Sunday, November 3, 2019

కరి‌ వేపాకు

నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *14-10-2019*
*వారణాసి భానుమూర్తి రావు*
సంఖ్య: *153*
అంశం *కరివేపాకు*
శీర్షిక: *కరివేపాకు*

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
వేపాకులా కరివేపాకు
ఔషధ దాయిని
సర్వ రోగ నివారిణి
సర్వ శక్తి ప్రదాయిని

ప్రతి కూరలో
కరివేపాకు
ప్రతి ఉపాహారంలో
కరి వేపాకు

ప్రతి ఇంటి పెరట్లో
కరి వేపాకు  చెట్టు
అదే వారి ఆరోగ్యానికి
 తొలి మెట్టు

కొంతమంది మనుష్యులు
 ప్రేమాభిషేకాలు చేస్తారు
అవసరం తీరగానే
కరివేపాకులా ప్రక్కన బెడతారు


అధికారులు స్టాఫ్ ని  పనుల కోసం
 నాయకులు ప్రజల్ని  వోట్ల కోసం
పిల్లలు తల్లితండ్రుల్ని ఆస్థి కోసం
వాడుకొంటారు  కరివేపాకులా
అవసరం తీరగానే విసిరి వేస్తారు





ఆచమనం విశిష్టత

★ఆచమనం విశిష్టత★

 మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతోపాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి.

మన గొంతులో 'స్వరపేటిక' అనే శరీర అంతర్భాగం వుంటుంది. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆ ధారం. స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతులమీదుగా పయనించినప్పుడు, ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటకు రావడానికి నోరు, ముక్కు రంధ్రాలు సహాయపడతాయి.

 అదేవిధంగా నాలుక పెదవులు శబ్దాల ఉచ్ఛారణకు, స్పష్టతకు దోహదం చేస్తాయి. ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది. నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని (అక్షరం) ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంఠ్యాలు, తాలవ్యాలు మొదలైనవిగా విభజించారు. ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆచమనం వలన మన నాలుకకు, గొంతుకు ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది.

అంతేకాకుండా మన గొంతునుండి మాట బయటకు వచ్చేటప్పుడు, ధ్వనితోపాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా లోపలి నుండి వాయువు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది.

 నిర్దిష్ట పరమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపలివైపు మార్గాన్ని నునుపుగా చేసి మన మాట సులభంగా, స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది. పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయా మంత్రాలన్నీ గొంతునుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకే మన మహర్షులు ఈ ఆచమన సంప్రదయాన్ని ఏర్పరచారు.

ఇక ఆచమనంలో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇమిడి ఉంది. ఆచమనంలో ముందుగా "కేశవాయస్వాహా: అని చెప్పుకుంటారు. ‘కే’  శబ్దము గొంతునుండి పుడుతుంది. తర్వాత పలికే "నారయణస్వాహా" అనే నామము నాలుక నుండి వస్తుంది. ఇక మూడవసారి చెప్పుకునే "మాధవాయస్వాహా" అనే పదము పెదవుల సహాయంతో పలుక బడుతుంది. కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు, నాలుకకు, పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది మరియు ఆ తరువాత వచ్చే శబ్దాలకు ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంతుంది.

మన శరీరము ఒక విద్యుత్ కేంద్రములాంటిది, మన శరీరమంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రో మాగ్నిటిజమ్ పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకొంటుంది. ఈ నీటిని త్రాగినప్పుడు, నీరు జీర్ణకోశమును చేరి, అక్కడి గోడలలో ప్రవహించే విద్యుత్తుతో కలిసి, శరీరమంతా ఒకే క్రమపద్ధతిలో విద్యుత్తు ప్రవహించేలాగా చేస్తుంది.

ఇలా విద్యుత్తీకరణము చెందిన నీరువల్ల గొంతు, నాలుక, స్వరపేటిక మొ|| భాగాలు కూడా ఉత్తేజము పొందుతాయి.

ఇంతటి వైజ్ఞానికాంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే, మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమంగా ఏర్పరిచారు💐

లోకాసమస్తా సుఖినోభవంతు.

నాగుల చవితి

*నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *31- 10-2019*
*వారణాసి భానుమూర్తి రావు*

అంశం * నాగుల చవితి*
శీర్షిక: *నాగుల చవితి*

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


పాములకు‌ మొక్కే సంస్కృతి మనది
నాగ జాతిని‌ గౌరవించే ఆచారం
నాగుల చవితిని‌ పండగ గా చేసుకొని
అమ్మ లక్కలు‌ దీవెనలు పొందేరు

పాలు‌ పుట్టలో‌ పోసి
నాగన్నా  పైకి‌ రావన్నా  అంటూ
నాగులకు పాలాభిషేకం చేస్తారు
నాగుల చవితి‌ రోజు

శివుడి‌ మెడలో హారమైన
నాగ రాజుకి నీరాజనాలు
విష్ణు మూర్తికి  శయనింపు తల్పమైన
ఆది శేషుడికి  అభినందనాలు

ప్రకృతి‌ని‌ ప్రేమించెడి ఆచారము
దేవుళ్ళకు‌ వాహనాలయిన
జంతు పక్షుల కొలుచుట
హిందూ పండగల వైశిష్ట్యము
ప్రకృతిని ఆరాధించెడి
పండగలు‌ మన స్వంతం.

Tuesday, October 29, 2019

చినుకు‌ మాట్లాడితే!


*నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *22- 10-2019*
*వారణాసి భానుమూర్తి రావు*
సంఖ్య: *157*

అంశం *చినుకు మాట్లాడితే! *
శీర్షిక: *చినుకు మాట్లాడితే!*

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


సముద్రాలు  మేఘాలను  రాయబారానికి పంపిస్తే
చిట్టి చిట్టి చినుకమ్మలు మళ్ళీ సముద్రాన్ని  పలకరిస్తాయి

ఆవిరి బుడతలు ఆకాశానికి ఎగిరే కొద్దీ
నీటి మేఘాలు వువ్వెత్తున‌ పొంగుతాయి

ఏకధాటిగా చినుకు చినుకు ఆడుకొంటూ
గగనం నుండి  వాన రాగాల్ని పాడుకొంటూ
భూమి తల్లిని అభిషేకం చేస్తాయి
కల్మషం లేని జలంతో

కరి‌మబ్బులు నేలమ్మను దీవిస్తే
పచ్చని‌ ప్రకృతి పులకరిస్తుంది
పుడమిని చీల్చుకొని రెండు లేతమ్మ ఆకులు
రెపరెప లాడుతూ ఆడుకొంటాయి
చల్లని తుషార బిందువులతో
ప్రభాత కిరణాల్ని పరిచయం చేసుకొంటాయి

చినుకమ్మ మాట్లాడితే
ఈ పృధ్వి పులకరించదా?
ఈ పక్షులు పలకరించవా?
ఈ తరువులు కుశల ప్రశ్నలు వెయ్యవా?

చినుకమ్మ మాట్లాడితే
ఈ కవి గుండెల్లొ అక్షరాల హరివిల్లు పూయదా?
భావాల పొదరిల్లు వికసించదా?
కవిత్వం సముద్రమై పొంగదా?


********************************

బ్రహ్మశ్రీ  ప్రభాకర స్వామి


వారణాశి వారికి ముందుగ  శుభాభివందనలు.. శుకాభినందనలు!!  మీ కవిత స్పందింప చేసింది!   కవి హృదయాన్ని ఆవిష్కరింప  చేసింది!!
'భాషమీద అధికారం నీకుంటే కవనానికి అడ్డేముందోయ్ నేస్తం..
ఆ భూషణమై  రాదా ఎగరేసుకుని తన మస్తకం'....
నాలుగు మాటలకూర్పా  కవిత్వం...
భాష భావం... ఊహ ఉత్ప్రేక్షల సంగమం!! దమ్మున్న కవి
కలం విదిలింపు....
సమ్యక్ భావాల మేళవింపు.......
అనిపించింది మీ కవిత... ధన్యోహం!
కదిలిన భావ సందోహం!!
ఇది మీ నేటి కవిత...
రసజ్ఞులకది మేటి కవిత..


Monday, October 28, 2019

ఆ రాత్రి ఏమయ్యిందంటే!

ఆ రాత్రి ఏమయ్యిందంటే!
----------------------------------------
రచన: వారణాసి భానుమూర్తి రావు
---------------------------------+++-------------

ఆ రాత్రి ఎవ్వరో తలుపు తట్టారు.

నాకు భయం వేసింది. ఇంత అర్ధ రాత్రి వేళ ఎవ్వరయి ఉంటారబ్బా అని. ఏ దొంగలో దోపిడీకి వచ్చారేమో అని భయ పడి పొయ్యాను. నేను వేరే వూరికి ట్రాంస్ ఫర్ అయినందువల్ల , ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒక్కడే ఉంటున్నాను. బాంకు మేనేజర్ అయినందు వలన బాంకుకు దగ్గరగా ఇల్లు తీసుకొన్నాను.

మళ్ళీ తలుపు కొట్టిన శబ్దం.
బయట వర్షం పడుతోంది. బిగ్గరగా వాన చినుకు ల శబ్ధం వినబడుతోంది.
దేవుడి మీద భారం వేసి తలుపు తీశాను.

ఎదురుగా ఒక పదహారేళ్ళ అందమైన ఆడపిల్ల. ఆమె ముఖంలో భయం , వళ్ళంతా వణుకుతూ ఉంది.

దబుక్కున నన్ను లోపలికి తోసి , తలుపు గడియ పెట్టింది.
ఆమె చొరవ కు ఆశ్చర్య పొయ్యాను.

( మిగిలిన కథ రేపు )

" ఏమయ్యిందమ్మా?" అని అడిగాను.


ఆమె చలికో , భయానికో గడ గడ మని‌ వణికి పోతూ రెండు చేతులూ ముఖాన్ని కప్పుకొని ఏడుస్తోంది.

వెంటనే నేను ఒక తువ్వాలు తెచ్చి ఇచ్చాను. 
మళ్ళీ అడిగాను , ఏమయిందని..

ఆమె చిన్న పిల్లలా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి ఇలా తన కథ చెప్ప సాగింది.

ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో బర్థ్ డే పార్టీ కని వచ్చిందట. వాళ్ళను నమ్మి అర్థ రాత్రి దాకా అక్కడే గడిపి వారి కార్లో ఇంటికి వచ్చేటప్పుడు కార్లోనే ఆ ముగ్గురూ తనని బలాత్కరించ బొయ్యే సరికి, తను పెనుగు లాడి, ఎలాగో ఒక లాగు  కార్లోంచి బయటకు దూకి చీకట్లో పారి‌పోయిందట. కొంత సేపటి తరువాత వెనుక కాలనీ లోని మీ ఇల్లు కనబడే సరికి తలుపు తట్టాను అని ఏడుస్తూ చెప్పింది. ఆమె వంట్ళో నిస్సత్తువతో మాట్లాడ లేక పోతోంది.

వేడి వేడి టీ , కొన్ని బిస్కట్లు , ఆపిల్ ముక్కలు తెచ్చి ఆమె ముందు పెట్టాను. ఆమె వద్దంటూనే కాస్త తినింది.

"చూడమ్మాయ్..సమయం..సందర్బం లేకుండా ఆడ పిల్లలు‌ ఇలా తిరగ్గూడదు. ఇంట్లో పేరెంట్స్ కి చెప్పకుండా బయటకు రాగూడదు.  అసలే రోజులు బాగా లేవు. ఆడ పిల్లలకు రక్షణ లేదు. వారి జాగ్రత్తలో వారు ఉండాలి."

ఆ రాత్రంతా ఆ అమ్మాయి మేలుకొనే ఉంది.భయంతో నిద్ర పోవడం లేదు. తెల్లవారి నా కార్లో ఆమెను వాళ్ళింట్లో దింపి వచ్చాను.

మరుసటి రోజు పేపర్లో ముగ్గురి యువకుల అరెస్టు అనే వార్త చూసి చాలా సంతోషించాను.

ఇంకా ఈ దేశంలో న్యాయం మిగిలే ఉంది అని అనుకొన్నాను.

********************************************************

దీపావళి

*నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *26- 10-2019*
*వారణాసి భానుమూర్తి రావు*
సంఖ్య: *159*

అంశం *దీపావళి*
శీర్షిక: *దీపావళి*

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!



దీపాల పండుగ
జగాన  వెలుతురు  పండగ
చీకట్లను పారద్రోలి
జీవితాన ఆనంద జ్యోతులను
వెలిగించు పండుగ

ఆశల్లాంటి
తారాజువ్వలు
ఆకసానికి ఎగరగ
మదిలో విరబూయును
కాకరొత్తుల ఆనంద  ప్రభలు

ప్రమిదల సమూహంలో
వెలిగే జ్యోతులు
ఇంటికి చేకూరును
సిరుల కాంతులు

ఆనాడైనా ఈ‌నాడైనా
దీపావళి పేదల బ్రతుకులకు
బరువయిన‌ పండగే!
ఆరి పోయిన మతాబులను
ఏరుకొనే  బడుగు పిల్లల
జీవితాలు  ఎప్పటికీ
వెలగని టపాసులే!


టపాసులు అందించే
కాలుష్యాన్ని తగ్గించి
ఆరోగ్య దీపావళిని
అందరూ ఆహ్వానిద్దాం






Wednesday, September 25, 2019

నిర్వేదం


నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *21-09-2019*
*వారణాసి భానుమూర్తి
అంశం *నిర్వేదం*
శీర్షిక: *నిర్వేదం*

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


అనిశ్చతి  అభయారణ్యంలో
అవకాశ వాదుల క్రూర మృగాల మధ్య
బ్రతకడం కష్టమే !

నిర్భయంగా నడవాలనుకొన్నా
ఆటంకాల అవరోధాల లాండ్ మైన్లు
అడుగడుగునా ఆవరిస్తూనే ఉంటాయి

 *నిర్వేదాల*  వేదాలు
నైరాశ్యపు గీతాల్ని వినిపిస్తుంటే
ప్రతి శ్లోకమూ ఒక శోకమై
బ్రతుకు  భారమయిన వేళ
మనిషి పురోగమించడం  కష్టమే!

 గ్రహ మండలాలు దూరమయినా
మానవుడు కాలు మోపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు
అవకాశాలు అంచులో లేక పోయినా
అందుకోవడానికి  ప్రయత్నిస్తూనే వుండాలి

రానీ రాక పోనీ
కానీ  కాక పోనీ
నీ ప్రయత్నం వృధా కారాదు.