Tuesday, June 27, 2017

నదీ రాగం

నదీ రాగం
-------------------------
అరే ఆశ్చర్యంగా ఉందే
ప్రతి చెట్టూ కవిత్వం రాస్తోంది ఇక్కడ
ప్రతి నదీ కవిత్వం వింటోంది ఇక్కడ
ఉదయం కాఫీ కప్పులో రాగం వినిన నాకు
సాయంకాలం టీ కప్పులో గూడా తుపాను వినబడుతోంది
ఆ రాత్రి పడుకొన్నానన్నమాటే గానీ
చీకటి దుప్పట్లో 
ఏవో కలవరింతలు
ఏవో పలవరింతలు
పొద్దున్నే శ్రీ మతి అడిగింది..
'' రాత్రి పక్క మీద మీరు లేరే? ''
అదీ...నా కవితా కన్యతో...
తను నవ్వుల మొగ్గ అయింది
ఇంకొక కవిత పూచింది.

వారణాశి భాను

Monday, June 19, 2017

బ్లాక్ బాక్స్ (BLACK BOX )

బ్లాక్ బాక్స్  (Black  Box  )






అందంగా ఉన్నప్పుడు
ఆమె అంతెత్తుకు ఎగిరింది
యవ్వనంలో మేఘాల మీద
మయూరిలా నర్తించింది
జీవితమే ' రన్ వే ' ఆమెకు
టేక్ ఆఫ్ లు. . లాండింగ్ లు ..
షికార్లు .. సరదాలు ..
ప్రపంచాన్ని చుట్టేసింది
ఆకలి గొన్న కొన్ని సింహాలు
ఆమె ' కాక్ పిట్ ' లోకి ప్రవేశించాయి
కొన్ని నిరర్థక పక్షులు
ఆమెను ఢీ కొన్నాయి
రెక్కలు తెగిన విమానంలా
ఆమె కూలి పోయింది
శకలాలు ముక్కలయిన
మెటెరోయిడ్స్ లా జారి పడ్డాయి
ఇప్పుడందరూ బ్లాక్ బాక్స్ కోసం
వెతుకు తున్నారు
పగిలి పోయిన గొంతు పలికిన
చివరి సత్యాలు ఏవైనా
నిక్షిప్తమై ఉన్నాయా అని !!
(పేపర్లో శిరీష ఉదంతం చదివాక )

Bhanu Varanasi /  20.06.2017/ USA 

Friday, June 16, 2017

నేను కవిని

నేను కవిని

----------------------------


నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి
నాకు కొన్ని పరిధులు ఉన్నాయి
నాకు కొన్ని నిబద్ధతలు ఉన్నాయి
నాకు కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి
నాకు కొన్ని అవరోధాలు ఉన్నాయి
నాకు కొన్ని అవకాశాలు ఉన్నాయి

అవును
నన్ను నేను అప్పుడప్పుడు ప్రక్షాళన చేసుకొంటాను
నన్ను నేను అప్పుడప్పుడు పరీక్షించు కొంటాను

అవును
నువ్వు నన్ను వేలెత్తి చూపినపుడు
నీ వ్రేళ్ళ మధ్య నుంచి వెలుగులా జారి పోతాను
నువ్వు నా కోసం కార్చిచ్చు వై అడువుల్ని వెతుకుతున్నపుడు
నీ పిడికిలి మధ్య చీకటినై నీ గుండె గోడల్లో మృత కణాన్నై పడి ఉంటాను

అవును
కన బడే ముళ్ళ కంపల్ని ఎత్తి వాడిన అంకురాల్ని పొదివి పట్టుకొన్నా
అగ్ని గుండం లోకి జారి పోతున్న కీటకాల్ని గుండెకు హత్తుకొన్నా
వ్యవస్థల అవస్థలలో కూరుకు పోయిన పిపీలకల్ని బయటకు తీస్తున్నా
కుల మత పంజరాల్లో ఇరుక్కుపోయిన శాంతి కపోతాల్ని కాపాడుతున్నా

అవును
నేను కవిని !

అక్షరాల బీజాక్షరాల్తో
కొన్ని సూర్య మండలాల్ని వెలిగిస్తాను
కొన్ని కొత్త గ్రహాల కోసం
అన్వేషణ మొదలు పెడతాను

అవును
నేను కవిని !




దాసరి దర్శకేంద్రుడికి అక్షర నివాళి

దాసరి దర్శకేంద్రుడికి అక్షర నివాళి ---------------------------------------- సరి లేరు నీ కెవ్వరు దాసరి పాల కొల్లులో పుట్టిన మన తెలుగు సిరి నాలుగు దశాబ్ధాల తెలుగు సినీ ప్రస్థానంలో నూట యాభై సినిమాల దర్శక రత్న దాసరి తాతా మనమడితో సాగించిన సినీ ప్రస్థానం అప్రతిహతంగా సాగింది మీ దర్శక దండయాత్ర తెలుగు సినీ జగత్తులో మైలు రాయిగా నిలచింది మీ దర్శక ప్రతిభ అవార్డుల పంట మీ ఇంటి ముంగిట వాలింది సకల కళా విశారదులు మీరు తెలుగు చలన చిత్ర సీమలో రారాజు మీరు మాటల మాంత్రికుడు ...పాటల సృష్టికర్తవు కథా బ్రహ్మవి...సంభాషణల చతురిడివి రాజకీయ జీవితం సాగించి ఉదయం పత్రిక రథ సారధిగా సినీ వినీలాకాశంలో ఒక్క ధ్రువ తారగా తెలుగు జాతి గుండెల్లో నిలిచి నారు మీరు అచంద్ర తారార్కమూ! మీకిదే మా అక్షరాంజలి! రచన: వారణాసి భానుమూర్తి రావు

Thursday, June 15, 2017

పారి పొయ్యాడు!

పారి పొయ్యాడు!
-------------------------
కులాల తలల్ని కత్తరించండి
కులాల తోకల్నీ  కత్తరించండి
అప్పుడు శంభూకుడెవ్వడో,
జాంబ వంతుడెవ్వడో ,
రాము డెవ్వడో ,
రావణాసురుడెవ్వడో
గుర్తు పట్టలేరు.
నేను పుట్టిన ప్రతి రోజూ  ఓడుతున్నాను
వాడు పుట్టిన ప్రతి రోజూ గెలుస్తున్నాడు
గెలుపు ఓటములు దైవాధీనాలా ? కులాధీనాలా?
అంతెందుకు ?
మొన్న ఒక కొంగల గుంపు
ఏటి ఒడ్డున తపస్సు చేస్తుంటే
 ఒక ఏనుగుల గుంపు
జనారణ్యం లోకి దూరి హంగమా చేసింది
నీతుల గోడలు కట్టి ఎగబాకే పీతలన్నీ , పడి జారి పోతున్నాయి
అతడెవడో అన్నాడు నాకు కవిత్వం రాయడం  చాత గాదనీ
చదవడం  చాత గాదనీ
చివరి చరణం పట్టుకొని
అర్థం చెప్పమని అడిగాను అతడ్ని
అతను కవిత్వాన్ని వదలి పారి పొయ్యాడు
మళ్ళీ జనారణ్యం లోకి!!

వారణాశి భాను మూర్తి రావు
 11.06.2017