Wednesday, May 31, 2017

స్వేద గీతం

స్వేద గీతం



ఏ సమాధులపై
మనిషి జీవితాన్ని చెక్కి
బ్రతుకు పాటను వ్రాస్తారో

ఏ సమాధులపై
ఎర్ర గులాబీలను పరచి
జీవన స్మృతులను నెమరువేస్తారో
ఆ సమాధుల వంక
నిర్వీర్యంగా నిర్లిప్తంగా చూస్తున్నా

ఏ రాజ వంశీయులో
రాచరికపు వ్యవస్థను గుర్తుకు తెచ్చుకొమ్మనా -
ఈ సమాధుల మందిరాలను నిర్మించారు

ఫిరంగులు పేలిన ఇనుపగోళాలతో
కోట గోడలు పగిలి ముక్కలు కాగా
ఇనుప చూలలతో  నిర్మించిన
సింహ ద్వారాలు  తుత్తునియలు కాగా
రాచరికపు వ్యవస్థ ఏ నాడొ మట్టిలో కలిసిపోయింది

రాచరికపు టెత్తులతో మనిషి మృగమై
సామన్యుడి రక్తంతో
కొండల్ని కోటలుగా మార్చాడు

తనకి మరణం తప్పదని తెలిసి
బంగారు తాపడాలతొ సమాధుల్ని తయారు చేయించాడు

సామాన్యుడి స్వేదం అప్పుడు ఎప్పుడూ వర్షిస్తూనే ఉంది
సామాన్యుడి రక్తం   అప్పుడూ ఎప్పుడూ కరిగిపోతూనే వుంది
రాజుల సమాధులు సామాన్యుడి స్వేదంతో పునీత మవుతూనే ఉంటాయి
ప్రాకారాల గోడలు  సామాన్యుడి రుధిరంతో ఎర్రగా ప్రకాశిస్తూనే ఉంటాయి
చరిత్ర చెప్పకున్నా
జాతి కళ్ళకు అది ఆవృత మవుతూనే ఉంటుంది
సమాధులు సమాధులగానే మిగులుతాయి

గానీ జాతికి మాత్రం సమాధి గోడల నుండి
సన్నని స్వేద గీతం మాత్రం వినబడుతూనే ఉంటుంది.

రచన : భాను మూర్తి
31.05.2017

అంతా నువ్వే!

అంతా నువ్వే!

తప్పని సరిగా
నా ఎదన అలజడి లేపి నావు
అభిసారికగా
జ్నాపకాల వూహాలలో తేలినావు
ప్రణయ మోహినిగా
ప్రణయ పరిమళాలు వెద జల్లి నావు
విద్యుల్లతగా
బ్రతుకు కుహరంలో వెలుగు జల్లుల్ని కురిపించి నావు
మధుర మోహినిగా
మన్మధ  సామ్రాజ్య దేవతవై కొలువు తీరినావు
సుధా మణిగా
అనురాగ సుధలను విరియించి నావు
అనురాగ వతిగా
రాగ మాలికవై సరాగాలను పలికించి నావు.

(రాసిన కాలం : 1982)

Sunday, May 28, 2017

పాపం చెల్లెమ్మ !

కవి: వారణాసి భానుమూర్తి రావు. కవిత శీర్షిక : పాపం చెల్లెమ్మ ! సర్రున నేల కొరిగిన ఆకాశం నుండి నక్షత్రాల వాన గగనం గడ్డ మీద తెల్లని మైలు రాయిలా చంద్రోదయం మూసుకొన్న రహదారులు భయం వేస్తున్న అడుగులు లయ తప్పిన ఎద సవ్వడులు చీకటి నేసిన దుప్పట్లలో ఆ నిశి రాత్రిలో దారి తప్పిన చెల్లెమ్మ చుక్కలు వెలిగించిన వెలుగు ఆమె వదనంలో జారిన చిరుచెమటల దిగులు డిల్లి వార్తల్లొ గుప్పుమన్న 'నిర్భయ ' ఆక్రందనలు ఎదురుగా ఒక మనిషి మృగం లాంటి మగ మనిషి ఓ అమ్మ కన్న కొడుకైనా ఈ చెల్లెమ్మ పాలిట కామాంధుడు శీలం పగిలి పోయిన అందాల గాజు బొమ్మ హృదయం లేని మగాడు ఆమె పాలిట మృగాడు గవర్నమెంట్ ఆసుపత్రిలో కత్తెరల పోస్ట్ మార్టం పేపర్లో పారాడిన వార్తల బల్లి 'కామాంధుడికి అబల బలి ' ఈ 'రేపుల 'రాజ్యం లో ఈ వార్తలు మామూలే! అడవులకు పూచిన పుష్పాలు అలా రాలి పొవలసిందే! (రాసిన కాలం: 28.05.2013) పేరు: వారణాసి భానుమూర్తి రావు తేది: 29.05.2017 వూరు: హైదరాబాద్

Thursday, May 18, 2017

అమ్మ

అమ్మ 





అమ్మ  మాటే  మంత్రం
అమ్మ  పాటే   ప్రణవం
అమ్మ పిలుపుకు అమృతం  వర్షిస్తుంది
అమ్మ అనురాగానికి  అమరత్వం  సిద్దిస్తుంది
కల్మషం  లేని  అమ్మ ప్రేమ   ఒక గంగా నది పవిత్ర  ఝరి
నిర్మల మైన అమ్మ  మనసు  ఒక మమతల  కోవెల

అమ్మ  నా పై  చూపే  కొలతలు  లేని ప్రేమాభి మానాలుకు
నా   కళ్ళు  జల పాతాలై వర్షిస్తాయి
అమ్మ కంట  ఒలికే  కన్నీరు
నన్ను అగాధ  లోతుల్లోకి   జార వేస్తాయి
గోరుముద్దలు  తినిపించిన అమ్మ స్మృతులు
నెమరు వేసు కొన్నప్పుడల్లా
నా కళ్ళు  నీలాల  సంద్రాలవుతాయి

ఒక  ఉదయం  తూరుపులో
అమ్మ  నుదుటి బొట్టు  నాకు  ప్రభాత సూర్యమై కన బడుతుంది
ఒక  సాయంత్రం  ఆకాశంలో
అమ్మ ముఖంలోని   దివ్యత్వం  రంగుల హరివిల్లై  కన బడుతుంది

అమ్మ నా కోసం
నిప్పుల మీద నడిచి మొక్కు తీర్చిందని  విన్నప్పుడు
అమ్మ  నా కోసం
ఎండిన పొలంలో  వెట్టి చాకిరి  చేసిందని  తెలిసి నపుడు
అమ్మ  ఆరిపోతూ
నా బ్రతుకు దీపం  వెలిగించిందని  తెలుసు కొన్నపుడు
అమ్మ త్యాగానికి  వెల కట్ట లేనని  నాకు తెలుసు

అందుకే అమ్మా !
నువ్వు నా కడుపులో  ఆడపిల్లగానే  పుట్టాలి !
మళ్ళీ  మళ్ళీ   ఏడు  జన్మలూ పుడుతూనే  ఉండాలి  !
------------------------------------------------------------------
 రచన :  వారణాసి  భానుమూర్తి  రావు.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈ  రచన  కేవలం నా స్వంత  మనియూ , ఇది అనువాదం గాదనియు ,  కాపీ  కాదనియు , ఎక్కడా  ప్రచురించ లేదనియు  ఇందు మూలముగా తెలియ చేయు చున్నాను . ఈ  కవిత మీద  సర్వ హక్కులు రచయితవే  అని తెలియ చేయు చున్నాను
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------






Tuesday, May 16, 2017

జీవన గతులు

కవితా శీర్షిక :

జీవన గతులు 

రచన: వారణాశి భాను మూర్తి రావు.


ఆకాశం పాలి పోవడం లేదూ
ఒంటరిగా  కునారిల్లుతున్న  ఎడారి దిబ్బలాగా
రోడ్లు బిత్తర  పోవడం లేదూ
క్లీనరు నడిపిన  బస్సు లాగా
సముద్రం  క్రుంగి  పోవడం  లేదూ
జాలర్లు మింగిన  చేపల్లాగా
చంద్రుడు  నాకయితే  కాళ్ళు తెగిన
ఒంటె  లాగా కనబడ్డం లేదు
నల్లని అడవిలో తెల్లని  కుందేళ్ళ
సమూహం లా ఉన్నాడు
జీవితం చక్కర్లు కొడుతోంది
వింత సంత ల్లాంటి  సామూహికాల్ని
కలిపేసుకొంటూ
ఫిలసాఫికల్  కాంప్లెక్సిటీస్  ఆఫ్  లైఫ్
విచిత్ర  సంబంధ  బాంధవ్యాలతో
క్రుంగి పోవడం లేదూ ...సముద్రం లాగా
కెరటానికీ  గమనం ఉంది
గమ్యం ఉంది
ఎగిరి  గంతేసి  మళ్ళీ  మళ్ళీ ముందుకు ఉరుకు తూనే ఉంటుంది
అమాంతం  సునామీల సమస్యలు
తీరాల్ని  మింగినా
జీవితం పొద్దు  పొడుస్తూనే  ఉంది
గత్యంతరం  లేక సూర్యుడు
ఉదయిస్తున్నాడా ?
క్షిణించిన  చంద్రుడూ
పున్నమిని  చేరుకొంటాడు  ధీమాగా !
మాట్లాడకండి.....
మౌనంగా జీవన భాష  వినండి
మనం గూడా  కాల చక్రానికి
ఇరుసులై పోతాం !!

bhanuvaranasi/ 09.01.2017