Tuesday, October 29, 2019

చినుకు‌ మాట్లాడితే!


*నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *22- 10-2019*
*వారణాసి భానుమూర్తి రావు*
సంఖ్య: *157*

అంశం *చినుకు మాట్లాడితే! *
శీర్షిక: *చినుకు మాట్లాడితే!*

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


సముద్రాలు  మేఘాలను  రాయబారానికి పంపిస్తే
చిట్టి చిట్టి చినుకమ్మలు మళ్ళీ సముద్రాన్ని  పలకరిస్తాయి

ఆవిరి బుడతలు ఆకాశానికి ఎగిరే కొద్దీ
నీటి మేఘాలు వువ్వెత్తున‌ పొంగుతాయి

ఏకధాటిగా చినుకు చినుకు ఆడుకొంటూ
గగనం నుండి  వాన రాగాల్ని పాడుకొంటూ
భూమి తల్లిని అభిషేకం చేస్తాయి
కల్మషం లేని జలంతో

కరి‌మబ్బులు నేలమ్మను దీవిస్తే
పచ్చని‌ ప్రకృతి పులకరిస్తుంది
పుడమిని చీల్చుకొని రెండు లేతమ్మ ఆకులు
రెపరెప లాడుతూ ఆడుకొంటాయి
చల్లని తుషార బిందువులతో
ప్రభాత కిరణాల్ని పరిచయం చేసుకొంటాయి

చినుకమ్మ మాట్లాడితే
ఈ పృధ్వి పులకరించదా?
ఈ పక్షులు పలకరించవా?
ఈ తరువులు కుశల ప్రశ్నలు వెయ్యవా?

చినుకమ్మ మాట్లాడితే
ఈ కవి గుండెల్లొ అక్షరాల హరివిల్లు పూయదా?
భావాల పొదరిల్లు వికసించదా?
కవిత్వం సముద్రమై పొంగదా?


********************************

బ్రహ్మశ్రీ  ప్రభాకర స్వామి


వారణాశి వారికి ముందుగ  శుభాభివందనలు.. శుకాభినందనలు!!  మీ కవిత స్పందింప చేసింది!   కవి హృదయాన్ని ఆవిష్కరింప  చేసింది!!
'భాషమీద అధికారం నీకుంటే కవనానికి అడ్డేముందోయ్ నేస్తం..
ఆ భూషణమై  రాదా ఎగరేసుకుని తన మస్తకం'....
నాలుగు మాటలకూర్పా  కవిత్వం...
భాష భావం... ఊహ ఉత్ప్రేక్షల సంగమం!! దమ్మున్న కవి
కలం విదిలింపు....
సమ్యక్ భావాల మేళవింపు.......
అనిపించింది మీ కవిత... ధన్యోహం!
కదిలిన భావ సందోహం!!
ఇది మీ నేటి కవిత...
రసజ్ఞులకది మేటి కవిత..


No comments:

Post a Comment