Friday, September 13, 2013

మా గుడిసె

మా గుడిసె

మా గుడిసె మాకు గుడి!
మా గుడిసె మాకు తల్లి వొడి !
తాటాకు మండెలు తంబూరాలు మీటుతుంటె
గుడిసె గుండెల్లో నిద్రపోతాము మేము

గుడిసె చూరు మీద నుండి
జాలు వారే నీటి బొట్టులే
మా ఎద లయల్ని తాకే రాగలీనాలు 
కట్టెల పొయ్యి లోంచి గుడిసె పైకి
ఎగజిమ్మే పొగల సాక్షిగా
మా గుడిసే మాకు గుడి
మా గుడిసే మాకు తల్లి వొడి
తెల్లటి సున్నాలు వేసుకొన్న మట్టి గోడలే
మాకు దివ్యమైన ప్రాకారాలు
తెల్లని గోడల మీద వేసుకొన్న ఎర్రటి చారలే   
మాకు చిత్ర కళా రూపాలు 
చూరు మధ్యలో వేలాడే లాంతరు బుడ్డీయే 
మాకు వెలుగు నిచ్చే బతుకు దీపాలు
మిణుగురు పురుగుల వెదజల్లే వెలుతురు లోనే
మా జీవితాల్ని తెరచి చూస్తాం
వాన పడ్డప్పుడు భూకన్నాల్లోంచి ఒక్కసారిగా
బయట పడ్ద రెక్కల పురుగులే మా ఆశా కిరణాలు 
వెదురు కర్రల తలుపుల కిర్రు కిర్రు శభ్ధాలే 
మా జీవితాలను పలకరించె మధుర నాదాలు
గుడిశె గర్భగుడిలో నిదురోతున్న 
నందీశ్వరులు మా పిల్లలు  
వానా కాలంలో మా గుడిసె ఉగ్ర గోదారే !
కట్టుకొన్న మట్టి గోడలు కూలిపోతే
ఆకాశ మంత పందిరి కనపడుతుంది-  
మా మొండి గోడల గుడిసెకు
అప్పుడు మా గుడిసె సౌధాన్ని వీడి
ఎక్కడొ తల దాచుకొంటాం !
వాన విరిసీ విరియ గానే
మా గుడిసె గూడును కట్టుకొంటాం
 
మా గుడిసె మాకు గుడి!
మా గుడిసె మాకు తల్లి వొడి !

12.09.2013

No comments:

Post a Comment