిన సంస్కారాన్ని
వాళ్ళు భూస్థాపితం చేస్తారు
మేము కట్టిన భవంతుల్లో
వాళ్ళు డాలర్ల ముళ్ళను పరచి వేస్తారు
విదేశీ వ్యామోహములో
తరాలు మారాయి
అంతరాలు మారాయి
ఇప్పుడు ఆ ఇల్లు
జీవం లేని శిల్పంగా పడి ఉంది
ఆ ఇల్లు నిశ్శబ్ధ గీతమయ్యింది .


Sunday, July 21, 2013

నిశ్శబ్ద గీతం

నువ్వెప్పుడైనా నిశ్శబ్ద గీతం విన్నావా?
ఒక్క సారి ఏకాంతంలో నీ  చెవులలో మ్రోగే  ఓంకారనాదాన్ని విన్నావా?
చూరు నుండి బొట్టు బొట్టు కారే నీటి శబ్దం లో ఒక రాగం విన్నావా ?
నీ  స్నానాల గదిలో నీటి భాష ను విన్నావా ?
సన్నని తుంపర చేసే   సరికొత్త  రాగం విన్నావా?
ఆషాడ మాసంలో తల లూపే  చెట్లలో వినపడే ఆనంద  రాగం  విన్నావా?
రైలు వెంబడి పరుగెత్తే మేఘాలు పాడే  మోహన  రాగం విన్నావా?
సంధ్యా సమయంలో పక్షలు జేసే జుగల్ బంది విన్నావా?
సాయంకాలపు నీరెండలొ సముద్రం జేసే సవ్వడి రాగం విన్నావా?
టిక్ టిక్ మంటూ గడియారపు ముళ్ళు జేసే లయ విన్యాసం విన్నావా?
శ్రీమతి జేసే గాజుల సవ్వడి విన్నావా ?
అందాల పాప కు తొడిగిన గజ్జెల సవ్వడి  విన్నావా?
గంగిరెద్దుల వాడి విన సొంపయిన సన్నాయి రాగం విన్నావా?
రాగ రంజిత మైన జీవన రాగం విన్నావా?



 

Friday, July 19, 2013

ఎంతయినా నేను చె త్తబుట్ట నే గదా !


ఎంతయినా నేను చె త్తబుట్ట నే గదా !

అవును
నేను చెత్త బుట్ట నే !
కాళ్ళతో తన్నినా ఓ మూల పడి ఉంటాను 
మీ పాద ధూళీతో పునీతమవుతాను
నేను చెత్తబుట్ట ను
మీరు నా వైపు కన్నెత్తయినా చూడరు
కాని నా అవసరం మీకెపుడూ  వుంటుంది
ఇళ్ళల్లో , అఫిసుల్లొ
మీరు తినేసిన ఎంగిళ్ళను, చీకేసిన తోక్కళ్ళను
మీరు విసిరేసిన చిత్తు కాగితాలను
నన్ను నింపడానికి మాత్రమె
నేను గుర్తుకు వస్తాను
నన్ను తాకాలంటే మీకు భయం
నా బాక్టీరియా తో మీరు హైరానా పడతారు
నన్ను కాళ్ళతో నొక్కి నా నోరు తెరుస్తారు
'అమ్మా    చెత్త '   అనే మున్సిపాలిటీ అబ్బాయి మాత్రమె
నన్ను ప్రేమగా చూసుకొం టా డు
నాలో చెత్తను తీసేసి మీ కిస్తాడు  
మళ్లి మీరు నన్ను ఒక మూలకి నెట్టేస్తారు
అందరికి ఊడిగాలు     చేస్తున్నా-
 కానీ  మీ ఇంట్లో  పోపుల డబ్బా  కున్న విలువ నాకు లేదు
ఇంట్లోనే అంటరాని దాన్ని అయిపొయ్యాను   
ఎంతయినా నేను చె త్తబుట్ట నే  గదా !                                   

 (ఎందుకో ఆఫీసులో  ప్రొద్దున్నేచె త్తబుట్ట కాళ్ళకి తగిలింది .చి రాకుగా కాళ్ళతోనే మూలకి తోసేసిన వెంటనే దాని ఆత్మ నాతొ మూగగా మాట్లాడింది , ఆ స్పందనే ఈ కవిత )